పునీతులు జ్వాకీము, అన్నమ్మ – జూలై 26

పునీతులు జ్వాకీము, అన్నమ్మ – జూలై 26
మరియమాత తల్లిదండ్రులు, దైవభక్తులు (క్రీ.శ. 1వ శతాబ్దం)

జ్వాకీము, అన్నమ్మలు పుణ్య దంపతులు. మరియమాత తల్లిదండ్రులు. యేసు అమ్మమ్మ తాతలు. బైబులులో వీరిరువురు గురించి ఎక్కడా చెప్పబడలేదు. ఇతర ఆధారాల ప్రకారం [“Protoevangelium Jacobi,” or "Gospel of James" - an apocryphal writing from second century], అన్నమ్మ బెత్లెహేములో జన్మించారు. అన్నమ్మ తల్లిదండ్రులు ఆరోను వంశములోని భక్తులు ఎమరెన్షియా, స్తోల్లానుస్. అన్నమ్మ (హీబ్రూ: హన్నా) అనగా ‘వరప్రసాదం’, ‘దేవుని కృప’ అని అర్ధం. జ్వాకీము గలిలీయ ప్రాంతములోని నజరేతు నివాసులు. గొర్రెల కాపరి. జ్వాకీము అనగా ‘దేవుడు సిద్ధపరుస్తాడు’ అని అర్ధము. జ్వాకీము, అన్నమ్మలు సామాన్య కుటుంబీకులు. గొర్రెల మంద నుండి వచ్చే ఆదాయములో, ఒక భాగం దేవాలయమునకు, రెండవ భాగం పేదలకు, యాత్రికులకు, మూడవ భాగం స్వంత అవసరాల కోసం ఉపయోగించేవారు.


వీరికి చాలా సంవత్సరముల వరకు, అనగా వృద్ధాప్యము వరకు సంతానము కలుగలేదు. సంతానము కొరకు ప్రతీరోజు ఓపిక, నమ్మిక, ఏకాగ్రతతో ప్రార్ధించేవారు. ఒకరోజు యెరూషలేము దేవాలయములో గొర్రెలను కానుకగా సమర్పించడానికి జ్వాకీము వెళ్ళగా, ఆ రోజు ప్రధాన యాజకుడిగానున్న రూబేను, సంతానము లేనివారు బలి ఇవ్వకూడదని కానుకలను స్వీకరించలేదు. యూదులు సంతానలేమిని దేవుని శాపముగా భావించేవారు. ఆ బాధతో, జ్వాకీము కొండ ప్రాంతమునకు వెళ్లి, భక్తితో, విశ్వాసముతో, కన్నీటితో ఉపవాస ప్రార్ధనలు చేసాడు. అదే సమయములో, భర్త ఇంకా ఇంటికి రాలేదని వేదనతో నిరీక్షణతో ఎదురుచూస్తూ ఉపవాసముతో యావే దేవునకు మొరపెట్టుకొన్నది. 

దేవుడు వీరి ప్రార్ధనలను, మొరను ఆలకించి, పరలోకము నుండి ఇద్దరు దేవదూతలను చేరొకరి దగ్గరకు పంపారు. “దేవుడు మీ ప్రార్ధనలను ఆలకించారు. మీకొక కుమార్తె కలుగును. ఆమెకు ‘మరియ’ (మిరియం) అను పేరు పెట్టుము” అని ఇరువురికి దేవుని సందేశాన్ని అందించి ఆ దూతలు అదృశ్యమయ్యారు.

"సంప్రదాయం ప్రకారం, యేసు తాతగారు పునీత జ్వాకీము తనకు పిల్లలు లేని కారణముగా తన చుట్టూ ఉన్నవారందరి నుండి ఒంటరివాడయ్యాడు. ఆయన భార్య అన్నమ్మవలె, ఆయన జీవితం నిరుపయోగమైనదిగా భావించబడింది. అందువలన, అతనిని ఓదార్చడానికి ప్రభువు ఆయన యొద్దకు తన దూతను పంపారు. జ్వాకీము నగరము వెలుపల విచారముతో ఉండగా, ప్రభువు దూత అతనికి కనిపించి, “జ్వాకీము, జ్వాకీము! నీ ప్రార్ధనను ప్రభువు ఆలకించారు” అని తెలిపినది. గియోత్తో అనే చిత్రకారుడు, తాను గీసిన ఒక ప్రసిద్ధ చిత్ర పటములో ఈ సంఘటనను రాత్రిపూట జరిగినట్లుగా చిత్రీకరించాడు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఆందోళన, జ్ఞాపకాలు, కోరికలతో నిండిన జ్వాకీమును ఆ పటములో చూడవచ్చు" (పోపు ఫ్రాన్సిస్, ప్రపంచ వృద్ధుల దినోత్సవ సందేశం)

గియోత్తో గీసిన చిత్ర పటము

 

ఈవిధముగా, వృద్ధాప్యములో పవిత్రాత్మ వరముతో మరియ జన్మపాపము లేకుండా జన్మించినది. కన్య మరియను వర పుత్రికగా జ్వాకీము, అన్నమ్మలు ఈ లోకానికి అందించారు. మరియను ప్రేమానురాగాలతో, భక్తితో పెంచారు. అయితే, దేవునికి వాగ్ధానము చేసిన విధముగా, మరియకు మూడు సంవత్సరములు నిండగానే, యెరూషలేము దేవాలయములో సమర్పించారు. పాత నిబంధన గ్రంథములో 'హన్నా' తన కుమారుడు సమూవేలును దేవాలయములో సమర్పించిన విధముగా అన్నమ్మ, జ్వాకీములు మరియను దేవాలయములో సమర్పించారు. దేవుని రక్షణ ప్రణాళికలో మరియ ముఖ్య పాత్ర పోషించ బోవుచున్నదని దీని అర్ధం.

వీరి సమాధి 1889లో యెరూషలేములో కనుగొనబడింది. వీరిని పునీతులుగా గౌరవిస్తున్నాము. పు. జ్వాకీము, అన్నమ్మల పండుగ 4వ శతాబ్దము నుండియే ఉన్నను, విశ్వశ్రీసభ పండుగగా మాత్రం 15 లేదా 16వ శతాబ్ధములోనే ప్రారంభమైనది. వారు ఒకరిపై ఒకరు చూపించిన ప్రేమ, ఇరువురు మరియపై చూపిన ప్రేమానురాగాలు మనకు ఆదర్శం. వారి విశ్వాసం, పట్టుదలతో కూడిన ప్రార్ధనా జీవితం మనకు ఆదర్శం.

పు. జ్వాకీము, అన్నమ్మలు వివాహితులకు, గర్భిణీ స్త్రీలకు, పిల్లలు లేనివారికి, అమ్మమ్మ, నానమ్మ, తాతలకు పాలక పునీతులు. కష్ట సమయములో (కరోన మహమ్మారి) ఈ పునీతుల ప్రార్ధన సహాయాన్ని వేడుకుందాం. కుటుంబాలలో శాంతి, సమాధానం, ఆరోగ్యం కొరకు ప్రార్ధన చేద్దాం.

1 comment: