దేవమాత
మోక్షారోహణ మహోత్సవం, 15 ఆగష్టు
ద.గ్రం.
11:19, 12:1-6, 10; 1 కొరి 15:20-26; లూకా 1:39-56
“దివియందు దేవుని ఆలయము
తెరువబడెను. ఆ ఆలయమున ఒప్పందపు పేటికయు కాననయ్యెను. అంతలో మెరుపులును, గర్జనలును, ఉరుములును, భూకంపములును, వడగండ్లవానలును ప్రారంభమయ్యెను. అంతట
దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె
వస్త్రములు. చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై పండ్రెండు
నక్షత్రములు గల కిరీటముఉండెను. ఆమె నిండుచూలాలు. ప్రసవవేదనవలన ఆమె మూలుగుచుండెను” (ద.గ్రం.
11:19-12:2).
మానవాళి రక్షణకు పరిశుద్ధ కన్యమరియ దివ్యమందసమై, క్రీస్తుప్రభువునకు
జన్మనిచ్చి, మానవాళి కోల్పోయిన జీవమును, తిరిగి పొందుకొనే నిత్యజీవమునకు రక్షణద్వారమై
నిలిచిన ధన్యురాలు! పరిశుద్ధ కన్యమరియ మాతను, పరమ తండ్రి దేవుడు, సృష్టి
సృష్టింపక మునుపే, ఎన్నుకొనిన ధన్యకన్యక! సాక్షాత్తు దేవుని కుమారుడినే, ఆమె గర్భమునందు మోసిన ధన్యురాలు పరిశుద్ధ కన్యమరియమాత!
భువియందు మానవాళికి, కోల్పోయిన రక్షణను తిరిగి తెచ్చిన, దైవకుమారుడైన
యేసుక్రీస్తు ప్రభువునకు, జన్మనిచ్చి, ప్రభుయందు భయభక్తులు కలిగి, జీవించి, పరమ తండ్రి
దేవుని కనికరమును పొందుకున్న, ఆశీర్వదింపబడిన 'స్త్రీ' పరిశుద్ధ కన్యమరియ.
ఈరోజు
పరిశుద్ధ కన్య మరియమ్మ మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడుచున్నాము. అలాగే, భారత స్వాతంత్ర్య దినోత్సవమును జరుపుకుంటున్నాము. ఈ రెండు సంఘటనలు
ఒకే రోజున రావడం ఒక అద్భుతమైన అవకాశం. మరియమాత పాపంనుండి సంపూర్ణ స్వేచ్ఛ పొందిన
వ్యక్తి. ఆమె జీవితం, దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడి
ఉండడం ద్వారా, నిజమైన స్వాతంత్ర్యం ఎలా ఉంటుందో
చూపిస్తుంది. ఈ స్వేచ్ఛ మన దేశం కోరుకుంటున్న స్వేచ్ఛకు ఆదర్శంగా నిలుస్తుంది!
ప్రభువునందు
ఆనందించుచు, కన్యమరియ గౌరవార్ధము ఆమె మోక్షారోహణ మహోత్సవమును
కొనియాడుచున్నాము. మరియ మోక్షారోహణ సందర్భమున దేవదూతలు పరవశించి దైవకుమారుని
స్తుతించిరి. ఈలోకములో ఒక పావన మందసముగా జీవించినటువంటి మరియతల్లి ఆత్మశరీరములతో
మోక్షమునకు ఎత్తబడినది. దీనిని మనము ఒక గొప్ప పండుగగా నేడు కొనియాడు చున్నాము. ఈరోజు మనం మరియమ్మ ఇహలోక జీవితం ముగిసి, ఆమె
శరీరంతో, ఆత్మతో సహా పరలోక మహిమలోనికి ఆరోహణమైన శుభదినాన్ని జ్ఞాపకం
చేసుకుంటున్నాము. మరియ మోక్షారోహణం అనేది ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు. అది
మనకు ఆశను, మన అంతిమ గమ్యాన్ని సూచించే ఒక గొప్ప సందేశం. ఈ పండుగ మన పునరుత్థానంపై
ఆశను కలిగిస్తుంది. శరీర ఉత్థానమునందు మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. మన భౌతిక
జీవితాలకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉందని, శాశ్వతమైన మహిమకు మనం యోగ్యులమని ఈ పండుగ
మనకు బోధిస్తుంది. సంపూర్ణ విమోచన, రక్షణ అంటే ఏమిటో ఈ పండుగ మనకు తెలియ
జేస్తుంది. మరియ జీవితం, అచంచలమైన విశ్వాసం, వినయపూర్వకమైన విధేయత, దేవునిపట్ల
లోతైన ప్రేమ మనదరికి ఆదర్శం!
1950వ
సంవత్సరము నవంబరు 1వ తేదీన 12వ పయస్
పోపుగారు “మునిఫిషెన్తిస్సిముస్ దేయుస్” (Munificentissimus Deus) అను
విశ్వలేఖ ద్వారా, “తన భూలోక జీవితమును సంపూర్ణముగావించుకొన్న కన్య మరియమ్మ, ఆత్మశరీరములతో
మోక్షమునకు కొనిపోబడినది” అని ఈ గొప్ప విశ్వాస సత్యమును బోధించారు. విశ్వాసులందరికి
మరియమాత మోక్షారోహణము చాలా ఉన్నతమైనది. ఎందుకంటే, అది
కన్యమరియమ్మ పరలోక జనన పండుగ. మానవులందరికీ పరలోక రాజ్య బహుమానమును గూర్చి ఈ
మహోత్సవము బోధిస్తుంది.
ఈనాటి మహోత్సవ
సారాంశం: దైవకుమారుని తల్లియగు నిష్కళంక కన్యమరియమ్మను
ఆత్మ శరీరములతో స్వర్గీయ మహిమలోనికి దేవుడు చేర్చుకొని యున్నారు. ఈ దినము కన్యకయగు
దేవమాతకు స్వర్గప్రవేశ వరము లభించింది. ఈవిధముగా, మరియ
సత్యసభ పొందవలసియున్న పరిపూర్ణ రూపురేఖలకు సూచకముగా ఉన్నది. ఈ లోకమందు జీవితయాత్ర
గడుపు మనందరికీ నమ్మక పూరిత ఆశగాను, దుఃఖ:బాధల మధ్యన ఊరటగాను ఆమె వెలసి
యున్నది. దైవకుమారుని కనిన ఆమె శరీరము మరణానంతరము శిధిల మొందుటకు అంగీకరించలేదు.
ఆమె ఆత్మ శరీరములతో మోక్షమునకు ఎత్తబడి యున్నది. అందుకే, మరియ
స్తుతిగీతములో చెప్పిన వాక్యాలు, అక్షరాల నేరవేర్చబడ్డాయి. “తరతరములవారు నన్ను
ధన్యురాలని పిలుతురు. ఎందుకన, సర్వేశ్వరుడు నాయందు ఘనకార్యములను నెరవేర్చెను.”
దేవుడు మరియ జీవితములో చేసిన ఒక మహోన్నత కార్యము, ఆమెను
ఆత్మ శరీరములతో స్వర్గీయ మహిమలోనికి చేర్చుకొనుట.
ఈ మహోత్సవం,
మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఏవిధముగా తోడ్పడుచున్నది? యేసు
చెప్పినట్లుగా, “తండ్రి గృహమున అనేక నివాసములు కలవు” (యో 14:2).
మానవుని నివాసము దేవుడు. అదే నిత్య నివాసము, నిత్యజీవితము,
నిత్యసంతోషము. మరియ ఆ నివాసమునకు ఆత్మ శరీరములతో కొనిపోబడి యున్నది.
అంత మాత్రమున మరియమ్మ మనకు దూరము కాలేదు. దేవునిలో ఐక్యమైన మరియ దేవుని సానిధ్యాన్ని
పంచుకొనియున్నది. దైవసాన్నిధ్యం మన దరిలోనే ఉన్నది. దేవున్ని ఆశ్రయించే ప్రతీవారి
దరికి ఆయన వచ్చును. దేవునిలో మనకొరకు నివాసమున్నట్లే, మనలోకూడా
దేవుని కొరకు నివాసమున్నది. మరియ దేవుని సాన్నిధ్యాన్ని హృదయములో పదిలపరచుకొన్నది.
అలాగే, మనలో దైవసాన్నిధ్యమున్నదంటే, మనలో
దేవునికి నివాసము ఉన్నట్లే గదా! ఈ సాన్నిధ్యం, విశ్వాసమున
ప్రదర్శింపబడు చున్నది. విశ్వాసమున మన జీవిత ద్వారాలను తెరచిన దేవుడు మనలో కొలువు
దీరును. దేవుని కొలువుతో మన జీవితం ధన్యమవుతుంది.
మరియమ్మ
మనకు ఎన్నో విధాలుగా ఆదర్శప్రాయులు. ఈరోజు ప్రత్యేకముగా అమ్మ మరియ ప్రార్ధన
సహాయాన్ని వేడుకొందాం. ఆమె ప్రార్ధన ఫలితమున మన విశ్వాసం అధికమధికమగునుగాక. దేవుడు
మనకు ఇచ్చిన సమయములో గొప్ప నమ్మకముతో జీవింతుముగాక. మనముకూడా పునరుత్థాన మహిమను
సాధించగలుగుదుముగాక.
ఈరోజు మన
దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని కొనియాడుచున్నాము. మన దేశాభివృద్ది కొరకు
ప్రార్ధన చేద్దాం. స్వాతంత్రం, సమానత్వం, అభివృద్దిని,
ప్రతీ భారతీయుడు చవిచూడాలని ఆశిద్దాం. మన స్వాతంత్రం కొరకు పాటుబడి మరణించిన
వారిని గుర్తుకు చేసుకొంటూ, వారు చూపించిన సన్మార్గములో మనం నడవడానికి
కావలసిన శక్తిని ఇవ్వుమని దేవున్ని ప్రార్ధిద్దాం. భారత దేశము కొరకు విజ్ఞాపన
ప్రార్ధన చేద్దాం. ఈ రోజు బాహ్య శరీరాలకు స్వాతంత్ర్యం చేకూర్చబడిన రోజు. అయితే,
అంత:రంగిక ఆత్మలు పాపము నుండి విడుదల పొంది, స్వేచ్ఛను,
స్వాతంత్ర్యమును పొందాలని మన దేశం కొరకు ప్రార్ధన చేద్దాం.
స్వేచ్ఛ
అనగా నేమి? “మన స్వంత బాధ్యతతో ఉద్దేశపూర్వకమైన
చర్యలను చేపట్టు శక్తియే స్వేచ్ఛ. సత్యములోను, మంచితనములోను,
అభివృద్ధికి, పరిణతికి అవసరమయ్యే శక్తియే స్వేచ్ఛ. మనిషి
స్వేచ్ఛ దేవుని వైపుకు నిశ్చితముగా సాగాలి. ఈ స్వేచ్ఛ మానవ చర్యలకు విలక్షణతను ఆపాదిస్తుంది.
మనం ఎంత ఎక్కువగా మంచిని చేస్తే అంత ఎక్కువగా స్వేచ్చాపరులము అవుతాము. స్వేచ్ఛ
మనలను బాధ్యత కలిగి జీవించునట్లు చేస్తుంది. స్వేచ్ఛను వినియోగించడమనగా ఏదిబడితే
అది చెప్పడం, చేయడం కాదు. స్వేచ్ఛ ఉందికదాయని, స్వప్రయోజనాల
సంతృప్తికోసం ఇహలోక వస్తువులను భోగించడమే భవితగమ్యం అని భావించడం పొరపాటు”
(కతోలిక శ్రీసభ సత్యోపదేశం).
స్వేచ్ఛగా
జీవించడానికి ఆర్ధిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక
పరిస్థితులను చాలాసార్లు ఉల్లంఘిస్తూ ఉంటాము. అది మన నైతిక జీవనాన్ని కుంటుబరచి
ప్రేమకు విరుద్ధముగా పాపంచేసే శోధనలలో పడవేస్తుంది. నైతిక చట్టాన్ని ఉల్లంఘించడం
ద్వారా, మనిషి తన స్వంత స్వేచ్ఛను కోల్పోతాడు, తనలోతానే
బంధీ అవుతాడు. ఇరుగుపొరుగు వారితో సహవాసాన్ని కోల్పోతాడు. దైవసత్యాన్ని
ఎదిరిస్తాడు.
మామూలుగా,
స్వేచ్ఛ అనగా సామాజిక న్యాయం, సమానత్వం, ఎంచుకొను
హక్కు, అనియంత్రిత, మెరుగైన
జీవితం మొదలగు వానిగా భావిస్తూ ఉంటాము. ఈ రోజు ‘స్వేచ్ఛ’ అనే
పదమును వ్యక్తిగత, స్వార్ధపూరిత ప్రయోజనాలకు, వ్యక్తిగత
ఆలోచనలకు వక్రీకరించ బడుచున్నది. ఈనాడు కొన్ని దుష్టశక్తులు మన దేశములో
స్వార్ధపూరితముగా ఉంటున్నాయి. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అనుకొంటూ అజ్ఞానములో,
అంధకారములో జీవిస్తున్నాము. దీనిఫలితమే, ఇంకా
మన దేశములో ప్రబలిపోతున్న అణచివేతలు, అరాచకాలు, వివక్షలు,
అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు,
తప్పుడు కేసులు! అందుకే, ఈ రోజు మన దేశం కోసం ప్రార్ధన చేయాలి.
నిజమైన స్వాతంత్ర్యం కోసం ప్రార్ధన చేయాలి. ఈనాడు పరిశుద్ధ కన్యమరియమాత మోక్షరోహణ పండుగ జరుపుకుంటున్న ఈ తరుణంలో, ప్రతి స్త్రీ పరిశుద్ధ
కన్యమరియమాత ప్రార్థనా సహాయమును వేడుకొని, గౌరవింపబడేటట్లుగా,
దేవుని ఆశీర్వాదములు పొందుకొనేటట్లుగా, ఒక విలువైన జీవితమును జీవించే విధంగా, మంచి ప్రవర్తనను కలిగి
ప్రవర్తించే విధముగా ప్రార్థించుకోవాలి.
స్త్రీలకు రక్షణ, మర్యాద, విలువ ఇచ్చే విధముగా, ప్రతిఒక్కరూ నడుచుకునే విధముగా పరిస్థితులను
కల్పించమని, ప్రతి స్త్రీ దీనురాలుగా, వినయం కలిగి,
జీవించే హృదయములను ప్రసాదించమని, పరిశుద్ధ కన్యమరియమాతను, ఈ పండుగ రోజు ప్రార్థించమని వేడుకుందాం. మరియమాతను
గౌరవించడం ద్వారా, సమాజంలోని ప్రతి స్త్రీని గౌరవించాలి.
ఆమె పునరుత్థాన మహిమలో భాగమైనట్లు, ఈ సమాజంలో ప్రతి మహిళ కూడా గౌరవం,
రక్షణ, స్వేచ్ఛ పొందేలా
మనం కృషి చేయాలి.
యోహాను
8:31-32లో ప్రభువు మనతో అంటున్నారు, “మీరు నా మాటలపై నిలిచి
యున్నచో, నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును
గ్రహించెదరు. సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును.” ఇది మనం పొందవలసిన నిజమైన
స్వేచ్ఛ, స్వాతంత్ర్యము. బాధ్యతతో కూడిన స్వేచ్ఛ
ఫలవంతమైనది, అర్ధవంతమైనది. అది సోదర ప్రేమతో ముడిపడి యున్నది.
కనుక మనము అందరిని గౌరవించాలి. మన స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదు. స్వార్ధముగా
జీవించ కూడదు. అలాగే నేటి సమాజములోనున్న చెడును, దుష్టశక్తులను
వ్యతిరేకించాలి. వాటినుండి మనం ఇంకా విముక్తి కావాల్సి యున్నది.
నిజమైన
స్వాతంత్ర్యమును పొందినప్పుడు ఎల్లప్పుడూ మంచినే చేస్తూ ఉంటాము. కనుక, ఈ రోజు
మన దేశం కోసం ప్రార్ధన చేయాలి. పాపము నుండి స్వేచ్ఛ! దాని మరణ వేతనమైన మరణము నుండి
స్వేచ్ఛ! ఇది నిజమైన స్వేచ్ఛ! స్వేచ్ఛ వలన శాశ్వత జీవనము లభించును (రోమీ 6:22,
23). అనగా ఇక జీవించునది నేను కాదు. క్రీస్తే నాయందు జీవించు చున్నాడు
(గలతీ 2:20).
ఈ
స్వేచ్ఛ వలన మనము మరియ తల్లివలె దేవుని పిలుపునకు, చిత్తానికి,
“అవును” అని ప్రత్యుత్తరము ఇవ్వగలము. ఈ రోజు మరియ
తల్లి మోక్షారోహణ మహోత్సవాన్ని కొనియాడు చున్నాము కనుక, మన
దేశం కోసం ప్రార్ధన చేసేప్పుడు మరియ తల్లి ప్రార్ధన సహాయాన్ని వేడుకుందాం! ఆమె
నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యములో జీవించినది, పాపరహితగా, నిష్కళంక
మరియగా జన్మించినది. సంపూర్ణ స్వేచ్ఛపరురాలు, సంపూర్ణ
స్వతంత్రురాలు.
మరియ
మోక్షారోహణము అనగా ఆత్మ, శరీరములతో పరలోకమునకు కొనిపోబడుట. ఈ భాగ్యాన్ని
దేవుడు కొద్ది మందికి మాత్రమే ఇచ్చాడు, మొదటి వ్యక్తి హనోకు (ఆది 5:24),
ఆతరువాత, ఏలియా (2 రాజు 2:11) మరియు మరియతల్లి.
మనం పాపమును వీడి పుణ్య మార్గములోనికి రావాలి. అందులకు మరియ తల్లిని, ఆమె
జీవితాన్ని ఆదర్శముగా తీసుకుందాం. ముఖ్యముగా, మరియతల్లి దేవుని చిత్తానికి లోబడి
జీవించింది. మనం కూడా మన జీవితాల్లో ఎదురయ్యే
సవాళ్ళలో దేవునిపై నమ్మకముంచి, ఆయన చిత్తానికి లోబడటం ద్వారా ఆనందాన్ని,
శాంతిని పొందవచ్చు! అలాగే, మరియతల్లి ప్రార్ధనా
జీవితాన్ని మనమందరం ఆదర్శముగా తీసుకోవాలి. మనం కూడా నిత్యం ప్రార్థన చేయడం ద్వారా,
దేవునితో మన బంధాన్ని బలపరుచుకోవచ్చు!
మన
దేశం కొరకు ప్రత్యేకముగా ప్రార్ధన చేద్దాం. మన దేశం ఇంకా నిజమైన స్వాతంత్ర్యమును,
స్వేచ్ఛను, విడుదలను పొందవలసి యున్నది. పౌరులుగా మన బాధ్యత ఏమిటి? స్వాతంత్ర్యం అంటే కేవలం హక్కులు పొందడం
మాత్రమే కాదు, పౌరులుగా మన బాధ్యతలను నెరవేర్చడం. సమాజంలో
శాంతి, సమగ్రత, ఐక్యత కోసం మనం కృషి చేయాలి. ఒక మంచి దేశభక్తుడు, అదే సమయంలో ఒక మంచి క్రైస్తవుడుగా మనం ఉండాలి. మన విశ్వాసం మన
దేశాన్ని ప్రేమించడానికి, సేవించడానికి మనకు శక్తినిస్తుంది. దేవుని
ఆజ్ఞలను పాటిస్తూ, తోటివారిని ప్రేమించాలి. దేశభక్తి
అనేది దేశం పట్ల ప్రేమ, విధేయత చూపడం. ఈ రెండూ ఒకదానితో ఒకటి
ముడిపడి ఉంటాయి. దేవుని సృష్టిలో భాగమైన మన దేశాన్ని, దాని ప్రజలను ప్రేమించడం ద్వారా మనం దేవునికి సేవ చేయవచ్చు. విశ్వాసంలో
సేవ అనేది ఒక ముఖ్యమైన భాగం. మనం మన దేశ ప్రజలకు సహాయం చేయడం ద్వారా, పేదవారికి, అణగారిన వారికి అండగా నిలబడటం ద్వారా
మన విశ్వాసాన్ని ఆచరణలో చూపవచ్చు. మన దేశంలో వివిధ మతాలు, కులాలు, సంస్కృతులకు చెందిన ప్రజలు
నివసిస్తున్నారు. క్రైస్తవులుగా మనం ఇతరులను ప్రేమించడం, గౌరవించడం ద్వారా దేశంలో సామరస్యాన్ని, ఐక్యతను పెంపొందించవచ్చు. ఇతరుల విశ్వాసాలను గౌరవించడం ద్వారా నిజమైన
దేశభక్తిని చూపవచ్చు.
మరియ
తల్లి విన్నపము ద్వారా, దేశములో శాంతి, సమాధానము,
భద్రత కొరకు ప్రార్ధన చేద్దాం. రోమీ. 6:22లో చెప్పబడినట్లుగా, “ఈనాడు
పాపము నుండి విముక్తి పొంది, దేవునికి దాసులమైతిమి. పవిత్రతకు చెందిన ఫలితమును
స్వీకరించితిమి. చివరకు, శాశ్వత జీవితము లభించును.”
ఆవిధముగా ప్రత్యేకింపబడిన, ఆశీర్వదింపబడిన,
దేవుని వాక్కు నెరవేరునని విశ్వసించిన పరిశుద్ధ
కన్యమరియ మాతకు, మనమందరమూ వందనములు తెలియపరుస్తూ, ప్రతివ్యక్తి
హృదయంలో ఆమె కీర్తింపబడే విధముగా ప్రతి కుటుంబమునకు ఆమె ఆశీర్వాదములు, ఆమె
ప్రార్థన సహాయము, మనందరియొక్క లోటులను,
కొరతలను తీర్చేవిధంగా, పరిశుద్ధ కన్యమరియమాత మోక్షారోహణ
పండుగ సందర్భముగా, మనందరి కొరకూ, ప్రార్థింపమని వేడుకుందాం. విశ్వాసం, పవిత్రతతో కూడిన జీవితాలను గడపడానికి మనకు
సహాయం చేయమని వేడుకుందాం! ఆమెన్.
No comments:
Post a Comment