యేసు పవిత్ర నామ స్మరణోత్సవము (లేదా)
పరమ పవిత్ర యేసు నామకరణ పండుగ
పఠనాలు: 1 యోహాను 3:22-4:6; మత్త 4:12-17, 23-25
యేసు నామం జై జై, క్రీస్తు నామం జై, జై
యేసు నామము ప్రత్యేక విధముగా స్మరించుకోవడానికిగల ముఖ్య కారణం, ఈనామము అద్భుత రీతిన ఇవ్వబడినది. ఈనామము మానవునిచేతగాక, స్వయముగా పితయైన దేవునిచేత ఇవ్వబడినది. ''ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. అ శిశువునకు 'యేసు' అని పేరు పెట్టుము'' (లూకా 1:31), అని గబ్రియేలు దూత మరియమ్మతో దేవుని సందేశమును చెప్పినది. ''యోసేపూ! నీ భార్యయైన మరియమ్మ.... పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు 'యేసు' అను పేరు పెట్టుము.'' (మత్తయి 1:20-21). 'యేసు' అనగా 'దేవుడు సహాయము చేయును' లేదా 'దేవుడు రక్షించును' అని అర్ధము. ''ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపములనుండి రక్షించును'' (మత్తయి 1:21).
యేసు నామము పవిత్రమైనది, శక్తివంతమైనది. ఎందుకన, ఆ నామము కలిగిన రక్షకుని, దేవుని కుమారుని యొక్క వ్యక్తిత్వమును సూచిస్తున్నది. ఆయన శక్తిగలవాడు. ఆయన నామమున ప్రజలు స్వస్థతను పొందియున్నారు. యేసు నామముము గౌరవించెదము, ఆరాధించెదము. ఎందుకన, ఆయన నామమును స్మరించినప్పుడు, మనము దేవునికి అత్యంత గొప్పదైన, శక్తివంతమైన ప్రార్ధన చేస్తున్నాము. ఆయన నామమున ప్రార్ధన చేయమని ప్రభువే కోరియున్నారు. ''మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును'' (యోహాను 16:23). అంతేగాక, ఆయన పవిత్ర నామమును స్మరించుటవలన, మనంచేసే ప్రార్ధనలో అనేక వ్యర్ధపదాలకు దూరముగా ఉండవచ్చు (మత్తయి 6:7).
ఆయన నామము, రక్షకునిద్వారా పొందు సకల ఆశీర్వాదములను జ్ఞప్తికి చేస్తుంది. అందుకే, పునీత పౌలుగారు ఇలా వ్రాసియున్నారు: "పరలోక భూలోక పాతాళ లోకములయందలి సమస్త జీవులును క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను" (ఫిలిప్పీ 1:10).
'యేసు' అను నామము ఎనిమిదవరోజున, అనగా యూదుల ఆచారము ప్రకారము సున్నతిచేయబడిన రోజున, నామకరణము చేసిరి (లూకా 2:21).
యేసు నామము ఎంతో మధురమైన నామము. ఆ నామము మనలను మంచి ఆలోచనలతో నింపుతుంది. మంచి కార్యములను చేయుటకు స్పూర్తినిస్తుంది. సద్గుణాలను బలపరస్తుంది. యేసు నామము మన నోటిలో తేనెలాంటిది, మన చూపులో వెలుగు, మన హృదయాలలో ఓ జ్వాల. యేసు నామము వలన సకల రోగాలకు స్వస్థత. భోదకులకు వెలుగు.
యేసు నామము త్రిత్వైక దేవుని దైవత్వమును, పవిత్రతను సూచిస్తున్నది. అందుకే యేసు తండ్రిని ఇలా ప్రార్ధించాడు: "పవిత్రుడవైన తండ్రీ! మనవలె వారును ఒకరుగ ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగిన నీ నామమందు సురక్షితముగ ఉంచుము" (యోహాను 17:11-12).
పేరు ఓ వ్యక్తి స్వభావమును సూచిస్తుంది. "కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది." (కొలస్సీ 1:19). "దివ్య స్వభావపు సంపూర్ణత్వము క్రీస్తునందు ఉన్నది" (కొలస్సీ 2:9).
యేసు నామము మహోన్నతమైనది, ఘనమైనది. "దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామములకంటె ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను" (ఫిలిప్పీ 2:9). "యేసు క్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింప వలెను" (ఫిలిప్పీ 2:11). యేసు నామము ప్రేమగలది. ఆయన నామము ధర్మమును, రక్షణమును సూచిస్తుంది. "నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరు ద్వేషింతురు; కాని, చివరివరకు సహించి నిలచినవాడే రక్షింపబడును" (మత్తయి 10:22).
యేసుపవిత్రనామాన్ని శ్రీసభ ప్రారంభదినాలలోనే స్మరించడం జరిగింది. కాని, 14 వ శతాబ్దములో మాత్రమే ఆరాధన క్రమములో చోటు కల్పించబడినది. యేసు పవిత్ర నామ భక్తిని, పునీత బెర్నార్డుగారు తన ఇతర సహచరులతోను, పునీత బెర్నార్డు సియోనగారు, పున్నేత జాన్ కపిస్త్రానో మరియు ఫ్రాన్సిసు సభ సభ్యులు వ్యాపింప జేసియున్నారు.
యేసు నామం జై జై, క్రీస్తు నామం జై, జై.
No comments:
Post a Comment