ధన్యజీవి దేవసహాయం పిళ్ళై, వేదసాక్షి (1712 - 1752)


పునీత దేవసహాయం పిళ్ళై, వేదసాక్షి
(1712 - 1752)

పునీత దేవసహాయం పిళ్ళై అసలు పేరు నీలకంఠ. ఆయన 18వ శతాబ్దములో 1712 నుండి 1752 మధ్యకాలములో జీవించాడు. 23 ఏప్రిల్ 1712వ సం.లో తమిళనాడు రాష్రం, ప్రస్తుత నాగర్కోయిల్ జిల్లా, నట్టాలం (Nattalam) పల్లియాడి అను గ్రామములో, వాసుదేవన్ నంబూదిరి మరియు దేవకియమ్మ దంపతులకు జన్మించాడు. వారిది సుసంపన్నమైయిన నాయర్ కులమునకు చెందిన కుటుంబము. తండ్రి ప్రస్తుత కేరళ రాష్ట్రములోని కాయంకుళం మరియు తల్లి కన్యాకుమారి జిల్లాలోని తిరువత్తర్ వాస్తవ్యులు. తండ్రి శ్రీ ఆది కేశవ పెరుమాళ్ దేవాలయములో పూజారిగా పనిచేసియున్నాడు. ఆనాటి నాయర్ కుటుంబ ఆచారాల ప్రకారం, పిళ్ళై తన మేనమామ దగ్గర పెరిగి, హిందూ విశ్వాస ఆచారాలను నేర్చుకొనియున్నాడు.

దేవసహాయం వారి కుటుంబానికి, ట్రావన్కోర్ (Travancore) మహారాజైన మార్తాండవర్మ రాజకొలువులో ఎంతో పలుకుబడి యున్నది. అందుకే, యువకునిగానే, దేవసహాయం పిళ్ళై రాజకొలువులో సేవకై వెళ్లియున్నాడు. అతని శక్తి సామర్ధ్యాలు, ఉత్సాహాన్ని చూసిట్రావన్కోర్ మంత్రి అయిన రామయ్యన్ దలవ క్రింద రాజ వ్యవహారాల భాధ్యతలను అప్పజెప్పియున్నారు.

క్రైస్తవ మత విశ్వాస స్వీకరణ

1741వ సం.లో డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ, ట్రావన్కోర్ ఆధీనములోనున్న కొలచేల్ (Colachel) పోర్టును ఆక్రమించుకొని అక్కడ వర్తక వ్యాపారాలను స్థాపించుటకు, డచ్ నావికా కమాండర్ కెప్టెన్ యుస్తాకియుస్ ది లన్నోయ్ (Captain Eustachius De Lannoy, ఉత్తర ఫ్రాన్సుదేశ [ప్రస్తుతం బెల్జియం] కతోలికుడు) ని పంపడం జరిగింది. డచ్-ట్రావన్కోర్ వైరి పక్షాల మధ్య జరిగిన యుద్ధములో (Battle of Colachel) డచ్ బలగాలు ఓడిపోయాయి. కెప్టెన్ యుస్తాకియుస్, అతని సహాయకుడు దొనాడి (Donadi) మరియు ఇతర డచ్ సైన్యాన్ని బంధించి చెరసాలలో వేయడం జరిగింది. ఆ తరువాత, ట్రావన్కోర్ సైన్యములో పనిచేయాలన్న షరతుతో వారిని క్షమించడం జరిగింది. తరువాతి కాలములో రాజుగారి నమ్మకాన్ని చవిచూసిన యుస్తాకియుస్ సాయుధ దళాల కమాండరుగా ఎదిగి, ఎన్నో యుద్ధాలు గెలిచి, అనేక పొరుగు ప్రాంతాలను ట్రావన్కోర్ సామ్రాజ్యములో కలిపాడు.

ట్రావన్కోర్ రాజు కొలవులో ప్రతిభావంతమైన పాత్రను పోషించిన దేవసహాయం పిళ్ళై మరియు యుస్తాకియుస్ అతి సన్నిహితులయ్యారు. యుస్తాకియుస్ క్రైస్తవ భక్తి విశ్వాసాలు దేవసహాయాన్ని ఎంతగానో ఆకర్షించాయి. ఆవిధముగా, 1745వ సం.లో క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించాడు.

జ్ఞానస్నానం

దేవసహాయం క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించినందున, వడక్కన్కులం (Vadakkankulam) గ్రామములోని ప్రస్తుత తిరునల్వేలి జిల్లా, తమిళనాడులోని , రోమను కతోలిక దేవాలయములో, యేసు సభకు చెందిన గురువులచే  జ్ఞానస్నానమును పొంది, లాజరు అని నామకరణం చేయబడ్డాడు. అయితే, తమిళం, మలయాళంలో లాజరు అనగా "దేవుని సహాయం" అని అర్ధం. అందుకే, ఆయన పేరు దేవసహాయముగా స్థిరపడి పోయింది.

అప్పటికే, దేవసహాయం వివాహితుడు. ట్రావన్కోర్కి చెందిన భార్గవి అమ్మల్ను వివాహమాడి యున్నాడు. ఆమెకూడా జ్ఞానస్నానం పొంది జ్ఞానపూ అమ్మల్ (తమిళం, మలయాళం లో "తెరెసా" అని అర్ధం) అనే నామాన్ని స్వీకరించినది. మత మార్పిడి వ్యతిరేక ప్రతీకారానికి భయపడి, గ్రామములో ఒక వలస-నివాసిగా జీవించుటకు ఎంచుకొన్నది. దేవసహాయం పిళ్ళై దగ్గరి బంధువులు కూడా కొందరు జ్ఞానస్నానాన్ని పొందియున్నారు.

నిందారోపణలు, శ్రమలు

శ్రీసభ-చర్చి చరిత్ర కారుల ప్రకారం, రాజ్యంలో బ్రాహ్మణ పూజారి, భూస్వాములు, రాజగృహ సభ్యులు మరియు నాయర్ కమ్యూనిటీ సభ్యులు, రామయ్యన్ దలవ మంత్రి దగ్గర, దేవసహాయంపై ఆరోపణలు మోపారు. రాజద్రోహం చేసాడని, రాజ రహస్యాలను పొరుగు దేశాలవారికి, యూరప్ దేశాలవారికి చేరవేసాడని నిందించారు. ఈ నేరారోపణలపై, పిళ్ళైని ఇనుప గొలుసులతో బంధించి మూడు సం.ల పాటు చిత్రహింసలు పెట్టారు. శిక్షను అమలు చేయమని ఆజ్ఞలు జారీ చేసిన తరువాత, మొదటగా, ఒక గేదెపై కురుమైక్కడ్ (Kuzhumaikkad) అను స్థలమునకు తీసుకొని పొమ్మని ఆజ్ఞలు చేసారు. కాని, మారిన ఆజ్ఞ ప్రకారం అతనిని గేదెపై అరల్వైమొరి (Aralvaimozhy) అను స్థలపరిసరాలకు తీసుకొని వెళ్లి, మంత్రుల సలహా ప్రకారం, అనేక హింసలకు గురి చేసి రాజ్య బహిష్కరణ చేయ నిశ్చయించారు. పద్మనాభపుర రాజ భవనము నుండి  అరల్వైమొరికి చేరడానికి కొన్ని రోజులు పడుతుంది. ఈ సమయములో, రాజ భటులు ఆయనను ఒక క్రూరమైన నేరస్తుడిగా భావించారు. ప్రతిరోజు ఆయనను కొట్టారు, ఎండలో ఉంచారు, గాయాలపై, ముక్కు రంధ్రాలలో మిరియాల పొడిని రాసారు. తాగడానికి మురికి నీరుని ఇచ్చారు.

మార్గమధ్యములో, పులియూర్కురిచి (Puliyoorkurichi) అను స్థలమున ఆగినప్పుడు దేవుడు అద్భుత రీతిన రాతినుంచి నీటి బుగ్గను సృష్టించి ఆయన దాహమును తీర్చారు. ఆ నీటి బుగ్గ ఇప్పటికీ నాగర్కోయిల్ నుండి 15 కి.మీ దూరములోనున్న పులియూర్కురిచి చర్చి ప్రాంగణములో చూడవచ్చు.

అలాగే, మార్గమధ్యములో పెరువిలై (Peruvilai) అను గ్రామములో ఒక వేప చెట్టుకు అతనిని కట్టి వేసారు. ఆ వేపచెట్టు ఆకుల వలన అనారోగ్యముతో బాధపడుచున్న ఆ గ్రామస్తులు,  చుట్టుప్రక్కల గ్రామస్తులు స్వస్థతను పొందియున్నారు.

మరణం

1752 వ సం.లో రాజు జారీ చేసిన ఆజ్ఞ ప్రకారం, దేవసహాయాన్ని ట్రావన్కోర్ నుండి బహిష్కరణ చేయవలసినదిగా నిర్ణయించడమైనది. అరల్వైమొరి దగ్గర అతనిని అడవిలోని కొండ ప్రాంతములో వదలి పెట్టారు. అక్కడ ఆయన ధ్యానములో జీవించాడు. చుట్టుప్రక్కల గ్రామాలనుండి అనేకమంది ఆయనను సందర్శించేవారు. అయితే, కొంతమంది దేవసహాయాన్ని తుదముట్టించాలని నిర్ణయించారు. ఆవిధముగా, భటులు అతనిపై తుపాకీ కాల్పులు జరిపి చంపివేసారు. దేవసహాయం కన్యాకుమారి జిల్లాలోని కట్టాడిమలై ప్రాంతములో 14 జనవరి 1752వ సం.లో, తన 39వ యేట వేదసాక్షి మరణాన్ని పొందాడు. ఈవిధముగా, తన విశ్వాసం కొరకు ధన్యమరణమును, వేదసాక్షి మరణమును పొందాడు.

వేదసాక్షి దేవసహాయం పిళ్ళై చివరి ప్రార్ధన: “ఓ ప్రభువా! నన్ను ఎడబాయకుము! ఓ ప్రియమైన మరియతల్లి నాకు సహాయం చేయము! ఓ ప్రభువా! నా యాత్మను నీ చేతులకు ఒప్పజేప్పు చున్నాను!”

అతని భౌతిక దేహాన్ని నిర్లక్ష్యముగా కట్టాడిమలై (Kattadimalai) కొండ  ప్రాంతాలలో విసిరి పారేసారు. నాగర్కోయిల్లోని, కొట్టార్, పునీత ఫ్రాన్సిస్ శౌరివారి దేవాలయం, ప్రస్తుత మేత్రాసణ కతిద్రల్ లోని పీఠముచెంత పునీత దేవసహాయం పిళ్ళై భౌతిక దేహాన్ని భూస్థాపితం చేసారు.

ధన్యజీవి, వేదసాక్షి

2 డిశంబర్ 2012 , దైవసేవకుడైన దేవసహాయం పిళ్ళై, వేదసాక్షిగా, ధన్యజీవిగా ప్రకటింపబడి యున్నాడు. ఈ పరిశుద్ధ కార్యక్రమం కొట్టార్ మేత్రాసణం, నాగర్కోయిల్, కార్మెల్ సెకండరీ స్కూలు ప్రాంగణములో, దేవసహాయం వేదసాక్షి మరణం పొందిన స్థలానికి దగ్గరిలో జరిగింది. 16 వ బెనెడిక్ట్ పాపుగారి ప్రతినిధిగా కార్డినల్ అంజెలో అమాతో (The Prefect of the Congregation for the Causes of Saints), ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనేకమంది కార్డినల్స్, అగ్ర పీఠాధిపతులు, పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు, మఠకన్యలు, లక్షకు పైగా విశ్వాసులు, ఈ కార్యక్రమములో పాల్గొని సాక్షులుగా నిలిచారు.

పునీతుడు, వేదసాక్షి

పది సంవత్సరాల తరువాత, అనగా 15 మే 2022వ సం.లో రోమునగరములో జగద్గురువులు ఫ్రాన్సిస్గారు వేదసాక్షి అయిన దేవసహాయం పిళ్ళైను పునీతునిగా ప్రకటించాడు. దేవుని ప్రేమను గుర్తించి, పంచుకొనే ప్రతీ ఒక్కరు పునీతులుగా పున్యాత్ములుగా, పవిత్రులుగా జీవించే అవకాశం ఉంటుందని, ఇది అందరికీ అందుబాటులో ఉండే జీవితమే అని పోప్ ఫ్రాన్సిస్ తెలియజేసారు. దేవసహాయం పిళ్ళై సువార్తను జీవించి మనందరికి నేడు సవాలుగా, ఆదర్శముగా యున్నాడు. ప్రాపంచిక మహిమకొరకు ఆశించక తన విశ్వాసం కొరకు సంతోషముగా దేవసహాయం పిళ్ళై తన ప్రాణాలను విడిచాడు.

No comments:

Post a Comment