పునీత తిమోతి, పునీత తీతు: పౌలు శిష్యులు (జనవరి 26)

పునీత తిమోతి, పునీత తీతు
పౌలు శిష్యులు (జనవరి 26)

నేడు శ్రీసభ పౌలుకు ప్రియ అనుచరులైన తిమోతి, తీతుల మహోత్సవాన్ని కొనియాడుచున్నది. ఆదిమ క్రైస్తవ సంఘములో, చాలా క్లిష్టమైన పరిస్థితులలో మేత్రాణులుగా బాధ్యతలను చేపట్టి సంఘాలను పటిష్ట పరచారు. వారి జీవితాలను సువార్తకు, క్రైస్తవ సంఘ సేవకు అంకితం చేసుకున్నారు. తిమోతి 64లో ఎఫెసుకు మొదటి మేత్రాణులుగా పనిచేసారు. 93వ సం.లో ఎఫెసు నగరములో విగ్రహారాధనను వ్యతిరేకించినందులకు, వేదసాక్షి మరణాన్ని పొందాడు. తీతు క్రీటు సంఘమునకు మేత్రాణులుగా పనిచేసారు. ప్రార్ధన, బోధనలద్వారా క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచాడు. అపోస్తోలిక ప్రేషితత్వములో గొప్ప ఉత్సాహాన్ని చూపాడు. క్రీస్తునందు సహవాసం, స్నేహం కలిగి జీవించాడు. తన ముసలి ప్రాయములో ప్రశాంతమైన మరణాన్ని పొందాడు.

తిమోతి
ఎఫెసు మరియు తెస్సలోనిక సంఘాలలో తిమోతి పనిచేసాడు. పౌలుకు ప్రీతిపాత్రుడు, పభువునందు విశ్వసనీయ సహచరుడు (1 కొరి. 4:17, 1 తిమో. 1:2). పౌలు అనుమతితో సున్నతి కావింప బడ్డాడు (అ.కా. 16:1-3). పౌలు తన లేఖలు వ్రాయడానికి సహాయ పడ్డాడు (1తెస్స. 1:1, 2 కొరి. 1:1). తిమోతి లికోనియాలోని లిస్త్రా గ్రామానికి చెందినవాడు. తల్లి యూనీకే (యునిస) మరియు అమ్మమ్మ లోయి. లిస్త్రాలో మొట్టమొదటిగా క్రైస్తవులుగా మారినదే ఈ కుటుంబమే (2 తిమో. 1:5). తిమోతి అనగా దేవున్ని గౌరవించడంఅని అర్ధం. పౌలు సువార్తా ప్రచారమునకై లిస్త్రాకు వెళ్ళినప్పుడు (క్రీ.శ. 46) తిమోతితో అనుబంధం ఏర్పడినది (అ.కా. 13:1-14:28). తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు. తల్లి భక్తిగల యూదురాలు. యూదురాలైన తిమోతి అమ్మమ్మ మొదటగా క్రైస్తవురాలిగా మారింది (2 తిమో. 1:5, అ.కా. 16:1-2). తిమోతి తన చిన్నతనము నుండి హీబ్రూ గ్రంథముల పట్ల విద్యాభ్యాసాన్ని పొందియున్నాడు (2 తిమో. 3:15).

మొదటగా, లిస్త్రాను పౌలు, బర్నబాసులు సందర్శించారు. అచ్చటి ప్రజలు వారిని దేవుళ్ళుగా భావించి ఆహ్వానించారు. కాని ఆ తరువాత పౌలును రాళ్ళతో కొట్టి, అతడు మరణించెనని భావించి, పట్టణము బయటకు ఈడ్చివేసారు (అ.కా. 14:6-20). చిన్నవాడైన తిమోతి, సంఘటనను కనులారా చూడనప్పటికిని, ఆ తరువాత తప్పక వినే ఉంటాడు. పౌలు రెండవసారి లిస్త్రాను సందర్శించినప్పుడు (క్రీ.శ. 50-52), పెద్దవాడైన తిమోతిని తన సహచరునిగా తీసుకున్నాడు (అ.కా. 15:36-18:22). యూదుల పోరు వలన, తిమోతిని తన వెంట తీసుకొని పోదలచి అతనికి సున్నతి కావించెను (అ.కా. 16:3). హస్తనిక్షేపణ వలన పౌలు సమక్షములో, పెద్దలచేత అభిషేకింప బడినాడు (1 తిమో. 4:14, 2 తిమో. 1:6).

ఆసియా, ఐరోపా ప్రేషిత పరిచర్య ప్రయాణాలలో తిమోతి పౌలును అనుసరించాడు. ఇరువురు కలసి మొట్టమొదటిసారిగా ఐరోపాకు వెళ్లియున్నారు (అ.కా. 16:9). వారిరువురు కలిసి గలతి, ఫిలిప్పీ, తెస్సలోనిక, బెరయాలలో సువార్తను బోధించారు (అ.కా. 17:14-15, 18:5). తెస్సలోనిక క్రైస్తవులను బలపరచుటకు పౌలు తిమోతిని వారి వద్దకు పంపాడు. తిమోతి తిరిగి పౌలును కొరింతులో కలుసు కున్నాడు (1 తెస్స. 3:6, అ.కా. 18:5). కేవలం ఎఫెసులోనే ఇరువురు కలిసి దాదాపు రెండు సంవత్సరములు కలిసి పని చేసారు. ఎఫెసునుండి పౌలు తిమోతిని మాసిడోనియాకు (అ.కా. 19:22, 1 కొరి. 4:17, 16:10), బహుశా యెరూషలేము విశ్వాసులకు కొరకు ధన సహాయమునకై పంపియుండవచ్చు.

క్రీ.శ. 57-58 చలికాలము తిమోతి కొరింతులో పౌలుతోనే ఉండెను. ఆ సమయముననే తిమోతి కూడా పౌలు వెంట రోము నగరమునకు కొనిపోబడెను (రోమీ. 16:21). అ.కా. 20:4-5 ప్రకారం, క్రీ.శ. 58వ సంవత్సరములోని పెంతకోస్తు మహోత్సవమునకు ముందుగా, ఆరంభములో యెరూషలేమునకు ప్రయాణములో తిమోతి పౌలుతో ఉండెను. తిమోతి ముందుగా వెళ్లి పౌలు కొరకు త్రోయలో వేచి ఉండెను.

పౌలు తనకు మొదటి లేఖ వ్రాయు సమయమునకు, తిమోతి ఎఫెసు నగరములో ఉండెను. పౌలు మాసిడోనియాకు వెళ్ళెను (1 తిమో. 1:3). పౌలు తిమోతిని ఎఫెసు నగరములో త్వరలో కలవాలని ఆశించి యున్నాడు (1 తిమో. 3:14-15, 4:13).

తీతు
తీతు పౌలు పరిచర్య వలన విశ్వాసమును పొందెను. పౌలు తీతును యెరూషలేము సమావేశమునకు (క్రీ.శ. 49) తీసుకొని వెళ్ళాడు. తీతు గ్రీసు దేశస్థుడు. సున్నతి పొందని విశ్వాసముగల క్రైస్తవుడు (గలతీ. 2:1-3). పౌలుకు తోటి మిషనరి (2 కొరి. 8:23), నమ్మదగిన ప్రతినిధి (2 కొరి. 12:18). మొదటి ప్రేషిత ప్రయాణములో, తీతు అంతియోకు నుండి యెరూషలేము వరకు పౌలు, బర్నబాను వెంబడించాడు.

కొరింతు సంఘములో సంక్షోభం నెలకొన్నప్పుడు, పౌలు తన లేఖను ఎఫెసునుండి కొరింతుకు తీతుతో పంపించాడు. కొరింతు ప్రజలు మారుమనస్సు పొందుటలో తీతు విజయవంతుడైనాడు. ఈ మంచి వార్తను తీతు మాసిడోనియాలోనున్న పౌలుకు అందచేశాడు. ఈవిధముగా కొరింతు ప్రజలు మరియు పౌలు మధ్య సఖ్యతను నెలకొల్పడములో ముఖ్యపాత్ర పోషించాడు (2 కొరి. 2:1, 7:6-16). మరల యెరూషలేములోని ప్రజలకు సహాయమును సమకూర్చుటకు పౌలు తీతును కొరింతునకు పంపియున్నాడు (2 కొరి. 8:6, 16, 22, 12:17-18). తీతు. 1:5 ప్రకారం, తీతు పౌలుతో క్రీటులో ఉన్నాడు. అచటి సంఘములో ఇంకను తీర్చి దిద్దబవలసిన వానిని క్రమపరచుటకును, ప్రతి నగరము నందును దైవ సంఘమునకు పెద్దలను నియమించుటకును, తీతును పౌలు క్రీటులోనే వదిలి వచ్చాడు.

తీతుకు లేఖను విశ్వాసము నందు నా నిజమైన కుమారుడుఅని పౌలు తీతును సంబోధిస్తూ వ్రాయుచున్నాడు. కుమారుడు, తండ్రి కార్యమును కొనసాగించునట్లుగా, పౌలు ఆరంభించిన అపోస్తోలిక ప్రేషిత కార్యమును తీతు కొనసాగించవలెనని ఈ లేఖద్వారా ఆజ్ఞాపించుచున్నాడు (తీతు. 1:1-4).

నేడు ప్రత్యేకముగా దీకనుల కొరకు, గురువుల కొరకు, మేత్రాణుల కొరకు ప్రార్ధన చేద్దాం.

No comments:

Post a Comment