ఫాతిమా జపమాల మాత, 13 మే

ఫాతిమా జపమాల మాత, 13 మే

1917 మే 13వ తేదీ నాటికి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై మూడవ సంవత్సరం గడుస్తుంది. 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలోనే రష్యా దేశంలో బోల్షెవిక్ విప్లవం వచ్చి, లెనిన్, ట్రాటస్కీ నేతృత్వంలో కమ్యూనిస్టుల ప్రభుత్వం గద్దెనెక్కింది.ఆ సమయంలో పోర్చుగల్ దేశంలో ‘ఫాతిమా’ అనబడే ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణం వద్ద గొర్రెలు మేపుకునే లూసీ, ఫ్రాన్సిస్, జసింత అనే ముగ్గురు పిల్లలకు దేవుని తల్లి మరియమాత తొలిసారిగా ధర్శన మయ్యారు. ధఫాలుధఫాలుగా ఆరు సార్లు ప్రత్యక్షమవ్వడం విశేషం. ఆ తల్లి ఆ పిల్లల ద్వారా లోకానికి ప్రత్యేక సందేశం అందించారు.


యుద్ధం చేత ప్రపంచం చిన్నాభిన్నం అవుతుంది అని ఆమె సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మానవలు తమ ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, అనేక పనుల ద్వారా చేస్తున్న వివిధ పాపాలు, అన్యాయాలకు గాను ప్రభువు ఎంతో వ్యధ చెందుతున్నారు అని తెలియచేసారు. పాపాత్ములు మనసు మార్చుకోవాలి, చేసిన పాపాలకు దుఖ పడాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆ తల్లి తమ సందేశంలో మానవాళి శ్రేయస్సు కోరి హెచ్చరించారు. వీరిని నరకం నుండి రక్షించడమే ఆ అమ్మ ప్రత్యేక సందేశ తాత్పర్యం. యేసు నేర్పిన దేవుని ప్రేమ, సోదర ప్రేమను మానవాళి ఆచరించాలని చెప్పక చెప్పారు.

అంతే కాకుండా ప్రపంచ శాంతి కోసం సమైక్యత కోసం భక్తితో జపమాలను ప్రార్ధించమని ఆ తల్లి కోరారు. ప్రతీ రోజు ఆ జపమాలను వల్లించడం మరువరాదని మరీ మరీ కోరారు. అలాగే ప్రతీ గుర్తుకు చివరన “ఓనా యేసువా! మా పాపములను మన్నించండి. నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. ఆత్మలన్నింటిని ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వాటిని మోక్షమునకు తీసుకొనిపోండి”. అనే ప్రార్ధనను కూడా వల్లించమని మాత కోరారు.

1917 అక్టోబర్ 13వ తేదీ న ఆ ముగ్గురు పిల్లలకు చివరి సారిగా ప్రత్యక్షమై “నేను జపమాల మాతను. మానవాళి చేస్తున్న పాపాల కోసం ప్రాయశ్చిత్తం పొందాలని అడిగేందుకు నేను ఇచ్చటకి వచ్చాను. మనుషులు తమ పాపాలతో ఇప్పటికే ప్రభువును అనేక రకాలుగా హింసించారు.” అని తమ కడపటి దర్శనంలో దేవమాత తమ మనో వ్యధను వ్యక్తం చేశారు.

ప్రతీ శనివారము మే మాసపు అన్నీ రోజుల్లో ఆ తల్లి నేర్పిన జపమాలను ప్రత్యేకంగా చెప్పేటందుకు శ్రీసభ ఏర్పాటు చేసింది. అనుదిన సాయంత్రాలు కూడా భక్తులు జపమాల చెప్తుంటారు.

ధ్యానాంశం: గతంలో నాకు జపమాలను ప్రార్ధింప సమయం దొరికినట్లయితే, ఇప్పటకీ మారు మనస్సు పొందని వ్యక్తిని చూసేవాడిని కాదు. (పు. క్లెమెంట్)

No comments:

Post a Comment