పునీత గొన్సాలో గ్రాసియ (ఫిబ్రవరి 7)

 పునీత గొన్సాలో గ్రాసియ (ఫిబ్రవరి 7)
బ్రదర్, వేదసాక్షి, క్రీ.శ. 1555 - 1597


భారత గడ్డపై జన్మించి, జపాను దేశములో వేదసాక్షి మరణం పొందారు. వీరి పండుగను ఫిబ్రవరి 6న ఘనముగా కొనియాడతారు. ఆయన క్రీ.శ. 1555వ సం.లో ముంబై నగరానికి దగ్గరగల వాసాయ్ అనే గ్రామములో జన్మించారు. యేసు సభ గురువుల పాఠశాలలో విద్యనభ్యసించారు. మంచి దైవభక్తి పరుడు, క్రమశిక్షణ కలవాడు.

క్రీ.శ. 1574వ సం.లో, యేసు సభ గురువు సెబాస్టియన్ గొంసాల్వెస్ వారితో కలిసి ఉపదేశిగా జపాన్ దేశానికి ప్రయాణ మయ్యాడు. 80 రోజుల సముద్ర ప్రయాణం చేసి వారు జపాన్ గడ్డపై కాలు మోపారు. పడవలోనే ఆయన జపాన్ భాషను నేర్చుకున్నారు. త్వరలోనే అక్కడి వారి వేషభాషలు, ఆచారాలను నేర్చుకున్నారు. నాగసాకి ప్రాంతములో సెబాస్టియన్ గురువులు విచారణ కర్తగా నియమింప బడగా, గొన్సాలో గ్రాసియ వారికింద ఉపదేశిగా పనిచేసారు.

క్రీ.శ. 1577లో యేసు సభలో సాధారణ బ్రదరుగా ఉండుటకు అనేకసార్లు కోరినను, అందుకు అనుమతి లభించలేదు. యేసు సభ గురువులను వదిలి నాగసాకి పట్టణానికి ఏబది మైళ్ళ దూరములో నున్న 'హిర్దో' అను ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ కొంతకాలం, పోర్చుగీసు వ్యాపారస్థులతో కలిసి వ్యాపారం చేసారు. క్రీ.శ. 1586లో వ్యాపార నిమిత్తమై ఫిలిప్పైన్స్ దీవులకు చేరుకొని, అక్కడ ముఖ్య పట్టణమైన 'మనిలా'కు చేరుకున్నారు.

అక్కడ పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ సభ గురువులు సువార్తా ప్రబోధాన్ని ముమ్మరముగా సాగిస్తున్న రోజులు. గొన్సాలో గ్రాసియ, ఆ సభ గురువులను సమీపించి, చిరకాల బ్రదరుగా ఉండ అంగీకరింపుమని ప్రాధేయ పడినాడు. ఉపదేశిగా అనుభవం ఉండినందున, తన సభలో నోవీసుగా చేర్చుకొనుటకు మఠ శ్రేష్ఠులు గురువులు పీటర్ బాప్టిస్టు గారు 1586లో ఆమోదం తెలిపారు. 7 జూన్ 1587లో పేదరికము, బ్రహ్మచర్యము, విధేయత వ్రత దీక్షను తీసికొని, సభ అంగీని స్వీకరించారు. వంటశాల, భోజనశాలలో, వస్తుసామాగ్రిని కొనితేవడం వీరి ముఖ్య విధి.

సం.రం. గడచిన పిమ్మట, జపాను క్రైస్తవులు తండోపతండాలుగా, మనిలా నగరం వచ్చి నివాసాలేర్పరచు కున్నారు. గొన్సాలో గ్రాసియ వారికి జపాను భాష రావడం వలన, వారి మధ్య సేవలు చేసారు. పిమ్మట సువార్తా బోధకుడిగా. పెద్రో బాప్టిస్టు గురువులకు సహాయకుడిగా, 1592లో తిరిగి జపాను దేశము వెళ్లి, టోక్యో నగరములో, క్రైస్తవ విశ్వాసాన్ని బోధించారు. 500ల మందికి పైగా జ్ఞానస్నానాలు ఇప్పించారు. పిమ్మట 'నగోయ' అను పట్టణములో క్రైస్తవ ఆధ్యాత్మిక సేవలో వ్యాధిగ్రస్తుల పరిచర్యలో విశేషముగా కృషి సల్ఫారు. మకావో, ఒసాకా పట్టణాలలో, ఫ్రాన్సిసు సభ ఆశ్రమాలను, కుష్ఠరోగులకు ఆసుపత్రులను నిర్మించడములో గొన్సాలో గ్రాసియ వారి కృషి ఎంతగానో ఉన్నది.

అయితే, 1596లో క్రైస్తవ బోధకులకు కష్టకాలం ఆరంభ మైనది. ఆ ప్రాంత గవర్నరు క్రైస్తవులను ద్వేషించి, ఎన్నో హింసలకు గురి చేసాడు. అతని సలహా దారుడు ఫ్రాన్సీసు సభ మిషనరీలందరినీ తుదముట్టించ, మరణ దండన శాసనాన్ని జారీ చేసారు. దాని ఫలితముగా, గొన్సాలో గ్రాసియ వారితోసహా, ఐదుగురు ఇతర ఫ్రాన్సిస్ సభ సోదరులు (పీటర్ బాప్టిస్ట్, మార్టిన్ ది అగుర్రే, ఫ్రాన్సిస్ బ్లాంకో, ఫ్రాన్సిస్ ఆఫ్ సెయింట్ మైకల్, ఫిలిప్), ముగ్గురు యేసుసభకు చెందినవారు (ఫాదర్ పౌల్ మికి, బ్రదర్ జాన్ గోటో, బ్రదర్ జేమ్స్ కిసాయి) మరియు 17 మంది జపానుకు చెందిన సాధారణ క్రైస్తవులు, నాగసాకి నగర వీధుల్లో అతిక్రూరముగా, ఎన్నో చిత్రహింసలను అనుభవించి, యేసుక్రీస్తుకు సాక్షులుగా 5 ఫిబ్రవరి 1597లో వేదసాక్షి మరణాన్ని పొందారు. నాగసాకి చేరువలోనున్న ఒక కొండపై సిలువపై కొట్టబడి, బల్లెములతో పొడవబడి చంపబడినారు.

సువార్త కోసం ప్రాణాలర్పించిన త్యాగశీలి గొన్సాలో గ్రాసియ. వీరికి మరియు తోటి సహోదరులకు, 9వ భక్తినాధ జగద్గురువులు 8 జూన్ 1862లో పునీత పట్టం ఇవ్వడం జరిగింది.

No comments:

Post a Comment