పునీత తోమాసు అక్వినాసు (జనవరి 28)

 పునీత తోమాసు అక్వినాసు (జనవరి 28)
గురువు, శ్రీసభ పండితుడు, గ్రంథకర్త, మతసాక్షి (క్రీ.శ. 1225-1274)



1225లో ఇటలీ దేశములో లాంన్దోల్ఫో-తెయోదోరా దంపతులకు 'రోక్కసెక్క' అను పట్టణములో జన్మించారు. 'అక్వినాసు' వారి ఇంటి పేరు. వీరి తండ్రి రోమను సామ్రాజ్యాన్ని పాలించిన ఫ్రెడరిక్ చక్రవర్తికి దగ్గరి బంధువు.

కాస్సినో పర్వతముపై నున్న పునీత బెనెడిక్టు ఆశ్రమ పాఠశాలలో తన 5వ యేట ప్రవేశించారు. అక్కడే 9సం.లు విద్యాభ్యాసం చేసారు. క్రీ.శ. 1239లో నేపుల్స్ విశ్వవిద్యాలయములో డిగ్రీ ఉన్నత విద్యకై చేరారు. చిన్ననాటి నుండే, విద్యపై, దేవునిపై అమితాసక్తి చూపేవారు. డొమినికన్ సభలో చేరి తన 18వ యేటనే సన్యాసిగా తొలి వ్రత ప్రమాణాలను చేసారు. అతను సన్యాసిగా మారటం కుటుంబ సభ్యులకు ఏమాత్రము ఇష్టం లేకుండెను. సన్యాస జీవితమునుండి విరమింప ఎన్నో ప్రయత్నాలు చేసారు. చివరికి, రెండేళ్ళ పాటు అతనిని ఒక కోటలో బంధించారు. ఒకరోజు డోమినిక్ సన్యాసుల సహాయముతో అక్కడనుండి తప్పించు కోవడం జరిగింది. ఆ రెండేళ్ళ సమయములో తోమాసు వారి అక్కగారు అతనికి సహాయకులుగా, కాపలాగా ఉండేవారు. ఆమె ఎంత చెప్పిన తోమాసు సన్యాస జీవితమును విరమించలేదు. చివరికి, తోమాసు బోధనలు విని, ఆమె బెనడిక్టు మఠవాసినిగా మారింది.

క్రీ.శ. 1245లో పారిస్ విశ్వవిధ్యాలయములో చేరి, పునీత ఆల్బర్ట్ ది గ్రేట్ అను ప్రసిద్ధ తత్వవేత్త సారధ్యములో ఉన్నత విద్యను కొనసాగించారు. 1248లో చదువు ముగించుకొని, డోమినిక్ సభలో గురువుగా అభిషిక్తులైనారు. 1257లో వేదాంత విద్యలో డాక్టరేటు పట్టా పుచ్చుకున్నారు. పారిస్ విశ్వవిధ్యాలయములోనే కొంతకాలం ప్రొఫెసరుగా పనిచేసారు. వారి బోధనలో స్పష్టత, యదార్ధత, ప్రేరణ, క్రొత్తదనం కనిపించేవి. 1269 వరకు అనేక కతోలిక విశ్వవిధ్యాలయాలలో బోధించారు. ఆనాటి రాజులకు, చక్రవర్తులకు సలహాలను ఇచ్చేవారు. జగద్గురువులకు, కార్దినల్సుకు, బిషప్పులకు, మఠ అధిపతులకు వారివారి సమస్యలలో అత్యుత్తమ పరిష్కారాలను సూచించేవారు. లియోన్సు జనరల్ కౌన్సిల్ మహాసభలో పాల్గొనడానికి 10వ గ్రెగోరి జగద్గురువులు తోమాసు వారిని ఆహ్వానించారు.

తోమాసు వారు పరిపూర్ణ మఠవాస జీవితానికి ప్రతీక. వినమ్రుడు. అణకువ కలిగి జీవించాడు. ఆయన జీవించినది 49 సం.లే అయినను, క్రైస్తవ ఉపదేశాల గురించి దాదాపు 60 గ్రంథాలు వ్రాసారు. ఏ పని చేసిన, ముందుగా ప్రార్ధన చేసే దైవ సహాయాన్ని కోరేవారు. ఉపవాసాలు ఉండేవారు. దివ్యపూజా బలిలో పాడే ఎన్నో లతీను గీతాలు వారు రచించినవే! 7 మార్చి 1274లో పరలోక ప్రాప్తి చెందారు.18 జులై1323లో 22వ జాన్ జగద్గురువులు తోమాసు వారికి పునీత పట్టా ప్రసాదించారు. 11 ఏప్రిల్ 1567లో 5వ పయస్ జగద్గురువులు తోమాసు వారిని శ్రీసభ పండితునిగా గుర్తించారు.

2 comments: