పునీత పేతురు పౌలుల మహోత్సవము (29జూన్)

పునీత పేతురు పౌలుల మహోత్సవము (29జూన్)


అపోస్తలుల మహోత్సవం: క్రీస్తునందు ప్రియ సహోదరీ సహోదరులారా! ఈరోజు మనం రోమునగర పాలకులైన పునీత పేతురు, పౌలు గార్ల మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. క్రీస్తు సంఘ స్థాపనలో, సువార్త వ్యాప్తిలో కీలక పాత్ర పోషించిన ఈ ఇద్దరు మహనీయులు క్రీస్తు సంఘానికి మూల స్తంభాలు. వారి జీవితాలు, విశ్వాసం, ధైర్యం, దేవుని పట్ల అంకితభావానికి గొప్ప నిదర్శనం.

నేటి మొదటి పఠనం, పునీత పేతురు చెరసాల నుండి అద్భుత రీతిలో విడుదల కావడాన్ని వివరిస్తుంది (అ.కా. 12:1-12) పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, క్రైస్తవ సంఘం ఆయన విడుదల కోసం పట్టుదలతో దేవున్ని ప్రార్థించింది. హేరోదు రాజు పేతురును బంధించి, చంపడానికి ప్రయత్నించాడు. అయితే, క్రైస్తవ సంఘం నిరంతరం అతని కోసం ప్రార్థించింది. దేవుడు ఒక దూతను పంపి, పేతురును సంకెళ్ల నుండి విడిపించి, చెరసాల నుండి బయటకు తీసుకు వచ్చారు. ఈ సంఘటన దేవుని శక్తిని, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది. పేతురు జీవితంలో దేవుని హస్తం ఎప్పుడూ తోడున్నదని అర్ధమగుచున్నది.

అయితే, కొన్ని సంవత్సరాల తరువాత, పేతురు రోమునగరంలో తిరిగి చెరసాలలో బంధించబడినప్పుడు, సంఘం తప్పకుండా ఆయన కోసం ప్రార్థన చేసియుండవచ్చు. కానీ, ఈసారి ఆయన మరణంనుండి తప్పించుకోలేకపోయారు. ప్రభువు పేతురుకు అనేక అనుగ్రహాలను ప్రసాదించి, సాతాను శక్తులనుండి విడిపించినప్పటికీ, ఆయన చెరసాలనుండి విముక్తుడైనందుకు 'వీరుడు' (హీరో) కాలేదు. కానీ, తన ప్రాణాన్ని త్యాగంచేసి, వేదసాక్షి మరణం పొందినందుకే నిజమైన వీరుడయ్యాడు.

పేతురు విశ్వాసం-సంఘ నిర్మాణానికి ఆధారం: ఈనాటి సువిశేషంలో, పేతురు పలికిన విశ్వాస సత్యం ఆయన జీవితాన్నే మార్చివేసింది: యేసు తన శిష్యులను “నన్ను ఎవరని చెప్పుకుంటున్నారు?” అని అడిగినప్పుడు, పేతురు ధైర్యంగా, “నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” (మత్త 16:16) అని తన విశ్వాసాన్ని ప్రకటించాడు. ఈ విశ్వాస ప్రకటన పేతురును శిష్యులందరిలో ప్రత్యేకంగా నిలిపింది. ఈ ప్రకటన ద్వారా, పేతురు విశ్వాసానికి, సంఘానికి మూల స్తంభంగా మారారు. అందుకు ప్రభువు, “యోనా పుత్రుడవగు సీమోను! నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రే కాని, రక్తమాంసములు కావు” (మత్త 16:17) అని పలికారు. ధన్యత అనగా సంతోషం. ఈ ధన్యతకు, సంతోషానికి కారణం యేసు “సజీవుడగు దేవుడు” అని గుర్తించడమే. పేతురు తన జీవితంలో, తన హృదయంలో యేసును సజీవ దేవుడిగా నిలుపుకున్నాడు. అందుకే యేసు, “నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు” (మత్త 16:18) అని అన్నారు.

సీమోను దృఢమైనవాడని, నమ్మదగినవాడని, ఇక తప్పులు చేయడని యేసు ఆయనను ‘పేతురు’ లేదా ‘రాయి’ అని పిలవలేదు. ఆ తర్వాత యేసు ఎవరో తనకు తెలియదని పేతురు బొంకాడు. అయినప్పటికీ, ప్రభువు తన సంఘమును ఈ ‘రాయి’ [పేతురు] మీదే నిర్మించారు. ఎందుకంటే, పేతురు తన జీవితాన్ని “రక్తమాంసములు”పై గాక, తన శక్తియుక్తులపై గాక, మూలరాయి [శిల] అయిన యేసుపై నిర్మించుకున్నాడు. ఈ విధంగా ఆయన శిలపై [యేసుపై] రాయిగా మారాడు.

పౌలు మార్పు-విశ్వాసంనుండి అంకితభావం వరకు: పౌలుకూడా క్రీస్తు సువార్త కొరకు తననుతాను సంపూర్ణంగా అర్పించుకున్నాడు. ఆయన క్రీస్తు కొరకు సమస్తమును సంపూర్ణ నష్టంగా పరిగణించాడు, అన్నిటినీ విడనాడాడు, అన్నింటినీ చెత్తగా భావించాడు (ఫిలిప్పీ 3:8). నేటి రెండవ పఠనం 2 తిమోతి 4వ అధ్యాయం నుండి, పునీత పౌలు తన మరణానికి సిద్ధంగా ఉన్నప్పుడు రాసిన లేఖలో భాగం. ఆయన తన జీవితాన్ని ప్రభువు సేవకు అంకితం చేశారు. “నేను మంచి పోరాటమును పోరాడితిని. నా పరుగును ముగించితిని. విశ్వాసమును నిలుపు కొంటిని” అని ఆయన ధైర్యంగా ప్రకటించారు. పౌలు సువార్తను ప్రకటించడంలో ఎన్నో కష్టాలను, హింసలను ఎదుర్కొన్నారు. అయినా, ఆయన ఎన్నడూ తన విశ్వాసాన్ని వదులుకోలేదు. దేవుడు తనకు తోడుగా ఉన్నాడని ఆయన ఎల్లప్పుడూ నమ్మారు.

పౌలు భక్తిగల, అత్యంత ఆసక్తిగల యూదుడు (ఫిలిప్పీ 3:6). యూద మతాన్ని హృదయపూర్వకంగా ప్రేమించాడు. తన మతాన్ని, ముఖ్యంగా ధర్మశాస్త్ర దృక్పథాన్ని, గౌరవనీయ సంప్రదాయాలను, ఆరాధనను, రక్షణను సవాలు చేస్తూ, కొత్తగా ఆవిర్భవించిన ‘మార్గము’ను (క్రైస్తవ/క్రీస్తు మార్గము) సహించలేకపోయాడు. అందువల్ల, స్వమతమందు అతి మూర్ఖాభిమానుడై ‘క్రైస్తవ సంఘము’ను నాశనం చేయ ప్రయత్నించాడు. స్తెఫాను పట్ల హింసను, హత్యను ప్రోత్సహించాడు. (అ.కా. 7:58-60). ఆనాటినుండి యెరూషలేములో “సౌలు క్రైస్తవ సంఘమును నాశనము చేయ ప్రయత్నించుచు ఇంటింట జొరబడి విశ్వాసులైన స్త్రీ పురుషులను బయటకు ఈడ్చుకొనిపోయి వారిని చెరసాలలో వేయించుచుండెను” (అ.కా. 8:3). యెరూషలేములోనే గాక, దమస్కు నగరంలో కూడా ప్రభువు మార్గమును అవలంబిస్తున్న వారిని పట్టుకోవాలని తలంచి, ప్రధానార్చకుని నుండి అచటి యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములతో బయలుదేరాడు (అ.కా. 9:1-2).

పౌలు జీవితంలో దైవిక మలుపు: కానీ దమస్కు నగరానికి వెళ్లే మార్గమధ్యలో ఉత్థాన క్రీస్తును ఆకస్మికంగా ‘కలుసుకోవడం’ వల్ల (అ.కా. 9:1-9),  పౌలు తన జీవితంలో సంపూర్ణ మార్పును చూశాడు. క్రీస్తుకు శత్రువైన సౌలు ఇప్పుడు ఆయనకు అత్యంత ప్రియునిగా మారాడు. యేసును దేవునిగా, ప్రభువుగా అంగీకరించాడు (అ.కా. 9:10-20). క్రీస్తు సువార్తకు ప్రచారకునిగా మారిన సౌలు, క్రీస్తు విశ్వాసులను విస్మరించి, హింసించిన స్థితినుండి వారి పక్షాన వాదించి, వారిని ‘నిర్మించే’ పౌలుగా పరివర్తన చెందాడు. ఈవిధంగా, ప్రభువు పౌలును “తన నామమును తెలియజేయడానికి ఒక సాధనంగా ఎన్నుకున్నాడు” (అ.కా. 9:15).

పౌలు, శ్రీసభ నిర్మాణంలో అగ్రశిల్పి: సర్వకాలాల్లోనూ, శ్రీసభ నిర్మాణంలో పౌలు గొప్ప ‘శిల్పి’గా క్రైస్తవ చరిత్రలో నిలిచిపోతారు. శ్రీసభ కట్టుబాట్లు, పరిపాలనా విధానాలను పౌలు ఆనాడే రూపకల్పన చేశారు. వివిధ స్థాయిల్లో శ్రీసభ పరిపాలనను ఇతర నాయకులకు అప్పగించి, చక్కటి పరిపాలనా వ్యవస్థకు బాటలు వేశారు. క్రైస్తవ సంఘ గుర్తింపునకు పౌలు ఎంతగానో కృషి చేశారు. నజరేయుడైన యేసుక్రీస్తు సందేశాన్ని తన నాటి ప్రపంచమంతటికీ వ్యాపింపజేశారు. స్త్రీలు, పురుషులు, బానిసలు, స్వతంత్రులు, పునీతులు, పాపాత్ములు, ధనికులు, పేదవారు, అమాయకులు, విద్యావంతులు అందరూ కలిసి సామరస్యంగా జీవించగల బహుళజాతి, వివక్షతలేని సమాజ స్థాపనకు పౌలు ఎంతో కృషి చేశారు.

పౌలు, అన్యజనులకు అపోస్తలుడు: దమస్కు నగర మార్గంలో పౌలు పొందిన క్రీస్తానుభవం ద్వారా, క్రీస్తు పరమ రహస్యాలను, క్రీస్తు మరణ, ఉత్థాన రక్షణ విలువలను గుర్తించాడు (గలతీ 1:16, 3:13, 1 కొరి 1:22-25). ఇకనుండి తను ఒక నూతన పాత్రను పోషించవలసి యున్నదని, అదే ‘అన్యజనులకు అపోస్తలుడు’ అని పౌలు తెలుసుకున్నాడు (రోమీ 11:13). తాను పొందిన ఈ దైవ పిలుపు, దైవ ప్రేషిత కార్యానికి కట్టుబడి ఉన్నాడు. ఏ విషయంలోనూ రాజీ పడలేదు. అబద్ధపు బోధకులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు (గలతీ 2:4). క్రీ.శ. 49లో జరిగిన యెరూషలేము సమావేశంలో తన వాదనలను వినిపించి క్రైస్తవత్వాన్ని యూద మూలాల నుండి స్వతంత్రం చేయడానికి తనవంతు కృషి చేశాడు (అ.కా. 15, గలతీ 2:1-10).

పౌలు ప్రేషిత ప్రయాణాలు-సువార్త వ్యాప్తి: “సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును” (1:16) అన్న పౌలు మాటలు, సువార్త బోధనపట్ల, దేవుని ప్రేషిత కార్యంపట్ల ఆయనకున్న అకుంఠిత దీక్షను స్పష్టం చేస్తాయి. ఉత్థాన క్రీస్తానుభవాన్ని పొందిన పౌలు, “ప్రభువు నామమును అన్యులకు తెలియజేయడానికి సాధనముగా ఎన్నుకొనబడిన” (అ.కా. 9:15) తన పిలుపును తన ప్రేషితత్వ కార్యానికి, ప్రయాణాలకు ఆయువు పట్టుగా మలచుకున్నాడు. పౌలు విస్తృతంగా యెరూషలేమునుండి రోమునగరం వరకు ప్రయాణిస్తూ సువార్తను బోధించాడు. ఈ క్రమంలో ఎన్నో క్రైస్తవ సంఘాలను స్థాపించాడు. ప్రపంచం మొత్తాన్ని (“భూదిగంతముల వరకు”) తన సువార్త ప్రేషిత క్షేత్రంగా చేసుకున్నాడు.

పౌలు, బంధితునిగా, వేదసాక్షిగా: పౌలు తన మూడవ ప్రేషిత ప్రయాణాన్ని క్రీ.శ. 58లో ముగించుకొని యెరూషలేముకు వచ్చినప్పుడు బంధించబడ్డాడు (అ.కా. 21:27-36). రోమునగరంలో పౌలు రెండు సంవత్సరాల పాటు (క్రీ.శ. 61-63) గృహనిర్బంధంలో ఉన్నాడు. ఈ సమయంలో, తన దగ్గరికి వచ్చిన ప్రజలను స్వేచ్ఛగా కలుసుకోగలిగాడు. పౌలు బోధనలద్వారా వారిలో కొంతమంది యేసు ప్రభువును విశ్వసించారు. రోములోనున్న అన్యులకుకూడా పౌలు సువార్తను ప్రకటించాడు. బహుశా, రెండు సంవత్సరాల పాటు తన బోధనను కొనసాగించినట్లు తెలుస్తోంది (అ.కా. 28::30). పౌలు బహిరంగంగా, నిరాటంకంగా దేవునిరాజ్యం గురించి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించాడు (అ.కా. 28:31). క్రీ.శ. 63 నుండి పౌలు జీవితంలో జరిగిన సంఘటనల గురించి మనకు స్పష్టంగా తెలియదు. బహుశా, గృహనిర్బంధం తర్వాత కొంతకాలంపాటు చెరసాలలో బంధింపబడి ఉండవచ్చు. చరిత్రకారుడు యుసేబియస్ సాక్ష్యం ప్రకారం, నీరో చక్రవర్తి పాలనలోని హింసలలో, క్రీ.శ. 64-68 సంవత్సరాల మధ్య పౌలును విచారణ జరిపించి, మరణ శిక్ష విధించారు. సంప్రదాయం ప్రకారం, పౌలు క్రీ.శ. 67లో వేదసాక్షి మరణం పొందాడు.

పౌలు లేఖల సారాంశం-సంఘాలకు మార్గదర్శనం: పౌలు తన ప్రేషిత కార్య సిద్ధతలో ఎన్నో క్రైస్తవ సంఘాలను సందర్శించారు, మరికొన్నింటిని స్థాపించారు. ఒక సంఘ పెద్దగా, క్రీస్తు శిష్యుడిగా ఆయా సంఘాలలో క్రైస్తవ మత, ఆధ్యాత్మిక, వేదాంత, మరియు నైతిక నియమాలతో పాటు విశ్వాస జీవితానికి సంబంధించిన అంశాలను తన లేఖలలో వివరించారు, పరిష్కరించారు. పౌలు అందించిన క్రైస్తవ సిద్ధాంతాలు నేటికీ ప్రాతిపదికలుగా ఉన్నాయి. పౌలు తన లేఖలలో సంబోధించిన ప్రతి అంశం క్రైస్తవ సంఘాలలో నాటి పరిస్థితులను, సమస్యలను వివరించి, పరిష్కార మార్గాలను, సూచనలను నిర్దేశించింది. అలాగే ఆయా సంఘాల ఆర్థిక, సామాజిక, మత పరిస్థితులను కూడా అవి వివరించాయి. ఈనాటి మన సంఘాలు కూడా ప్రతీ కాలంలో, ప్రతీ పరిస్థితులలో ఎన్నో రకాల సంక్షోభాలను, సమస్యలను ఎదుర్కొంటున్నాయి. పౌలు లేఖలనుండి ప్రతి సమస్యకు పరిష్కారం లభించి, మన సంఘాలు ఆధ్యాత్మికంగా బలపడాలని ఆశిద్దాం!

పునీత పేతురు, పునీత పౌలుల జీవితాల నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి:

(1). విశ్వాసం మరియు అంకితభావం: పేతురు తన అపనమ్మకాలను, బలహీనతలను అధిగమించి, క్రీస్తుపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి యున్నాడు. పౌలు తన గతాన్ని విడిచిపెట్టి, క్రీస్తుకు సంపూర్ణంగా అంకితమయ్యాడు. వారి విశ్వాసం మనకు ఆదర్శం కావాలి.

(2). ధైర్యం మరియు త్యాగం: సువార్తను ప్రకటించడంలో వారు ఎన్నో కష్టాలను, హింసలను, చివరికి ప్రాణత్యాగాన్ని కూడా చేశారు. సత్యం కోసం నిలబడటానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వారు వెనుకాడలేదు.

(3). దైవశక్తి: వారి జీవితాలలో దేవుని శక్తి ఎలా అద్భుతాలు చేసిందో మనం చూశాం. పేతురు చెరసాల నుండి విడుదల, పౌలు తన బలహీనతలలో దైవశక్తిని అనుభవించడం మనకు దేవుని గొప్పదనాన్ని గుర్తుచేస్తుంది.

(4). ఐక్యత మరియు సహకారం: పేతురు యూదులకు, పౌలు అన్యజనులకు అపోస్తలులుగా నియమించబడినప్పటికీ, వారిద్దరూ క్రీస్తు శరీరమైన సంఘం కోసం కలిసి పనిచేశారు. భేదాలను అధిగమించి, సువార్త వ్యాప్తికి సహకరించారు.

ప్రియమైన సహోదరీ సహోదరులారా!, నేడు మనం పునీత పేతురు మరియు పౌలుల అడుగుజాడలను అనుసరించాలని ప్రభువు ఆశిస్తున్నారు. మన విశ్వాసాన్ని మరింత బలపరచుకుందాం. క్రీస్తును ధైర్యంగా ప్రకటిద్దాం. మన జీవితాలలో దేవుని శక్తిని అనుభవిద్దాం. సువార్తను అందరికీ చేరవేసే బాధ్యత మనపై ఉంది. వారి ప్రార్థనల ద్వారా మనం కూడా క్రీస్తులో స్థిరంగా ఉండి, ఆయన రాజ్య వ్యాప్తికి కృషి చేయగలగాలని కోరుకుందాం. ఆమెన్.

No comments:

Post a Comment