పునీత జాన్ ఆఫ్ ఆర్క్ (30 మే)
వీర కన్య, ఫ్రాన్స్ దేశ పాలక పునీతురాలు, క్రీ. శ. 1412 –
1431
“ఫ్రాన్స్ దేశ విమోచకురాలు”గా
గణుతికెక్కిన వీరకన్యామణి. క్రీ.శ. 1412 జనవరి 6న ముగ్గురు జ్ఞానుల పండుగ రోజున
ఈమె జన్మించింది. ఫ్రాన్సు దేశానికి ఈశాన్య ప్రాంతంలోని మ్యూజ్నదీ తీరానగల
సారవంతమైన ‘చంపాగ్నే’ మండలంలోని ‘దోమ్రేమి’ గ్రామం ఈమె జన్మస్థలం. వీరిది కేవలం ఒక
వ్యవసాయక కుటుంబం. పేదరైతు జాక్వెస్ డి ఆర్క్ అయిదుగురు సంతానంలో ఈమె కడపటిది.
తల్లి గొప్ప విశ్వాసురాలు. తమ చివరి బిడ్డలిద్దరికి నూలువడకడం, బట్టలుకుత్తడంలో
శిక్షణ ఇప్పించారు. దైవభక్తితో పెంచారు. కాని జాన్ ఆఫ్ ఆర్క్ కు చదవడం వ్రాయడం
తెలీదు.
ఈమె చిన్నతనంలో తమదేశమైన
ఫ్రాన్సుకు, ఇంగ్లాండుకు పడేది కాదు. గత నూరేళ్ళుగా అడపాదడపా యుద్ధాలు జరిగుతుండేవి. దీనికితోడు ఫ్రాన్సులోని
ఆర్లియనులకు బర్గండియనులకు మధ్య వైరముండి అంతర్యుద్ధాలు చెలరేగుతుండేవి.
ఇదేఅదునుగా బ్రిటన్ శత్రుసైన్యాలు వీరవిహారంచేస్తూ ఒక్కొక్క ప్రాంతాన్నే హస్తగతం
చేసుకుంటున్నాయి.
జాన్ కు తన 14వ యేట ఆకాశం నుండి
ఒక అదృశ్యవాణి విన్పించింది. ఆమె తోటలో పనిచేస్తుండుగా మెరుపులా మధ్యనుండి వింతస్వరం
పలికింది. ఆనాటినుండే ఆమె తాను దైవాంకిత బిడ్డగా ప్రవర్తిస్తూ, కన్యకగా గడుప
ప్రతిజ్ఞ చేసుకుంది. మరో రెండు సంవత్సరాలు
దొర్లిపోయాయి. జాన్ కు మునుపటి అదృశ్యస్వరాలూ పదేపదే విన్పింపసాగాయి. ఎవరా
అని దేవుని ప్రార్ధిస్తూ పరిశీలనగా చూసింది. ఆమెకు పునీత మిఖాయేలు, అలెగ్జాండ్రియా
నగర (ఈజిప్ట్) పునీత కత్తెరేనమ్మ, పునీత మార్గరేటుగార్లు దర్శనమయ్యారు. జాన్ తరచూ
ఆ పునీతుల త్రయం సందేశాలు సూచనలు తరచు వింటుండేది.
ఇలావుండగా, ఆంగ్లేయులు సైన్యులు
విజ్రుంభించి దాదాపు ఫ్రాన్సులోని అత్యధిక ప్రాంతాలు ఆక్రమించాయి. ఇంటిదుస్థిలో
1428 మే నెలలో పునీత త్రయం పలుకులు ఆలించిన జాన్ దైవాదేశంగా భావించి దేశరక్షణకోసం
నడుంకట్టింది. మిగిలివున్న ఒక ప్రాంతం ఫ్రాన్సు సైన్యానికి నాయకత్వం చేపట్టింది.
కదనరంగానికురికింది. తాను అబల, అమాయకురాలు, అవిద్యావంతురాలైనా దేవునిపై భారంమోపి
సబలగామారింది. పురుషదుస్తులు ధరించి గుర్రంపై స్వారీచేస్తూ కత్తిఝుళిపించింది.
శత్రుసైన్యంలో గుబులు పుట్టించింది పునీత త్రయంప్రోత్సాహం దేవభక్తి ఆమెను ముందుకు
నడిపించింది. ధైర్యసాహసాలతో వీరోచితంగా పోరాడి శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించి
తరిమి వేసింది.
ఫ్రాన్సురాజైన 7వ చార్లెస్
జాన్లోని దైవశక్తి ఏపాటిదో పరీక్షింప నెంచి మారువేషంలో రాజోద్యోగ్యులతో కలిసిపోయి
వుండగా జాన్ ఆ రాజును గుర్తుపట్టి పలుకరించగా రాజు ఆశ్చర్యచకితుడై ఆమెను బహుగా
ప్రశంసించాడు. మతాధికారులు కూడా ఆమెకు అండగాను, సలహాదారులు గాను ఉన్నారన్న పునీత
త్రయం గూర్చి పలుమార్లు పరిశీలించారు. మరో సందర్భంలోకూడా ఆర్లియనుల నగరాన్ని
శత్రుగుంపులు చుట్టుముట్టిరాగా జాన్ వారిని అవలీలగా ఓడించి విజయం సాధించింది.
క్రీ.శ. 1429 జూలై 17న ఏడవ
చార్లెస్ అధికార లాంఛనాలతో ప్రజాసమక్షంలో కిరీటధారియై రాజ్యాధికారం చేపట్టిన
పిమ్మట జాన్ కు ప్రత్యేక స్థానమిచ్చి గౌరవించాడు. ఆమె తన విజయ పతాకంతో సగర్వంగా
నిలబడింది. ఆ జెండాపై తండ్రి దేవుని చిత్ర పటం, క్రింద యేసు మరియల నామధేయములు
లిఖింపబడి ఇరువైపులా ఇరువురు దేవదూతలు మోకరిల్లి స్తుతులు అర్పిస్తున్నట్లు చిత్రీకరింపబడి
దైవభక్తిని చాటుతోంది. సుందరమైన ఆకారం, పరిపుష్టమైన శరీరం, మంచి ఆరోగ్యంతో
నిగనిగలాడే, నల్లని కురులు కురుచుగా కత్తిరించుకొని ఉంది. చిరుధరహాసంతో వీరదీరవనితలా
చూపరులనిట్టే ఆకట్టుకుంది.
తర్వాత కాలంలోకూడా ఫ్రాన్సుపై
జరిగిన పలు దండయాత్రల్లో జాన్ శత్రువులను ఎదురుకుంది. అయితే 1430 మే 23న
బర్గండియనులపై జరిగిన పోరాటంలో గవర్నరు తప్పుడు అంచనాలవల్ల ఎత్తుగడల్లో పొరపాటు
జరిగి దుండగులకు ఆమె దొరికిపోయింది. జాన్ ను గుర్రంపైనుండి క్రిందికి గుంజి,
బంధించి ఖైదుచేశారు. ఆమె తప్పించుకునేందుకు ఎత్తైన ఒక టవరుపై ఎక్కి క్రిందికి
దూకింది. కాని తప్పించుకోలేక పోయింది. అయినా అంతపైనుండి దూకి నిక్షేపంగా ఉండడమే ఒక
మహా అద్భుతం అనుకున్నారు.
జాన్ ని భందించిన బర్గండీయనులను
దుండగులు తమకు అధిక దానం ఇచ్చిన వారికి జాన్ ను అమ్మి వేస్తామని ప్రకటించారు. అయితే
ఫ్రాన్సు రక్షణకు విశేషముగా కృషి సలిపిన జాన్ ను 7వ చార్లెస్ రాజు అంతగా
పట్టించుకోలేదు. ఇదేఅదనుగా ఆంగ్లేయులు అధికమొత్తములో డబ్బు క్రుమ్మరించి 1430
నవంబర్ 21 న జాన్ ను క్రయం చేశారు. క్రిస్మస్ పండుగకు రెండు దినాలకు ముందుగా ఆమెను
రౌయెన్ పట్టణ జైలుకు తరలించి ఒక బల్ల పరుపు పలకంపై గొలుసులతో కట్టి కాపలా పెట్టారు.
తర్వాత 1431 ఫిబ్రవరి 21న ఆమె కోర్ట్ హాల్ లోనికి విచారణ నిమిత్తం కొని తేపడింది.
న్యాయాధిపతులు న్యాయానికి
కట్టుబడక జాన్ తమ శత్రువు అనే అక్కసునే ప్రదర్శించారు. జాన్ ఒక మంత్రగత్తె,
తంత్రశక్తులతో, మూడనమ్మకాలతో కుయుక్తులతో బ్రిటీష్వారిపై తలపడిందని నేరారోపణ
చేశారు. ఆమెకు పునీత త్రయం ప్రోత్సాహం, దైవబలం ఉందన్న సంగతి వారి మూర్ఖపగ విద్వేషం
వల్ల గ్రహించుకోలేకపోయారు. సైతాను ప్రేరణవల్ల వారి కళ్ళు పొరలు కమ్మాయి. జాన్ ను
సజీవంగా మండుతున్న మంటల్లో వేసి దహనం చేయాలని తీర్పునిచ్చి తమ కసి తీర్చుకున్నారు.
తీర్పు ఇవ్వబడిన మరునాడు అనగా
1431 మే 30న బుధవారం ఉదయం 8:౦౦ గంటలకు రౌయన్ పట్టణం మార్కెట్టు ప్రదేశాన జాన్ ను
దహన బలికి గురిచేశారు. కట్టెపుల్లలచితికి నిప్పంటించగానే జాన్ కడపటి కోరిక ప్రకారం ఒక దోమినికన్
సన్యాసిని ఒక సిలువ స్వరూపమును ఆమె కండ్లకు కనబడేలా పైకి ఎత్తి పట్టుకుంది. ఎగిసి
మండుతున్న మంటల్లో నుండి “యేసు!” అని జాన్ కంఠం పిలిచింది. బ్రిటీష్ రాజైన హెన్రీ
కార్యదర్శి జాన్ ట్రేస్సార్ట్ కు ఈ పిలుపు స్పష్టంగా వినిపించింది. “మనం
పోగొట్టుకున్నాం. ఒక పవిత్రురాలిని తగలుబెట్టాము.” అని బిగ్గరగా పలికి పరితాపము
చెందాడు. ఆమె అస్థికలు సియెన్ నదీ జలల్లో కలపబడినాయి.
క్రీ.శ. 1456లో అనగా జాన్ యొక్క
మరణానంతరం ఆమెయొక్క జీవితాన్ని, పునఃపరిశీలింప వలసినదిగా ఆమె కుటుంభ సభ్యులు కోరిన
మీదట 3వ కలిస్తస్ పోపుగారి అనుజ్ఞ మేరకు కేసు తిరుగ తోడబడింది. తద్వారా, తప్పు
తీర్పు అన్యాయపు శిక్ష విధింపబడినట్లు అంచనా వేయబడింది. జాన్ తో బాల్యంలో ఆటలు
ఆడుకున్నవారు, సహగాములు, గురువులు, జాన్ కు అనుకూలంగా చెప్పారు. జాన్ పవిత్రురాలు,
ప్రార్ధనాపరురాలు. అనుదినం గుడిలో కనబడుతుంది. దివ్యసంస్కారాల యెడల భక్తి
విశ్వాసాలు మెండు. ఆమె వీర కన్య. పేదలు, రోగులు బాటసారుల యెడ ఎంతో ప్రేమ కనబరిచేది
“ఆమె చాల మంచిది.” “ఆమె గ్రామస్తులు ఆమెను అధికంగా అభిమానిస్తారు” అని ఉద్వేంగా
వాకృచ్చారు.
జాన్ పునీతుల త్రయం ఆదేశాలవల్ల
ఆధ్యాత్మిక బలం పొంది సాహస కార్యాలు చేయగలిగింది అని వెల్లడైంది. నాటి క్రైస్తవ సమాజం
చేసిన ఘోర తప్పిదానికి పోపుగారు విస్తుపోయారు. జాన్ “భక్తి విశ్వాసాలుగల శ్రీసభ
బిడ్డ” అని వారు నమ్మారు. అప్పటికే ఫ్రాన్సులోని ఆర్లీయను ప్రజలు ప్రతీ సంవత్సరము
మే నెల 8న ఆమెను కొనియాడుతూ పండుగ జరుపుకుంటారు. ఈ ఉత్సవాన్ని,1920 లో జాతీయ
ఉత్సవంగా ఫ్రాన్సు గుర్తించింది. 1909లో జాన్ ధన్యతగాను, 1919లో 15వ బెనెడిక్ట్
పోపుగారిచే పునీతగాను ప్రకటింపబడింది. ఈమెను ఫ్రాన్సుదేశపు పాలక పునీతురాలిగా
శ్రీసభ పేర్కొంది. యువతకుకూడా ఆమె మార్గదర్శకురాలైంది. జాన్, జోన్, జోన్నా అంటే
దేవుడు వరముల ఘని, దేవుడు ఆదరించును అని అర్ధం.
ధ్యానాంశం: హృదయపూర్వకంగా ప్రతీ
కార్యాన్ని అంగీకరించు. మరణానికి భయపడవద్దు. చివరకు నీవు స్వర్గానికి చేరుకుంటావు
(పు. జాన్).
No comments:
Post a Comment