పునీత సిమియోను, అపోస్తలుడు (ఫిబ్రవరి 18)

పునీత సిమియోను
అపోస్తలుడు, వేదసాక్షి (క్రీ.పూ. 8 - క్రీ.శ. 112)


యేసు శిష్యుడు, పీఠాధిపతి, వేదసాక్షి క్రీ.పూ. 8నుండి క్రీ.శ.112): సిమియోను లేక సిమోను గారి తల్లిపేరు క్లెయోఫా. ఈమె మేరీమాతకు వరసకు అక్క. అందువల్ల యేసు ప్రభువుకు వరసకు అన్న అవుతారు. ఈ విషయాల్ని మత్తయి, మార్కు సువార్త ద్వారా తెలుసుకున్నాము. అయితే యేసుకు మొత్తం మీద 72మంది శిష్యులు ఉన్నారు కదా! వారిలో సిమియోనుగారు కూడ ఒకరు. యేసు స్వర్గారోహణ సమయంలో ఈ 72మంది శిష్యులతో పాటు సిమియోనుగారు కూడా ఉన్నారు. అదేవిధంగా, పెంతెకోస్తునాడు శిష్యులందరిపై పవిత్రాత్మ అగ్నిశిఖల రూపంలో దిగివచ్చినప్పుడు కూడా వీరు అక్కడే ఉన్నారు. అంతకు క్రితం యేసు తన మరణాన్ని గెలిచి పునరుత్ధానుడై ఎమ్మావు గ్రామానికి మాట్లాడుకుంటు వెళ్తున్న ఇద్దరు శిష్యుల్లో సిమియోను గారు కూడ ఒకరని తెలియవస్తోంది. (లూకా. 24:34).

పునీత సిమియోను గారికి పునీత జేమ్సుగారని ఒక సోదరుడున్నారు. వీరు క్రీ.శ. 62లో యెరూషలేమునగర క్రైస్తవ మేత్రాసనానికి మొదట పీఠాధిపతిగా సేవనందిస్తున్నారు. వీరి క్రైస్తవ మతవ్యాప్తికి కన్నుకుట్టిన ఛాందస యూదులు పునీత జేమ్సుగార్ని బంధించి పాస్కా పండుగ రోజున యూదమత ద్రోహిగా నేరంమోపి చంపారు. ఈ దుస్సంఘటనకు తీవ్రంగా చలించిన సిమియోనుగారు నిర్భయంగా యూదుల అమానుష చర్యల్ని ఖండించారు. మత స్వాతంత్య్రానికి వ్యక్తి స్వేచ్ఛకు తెలివి కలవారమనుకునే యూదులు అడ్డు తగిలి అకృత్యాలకు పాల్పడటాన్ని తూర్బారబట్టారు. అటు తరువాత సిమియోను గారే యోరుషలేము రెండవ పీఠాధిపతిగా ఎన్నిక కాగా ధైర్యంతో, ఉత్సాహంతో ఆ పదవిని అలంకరించి తన సోదరుని అడుగుజాడల్లో సువార్తను విన్పిస్తూ మతవ్యాప్తికి కృషి చేశారు.

పునీత సిమియోనుగారి పాలనా కాలములో కతోలిక మత సిద్దాంతాలను వ్యతిరేకించే అనేక వర్గాలు తామరతంపరులుగా వెలిశాయి. ఈ శాఖవారు క్రీస్తును దేవునిగా విశ్వసించరు. కాని ఆయన బోధ ద్వారా తండ్రి దేవుని మరింత అర్ధవంతంగా కొలవాలనే వారు. కొందరు క్రీస్తు కేవలం ఒక ప్రవక్తయే కాని దేవుని పుత్రుడు కాడని, దేవుడు అంత దీనుడుగా పశువుల కొట్టంలో పుట్టడ మేమిటని పంటికి పన్ను కంటికి కన్ను సిద్దాంతాన్ని ఖండిరచడ మేమిటని, ఒక చెంపపైకొడితే చేతకాని వానిలా మరో చెంప చూపమనడ మేమిటని, బహుభార్యత్వాన్ని పురుషాధిక్యతను ఖండించడం పొరపాటని, క్రీస్తు ఒక తరహా ప్రవక్తయేకాని ఆయన  చెప్పిన ప్రాథమిక సత్యాలు యూద మతానికి వ్యతిరేకమని నిరసించారు. మరి కొందరు క్రీస్తు ప్రాణత్యాగాన్ని బట్టి గౌరవింప దగినవాడని, కాని మొదటి (పాత) నిబంధన ప్రవచనాలు క్రీస్తును గూర్చి ఒక దేవునిగా కాక ఒక మహాప్రవక్తగా చెప్పబడినాయని ఇలా ఇష్టమొచ్చినట్లు భాష్యాలు చెప్పుకుని ప్రవర్తిల్లేవారు. ఇట్టితరుణములో సిమియోనుగారు యేసే మెస్సియా, దైవం, రక్షకుడని సోదాహరణంగా వివరిస్తూ కతోలిక మతాన్ని బలపరచారు. శ్రీసభ ఐక్యతకు, అభివృద్ధికి పాటుబడ్డారు.

క్రీ.శ. 66లో యెరూషలేము నాశనమవుతోందని దేవుడు ముందుగానే సిమియోను గారిని హెచ్చరించారు. అంతటవారు తమ భక్తులు, అనుచరుతో యెరూషలేము పట్టణానికి 65మైళ్ల దూరంలో యోర్దాను నదికి ఆవలివైపున్న పెల్లాగ్రామానికి వలస పోయారు. నాలుగు సంవత్సరాల తర్వాత అనగా క్రీ.శ. 70లో తీతు అనే నాయకుని ఆధిపత్యంలో సైన్యం యూదుల తిరుగుబాటుల్ని అణచేందుకు యూదయాలోకి  ప్రవేశించింది. ఐదుమాసాల పాటు యుద్ధంచేసి యెరూషలేము నగరాన్ని వశపరచుకొని సర్వనాశనం చేసింది. దాదాపు యూదులు ఆరులక్షలమంది ఈ ముట్టడిలో అసువులు బాశారు. నగరం పూర్తిగా ధ్వంసమైనా దేవుని కృపవల్ల యేసుప్రభువు కడరాభోజనం చేసినది, పవిత్రాత్మ దేవుడు శిష్యులపై వేంచేసిన ముఖ్య సంఘటనలు సంభవించిన ‘‘సెనాకల్‌’’ అనే భవంతి చెక్కుచెదరకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. తర్వాత ఆ గృహ-ప్రార్ధనా మందిరంగా మార్చబడిరది.

ముట్టడి అనంతరం శిధిలమైన యెరూషలేము నగరానికి సిమియోను గారు తన భక్తగణంతో తిరిగి వచ్చారు. క్రీ.శ.134లో ‘‘హెడ్రియను’’ చక్రవర్తి మరోమారు యెరూషలేము పైకి దండెత్తి నేలమట్టం గావించాడు. అంతకు మునుపు వెస్పాసియను, దొమిషియను చక్రవర్తులు జరిపిన దాడుల్లో సిమియోనుగారు సురక్షితంగా బయలు పడగలిగారు. కాని క్రీ.శ.112లో ట్రాజను చక్రవర్తి జరిపిన దాడిలో సిమియోను గారిని వ్యతిరేకించే యూదులు వారిపై అనేక నిందలు మోపారు. సిమియోను యేసుప్రభు సోదరుడని, క్రైస్తవు నాయకుడుగా మతగురువుగా వ్యవహరిస్తున్నాడని, క్రీస్తు దేవుడని, ఇతరత్రా చేప్పేదేవుళ్లు మానవకల్పిత దేవుళ్లని, విగ్రహాలను, గ్రహాలను, సృష్టివస్తువులను కొలవడం నిష్ప్రయోజనమని బోధిస్తున్నాడని ప్రజలను క్రైస్తవంలోకి కలుపుకుంటున్నాడని ఏమేమో నేరాలు మోపారు. దీని ఫలితంగా సిమియోను గారిని బంధించి కొన్ని రోజులపాటు హింసకు గురిచేశారు. అటు తర్వాత వారిని యేసుకువలె సిలువ వేయాలని నిర్ణయించి అట్లేచేశారు. అప్పటికి పునీత సిమియోను గారి వయస్సు 120సంవత్సరాలు. వీరి వేదసాక్షి మరణంతో అపోస్తులకాలం అంతరించింది. యేసు ప్రభుని స్వయంగా దర్శించి, ముఖాముఖి ముచ్చటించిన శిష్యుల్లో అందరికంటే చివరగా అనగా క్రీ.శ.112లో మరణించిన వృద్ద అపోస్తుడు వీరే. సిమియోను లేక సిమోను అంటే దేవుడు ఆకించాడు అని భావం.

ధ్యానాంశం: ‘‘మీ హృదయాల్లో నుండి శత్రువును తరిమేసినప్పుడు కేవలం మాటల్లోనే కాదు క్రియల్లోకూడ దాన్ని త్యజించు. కేవలం పెదాల శబ్దంతోనే కాదు మీ జీవితంలోని ప్రతికార్యం ద్వారా తరిమివేయాలి’’ (పునీత అగస్టీను)

ప్రభూ! నీవు సత్పురుషులను దీవింతువు. నీ కృప వారిని  డాలువలె కాపాడును. (కీర్తన. 5:12).

No comments:

Post a Comment