పునీత బొనవెంతూరు (బొనవెంచర్) – జూలై 15

 పునీత బొనవెంతూరు (బొనవెంచర్) – జూలై 15

అస్సీసిపుర ఫ్రాన్సిస్ సభ గురువు, బిషప్, కార్డినల్, వేదాంత పండితుడు (క్రీ.శ. 1221-1274)

బొనవెంతూరు (సెరాఫిక్ డాక్టర్) మధ్య ఇటలీ దేశములో ‘లాజియో’ రాష్ట్రములోని ‘బాగ్నోరేజియో’ అను ప్రాంతములో 1221 సం.లో జన్మించారు. జాన్ ఫిదాంజ, మరియ రితెల్లో తల్లిదండ్రులు. అతని అసలు పేరు జాన్. నాలుగు సం.ల ప్రాయములో తీవ్ర వ్యాధికి గురియైనప్పుడు, తల్లి పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి మధ్యస్థ ప్రార్ధనలను వేడుకోగా, చనిపోతాడని అనుకున్న బాలుడు సంపూర్ణ స్వస్థతను పొందాడు. అప్పటినుండి అతని పేరు ‘బొనవెంతూరు’గా పిలువబడినది. బొనవెంతూరు అనగా “అదృష్టం” అని అర్ధము.


 
x

1243వ సం.లో, 22 సం.ల ప్రాయములో అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి సభలో చేరాడు. మాటపట్టు తరువాత, అతనిని పైచదువులకు పారిస్ నగరమునకు పంపించారు. అక్కడ, మరో గొప్ప పునీతుడు ‘థామస్ అక్వినాసు’కు సన్నిహితుడయ్యాడు. 1257వ సం.లో, తన సన్నిహితుడు థామస్ అక్వినాసుతో కలసి డాక్టరేటు పట్టా పుచ్చుకొని, పారిస్ యూనివర్సిటిలోనే ఏడు సం.లు విద్యాబోధనలు చేసాడు.

36 సం.ల ప్రాయములోనే, వారి సభ శ్రేష్టులుగా లేదా ‘జనరల్ మినిస్టర్’గా నియమితుడై, ఆ సేవలో నిర్విరామముగా 17 సం.లు కొనసాగాడు. అంతటితో అతని విద్యాబోధనలకు తెరపడింది. ఆయన ప్రార్ధనాపరుడు, మంచి కార్యనిర్వాహకుడు. సభలో అంత:ర్గత విభేదాల వలన, ముఖ్యముగా ‘పేదరికము’ ఎలా జీవించాలి అనే విషయములో చెదరిపోయిన శాంతిని, ప్రశాంతతను, సమర్ధవంతమైన చట్టాలను చేసి, తిరిగి సభను పునరుద్దరించగలిగాడు. అంతకంటే ముఖ్యముగా, అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి జీవిత ఆదర్శానుసారముగా, సభ్యులకు వ్యవస్థీకృత ఆధ్యాత్మికతను అందించాడు. ఈవిధముగా, సభకోసం ఎన్నో సేవలు, మేలులు చేసాడు. పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారికి నిజమైన అనుచరుడిగా, సోదరుడిగా జీవించాడు. అందుకే, ఫ్రాన్సిస్ సభ ‘రెండవ స్థాపకుడు’గా అతనికి పేరు.

ఆయన గొప్ప ఆధ్యాత్మిక రచయిత. తన రచనలలో, మత సంబంధమైన, ఆచరణాత్మకమైన అంశాలను శ్రీసభ సిద్ధాంతాలతో ఏకం చేయగలిగాడు. అలాగే, 1263లో పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి జీవిత చరిత్రను రచించాడు. అదే సం.లో జరిగిన సభ సమావేశములో, అన్నింటిలో ఇదే ప్రామాణికమైన ఫ్రాన్సిసు వారి చరిత్రగా గుర్తించ బడినది, కీర్తించ బడినది.

1265వ సం.లో, నాలుగవ క్లెమెంట్ పోపు ‘యార్క్’కు అగ్రపీఠాధిపతిగా అతని పేరును ప్రతిపాదించగా, ఆ గౌరవాన్ని అంగీకరించమని తనని బలవంతం చేయవద్దని పాదాలపై పడి, కన్నీటితో వేడుకున్నాడు. అందుకు పోపు తన నిర్ణయాన్ని విరమించుకున్నారు. తరువాత, 1272వ సం.లో పదవ గ్రెగొరి పోపు తనను కార్దినలుగా, ‘అల్బానో’ పీఠాధిపతిగా నియమించి, అంగీకరించమని ఆజ్ఞాపించారు. అదేసమయములో, సభకు ‘జనరల్ మినిస్టర్’గా కూడా కొనసాగారు. ఆ తరువాత పదవీ విరమణ చేసారు. అయితే, ఒక సంవత్సరము తరువాత జరిగిన రెండవ లియోన్స్ సభలో సహాయం చేయమని పోపు అతనిని కోరారు. తనకు అప్పజెప్పిన బాధ్యతలను దిగ్విజయముగా పూర్తిచేసారు. కాని, సభ ముగియకముందే, అకస్మాత్తుగా 15 జూలై 1274లో బొనవెంతూరు మరణించారు.

1482వ సం.లో నాలుగవ సిక్తస్ (Sixtus IV) పోపు బొనవెంతూరును పునీతునిగా ప్రకటించారు. 1588వ సం.లో ఐదవ సిక్తస్ (Sixtus V) పోపు అతనిని శ్రీసభ వేదాంత పండితుడుగా ప్రకటించారు.

“ఒక మఠవాసి అత్యంత పరిపూర్ణత, సాధారణ పనులను సంపూర్ణముగా, పరిపూర్ణముగా చేయడం” – పునీత బొనవెంతూరు.

Bagnoregio 2011

No comments:

Post a Comment