లూర్దుమాత పండుగ 11 ఫిబ్రవరి

లూర్దుమాత పండుగ Feb 11

మరియతల్లికి గల అనేక పరిశుద్ధ నామములో "లూర్దుమాత" ఒకటి. ప్రతి ఏటా ఫిబ్రవరి 11వ తేదీన విశ్వవ్యాప్తంగా మన తల్లి శ్రీసభ లూర్ధుమాత మహోత్సవాన్ని అత్యంత భక్తిపూర్వకముగా కొనియాడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక చరిత్రలో మరియతల్లి అద్భుత దర్శనాలు ఎన్నో! ప్రతి దర్శనం వెనుక ఒక పరమార్ధం వుంది. ఆ పరమార్థం ప్రతి ఒక్కరూ హృదయ పరివర్తన చెంది క్రీస్తు బాటలో నడవాలి అని. ఆమె దర్శనం ఇచ్చిన ప్రతి ప్రదేశం ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నది. అశేష భక్తుల రాకతో విశేషమైన ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. మరియతల్లి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న ఎందరో స్వస్థతలు, మేలులు పొంది క్రీస్తు బాటలో నడుస్తున్నారు. మరియ తల్లి  ప్రేమకు సాక్షులుగా నిలుస్తున్నారు.

పండుగ చరిత్ర

క్రీస్తు శకం 1858వ సంవత్సరంలో మరియతల్లి ‘‘ బెర్నదెత్త సౌబిరన్‌’’ అనే 14 ఏళ్ల బాలికకు ఫిబ్రవరి 11, 1858 నుండి  జూలై 16 వరకు మరియతల్లి మొత్తంగా 18 సార్లు దర్శనమిచ్చారు. మరియతల్లి ఆ దర్శనాలలో, ‘‘హృదయ పరివర్తన కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని, పశ్చాత్తాపం పొంది అందరు క్రీస్తు బాటలో నడవాలని కోరారు.’’ దానితో పాటుగా ఇక్కడ  ఒక దేవాలయాన్ని నిర్మించాలని  ఆమె కోరారు. ఆ బాలిక అమాయకంగా మీరు ఎవరు అని అడిగినప్పుడు, ‘నేను జన్మపాపము లేక ఉద్భవించిన రాజ్ఞిని’ అని మరియతల్లి పేర్కొన్నారు. మరియ తల్లి ఆదేశించినట్లు అక్కడ ఒక దేవాలయం నిర్మించబడినది. నిత్యం అశేష భక్తులతో విశేషముగా ఆ యొక్క పుణ్యక్షేత్రం అలరారుతున్నది. ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తున్న ఎందరో ఎన్నో దీవెనలను, స్వస్థతలు పొందుతున్నారని మన తల్లి శ్రీసభ తెలియజేయుచూ ఉన్నది.

‘‘మరియతల్లి ప్రతి దర్శనం మనల్ని ప్రభువు వైపు నడిపించుట కొరకే’’. శ్రీసభ చరిత్రలో మరియతల్లి దర్శనాలు ఎన్నో నమోదయ్యాయి. ఈ దర్శనాలన్నింటిలో కూడా మరియ తల్లి యావత్‌ ప్రపంచాన్ని పశ్చాత్తాపం పొంది క్రీస్తు బాటలో నడవమని అజ్ఞాపించడం ప్రథమంగా నిలిచింది. ఆమె దర్శనమిచ్చిన ప్రతిచోట జపమాల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేసి, అందరూ తమ యొక్క పాపములకు  ప్రాయశ్చిత్తం చేసుకొని క్రీస్తు బాటలో నడవాలని ఆమె ఆజ్ఞాపించారు. పరలోక తండ్రి అనాదినుండి మనలను రక్షించాలని సంకల్పించుకున్నప్పుడే, క్రీస్తుతో పాటు మరియతల్లిని కూడా ఎన్నుకున్నారు. మన ప్రథమ తల్లి అయినటువంటి ఏవమ్మ తన అవిధేయత ద్వారా పోగొట్టుకున్నదానిని, మరియమ్మ తన విశ్వాసము, విధేయత ద్వారా సంపాదించుకున్నారు. ఏవమ్మ తన అవిధేయత ద్వారా ఈ లోకానికి పాపాన్ని పరిచయం చేస్తే, మరియమ్మ ఆ పాపాన్ని రూపుమాపి మనల్ని పవిత్రులను చేసి సన్మార్గములో నడిపే ప్రభువుకు జన్మనిచ్చి ఈ లోకానికి త్యాగం చేశారు. ఈ రోజుల్లో మనము ఆ త్యాగాన్ని గ్రహించక మరలా మరలా పాపాన్ని చేసి ప్రభువు హృదయాన్ని గాయపరుస్తున్నాము. నోవాహు దినములలో జనులు దైవ ఆజ్ఞలను ధిక్కరించి, చెడు క్రియకు దాసోహమై జీవిస్తున్నప్పుడు దేవుడు అందరిని నాశనం చేయడానికి పూనుకున్నారు. నోవాహు ఓడను తయారుచేసి ఒక నూతన సృష్టికి శ్రీకారం చుడుతున్నప్పుడు ప్రజలు ఆయనను విశ్వసించలేదు. ఫలితంగా అందరూ నశించి పోయారు. నోవాహు కుటుంబం మాత్రమే రక్షించ బడినది. మరియతల్లి ప్రజందరినీ ప్రభువు వైపు తిప్పటంకోసం ప్రతి ఒక్కరు హృదయ పరివర్తన చెంది జీవించడం కోసం దర్శనమిచ్చినది. జపమాల అనే భక్తి సాధనం ద్వారా ప్రతి ఒక్కరు ప్రభువును చేరుకోవాలని ఆమె తన యొక్క దర్శనాలలో కోరారు. ఎవ్వరు నశించి పోకూడదు. ప్రతి ఒక్కరు క్రీస్తును చేరుకోవాలి. హృదయ శుద్ధి కలిగి జీవించాలి అనేది ఆమె దర్శనాల యొక్క పరమార్థం.

‘‘నేనే మార్గము, సత్యము, జీవము. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు’’ (యోహాను సువార్త 14:6). మనము పిత దేవుడిని చేరుకోవాలంటే మొదటిగా సుతుడైన యేసు ప్రభువుని చేరుకోవాలి. ప్రభువు ద్వారా తప్ప మనము ఏ మార్గములోనూ తండ్రిని చేరుకోలేము. అదేవిధముగా మనము ప్రభువును చేరుకోవాలంటే ఖచ్చితంగా మరియ తల్లి సహాయం మనకు అవసరం. క్రీస్తు ఏ విధముగా అయితే మన కొరకు తండ్రిని మనవి చేస్తారో అదేవిధముగా మరియతల్లి కూడా మన కొరకు క్రీస్తుకు మనవి చేస్తారు.

మరియ తల్లి తన బంధువు  అయిన ఎలిజబేతమ్మను సందర్శించి సేవా, పరిచర్యలు చేసి బాప్తిస్మ యోహానుకు మేలు చేశారు (లూకా 1:41). కానాపల్లె వివాహములో పెళ్లి వారి అవసరతను గుర్తించి అక్కరను తీర్చారు (యోహాను 2:3). క్రీస్తు మరణ ఘడియల్లో ఉన్నప్పుడు ఒంటరి అయిపోతున్న శిష్యులకు తాను తల్లిగా నిలిచారు (యోహాను 19:2). భయభ్రాంతులకు గురై చెల్లాచెదురై పోతున్న శిష్యులను ఒక గూటికి చేర్చి వారి పవిత్రాత్మ పొందికకై  ప్రార్థన చేశారు (అపో.కా. 1:14). పాపపు ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఈ లోకములో వివిధ ప్రాంతాలలో మరియతల్లి దర్శనమిచ్చి పశ్చాత్తాపం నిమిత్తం ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరారు. ఈ దర్శనాన్ని కూడా ఈ లోకం మీద, మనమీద ఆమెకుగల ప్రేమకు నిదర్శనం!

మరియతల్లి పండుగను ఏ విధంగా కొనియాడుతున్నాము? ఏ విధముగా కొనియాడాలి?

శ్రీసభ పరంగా మనము ఏదైనా పునీతుల పండుగలు లేదా మరియమాత పండుగును కొనియాడాలి అంటే ముందుగా 9 రోజులను మనకు నవదిన ప్రార్థనలుగా తల్లి శ్రీసభ ఇస్తూ ఉన్నది. ఈ తొమ్మిది రోజులు ఎందుకు అనగా మనల్ని మనం పరిశుద్ధం చేసుకొని పండుగలోకి ప్రవేశించుట కొరకు. తిరుసభ మనకు మరియతల్లి పండుగలను ఇస్తూ ఉన్నది. నవదిన ప్రార్థనల్లో పాల్గొని, దృఢవిశ్వాసముతో జపమాల ప్రార్థనలను చేసి, పాపసంకీర్తనము చేసి, నిండు పూజలో పాల్గొంటే తప్పక దేవుని ఆశీర్వాదాలు మనకు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రియ విశ్వాసులారా! మరియతల్లివలె మనముకూడా దేవునిపట్ల పూర్ణవిశ్వాసంతో జీవిద్దాం. ఆ తల్లి కోరుతున్నట్లు మంచి ప్రార్థనా జీవితాన్ని జీవిద్దాం. మరియ తల్లి  పండుగను ఒక ఆచారంలా  కాకుండా ఆధ్యాత్మిక కోణంలో జరుపుకుందాం. మన శ్రీసభ విశ్వాసాన్ని నలుగురికి వ్యక్తపరచుదాం. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనను వేడుకొని ప్రభువు మార్గంలో నడుద్దాం. అందరికీ పండుగ శుభాకాంక్షలు!

No comments:

Post a Comment