5 వ సామాన్య ఆదివారము, Year B

 5 వ సామాన్య ఆదివారము, Year B
యోబు 7:1-4; 6-7, భక్తి కీర్తన 147; 1-6, 1 కొరి 9:16-19, 22-23; మార్కు 1: 29-39
"రండు, మనలను సృజించిన సర్వేశ్వరుని ముందు సాగిలపడి ఆయనను ఆరాధింతము. ఎందుకన, ఆయనే సర్వాధికారి, ఆయనే మన కర్త."
"అందరు మిమ్ము వెదకుచున్నారు" (మార్కు 1:37 ) - ప్రార్ధన ప్రాముఖ్యత

ఉపోద్ఘాతము: శ్రమల అంతర్యము

బాధలు మన జీవితములో అనివార్యము. ఈలోక బాధలలో చివరిది మరియు తీవ్రమైనది మరణం. నాశనం చేయబడ వలాసిన చివరి శత్రువు మృత్యువు (1 కొరి 15:26). మన బాధలలో మనం అశక్తులం. అందుకే, మన బాధలకు అర్ధాన్ని వెదకుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాము. క్రైస్తవులకు, క్రీస్తును విశ్వసించి అనుసరించు వారైన మన బాధలకు, క్రీస్తు శ్రమలు అర్ధాన్ని చేకూర్చుతున్నాయి. బాధలను, మరణాన్ని జయించుటకు క్రీస్తు ఒక రక్షకునిగా ఏతెంచాడు. క్రీస్తు శారీరక బాధలను మాత్రమే గాక, సంపూర్ణ వ్యక్తిని స్వస్థత పరచును. అంతర్గత స్వస్థత, పాపమన్నింపు ఆయన ప్రేషిత కార్యాలు. మన బాధల ఉపశమనము కొరకు, దేవుడు మన జీవితాలలో జోక్యము చేసికొనును. అయినప్పటికిని, బాధలను ఆయన అనుమతించును. "దేవుని మహిమ వీనియందు బయలుపడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను" (చూడుము యో 9:1-3). బాధలలోనున్న వ్యక్తి, దేవున్ని వెదకుటకు ప్రయత్నిస్తాడు.

మొదటి పఠనం - శ్రమలను ఎలా అర్ధం చేసుకోవాలి?

ఈనాటి మొదటి పఠనం యోబు జీవిత గాధనుండి వింటున్నాం. యోబు ఆయన జీవితములో ఎన్నోకష్టాలను, బాధలను అనుభవించాడు. ఆయన పొందే బాధలను మాటలలో వ్యక్తపరస్తున్నాడు. తన స్నేహితులు ఆయన విడచిపోయారు. యోబు పాపం చేసాడని ఒకరు, పశ్చాత్తాప పడాలని ఒకరు, చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని మరొకరన్నారు. చివరికి, ఆయన భార్యకూడా శంకించింది. 'దేవున్ని శపించి మరణింపుము' అని కోరింది. కాని, యోబు, "దేవుడు మనకు శుభములు దయచేసినప్పుడు స్వీకరించితిమి. కీడులను పంపినపుడు మాత్రము స్వీకరింప వలదా?" అని ప్రశ్నించాడు. ఆవిధముగా, బాధలలోనే యోబు ఇంకా ఎక్కువగా దేవున్ని వెదికాడు, ప్రార్ధించాడు. ఆయనకు మరింత దగ్గరయ్యాడు. యోబు విశ్వాస ప్రార్ధనకు దేవుడు జవాబు ఇచ్చాడు.

మనముకూడా, మన కష్టాలకు, బాధలకు కృంగి కృశించక, ఆధ్యాత్మిక హృదయముతో, వాటిద్వారా దేవుడు మనకి అందిస్తున్న సందేశాన్ని తెలుసుకొనడానికి ప్రయత్నం చేయాలి. బాధలలో, ప్రభువు మనలను పరిశుద్ధులను చేయుచున్నాడా? మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడా / బలపరుస్తున్నాడా? మన నిలకడను పరీక్షిస్తున్నాడా? మన దైవ/సోదరప్రేమను పరీక్షిస్తున్నాడా? మనం తప్పక గ్రహించాల్సిన విషయం, 'ప్రార్ధనతో, పవిత్రాత్మ శక్తితో జవాబు వెదకిన వారికి సరియైన సమాధానం దొరకును'.

సువిశేష పఠనము: శ్రమలలో ప్రభువును వెదకాలి

ఈనాటి సువిశేష పఠనములోకూడా, కష్టాలలో, బాధలలోనున్న ప్రజలందరు ప్రభువు కొరకు వెదకుచున్నారు. ప్రార్ధనా మందిరములో అధికారపూర్వకముగా బోధించి, అపవిత్రాత్మ ఆవేశించిన వానిని స్వస్థత పరచి, ఇంకా మరెంతోమందిని స్వస్థత పరచాడు. వేకువ జామున, ఒక నిర్జన ప్రదేశమున ప్రార్ధన చేయుచుండగా, సీమోను అతని సహచరులు ప్రభువును వెదకుచు వెళ్లి ఆయనను కనుగొని, "అందరు మిమ్ము వెదకుచున్నారు" అని చెప్పారు.

ప్రార్ధన జీవితముతో ప్రభువును వెదకాలి: ఈ రోజుకి కూడా, అందరు ఆయన కొరకు వెదకుచున్నారు. మన కష్టాలు, బాధలు ఎంతవైనను, ఆత్మశక్తితో వాటన్నింటిని జయించవచ్చు. దేవుని కృపవలన, యేసు నామమున ఎలాంటి బాధలనైనను ఎదుర్కొనవచ్చు. దేవునినుండి మనం ఎన్నో అనుగ్రహాలను పొందియున్నాము. ఏదీ ఆశించకుండా, ఇతరులతో ఆ వరాలను పంచుకొందాం. మన జీవితానికి ఓ అర్ధాన్ని చేకూర్చుకోవాలని ప్రభువు ఆశిస్తున్నారు. ప్రార్ధనతో కూడిన జీవితం, దేవునికి దగ్గరగా చేరు జీవితం, ఇతరులతో పంచుకొను జీవితం, స్వస్థత, పశ్చాత్తాపముతో కూడిన జీవితాన్ని జీవించాలని ప్రభువు ఆశిస్తున్నారు. తండ్రి చిత్తాన్ని కనుగొనుటకు యేసు ప్రతిదినం ప్రార్ధన చేసాడు. ఆయన ప్రార్ధానా మందిరములలో, అలాగే ఏకాంత ప్రదేశాలలో ప్రార్ధన చేసాడు. యేసు ప్తరభువుకు కూడా, తన ప్రేషితకార్యములో ప్రార్ధన ఎంతో ప్రధానమైనది. దేవుని కుమారుడైనప్పటికినీ, ప్రార్ధన అవసరత, తండ్రి దేవునితో సంభాషించడం ఎంతో అవసరమని గుర్తించాడు. మరి మనికింకా ఎంత అవసరమో గుర్తించాలి!  అందులకే, దైవచిత్తాన్ని తెలుసుకొనుటకు, ప్రభువు మనకు కూడా ప్రార్ధన నేర్పించాడు. 

మన జీవిత అంధకారమునుండి బయటపడుటకు ప్రార్ధన ఎంతో ప్రాముఖ్యం. క్రీస్తానుచరులుగా, క్రీస్తువలే మారుటకు ప్రయత్నంచేద్దాం. తండ్రి చిత్తం, ప్రభువు కార్యమైనప్పుడు, అదే దేవుని చిత్తం, ప్రభువు కార్యం, మన కార్యముకూడా కావలయును. తండ్రితో ప్రభువు ఇలా ప్రార్ధించాడు: "నీవు నాకు అప్పగించిన పనిని పూర్తిచేసి, నిన్ను ఈ లోకమున మహిమ పరచితిని" (యో 17:4). మనతో ప్రభువు ఇలా అంటున్నాడు, "ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి యెడల ప్రకాశింపనిండు" (మ 5:16).

ప్రభువు ప్రేషిత కార్యములో మనమూ భాగస్తులమే. తండ్రి కుమారున్ని పంపినట్లే, మనలను కూడా పంపియున్నాడు. "నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును. అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యో 14:12).

రెండవ పఠనము - శ్రమలలో పౌలు ఆదర్శం

ఈనాటి రెండవ పఠనములో పౌలుగారు ఇలా అంటున్నారు, "ఈ పనిని (సువార్తా బోధన) నేనే చేసినచో ప్రతిఫలమును ఆశింపవచ్చును. కాని, ఇది నా విధి అని భావించినచో, నాకు ఒక పని ఒప్పచెప్పబడినదని అర్ధము (1 కొరింతి 9:17). పౌలుగారు యేసువలెనె దైవకార్యాలను చేసియున్నాడు. అన్ని ఇబ్బందులను, బాధలను ధైర్యముతో ఎదుర్కొని, సువార్తను బోధించి తన జీవితాన్ని అర్పించాడు. యో 9:4 లో ప్రభువు చెప్పిన మాటలను తన జీవితములో పాటించాడు: "పగటి వేళనే నన్ను పంపిన వాని పనులు మనము చేయుచుండవలెను. రాత్రి దగ్గర పడుచున్నది. అపుడు ఎవడును పని చేయలేడు." మనం ఏ పని చేసిన ప్రభువు పేరిట చేసినచో ఆనందాన్ని పొందగలము. ప్రతీది ఆయన కొరకు చేద్దాం. మన బాధలను, కష్టాలను, మన అనుదిన కార్యాలను ఆయన చెంతకు తీసుకొని వద్దాం. "భారముచే అలసి సొలసి యున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను" (మ 11: 28).

వరప్రసాదముల మాత మహోత్సవము

 వరప్రసాదముల మాత మహోత్సవము

దేవదూత లోపలి వచ్చి, కన్యక మరియమ్మతో, “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు” అనెను (లూకా 1:28).

దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మా, వందనము!



వరప్రసాదముల మాత పేరిట శ్రీసభలో ఎన్నో దేవాలయాలు వెలిసాయి. ఈ దేవాలయాల ద్వారా స్థానిక శ్రీసభ మరియతల్లి ద్వారా పొందిన మేలులకు కృతజ్ఞతలు తెలియ జేస్తారు. మరియద్వారా వరప్రసాదమైన క్రీస్తును మనం పొందుకొనుచున్నాము. ముందుగా మరియమ్మను వరప్రసాదముల మాత అని ఎందుకు పిలుస్తున్నాము అంటే, పునీత పౌలుగారు చెప్పినట్లుగా, “సర్వమానవాళి రక్షణకై ‘దేవుని కృప’గా ప్రత్యక్ష మయ్యెను” (తీతు 2:11). ఆ దేవుని కృప ఎవరో కాదు, సత్యము, జీవము, మార్గము అయిన యేసుక్రీస్తు ప్రభువే. మరియ ఆ ‘దేవుని కృపకు’ తల్లి. అందుకే ఆమె క్రుపానుగ్రహ మాత లేదా వరప్రసాదాల మాత. ఈవిధముగా, దేవుడు వాగ్ధానము చేసిన కృప యేసుక్రీస్తు. ఆ దేవుని కృపకు మానవ శరీరాన్ని ఒసగిన మాతృమూర్తి కనుక, మరియ ‘దైవకృప’కు తల్లి అని ఖచ్చితముగా చెప్పగలము. యోహాను సువార్తీకుడు కూడా క్లుప్తముగా “క్రీస్తు కృపాసత్యములతో నిండెను” అని సూచించాడు (1:14). యేసుక్రీస్తు “దేవునికృపకు” పాత్రురాలుగా ఉండుటకు, ఆమెను “అనుగ్రహ పరిపూర్ణురాలుగా” (లూకా 1:28) చేసాడు దేవుడు. కనుక, “దేవవరప్రసాదము చేత నిండిన మరియమ్మా వందనము” అని ప్రార్ధించి నపుడెల్ల, దేవుని పరిపూర్ణ జీవితమును మరియ కలిగియున్నదని చెబుతున్నాము.

దేవదూత లోపలి వచ్చి, కన్యక మరియమ్మతో, “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు” అనెను (లూకా 1:28): దేవుని సందేశమును, చిత్తమును, ప్రణాళికను తెలియజేయువారు దేవదూతలు. దేవుని సందేశానికి స్పందించాలని, సమాధాన మివ్వాలని ఆహ్వానిస్తారు. దేవుని సందేశానికి స్పందించడం చాలా ప్రధానం. పిలుపునిచ్చిన దేవునికి సమాధాన మివ్వడం అతిప్రాముఖ్యము. మత్త 1:18-25లో ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, దేవుని ఆజ్ఞను తెలియజేయగా, యోసేపు అటులే చేసాడు. లూకా 1:5-25లో జెకర్యాకు దేవదూత ప్రత్యక్షమై, దేవుని సందేశమును తెలియ జేసెను. జెకర్యా ఆరంభములో స్పందించక పోయినను, నెమ్మదిగా దేవుని చిత్తమును గ్రహించి అటులనే చేసాడు. అలాగే, లూకా 1:26-38లో గబ్రియేలు దేవదూత కన్యక మరియమ్మ దగ్గరకు పంపబడెను. ఆ వృత్తాంతాన్ని ధ్యానిస్తూ, మరియ ఎలా వరప్రసాదముల మాత అయినదో తెలుసుకుందాం!

మరియ “అనుగ్రహ పరిపూర్ణురాలు” అని బైబులు గ్రంథం చెబుతుంది (లూకా 1:28). మరియను మాత్రమే ఇలా పిలువబడి యుండటం చూస్తాము. ఇది దేవుని కుమారునికి తల్లిగా ఆమె ఎన్నికను సూచిస్తుంది. అలాగే, మరియకు “దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సును ఒసగినట్లు” (ఎఫెసీ 1:3) సూచిస్తుంది. “అనుగ్రహ పరిపూర్ణురాలు” అనగా మరియ దేవుని జీవముతో, సాన్నిధ్యముతో నింపబడినది అని అర్ధం. దేవుని సాన్నిధ్యముతో పరిపూర్ణముగా నిండియున్నది కనుక, ఆమెలో పాపమునకు ఎలాంటి చోటు లేదు. ఆమె నిష్కళంక మాత. అదియే కృపావరం, వరప్రసాదము. మరియమ్మ వరప్రసాదముల మాత, ఎందుకన “కృపాసత్యములు యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి” (యోహాను 1:17). యేసుక్రీస్తు మన యొద్దకు వచ్చును; ఆ కృపానుగ్రహం (యేసుక్రీస్తు) మరియమ్మ ద్వారామన యొద్దకు వచ్చును. అందుకే ఆమె వరప్రసాదముల మాత, అమ్మ! వరప్రసాదముల మాతగా మరియమ్మను ధ్యానించినపుడు, ఆమె మనకు ఆ దేవుని కృపను గురించి, ప్రాముఖ్యత గురించి మనకు బోధిస్తుంది.

వరప్రసాదము అనగా ఏమి?

కృపావరం, వరప్రసాదము అనగా “దేవుని బిడ్డలమగుటకు, దత్తపుత్రులమగుటకు, దేవుని స్వభావములో, శాశ్వత జీవనములో భాగస్వాములమగుటకు పిలుపునిచ్చిన దేవునికి సమాధాన మివ్వటానికి ఆయన అందించే వరప్రసాదం, ఉచితార్ధం, అర్హతకు తగని సహాయమే కృపావరం (grace) అని, దేవుని జీవనములో పాలుపంచుకోవటమే కృపావరం అని సత్యోపదేశం (నం. 1996, 1997) బోధిస్తుంది. దైవకుమారుడు, లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తుకు తల్లి కావడానికి “ఆ పాత్రకు తగిన వరాలతో” దేవుడు ఆమెను దీవించాడు (సత్యోపదేశం, 490). మరియమ్మ దేవునితో లోతైన, స్థిరమైన, అతిసన్నిహిత సంబంధములో జీవించినది. దేవుని చిత్తానికి స్పందించక పూర్వమే దేవుడు ఆమెతో ఉన్నాడు – “ఏలినవారు నీతో ఉన్నారు” (లూకా 1:28) అని గాబ్రియేలు దూత పలికింది. మరియమ్మ దేవున్ని ఎన్నుకొనక మునుపే, దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు అని అర్ధమగు చున్నది.

మనమే దేవున్ని ఎన్నుకున్నామని కొన్నిసార్లు తప్పుగా భావిస్తూ ఉంటాము. ఈ విషయాన్ని యేసుక్రీస్తు యోహాను 15:16లో తన శిష్యులకు స్పష్టం చేసియున్నారు, “మీరు నన్ను ఎన్నుకొనలేదు. కాని, నేను మిమ్ము ఎన్నుకొంటిని”. కనుక, మనం దేవుని అనుగ్రహముచేత నింపబడి, నడిపింప బడుచున్నాము. దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటారు. మనమే ఆయనతో ఉండటము లేదు. తన ప్రేమచేత (యోహాను 3:16) దేవుడే మన చెంతకు వస్తారు, మనలను చేరదీస్తారు. ప్రభువే తన అనుగ్రహాన్ని మనకు దయచేస్తారు. మనము కేవలము ఆ దైవానుగ్రహాన్ని, కృపానుగ్రహాన్ని స్వీకరించు వారము మాత్రమే. ఆ కృపయే, మన మాటలో, చేతలో దేవునికి ప్రతిస్పందించడానికి, సమాధాన మివ్వటానికి, ‘అవును’ అని చెప్పటానికి కదిలిస్తుంది. దేవుడు “ఇమ్మానుయేలు” మనతో ఉన్నాడు. దేవుడు తన ప్రేమానుగ్రహములకు స్పందిస్తూ మన సమాధానం కొరకు ఎదురుచూచు చున్నాడు.

దేవుని కృపకు, అనుగ్రహమునకు సమాధాన మివ్వడములో, మనం మరియమ్మనుండి ఎంతో నేర్చుకోవచ్చు. గబ్రియేలు దూతతో మరియమ్మ అనుభవం మన అనుదిన జీవితములో ఎన్నో పాటాలను నేర్పుతుంది. మన జీవితములో కూడా దేవదూతలను గుర్తించడానికి, ఎలా ప్రతిస్పందించాలో నేర్చుకోవడములో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దేవుని అనుగ్రహాన్ని విశ్వసించువారికి నేటికీ దేవదూతలు ప్రత్యక్ష మవుతారు, కనిపిస్తారు, దేవునిచేత పంపబడతారు. అయితే, దానికొరకై మనం ఆధ్యాత్మిక కన్నులను తెరవాలి. దేవుని మంచితనము వలన, మరియతల్లి దేవుని కృపతో సహకారము వలన, మనము కూడా దేవుని కృపతో జీవించ గలుగుచున్నాము. మనం ఎల్లప్పుడు దేవుని కృపతో సహకరించాలి. పాపమును, సాతానును, దాని దుష్క్రియలను త్యజించాలి. పవిత్రముగా జీవించాలి. ఏడు దివ్యసంస్కారములు కూడాను ముఖ్యముగా జ్ఞానస్నానము, దివ్యసత్ప్రసాదము, పాపసంకీర్తనములు మనకు దేవుని కృపను ఒసగు మార్గాలు.

లూకా 1:26లో “తదుపరి ఆరవమాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను” అని చూస్తున్నాము. దేవదూతల ప్రత్యక్షత ఒక నిర్దిష్ట సమయములో జరుగునని లేదా దేవుడు నిర్ణయించిన సమయములో జరుగునని స్పష్టమగు చున్నది. మన స్వంత జీవితాలలో కూడా దేవుడు జోక్యం చేసుకోవడానికి తాను ఎంచుకున్న నిర్దిష్ట సమయములో తన దేవదూతలను పంపుతారు. అలాగే, లూకా 1:27లో “ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను” అని చదువుచున్నాము. అనగా ఒక నిర్దిష్టమైన వ్యక్తి (మరియ) దగ్గరకు పంపబడెను. ఆ వ్యక్తి రోజువారి జీవితములోని వాస్తవ పరిస్థితులలో, మానవ సంబంధాల మధ్యన పంపబడెను. దూతలు దేవుని సందేశాన్ని కలిగి ఒక నిర్దిష్ట సమయములో, ఒక నిర్దిష్ట పరిస్థితి అవసరతలో పంపబడతారు. “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు” (లూకా 1:28) అను దేవదూత శుభవచనము, దేవునితో సంబంధములోనికి ఆహ్వానిస్తున్నట్లుగా యున్నది. దూత పలుకులు చాలా నిర్దిష్టముగా ఉన్నాయి. మరియమ్మను ఆమె హీబ్రూ పేరుతో సంబోధించడం చూస్తున్నాము. అనగా దేవదూత పంపబడక మునుపే దేవునకు మరియమ్మ వ్యక్తిగతముగా తెలుసు మరియు ఆమెతో సత్సంబంధాన్ని కలిగియున్నాడని అని అర్ధం. అలాగే మనతో కూడా దేవుడు ప్రవర్తించును. గొప్ప హీబ్రూ కీర్తన కారుడు దావీదు పాడినట్లుగా:

“నాలోని ప్రతి అణువునునీవే సృజించితివి. మాతృగర్భమున నన్ను రూపొంచించితివి.
నీవు నన్ను అద్భుతముగ కలుగజేసిన భీకరుడవు. కనుక నేను నీకు వందనములు అర్పింతును.
నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. ఈ అంశము నాకు బాగుగా తెలియును.
నేను రహస్య స్థలమున రూపము తాల్చినపుడు, మాతృగర్భమున విచిత్రముగా నిర్మితుడనైనపుడు
నీ కంటికి మరుగై యుండలేదు.
నేను పిండముగా నున్నపుడే నీవు నన్ను చూచితివి. నాకు నిర్ణయింప బడిన రోజులన్నియు
అవి ఇంకను ప్రారంభము కాకమునుపే, నీ గ్రంథమున లిఖింపబడి యున్నవి” (కీర్త 139:13-16).

          మరియమ్మను “అనుగ్రహ పరిపూర్ణురాలు” అని దేవదూత సూచించినది. ఆమె నిజముగానే దేవుని అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందినది. పరలోక భూలోకముల ప్రభువు ఆమెను సారవంతమైన నేలగా సిద్ధంచేసి, ఎంచుకొని, తన వాక్యమగు విత్తనాన్ని నాటాడు. ప్రభువు మాటలకు, చిత్తానికి, ప్రణాళికకు ప్రతిస్పందించినపుడు, సమాధానం ఇచ్చినపుడు, మనము కూడా దేవుని అనుగ్రహముచేత నింపబడతాము. మన మనస్సులు పవిత్రముగా యున్నచో, యేసుక్రీస్తు మనలో కూడా జన్మిస్తాడు. ఆధ్యాత్మికముగా ఆయన మనలో వసిస్తాడు. బైబులులో మరియమ్మ గురించి చాలా తక్కువగా చెప్పబడింది. ఎందుకనగా, ఆమె తనకన్నా గొప్పవాడైన ప్రభువు యొక్క అద్దము, ప్రతిబింబము మాత్రమే కనుక! దేవుని అనుగ్రహముతో ఆమె నింపడినది. “ప్రభువు దాసురాలు” (లూకా 1:38) అయినది. పవిత్ర హృదయాలు కలిగిన సాధారణ ప్రజలను దేవుడు నూతన జీవితముతో నింపుతాడు. వారు దేవున్ని కలుసుకున్నప్పుడు, మరియమ్మవలె వారు దేవుని దయతో నింపబడతారు.

నజరేతు వాసియైన మరియమ్మ జీవిత సాక్ష్యముద్వారా పరమరహస్యము సులభతరం చేయబడింది. ఆమె ఫలభరితమైన జీవితాన్ని జీవించినది. పసిబిడ్డ అమాయకత్వము, మనస్తత్వముతోను జీవించినది. అందుకే ప్రభువు ఇలా అన్నారు, “ఓ తండ్రీ! పరలోక భూలోకములకు అధిపతీ! ఈ విషయములను నీవు జ్ఞానులకును, వివేకులకును మరుగుపరచి, పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు నీకు ధన్యవాదములు. ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము” (లూకా 10:21).

మరియమ్మ మనకు ఆదర్శమూర్తి: మరియమ్మ మనకు మార్గచూపరి. ఆమె దేవుని వాగ్దానాన్ని ఆలకించినది, విశ్వసించినది, అనుగ్రహముతో నింపబడినది, ప్రేమ స్వరూపుడైన దేవున్ని గర్భమున దాల్చినది. మనము కూడా ప్రార్ధన చేసినచో, దేవుని వాక్యాని, చిత్తాన్ని ఆలకించినచో, దేవునికి ‘అవును’ అని సమాధానం ఇచ్చినచో, మనముకూడా మరియమ్మవలె జీవించగలము. అలా చేసినప్పుడు, ‘దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు’ (లూకా 1:37) అని మరియమ్మవలె గుర్తించ గలము. మనము దేవుని అనుగ్రహముతో నింపబడి, యేసుక్రీస్తును ఇంకా అవసతలోనున్న ఈ లోకములోనికి, మరియమ్మవలె తీసుకొని రాగలము.

వరప్రసాదముల మాత చిత్ర పటము – చరిత్ర

శ్రీసభ ఆరంభము నుండి కూడా అద్భుత వరములు కలిగిన మరియమ్మ చిత్ర పటాలు, స్వరూపాలు ఉన్నాయి. సాంప్రదాయం ప్రకారం, మొట్టమొదటిగా మరియమ్మ పటాన్ని గీసినది సువార్తీకుడు పునీత లూకాగారు. అనాధి కాలము నుండి కూడా కన్యమరియమ్మ చిత్రాలను, స్వరూపాలను ప్రపంచ వ్యాప్తముగా ఎంతోమంది చేత పెయింటింగ్ చేయబడ్డాయి, రూపొందించ బడ్డాయి. వీటిలో కొన్ని, అద్భుత మధ్యస్థ వేడుదల ద్వారా ఎంతగానో ప్రసిద్ధి గాంచాయి. ఆలాంటి వాటిలో ‘వరప్రసాదముల మాత’ (అవర్ లేడి అఫ్ గ్రేస్) చిత్ర పటము ఒకటి. దీనిని ‘అవర్ లేడి అఫ్ బౌవ్డ్ హెడ్’ అని కూడా పిలుస్తారు. ఇది ఆస్ట్రియా దేశములోని వియన్నా నగరములోని కార్మలైట్ ఆశ్రమ దేవాలయములో ఉన్నది.

          ఫాదర్ దోమినిక్ అను ఒక కార్మలైట్ సన్యాసి దీనిని రోమునగరములో 1610లో కనుగొన్నాడు. అతను కార్మలైట్ మఠముగా మార్చాలనుకుంటున్న ఒక పాడుబడిన ఇంటిని చూసుకుంటూ ఉన్నాడు. ఆ ఇంటిముందు నడుస్తూ ఉండగా ఒక చెత్తకుప్పలో పడియున్న మరియమ్మ చిత్ర పటము ఒకటి ఆయన కంట బడింది. ఇంత అందమైన చిత్ర పటాన్ని ఎవరు చెత్తకుప్పలో పడేసారు అని ఆశ్చర్యపోయి, బాధపడి మరియమ్మకు క్షమాపణలు చెప్పి, దానిని తీసుకెళ్ళి మఠములోని తన గదిలో పెట్టుకున్నాడు. ఒకరోజు పటముపై నున్న దుమ్మును తుడుస్తూ ఉండగా, మరియమ్మ ముఖము సజీవముగా, నవ్వుతూ కనిపించినది. ఇలా అనేకసార్లు ఫాదర్ దోమినిక్ గారికి కనిపించి, తన సందేశాలను వినిపించినది. ఉత్తరించు స్థలములోనున్న ఆత్మల కొరకు పూజా ప్రార్ధనలు పెట్టించాలని, నా బిడ్డలు రక్షణ పొందుటకు కావలసిన వరములను పొందునట్లు చేయుదునని తెలియ జేసింది. ఇంకా, నా సంరక్షణను కోరువారి, భక్తితో ఈ పటాన్ని గౌరవించేవారి ప్రార్ధనలకు సమాధానం, అనేక వరప్రసాదములను పొందుదురని, ముఖ్యముగా ఉత్తరించు స్థలములోనున్న ఆత్మల విడుదల కొరకు ప్రార్ధించే వారి విన్నపాలకు ప్రత్యేక శ్రద్ధను చూపుతానని తెలియ జేసింది.

          అందుకే, ఫాదర్ దోమినిక్, ఆ చిత్ర పటాన్ని రోమునగరములోని ‘సాంత మరియ అల్లా స్కాల’ (Santa Maria alla Scala in Trastevere, Rome) దేవాలయానికి అనుబంధముగా నున్న పునీత చార్లెస్ చిన్న గుడిలో ఉంచాడు. అనేకమంది ఈ చిత్రపటము ముందు ప్రార్ధన చేసారు. అది అనేక వరప్రసాదములకు మూలం అయినది. ఫాదర్ దోమినిక్ మరణించు వరకు అనగా 16 ఫిభ్రవరి 1630వ సం.రం వరకు అది అక్కడే ఉంచబడింది. ఆ తరువాత కొంతకాలము రాజుల కొలువులో ఉన్నతరువాత, కార్మలైట్ మఠవాసినుల దగ్గర ఉంచబడింది. ఆతరువాత 1655వ సం.లో తిరిగి కార్మలైట్ మఠవాసులకు అప్పజెప్పడం జరిగింది. కాలక్రమేనా, వియన్నా పట్టణములో (Silbergasse, 35) నూతన దేవాలయము, మఠము నిర్మించబడటముతో, అద్భుత శక్తిగల వరప్రసాదముల మాత చిత్రపటమును 14 డిసంబరు 1901న నూతన దేవాలయములోనికి మార్చబడినది. 27 సెప్టెంబరు 1931న వియన్నాలో 300ల శతాబ్ద వేడుకలను ఘనముగా కొనియాడారు. ఆ సందర్భముగా, 11వ భక్తినాధ జగద్గురువులు చిత్రపటానికి కిరీటాన్ని అలంకరింప జేశారు.

          వరప్రసాదముల మాత మధ్యస్థ ప్రార్ధనను వేడుకొనడం అనగా, ‘దేవునికృప’ అయిన యేసుక్రీస్తు ప్రభువు మనకు అవసరమని గుర్తించడం! మరియతల్లి ద్వారా ఆ దేవుని కృప కొరకు ప్రార్ధన చేయడమే! లోకానికి వెలుగు శ్రీసభ అను చట్టములో ఈవిధముగా చదుచున్నాము, “దేవుని కృపావర శ్రేణిలో తొలి వరుసలో నిలుస్తుంది” మరియ (నం. 61). “నేటికీ ఆ దేవమాత మనలోని ప్రతి ఒక్కరికోసం ప్రార్ధిస్తూ మనకు నిత్యజీవ బహుమానాలను సంపాదించి పెడుతుంది” (నం. 62). 

గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్ర నూరు వసంతాల వేడుకలు (1924-2024)

గుణదల లూర్దుమాత పుణ్యక్షేత్ర నూరు వసంతాల వేడుకలు (1924-2024)
ఫాదర్ ప్రవీణ్ గోపు OFM Cap.
పెద్దావుటపల్లి
కానా పల్లెలో పెండ్లి సందర్భముగా, కుటుంబములోని అవసరతను మొదటగా గుర్తించిన మరియతల్లి సేవకులతో “ఆయన చెప్పినట్లు చేయుడు” (యోహాను 2:5) అని చెప్పడం వలన యేసు తన మొదటి సూచక క్రియను ప్రదర్శించాడు. ఆ పరలోకతల్లి అవసరత నేటికీ మనకు అవసరమనే, తండ్రి దేవుడు అప్పుడప్పుడు మరియతల్లి దర్శనాలను కలుగజేస్తున్నాడు. 11 ఫిబ్రవరి 1858లో మరియమాత ఫ్రాన్స్ దేశములోని లూర్దునగరములో దర్శన మిచ్చి, దైవకుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించమని కోరియున్నది. పాప జీవితానికి స్వస్థిచెప్పి, పుణ్య జీవితాన్ని జీవించమనేదే ఆమె సందేశం. ఫ్రాన్స్ దేశములోని లూర్దునగరములో దర్శనమిచ్చిన లూర్దుమాత పేరున వెలసిన గుణదల మాత పుణ్యక్షేత్రం కూడా అట్టిదే. మనం పొందుకున్న గొప్ప దైవానుగ్రహం. అట్టి గుణదల పుణ్యక్షేత్రం, 2024లో నూరువసంతాల జూబిలీ వేడుకలను కొనియాడుచున్నది. భారతావనిలోని క్రైస్తవ పుణ్యక్షేత్రాలలో రెండవ అత్యంత ప్రజాదరణ పొందుతున్న పుణ్యక్షేత్రం. ఎక్కువగా సందర్శించే దేవాలయాలలో గుణదల మరియమాత దేవాలయము ఒకటిగా పేరుగాంచినది. ఎన్నో లక్షల విశ్వాసులు, భక్తులు, యాత్రికులు, ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి, మరియమాత ద్వారా దేవున్ని దర్శించ గలుగుతున్నారు.
గుణదల మరియమాత మహోత్సవాలను ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఘనముగా కొనియాడుతారు. అయితే, 2024వ సంవత్సరములో ఈ పుణ్యక్షేత్రానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఎందుకన, నూరువసంతాల వేడుకలను ఈ పుణ్యక్షేత్రం కొనియాడు చున్నది.
మోన్సిగ్నోర్ H. పెజ్జోని గుణదలలో 1923లో స్థలాన్ని పొందారు. మొదటిగా 15 జూన్ 1924న సెయింట్ జోసఫ్ అనాధాశ్రమం, తరువాత పారిశ్రామిక పాఠశాల ప్రారంభించడం జరిగింది. ఇది అప్పటి బెజవాడ విచారణకు జోడించబడినది. గుణదల సంస్థల ప్రధమ మేనేజరుగా రెవ. ఫాదర్ P. అర్లాటి 1924లో నియమించ బడినారు. బాధ్యతలు చేపట్టిన రోజునుండే ఎన్నోకష్టాలను, ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నారు. స్థలాన్నంతా శుభ్రంచేయించారు. మంచి నీటికోసం బావిని త్రవ్వించారు.
సంస్థలకు మరియమాత ఆశీర్వాదాలు, సంరక్షణ పొందేందుకు రెవ. ఫాదర్ P. ఆర్లాటి 1924లో కొండపైన సహజ సిద్ధమైన ప్రదేశములో మరియమాత స్వరూపాన్ని నెలకొల్పారు. ఇదే గుణదల మరియమాత భక్తికి నాంది పలికింది. 1931లో దేవాలయమును నిర్మించారు. 1933లో గుణదల సంస్థల ప్రధమ శతాబ్ది పూర్తిచేసుకున్న సందర్భముగా, రెవ. ఫాదర్ P. అర్లాటి గుణదల కొండ అంచుపై 18 అడుగుల ఎత్తైన ఇనుప సిలువను ఏర్పాటు చేసారు. సిలువ యొద్దకు మరియమాత గుహనుండి వెళ్ళాల్సి ఉంటుంది. కనుక TO JESUS THROUGH MARY (మరియమాత ద్వారా యేసు చెంతకు) అన్న సత్యాన్ని చక్కగా మనకు స్పురిస్తుంది. ఇది కతోలిక బెజవాడకు గర్వకారణమైనది.
1937 నాటికి గుణదల పండుగ మేత్రాసణ పండుగగా ప్రసిద్ధి గాంచినది. 1937లో, రెవ. ఫాదర్ P. అర్లాటి, ప్రస్తుతం గుణదల కొండపై చూస్తున్న, 300 కిలోల బరువుగల మరియమాత స్వరూపాన్ని ఇటలీ దేశమునుండి తీసుకొని వచ్చి నెలకొల్పడం జరిగింది. ఆ రోజు స్వరూపాన్ని బెజవాడ పురవీధులలో ఊరేగింపుగా తీసుకెళ్ళి గుహలో ప్రతిష్టించడం జరిగింది.
1944-1946 మధ్యకాలములో, సహజ సిద్ధముగా కనిపించే గుహను, అలాగే, దివ్యపూజలు సమర్పించడానికి, గుహముందు బలిపీఠము నిర్మించడం జరిగింది. అప్పటినుండి, ప్రతీసంవత్సరం లూర్దుమాత పండుగను స్థానిక కతోలిక క్రైస్తవులతో కలిసి కొనియాడటం జరుగుతుంది. కొండపైన మరియమాత గుహవరకు ప్రదక్షిణగా వెళ్లి, అక్కడ దివ్యపూజా బలిని సమర్పిస్తారు. గుహకు వెళ్ళుమార్గములో పదిహేను జపమాల రహస్యాలను చిత్రపటాలతో బహుసుందరముగా ఏర్పాటు చేయబడ్డాయి. 1951లో యాత్రికుల మరియమాత స్వరూపమును దగ్గరకు వెళ్ళుటకు, కానుకలు చెల్లించుటకు మెట్లమార్గము ఏర్పాటు చేయబడినది. అలాగే, గుహపైన అందమైన తోరణం నిర్మించడమైనది. 1971లో నూతన దేవాలయం నిర్మించడ మైనది.
కాలక్రమేణ, గుణదల పుణ్యక్షేత్రములో అనేక వసతులు ఏర్పాటు చేయబడ్డాయి. బిషప్ గ్రాసి స్కూల్ ఆవరణలో, పూజ, సాంస్కృతిక కార్యక్రమాల కొరకు పెద్ద వేదిక నిర్మించడమైనది. యాత్రికుల బస కొరకై షెడ్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయబడ్డాయి. కొండపైన విద్యుత్, మంచినీటి వసతులు కల్పించ బడ్డాయి. కొండపైకి సులువుగా చేరుకోవడానికి మరిన్ని మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయి. మరియమాత గుహనుండి సిలువ వరకు సిలువమార్గము ప్రతిమలతో ఏర్పాటు చేయబడినది.
గుణదల పుణ్యక్షేత్ర సందర్శనలో కొన్ని ప్రాముఖ్యమైనవి: యాత్రికులు తలనీలాలు సమర్పించడం. తలనీలాలు త్యాగానికి గురుతు. మరియమాత మధ్యస్థ ప్రార్ధనలద్వారా పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని, అలాంటి శక్తులు గుణదల మరియ మాతకు ఉన్నట్లు ప్రజల విశ్వాసం, నమ్మకం. మరియమాతకు కొబ్బరికాయలు, పూలు సమర్పిస్తారు. పేరుకు తగ్గట్టుగానే, గుణదల లూర్దుమాత స్వస్థతకు మరోపేరుగా ప్రసిద్ధి చెందినది. గుణదల మాతగా భక్తులపై స్వస్థత, కృపానుగ్రహ జల్లులను కురిపిస్తుంది. నిజమైన, దృఢమైన విశ్వాసముతో ప్రార్ధించే వారిని గుణదల మరియమాత ఎప్పటికీ విడిచి పెట్టదు. ఆమె దయగల హృదయాన్ని గ్రహించిన భక్తులు, విశ్వాసులు ఏడాది పొడవునా పుణ్యక్షేత్రాన్ని సందర్శించి మరియమాత ఆశీర్వాదాలను పొందుతూ ఉంటారు.
11 ఫిభ్రవరి 2024న గుణదల పుణ్యక్షేత్రం నూరువసంతాల వేడుకలను ఘనముగా కొనియాడుచున్నది. ఇది విజయవాడకు, తెలుగు రాష్ట్రాల క్రైస్తవులకు, యావత్ కతోలిక శ్రీసభకు గర్వకారణం! ఈ సందర్భముగా, గుణదలలో వెలసిన లూర్దుమాత స్వరూపాన్ని విజయవాడ మేత్రాసణములోని అన్ని గురుమండలాలకు ప్రదక్షిణగా తీసుకొని వెళ్ళుచున్నారు. దివ్యపూజలు అర్పిస్తున్నారు. ప్రతీచోట, వేలమంది భక్తులు స్వరూపాన్ని సందర్శించి దీవెనలను పొందుచున్నారు. భూలోకములో అమ్మ అంటే మనందరికీ ఎంతో ప్రేమ, అనురాగం, ఇష్టం. అలాగే పరలోకములోకూడా మనందరికీ మరియతల్లి రూపములో ఒక అమ్మ ఉన్నదని మనదరం సంతోషపడాలి. గుణదల మరియ మధ్యస్థ ప్రార్ధనలద్వారా దేవుడు మనలనందరినీ దీవించునుగాక!

నిత్యసహాయమాత మహోత్సవము

 నిత్యసహాయమాత మహోత్సవము

క్రీస్తునందు ప్రియ సహోదరీ సహోదరులారా! చాలామంది ఈ దివ్యపూజలో పాల్గొంటున్నారు. మరియతల్లిపై, ముఖ్యముగా నిత్యసహాయమాతపై మీకున్న ప్రేమ ఎంత గొప్పదో అర్ధమగుచున్నది. మరియతల్లి యొక్క రక్షణ, సంరక్షణపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి ఇది గొప్ప సూచనగా యున్నది. యోహాను సువార్త 19వ అధ్యాయములో చూస్తున్నట్లుగా, సిలువపైనున్న యేసు తన శిష్యునితో “ఇదిగో నీ తల్లి” అని పలికాడు. “శిష్యుడు ఆ గడియనుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసికొని పోయెను” (19:27). మనముకూడా ఆ శిష్యునివలె చేయాలి. మరియ మనందరికీ తల్లి, అమ్మ. కనుక, ఈ సమయమున యేసు మనందరితోకూడా “ఇదిగో నీ తల్లి” అని చెప్పుచున్నాడు. అప్పుడు మనం ఏమి చేయాలి? మరియ తల్లిని మన ఇంటికి తీసుకొని పోవాలి. అనగా, ఆమె విశ్వాసాన్ని, నమ్మకాన్ని, ధైర్యాన్ని, పవిత్రతను, భక్తిని, ఆధ్యాత్మికతను, ప్రార్ధన జీవితాన్ని, సంతోషాన్ని, సేవాజీవితాన్ని, విశ్వసనీయతను, ప్రేమను, మాతృత్వాన్ని, సరళతను, దైవవాక్కును మరియు ఆ తల్లిద్వారా మనం పొందుకునే నిత్యసహాయాన్ని మనం తీసుకుని పోవాలి.

నిత్యసహాయమాత ప్రాచుర్యములోనికి వచ్చినది, నిత్యసహాయమాత చిత్ర పటము వలన. ఆ పటము యొక్క చరిత్రను మీకు క్లుప్తముగా వివరిస్తాను. అది...1498వ సం.ములో గ్రీసు దేశములోని క్రీటు అనే ద్వీపములోని ఒక దేవాలయములో కొంతకాలముగా ఈ చిత్రపటము ఉండేది. దీనికి అద్భుతమైన పటముగా పేరు. ఒకరోజు ఒక వ్యాపారి, ఆ ఫోటోను దొంగిలించి, తనతో తీసుకొని వెళ్ళాడు. ఒక సం.రం తతువాత ఆ వ్యాపారి రోము నగరానికి వెళ్ళాడు. అచట తీవ్రమైన జబ్బుకు గురై మరణావస్థలో ఉండగా, రోమునగరములో తన స్నేహితున్ని పిలచి ఆ చిత్ర పటము గురించి చెప్పి, దానిని బహిరంగముగా అందరు దర్శించడానికి వీలుగా ఉండే ఏదైనా ఒక దేవాలయములో ఉంచమని కోరతాడు. అతడు మరణించిన తరువాత, ఆ స్నేహితుడు దానిని తన యింటికి తీసుకొని వెళ్ళగా, ఆయన భార్య దానికి వారి యింటిలోనే ఉంచుతుంది. మరియతల్లి అనేకసార్లు ఆ వ్యక్తికి దర్శనం యిచ్చి అ చిత్ర పటాన్ని అక్కడనుండి తీసివేయమని చెప్పిన వినలేదు. చివరికి, మరియతల్లి 6 సం.ల అతని కుమార్తెకు దర్శనమిచ్చి చెప్పడముతో, అలాగే ఆ వ్యక్తికూడా వ్యాధిబారిన పడటముతో, 27 మార్చి 1499న, ఆ పటాన్ని రోమునగరములోని పునీత మత్తయి దేవాలయములో ఉంచడం జరిగింది. అప్పటినుండి దాదాపు మూడు వందల సం.లు అక్కడే ఉంది. ఎంతోమంది ఆ పటాన్ని దర్శించి, ఎన్నో అద్భుత మేలులను పొందటం జరిగింది. అయితే, 1798వ సం.లో ఫ్రెంచ్ సైన్యం రోమునగరాన్ని ఆక్రమించుకొని 30 దేవాలయాలను కూల్చివేయాల్సిందిగా నిర్ణయించారు. దానిలో పునీత మత్తయిగారి దేవాలయము కూడా ఒకటి. అందుకే ఆ పటాన్ని దగ్గరలోనున్న పునీత యూసేబియో దేవాలయములోనికి మార్చడం జరిగింది. అక్కడ దాదాపు 20 సం.లపాటు ఉంచడం జరిగింది. 1818వ సం.లో అక్కడ నుండి పునీత మరియ అనే దేవాలయములోని మార్చబడింది. చివరిగా 1866వ సం.లో పునీత మత్తయిగారి దేవాలయ స్థలములో నిర్మించబడిన పునీత అల్ఫోన్స్ లిగోరి దేవాలయమునకు మార్చడం జరిగింది.

క్రీ.శ.1808లో 7వ భక్తినాధ జగద్గురువులను నియంత అయిన నెపోలియన్ నిర్భందించి జైలులో పెట్టించాడు. నెపోలియన్, దేవుడంటే నమ్మని పాషాణ హృదయుడు, తన శక్తియుక్తులే కాని దైవశక్తి సహాయం అంటూ ఏదిలేదని చెప్పిన అహంభావి. అయితే లీప్ జిగ్యుద్దం ముగిశాక నెపోలియన్ జగద్గురువులను విడుదలచేశాడు క్రీ.శ. 1814లో జగద్గురువులు విజయోత్సాహంతో విశ్వాసుల జయజయ ధ్వానాలమద్య రోమునగర పేతురు సింహాసనం తిరిగి అధిష్టించారు.

 అయితే వందవరోజు నెపోలియన్ ఆటకట్టు అయ్యింది. సంకీర్ణ సేనలు ‘వాటర్లూ’ యుద్ధంలో నెపోలియన్ సైన్యాన్ని ఓడించి తరిమికొట్టాయి. క్రీ.శ.1815లో నెపోలియన్ పీడవిరగడై క్రైస్తవ మతాధిపతులకు భయం గుప్పిటనుండి బైటపడినట్లయ్యింది. ఈ సందర్భంగా 7వ భక్తినాధ జగద్గురువులు దేవునితల్లి అయిన మరియతల్లికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించారు. తాము చెరనుండి విడుదలైన వార్షికోత్సవం రోజున క్రైస్తవులయొక్క సహాయమాత ఉత్సవాన్ని ప్రకటించి ఘనంగా ఆ తల్లిని కొనియాడారు. ఆరోజు నుండి కూడా ఈ పండుగ తల్లి శ్రీసభలో కొనసాగుతూ ఉన్నది.

నిత్యసహాయమాత ఫోటోను మనం చూసినట్లయితే, ముందుగా మరియతల్లి కళ్ళను మనం గమనించాలి. ఆ ఆమె తన కళ్ళను పెద్దవిగా చేసి మనలనే చూస్తూ ఉన్నది. ఆమె చల్లని చూపు ఎంతో ప్రేమతో కలిగిన చూపుగా మనం గమనించవచ్చు. ఆమె కుడిచేయిని బాలయేసు తన రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నట్లుగా చూస్తాం. మరియ మనవైపు చూస్తూనే, తన కుడి చేయి బాలయేసును చూపిస్తూ మనకు సైగ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. దాని అర్ధం ఏమిటంటే, ఆ తల్లి మనలను యేసు వద్దకు నడిపిస్తుంది.

కానా పల్లెలో పెండ్లిలో ద్రాక్షారసం అయినప్పుడు చేసినట్లే, ఇప్పుడు కూడా చేస్తుంది. యేసువైపునకు మనలను సూచిస్తుంది. అక్కడనున్న సేవకులతో “ఆయన చెప్పినట్లు చేయుడు” (యో 2:5) అని చెప్పింది. నిత్యసహాయమాత ఈరోజు మనదరితోకూడా చెప్పేది ఇదే, “ఆయన చెప్పినట్లు చేయుడు”. ఈవిధముగా, మరియతల్లి “మార్గము, సత్యము, జీవము” (యో 14:6) అయిన యేసు చెంతకు మనలను నడిపిస్తుంది. పరలోకమునకు, నిత్యజీవమునకు నడిపించు మార్గము యేసు క్రీస్తు ప్రభువు వైపునకు మనలను నడిపిస్తుంది. తండ్రి దేవుని యొద్దకు మనలను నడిపించు మార్గము యేసు క్రీస్తు ప్రభువు.

“నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు” (యో 14:6) అని ప్రభువు పలికియున్నారు. ఈ విషయం మరియ తల్లికి తెలుసు కనుక, ఆమె, “మార్గము, సత్యము, జీవము” అయిన యేసు చెంతకు మనలను నడిపిస్తుంది. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను...నిత్య జీవమును పొందుటకై అటుల చేసెను (యో 3:16). ఈ విషయం మరియ తల్లికి తెలుసు కనుక, మనలను ఈ దేవుని కుమారుని చెంతకు నడిపిస్తుంది.

దేవుడు తన దయను మరియ తల్లిద్వారా మనకు ప్రకాశింప జేయుచున్నాడు. మరియ తల్లి గర్భమున ఉద్భవించి, దివ్యబాలయేసుగా, ఆమె చేతులలో, ఒడిలో పెరిగి లోక రక్షకునిగా ఆవిర్భవించాడు. జ్ఞానస్నానములో దయతో మనలను పాపమునుండి రక్షిస్తాడు. దివ్యసత్ప్రసాదమును స్వీకరించినపుడు దయతో మనలను పోషిస్తున్నాడు. పాపం చేసినపుడు పాపసంకీర్తనం ద్వారా ఆయన వద్దకు వస్తున్నాము. దయతో మన పాపములను క్షమిస్తున్నాడు. తద్వార, మరల మనం ఆ మార్గములో ఉంచబడుతున్నాము. శాంతి, సంతోషముగల పరలోకమునకు, నిత్యజీవమునకు నడిపించ బడుచున్నాము. ఇలా జీవించ గలగడానికి, మరియ తల్లి మనకు సహాయం చేస్తుంది. నిత్యమూ సహాయం చేస్తుంది.

ఇంకా చిత్ర పటములో ఆసక్తికరమైన మరొక అంశం ఏమిటంటే, ఇద్దరు దేవదూతలు (గబ్రియేలు దేవదూత, మైకేల్ దేవదూత). ఒక దేవదూత సిలువను మోసుకొని వస్తూ ఉన్నది. ఇంకొక దేవదూత పులిసిన ద్రాక్షారసములో ముంచిన స్పాంజ్’ను మోసుకొని వస్తూ ఉన్నది. ఈ రెండు సూచనలు క్రీస్తు శ్రమలకు సూచనలు. యేసుక్రీస్తు మనకోసం, మన పాపముల నిమిత్తం శ్రమలను అనుభవిస్తాడు అన్నదానికి సూచనగా యున్నది.

యేసు ఎందుకు మనకోసం శ్రమలను అనుభవించాడు? ఎందుకన, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయన శ్రమలద్వారా మనం పాపమునుండి విముక్తిని పొందుచున్నాము. ఆయన శ్రమలద్వారా, దేవుని కృపానుగ్రహము లోనికి మనం పునరుద్దరింప బడుచున్నాము.

ఈవిధముగా, నిత్యసహాయమాత చిత్ర పటము మన క్రైస్తవ విశ్వాసాన్ని తెలియ బరుస్తుంది. యేసు మన “మార్గము” అని తెలియజేస్తుంది. ఆయన మనకోసం శ్రమలను అనుభవించాడని, తద్వారా మనకు రక్షణను, నిత్యజీవితమును ప్రసాదించాడని తెలియజేస్తుంది. ఈరోజు ఎన్నో మనవులతో మరియతల్లి చెంతకు వచ్చియున్నాము. మరియతల్లి ఏవిధముగానైతే దివ్యబాల యేసును తన చేతుల్లో పట్టుకొని యున్నదో, మనలనుకూడా తన చేతుల్లోనికి తీసుకొని తండ్రి దేవునికి సమర్పించమని కోరుదాం. చిన్నారి బాల యేసును రక్షించిన విధముగా, మనలనుకూడా రక్షించి, పరలోక తండ్రికి అందజేయమని ప్రార్ధన చేద్దాం.

“నిత్యసహాయమాత” అనే పేరు స్వయముగా మరియ తల్లియే ఎన్నికోవడం జరిగింది. ఎందుకంటే, మన ప్రతీ అవసరములో విశ్వాసముతో, నమ్మకముతో ఆ తల్లి చెంతకు రావాలని.

అలాగే, “నిత్యసహాయమాత” ఫోటోపై ఉన్న పేర్ల గురించి తెలుసుకుందాం. “దేవునితల్లి” అని వ్రాయబడి యుండటం మనం చూస్తాము. ఆమె యేసుని తల్లి. మనదరికే తల్లి. ఒక అమ్మగా మనకు సహాయం చేస్తుంది. “నిత్యమూ” అని చూస్తున్నాము, అనగా ఎల్లప్పుడు, అన్నివేళల అని అర్ధం. మరియతల్లి మనకు ఎల్లప్పుడు, నిత్యమూ తోడుగా యుండి, మనలను యేసు చెంతకు రమ్మని ప్రోత్సహిస్తూ ఉంటుంది అని అర్ధం. మరియ తల్లి మధ్యస్థ ప్రార్ధనల ద్వారా నిత్యమూ మనం దేవుని సహాయం పొందుతామని అర్ధం. “సహాయం” మరియ భక్తులము, బిడ్డలమైన మనందరమూ చేసెది అదే నిత్యమూ ఆమె సహాయం కొరకు వేడుకుంటాము. మనకు ఎల్లప్పుడు దేవుని సహాయం మనకు ఎంతో అవసరం. ఆయన లేకుండా మనం జీవించలేము. దేవుని సహాయం కొరకు, మరియమ్మ సహాయం కూడా మనకు ఎంతో అవసరమని తెలియ జేస్తుంది.

నిత్యసహాయము: ఈ మూడు పేర్లను గురించి తెలుసుకున్న తరువాత, నిత్యసహాయము ఎవరు అంటే మీరు ఏమి చెప్తారు? వెంటనే మన సమాధానం మరియతల్లి అని చెప్తాం! సహాయానికి, ఆశీర్వాదాలకు మూల మరియతల్లి అని అనుకుంటాం! కాని మరియ నిత్యసహాయమునకు మాత, అమ్మ అని మనం గుర్తించాలి. మరియ దేవుని తల్లి అయితే, యేసు క్రీస్తు నిత్యసహాయానికి మూలం.

నిత్యసహాయము అనేది శాశ్వతమైన, అనంతమైన దేవుని ప్రేమనుండి వస్తుంది. మరియతల్లి దేవుని శాశ్వతమైన, అనంతమైన ప్రేమను పొందింది. కనుక, మనం మరియ తల్లిని చూసినప్పుడు, మన జీవితాలుకూడా ఆ దేవుని శాశ్వతమైన, అనంతమైన, షరతులు లేని ప్రేమతో నింపబడాలని చూడాలి.

4 వ సామాన్య ఆదివారము, Year B

4 వ సామాన్య ఆదివారము, Year B
దేవుని వాక్కు శక్తి గలది: ఆలకింపుము - యేసు ఆ వాక్కును అధికారముతో బోధించెను
ద్వితీ 18: 15-20; భక్తి కీర్తన 95: 1-2, 6-9; 1 కొరి 7: 32-35; మార్కు 1: 21-28

ఉపోద్ఘాతము: దేవుని వాక్కు శక్తిగలది
"మా కర్తయగు ఓ సర్వేశ్వరా! మమ్ము అన్ని దేశములనుండి రప్పించి తిరుగ ఏకము చేయుడు. అపుడు మేము మీ నామ సంకీర్తనము చేయుచు మీకు ప్రస్తుతి చేయుటలో ఆనందము కలిగియుందుము".
గతవారం, "కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది, సువార్తను విశ్వసింపుడు" (మార్కు 1:14) అంటూ యేసు దైవరాజ్యమును ప్రకటించియున్నాడు.  ఈ వారం యేసు తన సువార్తా వాక్య బోధనద్వారా, తన అధికారముతో, శక్తితో వాక్యమును బోధించి, వాక్య శక్తిని ఋజువు చేయుటకు దయ్యము (అపవిత్రాత్మ) పట్టిన వానికి స్వస్థతను చేకూర్చాడు. సాతానును గద్దించి పారద్రోలుచున్నాడు. దేవుని వాక్యం మన మధ్యలోనికి అనేక విధాలుగా వచ్చును. "దేవుని వాక్యం సజీవమును, చైతన్యవంతమునైనది. అది కత్తివాదరకంటే పదునైనది. జీవాత్మల సంయోగస్థానము వరకును, కీళ్ళు మజ్జ కలియు వరకును, అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను, ఆలోచనలను, అది విచక్షింపగలదు" (హెబ్రీ 4:12). దేవుని వాక్యం, మన హృదయములోనికి దూసుకొని పోగలదు. మన ఆలోచనలను, మన జీవితాలను మార్చగలదు. మనలను శుద్ధులను గావించి, మనలోని పాపమును తొలగించగలదు. ఈలోక విలువలకు వ్యతిరేకముగా, దైవరాజ్య విలువల వైపునకు మనలను నడిపించ గలదు. దేవుని వాక్యమునకు పాపోశ్చరణ శక్తిగలదు. మనలోని విభేధములను తొలగించి, ఒకటిగా చేయగలదు.
మొదటి పఠనము: దేవుడు పంపు ప్రవక్త బోధను ఆలకింపుము
మోషే ప్రవక్త (క్రీ.పూ 13వ శతాబ్దం) ఇశ్రాయేలు ప్రజలకు తన చివరి వీడ్కోలు సందేశమును ఇస్తున్నాడు. వాగ్ధత్తభూమిలోనికి ప్రవేశించు వారికి, వారిని నడిపించుటకు, జీవిత మార్గమును చూపుటకు దేవునివాక్యం వారితో ఎల్లప్పుడు ఉంటుందని చెప్పాడు. తన మరణం తర్వాత, దేవుడు వారిని విడచి వేయక వారితో తన ప్రవక్తలద్వారా మాట్లాడతాడని అభయాన్ని ఇచ్చాడు. మోషే ప్రవక్తను ఆలకించిన విధముగా, రాబోవు ప్రవక్తలను, వారి ప్రవచనాలను ఆలకించాలి. ప్రవక్తలను నిర్లక్ష్యము చేసిన యెడల, వారి జీవితాలు ప్రమాదములో పడిపోతాయి. యోర్దాను నది దాటి, వాగ్ధత్త భూమిలోనికి ప్రవేశించిన తర్వాతకూడా, దేవునికి విధేయులై జీవించడం చాలా ముఖ్యమని వారికి మోషే గుర్తుకు చేస్తున్నాడు. దేవుని ఒప్పందాలకు విశ్వాసపాత్రులుగా జీవించిన యెడల, వారు అనేక దైవవరములను పొందెదరు. నిబంధనలను ఉల్లంఘించిన యెడల వారికి కష్టాలు తప్పవు. ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఉన్నపుడు, వారికి దేవుడు ఎలా అవసరపడి యున్నాడో, అలాగే, వాగ్ధత్త భూమిలో కూడా, దేవుని అవసరం, సహాయం, శక్తి వారికి అవసరమని వారు గుర్తుంచుకోవాలి. అనేక ప్రవక్తలద్వారా వచ్చు దేవుని సందేశమును, వాక్యమును శ్రద్ధగా ఆలకించి, పాటించాలి.
ఈవిధముగా మోషే, భవిష్యత్తులో రాబోవు గొప్ప ప్రవక్త, రక్షకుడైన యేసు క్రీస్తును గూర్చి ప్రవచిస్తున్నాడు. "నీ వంటి ప్రవక్తనొకనిని వారి జనము నుండియే వారిచెంతకు పంపుదును. అతనికి నా సందేశమును ఎరిగింతును. నేను చెప్పుము అనిన సంగతులన్నియు అతడు వారితో చెప్పును" (ద్వితీ 18:18). క్రీస్తునందు ఈ ప్రవచనం నెరవేరినది. క్రీస్తుద్వారా మనం నిజమైన వాగ్ధత్తభూమికి (పరలోకం, నిత్యజీవము) నడిపించ బడుచున్నాము. కనుక దేవుని చిత్తమును, సత్యమును బయలుపరచు నిజ ప్రవక్తల బోధనలను శ్రద్ధగా ఆలకించాలి.
రెండవ పఠనము: వివాహితుల బాధ్యతలు
దేవునిచేత ప్రత్యేకముగా ఒసగబడిన పిలుపును విశ్వాసముతో జీవించాలని, పునీత పౌలుగారు బోధిస్తున్నారు. ప్రత్యేక పిలుపు అనేది కేవలం అవివాహితులకు మాత్రమేగాక, వివాహితులకుకూడా అని గుర్తించాలి. సకల విచారముల నుండియు దూరము కావలయుననియు, అత్మచేత ప్రేరేపింపబడి, ప్రభువును నమ్మిన పౌలుగారు చెబుతున్నారు. అవివాహితులు, విధవరాండ్రు దేవుని విషయములందు నిమగ్నులై ఉండాలి. దేవున్ని సంతోష పెట్టుటకు ప్రయత్నించాలి. అలా శారీరకముగా, ఆత్మయందును పరిశుద్ధులై ఉండెదరు. వివాహితులు ఈలోక విషయాలలో చిక్కుకొని ఉండెదరు. భర్త భార్యను, భార్య భర్తను ఎలా సంతోషపెట్ట వలయునని లౌకిక వ్యవహారములలో చిక్కుకొని ఉండెదరు. వారి జీవితం దేవునికి-లోకానికి మద్య విభజింప బడుతూ ఉంటుంది. వారు విచారములనుండి దూరము కావలయునంటే, ప్రభువునకు సంపూర్ణముగా వారి జీవితాలను అర్పించుకోవాలి మరియు క్రమశిక్షణ అలవరచు కోవాలి. కుటుంబ భాధ్యతలను నేరవేరుస్తూనే, దేవుని విషయాలయందుకూడా నిమగ్నులై యుండాలి. పొరుగువారిని ప్రేమిస్తూ, దైవాజ్ఞలను విధేయిస్తూ, సజీవ విశ్వాసము కలిగి క్రీస్తునందు వారు జీవించగలగాలి.
సువిశేష  పఠనము: యేసు బోధ అధికారము గలది
యేసు విశ్రాంతి దినమున (సబ్బాతు) కఫర్నాములోని (గలిలీయ సముద్ర తీరమున ఒక చిన్న గ్రామము; పేతురు అతని సోదరుడు అంద్రేయ అక్కడ నివసించిరి; నజరేతును వీడిన యేసు, కఫర్నామును తన నివాస మేర్పరచు కొనెను మత్త 4:13; మార్కు 2:1) యూదుల ప్రార్ధన మందిరములోకి (సినగోగు - ప్రార్ధన, బోధన, ఆరాధన, సంఘకూడిక) ప్రవేశించి, ధర్మశాస్త్రబోధకులవలెగాక (యూదచట్టం యొక్క అధికారిక వ్యాఖ్యాతలు), అధికారపూర్వకముగా బోధించాడు. అనగా ఆత్మవిశ్వాసముతో లేఖనాలను వివరించాడు. ధర్మశాస్త్రబోధకులు, ఆత్మసంబంధమైన విషయాలకుగాక, బాహ్యపరమైన విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చారు. "వారు బోధించునది వారే ఆచరింపరు" (మత్త 23:3) అని వారి గురించి యేసు చెప్పాడు. మత్త 7:29లో "ఏలయన ధర్మశాస్త్ర బోధకులవలె గాక అధికారము కలవానివలె యేసు బోధించెను".
యేసు అధికారము వ్యక్తిగత అనుబంధముపై ఆధారపడి యున్నది. ఆయన అధికారము తండ్రి దేవునితో తనకున్న వ్యక్తిగత అనుబంధము నుండి వస్తుంది. నేటి సువిషేశములో అపవిత్రత్మతో ఆవేశించిన వ్యక్తి యేసు అధికారాన్ని గుర్తించి, "నీవు ఎవరివో నేను ఎరుగుదును.నీవు దేవుని పవిత్ర మూర్తివి" అని అరిచాడు (మార్కు 1:24). 
యేసు దైవీక అధికారాన్ని కలిగియున్నాడు. ఆయన బోధనలయందును, కార్యములందును శక్తిగల ప్రవక్త, మెస్సయ్య. ఆయన బోధకు అచ్చటనున్నవారు ఆశ్చర్యపడ్డారు. మార్కు సువార్తలో, ప్రభువును, ఒక బోధకునిగా, గురువుగా, ఆశ్చర్యకరునిగా, ప్రార్ధనాపరునిగా చూస్తాము. ఇవన్నియు, ప్రభుని అనుదిన చర్యలో భాగాలే! ఆయన, ఓ గొప్ప గురువు, బోధకుడు. ప్రజలకు దర్మశాస్త్రమునుగూర్చి బోధించాడు. ఆయన వద్దకు విశ్వాసముతో వచ్చిన ప్రతీవారిని స్వస్థపరచాడు. గురువు తన వ్యక్తిగత జీవితముద్వారా, అనుభవముద్వారా, జ్ఞానాన్ని ఇతరులకు ఒసగుతాడు. ప్రభువు, తన జీవితాంతముకూడా, దేవుడు తనకు అప్పగించిన ప్రజలకు సువార్తను బోధించాడు. సువార్తను అర్ధము చేసికొనుటకు, ఉపమానాలద్వారా విశదపరచాడు. క్రీస్తు బోధన కేవలం మదిలోనికేగాక, హృదయములోనికి కూడా ప్రవేశిస్తుంది. ప్రజలు అతని చర్యలలో దేవుని దయను, కరుణను అనుభవించారు. రోగులను, పాపాత్ములను, సమాజముచే వెలివేయబడిన వారిని ప్రేమతో ఆదరించాడు. నేటి సువార్తలో దయ్యము పట్టినవానికి స్వస్థతను చేకూర్చాడు (మార్కు 1:23-26). అందుకే ప్రజలు, ఆశ్చర్యపడి "ఇది యేమి? ఈ నూతన బోధయేమి?" (మార్కు 1:27) అని గుసగుసలాడారు.
యేసు తండ్రిప్రేమను బోధించాడు. యేసు అధికారము - తండ్రి దేవుని ప్రేమ యొక్క శక్తి. ఆయన నిశ్చయముగా, అధికార పూర్వకముగా బోధించాడు, ఎందుకనగా, ఆయన బోధన తండ్రిచిత్తమని, తండ్రివాక్కు అని ఎరిగియున్నాడు. యేసుప్రభువు దేవుని వాక్యమును బోధించాడు. దేవునిగూర్చి, రక్షణ ప్రణాళికనుగూర్చి బోధించాడు. ప్రజలు ఆయన బోధనను ఆలకించడానికి ఆసక్తిని చూపారు. ఈ సందర్భాలలోనే ఆయన ఎన్నో అద్భుతాలను, స్వస్తతలను కూడా చేసాడు. ఈనాడు, అపవిత్రాత్మతో ఆవేశించిన వానిని, ప్రభువు స్వస్థపరచాడు. ఆ అపవిత్రాత్మ ప్రభువు శక్తిని అణగత్రొక్కుటకు ప్రయత్నం చేసింది. కాని, ప్రభువు దానిని తన శక్తితో, అధికారముతో గద్దింపగా, అది వదలి పోయింది. క్రీస్తు అధికారపూర్వకముగా బోధించాడు. యేసు బోధనలు అధికారపూర్వకమైనవి, ఎందుకన, ఆయన దేవుడు, నిత్యజీవపు మాటలు కలవాడు. అందుకే, ఆయన బోధ మనసున, హృదయమున నాటుకొని పోతుంది. అదే యేసుప్రభువునకు, ధర్మశాస్త్రబోధకులకు మధ్యనున్న వ్యత్యాసము. యేసు తన అధికారాన్ని ఇతరుల శ్రేయస్సు, స్వస్థత, రక్షణ కొరకు ఉపయోగించాడు (చదువుము మా 10:45). మనం కూడా యేసువలె జీవించాలి (చదువుము మా 10:42-43). ఎందుకన, మన జ్ఞానస్నాముద్వారా, యేసు అధికారములో భాగస్వామ్యం అవుతున్నాము. ఇతరుల సేవకై మనకున్న అధికారాన్ని వినియోగించాలి.
మత్త 10:1లో చూస్తున్నట్లుగా, యేసు తన శిష్యులకు అధికారమును ఇచ్చాడు. అధికారము ఎప్పుడు కూడా దేవుని నుండి వస్తుంది. మనం సంపాదించుకునేది కాదు. అధికారము అనగా 'సేవ' అని శిష్యులకు బోధించాడు. యేసు ఆదర్శాన్ని మత్త 20:28 లో చూడవచ్చు: "మనుష్య కుమారుడు సేవించుటకే కాని సేవింప బడుటకు రాలేదు". 
సందేశము
అయితే, ఈ రోజుల్లో, 'అధికారం' ఓ చెడు పదముగా మారింది. అధికారం అంటే డబ్బు, పదవులు, ఆధిపత్యం, విజయాలు అని తప్పుగా భావిస్తున్నాం. దేవుని దృష్టిలో, అధికారం అనగా, సేవ, వినయము, ప్రేమ.
ఈనాడు మనం ఇతరుల అధికారాన్ని చూసి వారికి గౌరవాన్ని ఇస్తాం. అలా అధికారముతోగాక, మన మంచి జీవితముద్వారా, ఇతరుల గౌరవాన్ని పొందాలి. అప్పుడే, మనం చేసే బోధనని ఇతరులు ఆలకిస్తారు. ఆరవ పౌలు పాపుగారు, ఓ సందర్భములో 'ఈ లోకం బోధకులకన్న ఎక్కువగా సాక్షులు అవసరం ఎంతో ఉన్నది' అని అన్నారు. ఈ రోజు, గురువులను, బోధకులను గౌరవిస్తున్నారంటే, వారికున్న అధికారమునుబట్టి కాదు. కాని వారి జీవితమును బట్టి. వారు ఎలాంటి వ్యక్తులు, ఎలా జీవిస్తున్నారో వారి బోధనలను బట్టి చెప్పగలరు. యేసు ప్రభువు అధికారపూర్వకముగా బోధించాడు. ఆయన గొంతెత్తి బోధించాడనో , శిక్షనుగూర్చి బోధించాడనో కాదు. ఆయన బోధన ఆయన జీవిత ఆదర్శానుసారముగా సాగింది. ఆయన జీవించినదే, బోధించాడు. అందుకే, అధికారముతో బోధించగలిగాడు. మన బోధ కేవలం మాటలద్వారా మాత్రమేగాక, మన బోధ జీవితమై యుండాలి.
క్రీస్తు ఓ గొప్ప బోధకుడు. మనమందరం ఆయన శిష్యులం, అనుచరులం. దేవుడు, జ్ఞానస్నానము ద్వారా, మనకొక్కరికి ఓ విధమైన పిలుపునిచ్చి ఆయన బిడ్డలుగా జీవించునట్లు చేసాడు. ఆ పిలుపునకు మనం ఎల్లప్పుడు స్పందించాలి. ఎలాంటి విచారములకు లోనుకాకుండా, లోకవ్యవహారములలో చిక్కుకొనక, ప్రభునిలో నమ్మకముంచి, ముందుకు సాగిపోవాలి. మనలోనున్న అపవిత్రాత్మ శక్తులను, లోకవ్యామోహములను గద్దింపమని ప్రభువుని ప్రార్దన చేద్దాం. యేసుక్రీస్తు శక్తిని, అధికారాన్ని మన అనుదిన జీవితాలలో గుర్తించి ప్రతిస్పందించాలి. 
దయ్యములను వెడలగొట్ట బడటం పాత నిబంధనలో 1 సమూ 16:14-23; తోబితు 8:1-3); పాత నిబంధనలో ప్రేషిత సేవలో భాగముగా చూడవచ్చు (మత్త 9:32-34; 12:22-32; మా 1:22-27; 3:14-30; 5:1-20; 6:7; 7:24-30; 9:17-29; 16:17; అపో.కా. 5:16; 8:7; 19:12). ఇది శ్రీసభ పరిచర్యలో కూడా భాగమే (శ్రీసభ చట్టం 1172 1,2).
తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా, గురువులుగా, మఠవాసులు, మఠకన్యలుగా, పాలకులుగా, ప్రజాధికారులుగా మనం కలిగియున్న అధికారము, మనము జీవించే జీవిత విధానమునుండి (సేవ, వినయము, ప్రేమ) రావాలి. అప్పుడే, మనం చెప్పేదానిని ఇతరులు ఆలకిస్తారు. మనమూ గౌరవాన్ని పొందగలము. 
శ్రీసభలో నిజమైన అధికారము
ప్రజల కొరకు ఉపయోగార్ధమైనదే నిజమైన అధికారము. అవసరతలో నున్న వారికి సహాయం అందించుటకై వినియోగించునదే నిజమైన అధికారము. ఇతరులపై ఆధిపత్యం చెలాయించేది నిజమైన అధికారం కాదు. దుర్భుద్ధితో, స్వార్ధబుద్ధితో ఉపయోగించేది నిజమైన అధికారం కాదు.
ఆధిమ క్రైస్తవ సంఘములో కూడా కొంతమంది అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిసి పునీత పౌలుగారు ఈ విషయాన్ని ప్రస్తావించారు: 2 కొరి 10:8 - "ప్రభువు మాకు ప్రసాదించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ గొప్పగా చెప్పుకొనినను, దాని కొరకు సిగ్గుపడుట లేదు. ఆ అధికారము మీ ప్రసిద్ధి కొరకే కాని, మిమ్ము నాశనము చేయుటకు కాదు." క్రీస్తు ఒసగిన అధికారము దైవప్రజలను, దైవసంఘమును ప్రసిద్ధి చేయుటకు అధికారము వినియోగించ బడాలి.
ఎఫెసీ 4:11-12 - "క్రీస్తు శరీరము అను సంఘాభివృద్ధికై పాటుబడుటకు, పవిత్రులెల్లరను సిద్ధము చేయుటకు ఆయన క్రీస్తు కొందరిని అపోస్తలులుగను, కొందరిని ప్రవక్తలుగను, కొందరిని కాపరులుగను, కొందరిని బోధకులుగను నియమించెను.". కనుక, శ్రీసభలోని అధికారము సంఘాభివృద్ధికై, ప్రసిద్ధి చేయుటకై ఉండాలి. అలాగే 'విశ్వాస విషయములోను, యేసు జ్ఞానము విషయములోను, ఏకత్వము పొంది, సంపూర్ణము కావలయును. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందాలి' (ఎఫెసీ 4:13).
నేడు ప్రార్ధనాలయములాంటి మన హృదయములో అధికారముతో మనకు బోధిస్తున్నారు. ఆయన మాటలను హృదయపూర్వకముగా ఆలకించు చున్నామా? ప్రస్తుత కాలములో ఎన్నో విధములైన ‘అపవిత్రాత్మలతో’, నిండియున్నాము, శోధింపబడుచున్నాము. స్వస్థపరచమని యేసుక్రీస్తును వేడుకుందాం. అలాగే, మనకొసగబడిన అధికారాన్ని దుర్వినియోగం చేయక, క్రీస్తు శరీరమైన దైవసంఘము కొరకు వినియోగించ శక్తిని, ఆత్మప్రేరణను ఒసగమని ప్రార్ధన చేద్దాం!

వేదవ్యాపక ఆదివారము (2023)

 వేదవ్యాపక ఆదివారము
యెషయ 2:1-5; ఎఫే. 3:2-12; మార్కు. 16:15-20
“మీరు ప్రపంచ మందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు” (మార్కు. 16:15)


ఉపోద్ఘాతము

క్రీస్తునందు ప్రియమైన సహోదరీ సహోదరులారా! 22 అక్టోబర్ 2023న ‘ప్రపంచ వేదవ్యాపక ఆదివారము’. ప్రపంచ వ్యాప్తముగా ఒక బిలియన్ పైగానున్న (10,000 లక్షలు) కతోలిక విశ్వాసులందరమూ ‘ప్రపంచ వేదవ్యాపక ఆదివారము’ను కొనియాడుచున్నాము. ‘వేదవ్యాపక ఆదివారము’ను 1926వ సం.లో 11వ భక్తినాధ జగద్గురువులు స్థాపించారు. ఆనాటినుండి నేటివరకు కూడా విశ్వశ్రీసభ అక్టోబరు మాసమును వేదవ్యాపకము కొరకై ప్రార్ధన చేయడానికి అంకితం చేసింది. ఈరోజు మనం వేదవ్యాపక ఆదివార దివ్యపూజాబలిలో పాల్గొని, ప్రపంచ వ్యాప్తంగా సువార్తా ప్రచారము కొరకు, ప్రార్ధనలు చేస్తూ, దానినిమిత్తమై మనకు తోచిన ఆర్ధిక సహాయాన్ని అందజేస్తాము. ఈ వార్షిక వేడుకద్వారా విశ్వశ్రీసభ యొక్క మిషన్, ప్రేషితకార్యమైన సువార్త ప్రచారం లేదా వేదవ్యాపకం గురించి ధ్యానిస్తూ ఉంటాము. అలాగే, విశ్వశ్రీసభతో ‘మేమున్నాము’, క్రీస్తుయొక్క ప్రేశితకార్యమైన ‘దైవరాజ్యవ్యాప్తి’ కొనసాగింపుకు కట్టుబడియున్నామని నేడు మనమందరముకూడా ప్రకటిస్తున్నాము.

సువార్త ప్రచారం శ్రీసభ ప్రధాన పరిచర్య – మనందరి బాధ్యత

శ్రీసభ ప్రధానముగా మిషనరీ లేదా వేదవ్యాపక సభ. కనుక శ్రీసభ ప్రధాన బాధ్యత లేదా ప్రేషిత ధర్మం సువార్తీకరణ. ఎందుకన, యేసుక్రీస్తు ప్రధమ మిషనరీ. తండ్రియైన దేవుడు, దైవకుమారున్ని తన ప్రేమ, పరలోక రక్షణ సందేశముతో ఈ లోకానికి పంపియున్నాడు. ఒక మిషనుతో, ఒక మిషనరీగా ఆయన ఈ లోకానికి ఏతెంచాడు. దైవరాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ సందేశాన్ని స్పష్టముగా యోహాను సువార్త 3:16లో చూడవచ్చు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్యజీవమును పొందుటకై అట్లు చేసెను”. యోహాను ఇదే విషయాన్ని మరల తన మొదటి లేఖ 4:9లో స్పష్టం చేసియున్నాడు: “ఆయనద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను”. పౌలు తిమోతీకి రాసిన మొదటి లేఖ 2:4లో, శ్రీసభ ప్రేషిత లక్ష్యాన్ని ఇలా తెలిపియున్నారు: “మానవులు అందరు రక్షింపబడ వలయునని, సత్యమును తెలిసికొన వలయునని దేవుని అభిలాష”. ఇదే నిజమైన సువార్త, శుభవార్త. ఈ సువార్తను మనం ప్రకటించాలి.

కనుక, శ్రీసభ తప్పనిసరిగా దేవుని ప్రేమ, దయ, కనికరము, క్షమాపణ, రక్షణ గురించి ప్రకటించాలి, బోధించాలి. అందుకే, శ్రీసభ ప్రధాన అంశం అయిన సువార్తా వ్యాప్తిలో, వేదవ్యాపకములో పాల్గొనడం ముఖ్యమైన భాగముగా మనం గుర్తించాలి. క్రీస్తుసువార్తా సారాంశమైన ప్రేమ, శాంతి, నిరీక్షణ, మన్నింపు, సహవాసముల సందేశాన్ని ధైర్యముగా ప్రకటించాలి. “మీరు ప్రపంచ మందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు” (మార్కు. 16:15; చూడుము. మత్త. 28:19) అన్న క్రీస్తు మాటలు మనలను చైతన్యవంతులను చేయాలి.

వేదవ్యాపకం జ్ఞానస్నానం పొందిన ప్రతీ క్రైస్తవుని బాధ్యత, కర్తవ్యం. ఈ బాధ్యతను, కర్తవ్యాన్ని యెషయ ప్రవక్తవలె స్వచ్చందముగా చేయాలి. “నేనున్నానుగదా, నన్ను పంపుడు (6:8) అని యెషయ ప్రవక్త పలికి యున్నాడు. ఒకరు బలవంతం చేస్తే చేసేది కాదు వేదవ్యాపకం. మనస్పూర్తిగా, స్వచ్చంధముగా చేయాలి. అయితే అ.కా. 4:20వ వచనములో, విచారణ సభముందు - యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన యాజకుడైన అన్నా, కైఫా, మొదలగు వారి సమక్షములో, పేతురు, యోహానులు పలికిన వాక్యాలుకూడా మనకు స్పూర్తిదాయకం కావాలి. “మేము మా కన్నులార చూచిన దానిని గూర్చి, చెవులార విన్న దానిని గూర్చి మాట్లాడకుండ ఉండలేము” అని ధైర్యముగా పలికి యున్నారు. మన హృదిలో, మదిలో పొందిన క్రీస్తు విశ్వాసాన్ని, క్రీస్తు సువార్తను చాటాలి, ప్రకటించాలి.

పరలోకానికి కొనిపోబడుటకు ముందు యేసు తన శిష్యులతో, “పవిత్రాత్మ మీ పైకి వచ్చునప్పుడు, మీరు శక్తిని పొందుదురు. కనుక... భూదిగంతముల వరకు నాకు సాక్ష్యులై ఉండెదరు” (అ.కా. 1:8) అని పలికి యున్నారు. వేదవ్యాపకం కేవలం మన పని కాదు, మనం మాత్రమే చేసేది కాదు. పవిత్రాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మాత్రమే మనం చేయగలం. అది పరిశుద్ధాత్మ దేవుని పవిత్ర కార్యము. మనం కేవలం ఆయన సాధనాలము మాత్రమే. కనుక, ప్రతీ క్రైస్తవుడు/రాలు క్రీస్తు మిషనరీగా, క్రీస్తు సాక్షిగా పిలువబడి యున్నారు. సువార్తా ప్రచారం మన అందరి బాధ్యత. ప్రతీ ఒక్కరు దేవుని ప్రేమను, రక్షణను ఇతరులతో పంచుకోవాలి.

సువార్త వ్యాప్తి / వేదవ్యాపకం మనం ఎలాచేయాలి?

            మొట్టమొదటిగా శ్రేష్టమైన, పారదర్శకమైన, పవిత్రమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడం ద్వారా సువార్తా ప్రచారం చేయాలి. క్రీస్తుకు సాక్షిగా ఉండటానికి అత్యంత శక్తివంతమైన సాధనం ‘నిజమైన లేదా అసలు సిసలైన క్రైస్తవ జీవితాన్ని జీవించడం’. ప్రేమ, దయ, కనికరము, ప్రార్ధన, క్షమాగుణము కలిగిన జీవితాన్ని జీవించడం. “నా జీవితమే నా సందేశము”గా మారాలి. రోజాపువ్వు ఎలాంటి వాఖ్యలను చేయదు. కాని, తను వెదజల్లే సువాసనద్వారా, తన ఎదురులేని అందముద్వారా అందరిని తనవైపునకు ఆకర్షిస్తుంది. కనుక, వేదవ్యాపకములో ముఖ్యమైన విషయం మనం జీవించే మంచి జీవితం. అనాధి క్రైస్తవులు ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించారు. క్రైస్తవుల పరస్పర ప్రేమను చూసి అన్యులు అనేకమంది ఆకర్షింప బడ్డారు. ఇచ్చట క్రీస్తు పలుకులను జ్ఞాపకం చేసుకుందాం: “మీరు పరస్పరము ప్రేమ కలిగి యున్నచో, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలిసి కొందురు” (యోహాను. 13:35).

రెండవదిగా ప్రార్ధన. మన ప్రార్ధనద్వారా సువార్తా ప్రచారం చేయవచ్చు. “నేను లేక మీరు ఏమియు చేయ జాలరు” (యోహాను. 15:5) అని ప్రభువు పలికి యున్నారు. కనుక, యేసును ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించాలని కోరుకునే వారందరికీ, అలాగే క్రీస్తు సువార్తను బోధించే ప్రతి ఒక్కరికి ప్రార్ధన ఎంతో అవసరం. ప్రార్ధన నేపధ్యములో మాత్రమే క్రీస్తుకు సాక్ష్యులుగా మారడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయును. మిషనరీలు, సువార్తా బోధకులు అందరిలాగే మానవ మాత్రులు, బలహీనులు. క్రీస్తుకు సాక్ష్యులుగా జీవించడం అంత సులువు కాదు. అది ఎన్నో సవాళ్ళతో కూడుకున్నటు వంటిది, కనుక మన ప్రార్ధనలతో వారిని బలపరచుదాం. “పంట విస్తారము కాని పనివారు తక్కువ. కనుక పనివారిని పంపవలసినదిగా ప్రార్ధింపుడు” (లూకా. 10:2). కనుక, దేవుని రాజ్యములో పనిచేయుటకు, తమ జీవితాలను అంకితం చేసుకొనుటకు అనేకమంది ప్రేరేపింప బడాలని, సంసిద్ధమై ధైర్యముగా ముందుకు రావాలని ప్రార్ధన చేద్దాం. సిలువ చెంత, మరియు ‘పైగది’లో శిష్యులతో కలిసి మరియ తల్లి శ్రీసభ కొరకు ప్రార్ధన చేసిన విధముగా, తనవంతు సహకారాన్ని అందించిన విధముగా, మనము కూడా ప్రార్ధన ద్వారా, తల్లి శ్రీసభకు మనవంతు సహకారాన్ని అందిద్దాం.

మూడవదిగా ఆర్ధిక సహాయముద్వారా మనం సువార్తా ప్రచారం లేదా వేదవ్యాపకాన్ని చేయవచ్చు. ప్రతీ వేదవ్యాపక ప్రయత్నానికి ఆర్ధిక మద్దతు ఎంతో అవసరం. పేదవారికి సహాయం చేయడం, అనారోగ్యులకు వైద్యసహాయం అందించడం, సువార్తా వ్యాప్తికి ఆధునిక టెక్నాలజీకి...మొ.గు వాటన్నింటికీ ఆర్ధిక సహాయం ఎంతో అవసరం. ప్రపంచ మంతటా నెలకొన్న 3వేల మేత్రాసణాలలో దాదాపు ఒక వెయ్యికి పైగా మేత్రాసణాలు ఇంకా మిషనరీ మేత్రాసణాలుగా ఉన్నాయి. వారికి ఆర్ధిక సహాయం ఎంతో అవసరం. మనం చేసే ఆర్ధిక సహాయం, విరాళాలు జగద్గురువులు పోపు ఫ్రాన్సిస్ ద్వారా, ఈ మిషనరీ మేత్రాసణాలకు చేరుతుంది. మన ఉదారమైన విరాళాల ద్వారా సువార్త వ్యాప్తికై సహాయం చేద్దాం, తద్వారా, మనము కూడా వేదవ్యాపకములో భాగస్థులమవుదాం.

సవాళ్లు / ఇబ్బందులు – మన దృక్పధం

వేదవ్యాపకం ఎన్నో సవాళ్ళతో కూడుకున్నటు వంటిది. “మీరు పొందు. ఇదిగో! తోడేళ్ళ మధ్యకు గొర్రెపిల్లలవలె మిమ్ము పంపుచున్నాను” (లూకా. 10:3) అని ప్రభువు చెప్పియున్నారు. నేడు మనం ఎదుర్కుంటున్న పెద్దమిషనరీ సవాలు లౌకికవాదం మరియు వినియోగ సంస్కృతి. వీని మూలముగా అనేకమంది దేవునికి అంతగా ప్రాముఖ్యత లేకుండా జీవిస్తున్నారు. నైతిక విలువలు కుంటుబడి పోవుచున్నాయి. మతాలు అవసరం లేదని ఎంతోమంది భావిస్తున్నారు. ఇలాంటి ‘సంస్కృతి’లో, సువార్తా ప్రచారం, వేదవ్యాపకం నిజముగా పెద్ద సవాలే! ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులలో శ్రీసభ మరింత ఆలోచనాత్మకముగా, పవిత్రముగా, మిషనరీ-కేంద్రీకృతమైన శ్రీసభగా మారాలి. తన ప్రేషిత కార్యాన్ని ప్రార్ధనపై ఆధారపడుతూ కొనసాగించాలి. దైవపిలుపులు అధికముగా నున్న ప్రాంతాలనుండి, దైవపిలుపులు ఎక్కువగా లేని ప్రాంతాలకు వెళ్లి సువార్తా పరిచర్యను చేయడానికి సిద్ధపడాలి. నేటికీ సువార్త ప్రకటింపబడని ప్రాంతాలకు సైతము ఉత్సాహముతో, ధైర్యముగా వెళ్ళడానికి సిద్ధపడాలి.

ప్రజలందరూ దేవునివైపుకు చేసే ప్రయాణములో, వారిని సువార్త వెలుగుతో ప్రకాశింప జేయడమే శ్రీసభ లక్ష్యం. దైవప్రేమకుగల శక్తి తప్పక అంధకారాన్ని జయించి, సన్మార్గములో నడిపిస్తుంది. కనుక, ఇతర సాంప్రదాయాలను, తాత్విక వ్యవస్థలను తెలుసుకోవడం, గౌరవించడం ఎంతో అవసరం. వారివారి సాంప్రదాయాలు, సంస్కృతులద్వారా దేవుని జ్ఞానరహస్యములోనికి ప్రవేశించుటకు, క్రీస్తు సువార్తను విశ్వసించుటకు సహాయం చేయాలి. ప్రజలందరు వారి మూలాలకు వెళ్ళడం, వారి సంస్కృతుల విలువలను రక్షించుకుంటూ సత్యములోనికి రావడమే శ్రీసభ లక్ష్యం. ఇది ఎంతో సవాలుతో కూడినటువంటిదే! అయినను, ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యముగా భావించి మనవంతు మనం కృషి చేయాలి. పవిత్రాత్మచేత మనం నడిపింప బడాలి. పవిత్రాత్మ ప్రేరణలను శ్రద్ధగా ఆలకించాలి.

మనముందు ఉన్న మరో సవాలు, నేడు కొంతమంది కతోలికులు శ్రీసభను వీడి ఇతర క్రైస్తవ శాఖలలో చేరుతున్నారు. ఇది కతోలికేత్తర క్రైస్తవులను, క్రైస్తవేత్తరులను ఒకింత డైలమాలోనికి, సందేహములోనికి నెట్టివేస్తుంది. కతోలికులుగా చేరాలని అనుకుంటున్నవారు వెనకడుగు వేస్తున్నారు లేదా వారి ఆలోచనలను విరమించు కుంటున్నారు. దీనికి కారణాలు అనేకం కావచ్చు – ఉదాహరణకు అంత:ర్గత కలహాలు, విభేదాలు, సమన్వయలోపం, వ్యక్తిగతస్వార్ధం, లౌకికకార్యకలాపాలు, గ్రూపులు, దైవార్చనలో అతిఆర్భాటాలు...మొ.వి. కనుక, వారిని తప్పుబట్టకుండా, మన జీవితాలను ఆత్మపరిశీలన చేసుకుందాం. ముందుగా, మన జీవితాలను పునరుద్దరించుకుందాం! మానవీయ, సువార్తా విలువలు కలిగి జీవించుదాం!

నేడు మనముందున్న మరో అతిగొప్ప సవాలు – క్రైస్తవులు ‘మతమార్పిడి’ చేస్తున్నారనే తప్పుడు భావన, తప్పుడు ప్రచారం! వాస్తవానికి అది కతోలిక శ్రీసభ ఉద్దేశ్యం కానేకాదు. మన ఉద్దేశ్యం – మానవాళికి సేవచేయడం. ‘మతమార్పిడి’ అను తప్పుడు భావనను సామరస్యముగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి.

ముగింపు

ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా! నేడు ప్రధానముగా కావలసిన అంశాలు: బోధనకన్న క్రీస్తుబోధనల సారాంశాన్ని జీవించ గలగడం. జీవిత సాక్ష్యులుగా మారడం. సిననడల్ పద్ధతిలో ప్రయాణం చేయడం: అనగా అందరితో కలిసి నడవడం, అందరితో చర్చించడం / సంభాషించడం, పవిత్రాత్మ ప్రేరణతో నిర్ణయాలు చేయడం. విశ్వాస వికాసానికి ప్రతీ ఒక్కరు కృషిచేయడం. విశ్వాసులు మరియు ఆధ్యాత్మిక నాయకులు పవిత్ర జీవితాన్ని జీవించడం, ముఖ్యముగా ప్రార్ధనా జీవితాన్ని జీవించడం. 

వేదవ్యాపక ఆదివారాన్ని కొనియాడుచున్న మనం, వేదవ్యాపకుల కొరకు మరీ ముఖ్యముగా తిరుసభలో పునరుద్ధరనకు అవిరామముగా కృషి చేయుచున్న జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ వారి కొరకు ప్రార్ధన చేద్దాం. తాను తలపెట్టిన సినడల్ ప్రయాణం దిగ్విజయముగా శ్రీసభ ఆధ్యాత్మికాభివృద్ధికి బాటలు వేయాలని ప్రార్ధన చేద్దాం. అలాగే వేదవ్యాపకములో పాల్గొంటున్న మేత్రాణుల కొరకు, గురువుల కొరకు, మఠకన్యల కొరకు, ఉపదేశుల కొరకు ప్రార్ధన చేద్దాం. దేవుడు మనందరినీ కూడా తన ప్రణాళిక ప్రకారం సువార్తా ప్రచారం కొరకు వినియోగించు కొనమని వేడుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక! ఆమెన్.

పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్

 పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ (4 అక్టోబర్)


ఉపోద్ఘాతం:
పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ 12వ శతాబ్దంలో జీవించిన గొప్పపునీతుడుమహనీయుడు. ఆయన జీవించిన ‘పేదరికం’, ఎవరూ జీవించి యుండరు. పేదవారిపట్ల ప్రేమ, స్నేహ, సేవా భావముతో జీవించాడు. ఎప్పుడైతే పేదవారిని ప్రేమించగలనో 

, అప్పుడే దేవున్ని పరిపూర్ణముగా ప్రేమించగలనని గ్రహించాడు. ప్రేమ, కరుణ స్వరూపియైన దేవుని మంచితనమును ఫ్రాన్సిస్‌ అలవర్చుకున్నాడు. పవిత్రాత్మచేత ప్రేరేపింప బడ్డాడు. తన ధాతృత్వ సుగుణాన్ని, జీవితాంతం ఆచరణలో పెట్టిన గొప్పవ్యక్తి. “ఇప్పటి వరకు మనం ఏమి చేయలేదు, దేవున్ని సేవించడం ఇప్పటికైనా మొదలు పెడదాం” అని తన మరణావస్థలో తన సహోదరులతో పలికిన గొప్పపునీతుడు ఫ్రాన్సిస్‌. దేవుని సృష్టిపట్ల, ముఖ్యంగా మూగజీవులపట్ల ప్రత్యేకమైన ఆకర్షణని, ప్రేమని, సోదరభావాన్ని వ్యక్తపరచిన చిరస్మరణీయుడు.

కుటుంబ నేపధ్యం: ఇటలీ దేశంలోని అస్సీసి పట్టణంలో క్రీ.శ. 1182వ సం.లో జన్మించాడు. జ్ఞానస్నానం పేరు యోహాను. తరువాత ఫ్రాన్సిసుగా పిలువబడ్డాడు. తండ్రి పీటర్‌ బెర్నార్డ్‌తల్లి పీకా. తండ్రి పెద్ద ధనవంతుడైన బట్టల వ్యాపారి. ఫ్రాన్సిస్‌ చలాకీగా, కలుపుగోలు తనముతో వ్యాపారంలో తండ్రికి సహాయం తోడుగా ఉండేవాడు. కాని, ఫ్రాన్సిస్‌, తోటియువతతో కలిసి విందువినోదాలకు అధికంగా డబ్బు ఖర్చుచేసేవాడు, దుబారా చేసేవాడు. ఒకవైపు తండ్రి తన వ్యాపారంలో ఫ్రాన్సిసు గొప్పవారసుడు కావాలని కలలు కనేవాడు.

కాని, మరోవైపు ఫ్రాన్సిసు యుక్తవయస్సులోనే గొప్పయోధుడు కావాలని కలలు కనేవాడు. యుద్ధాలలో పాల్గొన్నాడు. 1202వ సం.లో పెరూజియన్‌లతో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. అయితే అస్సీసి ఓడిపోవడముతో ఖైదీగా పట్టుబడ్డాడు. తన కల చెదరిపోయింది. చెరసాలలోకూడా అందరితో కలవిడిగా తిరుగాడుచూ చతురోక్తులతో నవ్వించేవాడు. ఒక సంవత్సరం తరువాత, చెరసాలనుండి విడుదలయ్యాడు. కాని, కొద్దిరోజులకే తీవ్రజబ్బు బారిన పడ్డాడు. ఈ సమయంలోనే తనలో ఎంతో మార్పు కలిగింది. తన జీవితములోనికి తొంగి చూడటం ప్రారంభించాడు.

దైవపిలుపు: అయినను, మరల 1205వ సం.లో, పోపు సైన్యముతో కలిసి యుద్ధము చేయుటకు బయలుదేరాడు. ఆపూలియా వెళ్ళుత్రోవలో, “ఫ్రాన్సిస్‌, ఎక్కడికి వెళ్ళుచున్నావు? నీవు ఎవరిని సేవించగోరుచున్నావు? యజమానుడినా లేదా సేవకుడినా? అని ఒక స్వరాన్ని విన్నాడు. ‘యజమానుడిని’ అని ఫ్రాన్సిస్‌ సమాధానం చెప్పాడు. మళ్ళీ ఆ స్వరం, “కాని, నీవు యాజమానుడినిగాక, సేవకుడిని సేవిస్తున్నావు” అని పలికింది. అప్పుడు ఫ్రాన్సిస్‌, “అయితే, నన్నేమి చేయమంటారు?” అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ స్వరం, “నీవు తిరిగి అస్సీసి నగరానికి వెళ్ళు. నీవు ఏమి చేయాలో అక్కడ తెలుసుకుంటావు” అని చెప్పింది.

ఫ్రాన్సిస్‌ తిరిగి అస్సీసికి వచ్చాడు. అప్పటినుండి ఫ్రాన్సిస్‌ సువార్తధ్యానం మొదలుపెట్టాడు. ధనాన్ని పేదలకు దానంచేసాడు. ఆస్తినంతా త్యజించి, స్వచ్చంధ పేదరికంలో, క్రీస్తుకు నిజమైన శిష్యునిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. దైవపిలుపును అర్ధంచేసుకోవడం మొదలుపెట్టాడు. ఏకాంత ప్రదేశాలకు వెళ్లి, ప్రార్ధన చేయడం ప్రారంభించాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాడు.

          ఈ అన్వేషణలో ఉండగానే, ఫ్రాన్సిసువారి జీవితాన్ని పూర్తిగా మార్చేసిన మరో అద్భుతమైన, మరపురాని సంఘటన జరిగింది. ఒకరోజు ఫ్రాన్సిస్ తన గుర్రముపై వెళ్ళుచుండగా, ఒక కుష్ఠురోగి ఎదురు పడ్డాడు. యుద్ధానికి వెళ్ళకముందు ఫ్రాన్సిస్ కుష్ఠురోగులను చూసి అసహ్యించుకునేవాడు. వారినుండి దూరముగా తప్పించుకునేవాడు. కాని ఈసారి, ఫ్రాన్సిస్ కుష్ఠురోగి దగ్గరకు వెళ్లి కౌగలించుకొని ముద్దుపెట్టు కున్నాడు. కుష్ఠురోగిని ముద్దాడి, అతనికి సహాయం చేసిన తరువాత, గుర్రముపై తిరిగి వెళ్ళేటప్పుడు, వెనుదిరగగా, అక్కడ ఆ కుష్ఠురోగి కనిపించలేదు. చుట్టూచూడగా అతని జాడ ఎక్కడా కనిపించలేదు. ఆ సమయములో తనను సందర్శించినది స్వయముగా యేసుక్రీస్తు ప్రభువే అని ఫ్రాన్సిస్ గ్రహించాడు. ఈ సంఘటన తన జీవితములో మరువలేని తీయనైన అనుభూతిగా ఫ్రాన్సిస్ వర్ణించాడు. లోకబంధకములనుండి తనను విముక్తిగావించిన అద్భుతమైన సంఘటనగా వర్ణించాడు.

అయితే, ఖచ్చితమైన దైవపిలుపును 14 మే 1208 సం.లో, పునీత మత్తయిగారి పండుగ రోజున అర్ధంచేసుకున్నాడు. ఆనాటి సువార్తా, “క్రీస్తు తన శిష్యులను వేదప్రచారానికి పంపటం” ఫ్రాన్సిస్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. తను అర్ధం చేసుకున్నది వెంటనే ఆచరణలో పెట్టుటకు బయలు దేరాడు.

రోమునగరములోని పునీత పేతురుగారి సమాధిని సందర్శించి తననుతాను దేవునికి అంకితం చేసుకున్నాడు. పేదలకు, రోగులకు, ముఖ్యంగా కుష్ఠురోగులకు సేవలు చేయాలని తీర్మానించుకున్నాడు. ఈవిధముగా, తన జీవితాన్ని, సేవకు (సంఘంనుండి వెలివేయబడినవారికి, పేదవారికి, కుష్ఠురోగులకు) అంకితం చేసుకున్నాడు. అస్సీసి పట్టణ ఆవల జీవిస్తూ ప్రార్ధించాడు, బోధించాడు, రోగులకు సేవచేసాడు. కుష్ఠురోగుల సేవద్వారా తనలో ఆధ్యాత్మిక చింతన పెరిగింది, తన మిషన్‌, తన ప్రేషితసేవను, దేవునిచిత్తాన్ని తెలుసుకోగలిగాడు. కుష్టురోగులను ఆలింగనం చేసుకోవడంద్వారా, సర్వమానవాళిని గౌరవించాలి, రక్షించాలి అని తెలుసుకున్నాడు. సకలసృష్టితో సహోదరభావమును పెంపొందించు కోవడంకూడా నెమ్మదిగా తెలుసుకోగలిగాడు.

అలాగే, సువార్తను జీవించడం మరియు దానిని ప్రకటించడం, బోధించడం ప్రారంభించాడు. దేవునియొక్క ప్రేమను, కరుణను ఇతరులతో పంచుకోవడం ప్రారంభించాడు. సాన్ దమియానో దేవాలయములో సిలువలోని యేసుప్రతిమ ముందు ప్రార్ధించు చుండగా, యేసు కళ్ళు తెరచి, ఫ్రాన్సిసుతో, “వెళ్లి నా దేవాలయాన్ని పునర్నిర్మించు” అని చెప్పడం తన ప్రేషితకార్యానికి మూలమైనది. ఆరంభములో పాడుబడిన దేవాలయాలను పునర్నిర్మించిన ఫ్రాన్సిస్ అతిత్వరలోనే శ్రీసభ పునరుద్ధరణకు దోహద పడ్డాడు. 

ఫ్రాన్సిసు సభ: త్వరలోనే అస్సీసిలో అనేకమంది మన్ననలను పొందాడు. తన పేద, ఆధ్యాత్మిక జీవితాన్నిచూసి ఎంతోమంది ఆయనను అనుసరించారు. ఈవిధంగా, చిన్నసహోదరబృందం ఏర్పడింది. ఫ్రాన్సిస్‌ తన స్వచ్చంధ పేదరికం, సహోదరభావం, సంఫీుభావంద్వారా, లోకాన్నే మార్చివేసాడు.

తన జీవితాన్నిచూసి కొందమంది ఆయన సహోదరులుగాఅనుచరులుగా చేరారు. 1209వ సం.లో, మూడవ ఇన్నోసెంట్‌ పోపుగారు ఈ చిన్న సమూహమును దీవించి, ఫ్రాన్సిస్‌ను డీకన్‌గా అభిషేకించి, ఆత్మల రక్షణార్ధం, ప్రాయశ్చిత్తాన్ని బోధించేందుకుభిక్షమెత్తుకొని దైవసేవ చేయుటకు అనుమతిని ఇచ్చారు. 1219 నాటికి ఫ్రాన్సిస్‌ అనుచరుల సంఖ్య ఐదువేలకు పెరిగింది. ఫ్రాన్సిసువారు స్థాపించిన మఠవాస సభ ఎంతగానో అభివృద్ధి చెందింది. ఫ్రాన్సిస్‌వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని, ఎంతోమంది తమ జీవితాలను అంకితం చేసుకొని, ఫ్రాన్సిసువారి బాటలో నడుస్తూ, సేవామార్గంలో జీవిస్తూ, స్వచ్చంధ పేదరికాన్ని జీవిస్తూ, ప్రపంచమంతటా వారు తమ సేవలను అందిస్తున్నారు. ఫ్రాన్సిస్‌ అనుచరుడనగా ‘స్వచ్చంధ పేదరికం’లో జీవించడం అనగా, సోదరునిగా జీవించడం, మానవగౌరవాన్ని పెంపొందిచడం.

దైవచిత్తాన్వేషి: ఈనాటి మానవుడు ‘కోరికలు’ అనే వలయంలో చిక్కుకున్నాడు. కోరికలు తీరనప్పుడు నిరుత్సాహపడి పోతున్నాడు. సానుభూతి, ఓదార్పుకు నోచుకోలేక పోతున్నాడు. దేవునివాక్యం, దేవునికార్యంపై ధ్యానంచేసిఆయన చిత్తాన్ని అన్వేషించుటకు మానవునికి సమయం, ఆసక్తి లేకుండా పోయింది. దైవచిత్తాన్ని వెదకుటలో, తెలుసుకోవడంలో, ఆచరించడంలోనున్న ఆనందాన్ని, సంతోషాన్ని నేటి మానవుడు గ్రహించలేక పోతున్నాడు.

ఫ్రాన్సిస్‌ దైవచిత్తాన్ని అన్వేషించడంలో పొందిన ఆనందం వర్ణణాతీతం. యుక్తవయస్సులో, చిలిపిగా యువతకు నాయకుడై విచ్చలవిడిగా జీవించినప్పటికిని, మార్పు, మారుమనస్సు అతని జీవితాన్ని ఆవహించాయి. ఏకాంత ప్రదేశాలకు వెళ్లి దేవుని వాక్యంపై, దేవుని ప్రేమపై ధ్యానించడం, ప్రార్ధించడం ప్రారంభించాడు. దమియాను దేవాలయంలోని సిలువలో వ్రేలాడు క్రీస్తుప్రతిమ ఫ్రాన్సిస్‌ హృదిని, మదిని తొలచింది. ఫ్రాన్సిస్‌ దైవపిలుపును అర్ధం చేసుకున్నది ఆ సిలువనుండియే! ఈవిధముగా, తన జీవితములో జరిగిన ప్రతీ సంఘటననుండి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాడు.

ప్రకృతి ప్రేమికుడు: ఫ్రాన్సిస్‌ ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతిద్వారా దేవుని మహిమను పొగడేవాడు. ప్రకృతిపట్ల గాఢమైన ప్రేమనుగౌరవాన్ని పెంచుకున్నాడు. ప్రకృతిలోని సమస్తములో దేవుని సాన్నిధ్యాన్ని చవిచూసాడు. సమస్తమును తన సహోదరీసహోదరులుగా పిలిచాడు. సూర్యుడు ఆయన సోదరుడు, చంద్రుడు ఆయన సోదరి. ఆకాశములోని పక్షులకు, నీటిలోని చేపలకు ప్రవచనాలను బోధించాడు. భయంకరమైన తోడేలుకు ఉపదేశం చేసి దానిని సాధుజంతువుగా మార్చాడు. ప్రకృతిపట్ల, ఫ్రాన్సిసువారికున్న ప్రేమవలన, ఈ తరమువారుకూడా ప్రకృతిపట్ల ప్రేమను, దాని నాశనమును కోరుకొనక అభివృద్ధిని కోరుకొనేట్టు ప్రేరేపింపబడాలని ఆశిద్దాం.

శాంతిదాత: ఫ్రాన్సిసువారు తన జీవితముద్వారా ఈ లోకాన్నే మార్చేసారు. క్రూసేడుల కాలములో, శాంతిని నెలకొల్పుటకు మధ్యవర్తిగా ఫ్రాన్సిస్ ధైర్యముగా ఈజిప్టుకు వెళ్లి అక్కడి సుల్తానును కలిసాడు. యుద్ధాన్ని ఆపాలని కోరాడు. ఈ సంఘటన సకల మానవాళిపట్ల ఫ్రాన్సిసువారికున్న ప్రేమ, కరుణను తెలియజేస్తుంది. ఫ్రాన్సిస్ వారు ప్రపంచ శాంతిదూత అని చెప్పడానికి ఆయన చేసే శాంతి ప్రార్ధనయే గొప్పనిదర్శనం.

ప్రభువా! నీ శాంతి సాధనముగా నన్ను మలచుకొనుమయా!
ద్వేషమున్నచోట, ప్రేమను వెదజల్లనీయుము
గాయమున్నచోట క్షమాపణను చూపనీయుము
అవిశ్వాసమున్నచోట విశ్వాసమును నింపనీయుము
నిరాశయున్నచోట ఆశను పెంచనీయుము
అంధ:కారమున్నచోట జ్యోతిని వెలిగింప నీయుము
విచారము నిండినచోట సంతోషమును పంచనీయుము
ఓ దివ్యనాధా!
పరుల ఓదార్పును వెదకుట కంటె, పరులను ఓదార్చు వరము నీయుము
పరులు నన్ను అర్ధము చేసుకొన గోరుట కంటె, పరులను అర్ధముచేసుకొను గుణము నీయుము
పరులు నన్ను ప్రేమించాలని కోరుట కంటె, పరులను ప్రేమింప శక్తినీయుము
ఎందుకన,
యిచ్చుట ద్వారా పొందగలము
క్షమించుట ద్వారా క్షమింప బడగలము
మరణించుట ద్వారా నిత్యజీవము పొందగలము

క్రిస్మస్: పునీత అస్సిసిపుర ప్రాన్సిస్‌ దివ్యబాలయేసుపట్ల ప్రత్యేకమైన భక్తిని కలిగియున్నాడు. 1223వ సం.లో క్రిస్మస్‌ జాగరణ సందర్భంగా పశువుల పాకను ఏర్పాటు చేసి క్రీస్తుజనన సన్నివేశాన్ని సృష్టించిన మొట్టమొదటి వ్యక్తి ఫ్రాన్సిసుగారు. అస్సీసి పట్టణమునకు దగ్గరిలోనున్న గ్రేచియా అనే గుహలో క్రీస్తుజన్మను ఒక ప్రత్యేక అనుకరణములో ఫ్రాన్సిస్‌ పున:సృష్టించాడు. ఈసందర్భంగా అచ్చట దివ్యపూజాబలిలో పాల్గొనాలని, తాను స్వయంగా ఏర్పరచిన పశువులపాకలోని క్రీస్తుజనన సన్నివేశాన్ని దర్శించాలని అచ్చటి పట్టణ ప్రజలను ఆహ్వానించియున్నాడు.

సిలువపట్ల ఆరాధన: ఫ్రాన్సిసువారు యేసు పవిత్ర సిలువను ఎంతగానో ఆరాధించేవారు, గౌరవించేవారు. ఎక్కడ దేవాలయము కనబడిన, వెంటనే మొకాళ్ళూని సిలువను ఆరాధించేవారు. ఆయన ఈవిధముగా ప్రార్ధించేవారు, “ఓ యేసుక్రీస్తువా, ఇక్కడ ఈ దేవాలయమునందును, ప్రపంచములోని ప్రతీ దేవాలయమునందును, ప్రతీ దివ్యమందసమునందునుగల మిమ్ము మేము ఆరాధించుచున్నాము. మిమ్ము స్తుతించుచున్నాము. ఎందుకన, మీ పవిత్ర సిలువద్వారా మీరు ఈ లోకమును రక్షించితిరి.” అందుకేనేమో, యేసు పవిత్ర సిలువ మహోత్సవమునాడే, 14 సెప్టెంబర్‌ 1224వ సం.లో, అల్వెర్నా అనే కొండప్రాంతములో ప్రార్ధన చేయుచుండగా క్రీస్తు పంచగాయాలను తన శరీరముపై పొందాడు.

ముగింపు: సువార్తను అక్షరాల జీవించి, క్రీస్తువలె, క్రీస్తునుపోలి జీవించడానికి ప్రయత్నం చేసిన గొప్ప పునీతుడు ఫ్రాన్సిస్. అందుకే చరిత్రకారులు ఫ్రాన్సిసువారిని ‘మరోక్రీస్తు’ అని పిలిచారు. సంపూర్ణముగా దేవునిపై ఆధారపడి జీవించాడు. అస్సీసిపుర ఫ్రాన్సిసుగారు, 3 అక్టోబర్‌ 1226వ సం.లో స్వర్గస్తులైనారు. మరణించిన రెండేళ్లకే, అనగా 1228వ సం.లో తొమ్మిదవ గ్రెగోరి పోపుగారు, ఫ్రాన్సిసువారిని పునీతునిగా ప్రకటించారు. పునీత ఫ్రాన్సుసువారు ఇటలీ దేశానికి పాలకపునీతుడు.

అలాగే, 1979 నవంబరు 29వ తేదీన రెండవ జాన్ పౌల్ జగద్గురువులు, పునీత అస్సీసి ఫ్రాన్సిసు వారిని పర్యావరణమునకు, వాతావరణ సంరక్షణ, జీవజాల సమగ్రతను కాపాడుటకు కృషిసలుపు వారందరికి పాలక పునీతునిగా ప్రకటించి యున్నారు.

జీవితము ఒసగే సుఖసంపదలను ఒడిసి పట్టుకోవాలని పరుగులు తీస్తున్నప్పుడు, ఫ్రాన్సిస్ క్రిందికి తోయబడ్డాడు. వివిధ రూపాలలో తాను క్రీస్తును కలుసుకొనుట ద్వారా, ఆత్మప్రేరేపితుడై జీవితములో ఏది విలువైనదో, ఏది శాశ్వతమైనదో తెలుసుకున్నాడు. సేవకుడినిగాక, యజమానిని సేవించడం మొదలుపెట్టాడు. సువార్తయే తన నియమాళిగా చేసుకొని జీవించాడు. క్రీస్తులేకుండా ధనవంతునిగా ఉండుట కంటె, క్రీస్తు కొరకు పేదవానిగా ఉండుటకు ఫ్రాన్సిస్ ఇష్టపడ్డాడు.

“క్రైస్తవమతం ఒసగిన వారిలో ఫ్రాన్సిస్ గౌరవ ప్రదమైన వ్యక్తులలో ఒకనిగా నిలిచిపోతాడు. సర్వాన్ని పరిత్యజించి వైరాగ్య జీవితాన్ని జీవించాడు. కుష్ఠురోగులకు సేవలు చేసాడు” అని నెహ్రూజీ ఫ్రాన్సిస్ వారి గురించి చెప్పారు. “ప్రపంచములోని ఏకైక నిజాయితీగల ప్రజాస్వామ్యవాది మరియు మానవతావాది, ప్రధమ హీరో, ధీరుడు, నాయకుడు ఫ్రాన్సిస్” అని జీ.కే. చెస్టర్టన్ రాసాడు. “ప్రపంచములోనే గొప్ప జ్ఞాని ఫ్రాన్సిసుగారు” అని గాంధీజీ ప్రశంసించారు.

మొదటిగా ఫ్రాన్సిస్ తన ఆత్మను చక్కదిద్దుకున్నారు, ఆతరువాత దేవాలయము, అటుపిమ్మట ప్రపంచము! ఫ్రాన్సిసు వారివలె దేవుని కలలను నిజం చేద్దాం. శాంతి, ప్రేమ, నీతి, న్యాయం కలిగిన ప్రపంచం కోసం మనం కలలు కందాం. ఆ కలలను సాకారం చేసుకోవడానికి మనవంతు కృషి చేద్దాం.