పునీత పేతురు పౌలుల మహోత్సవము
ప్రియ సహోదరీ, సహోదరులారా, శుభోదయం!
ఈ రోజు మనం రోమునగర పాలక పునీతులైన పునీత రాయప్ప [పేతురు], చిన్నప్ప [పౌలు] గార్ల మహోత్సవాన్ని కొనియాడుచున్నాము. పునీత పేతురు వేదసాక్షి మరణం పొంది, సమాధి చేయబడిన చోటుకు అతి సమీపములో ఈరోజు ప్రార్ధన చేయు గొప్ప భాగ్యమును మనమందరం పొందియున్నాము. పేతురు చెరసాలలో నున్నప్పుడు, క్రీస్తు సంఘము ఆయన కొరకు పట్టుదలతో దేవుని ప్రార్ధించిరి. అప్పుడు దూత అతనిని చెరసాల నుండి [మరణము నుండి] విడిపించెను (చూడుము. అ.కా. 12:1-12). అలాగే, కొన్ని సం.ల తరువాత, రోము నగరములో పేతురు మరల చెరసాలలో నున్నప్పుడు, క్రీస్తు సంఘము తప్పక అతని కొరకు ప్రార్ధన చేసి యుండవచ్చు. కాని, ఈ సారి అతను మరణమును తప్పించు కొనలేక పోయెను. అది ఎలా?
ప్రభువు పేతురుకు ఎన్నో అనుగ్రహాలను ఒసగి, సాతాను శక్తుల నుండి విడిపించాడు. ప్రభువు మనకు కూడా అట్లే చేయును. వాస్తవానికి, మనం మన అవసరతలో మాత్రమే ప్రభువు దగ్గరికి సహాయము కొరకు వెళుతూ ఉంటాము. కాని కేవలం ఆయన వరములను మాత్రమే వెదకక, వరధాతయైన ప్రభువు కొరకు చూడాలని ప్రభువు మనలను ఆహ్వానించు చున్నాడు. కేవలం, మన సమస్యలను మాత్రమేగాక, మన జీవితాలను ప్రభువునకు అప్పగించాలి. అప్పుడే, అతి గొప్ప అనుగ్రహమైన జీవితమును మనకొసగును. మన జీవితమును గొప్ప వరముగా, అనుగ్రహముగా చేయడమే మన జీవితములో ముఖ్యమైనది. ఇది అందరికి వర్తిస్తుంది: తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల, పిల్లలు వారి తల్లిదండ్రుల పట్ల. ఈనాడు ఎంతో మంది వృద్ధ తల్లిదండ్రులను వారి కుటుంబాలు అనాధులుగా విడచి పెట్టడం నేను జ్ఞాపకం చేసుకొంటున్నాను. ఇది ఎంతో విషాదకరం! పిల్లలు తమ జీవితాలను వరముగా వారి వృద్ధ తల్లిదండ్రులకు ఇవ్వలేక పోవుచున్నారు. ఇతరులకు మన జీవితాలను వరముగా ఒసగినప్పుడే, దేవుడు మన ఎదుగుదలను కాంక్షిస్తాడు. అప్పుడే మనం గొప్ప వారము కాగలము. మనలను మనం ఇతరులకు ఒసగినప్పుడే, మనం ఎదుగుతాము. పునీత పేతురును చూడండి: చెరసాల నుండి విముక్తుడై నందుకు అతను ‘వీరుడు’ (హీరో) కాలేదు. కాని, తన ప్రాణమును త్యాగము చేసినందులకు, వేదసాక్షి మరణము పొందినందులకు వీరుడయ్యాడు. అందులకే ఈస్థలం నేడు మనకు ఒక ఆశను కలిపించెడు స్థలముగా మారింది.
కనుక ఈ రోజు మన జీవితమును ఒక గొప్ప వరముగా మార్చుమని ప్రభువును వేడుకుందాం. ఈ నాటి సువిశేషములో పేతురు చెప్పిన విశ్వాస సత్యము అతని జీవితమునే మార్చి వేసింది: “ నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు” (మత్తయి 16:16). అందుకు ప్రభువు, “యోనా పుత్రుడవగు సీమోను! నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియ జేసినది పరలోక మందున్న నా తండ్రియే కాని, రక్తమాంసములు కావు (మత్తయి 16:17) అని చెప్పాడు. ధన్యత అనగా సంతోషము. ఈ ధన్యతకు/సంతోషమునకు కారణమేమి? కారణం, యేసు “సజీవుడగు దేవుడు” అని గుర్తించడం. చరిత్రలో యేసు గొప్పవాడని తెలుసుకోవడం, ఆయన చెప్పిన వాటిని, చేసిన వాటిని మెచ్చుకోవడం కాదు. కాని, యేసుకు నా జీవితములో, నా హృదయములో ఎలాంటి ప్రాముఖ్యతను ఇస్తున్నాను అన్నది ముఖ్యము. పేతురు తన జీవితములో, తన హృదయములో యేసును సజీవ దేవుడిగా నిలుపుకున్నాడు. అందుకే యేసు, “నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింప జాలవు” (మత్తయి 16:18) అని అన్నాడు.
సీమోను దృఢమైన వాడని, నమ్మదగిన వాడని, ఇక తప్పులు చేయడని, యేసు అతనిని ‘పేతురు’ లేదా ‘రాయి’ అని పిలువలేదు. తరువాత యేసు ఎవరో తనకు తెలియదని బొంకాడు. అయినప్పటికిని ప్రభువు తన సంఘమును ఈ ‘రాతి’ [పేతురు] మీదనే నిర్మించాడు. ఎందుకన, పేతురు తన జీవితాన్ని “రక్త మాంసములు”పై గాక, తన శక్తియుక్తులపై గాక, మూల రాయి [శిల] అయిన యేసుపై నిర్మించుకున్నాడు. శిలపై [యేసు] రాయిగా మారాడు. పునీత పౌలు కూడా క్రీస్తు సువార్త కొరకు తనను తాను సంపూర్ణముగా అర్పించుకొని, క్రీస్తు కొరకు సర్వమును పూర్తి నష్టముగా పరిగణించాడు, సమస్తమును విడనాడాడు, అన్నింటిని చెత్తగా భావించాడు [ఫిలిప్పీ. 3:8].
ఆత్మ పరిశీలన చేసుకుందాం: నేను నా జీవితాన్ని ఎలా నిర్మించు కుంటున్నాను? క్షణిక అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నానా? లేదా నా నిజమైన అవసరం యేసు అని నమ్ముచున్నానా? నా జీవితమును నా శక్తియుక్తులపై గాక, సజీవ దేవునిపై నిర్మించు కుంటున్నానా?
సర్వమును దేవునకు అర్పించుకున్న మరియ తల్లి, మన అనుదిన జీవితములో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చునట్లు మనకు సహాయ పడును గాక! దేవుని అనుగ్రహము వలన, మన జీవితమును గొప్ప వరముగా మార్చుటకు ఆ తల్లి మన కొరకు ప్రార్ధించునుగాక!
జగద్గురువులు పోపు ఫ్రాన్సిస్
పునీత పేతురు బసిలిక
సోమవారము, 29 జూన్ 2020
- (అనువాదం)
రెవ. ఫా. ప్రవీణ్ గోపు, కపూచిన్
పెద్దావుటపల్లి, విజయవాడ
No comments:
Post a Comment