Showing posts with label Christmas Season. Show all posts
Showing posts with label Christmas Season. Show all posts

క్రిస్మస్

 క్రిస్మస్



నిశిరాత్రి నిశ్శబ్ధములో జగమంతా నిద్రించువేళ
అర్దరాత్రి అంబరవీదినుండి అమరులు
ఓ జనమా! మేల్కొనండి, రాజాధిరాజు జనియించె
వేగమే విచ్చేసి సాష్టాంగపడి భక్తితో ప్రణమిల్లుడు

వజ్రవైడూర్యాలు, విలువైన రాజవస్త్రాలు, బంగారం, వెండి, సాంబ్రాణి
ఆయనకు అర్పించడానికి లేదని చింతించకండి
దేవదూతలతో కలిసి, 'మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ
భూలోకములో మంచి మనసుగల వారికి సమాధానము కలుగునుగాక' అని పాడండి

సూర్యుడిని చూసి కమలం వికసించే విధముగా
మేఘమును చూసి నెమలి నాట్యం చేసే తీరుగా
తల్లిని చూసి బిడ్డ మైమరచే తీరుగా
చంద్రుడిని చూసి కలువ నవ్వే విధముగా
ఆనందించండి, మహానందించండి. ఎందుకన, మన రక్షకుడు
మన హృదయాలలో జన్మించాడు.

ఇది ఒక అనూహ్యమైన సంఘటన! చరిత్రలో ఎన్నడు కనీవిని ఎరుగని సంఘటన! అదే క్రీస్తు జననం. దేవుడు, మానవుడిగా జన్మించడం. కన్యయైన మరియ గర్భమున 'దేవుని కుమారుడు' ఈ భువిలో జన్మించాడు.

పూర్వము ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు క్రీస్తు జన్మముతో నెరవేరాయి: "ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కని, అతనికి 'ఇమ్మానువేలు' అని పేరు పెట్టును" (యెషయ 7:14). "మనకొక శిశువు జన్మించెను. మనము ఒక కుమారుని బడసితిమి. అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును" (యెషయ 9:6-7). "మీరు సియోను కుమారితో ఇట్లు నుడువుడు. ప్రభువు నిన్ను రక్షింప వచ్చుచున్నాడు" (యెషయ 62:11).

క్రిస్మస్ పండుగ రోజు అందరికి సంతోషకరమైన రోజు. ప్రతి సంవత్సరము వచ్చేదే అయినా, ప్రతీసారి ఎదో కొత్తదనం, ఎదో కొత్త అనుభూతి. క్రిస్మస్ అందరి పండుగ. ఎందుకంటే, క్రీస్తు అందరికోసం జన్మించాడు. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారున్ని ప్రసాదించెను" (యోహాను. 3:16). క్రిస్మస్ రోజు మేళతాళాలు, బాణసంచాలు, ఆటపాటలు, విన్దులుం, వినోదాలు ఆనందిస్తూ అసలు పండుగను, దాని అర్ధాన్ని మరచిపోయే ప్రమాదం ఉన్నది.

'క్రిస్మస్'కు నిజమైన అర్ధం ఏమిటి? యోహాను 1:14లో చక్కగా చెప్పబడినది: "ఆదిలో వాక్కు ఉండెను. ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను. ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు మానవుడై మనమధ్య నివసించెను." పరలోకం, భూలోకం కలుసుకున్న వేళ! దేవుడు మానవుడిగా మనమధ్య జన్మించిన వేళ - క్రిస్మస్, క్రీస్తు జయంతి! ప్రభువు వచ్చేది మానవులను రక్షించడానికేనని యెషయ చెప్పిన ప్రవచనాలు కార్యరూపం దాల్చినరోజే క్రిస్మస్! దేవుడు ప్రేమస్వరూపుడు. ఆప్రేమే క్రీస్తు రూపములో మనమధ్య జన్మించినది. అందుకే, క్రిస్మస్ ఓ ప్రేమ పండుగ, ప్రేమ జన్మించిన రోజు!

క్రీస్తు ఎందుకు ఈ లోకములో జన్మించాడు? 

1. తన ప్రజలను రక్షించుకోవడానికి - యోహాను. 3:17, "దేవుడు తన కుమారున్ని లోకమును రక్షించుటకు పంపెనే కాని, దానిని ఖండించుటకు పంపలేదు." 

2. పాపపు ఊబిలో కొట్టుమిట్టాడుతున్న తన ప్రజలను పాపము నుండి విముక్తులుగా చేయడానికి - 1 యోహా. 4:10, "దేవుడు మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగ తన కుమారుని పంపెను." మంచిగా ఉన్నప్పుడు అందరు ప్రేమిస్తారు. కాని, పాపములోనున్న లోకాన్ని ప్రేమించడం దేవునికి మాత్రమే సాధ్యమైనది.

3. తన సమస్తాన్ని మానవునికి ఇవ్వడానికి - 2 పేతు. 1:3-4, "ఆయన దైవశక్తి, పవిత్ర జీవమునకు సంబంధించిన సమస్తమును మనకోసగుటకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు."

4. నిత్యజీవము ఒసగడానికి - యోహాను. 3:16, "మానవుడు నిత్యజీవము పొందుటకై దేవుడు తన కుమారున్ని ఈ లోకానికి పంపాడు."

5. సర్వరోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థత పరచడానికి - మత్త. 9:12, "వ్యాధిగ్రస్తులకేగాని, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు." అలాగే, చెదరిపోయిన గొర్రెలమందవలె నున్న మానవాళిని ఒక మందగా చేయడానికి, అవిశ్వాసములో నున్న ప్రజలను, విశ్వాసులుగా తీర్చిదిద్దడానికి, అన్యదేవుళ్ళను కొలుస్తున్న తన ప్రజలను తనవైపుకు త్రిప్పుకోవడానికి, హింస, మారణహోమాలతో జీవించే మానవాళిని, ప్రేమ శాంతి సమాదానముతో నింపడానికి, అన్యాయ అక్రమ కుళ్ళు రాజకీయాలతో నిండిపోయిన సమాజాన్ని సరిచేయడానికి, పేద-ధనిక బెధమున్న సమాజాన్ని ఒక దైవసమాజముగా మార్చడానికి, దాస్యమునుండి స్వాతంత్రమునకు, చీకటినుండి వెలుగునకు, దు:ఖమునుండి సంతోషమునకు నడిపించడానికి క్రీస్తు మనమధ్య జన్మించాడు. తన జన్మము, జీవితముద్వారా మనిషి ఇలా జీవించాలని చూపించాడు. తన జన్మముద్వారా ఈ లోకములో దైవరాజ్య స్థాపనకు పునాదులు వేసాడు.

6. ప్రభువు మనతో ఉండటానికి జన్మించాడన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన పేరులోనే ఉన్నది. ఇమ్మానుయేలు అనగా "ప్రభువు మనతో ఉన్నాడు" (మత్త. 1:23). "లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉంటాను" (మత్త. 28:20) అని వాగ్దానం చేసాడు. కాబట్టి, సుఖాలున్నప్పుడు దేవుడున్నాడని, దు:ఖాలున్నప్పుడు దేవుడు లేడని చెప్పరాదు. మనం ఎలాంటి నిస్సహాయ స్థితిలో నున్నను, క్రీస్తు మనతో ఎల్లప్పుడు ఉంటాడు.

7. మన జీవితాలకు అర్దాన్నివ్వడానికి - యోహాను. 10:10, "నేను జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచియున్నాను." చాలామంది జీవిత గమ్యము లేక జీవిస్తున్నారు. ప్రభువును విశ్వసించినచో జీవితాలకు పరమార్ధం చేకూర్చుతాడు.

8. మన హృదయాలలో వసించడానికి - వాక్కు అయిన దేవుడే మనమధ్య జన్మించాడు. కాబట్టి, దేవుని వాక్యాన్ని (బైబులు) చదివి, ధ్యానించి, ఆచరించినచో ప్రభువు (వాక్కు) మన హృదయాలలో వసించును.

9. నూతన నివాసమేర్పరచడానికి - యోహాను. 14:2, "నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోవుచున్నాను." ఈ లోకములో మన జీవితము శాశ్వతము కాదు. అందుకే, ప్రభువు మనతో నివసిస్తూ, ఈలోక జీవితం తర్వాత మనలను పరలోకరాజ్య వారసులుగా, దేవుని బిడ్డలుగా చేయడానికి వచ్చియున్నాడు. "ఆయనను అంగీకరించి, విశ్వసించిన వారందరికీ, దేవుని బిడ్డలగు భాగ్యమును ఇచ్చెను" (యోహాను. 1:12).

ఈవిధముగా, సర్వసృష్టికర్త సర్వలోకాన్ని రక్షించడానికి తన కుమారున్ని పంపాడు.

క్రిస్మస్, నేటి సమాజానికి ఏమి నేర్పుతుంది? ఏ సందేశాన్ని ఇస్తుంది? నేటి సమాజం దైవసంకల్పాన్ని, దైవచిత్తాన్ని అనేకవిధాలుగా కాలరాస్తుంది. క్రీస్తు తన జన్మముద్వారా, జీవితంద్వారా, మరణ-పునరుత్థానములద్వారా స్థాపించిన ఆ దైవరాజ్యం ఎక్కడ? ఆ ప్రేమరాజ్యం ఎక్కడ? ఆ రక్షణ ఎక్కడ? ఆ స్వాతంత్రం ఎక్కడ? నీతినియమాలు ఎక్కడ? శాంతి, సమాధానాలు ఎక్కడ? దైవ-సోదర ప్రేమ ఎక్కడ? నేటి లోకం ఎన్నో సమస్యలతో (రోగాలు, ఆర్ధికమాంద్యం, యుద్ధాలు, రాజకీయ కక్షలు, అధికారదాహం, అక్రమార్జన, పేదరికం, నిరుద్యోగం, విరిగిపోయిన కుటుంబ బాంధవ్యాలు, వివాహేతర సంబంధాలు...) సతమతమవుతుంది.

కనుక, మనం మారాలి. మనలో మార్పు, మారుమనస్సు కలగాలి. అది నాతోనే ఆరంభం కావాలి. అప్పుడే, బాల యేసును దర్శించగలం. క్రిస్మస్ కేవలం పండగలాగే మిగిలిపోకూడదు, మనలో హృదయపరివర్తనం కలగాలి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవించుదాం!

క్రిస్మస్ సందేశము

క్రిస్మస్ సందేశము 

ఉపోద్ఘాతం: సృష్టి ఆరంభమునుండికూడా మానవుడు దేవునికోసం అన్వేషిస్తూనే ఉన్నాడు, వెదకుతూనే ఉన్నాడు. వివిధ రకాలుగా, వివిధ పద్ధతులలో ఈ అన్వేషణ కొనసాగుతుంది. కొంతమంది సృష్టికి మూలాన్ని అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషణలో మానవుడు ఎన్నో తెలుసుకోగలిగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో శాస్త్రీయాలను కనుగొన్నాడు, ఆధ్యాత్మిక సిద్ధాంతాలను లేదా మార్గాలను కనుగొన్నాడు. కాని, దేవున్ని మాత్రం పూర్తిగా తెలుసుకోలేక పోయాడు, కనుగొనలేక పోయాడు. ఈ అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. 
బైబులు - దేవుడు మానవున్ని వెదకడం: అయితే, బైబులులో ఒక ప్రత్యేకమైన అంశాన్ని చూస్తున్నాము. అదేమిటంటే, మానవుడు దేవున్ని వెదకటంకన్న, దేవుడు మానవున్ని వెదకడం! ఆ.కాం. 1:27 – ఇచట దేవుడు సృష్టికర్త, సృష్టికి మూలము అని చూస్తున్నాము. “దేవుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులనుగా మానవుని సృజించెను. దేవుడు వారిని దీవించెను. సృష్టి-రెండవ కథనములో చూసినట్లయితే, 2:7 – “దేవుడైన యావే నేలమట్టిని కొంత తీసుకొని, దానినుండి మానవుని చేసెను. అతని ముక్కురంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవముగలవాడయ్యెను.” ఆది కాండము, మూడవ ఆధ్యాయములో చూస్తున్నట్లుగా, మానవుడు దేవున్ని అవిధేయించి పాపము కట్టుకున్నాడు, దేవుని శిక్షకు గురియైయ్యాడు. తన సన్నిధినుండి తరిమివేసాడు. అయినప్పటికిని, దేవుడు ఆదామును, ఏవను దేవుడు దీవించాడు. వారికి సంతానాన్ని కలుగజేసాడు. కయీనును కనిన తర్వాత ఏవ, “దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించెను” (4:1) అని తలంచినది. అంటే దేవుడు శిక్షించినను, వారిని విడనాడలేదు. మరల దేవుడు కయూనును పాపము విషయములో హెచ్చరించాడు (4:6-7). దేవుని హెచ్చరికను పెడచెవిన పెట్టి కయూను హెబెలును చంపాడు. 6:1 – “మానవులు పెంపొంది భూమిపై విస్తరిల్లిరి.” 6:5 – “భూమిపై గల మానవులు పరమదుష్టులైరి.” దేవుని కృపకు పాత్రుడైన నోవాను అతని కుటుంబమును తప్ప సర్వమును దేవుడు జలప్రళయముద్వారా నాశనం చేసాడు. “దేవుడు నోవాను, అతని కుమారులను దీవించాడు” (9:1). ప్రజలు భూమిపై వ్యాపించారు. 
తరువాతి కాలములో దేవుడు అబ్రహామును పిలచుకొని ఆయన ద్వారా, ఒక మహాజాతిని తీర్చిదిద్దెదను అని వాగ్దానం చేసాడు (12:2-3). గొడ్రాలైన సారాకు కొడుకును (ఈసాకు) ప్రసాదించాడు (21:2). ఈసాకు భార్య రిబ్కా కూడా గొడ్రాలే. అయినను, దేవుడు వారికి ఏసావు, యాకోబు అను ఇద్దరు కుమారులను ప్రసాదించెను. యాకోబు భార్యలు: లేయా, రాహేలు (గొడ్రాలు). రాహేలుకు పుట్టిన బిడ్డ యోసేపు. 
ఆ తరువాత, ఐగుప్తు దేశములో స్థిరపడిన యాకోబు సంతతి అచట వృద్ధిచెందిరి. కాని, ఐగుప్తు రాజులు వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అప్పుడు దేవుడు మోషేను ఎన్నుకొని ఆయనద్వారా తన ప్రజలను ఐగుప్తు దేశమునుండి విడిపించి, వాగ్ధత్త భూమివైపుకు నడిపించాడు. దేవుడు మోషెకు “నేను ఉన్నవాడను” అని తన పేరును కూడా ఎరిగించెను (నిర్గమ 3:14). ఈవిధముగా, దేవుడు తను సృష్టించిన మానవుని వెంటనే ఉండి వారిని దీవిస్తూ వచ్చాడు. ఇలా న్యాయాధిపతులు, ప్రవక్తలు, యాజకులు, రాజులద్వారా దేవుడు ఇస్రాయేలు ప్రజలను నడిపించాడు. ఈవిధముగా, దేవుడే మానవునికొరకు వెదకడం బైబులులో మాత్రమే చూస్తాము: కొన్ని ఉదాహరణలు – యెహెజ్కె. 34:11,16, లూకా. 19:10 లేదా మత్త. 18:11. 
క్రీస్తు జనన ప్రవచనాలు: కాలము పరిపక్వమైనప్పుడు, దేవుడు తన కుమారున్ని ఈలోకానికి పంపాడు (గలతీ. 4:4). కాలము పరిపక్వమైనప్పుడు అనగా ఏమిటి? పాపములో పడి నశిస్తున్న మానవున్ని రక్షించడానికి, కాపాడటానికి. ధర్మశాస్త్రము లేదా మోషేచట్టము మెస్సయ్యరాకకు సర్వము సంసిద్ధము చేసినది, ఆ మెస్సయ్య వైపునకు నడిపించినది. ప్రజలుకూడా మెస్సయ్య రాకకొరకు ఎదురుచూస్తున్న కాలం, సంసిద్ధపడిన కాలము. 
క్రిస్మస్ పండుగను అర్ధవంతముగా కొనియాడాలంటే, దానిలోని పరమార్ధాన్ని అర్ధంచేసుకోవాలి. ముందుగా, క్రీస్తు రక్షకుని జననం దైవప్రణాళిక. ఏదో అనుకోకుండా, ఊహించనిదిగా జరిగినది ఎంతమాత్రము కాదు. మూడు ముఖ్యమైన ప్రవచనాలను ఇక్కడ ప్రస్తావించుకుందాము: ఆది. 3:15 – “నీకు, స్త్రీకి, నీ సంతతికి, ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతివారు నీ తల చితకగొట్టుదురు. నీవేమో వారి మడమలు కరతువు.” యెషయ 11:1 – “ఈషాయి మొద్దునుండి ఒక పిలక పుట్టును. అతని వేరులనుండి ఒక కొమ్మ ఎదుగును.” మీకా. 5:2 – “బెత్లెహేము ఎఫ్రాతా! నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు. కాని యిస్రాయేలు పాలకుడు నీనుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది.” అతను “నీతి సూర్యుడు”వలె ఉదయిస్తాడు అని మలా. 4:2లో చూస్తున్నాము. ఈ ప్రవచనాల ప్రకారం, లూకా. 2:11 లో ఇలా చదువుచున్నాము: “నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు, ప్రభువు.” పునీత పౌలు క్రిస్మస్ గురించి ఇలా చెప్పాడు: “ఆయన ఎల్లప్పుడును దైవస్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కాని ఆయన తన్నుతాను రిక్తుని చేసికొని, సేవకరూపము దాల్చి మానవమాత్రుడుగా జన్మించెను” (ఫిలిప్పీ. 2:6-7)
క్రిస్మస్ పరమార్ధం: దేవుడు మానవునిగా ఈ లోకమునకు రావడం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం, స్తుతించడం, శ్లాఘించడం, మహిమపరచడం. క్రిస్మస్ (ఆరంభములో క్రైస్ట్-మాస్) అనగా “క్రీస్తు దివ్యబలిపూజ.” అనగా దేవునికి కృతజ్ఞతార్చన చెల్లించడం. క్రిస్మస్ ఆనందం, శాంతి, ఆశ, వెలుగును కొనియాడు పండుగ. "చీకటిలో నడచు జనులు పెద్ద వెలుగు చూచిరి (యెషయ 9:2).
క్రీస్తు ఎందుకు మనుష్యావతారం ఎత్తాడు? క్రీస్తు తండ్రి దేవున్ని, ఆయన ప్రేమను మానవునికి బహిర్గతపరచడానికి వచ్చాడు. ఉదా. యోహాను. 1:18 (ఆయనను తెలియపరచెను), యోహాను. 14:6-11 (తండ్రి యొద్దకు మార్గము), మత్త. 11:27. క్రీస్తే ఏకైక రక్షణ మార్గము – “నేనే సత్యము, జీవము, మార్గము” (నేను కూడా అని చెప్పలేదు). పూర్వపు వైభవాన్ని ఇవ్వడానికి (పాపలేమి స్థితిని). క్రీస్తు రక్షకునియందు విశ్వాసము వలన మనలను నీతిమంతులను చేయుటకు. 
1. తన ప్రజలను రక్షించుకోవడానికి - యోహాను. 3:17, "దేవుడు తన కుమారున్ని లోకమును రక్షించుటకు పంపెనే కాని, దానిని ఖండించుటకు పంపలేదు." మనకొక రక్షకుడు అవసరమని క్రిస్మస్ గుర్తుచేస్తుంది. "సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యెను (తీతు 2:11).
2. పాపపు ఊబిలో కొట్టుమిట్టాడుతున్న తన ప్రజలను పాపము నుండి విముక్తులుగా చేయడానికి, మనలను ప్రేమించడానికి - 1 యోహా. 4:10, "దేవుడు మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగ తన కుమారుని పంపెను." మంచిగా ఉన్నప్పుడు అందరు ప్రేమిస్తారు. కాని, పాపములోనున్న లోకాన్ని ప్రేమించడం దేవునికి మాత్రమే సాధ్యమైనది. ఆయన మన హృదయములో జన్మించాలి.
3. తన సమస్తాన్ని మానవునికి ఇవ్వడానికి - 2 పేతు. 1:3-4, "ఆయన దైవశక్తి, పవిత్ర జీవమునకు సంబంధించిన సమస్తమును మనకొసగుటకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు."
4. నిత్యజీవము ఒసగడానికి - యోహాను. 3:16, "మానవుడు నిత్యజీవము పొందుటకై దేవుడు తన కుమారున్ని ఈ లోకానికి పంపాడు."
5. సర్వరోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థత పరచడానికి - మత్త. 9:12, "వ్యాధిగ్రస్తులకేగాని, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు." అలాగే, చెదరిపోయిన గొర్రెలమందవలె నున్న మానవాళిని ఒక మందగా చేయడానికి, అవిశ్వాసములో నున్న ప్రజలను, విశ్వాసులుగా తీర్చిదిద్దడానికి, అన్యదేవుళ్ళను కొలుస్తున్న తన ప్రజలను తనవైపుకు త్రిప్పుకోవడానికి, హింస, మారణహోమాలతో జీవించే మానవాళిని, ప్రేమ శాంతి సమాదానముతో నింపడానికి, అన్యాయ అక్రమ కుళ్ళు రాజకీయాలతో నిండిపోయిన సమాజాన్ని సరిచేయడానికి, పేద-ధనిక బేధమున్న సమాజాన్ని ఒక దైవసమాజముగా మార్చడానికి, దాస్యమునుండి స్వాతంత్రమునకు, చీకటినుండి వెలుగునకు, దు:ఖమునుండి సంతోషమునకు నడిపించడానికి క్రీస్తు మనమధ్య జన్మించాడు. తన జన్మము, జీవితముద్వారా మనిషి ఇలా జీవించాలని చూపించాడు. తన జన్మముద్వారా ఈ లోకములో దైవరాజ్య స్థాపనకు పునాదులు వేసాడు.
6. ప్రభువు మనతో ఉండటానికి (ఇమ్మానుయేలు) జన్మించాడన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన పేరులోనే ఉన్నది. ఇమ్మానుయేలు అనగా "ప్రభువు మనతో ఉన్నాడు" (మత్త. 1:23). "లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉంటాను" (మత్త. 28:20) అని వాగ్దానం చేసాడు. కాబట్టి, సుఖాలున్నప్పుడు దేవుడున్నాడని, దు:ఖాలున్నప్పుడు దేవుడు లేడని చెప్పరాదు. మనం ఎలాంటి నిస్సహాయ స్థితిలో నున్నను, క్రీస్తు మనతో ఎల్లప్పుడు ఉంటాడు. ఆయన మనతో ఉంటె అదే శ్రేష్టమైన క్రిస్మస్ గిఫ్ట్.
7. మన జీవితాలకు అర్దాన్నివ్వడానికి - యోహాను. 10:10, "నేను జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచియున్నాను." చాలామంది జీవిత గమ్యము లేక జీవిస్తున్నారు. ప్రభువును విశ్వసించినచో జీవితాలకు పరమార్ధం చేకూర్చుతాడు.
8. మన హృదయాలలో వసించడానికి - వాక్కు అయిన దేవుడే మనమధ్య జన్మించాడు. కాబట్టి, దేవుని వాక్యాన్ని (బైబులు) చదివి, ధ్యానించి, ఆచరించినచో ప్రభువు (వాక్కు) మన హృదయాలలో వసించును.
9. నూతన నివాసమేర్పరచడానికి - యోహాను. 14:2, "నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోవుచున్నాను." ఈ లోకములో మన జీవితము శాశ్వతము కాదు. అందుకే, ప్రభువు మనతో నివసిస్తూ, ఈలోక జీవితం తర్వాత మనలను పరలోకరాజ్య వారసులుగా, దేవుని బిడ్డలుగా చేయడానికి వచ్చియున్నాడు. "ఆయనను అంగీకరించి, విశ్వసించిన వారందరికీ, దేవుని బిడ్డలగు భాగ్యమును ఇచ్చెను" (యోహాను. 1:12).
ఈవిధముగా, సర్వసృష్టికర్త సర్వలోకాన్ని రక్షించడానికి తన కుమారున్ని పంపాడు.
క్రిస్మస్: సంఘటనలు, వ్యక్తులు, పరిస్థితులు...
క్రిస్మస్ పండుగను అర్ధవంతముగా కొనియాడుటకు, క్రిస్మస్ సంఘటనలోనున్న వ్యక్తులను, పరిస్థితులను ధ్యానిద్దాం. క్రీస్తు రక్షకుడిని వెదకి కనుగొన్న వారిని ఆదర్శముగా తీసుకొందాం.
1. మరియ-యోసేపులు: నీతిమంతులు, దేవుని వాక్యమును మననం చేసుకొని అర్ధం చేసుకున్నవారు. దైవచిత్తానికి తలొగ్గినవారు... 
2. గొల్లలు (లూకా. 2:8-20): క్రీస్తు రక్షకుని జనన సమాచారం మొదటగా గొల్లలకు తెలుపబడినది – సామాన్యులు, పేదవారు, అనామకులు. హీరోదురాజుకుగాని, బలవంతులకుగాని, ధనవంతులకుగాని, శాస్త్రజ్ఞులకుగాని, పండితులకుగాని, ధర్మశాస్త్ర బోధకులకుగాని తెలుపబడలేదు. గొల్లలు: శుభాసమాచారాన్ని విన్నారు, విశ్వసించారు, వెళ్ళారు, కనుగొన్నారు, వెల్లడించారు, వందనాలు తెల్పారు, దేవుని వైభవమును శ్లాఘించారు. 
3. జ్ఞానులు (మత్త. 2:1-12): యెషయ ప్రవచనాన్ని గుర్తుచేసుకుందాం: “ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును. అవి బంగారమును, సాంబ్రాణిని గొనివచ్చును (60:6). జ్ఞానులు హేరోదుచేత క్షోభింపబడినారు (నేడు మన శ్రమలు, బాధలు, హింసలు). బంగారము (రాజు, శక్తి, మహిమ), సాంబ్రాణి (యాజకుడు), పరిమళద్రవ్యములు (మృత్యుంజయుడు) కానుకలుగా అర్పించారు. 
4. నక్షత్రము: తూర్పుదేశ జ్ఞానులకు మార్గచూపరియై యున్నది. వారిని నడిపించింది. నక్షత్రం దేవుడు ఒసగిన మార్గదర్శకం. కనుక మనం, దేవుని సూచనలను అనుసరించాలి. దేవుని యొద్దకు నడిపించేవారిని అనుసరించాలి. ఈ నక్షత్రం లోకరక్షకుని యొద్దకు నడిపించింది. కనుగొను-అనుసరించు. దేనికోసం వెదుకుచున్నామో స్పష్టత ఉండాలి. లేచి-నడవాలి.
5. పశువుల పాక (లూకా. 2:7): పేదరికానికి, దీనత్వమునకు సూచన. పశువులపాక, రక్షకుడైన యేసు అందరికి అందుబాటులో ఉన్నాడని సూచిస్తుంది. ఒక సందర్భములో యేసు ఇలా అన్నాడు, “నక్కలకు బోరియలు, ఆకాశపక్షులకు గూళ్ళు కలవు. కాని మనుష్యకుమారునకు తలదాచుకొనుటకు ఇసుమంతైనను తావులేదు” (లూకా. 9:58). పశువుల పాక సాంప్రదాయాన్ని మొట్టమొదటిగా ప్రారభించినది పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారు. ఫ్రాన్సిస్ వారికి క్రిస్మస్ పండుగ అంటే ఎంతో ఇష్టం. ఎందుకన, దేవుడే స్వయంగా బాలుని రూపములో భువుకి ఏతెంచాడు. మనము ప్రేమించడానికి మనకూ ఒకరు ఉన్నారు అని ఫ్రాన్సిస్ భావించాడు. తిరుకుటుంబ దారిద్ర్యమును, వినయాన్ని, కన్నులారా చూడాలని అనుకున్నాడు. ఆ చారిత్రాత్మిక ఘట్టాన్ని పునరావృతంచేసి, కన్నులారా చూడాలని క్రీ.శ. 1223వ సం.లో, గ్రేచియా అను స్థలములో పశువులపాకను ఏర్పాటుచేసి, నిజమైన పశువుల మధ్యన (ఒక ఎద్దు, గాడిద, రెండు గొర్రెపిల్లలు) బాలయేసు స్వరూపమును ఉంచి మనసారా ముద్దాడి, ఆరాధించి తన్మయం చెందాడు. “ప్రేమ, శాంతితో నిండిన హృదయాలలో మనం ఆయనను మోసినప్పుడు మనం ఆయనకు తల్లులుగా మారుచున్నాము. మన పవిత్ర కార్యములద్వారా మనం ఆయనకు జన్మనిస్తున్నాము” అని అంటాడు ఫ్రాన్సిస్. 
6. క్రిస్మస్ ట్రీ (చెట్టు): ఈ సాంప్రదాయం క్రీ.శ. 16వ శతాబ్దములో జర్మనీ దేశములో ప్రారంభమైనది. శీతాకాలములో చెట్లు ఆకులను రాల్చుకొని మోడుపోయి ఉంటాయి. కాని కొన్ని చెట్లు అన్నివేళలా పచ్చగా ఉంటాయి. పచ్చని చెట్లు జీవానికి, సంపదకు, సమృద్ధికి గుర్తు. క్రీస్తు ఉదయించిన సంతోష ఘడియలకు గుర్తుగా, ఈ చెట్లను యిండ్లలో పెట్టుకొని, దీపాలతో అలంకరించి, దానిచుట్టూ తిరుగుతూ ఆనందముగా పాటలు పాడేవారు. ఇలా ఈ సాంప్రదాయం ప్రపంచమంతట వ్యాపించింది. 
7. క్రిస్మస్ తాత (శాంతాక్లాస్): ఇది క్రీ.శ. 4వ శతాబ్దములో జీవించిన పునీత నికోలస్ నుండి ప్రారభమయినది. ప్రతీ క్రిస్మస్ రోజున మారువేషములో యిల్లిల్లూ తిరుగుతూ పిల్లలకు బహుమతులు పంచేవాడు. క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి పేదరికం అడ్డురాకుడదని నికోలస్ వారు తలంచారు. శాంతాక్లాస్ అనేది సెయింట్ నికోలస్ గారికి మారుపేరు. ఇలా ఈ సాంప్రదాయం మొదలైనది. అందుకే క్రిస్మస్ రోజున బహుమతులను ఇచ్చిపుచ్చుకొంటూ ఉంటాము. మనకున్నది ఇతరులతో పంచుకోవాలనే సందేశం దీనిలో దాగి ఉన్నది. ఇతర జీవితాలలో వెలుగులు నింపినప్పుడే, మనం నిజమైన క్రిస్మస్ కొనియాడగలం. 
*********
క్రిస్మస్ 
శ్రీ యేసుని జన్మదినం లోకానికి పర్వదినం. శ్రీ క్రీస్తుని జన్మదినం మనుజాళికి శుభదినం. ఎందుకంటే, క్రిస్మస్‌ పండుగ ఈ లోకాన్ని, మనుజాళిని బానిసత్వంనుండి స్వేఛ్ఛలోనికి, యుద్ధమార్గంనుండి శాంతిపధంలోనికి, కారుచీకటినుండి ఉజ్వల వెలుగులోనికి, తీరని బాధనుండి అంతుపట్టని సంతోషంలోనికి నడిపిస్తుంది. అందుకనే, చిన్నారి యేసుని జననం యావత్‌ క్రైస్తవ జనావళికి ఒక పర్వదినం, ఒక శుభదినం. నీలాల నింగిలో తార వెలుగగా పాపపు చీకటి తొలగిపోయెను. దూతలంతా గళము విప్పగా, పాపిగుండె ప్రజ్వరిల్లెను, కాపరులంతా కలసి ఆడగా, పాపభీతి చెదరి పోయెను. అందుకనే, 
ఆ జననం పగలిన గుండెకు నవ్య కిరణాలు వంటిది, 
ఆ జననం చెదరిన మనసుకు ప్రేమ గీతాలు వంటిది, 
ఆ జననం విరిగిన వీణకు కోటిరాగాలు వంటిది. 
దారి తెలియక తిరుగుచుండగా వింతచుక్క దారి చూపెను. 
స్థలముకోసము వెదకుచుండగా, పశువుల పాక పలకరించెను, 
రాజులంతా శిరమువంచగా, దూతవార్త శరణమిచ్చెను, 
కన్యమరియ కడుపుపండగా, క్రీస్తు ప్రభువు జన్మించెను. అందుకనే. 
ఆ జననం వెదకినవారికి దొరికిన వరాలు వంటిది, 
ఆ జననం అడిగిన వారికి పొందిన ఫలాలు వంటిది, 
ఆ జననం తట్టిన వారికి తెరచిన ద్వారాలు వంటిది. 
ఆ కన్యమరియ కడుపు పండగ జన్మించిన క్రీస్తు ప్రభువే, చీకటిని చీల్చిన చిన్నారి యేసు. ఈ పుడమిన పుట్టిన ఈ చిన్నారి యేసే, పాప చీకటిని ప్రజ్వలింపచేసి ప్రకాశవంతంగా మలచింది. ఈ చిన్నారి యేసే, నిశిరాత్రి సమయాన నీతి సూర్యునిలా ఉద్భవించి, పాపచీకటిని పఠాపంచలు చేసింది. ఈ సంఘటనను ఉద్దేశించే దాదాపు క్రీ.పూ. 700 సం.ల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచనం పలికాడు: ‘‘చీకటిలో నడచు జనులు పెద్దవెలుగును చూచిరి. దట్టమైన నీడులుక్రమ్మిన తావున వసించు ప్రజలమీద జ్యోతి ప్రకాశించెను’’ (9:2). ఈ వచనం మనకు అర్ధం కావాలంటే, మనకు కొంత చారిత్రక నేపధ్యం తెలిసి ఉండాలి. 
బహుశ, యెషయా ఈ వచనాన్ని లేదా ఈ వృత్తాంతాన్ని రచించినపుడు, ఆ రోజులలో చోటుచేసుకున్న ఒక భయంకర సంఘటన తన మదిలో ఉండవచ్చు. ఆ సంఘటన ఏమంటే, ఇశ్రాయేలీయుల శత్రువు వారిమీదకు దండెత్తి వచ్చారు. ఈ దండయాత్రలో ఒక గొప్ప విధ్వంసాన్ని వారు సృష్టించారు. గ్రామాలను తగల బెట్టారు. పంటలను నాశనం చేసారు. వేలాదిమందిని బానిసలుగా తీసుకు వెళ్ళారు. శత్రువులు వారిని బానిసలుగా ఎలా తీసుకు వెళ్ళారంటే, పొలందున్నే కాడికి ఆవును ఎలా కడతారో ఆ మాదిరిగా నలుగురైదు బానిసలును ఒక కొయ్యకు కట్టి తీసుకొని వెళ్ళేవారు. ఆ సంఘటనను మన కళ్ళముందు చిత్రీకరించుకుంటే, ఆ బాధ వర్ణణాతీతం! 
ఈ సందర్భంలోనే యెషయా ప్రవక్త ఈ వచనాలను వ్రాసాడు: ‘‘నీవు వారి మెడమీద కాడిని విరుగ గొట్టితివి. వారి భుజము మీద దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి’’ (9:4). ఇలా బానిసత్వ చీకటిలో పయనించే నాటి ఇశ్రాయేలును ఉద్దేశించి, ‘చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును గాంచిరి’ అని ప్రవక్త ప్రవచించాడు. చీకటిని చీల్చే చిన్నారి యేసును గురించి తెలియజేస్తూ, యెషయా ఈ ఊరట వచనాలను పలికారు: ‘మనకొక శిశువు జన్మించును’ అని, ‘అతడు రాజ్య భారమును వహించును’ అని, రాబోవు రాజు గుణగణాలను తెలియచేశారు. అందుకనే, యేసు జననం అలసిన వారికి ఆశ్రయ స్థానంగా మారుతుంది. 
యేసు జననం తండ్రి దేవుని ప్రేమ వర్ణవిల్లు: 
పాత నిబంధనలో చూసినట్లయితే, తండ్రి దేవుడు పాప జగతిని ప్రక్షాళన చేయడానికి జలప్రళయమును పంపించారు. జప్రళయము తరువాత, ‘‘దేవుడు నోవాను, అతని కుమారులను దీవించి పిల్లపాపలతో పెంపొంది భూమండలము నందంతట వ్యాపింపుడు’’ (ఆ.కాం. 2:9) అని దీవించి, ‘ఇకపై ఇటువంటి ప్రళయము సంభవించదు’ అని నోవాతో ఒడంబడిక చేసుకొని దానికి గుర్తుగా ఇంద్రధనస్సును ఇచ్చారు. అదేవిధంగా, పాప ఊభిలోనున్న జనావళిని రక్షించడానికి తండ్రి దేవుడు తన కుమారున్ని పంపారు. అందుకనే, ఆ జననం తండ్రి దేవుని ప్రేమ వర్ణవిల్లు అయింది. దీని అర్ధం ఏమంటే, మరణం ఇకపై మనమీద ఎటువంటి ఆధిపత్యం చెల్లించదు. ఎందుకంటే, శాశ్వత మరణానికి మనకి మధ్య యేసు అనే రక్షణ చిహ్నమైన వర్ణవిల్లు ఉన్నది. దానిని ఉద్దేశించి యోహానుగారు ఇలా వ్రాసారు: ‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించారు. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందును’’ (3:16).
 యేసు జననం దేవుని త్యాగ సిరిజల్లు: 
సాధారణంగా, ఎప్పుడు పుడతామో, ఎలా మరణిస్తామో, ఎవరికీ తెలియదు. కాని యేసు ప్రభువు విషయంలో ఆయన ఎప్పుడు పుట్టేది, ఎవరి కడుపున జన్మించేది, ఎలా మరణించేది అన్న విషయాలు ఆయనకు విదితమే! ఇది రక్షణ ప్రణాళికలో భాగం! తాను భూలోకంలోనికి వచ్చింది దైవరాజ్యాన్ని స్థాపించి తన మరణము ద్వారా మనలను తండ్రితో ఐఖ్యం చేయడానికి అని ఆయనకు తెలుసు. కాని ఆయన వెనకడుగు వేయలేదు. అందుకనే, రక్షకుడైన యేసు జననం దేవుని త్యాగ సిరిజల్లు అయింది. 
యేసు జననం ఆత్మదేవుని వరాల పొదరిల్లు: 
మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, రక్షణ ప్రణాళికలోని ప్రతి ఘట్టంలో త్రిత్వైక సర్వేశ్వరుడు కొలువై ఉన్నాడు. యేసు ప్రభుని జననం కూడా అదేవిధంగా సంభవించినది. పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తివలన మరియమాత గర్భం ధరించింది. ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలై, దైవవరముతో పరిపూర్తిగా నింపబడినది. దానినే లూకా సువార్తికుడు ఇలా తెలియజేశారు: ‘‘పవిత్రాత్మ శక్తి నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును’’ (1:35). అందుకనే, యేసు జననం ఆత్మదేవుని వరాల పొదరిల్లు. ఇంకొక్క మాటలో చెప్పాలంటే, చిన్నారి యేసుని జననం త్రిత్వైక సర్వేశ్వరుని సమిష్టి వరదానం. 
క్రీస్తు జననం త్రిత్వం ఒసగిన ఒక గొప్ప బహుమానం. ఈ పండుగను మనమందరం ఎంతో ఉల్లాసంతో, ఉత్సాహంతో, సంతోషంతో జరుపుకుంటాం. కాని క్రిస్మస్‌ పండుగ ప్రతి సంవత్సరం వచ్చి వెళ్ళే పండుగలా ఉండకూడదు. ప్రతి క్రైస్తవుని జీవితంలో మార్పు తీసుకొని రావాలి. పునీత పౌలుగారు తీతుకు రాసిన లేఖ ద్వారా ఇలా తెలియ జేయుచున్నారు: ‘‘శక్తిహీనతను, లౌకిక మోహమును విడనాడి, ఇంద్రియ నిగ్రహము కలిగి ఋజుమార్గమున, పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది’’ (2:12). కావున ప్రియ మిత్రులారా! చీకటిని చీల్చిన చిన్నారి యేసు, మన గుండెల్లో, మన జీవితంలో ఉంటే ఆయన అనుగ్రహించే కృపానుగ్రహము చేత మనము ఎట్టికార్యమునైనను సాధింపవచ్చు. కనుక, మనమందరం, చిన్నారి యేసయ్యా, రావయ్యా అని ఆహ్వానిస్తూ, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వవయ్యా అని ప్రార్ధించుదాం! 
*******
ప్రభువు మనకోసం జన్మించెను - క్రిస్మస్ 
ఈరోజు, ఒకజ్యోతి మనపై ప్రకాశించెను, ప్రభువు మనకోసం జన్మించెను. ఆయన, దేవుని మహిమయొక్క ప్రకాశవంతమైన జ్యోతి. తన శక్తివంతమైన ఆజ్ఞతో ఈ లోకం పోషింపబడుతున్నది. క్రీస్తుజయంతి యొక్క అర్ధము ఏమిటి? ప్రాముఖ్యత ఏమిటి? మనసృష్టికర్త మనకి దూరములో లేడు, అతడు మనకు తెలువనంటివాడుకాదు అన్న నిజాన్ని ఎరిగి ఆనందముతో సంబరాన్ని చేసుకుంటున్నాము. దేవుడు మనకి అతిసమీపములోనే, మనచెంతనే ఉన్నాడు. ఎంతదగ్గర అంటే, ఆయన మనలో ఒకనిగా జన్మించాడు. ఇప్పుడు, స్వతంత్రముతో, నమ్మకముతో, దేవున్ని సమీపించవచ్చు. మనం ఆయనతో మాట్లాడవచ్చు. మన సమస్యలను ఆయనతో పంచుకోవచ్చు. ఆయనను స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. మనకు సాధ్యమైన తీరులో ఆయనతో సంభాషించవచ్చు. దేవుడు ప్రేమించే తండ్రిగా, దయగల రక్షకునిగా, కరుణగల ఆప్తునిగా బయలు పరచబడ్డాడు. దేవుడు మనలను తెరచిన కరములతో ఆహ్వానిస్తున్నాడు. ఈరోజే, మనం ఆయన దరికి వెళ్దాం.
ప్రభువా, మా హృదయాలను ప్రేమతో మీ కొరకు విశాలము చేయండి. అమ్మ మరియవలె, ''అవును'' అని చెప్పుటకు మమ్ములను బలవంతులనుగా చేయండి. ముఖ్యముగా, జీవితాలలో ప్రేమసుగుణాన్ని మరచిపోయినవారిని ఆశీర్వదించండి. వారిని తాకండి. తద్వారా, ఈ క్రిస్మస్ రోజున వారుకూడా మిమ్ములను ఆహ్వానించెదరుగాక. మీకు మాఅందరిపైఉన్న ప్రేమను నిజము చేయులాగున మమ్ములను చేయండి. 
*******
క్రిస్మస్ సందేశము 
“మీరు భయపడ వలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను'' (లూకా 2:10-11). ఆహా! ఎంతటి అనుగ్రహం! ఎంతటి భాగ్యం! మనం పొందిన వరాలలోకెల్ల గొప్ప వరం, అనుగ్రహం: క్రిస్మస్ - దేవుడు లోక రక్షకుడిగా జన్మించడం. వాక్కు మానవుడై మన మధ్య నివసించడం. తన ప్రజలకు వాగ్ధానము చేసిన విధముగా, చీకటిలోనున్న ఈ లోకానికి వెలుగును ప్రసాదించడం. నిజముగా ఇది గొప్ప శుభవార్తే! అందుకే పరలోకదూతల సమూహము సైతము ప్రత్యక్షమై ఇట్లు స్తుతించెను: 
''మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, 
భూలోకమున ఆయన అనుగ్రహమునకు 
పాత్రులగు వారికి సమాధానము కలుగుగాక!'' (లూకా 2:14). 
"మనకొక శిశువు జన్మించెను. మనమొక కుమారుని బడసితిమి" (యెషయా 9:6). క్రీస్తు పూర్వం 8వ శతాబ్దములో యెషయా ప్రవక్త ఇస్రాయేలు ప్రజలకు ఇచ్చిన గొప్ప ఊరట కలిగించే ప్రవచనం. ఎందుకన, బలమైన అస్సీరియ దేశం ఇస్రాయేలీయుల మీద దండెత్తుతున్న రోజులు. అస్సీరియా రాజు మరణముతో, 'చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూస్తారని, దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజలమీద జ్యోతి ప్రకాశించునని, మెడమీద కాడి (బానిసత్వం), విరగగొట్టబడునని, భుజములమీద దండమును (అణచివేయుట) ముక్కలు చేయబడునని, నూతన రాజ్యభారమును వహించుటకు శిశువు జన్మించునని' యెషయా ప్రవచించాడు. యేసు జననంపట్ల ఈ ప్రవచనాలు మనకీ ఊరట కల్గించే ప్రవచానాలే! ఎందుకనగా, మనంకూడా ఈనాడు అనేక విధాలుగా, చీకటిలో, బానిసత్వములో జీవిస్తున్నాం. 
క్రీస్తు జన్మము - ఇమ్మానుయేలు: దేవుడు మనతో ఉన్నాడు అను ఆనందమును కొనియాడటం. ఆయన మనతో లోకాంతము వరకు ఉంటాడు, మనలను అమితముగా, అనంతముగా ప్రేమిస్తాడు అను దానికి ఆయన జన్మ నిదర్శనం. క్రీస్తు జననం ఒక నూతన సృష్టి. నూతన దివికి, నీతికి నిలయమైన భువికి ఆరంభం (యెషయ 65:17; 2 పేతు. 3:13). పుట్టిన ప్రతీ బిడ్డ ఓ కొత్త ఆరంభం, ఎంతో భవిష్యత్తు. 
జన్మించిన రక్షకునిలో జీవముండెను. ఆ జీవము మనకు వెలుగాయెను (యోహాను 1:4). తన కుమారుని జన్మముతో దేవుడు తన శక్తిని, అనంతమైన ప్రేమను మనం తెలుసుకొనేలా చేస్తున్నాడు. తద్వారా, మనము జీవితమును, దానిని సమృద్ధిగా పొందులాగున చేసియున్నాడు. కాని, మనము గుర్తుంచుకోవలసిన విషయం: ''ఆయన తన వారి యొద్దకు వచ్చెను. కాని, తన వారే ఆయనను అంగీకరించలేదు'' (యోహాను 1:11). మనమందరము ఆయనకు చెందినవారమని మన విశ్వాసం. ఈరోజు ఆయన మన మధ్యలో జన్మించాడు. మరి, ఆయనను ఎరిగియున్నామా? వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. అదే క్రిస్మస్. దేవుని మహిమను మనమందరము పొందాలి. తండ్రి యొద్ద నుండి వచ్చే ఏకైక కుమారుని మహిమను మనం చూడాలి, పొందాలి. అప్పుడే, ఈ క్రిస్మస్ కి అర్ధం ఉంటుంది. దేవుని బిడ్డగా, ఏకైక కుమారునిగా జన్మించిన ప్రభువును అంగీకరించి విశ్వసిస్తే మనమూ దేవుని బిడ్డలగు భాగ్యమును పొందుదము (యోహాను 1:12). 
క్రీస్తు జన్మించే నాటికి, ఈ లోకం చీకటిలో ఉంది. పాపముతో నిండియున్నది. మనం అవిశ్వాసములో ఉన్నాము. పాలస్తీనా దేశం సాంఘిక అసమానలతో నిండి ఉన్నది. రోమను సామ్రాజ్యం తన మిలటరీ బలగాలతో మధ్యధరా ప్రపంచాన్నంతటిని తన గుప్పిట్లో ఉంచుకుంది. మతోన్మాదులు విప్లవాలను, రక్త పాతాన్ని, ఉగ్రవాదాన్ని, సృష్టిస్తున్నారు. ధనికులు పేదవారిపై పెత్తనం, మతాధికారులు తమ అధికారాన్ని, ప్రభావాన్ని చాటుకొనుటకు ప్రయత్నంచేసేవారు. యేరుషలేము శతాబ్దాలుగా రక్తపాతాలకు, ఘర్షణలకు నిలయముగా చరిత్రలో చిరస్థాయిగా నిలచినటువంటిది. ఇలాంటి విషమ పరిస్థితులు ఉన్నప్పటికిని, దివ్యబాలుడు ఎదురొడ్డి అద్భుత రీతిన జీవించగలిగాడు. అతడు పెరిగి పెద్దవాడై శాంతికి మూలాధారమైయ్యాడు. ఇదే దేవుని అపారమైన శక్తికి, కరుణకు నిదర్శనం. అందుకే దివ్య బాలుని జన్మను కృతజ్ఞతతో కొనియాడాలి. ఆయన జన్మతో, ఒక క్రొత్త జీవితం ఆరంభమైనది, లేతమొక్క అంకురించి యున్నది. ఓ నూతన సూరీడు దేదీప్యముగా ప్రకాశించి యున్నది. పెరిగి పెద్దవాడైన తర్వాత, దైవరాజ్యముగూర్చి, న్యాయముగూర్చి భోదిస్తాడు. 
16వ బెనడిక్ట్ పాపుగారు తన క్రిస్మస్ సందేశములో ఇలా చెప్పియున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మనం సాంకేతిక, సామాన్య పరిజ్ఞానములో అపారమైన పురోగతిని సాధించాం. ఈరోజు మనం అన్ని విషయాలలో అపారమైన జ్ఞానవనరులను కల్గియున్నాము. అయితే, ఇలాంటి పరిస్థితులలో, మానవ మేధస్సుకు, సాంకేతిక పరిజ్ఞానానికి బానిసలయ్యే అవకాశం లేకపోలేదు! అలా బానిసలుగా మారినప్పుడు, మనలో ఆధ్యాత్మికలేమి, హృదయశూన్యత సంతరించుకొంటాయి. అందుకే, మనం క్రీస్తు జన్మమునకు మన హృదయాలను, మనస్సులను తెరవాలి. రక్షణ ఘట్టమైన క్రీస్తు జననం ప్రతీ మానవునికి ఒక క్రొత్త నమ్మకాన్ని ఇస్తుంది. 
ఈనాడు ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినదని భావిస్తున్నాం. కాని, క్రీస్తు వెలుగులేనిచో మన అభివృద్ధికి ఎలాంటి సార్ధకత ఉండదు (యోహాను 1:9). వాక్కు మానవుడైనందునే మానవ జీవితానికి సంపూర్ణ అర్ధమున్నదని శ్రీసభ పదేపదే భోదిస్తుంది. ఈ రోజుల్లో అన్ని విభాగాల్లోనూ అన్యాయం, అవినీతి, స్వార్ధం, భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు, నైతిక విలువలు లేకపోవడం, ఆర్ధిక అసమానతలు మొ.గు దుష్ట శక్తులతో మన సమాజం నిండిపోయినది. క్రీస్తు ఆనాడు బెత్లేహేములో పుట్టినట్లుగా, ఈనాడు మన సమాజములోనూ జన్మించాల్సిన అవసరం ఉంది. మనం మారాలి. అప్పుడే, మన సమాజం మారుతుంది. దేవుడు కోరుకొనేది ఒక్కటే: పరలోక రాజ్యం భూలోకమున నెలకొనాలి. దానికి మనందరి సహాయ సహకారం అవసరం. 
క్రీస్తు జయంతిని బాహ్యముగా కొనియాడటముతో సరిపోదు. దివ్యబాలుడు ఈ లోకానికి తెచ్చిన పశ్చాత్తాపము, మారుమనస్సు అను సందేశాన్ని మన జీవితానికి అన్వయించుకొన్నప్పుడే, మనం కొనియాడే ఈ పండుగకు అర్ధం ఉంటుంది. రెండవ జాన్ పౌల్ పాపుగారు 19 డిశంబర్ 1999వ సంవత్సరములో, త్రికాలజపముగూర్చి సందేశాన్ని ఇస్తూ ఇలా అన్నారు. క్రీస్తు జయంతి కేవలం 2000ల సం.ల క్రితం క్రీస్తు జన్మించిన సంఘటనని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు. ఇది ఒక సజీవమైన వాస్తవము. కనుక, విశ్వాసుల హృదయాలలో ప్రతీ సం.ము ఈ సజీవ వాస్తవం పునరావృతం కావాలి. ఆనాటి చారిత్రాత్మిక సంఘటన ఈ రోజు ఆధ్యాత్మిక సజీవ వాస్తవముగా మన సాంగ్యాలలో జీవించాలి. 
క్రిస్మస్ - దేవుని శక్తి, దేవుని ప్రేమ, దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని శాంతి మరియు దేవుని రక్షణ. ఆమెన్.

క్రిస్మస్ సందేశము (పగలు)

క్రిస్మస్ సందేశము
 
కొన్ని సంవత్సరముల క్రితం ఒక క్రిస్మస్ రోజున, చిన్న పిల్లలతో మాట్లాడుతుండగా, వారిని ఒక ప్రశ్న అడిగాను, ‘క్రిస్మస్ రోజున మీరు పొందేటటువంటి బహుమతులలో మీరు ఏ బహుమతిని పొందాలని అనుకుంటున్నారు?’ పిల్లలు అందరూ కూడా అనేక రకాలైనటువంటి సమాధానమును ఇచ్చి ఉన్నారు. అయితే వారిలో ఒక అమ్మాయి నేను ‘యేసు’ ని బహుమతిగా పొందాలని అనుకుంటున్నాను’ అని సమాధానం ఇచ్చింది. నిజమే కదా! క్రిస్మస్ రోజున యేసు ప్రభువు కంటే గొప్ప బహుమతి, బహుమానం, అనుగ్రహం, దేవుని వరం ఏముంటుంది? వారిని మరో ప్రశ్న అడిగాను, ‘ఈ లోకానికి ఏ బహుమతి కావాలి అంటే మీరు ఏమి కోరుకుంటారు?’ మరలా అనేక సమాధానాలు వచ్చాయి. అయితే అదే అమ్మాయి, ‘ఈ లోకానికి శాంతి కావాలని కోరుకుంటాను’ అని చెప్పింది.

ఈరోజు మనం యేసు జన్మ దినమును కొనియాడుచున్నాము. ఇది దేవుని యొక్క ప్రేమకు నిదర్శనం. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనే దానికి ఒక గొప్ప సాక్ష్యం, నిదర్శనం. కనుక, ఆ దివ్య బాల యేసు మన హృదయాలలో, మన కుటుంబాలలో, మన సంఘములో, ఒక గొప్ప బహుమానంగా జన్మించాలని ఆశిద్దాం. అలాగే లోక రక్షకుడైన యేసు శాంతి స్థాపకుడు కనుక, ఈ లోకంలో శాంతి నెలకొనాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాం! ప్రభువు శాంతి ఈ లోకంలో నెలకొనాలంటే నీవు నేను మనమందరం కూడా శాంతి స్థాపకులుగా, శాంతిని బోధించే సందేశకులుగా మారాలి.

మనం ఎప్పుడైతే యేసు ప్రభువును అనుసరిస్తామో, ఆయన బోధనలను పాటిస్తామో, ప్రభువు శాంతి మనదవుతుంది. మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రులను గౌరవిస్తామో, వారిపై దయ, కనికరము కలిగి జీవిస్తామో, మన తోటి సహోదరీ సహోదరులను గౌరవిస్తామో, ప్రేమిస్తామో, అప్పుడు ప్రభువు శాంతి మన కుటుంబంలో భాగమవుతుంది.

ఈ క్రిస్మస్ రోజున మనము చిన్నపిల్లల వలే ఉండాలని ప్రభువు మనల్ని కోరుతున్నాడు. చిన్న బిడ్డల విశ్వాసాన్ని మనము కలిగి జీవించాలి. ఆ విశ్వాసమే నిజమైన శక్తి గల క్రిస్మస్ అంటే ఏమిటో మనకు తెలియజేస్తుంది.

క్రిస్మస్ అనగా ‘ఇమ్మానుయేలు’, దేవుడు మనతో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అంధకారాన్ని పటాపంచలు చేసి నూతన వెలుగును ఇచ్చుటకు ప్రభువు మనతో ఉన్నాడు. మనము ఇక భయపడవలసిన అవసరం లేదు. విచ్చిన్నమైనటువంటి మన బంధాలను, కుటుంబాలను, సంఘాలను, దేశాలను, ఏకం చేయడానికి ప్రభువు మనతో ఉన్నాడు. మనలను ఐక్యం చేయుటకు ప్రభువు మనతో ఉన్నాడు. మనము ప్రశాంతముగా జీవించుటకు ఆయన మనకు సహాయము చేయును. మన పాపములలోనూ, మన బలహీనతలలోనూ, మనలను క్షమించుటకు, మనలను ప్రేమించుటకు, మనలను ఒక నూతన సృష్టిగా తయారు చేయుటకు, ప్రభువు మనతో ఉన్నాడు. మన ఒంటరితనంలోను, మన కష్టాలలోను, బాధలోనూ, మనలను ఓదార్చుటకు ప్రభువు మనతో ఉన్నాడు.

గతంలో ఎంతో మంది దేవుని కోసం వెదకి ఉన్నారు. దేవుని చేరుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నారు. కానీ క్రిస్మస్ రోజున, దేవుడే మన మధ్యన జన్మిస్తూ ఉన్నాడు. దేవుడు మానవుడై మన మధ్యలో ఉంటున్నాడు. అదే నిజమైన క్రిస్మస్ కు అర్థం.

ప్రభువు మనతో ఉండాలి అంటే, మనము ప్రభువు పట్ల విశ్వాసముగా జీవించాలి. మరియ జోజప్ప గారి వలె మంచి కుటుంబ జీవితం జీవించాలి. ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవించాలి. దేవుని పట్ల మరియ తల్లి చూపించిన వినయ విధేయతలను బట్టియే, ఆమె జీవించిన విశ్వాసమును బట్టియే, ఆమె ధన్యురాలు అయ్యింది.
ప్రభువు మనతో ఉండాలి అంటే దేవునికి మనము ప్రత్యుత్తరము ఇవ్వాలి. దేవుని యొక్క సందేశము గబ్రియేలు దూత ద్వారా అందించినప్పుడు మరియ తల్లి ‘ఇదిగో నేను నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక’ అని జవాబు ఇచ్చింది.

ప్రభువు మనతో ఉండాలి అంటే మనము దేవుని స్వరాన్ని వినగలగాలి. మరియమ్మ దేవుని స్వరమును విని దేవుని యొక్క చిత్తానికి, ప్రణాళికకు తలవొగ్గింది. దేవుని తనలో మోసింది. 9 నెలలు గడిచిన తర్వాత ఆ లోక రక్షకుడు ఆమె గర్భమున జన్మించి ఉన్నాడు. ఆ సమయములో ఆ దివ్య బాల యేసు స్వరమును విన్నది కేవలము ఇద్దరు మాత్రమే, ఒకరు గొల్లలు, మరొకరు జ్ఞానులు.

మనము దేవుని స్వరాన్ని వింటున్నామా? మనలను రక్షించుటకు దివి నుండి భువికి దిగి వచ్చిన ప్రభువును మనము విశ్వసిస్తున్నామా? “ఆయన తన వారి యొద్దకు వచ్చెను. కాని, తన వారె ఆయనను స్వీకరించలేదు” (యో 1:11). కనుక ప్రభువు మనతో ఉండాలి అంటే మనము ప్రభువును స్వీకరించాలి. మన హృదయాలను తెరవాలి. మరియ ప్రసవించుటకు ఎక్కడా చోటు లేదు అని అందరూ అన్నారు. మరి ప్రభువును స్వీకరించుటకు నీ సమయాన్ని, నీ చోటును కేటాయించుటకు నీవు సిద్ధముగా ఉన్నావా?

క్రిస్మస్ ఈ రోజు నాకు ఏలాంటి అర్థాన్నిస్తుంది, అని మనమందరము వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాలి. రెండువేల సంవత్సరముల క్రితం జరిగిన క్రిస్మస్ ఈరోజు నాకు ఎలాంటి అర్థాన్ని ఇస్తుంది?

ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రిస్మస్ ద్వారా దేవుని దయ నాపై దిగి వస్తుంది. ఈ దయ నాకు దేవునికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గిస్తుంది. నా పాపానికి పరిహారంగా తన ప్రాణమును, తన రక్తాన్ని వెలగా చెల్లించుటకు దేవుని దయ దిగివస్తుంది.

మనం ఇచ్చట ఎందుకు సమావేశమై ఉన్నామో కూడా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ యొక్క అర్థాన్ని మనము తెలుసుకోగలం.

క్రిస్మస్ అంటేనే ఎంతో హడావిడి. చివరి క్షణం వరకు కూడా అలంకరణలు చేస్తూ ఉంటాము. షాపింగ్ చేస్తుంటాము. ఇంటిని, దేవాలయాన్ని శుభ్రపరుస్తూ ఉంటాము. క్రిస్మస్ కేకులు, బహుమతులు పంచుతూ ఉంటాము. వీటితోపాటు అలసట, ఒత్తిడికి కూడా లోనవుతూ ఉంటాము. కనుక మన ఆలోచనల ఉరుకులు పరుగులను నెమ్మదించవలసినటు వంటి సమయం. క్రిస్మస్ అంటే కేవలము ఉరుకులు పరుగులు, అలంకరణలు, ఆచారాలు మాత్రమే కాదు. మనం ఇక్కడ సమావేశమైనది ఇతరులను చూడటానికి లేకపోతే ఇతరులు మనలను చూడటానికి కాదు. మనకు ఇష్టమైన క్రిస్మస్ పాటలను పడుకోవడానికి కాదు. మన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కూర్చోవడానికి కాదు. లేకపోతే, ఒక మంచి ప్రసంగాన్ని వినాలని కాదు.

కాని, దేవుడు మన కోసం తన సింహాసనాన్ని వదిలిపెట్టి మనలో ఒకనిగా జన్మించిన ఆ రాత్రిని గుర్తు చేసుకోవడానికి. మనకోసం జన్మించిన దివ్య బాలయేసును ఆరాధించటానికి మనం ఇచట సమావేశమై ఉన్నాము. ఈ బాలుడు మనకు రక్షణ మార్గమును చూపించి యుండుట వలన, తన జీవితాన్నే మనకోసం అర్పించుట వలన మనం ఇక్కడ సమావేశమై ఉన్నాము. క్రిస్మస్ అనగా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, మనందరికీ ఒక ఆశను, ఒక గొప్ప నమ్మకమును మనకు కలిగిస్తున్నాడు. అందుకే, మనం ఇక్కడ సమావేశమై ఉన్నాము.

క్రీస్తు అను ఒక గొప్ప బహుమానము ఈ రోజు మనందరికీ ఇవ్వబడి ఉంది, కనుక, మనము ఇక్కడ సమావేశమై ఉన్నాము. అందుకే మనము పాటలు పాడుతూ ఉన్నాము, అలంకరణలు చేస్తున్నాము, బహుమతులు పంచుకుంటూ ఉన్నాము. దీనిని మనము ఎల్లప్పుడూ మరువరాదు.

రెండు వేల సంవత్సరముల క్రితం బెత్లెహేములో ప్రభువు జన్మించినప్పటికిని, ఈరోజు, ప్రభువు, నా విశ్వాసమును బట్టి, నా హృదయంలో జన్మించక పోయినట్లయితే నాకు ఎలాంటి ఉపయోగం లేదు.

కనుక, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మన హృదయాలలో జన్మించాలి. అప్పుడే అది మనకు నిజమైన క్రిస్మస్ అవుతుంది.

లోక రక్షకుడు మీ హృదయాలలో జన్మించాలని, మీ జీవితాలు రక్షణ మార్గము వైపు నడిపింప బడాలని, ప్రార్థిస్తున్నాను. మీరు దేవుని యొక్క స్వరమును ఆలకించి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జీవించాలని ఆశిస్తున్నాను.

అందరికీ నా హృదయపూర్వక యేసు క్రీస్తు రక్షకుని జన్మదిన శుభాకాంక్షలు!

క్రీస్తు సాక్షత్కార మహోత్సవము, జనవరి 6, 2013

క్రీస్తు సాక్షత్కార మహోత్సవము, జనవరి 6, 2013 
పఠనాలు: యెషయా 60: 1-6; కీర్తన 72: 1-2, 7-8 , 10-13; ఎఫెసీ 3:2-3, 5-6; మత్తయి 2:1-12 

ఇదిగో! సర్వాధికారియైన సర్వేశ్వరుడు వచ్చుచున్నాడు. తన చేతియందు రాజ్యాధికారము, శక్తి సామర్ధ్యములను కలిగి వచ్చుచున్నాడు. 

దేవుడు నమ్మదగిన వాడు 

మనలో ప్రతి ఒక్కరముకూడా, నమ్మకము కలిగిన వ్యక్తిని కోరుకొంటాం. అలాంటి వ్యక్తికోసం ఎదురు చూస్తూ ఉంటాము. మనలను ఎల్లప్పుడూ అంటిపెట్టుకొని ఉండటము మాత్రమేగాక, వాగ్దానాలను చేయడం మాత్రమేగాక, మంచి తనము కలిగి చేసిన వాగ్దానాలను నెరవేర్చుటకు కావలసిన శక్తిని కలిగియున్న వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఉంటాం. అధారపడదగిన వ్యక్తి, నమ్మదగిన వ్యక్తి, విశ్వాసముగల వ్యక్తి మనదరికీ కావాలి... ఆ వ్యక్తియే దేవుడు. జ్ఞానుల శిశు సందర్శనము, దేవుని విస్వసనీయతకు, నమ్మకమునకు, ఋజువుగా, బైబిలు గ్రంధములోనున్న అత్యంత అందమైన ప్రామాణాలలో ఒకటి. 

క్రీస్తు జనమ్మునకు 500 సం,,ల పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా, రక్షణ వెలుగును పంచుకొనుటకు అన్ని దేశములను యేరూషలేమునకు నడిపిస్తానని దేవుడు వాగ్ధానము చేసియున్నాడు (యెషయా 49:6). కీర్తనకారుని ద్వారా, ఇదే వాగ్దానాన్ని మరోమాటలో చేసియున్నాడు: ''తర్శీషు రాజులు, ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు. షేబా, సెబా పాలకులు కానుకలు కొనివత్తురు'' (కీర్తన 72:10). 500 ల సం,,లు యుద్ధాలు జరిగినను, ప్రజలు వలసలు పోయినను, చారిత్రాత్మక కలతలు జరిగినను, నాగరికత ప్రపంచములో మూడు వేర్వేరుసార్లు ప్రపంచ పటమును తిరగరాసినను, దేవుడు వాగ్ధానము చేసిన దానిని నెరవేర్చియున్నాడు. మంచి వ్యక్తులు, నమ్మకము కలిగిన వ్యక్తులు మాత్రమే మంచి వాగ్దానాలను నిలబెట్టగలరు. జ్ఞానుల ద్వారా, వారి కానుకలద్వారా, సకల దేశాలు, జాతులు రక్షణ వెలుగులోనికి ప్రవేశించియున్నాయి. 

జ్ఞానుల శిశు సందర్శనము దేవుని మంచితనాన్ని మరియు ఆయన శక్తికలవాడని నిరూపిస్తున్నది. ఆయన మన దేవుడు, అందరి దేవుడు. దేవుని మంచితనము, ఆయన శక్తి మనవే, ఎందుకన, మనము క్రీస్తుకు చెందినవారము. దేవుడు, నీకు, నాకు వ్యక్తిగతముగా విశ్వసనీయుడు, నమ్మదగినవాడు. ఆయన మన ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం. అన్నివేళల, అన్నిసమయాలలో, ఆయనను పరిపూర్తిగా విశ్వసించుదాం, పూర్ణహృదయముతో ప్రేమించుదాం. మనమూ ఆయనకు నమ్మదగినవారముగా జీవించుదము. 

రాజైన దేవుడు పరిపాలించుటకు వేంచేయును 

జ్ఞానుల శిశు సందర్శనములో, లోకరాజు జన్మనుగూర్చి ఎరిగి, హేరోదు రాజు కలత చెందాడు. అదే వార్తను ఎరిగిన జ్ఞానులు ఎంతో ఆనందించారు. హేరోదు తన జీవితాంతం హత్యలు చేస్తూ, అన్యాయముగా మరియు స్వార్ధముతో జీవించియున్నాడు. వ్యక్తిగత కీర్తికోసం, పేరు ప్రతిష్టల కోసం రాజ్యాన్ని పరిపాలించాడు. పరలోకమునుండి, గొప్ప అధికారముతో క్రీస్తు లోకరాజుగా ఈ లోకములో ఉద్భవించాడు. హేరోదు భయపడి, క్రీస్తును హంతం చేయకపోతే, తన జీవితం ముగుస్తుందని కలత చెందాడు. మరోవైపు, అన్య దేశాలనుండి వచ్చిన జ్ఞానులు లోకరక్షకుని పట్ల ఎంతగానో సంతోషించారు. లోకరక్షకుడు, రాజునైన క్రీస్తుపైనే వారి జీవితాలు, రాజ్యాలు ఆధారపడియున్నాయని గ్రహించారు. 

క్రీస్తు ప్రతీరోజు అనేక విధాలుగా మనకీ సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. మన మనసాక్షిద్వారా, శ్రీసభ బోధనలద్వారా, దేవుని కృపా వరములద్వారా, మనలోనికి వేంచేస్తూ ఉన్నాడు. హేరోదువలె కలత చెంది, ఆయనను నిర్మూలించుటకు ప్రయత్నింపక, జ్ఞానులవలె, సంతోషముగా, ఆయనను మనలోనికి, మన జీవితములోనికి ఆహ్వానిద్దాం, ఆయనను కలుసుకొందాం. 

దైవ రాజ్యము, శ్రీసభ 

క్రీస్తు ఈ లోకమును పాలించుటకు వచ్చెను, అనగా, సర్వమానవాళిని ఆధ్యాత్మికముగా పాలించి దైవరాజ్యమున చేర్చుటకు ఆధ్యాత్మిక రాజుగా వచ్చాడు. ఆయన ఈలోకమున దైవ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన బోధనల ద్వారా, ఆయన చూపించిన మార్గముల ద్వారా, ముఖ్యముగా, శ్రీసభ ద్వారా ఆ దైవరాజ్యం ఈ నాటికిని కొనసాగుతూనే ఉంది. దైవరాజ్యములో అందరు భాగస్తులే. కాలగతిలో, అనేకమంది శ్రీసభ రూపముననున్న ఈ దైవరాజ్యాన్ని హేరోదు వలె నిర్మూలించాలని ప్రయత్నించారు. వారి ఆధీనములోనుంచుటకు ప్రయత్నించారు. కాని, ఎవరూ నాశనం చేయలేకపోయారు. శ్రీసభ జీవిస్తూనే ఉన్నది, అభివృద్ది చెందుతూనే ఉన్నది, వ్యాప్తి చెందుతూనే ఉన్నది. ఎందుకన, ఈ రాజ్యానికి దేవుడే అధిపతి. ఈ రాజ్యము కలకాలము నిలచును. సర్వము దేవుని ఆధీనములో ఉన్నది. 

నక్షత్రము వలె మార్గ దర్శకులమవుదాం 

''తూర్పు దిక్కున జ్ఞానులు చూసిన నక్షత్రము వారికి మార్గదర్శినీయై, శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలచెను'' (మత్తయి 2:9). ప్రతీ ఒక్కరం ఓ నక్షత్రమువలె ఉండాలి. ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ క్రీస్తు ప్రేమకు సదా సాక్షులమై ఉండాలి. ఈలోకానికి అతీతముగా ఇతరులు వారి కన్నులను పైకెత్తి అనంతమైన దైవరాజ్యమువైపు చూచునట్లు ప్రోత్సహించాలి. క్రీస్తు రాజ్యములో మనం పౌరులం, ఈ లోకమున ఆయన దూతలం లేదా ప్రతినిధులం. 

అందరూ పరిపూర్ణమైన జీవితాన్ని ఆశిస్తారు. కాని, పొందలేకున్నారు. ఎందుకన, ఆ పరిపూర్ణతను వారికున్న సంపదలో, సుఖములో, అధికారములో, మానవ సంబంధాలలో, లోకాశలలో వెదకుచున్నారు. ఇలాంటి వారికి మనము నిజమైన రాజ్యాన్ని, కలకాలము నిలచే రాజ్యాన్ని చూపించగలగాలి. 

మనం చేసే ప్రతీ పని, మనం మాట్లాడే ప్రతీ మాట క్రీస్తును ప్రతిబింబించాలి. మనం మరో క్రీస్తులా మారాలి. ఎలా? మనలను ప్రేరేపించుటకు, మార్గము చూపుటకు పవిత్రాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్ధన చేద్దాం. అలాగే, జ్ఞానులకు మార్గదర్శినీయై క్రీస్తు వద్దకు చేర్చిన నక్షత్రమువలె మనముకూడా మన జీవితాదర్శముద్వారా ఇతరులను క్రీస్తు చెంతకు చేర్చుదాం.

క్రీస్తు సాక్షత్కార పండుగ, Year C

క్రీస్తు సాక్షత్కార పండుగ, Year C

మనమంతా కొన్ని రోజుల క్రితమే మరో నూతన సంవత్సరాన్ని ప్రారభించాము. ఈ సం,,ము ఎలా ఉండబోతుందో ఎవరికీ తెలియదు. మన భవిష్యత్తు ఎలా ఉంటుదో అసలు ఎవరికీ తెలియదు. మనలో ఏదో ఆందోళన, ఆరాటం! అవకాశం ఉంటే, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని అందరము ఆరాటపడుతూ ఉంటాము. కాలజ్ఞానం తెలుసు అంటున్న వ్యక్తులదగ్గరికి పరుగులు తీస్తూ ఉంటాము. అయితే, ఇక్కడ మనం ఒక విషయాన్ని మరచి పోతూ ఉంటాం!. అదే మన వ్యక్తిగత చరిత్ర. అది ఎప్పుడూ ఓ ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసి ఉండదని తెలుసుకోవాలి. మనం ఈరోజు జీవించే జీవితము రేపు చరిత్రగా మారుతుంది. కాబట్టి, భవిష్యత్తును తెలుసుకోవాలని ఆరాటపడటముకన్నా, ఈరోజు, ఈ క్షణం చాలా ముఖ్యమైనదని, విలువైనదని తెలుసుకొందాం. ఇప్పుడు, ఈ క్షణములో, మనం తీసుకొనే నిర్ణయాలనుబట్టి, ఎంచుకొనే విషయాలనుబట్టి, అలవరచుకొనే విధానాన్నిబట్టి, మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా, గతములోనికి తిరిగి వెళ్ళలేము. కొత్త ఆశతో, నమ్మకముతో ముందుకు సాగిపోదాం. ఈ నాటి పండుగ సారాంశం, క్రీస్తు తననుతాను ఈ లోకానికి సాక్షాత్కరింపచేసుకొనడం. జ్ఞానులు క్రీస్తును గాంచడానికి ఏవిధముగా ముందుకు సాగిపోయారో, అలాగే మనము కూడా ముందుకు సాగిపోదాం.

తూర్పు దిక్కున జ్ఞానులు, ఖచ్చితముగా ఎక్కడ ఉంటాడో తెలియని వ్యక్తికోసం దూరదేశానికి బయలుదేరారు. వారి ప్రయాణములో అనేక నక్షత్రాలు, కాంతి దీపాలుగ మారి దారినిచూపిస్తూ గమ్యాన్నిచేరడానికి తోడ్పడ్డాయి. మన జీవితం ఓ ప్రయాణం. ఏమీ తెలియనటువంటి భావిష్యత్తులోనికి చూస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాం. మన ప్రయాణములోకూడా నక్షత్రాలు మనలను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. కొన్ని నిండు వెలుగును ప్రకాశిస్తూ మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి, మరికొన్ని వెలుగు లేకుండా ఎలాంటి గమ్యాన్ని చేర్చకుండా ఉంటాయి. కాని, ప్రతీది మనలను ఆకర్షిస్తూనే ఉంటుంది! ఇంతకీ మనం ఏ నక్షత్రాల గూర్చి మాట్లాడుతున్నాం? ధనం, వస్తుప్రపంచం, మందు, పదవి, కీర్తి ప్రతిష్టలు మొ,,గు కాంతిలేని నక్షత్రాలు మనలను ఆకర్షిస్తూ ఉంటాయి. అలాగే, సేవ, శాంతి, సమాధానం, దయ, ప్రేమ, విశ్వాసం మొ,,గు తేజోవంతమైన నక్షత్రాలు మన ప్రయాణములో సహాయపడుతూ ఉంటాయి.

తేజోవంతమైన నక్షత్రాల కన్నా, కాంతిహీనమైన నక్షత్రాలే మనలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. దేవుని రూపములో సృష్టింపబడిన బిడ్డలముగా, తేజోవంతమైన మరియు మన గమ్యాన్నిచేర్చే నక్షత్రాలను మనం అనుసరించాలి. మన జీవితాలను సార్ధకముచేసే, నిజమైన సంతోషాన్ని, తృప్తిని ఇచ్చే నక్షత్రాలను అనుసరించి దేవున్ని చేరుకోవాలి. జ్ఞానులుకూడా, వారి ప్రయాణములో ఎన్నో నక్షత్రాలను చూసి ఉంటారు. కాని, వారి గమ్యాన్ని నడిపించిన నక్షత్రాన్ని ఎన్నుకొని, అనుసరించి, క్రీస్తుని దర్శించుకోగలిగారు. రక్షణను పొందియున్నారు.
మన జ్ఞానస్నానములో, ఆ నక్షత్రాన్ని కనుగొన్నామా? క్రీస్తు చూపించే వెలుగు బాటలో పయనిస్తామని, ఆయన కొరకు మాత్రమే జీవిస్తామని మాట ఇచ్చియున్నాము. ఆ వాగ్దానాన్ని నూత్నీకరించుకొని, ఆయన బాటలో, వెలుగులో నడవటానికి ప్రయాస పడదాం.

జ్ఞానుల ప్రయాణములో, ఎన్నో కష్టాలు, ఆటంకాలు, అవమానాలు ఎదురయ్యాయి. అన్నింటిని జయిస్తూ బెతేలేహేమునకు చేరుకొన్నారు. దివ్య బాలున్ని కనుగొని సంతోషించారు. దీనస్తితిలోనున్న బాలున్ని చూసి వారు అనుమానించలేదు, నిరాశ చెందలేదు. అతనే లోకరక్షకుడని గుర్తించి, అంగీకరించి, ఆరాధించారు. జ్ఞానుల వలె ఒకరికొకరము, ధైర్యము చెప్పుకుంటూ, కలసి మెలసి, ఒకే క్రీస్తుసంఘముగా ముందుకు సాగుదాం. క్రీస్తుకు సాక్షులముగా జీవించుదాం. సమస్యలు, అనుమానాలు, నిరాశ నిస్పృహలు అనే మేఘాలు నక్షత్రాన్ని కనపడకుండా చేసినప్పుడు, అధైర్యపడక, విశ్వాసముతో ముందుకు సాగుదాం.

జ్ఞానులు తెచ్చిన కానుకలు, బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను సంతోషముతో దివ్య బాలునికి అర్పించారు. క్రీస్తుకు మనం ఏ కానుకను ఇవ్వగలం? బెత్లేలేహేము అనే మన విచారణలో, శ్రీసభలో, కుటుంబములో, మన సమాజములో, మనం పనిచేసే స్థలములో, మనకి రోజు ఎదురుపడే వ్యక్తులలో దివ్యబాలున్ని కనుగొని, మన స్నేహాన్ని, ప్రేమను, సేవను, మంచి క్రియలను, ప్రభువుకు కానుకగా ఇద్దాం. ఎక్కడైతే దేవుని వాక్యాన్ని వింటామో, ప్రభువు శరీర రక్తాలను దివ్యబలిలో స్వీకరిస్తామో, అదే మన బెత్లెహేము. ఎందుకన, ప్రభువు గూర్చి తెలుసుకొంటున్నాం. ప్రభువు వెలుగును, దివ్య కాంతిని మనం దర్శించుకోగలుగుతున్నాం.

జ్ఞానులు, క్రీస్తును కనుగొని, ఆరాధించి, కానుకలను సమర్పించి, వేరొక మార్గమున వెనుతిరిగి పోయారు. మనం నిజముగా క్రీస్తును దర్శించగలిగితే, మనమూ ఓ నూతన మార్గములో పయానిస్తాము. పాత మార్గాలను, పాత జీవితాన్ని విడిచి పెట్టగలుగుతాము. మనలో నిజమైన మార్పు కలుగుతుంది. ఈ మార్పునే ప్రభువు మనలనుండి కోరుతున్నాడు. ఆయన చూపించిన మార్గములో, విస్వాసములో జీవించమని పిలుస్తున్నాడు. కనుక, జ్ఞానులవలె, ప్రభువును, ఆయన సువిశేషాన్ని కనుగొందాము. సంతోష హృదయముతో ఆయనతో ఐక్యమై, విశ్వాసముతో జీవించడానికి ప్రయాసపడుదాం. పరలోక రాజ్యములో క్రీస్తుదరికి చేరి ఆయన నిత్యవెలుగులో శాశ్వతజీవితాన్ని పొందుటకు ప్రయాసపడుదాము.

ప్రభువు మనకోసం జన్మించెను, క్రిస్మస్ జాగరణ

ప్రభువు మనకోసం జన్మించెను, క్రిస్మస్ జాగరణ

క్రిస్మస్ జాగరణ
ప్రభువు మనకోసం జన్మించెను
యెషయ 62:1-5, అ.కా. 13:16-17, 22-25, మత్త. 1:1-25

ఈరోజు, ఒకజ్యోతి మనపై ప్రకాశించెను, ప్రభువు మనకోసం జన్మించెను. ఆయన, దేవునిమహిమయొక్క ప్రకాశవంతమైన జ్యోతి. తన శక్తివంతమైన ఆజ్ఞతో ఈ లోకం పోషింపబడుతున్నది.

క్రీస్తుజయంతి యొక్క అర్ధము ఏమిటి? ప్రాముక్యత ఏమిటి? మన సృష్టికర్త మనకి దూరములో లేడు, అతడు మనకు తెలువనంటివాడుకాదు అన్నసత్యాన్ని ఎరిగి ఆనందముతో సంబరాన్ని చేసుకుంటున్నాము. దేవుడు మనకి అతిసమీపములోనే, మనచెంతనే ఉన్నాడు. ఎంతదగ్గర అంటే, ఆయన మనలో ఒకనిగా జన్మించాడు. ఇప్పుడు, స్వతంత్రముతో, నమ్మకముతో, దేవున్ని సమీపించవచ్చు. మనం ఆయనతో మాట్లాడవచ్చు. మన సమస్యలను ఆయనతో పంచుకోవచ్చు. ఆయనను స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. మనకు సాధ్యమైనతీరులో ఆయనతో సంభాషించవచ్చు. దేవుడు ప్రేమించే తండ్రిగా, దయగల రక్షకునిగా, కరుణగల ఆప్తునిగా బయలుపరచబడ్డాడు. దేవుడు మనలను తెరచిన కరములతో ఆహ్వానిస్తున్నాడు. ఈరోజే, మనం ఆయన దరికి వెళ్దాం.

ప్రభువా, మా హృదయాలను ప్రేమతో మీ కొరకు విశాలము చేయండి. అమ్మ మరియవలె, ''అవును'' అని చెప్పుటకు మమ్ములను బలవంతులనుగా చేయండి. ముఖ్యముగా, జీవితాలలో ప్రేమసుగుణాన్ని మరచిపోయిన వారిని ఆశీర్వదించండి. వారిని తాకండి. తద్వారా, ఈ క్రిస్మస్ రోజున వారుకూడా మిమ్ములను ఆహ్వానించెదరుగాక. మీకు మా అందరిపైనున్న ప్రేమను నిజముచేయు లాగున మమ్ములను చేయండి.

క్రిస్మస్ సందేశము
''మీరు భయపడ వలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను'' (లూకా 2:10-11). ఆహా! ఎంతటి అనుగ్రహం! ఎంతటి భాగ్యం! మనం పొందిన వరాలలోకెల్ల గొప్పవరం, అనుగ్రహం: క్రిస్మస్ - దేవుడు లోకరక్షకుడిగా జన్మించడం. వాక్కు మానవుడై మనమధ్య నివసించడం. తన ప్రజలకు వాగ్ధానము చేసిన విధముగా, చీకటిలోనున్న ఈ లోకానికి వెలుగును ప్రసాదించడం. నిజముగా ఇది గొప్పశుభవార్తే! అందుకే పరలోకదూతల సమూహము సైతము ప్రత్యక్షమై ఇట్లు స్తుతించెను:

''మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ,
భూలోకమున ఆయన అనుగ్రహమునకు
పాత్రులగు వారికి సమాధానము కలుగుగాక!'' (లూకా 2:14).

''మనకొక శిశువు జన్మించెను. మనమొక కుమారుని బడసితిమి '' (యెషయ 9:6). క్రీస్తు పూర్వం 8వ శతాబ్దములో యెషయా ప్రవక్త ఇస్రాయేలు ప్రజలకు ఇచ్చిన గొప్ప ఊరట కలిగించే ప్రవచనం. ఎందుకన, బలమైన అస్సీరియా దేశం ఇస్రాయేలీయుల మీద దండెత్తుతున్న రోజులు. అస్సీరియా రాజు మరణముతో, 'చీకటిలో నున్న ప్రజలు వెలుగును చూస్తారని, దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజలమీద జ్యోతి ప్రకాశించునని, మెడమీద కాడి (బానిసత్వం), విరగ గొట్టబడునని, భుజములమీద దండమును (అణచివేయుట) ముక్కలు చేయబడునని, నూతన రాజ్య భారమును వహించుటకు శిశువు జన్మించునని' యెషయా ప్రవచించాడు. యేసు జననంపట్ల ఈ ప్రవచనాలు మనకీ ఊరట కల్గించే ప్రవచానాలే! ఎందుకనగా, మనముకూడా ఈనాడు అనేక విధాలుగా, చీకటిలో, బానిసత్వములో జీవిస్తున్నాం.

క్రీస్తు జన్మము ఇమ్మానుయేలు: దేవుడు మనతో ఉన్నాడు అను ఆనందమును కొనియాడటం. ఆయన మనతో లోకాంతము వరకు ఉంటాడు, మనలను అమితముగా, అనంతముగా ప్రేమిస్తాడు అను దానికి ఆయన జన్మ నిదర్శనం. క్రీస్తు జననం ఒక నూతన సృష్టి. నూతన దివికి, నీతికి నిలయమైన భువికి ఆరంభం (యెషయ 65:17; 2 పేతు. 3:13). పుట్టిన ప్రతీ బిడ్డ ఓ కొత్త ఆరంభం, ఎంతో భవిష్యత్తు.

జన్మించిన రక్షకునిలో జీవముండెను. ఆ జీవము మనకు వెలుగాయెను (యోహాను. 1:4). తన కుమారుని జన్మముతో దేవుడు తన శక్తిని, అనంతమైన ప్రేమను మనం తెలుసుకొనేలా చేస్తున్నాడు. తద్వారా, మనము జీవితమును, దానిని సమృద్ధిగా పొందులాగున చేసియున్నాడు. కాని, మనము గుర్తుంచుకోవలసిన విషయం: ''ఆయన తన వారి యొద్దకు వచ్చెను. కాని, తన వారే ఆయనను అంగీకరించలేదు'' (యోహాను. 1:11). మనమందరము ఆయనకు చెందిన వారమని మన విశ్వాసం. ఈరోజు ఆయన మన మధ్యలో జన్మించాడు. మరి, ఆయనను ఎరిగియున్నామా? వాక్కు మానవుడై మనమధ్య నివసించెను. అదే క్రిస్మస్. దేవుని మహిమను మనమందరము పొందాలి. తండ్రినుండి వచ్చే ఏకైక కుమారుని మహిమను మనం చూడాలి, పొందాలి. అప్పుడే, ఈ క్రిస్మస్ వేడుకకు అర్ధం ఉంటుంది. దేవుని బిడ్డగా, ఏకైక కుమారునిగా జన్మించిన ప్రభువును అంగీకరించి విశ్వసిస్తే మనమూ దేవుని బిడ్డలగు భాగ్యమును పొందుదము (యోహాను. 1:12).

క్రీస్తు జన్మించే నాటికి, ఈ లోకం చీకటిలో ఉంది. పాపముతో నిండి యున్నది. మనం అవిశ్వాసములో ఉన్నాము. పాలస్తీనా దేశం సాంఘిక అసమానలతో నిండియున్నది. రోమను సామ్రాజ్యం తన మిలటరీ బలగాలతో మధ్యధరా ప్రపంచాన్నంతటిని తన గుప్పిట్లో ఉంచుకుంది. మతోన్మాదులు విప్లవాలను, రక్తపాతాన్ని, ఉగ్రవాదాన్ని, సృష్టిస్తున్నారు. ధనికులు పేదవారిపై పెత్తనం, మతాధికారులు తమ అధికారాన్ని, ప్రభావాన్ని చాటుకొనుటకు ప్రయత్నంచేసేవారు. యెరూషలేము శతాబ్దాలుగా రక్తపాతాలకు, ఘర్షణలకు నిలయముగా చరిత్రలో చిరస్థాయిగా నిలచినటు వంటిది. ఇలాంటి విషమ పరిస్థితులు ఉన్నప్పటికిని, దివ్య బాలుడు ఎదురొడ్డి అద్భుత రీతిన జీవించ గలిగాడు. అతడు పెరిగి పెద్దవాడై శాంతికి మూలాధారమైయ్యాడు. ఇదే దేవుని అపారమైన శక్తికి, కరుణకు నిదర్శనం. అందుకే దివ్యబాలుని జన్మను కృతజ్ఞతతో కొనియాడాలి. ఆయన జన్మతో, ఒక క్రొత్త జీవితం ఆరంభ మైనది, లేతమొక్క అంకురించి యున్నది. ఓ నూతన సూరీడు దేదీప్యముగా ప్రకాశించి యున్నది. పెరిగి పెద్దవాడైన తర్వాత, దైవరాజ్యముగూర్చి, న్యాయముగూర్చి భోదిస్తాడు.

16 వ బెనడిక్ట్ పాపుగారు తన క్రిస్మస్ సందేశములో ఇలా చెప్పియున్నారు. గత కొన్నిసంవత్సరాలుగా మనం సాంకేతిక, సామాన్య పరిజ్ఞానములో అపారమైన పురోగతిని సాధించాం. ఈరోజు మనం అన్ని విషయాలలో అపారమైన జ్ఞానవనరులను కలిగి యున్నాము. అయితే, ఇలాంటి పరిస్థితులలో, మానవ మేధస్సుకు, సాంకేతిక పరిజ్ఞానానికి బానిసలయ్యే అవకాశం లేకపోలేదు! అలా బానిసలుగా మారినప్పుడు, మనలో ఆధ్యాత్మిక లేమి, హృదయ శూన్యత సంతరించు కుంటాయి. అందుకే, మనం క్రీస్తు జన్మమునకు మన హృదయాలను, మనస్సులను తెరవాలి. రక్షణ ఘట్టమైన క్రీస్తు జననం ప్రతీ మానవునికి ఒక క్రొత్త నమ్మకాన్ని ఇస్తుంది.

ఈనాడు ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినదని భావిస్తున్నాం. కాని, క్రీస్తు వెలుగు లేనిచో మన అభివృద్ధికి ఎలాంటి సార్ధకత ఉండదు (యోహాను. 1:9). వాక్కు మానవుడై నందునే మానవ జీవితానికి సంపూర్ణ అర్ధమున్నదని శ్రీసభ పదేపదే భోదిస్తుంది.

ఈ రోజుల్లో అన్ని విభాగాల్లోనూ అన్యాయం, అవినీతి, స్వార్ధం, భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు, నైతిక విలువలు లేకపోవడం, ఆర్ధిక అసమానతలు మొదలగు దుష్టశక్తులతో మన సమాజం నిండిపోయినది. క్రీస్తు ఆనాడు బెత్లేహేములో పుట్టినట్లుగా, ఈనాడు మన సమాజములోనూ జన్మించాల్సిన అవసరం ఉన్నది. మనం మారాలి. అప్పుడే, మన సమాజం మారుతుంది. దేవుడు కోరుకొనేది, పరలోక రాజ్యం భూలోకమున నెలకొనాలి. దానికి మనందరి సహాయ సహకారం అవసరం.

క్రీస్తు జయంతిని బాహ్యముగా కొనియాడటముతో సరిపోదు. దివ్యబాలుడు ఈ లోకానికి తెచ్చిన పశ్చాత్తాపము, మారుమనస్సు అను సందేశాన్ని మన జీవితానికి అన్వయించు కున్నప్పుడే, మనం కొనియాడే ఈ పండుగకు అర్ధం ఉంటుంది.

పునీత రెండవ జాన్ పౌల్ పాపుగారు 19 డిశంబర్ 1999వ సంవత్సరములో, త్రికాల జపముగూర్చి సందేశాన్ని ఇస్తూ ఇలా అన్నారు. క్రీస్తు జయంతి కేవలం 2000 ల సం.ల క్రితం క్రీస్తు జన్మించిన సంఘటనని గుర్తుచేసుకోవడం మాత్రమే కాదు. ఇది ఒక సజీవమైన వాస్తవము. కనుక, విశ్వాసుల హృదయాలలో ప్రతీ సం.ము ఈ సజీవ వాస్తవం పునరావృతం కావాలి. ఆనాటి చారిత్రాత్మిక సంఘటన ఈ రోజు ఆధ్యాత్మిక సజీవ వాస్తవముగా మన సాంగ్యాలలో జీవించాలి.

క్రిస్మస్ - దేవుని శక్తి, దేవుని ప్రేమ, దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని శాంతి, దేవుని రక్షణ. ఆమెన్.

ప్రభువు మనకోసం జన్మించెను, Christmas

ప్రభువు మనకోసం జన్మించెను, Christmas

ఈరోజు, ఒకజ్యోతి మనపై ప్రకాశించెను, ప్రభువు మనకోసం జన్మించెను. ఆయన, దేవునిమహిమయొక్క ప్రకాశవంతమైన జ్యోతి. తన శక్తివంతమైన ఆజ్ఞతో ఈ లోకం పోషింపబడుతున్నది.

క్రీస్తుజయంతియొక్కఅర్ధము ఏమిటి? ప్రాముక్యత ఏమిటి? మనసృష్టికర్త మనకి దూరములో లేడు, అతడు మనకు తెలువనంటివాడుకాదు అన్ననిజాన్ని ఎరిగి ఆనందముతో సంబరాన్ని చేసుకుంటున్నాము. దేవుడు మనకి అతిసమీపములోనే, మనచెంతనే ఉన్నాడు. ఎంతదగ్గర అంటే, ఆయన మనలో ఒకనిగా జన్మించాడు. ఇప్పుడు, స్వతంత్రముతో, నమ్మ్మకముతో, దేవున్ని సమీపించవచ్చు. మనం ఆయనతో మాట్లాడవచ్చు. మన సమస్యలను ఆయనతో పంచుకోవచ్చు. ఆయనను స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. మనకు సాధ్యమైనతీరులో ఆయనతో సంభాషించవచ్చు. దేవుడు ప్రేమించేతండ్రిగా, దయగలరక్షకునిగా, కరుణగలఆప్తునిగా బయలుపరచబడ్డాడు. దేవుడు మనలను తెరచినకరములతో ఆహ్వానిస్తున్నాడు. ఈరోజే, మనం ఆయన దరికి వెళ్దాం.

ప్రభువా, మా హృదయాలను ప్రేమతో మీ కొరకు విశాలము చేయండి.  అమ్మ మరియవలె, ''అవును'' అని చెప్పుటకు మమ్ములను బలవంతులనుగా చేయండి.  ముఖ్యముగా, జీవితాలలో ప్రేమసుగుణాన్ని మరచిపోయినవారిని ఆశీర్వదించండి.  వారిని తాకండి. తద్వారా, ఈ క్రిస్మస్ రోజున వారుకూడా మిమ్ములను ఆహ్వానించెదరుగాక.  మీకు మాఅందరిపైఉన్న ప్రేమను నిజముచేయులాగున మమ్ములను చేయండి.

MERRY CHRISTMAS TO ALL

క్రిస్మస్ సందేశము

క్రిస్మస్ సందేశము

''మీరు భయపడ వలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను'' (లూకా 2:10-11). ఆహా! ఎంతటి అనుగ్రహం! ఎంతటి భాగ్యం! మనం పొందిన వరాలలోకెల్ల గొప్ప వరం, అనుగ్రహం: క్రిస్మస్ - దేవుడు లోక రక్షకుడిగా జన్మించడం. వాక్కు మానవుడై మన మధ్య నివసించడం. తన ప్రజలకు వాగ్ధానము చేసిన విధముగా, చీకటిలోనున్న ఈ లోకానికి వెలుగును ప్రసాదించడం. నిజముగా ఇది గొప్ప శుభవార్తే! అందుకే పరలోకదూతల సమూహము సైతము ప్రత్యక్షమై ఇట్లు స్తుతించెను:

''మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ,
భూలోకమున ఆయన అనుగ్రహమునకు
పాత్రులగు వారికి సమాధానము కలుగుగాక!'' (లూకా 2:14).


''మనకొక శిశువు జన్మించెను. మనమొక కుమారుని బడసితిమి  '' (యెషయా 9:6). క్రీస్తు పూర్వం 8 వ శతాబ్దములో యెషయా ప్రవక్త ఇస్రాయేలు ప్రజలకు ఇచ్చిన గొప్ప ఊరట కలిగించే ప్రవచనం. ఎందుకన, బలమైన అస్సీరియ దేశం ఇస్రాయేలీయుల మీద దండెత్తుతున్న రోజులు. అస్సీరియా రాజు మరణముతో, 'చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూస్తారని, దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించునని, మెడమీద కాడి (బానిసత్వం), విరగ గొట్టబడునని, భుజముల మీద దండమును (అణచివేయుట) ముక్కలు చేయబడునని, నూతన రాజ్య భారమును వహించుటకు శిశువు జన్మించునని' యెషయా ప్రవచించాడు. యేసు జననం పట్ల ఈ ప్రవచనాలు మనకీ ఊరట కల్గించే ప్రవచానాలే! ఎందుకనగా, మనంకూడా ఈనాడు అనేక విధాలుగా, చీకటిలో, బానిసత్వములో జీవిస్తున్నాం.

క్రీస్తు జన్మము ఇమ్మానుయేలు: దేవుడు మనతో ఉన్నాడు అను ఆనందమును కొనియాడటం. ఆయన మనతో లోకాంతము వరకు ఉంటాడు, మనలను అమితముగా, అనంతముగా ప్రేమిస్తాడు అను దానికి ఆయన జన్మ నిదర్శనం. క్రీస్తు జననం ఒక నూతన సృష్టి. నూతన దివికి, నీతికి నిలయమైన భువికి ఆరంభం (యెషయా 65:17; 2 పే 3:13). పుట్టిన ప్రతీ బిడ్డ ఓ కొత్త ఆరంభం, ఎంతో భవిష్యత్తు.

జన్మించిన రక్షకునిలో జీవముండెను. ఆ జీవము మనకు వెలుగాయెను (యో 1:4). తన కుమారుని జన్మముతో దేవుడు తన శక్తిని, అనంతమైన ప్రేమను మనం తెలుసుకొనేలా చేస్తున్నాడు. తద్వారా, మనము జీవితమును, దానిని సమృద్ధిగా పొందులాగున చేసియున్నాడు. కాని, మనము గుర్తుంచుకోవలసిన విషయం: ''ఆయన తన వారి యొద్దకు వచ్చెను. కాని, తన వారే ఆయనను అంగీకరించలేదు'' (యో 1:11). మనమందరము ఆయనకు చెందినవారమని మన విశ్వాసం. ఈరోజు ఆయన మన మధ్యలో జన్మించాడు. మరి, ఆయనను ఎరిగియున్నామా? వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. అదే క్రిస్మస్. దేవుని మహిమను మనమందరము పొందాలి. తండ్రి యొద్ద నుండి వచ్చే ఏకైక కుమారుని మహిమను మనం చూడాలి, పొందాలి. అప్పుడే, ఈ క్రిస్మస్ కి అర్ధం ఉంటుంది. దేవుని బిడ్డగా, ఏకైక కుమారునిగా జన్మించిన ప్రభువును అంగీకరించి విశ్వసిస్తే మనమూ దేవుని బిడ్డలగు భాగ్యమును పొందుదము (యో 1:12).

క్రీస్తు జన్మించే నాటికి, ఈ లోకం చీకటిలో ఉంది. పాపముతో నిండి యున్నది. మనం అవిశ్వాసములో ఉన్నాము. పాలస్తీనా దేశం సాంఘిక అసమానలతో నిండి ఉన్నది. రోమను సామ్రాజ్యం తన మిలటరీ బలగాలతో మధ్యధరా ప్రపంచాన్నంతటిని తన గుప్పిట్లో ఉంచుకుంది. మతోన్మాదులు విప్లవాలను, రక్త పాతాన్ని, ఉగ్రవాదాన్ని, సృష్టిస్తున్నారు. ధనికులు పేదవారిపై పెత్తనం, మతాధికారులు తమ అధికారాన్ని, ప్రభావాన్ని చాటుకొనుటకు ప్రయత్నంచేసేవారు. యేరుషలేము శతాబ్దాలుగా రక్తపాతాలకు, ఘర్షణలకు నిలయముగా చరిత్రలో చిరస్థాయిగా నిలచినటువంటిది. ఇలాంటి విషమ పరిస్థితులు ఉన్నప్పటికిని, దివ్య బాలుడు ఎదురొడ్డి అద్భుత రీతిన జీవించ గలిగాడు. అతడు పెరిగి పెద్దవాడై శాంతికి మూలాధారమైయ్యాడు. ఇదే దేవుని అపారమైన శక్తికి, కరుణకు నిదర్శనం. అందుకే దివ్య బాలుని జన్మను కృతజ్ఞతతో కొనియాడాలి. ఆయన జన్మతో, ఒక క్రొత్త జీవితం ఆరంభ మైనది, లేత మొక్క అంకురించియున్నది. ఓ నూతన సూరీడు దేదీప్యముగా ప్రకాశించి యున్నది. పెరిగి పెద్దవాడైన తర్వాత, దైవరాజ్యము గూర్చి, న్యాయముగూర్చి భోదిస్తాడు.

16 వ బెనడిక్ట్ పాపుగారు తన క్రిస్మస్ సందేశములో ఇలా చెప్పియున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మనం సాంకేతిక, సామాన్య పరిజ్ఞానములో అపారమైన పురోగతిని సాధించాం. ఈరోజు మనం అన్ని విషయాలలో అపారమైన జ్ఞాన వనరులను కల్గియున్నాము. అయితే, ఇలాంటి పరిస్థితులలో, మానవ మేధస్సుకు, సాంకేతిక పరి జ్ఞానానికి బానిసలయ్యే అవకాశం లేకపోలేదు! అలా బానిసలుగా మారినప్పుడు, మనలో ఆధ్యాత్మిక లేమి, హృదయ శూన్యత సంతరించుకొంటాయి. అందుకే, మనం క్రీస్తు జన్మమునకు మన హృదయాలను, మనస్సులను తెరవాలి. రక్షణ ఘట్టమైన క్రీస్తు జననం ప్రతీ మానవునికి ఒక క్రొత్త నమ్మకాన్ని ఇస్తుంది.

ఈనాడు ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినదని భావిస్తున్నాం. కాని, క్రీస్తు వెలుగులేనిచో మన అభివృద్ధికి ఎలాంటి సార్ధకత ఉండదు (యో 1:9). వాక్కు మానవుడై నందునే మానవ జీవితానికి సంపూర్ణ అర్ధమున్నదని శ్రీ సభ పదే పదే భోదిస్తుంది.

ఈ రోజుల్లో అన్ని విభాగాల్లోనూ అన్యాయం, అవినీతి, స్వార్ధం, భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు, నైతిక విలువలు లేకపోవడం, ఆర్ధిక అసమానతలు మొ,,గు దుష్ట శక్తులతో మన సమాజం నిండిపోయినది. క్రీస్తు ఆనాడు బెత్లేహేములో పుట్టినట్లుగా, ఈనాడు మన సమాజములోనూ జన్మించాల్సిన అవసరం ఉంది. మనం మారాలి. అప్పుడే, మన సమాజం మారుతుంది. దేవుడు కోరుకొనేది ఒక్కటే: పరలోక రాజ్యం భూలోకమున నెలకొనాలి. దానికి మనందరి సహాయ సహకారం అవసరం.

క్రీస్తు జయంతిని బాహ్యముగా కొనియాడటముతో సరిపోదు. దివ్యబాలుడు ఈ లోకానికి తెచ్చిన పశ్చాత్తాపము, మారుమనస్సు అను సందేశాన్ని మన జీవితానికి అన్వయించుకొన్నప్పుడే, మనం కొనియాడే ఈ పండుగకు అర్ధం ఉంటుంది.

రెండవ జాన్ పౌల్ పాపుగారు 19 డిశంబర్ 1999 వ సం,,రములో, త్రికాలజపముగూర్చి సందేశాన్ని ఇస్తూ ఇలా అన్నారు. క్రీస్తు జయంతి కేవలం 2000 ల సం,,ల క్రితం క్రీస్తు జన్మించిన సంఘటనని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు. ఇది ఒక సజీవమైన వాస్తవము. కనుక, విశ్వాసుల హృదయాలలో ప్రతీ సం,,ము ఈ సజీవ వాస్తవం పునరావృతం కావాలి. ఆనాటి చారిత్రాత్మిక సంఘటన ఈ రోజు ఆధ్యాత్మిక సజీవ వాస్తవముగా మన సాంగ్యాలలో జీవించాలి.

క్రిస్మస్ - దేవుని శక్తి, దేవుని ప్రేమ, దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని శాంతి మరియు దేవుని రక్షణ. ఆమెన్.