పునీత తోమా (జూలై 3)

 పునీత తోమా (జూలై 3)
అపోస్తలుడు, వేదసాక్షి, భారతదేశ అపోస్తలుడు

తోమా (అరమాయిక్: teoma; గ్రీకు: దిదీము = ‘కవలలో ఒకరు’ అని అర్ధం – యోహాను. 11:16, 20:24, 21:2) గలిలయ వాసి. ‘తోమా’ పేరును మత్త. 10:3, మార్కు. 3:18, లూకా. 6:15, అ.కా. 1;13లో కూడా చూడవచ్చు. వారు యూద కుటుంబములో జన్మించారు. వారి వృత్తి బహుశా జాలరి (మత్స్యకారుడు) లేదా వడ్రంగి అయ్యుండవచ్చు. అయితే, అతని వృత్తి గురించి ఎలాంటి ఆధారాలు లేవు. యేసు తన 12మంది అపోస్తలులలో తోమాను ఒకనిగా పిలుచుకున్నారు. యూదయా సీమలోని బెతానియాలో, మరియ, మార్తమ్మల సోదరుడు, యేసు స్నేహితుడు లాజరు మరణించినపుడు, యేసును అక్కడ హింసించే అవకాశం ఉన్నందున, యూదయాకు వెళ్ళుటకు శిష్యులు భయపడగా, తోమా, “మనము కూడా వెళ్లి ఆయనతో పాటు చనిపోవుదము” అని తోడి శిష్యులతో ధైర్యముగా అన్నారు (యోహాను. 11:16). గురువుపై తన ప్రేమను తెలియజేసారు, కష్ట సమయములో యేసుతో ఉండటానికి నిశ్చయించాడు. కడరా భోజన సమయములో సత్యమును తెలుసుకోవడానికి తోమా, “ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమెట్లు ఎరుగుదుము?” (యోహాను. 14:5) అని యేసును ప్రశ్నించినపుడు, అందుకు యేసు, “నేనే మార్గము, సత్యము, జీవము” (14:6) అని చెప్పారు. ఉత్థాన క్రీస్తును చూచితిమి అని మిగతా శిష్యులు తోమాతో చెప్పినప్పుడు, అతను విశ్వసించలేదు. మరల అతని సమక్షములో ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చి, “అవిశ్వాసివి కాక, విశ్వాసివై ఉండుము” (యోహాను. 20:27) అని తోమాతో అన్నప్పుడు, “నా ప్రభూ! నా దేవా!” (20:28) అని తన విశ్వాసాన్ని ప్రకటించారు. యేసు దైవత్వాన్ని ప్రకటించారు. దీనిని మనం ఒక చక్కటి ప్రార్ధనగా మలచుకోవచ్చు.

పెంతకోస్తు, మొక్షారోహణము తరువాత, తోమా పార్థియనులకు (ప్రస్తుత ఖొరాసన్), మిదీయనులకు (ఇరాన్), పర్షియనులకు క్రీస్తు సువార్తను బోధించి, ఆ తరువాత భారతదేశములో తన ప్రేషిత సేవలను కొనసాగించారు. భారతదేశములో క్రీస్తు సువార్తను తొలిసారిగా ప్రకటించిన అపోస్తలుడు తోమా.

మొదటిగా, (బహుశా, 52లో), తోమా భారతదేశములోని (కేరళ) మలబారు తీరప్రాంతములో ప్రభువు సువార్తను ప్రకటించి క్రైస్తవ సంఘాన్ని స్థాపించారు. సముద్ర మార్గాన ‘గురువాయూరు’ సమీపమున ‘పాలయూరు’ రేవుకు చేరుకొని, అక్కడ నాలుగు (బహుశా బ్రాహ్మణ) కుటుంబాలకు జ్ఞానస్నాన మిచ్చాడు. వారికి క్రైస్తవ సిద్ధాంతాలను, ఆచారవ్యవహారాలను, సంప్రదాయాలను నేర్పించాడు. బహుశా, భారతావనిలో వీరే తొలి క్రైస్తవులు. అలాగే, కేరళలో పలు దేవాలయాలను కూడా నిర్మించారు. అనేకమంది యూదులు, స్థానికులు, రాజ కుటుంబీకులు జ్ఞానస్నానం స్వీకరించారు.

భవన నిర్మితుడిగా తోమా పేరు గాంచారు. ఒకసారి ఒక రాజు, రాజమందిర నిర్మాణానికై తోమాసువారికి కొంత డబ్బు ఇవ్వగా, అతను ఆ డబ్బును పేదలకు పంచి పెట్టాడు. కొంత కాలము తరువాత, ఆ రాజు రాజభవన నిర్మాణం ఎక్కడ అని అడుగగా, పరలోకములో నిర్మించబడినదని సమాధానం చెప్పారు.

ఆ తరువాత, తోమా మద్రాసు (చెన్నై) నగరములోనున్న మైలాపూర్ ప్రాంతం చేరుకున్నారు. అక్కడ సువార్తను బోధించి, అనేకమందిని క్రైస్తవ మతములోనికి స్వీకరించాడు. దానితో స్థానికులు కొంతమంది ఆయనపై కన్నెర్ర జేశారు. అదును చూసుకొని, ఒకరోజు మద్రాసు సమీపములోని ‘కొండ’పై ప్రార్ధన చేసుకుంటుండగా, ఆయనపై దాడిచేసి, ఈటెతో పొడిచి చంపివేశారు. ఆయన 3 జూలై 72లో వేదసాక్షి మరణాన్ని పొందారు. మైలాపూరులో కొండపై (St. Thomas Mount) ఆయన నిర్మించిన దేవాలయములోనే భూస్థాపితం చేసారు. అక్కడ తోమా అద్భుత సిలువను ఆరాధిస్తారు. వీరి జ్ఞాపకార్ధం ఇప్పుడు అక్కడ ఒక పెద్ద దేవాలయం నిర్మించబడింది. ప్రస్తుతం తోమా వెముకలలోని ఒక చిన్న అవశేషం మాత్రమే ఈ దేవాలయములో ఉన్నది. ఎందుకన, క్రీ.శ. 232లో వారి భౌతిక అవశేషాలను సిరియాలోని ఎడెస్సా నగరమునకు పంపడం జరిగింది. ఆ తరువాత, 1258లో వాటిని ఇటలీ దేశానికి పంపించారు. ‘ఒర్తోనా’లోని పునీత తోమాసు వారి పెద్ద దేవాలయములో భద్రపరచబడినవి. ఎదేమైనప్పటికిని, తోమావారి కపాలము గ్రీసు ద్వీపమైన ‘పత్మోసు’ నందు అపోస్తలుడైన పునీత యోహాను మఠంలో ఉన్నదని ఒక నమ్మకం.  

తోమా “భారతదేశ అపోస్తలుడు” అని ఆరవ పాల్ పోపుగారు (Pope Paul VI) 1972లో ప్రకటించారు.

పునీత తోమాసుగారికి స్తోత్రముగా జపము

సర్వేశ్వరా స్వామీ! మీ అపోస్తలుడైన పునీత తోమా వలన భారత దేశమునకు సత్యోపదేశమును బోధింప నవదరించితిరికదా! ఆయన వేడుదల ఫలముచేత ఇప్పుడు ఈ దేశమందుండు అవిశ్వాసుల మనస్సు తిరుగను, ఎన్ని విఘ్నములు వచ్చినను మేము విశ్వాసములో దృఢమును పొంది, ఈ లోక తంత్రశోధనలను జయించి, మోక్షానంద భాగ్యము పొందను కృపజేయ నవధరించండి. మా నాధుడైన యేసు క్రీస్తుని దివ్య ముఖమును జూచి ఈ మనవులను మాకు దయ చేయండి. ఆమెన్. 

2 comments: