పునీత జాన్ మరియ వియాన్ని (ఆగష్టు 4)
గురువు, విచారణ గురువుల పాలక పునీతులు (క్రీ.శ. 1786-1859)
ఆగష్టు 4న పునీత జాన్ మరియ వియాన్నిఅను గొప్ప
పునీతున్ని స్మరించుకుంటాము. గురువులకు పాలక పునీతుడు. అతని జీవితము గురించి,
సుగుణాల గురించి తెలుసుకుందాం.
ఫ్రాన్స్ దేశములోని నైరుతి ప్రాంతమైన లయన్స్
నగరానికి ఆరు మైళ్ళ దూరంలోనున్న డర్డిల్లీ గ్రామంలో మే 8, 1786న
పునీత జాన్ మరియ వియాన్ని జన్మించారు.
ఆరుగురిలో మరియ వియాన్ని నాలుగవ వారు. తండ్రి మాత్యూ వియాన్ని వ్యవసాయి. తల్లి పేరు
మరియ. కుటుంబము కతోలిక విశ్వాసములో జీవించినది. పేదలకు ఎంతగానో సహాయం చేసేవారు.
మరియ వియాన్ని ఆధ్యాత్మికతలో ఎదగడానికి తల్లి పాత్ర ప్రశంసనీయం.
వియాన్ని బాల్యం అంతా వ్యవసాయంలోనే గడిచింది. తన
చిన్నతనములో ఫ్రెంచ్ విప్లవం కారణముగా గురువులు, సన్యాసులు
ఎన్నో ఇబ్బందులకు లోనయ్యారు. రహస్యముగా జీవించేవారు. అలాంటి గురువులు కొనియాడే
దివ్యపూజలో జాన్ వియాన్ని పాల్గొనేవాడు. ఆ గురువుల ధైర్యసాహసాలు వియాన్నిని
ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారిని ‘హీరోలు’గా భావించేవాడు.
వియాన్ని సోదరి కాథరిన్ పెళ్ళికి, ధనం
సమకూర్చడంలో తండ్రి తలమునకలయ్యేవాడు. తన పేదరికం వలన కుమారుడు వియాన్ని చదువులను
తండ్రి పెద్దగా పట్టించుకోలేక పోయాడు. అయితే డ్యూజోవర్ పాయింటులో నున్న తన తల్లి
తరపు తాతగారింట్లో ఉండి ప్రాధమిక విద్యను అభ్యసించాడు. ఎంతైనా చదువులో వెనకబడి
ఉండేవాడు.
వియాన్ని తన 13వ ఏట
ప్రథమ దివ్యసత్ప్రసాదమును స్వీకరించాడు. క్రమంగా గురువు కావాలన్న కాంక్ష అతనిలో
తీవ్రమైంది.
1806వ సం.లో, "ఈకల్లీ"విచారణ
గురువు అయిన చార్లెస్ బాల్లీ గారి వద్ద ఉండి వియన్నీగారు గురుశిక్షణ విద్యను
పొందాడు. చిన్నప్పుడు విద్య సరిగా లేనందున, లతీను
బాషను నేర్చుకోవడములో చాలా ఇబ్బందులు పడేవాడు. కాని, గురువు
కావాలన్న, అతని దీక్ష, పట్టుదల
ముందు అన్ని అడ్డంకులు చిన్నబోయాయి. తర్ఫీదు పొందుచుండగానే, 1809లో
నెపోలియన్ సైన్యములో చేరాలని పిలుపు వచ్చింది. అయితే రెండురోజులకు ముందుగా,
అనారోగ్యంపాలై ఆసుపత్రిలో చేరడం వలన వెళ్ళలేక పోయాడు.
గురువిద్యను ముగించుకొని, 1815
ఆగష్టు 12న గ్రెనోబుల్ పట్టణ దేవాలయంలో గురుపట్టాభిషికాన్ని
పొందారు. మరుసటిరోజు తన ప్రథమ దివ్యపూజాబలిని సమర్పించారు. వీరి
గురుపట్టాభిషేకానికి అనుమతి పొందేముందు లయన్స్’కు
చెందిన వికార్ జనరల్ "శ్రీసభ”కు విద్వాంసులైన గురువులు మాత్రమే కాదు, దైవసేవకు
అంకితమైపోయే గురువులు చాలా అవసరం" అని నొక్కి వొక్కాణించారు. “ఎకుల్లి” అను
విచారణలో సహాయక గురువుగా పనిచేసి, 1818వ సం.లో లయన్స్ నగర సమీపమున గల
"ఆర్స్" అనే ఓ చిన్న గ్రామంలో విచారణ గురువులుగా నియమితులయ్యారు. ‘ఆర్స్’
గ్రామంలో అప్పటికే క్రైస్తవ విలువలు క్రింది స్థాయికి దిగజారాయి.
అంతరించిపోయిన క్రైస్తవ విశ్వాసాన్ని మరలా వెలిగించాల్సిన భాద్యత ఫాదర్ వియాన్ని
గారిపై పడింది. ప్రారంభములోనే విచారణలోని పేదలను, రోగులను
పరామర్శిస్తూ ఉండేవారు. తరచూ గంటల తరబడి దివ్యసత్ప్రసాదం ఎదుట మోకాళ్లూని తన
విచారణ ప్రజల యొక్క మనోప్రవర్తనకై ప్రార్ధించేవారు. తన ప్రసంగాలతో, మంచి
పాపసంకీర్తనాలతో, ఆదర్శ సందేశాలతో విచారణ రూపురేఖలను మార్చివేశారు.
ఫాదర్ వియాన్ని గారు ఇచ్చే ఆధ్యాత్మిక శిక్షణలో వాళ్ళంతా ఎంతో చక్కగా
పాల్గొనేవారు.
బోధించడంలో వియాన్నిగారు ఆనాటి భోధకులలోకెల్లా
మేటి బోధకుడు అనిపించుకున్నారు. గురువుల శిక్షణకు సరైన సదుపాయాలు లోపించిన
రోజుల్లో కూడా వారు శ్రమించి అంతటి అర్హతను సంపాదించారు. తన ముక్కుసూటి పట్టుదల
వల్ల త్రాగుడు, నృత్యం పనికి రాదని, అవి
పాపానికి హేతువని పట్టుబట్టగా క్రైస్తవులచే తిరస్కరించబడి కష్టాలపాలయ్యారు.
అనాథలకు, దిక్కుమొక్కు
లేని బాలికలకు దేవాలయం దాపున ఒక పాఠశాలను ప్రారంభించారు. వీటి నిర్వహణకై లయన్స్
నగర వీధుల్లో భిక్షాటన చేసి, ఆర్దిక వనరులు సమకూర్చేవారు.
వియాన్నిగారి ప్రార్ధనల వలన ఆత్మారోగ్యంతోపాటు,
శారీరక స్వస్థతలుకూడా జరగడం విశ్వాసులను అబ్బుర పరచింది. రోజుకు 14 నుండి
18 గంటలు వియాన్నిగారు ఓపికతో పాపసంకీర్తన సంస్కారమును అందించేవారు. తన నడివయస్సులో
ఉన్నపుడు సాతాను చాలాసార్లు బాధపెట్టింది. రాత్రి సమయాల్లో భయానక అరుపులు, శబ్దాలు
వినిపించేవి. ఇలా సాతానుతో 21 సం.లు ఘర్షణ పడి నిద్రలేమి వలన అనేక రోగాల వలన వృద్ఢుడిలా
కనిపించసాగారు.
తన వృద్దాప్యంలో కూడా వియాన్నిగారు పిల్లలకు
సత్యోపదేశం నేర్పించేవారు. జపమాల పట్ల భక్తిని నేర్పించారు.
చిన్న గ్రామమైన ‘ఆర్స్’, వియాన్ని గారి ఎనలేని
ఆధ్యాత్మిక కృషి వలన, ప్రపంచ నలుమూలల నుండి ఎంతో మందిని తన ఆధ్యాత్మిక సేవలను
పొందుటకై ఆకర్షించినది.
1845లో వియాన్నిగారిని సాతాను భాదపెట్టడం
మానేసింది. ‘ఆర్స్’ విచారణలో 41 సం.లు
సేవలందించాక, చివరి రోజుల్లో కేవలం 3 వారాలు
మాత్రమే జబ్బున పడ్డారు. అస్వస్థతలో తానిక 3 వారాలు
మాత్రమే జీవిస్తానని తన మరణం గురించి ముందుగానే తెలిపారు. అలాగే జరిగింది. 1859
ఆగష్టు 4వ తేదీన తన 73వ యేట పరమపదించారు.
8 జనవరి 1905 జనవరి 10వ పయస్ పోపుగారు వియాన్ని
గారికి ధన్యత పట్టం కట్టారు. తరువాత 1925 మే 31న, 11వ పయస్ పోపుగారు పునీత
పట్టాభిషిక్తుల గావించారు.
గురువంటే ప్రజల మనిషని, ప్రజల
అవసరాలకు మించిన మరే పని గురువులకు ముఖ్యం కాదని పునీత వియాన్నిగారి జీవితాదర్శం
తెలుపుతుంది. అందుకే వీరిని విచారణ గురువుల పాలక పునీతులుగా శ్రీసభ గుర్తించింది.
“పరిశుద్దాత్మచేత నడిపింప బడువారు మాత్రమే, జీవితాలను
గ్రహించగలరు.” “దేవునికి సమర్పించనిది ఏదైనను వృధాయే” (పునీత జాన్ మరియ వియాన్ని).
పునీత వియాన్ని గారి సుగుణాలు:
1. దాతృత్వం: దేవుని పట్ల ప్రగాఢమైన ప్రేమను, తోటివారిపట్ల
కరుణను కలిగిజీవించాడు. తన విచారణ వాసులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అంకిత
భావముతో సహాయాన్ని అందించాడు. నిస్వార్ధ ప్రేమతో వారికి సేవలు చేసాడు.
2. వినయం: తన వలన ఎన్ని అద్భుతాలు, స్వస్థతలు
జరిగినను, ఎల్లప్పుడూ వినయముతో జీవించాడు. తన బలహీనతలను, పరిమితులను గుర్తించి,
ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడి జీవించాడు.
3. పట్టుదల: పేదరికం, ఫ్రెంచ్ విప్లవం,
అనారోగ్యం, పైఅధికారులనుండి వ్యతిరేకత...మొదలగు సవాళ్లు, అడ్డంకులపై సానుకూలముగా
పోరాడి, ధైర్యముగా ఎదుర్కొని, తన బాధ్యతలను పట్టుదలతో, నిబద్ధతతో నెరవేర్చాడు.
4. దైవభక్తి: వియాన్ని గారికి దేవునిపట్ల నున్న
భక్తి, అతని రోజువారి జీవితములో స్పష్టముగా కనిపించేది. రోజులో చాలా సమయాన్ని
ప్రార్ధనలో గడిపేవాడు. దివ్యసత్ప్రసాదము పట్ల ఎనలేని భక్తిని కలిగి యుండేవాడు.
5. సహనం: విచారణ వాసుల సమస్యలను ఎంతో ఓపికతో,
సహనముతో శ్రద్ధగా ఆలకించేవాడు. సహనముతో వారికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేసేవాడు.
6. నిరాడంబరత: వియాన్ని నిరాడంబరముగా, సరళముగా
జీవించాడు. తన జీవనశైలి చాలా సాధారణముగా, సరళముగా, నిరాడంబరముగా ఉండేది. ఏవిధమైన
విలాసాలకు, దుర్భల జీవితానికి చోటు ఇచ్చేవాడు కాదు. విశ్వాస విషయాలపై మాత్రమే తన
దృష్టిని సారించేవాడు.
7. ఉత్సాహం: విచారణ వాసులను ఆధ్యాత్మిక పధములో
నడుపుటలోను, వారిలో మార్పు, పరివర్తన తీసుకొని రావడములోను, తన ప్రేషిత సేవలోను
ఎంతో ఉత్సాహాన్ని చూపించాడు.
No comments:
Post a Comment