పునీత బప్తిస్మ యోహాను జయంతి ఉత్సవం (జూన్ 24)

 పునీత బప్తిస్మ యోహాను జయంతి ఉత్సవం (జూన్ 24)

యోహాను జననం లోకరక్షకుని రాకకు సంకేతం. బాలయేసు జననానికి బీజం... ఆయన చేసిన తొలి శబ్దం క్రీస్తు జననానికి దారి చూపింది. ఆయన బోధనలు, హెచ్చరికలు ప్రజలలో స్పూర్తిని రగిలించి ప్రేరణ కలిగించాయి. ఎంతోమందిని దైవ బాటలోకి నడిపించాయి. ప్రతి ఏటా జూన్ 24వ తేదీన మన తల్లి శ్రీసభ, పునీత బప్తిస్మ యోహాను జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా కొనియాడుతూ ఉంటుంది. ఈ మేరకు బప్తిస్మ యోహాను గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

సన్మనస్కుని సందేశం (లూకా 1:5-25)

    హేరోదు రాజు పరిపాలన కాలంలో, యూదయా రాష్ట్రంలో జెకర్య అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య పేరు ఎలిజబెత్. వాళ్లు దేవునిపట్ల పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో జీవించేవారు. ఐనా సంతానం లేకపోవడం వారికి పెద్ద బాధ అయ్యింది. పైగా ఇద్దరూ వృద్ధులు. ఒకనాడు జెకర్యా దేవాలయంలో పీఠంమీద దేవునికి సాంబ్రాణి పొగ వేస్తుండగా గాబ్రియేలు దేవదూత దర్శనమిచ్చి, ఈ విధముగా చెప్పి ఉన్నాడు"  జెకర్యా! దేవుడు నీ మొర ఆలకించాడు. నీ భార్య గర్భం ధరించి కుమారుని కనును. అతనికి "యోహాను" అని పేరు పెట్టుము. అతడు నజరేయ వ్రతాన్ని పాటించి దేవునికి సేవలు చేస్తాడు. యోహాను ఏలియా అంతటి ఆత్మశక్తి కలవాడై ప్రభువునకు ముందుగా వెడలును. తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచను. అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభువు కొరకు సన్నద్ధులైన  ప్రజలను సమాయత్త పరచును (లూకా 1:17). బప్తిస్మ యోహానులో ఏలియా లక్షణాలను, కార్యాలను, ఆత్మను మనం చూడగలం. 

యోహాను జననం (లూకా. 1:59-65)

    దేవదూత చెప్పినట్లే ఎలిజబేతమ్మ కుమారుని కనినది. బిడ్డ పుట్టినందుకు ఇరుగుపొరుగు వాళ్ళు ఆనందించారు. ఎనిమిదవనాడు శిశువుకు సున్నతి చేసి జెకర్యా అని పేరు పెట్టబోయారు. కాని తల్లి అతనికి "యోహాను" అనే పేరు పెట్టాలని చెప్పింది. కుమారునికి ఏమి పేరు పెట్టమంటారు అని తండ్రిని అడగగా, పలక మీద 'యోహాను' అని రాసి ఇచ్చాడు. కనుక బిడ్డకి ఆ పేరే పెట్టారు. వెంటనే జెకర్యా నాలుక పట్టుసడలగా అతడు దేవుని స్తుతించాడు. అద్భుతంగా పుట్టిన ఆ బిడ్డడు, తర్వాత ఎంత గొప్పవాడు ఔతాడో కదా! అని ప్రజలు విస్తుపోయారు.

పుట్టుకలో పవిత్రత

    యోహాను మాతృ గర్భంలోనే పవిత్రాత్మతో పరిపూర్ణంగా నింపబడ్డాడు. జన్మ, కర్మ పాపములు శుద్ధిచేయబడి జన్మించాడు. యెషయా ప్రవక్త తెలియపరిచిన విధంగా రక్షకుని రాక గురించి ప్రజలకు తెలియజేసి వారిని ఆత్మీయంగా సిద్ధంచేయడానికి దేవుడు యోహానును ఎన్నుకున్నారు ( యెషయా 40:3).

యోహాను బోధ

    క్రీస్తు బహిరంగ జీవితాన్ని ప్రారంభించి బోధచేయడానికి సిద్ధమవుతున్నాడు. అతనికి మార్గమును తయారుచేయటానికి బప్తిస్మ యోహాను ముందుకు వచ్చాడు. అతడు యోర్దాను నది సమీపంలో బోధను ప్రారంభించాడు. దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెంది పుణ్యకార్యాలు చేయమని  బప్తిస్మము ఇచ్చేవాడు.

    సోదర ప్రేమను, పేదలపట్ల కనికరమును ప్రోత్సహించాడు. వస్త్రహీనులకు దుస్తులను, అన్నార్తులకు ఆహారమును ఇవ్వమన్నాడు (లూకా. 3:11). ప్రజలలో అన్యాయాన్ని, అవినీతిని అరికట్టడానికి ప్రయత్నించాడు. నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా పన్నులు వసూలు చేయడం మంచి పద్ధతి కాదని, అన్యాయంగా పరుల సొమ్మును దోచుకోకూడదు, ఉన్నదానిలో సంతృప్తి చెందమని ఉపదేశించాడు (లూకా 3:12). 

    క్రీస్తును గురించి బోధిస్తూ, నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటైకనను యోగ్యుడను కాను. నేను  నీటితో మాత్రమే బప్తిస్మము ఇచ్చుచున్నాను. కాని, నా తర్వాత వచ్చు క్రీస్తు మిమ్మల్ని పవిత్రాత్మతోనూ, అగ్నితోనూ జ్ఞానస్నానం చేయించును. నాకంటే ఆయన శక్తిమంతుడు. ఆయన లోకపాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని ప్రవచించాడు. క్రీస్తును మెస్సయ్యగా అంగీకరించి, ఆయనను విశ్వసించేవారు నిత్యజీవమును పొందుతారని బోధించాడు.

యోహాను జీవనశైలి

    యోహాను తండ్రి యాజకుడు. పూర్వం తండ్రి యాజకుడైతే బిడ్డలకు సైతం యాజకత్వం వారసత్వంగా లభించేది. కాని, యోహాను యాజకత్వాన్ని విడనాడి ఎడారిలో సన్యాస జీవితాన్ని జీవించారు. ఒంటె రోమముల వస్త్రములను, నడుము చుట్టూ తోలుదట్టీ కట్టుకుని సంచరించాడు. మిడతలను భుజించుచు అడివి తేనెను త్రాగుతూ జీవించాడు. వైరాగ్యాన్ని అవలంబించాడు, నిరుపేదగా జీవించాడు‌. ఉపవాసాలు ఉంటూ తపస్సు చేస్తూ ప్రార్థనలో నిమగ్నమై తన పరిచర్యకు సిద్ధపడ్డాడు.

క్రీస్తుకు బలమైన సాక్ష్యం (మత్త. 3:13-17)

    క్రీస్తు నాథుడు తండ్రి చిత్తానుసారం బప్తిస్మము పొందుటకు యోహాను దగ్గరకు రాగా, "నేనే నీ దగ్గర బప్తిస్మము పొందవలసిన వాడను" అని తనను తాను తగ్గించుకున్నాడు. ఇది దేవుని సంకల్పమని క్రీస్తు పలికినప్పుడు నమ్రతతో విధేయించాడు. క్రీస్తు బప్తిస్మము పొందిన తరువాత, పవిత్రాత్మ పావుర రూపమున ప్రభువుపై వేంచేసి వచ్చుటను కనులారా చూసి ధన్యుడయ్యాడు. "ఈయనే నా ప్రియ కుమారుడు .ఈయన యందు నేను అధికముగా ఆనందించు చున్నాను" అని క్రీస్తును ఉద్దేశించి తండ్రి పలికిన పలుకులను  చెవులారా విన్నాడు. త్రిత్వేక సర్వేశ్వరుని ప్రత్యక్షపరిచే అద్భుత సంఘటనకు బలమైన సాక్షిగా నిలిచాడు.

దుష్టత్వ ఖండన

    "నిజాన్ని నిర్భయంగా చెప్పడం" యోహానుకున్న అతి ప్రత్యేకమైన సుగుణం. అసలు సిసలైన దేవుని ప్రవక్త ఎవరంటే, నిజాన్ని గుండెనిండా నింపుకొని ధైర్యంగా చెప్పేవాడే. నిర్భాగ్యులకు, నిరుపేదలకు, సామాన్య ప్రజలకు చెప్పవచ్చును. కాని అధికారులకు నిజం చెప్పాలంటే వారి అహంతో ఆడుకున్నట్లే. వారిలో కొంతమంది సానుకూలంగా ఉండవచ్చును, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. కానీ కొన్నిసార్లు ప్రాణానికే ముప్పు కలుగుతుంది. అయితే యోహానులో అత్యంత స్పష్టంగా స్ఫురించే సుగుణమే అధికారానికి ముఖ్యంగా రాజుకు తన తప్పును వేలెత్తి చూపటం.

    హేరోదు రాజు తన తమ్ముడు ఫిలిప్పు భార్య, సౌందర్యవతి అయిన హేరోదియాను అక్రమంగా వివాహమాడాడు. అప్పట్లో ప్రజాస్వామ్యం అమలులో లేదు. రాజులు సామంత రాజులు, సుంకరులు, అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాట. తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా చెప్పటం నిజమైన ప్రవక్త లక్షణం. అది ప్రాణానికి ముప్పు అయినా సరే. హేరోదు చేస్తున్నది తప్పని, ఇది అవినీతి, అధర్మమని యోహాను ఖండించారు. హేరోదు చేస్తున్న ఇతర దుశ్చర్యలను కూడా మందలించాడు. అందువల్ల  హేరోదు యోహానును కారాగారంలో బంధించాడు.

శిరచ్ఛేదనం

    యోహాను తన్ను మందలించి నందున హేరోదు అతన్ని చంపించ గోరాడు. కాని ప్రజలకు భయపడ్డాడు. ఆరోజు  రాజు జన్మదినమున, హేరోదియా కుమార్తె నాట్యం చేసి, అతనిని మెప్పించింది. ఏమి అడిగినా ఇస్తానని అందరి ఎదుట రాజు ప్రమాణం చేశాడు. తల్లి ఆమెను యోహాను శిరస్సును అడగమని ప్రోత్సహించింది. ఆ బాలిక యోహాను శిరస్సును ఓ పళ్లెంలో పెట్టి ఇప్పించమని రాజును కోరింది. అతడు అందరి ఎదుట మాట ఇచ్చినందున తప్పించుకోలేక పోయాడు. సేవకుని పంపి చెరలో ఉన్న యోహాను తల నరికించి తెప్పించి బాలికకు ఇచ్చాడు. ఆమె దానిని తల్లికి అందించింది. యోహాను శిష్యులు గురువు దేహాన్ని గౌరవపూర్వకంగా పాతిపెట్టారు.

చివరిగా

అజ్ఞానుల క్రూరత్వంకన్నా విజ్ఞానుల మౌనం సమాజానికి అత్యంత ప్రమాదకరం అనే నానుడి ఉంది. ఎదిరించేవాడు లేకపోతే, బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. అది అత్యంత అన్యాయంగా అప్రజాస్వామ్యంగా ఉంటుంది. ప్రజాస్వామ్యంలో నాయకులను, ప్రభుత్వాలను విమర్శించే హక్కు ఉంది. మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక వేత్తలు సద్విమర్శలు చేస్తూ ఉంటారు. అయినా కతోలిక సంఘాలు, పెద్దలు సంఘ విద్రోహ శక్తులను అప్రజాస్వామిక పాలనను విమర్శించటం చాలా అరుదు. మనతో ఉంటు విశ్వాసాన్ని మరచి, ఆజ్ఞలను మీరి జీవించే వ్యక్తులను ప్రశ్నించటం క్రమేణా తగ్గుతుంది. ఇటువంటి సమయంలో బప్తిస్మ యోహాను మనకు మంచి మాతృకగా నిలుస్తున్నారు. బప్తిస్మ యోహాను నిజమైన ప్రవక్త. సామాజికవేత్త.  చేసిన తప్పును, హేరోదును మందలించి శిరచ్చేదనానికి గురికాబడ్డారు. కాని నిజాన్ని చెప్పటం మరువలేదు. ముఖ్యంగా అధికారాన్ని, అధికారులను ప్రశ్నించడం మరువలేదు. ఇదే సుగుణాన్ని మనంకూడా అలవర్చుకోవాలి. కళ్ళముందు జరిగే అన్యాయాలను, అక్రమాలను ముక్తకంఠంతో ఖండించాలి. అప్పుడే దేవుడు మనల్ని బహుగా ఇష్టపడతారు.

Mr. జోసెఫ్ అవినాష్
పెద్దవడ్లపూడి విచారణ, గుంటూరు

No comments:

Post a Comment