పునీత బ్రిజితమ్మ, జూలై 23

 పునీత బ్రిజితమ్మ, జూలై 23
వితంతువు (క్రీ.శ. 1303-1373)


బ్రిజిత భక్తివిశ్వాసాలు గల క్రైస్తవ దంపతులైన ‘బిర్గర్ పర్సన్’, ‘ఇంగేబోర్గ్’ల పుత్రిక. తండ్రి స్వీడన్ దేశములోని అప్’ల్యాండ్ ప్రాంత గవర్నరు, న్యాయమూర్తి. చాలా భక్తిపరుడు. ప్రతీ శుక్రవారం పాపసంకీర్తనం చేసేవాడు. బ్రిజితకు 10 సం.ల ప్రాయములోనే తల్లి మరణించింది. అందుకే తండ్రి తన ముగ్గురు పిల్లలను వారి పిన్ని వద్దకు పంపించాడు. వారు అక్కడే పెరిగి విద్యావంతులైయ్యారు. బ్రిజితకు ఏడు సం.ల ప్రాయమునుండే సిలువ వేయబడిన రక్షకుని అసాధారణ దర్శనాలు కలిగేవి. 

13వ యేట ‘ఉల్ఫ్ గుడ్’మార్సన్’ అనే యువకునితో బ్రిజితమ్మకు వివాహమైనది. వారికి 8 మంది పిల్లలు; నలుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. వారిలో ఒకరే పునీత కత్తరీనమ్మ. వివాహం అనంతరం 28 సం.లకు ఆమె భర్త మరణించారు (1344). ఆ తరువాత మరో 29 సం.లు బ్రిజితమ్మ వితంతువుగానే జీవితాన్ని గడిపారు. భక్తి క్రియలు చేస్తూ దేవుని కృపకు మరింత చేరువ అయ్యారు.

తిరుసభ సంస్కరణల గురించి ఆమె ఎన్నో దర్శనాలను గాంచింది. దర్శనాలలో ప్రభువునుండి పొందిన సందేశాలను, పోపుకు, రాజులకు, అధికారులకు వినిపించినది. వారంతా తల్లి తిరుసభ అభివృద్ధికి కృషి చేయునట్లు చేసింది.

బ్రిజితమ్మ 1346లో “పవిత్ర రక్షకుని” మఠాన్ని స్థాపించి, పవిత్ర జీవితాన్ని జీవించేందుకు ఎంతోమందిని ప్రోత్సహించారు. 1373లో తన కుమార్తె కత్తరీనమ్మ గారితో రోమునగర సందర్శనకు వెళ్లి అక్కడే మరణించారు. 7 అక్టోబరు 1391లో, తొమ్మిదవ బోనిఫసు (Boniface IX) పోపు బ్రిజితమ్మను పునీతురాలుగా ప్రకటించారు. ఆమె జీవితం గృహస్తులకే గాక, మఠవాసులకు కూడా ఆదర్శం. ‘బ్రిజిత’ అనగా ‘శక్తి’, ‘ఉన్నత వ్యక్తి’ అని అర్ధము. 

No comments:

Post a Comment