కన్యక, వేదసాక్షి (క్రీ.శ. 250)
అయితే, క్వింటియానస్ అనే వ్యక్తి అగతమ్మను బలవంతముగా వివాహం చేసుకోవాలని తలంచాడు. అగతమ్మ దానికి తిరస్కరించినది. తన హోదాకే అవమానమనుకున్నాడు, అప్రతిష్టగా భావించాడు. ఆ కాలములో డేసియస్ చక్రవర్తి పరిపాలిస్తున్న కాలం. క్రైస్తవులను క్రూరముగా హింసించే వాడు. ఈ చక్రవర్తి సలహాదారుల్లో ఒకడే క్వింటియానస్. అగతమ్మ క్రైస్తవురాలని తెలుసుకొని, డేసియస్ చక్రవర్తి హింసల సమయములో ఆమెను అరెస్టు చేయించి, న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టారు. ఆ న్యాయమూర్తి క్వింటియానసే! చిత్రహింసలకు గురిచేస్తే, తాను లొంగుతుందని భావించాడు క్వింటియానస్. కాని, అగతమ్మ తన దేవునిపై సంపూర్ణ విశ్వాసాన్ని, నమ్మకాన్ని పునరుద్ఘాటించినది. "ఓ యేసు క్రీస్తువా! అందరికీ ప్రభువా! నా హృదయాన్ని చవిచూడుము. నా కోరికలన్నీ ఎరిగియున్నావు. నన్ను నన్నుగా నీ స్వాధీనం చేసుకో. నేను నీ గొర్రె పిల్లను. దుష్ట శక్తులను జయించుటకు నన్ను యోగ్యురాలినిగా చేయుము" అని ప్రార్ధించినది.
ఆమె మనస్సును మార్చుకొమ్మని బలవంతం చేయడానికి, ఆమెను వేశ్యాగృహములో క్వింటియానస్ బంధించాడు. ఆమెపై ఎన్నో ఒత్తుడులు, దాడులు జరిగినను, దేవునికి చేసిన ప్రతిజ్ఞకు విశ్వాసముగా ఉండటానికే నిర్ణయించినది. ఆమెను మరోసారి న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టారు. యేసు క్రీస్తు సేవకురాలిగా ఉండటమే నాకు నిజమైన స్వేచ్చ అని తెలిపింది. కోపోద్రిక్తుడైన క్వింటియానస్ ఈసారి ఆమెను వేశ్యాగృహానికి కాక, జైలులో నిర్భంధించాడు. ఇది ఆమెను మరింత భయానకానికి గురిచేయడానికి చేయబడిన చర్య, కాని ఆమెకు అది ఎంతో ఊరటగా మారింది.
ఆ సమయములో కూడా క్రీస్తును ప్రభువుగా, రక్షకునిగా, తన జీవితముగా, గొప్ప ఆశగా ప్రకటించినది. ఆమెను హింసల పాలు చేయమని క్వింటియానస్ ఆదేశాలు జారీ చేసాడు. ఇనుప గొలుసులతో బంధించి, ఇనుప హుక్కులతో తన శరీరాన్ని గాయపరచారు. కాగాడాలతో కాల్చారు. ఆమె రొమ్ము భాగాలను కత్తిరించమని ఆదేశించాడు. ఆమెకు ఆహరంగాని, వైద్యసహాయంగాని అందించకుండా తిరిగి జైలుకు పంపాడు. కాని అద్భుతరీతిన, ప్రభువు ఆమెకు తోడుగా ఉన్నారు. పునీత పేతురుగారి దర్శనాన్ని పొందారు. వారు ఆమెను ఓదార్చారు. వారి ప్రార్ధనలద్వారా, గాయాలనుండి స్వస్థత పొందినది.
నాలుగు రోజుల తరువాత, క్వింటియానస్ ఆమెను వివస్త్రను చేసి, కాలుతున్న నిప్పుల్లో వేయించాడు. ఆ సమయములో పెద్ద భూకంపం సంభవించగా, అక్కడున్న వారు పరుగులు తీసారు. జైలునకు తిరిగి వచ్చినప్పుడు, "ప్రభువా! నా సృష్టికర్తా! మీరు నన్ను చిన్ననాటినుండి రక్షించి కాపాడారు. ఈ ప్రాపంచిక వ్యామోహములనుండి నన్ను దూరముగా ఉంచి, శ్రమలనుభావించ డానికి కావలసిన ఓర్పును, సహనమును నాకు దయచేసారు. ఇప్పుడు నా ఆత్మను గైకొనండి" అని ప్రార్ధించి, తన తుది శ్వాసను విడిచారు.
ఆమె బహుశా 251వ సం.లో మరణించి యుండవచ్చు. అగత అనగా 'ఉత్తమ', 'కరుణ' అని అర్ధం.
No comments:
Post a Comment