పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు - 7 ఏప్రిల్ 1506 - 3 డిశంబర్ 1552
పునీత ఫ్రాన్సిస్ శౌరివారు 7 ఏప్రిల్ 1506వ సం.లో ఉత్తర స్పెయిన్ దేశములోని క్సవేరి అను నగరములో, జువాన్ ది జాస్సో, మరియ దంపతులకు జన్మించాడు. వారిది సంపన్నుల కుటుంబము. ఫ్రాన్సిస్ వారికి తొమ్మిది సం.ల వయస్సునే తండ్రి మరణించాడు. 1525వ సం.ము వరకు తన కుటుంబముతోనే ఉండి చదువులను పూర్తి చేసాడు. 1525వ సం.లో పైచదువుల నిమిత్తమై పారిస్ నగరములోని సెయింట్ బార్బర విశ్వవిద్యాలయమునకు వెళ్ళాడు. 1528వ సం.లో చదువులు పూర్తి చేసికొని పట్టభద్రులైనారు. ఆ తరువాత అక్కడే అధ్యాపకులుగా పనిచేసారు. పారిస్ నగరములో ఉన్నంతకాలము జీవితములో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ ఉండాలని కోరుకొన్నాడు. ఈ లోకములో ఏదో సాధించాలనే పట్టుదలతో ఉండేవాడు. 1529వ సం.లో పునీత ఇన్యాసి వారిని కలిసి ఆయనకు విశ్వాసపాత్రుడైన సహచరునిగా మారాడు. ఇన్యాసివారు, "లోకమంత సంపాదించి, నీ ఆత్మను కోల్పోతే ఏమున్నది?" అని అడిగిన ప్రశ్నకు, ఫ్రాన్సిస్ వారిలో పరివర్తన కలిగింది. దేవునికోసం, సువార్తకోసం జీవించాలని నిశ్చయించుకున్నాడు. 15 ఆగష్టు 1534 వ సం.లో మోంట్ మార్త్రే లోని చిన్న గుడిలో, ఇన్యాసివారు, ఫ్రాన్సిస్ వారు, మరో ఐదుగురు సహచరులతో కలసి, పేదరికము, బ్రహ్మచర్యము, విధేయత అను వ్రతాలను దేవునికి ప్రతిజ్ఞ చేసియున్నారు. అలాగే మహమ్మదీయులను క్రైస్తవ విశ్వాసములోనికి నడిపింపవలయునని కూడా దీక్షబూనారు. అలా యేసుసభకు పునాదులు వేసారు. 1536వ సం.లో పారిస్ వదలి ఇటలీ దేశములోని వెనిస్ పట్టణానికి వెళ్లారు. అక్కడ 24 జూన్ 1537వ సం.లో గురువులుగా అభిషిక్తులైనారు. అక్టోబర్ చివరిలో ఏడుగురు సహచరులు బోలోగ్న పట్టణమునకు చేరుకొని అక్కడ స్థానిక ఆసుపత్రిలో సేవలు చేసారు. ఆతరువాత, 1538వ సం.లో ఫ్రాన్సిస్ వారు రోమునగరమునకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఇన్యాసివారికి సెక్రేటరిగా పని చేసారు.
పోర్చుగల్ రాజైన జాన్, భారత దేశానికి గురువులను పంపవలసినదిగా ఇన్యాసివారిని కోరినప్పుడు, ఫ్రాన్సిసు వారిని ఈ కార్యానికి ఎన్నుకోవడం జరిగింది. ఫ్రాన్సిస్ వారు, భారత దేశానికి మిషనరీగా వెళ్ళుటకు ఎంతో సంతోషముగా అంగీకరించాడు. తనతో శ్రీసభ ప్రార్ధనా పుస్తకం, ధ్యాన పుస్తకం మాత్రమే తీసుకొని వెళ్ళాడు. యేసుసభ మొదటి మిషనరీగా 7 ఏప్రిల్ 1541వ సం.లో భారత దేశానికి ప్రయాణమై, మార్గమధ్యలో మోజాంబిగ్ లో సువార్తా ప్రచారం చేసి, రోగులకు సేవలు చేసి, 6 మే 1542వ సం.లో గోవా పట్టణమునకు చేరుకొన్నాడు. అచ్చటి స్థానిక భాషను నేర్చుకొని సువార్తను భోదించాడు. అనారోగ్యులకు సేవలు చేసాడు. ఆయన బోధనలను ఆలకించుటకు అనేకమంది ఆయన చుట్టూ గుమికూడెడివారు. అక్కడ చాలా అద్భుతాలు చేస్తూ, చుట్టూ ప్రక్కల గ్రామాలలో కూడా సంచారము చేసి లెక్కలేని పరపరులకు జ్ఞానస్నానమిచ్చియున్నాడు. గోవా చేరిన కొన్ని మాసముల తర్వాతనే, దక్షిణ భారత దేశమున కేప్ కొమొరిన్ కు వెళ్ళి, అక్కడ 3 సం.లు చేపలు పట్టువారు, పరపరుల మధ్య పనిచేసాడు. ఏప్రిల్ 1544వ సం.లో మైలాపురంలోని అపోస్తలుడు పునీత తోమాసువారి సమాధిని సందర్శించి, అక్కడ నాలుగు మాసాలపాటు ఉండి చుట్టుప్రక్కల సువార్తా ప్రచారం చేసాడు.
ఆయన తన మిషనరీ కార్యములో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. గోవానుండి తన సువార్తా ప్రచారాన్ని సిలోను, ఇండోనేషియా, శ్రీలంక, జపాను దేశాలకు విస్తరించాడు. 17 ఏప్రిల్ 1549వ సం.లో గొప్ప ఉత్సాహముతో సువార్తా ప్రచారమునకై జపాన్ దేశమునకు ప్రయాణమైయ్యాడు. అక్కడ రెండు సం.ల మూడు నెలల పాటు సువార్తా ప్రచారం చేసి, అనేకమందిని క్రైస్తవ విశ్వాసములోనికి నడిపించగలిగాడు.
ఆగష్టు 1552వ సం.లో గోవాకు తన తిరుగు ప్రయాణములో సువార్తా ప్రచారాన్ని చైనాలో కూడా విస్తరింప జూసాడు. కాని, తన ప్రయాణములో అనేక ఇబ్బందులకు, ప్రతిఘటనలకు గురికావలసి వచ్చింది. 21 నవంబర్ 1552న తీవ్రముగా జబ్బుపడి, బలహీనుడై, 3 డిశంబర్ 1552న, తన 46వ ఏట భాగ్యమైన మరణమును పొందియున్నాడు. మరుసటి రోజున, మొదటిగా శాంగ్చువాన్ ద్వీపములో సమాధి చేయబడ్డాడు. ఆతరువాత 22 మార్చి 1553వ సం.లో మలాక్కలోని పునీత పౌలుగారి దేవాలయములో సమాధిచేయబడ్డాడు.
పుణ్య జీవితమునుబట్టి, ప్రఖ్యాతి పొందియుండుటచే, రెండు నెలలకుపై తరువాత, ఆయన సమాధిని తెరచినప్పుడు, కుళ్ళని ఆయన శరీరమును కనుగొనిరి. ఆయన పవిత్ర శరీరమును గోవాకు 11 డిశంబర్ 1553వ సం.లో తీసుకొని రావడం జరిగింది. ఆయన పవిత్ర శరీరమును నేటికిని గోవా పట్టణములోని, 16వ శతాబ్దములో నిర్మించబడిన పెద్ద దేవాలయములో చూడవచ్చును.
తన జీవితాన్ని సంపూర్ణముగా, హృదయపూర్వకముగా, దేవునికి, తన ప్రజలకు అర్పించారు. ఎక్కడకు వెళ్ళిన, పేదరికములో జీవించారు. చాల మితముగా భోజనం చేసెడివారు. ఎక్కువగా, పేదలతో, పనివారితో గడిపేవారు. అనారోగ్యులకు సేవలు చేసెడివారు. రాత్రంతయు ప్రార్ధనలో గడిపేవారు. పునీత ఫ్రాన్సిస్ శౌరివారు ఎన్నో అద్భుతాలను చేసారు. ఆయన ఆత్మ ప్రేరితుడై అనేక భాషలలో మాట్లాడేవారని చెప్పేవారు. మరణించిన వారిని సైతం సజీవముగా లేపారు.
25 అక్టోబరు 1619వ సం.లో ఐదవ పౌలుపాపుగారిచే ధన్యత పట్టమును, 12 మార్చి 1622వ సం.లో గ్రెగోరి పాపుగారిచే పునీత పట్టమును పొందియున్నారు. 1748వ సం.లో తూర్పు దేశాల చర్చికి పాలక పునీతునిగా, 1904వ సం.లో 'ప్రోపగేషన్ ఆఫ్ ఫేయిత్' (Propagation of Faith)కు పాలక పునీతునిగా, 1927వ సం.లో మతబోధకుల పాలక పునీతునిగా ప్రకటింపబడియున్నాడు. ఆయన ఓడ ప్రయాణికులకు కూడా పాలక పునీతుడు.
Good
ReplyDelete