పరిశుద్ధ మరియరాణి మహోత్సవం (ఆగష్టు 22)

 పరిశుద్ధ మరియరాణి మహోత్సవం (ఆగష్టు 22)

- Mr. Joseph Avinash, Guntur


రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన క్రీస్తు భగవానుడి తల్లియగు మరియమాతను కతోలిక విశ్వాసులు ప్రాచీన కాలం నుండే రాజ్ఞిగా గౌరవించటం ఆనాదిగా వస్తున్న విశ్వాసం.

భూలోక జీవిత యాత్రను విశ్వాసముతో ముగించుకొని "మోక్షారోపణం" చెందిన మరియతల్లిని, తండ్రి కుమారా, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు దైవ వ్యక్తులు ఆమెను ఇహఃపరలోకాలకు రాజ్ఞిగా నియమించి కిరీటం ఉంచారు. శ్రీసభ ఆమెను రాజ్ఞిగా ఎన్నుకొని "మరియ రాజ్ఞి" మహోత్సవాన్ని నెలకొల్పింది.

ప్రతిఏటా ఆగష్టు 22వ తేదీన మన తల్లి శ్రీసభ "మరియ రాజ్ఞి" ఉత్సవాన్ని భక్తివిశ్వాసాలతో కొనియాడుతూ, మరియమాత ఇహ:పరలోకాలకు రాజ్ఞి అనే సత్యాన్ని ప్రకటిస్తుంది. ఈ మేరకు మరియరాజ్ఞీ పండుగను గూర్చి, మరియతల్లి రాచరికమును గూర్చి కొన్ని విషయాలను ధ్యానిద్దాం:

ప్రాచీన విశ్వాసం:

4వ శతాబ్ద కాలానికి చెందిన పునీత ఎఫ్రేమ్ మరియతల్లిని 'రాణి' అని సంబోధించారు. ఈ సంబోధనలు అప్పటినుండి శ్రీసభలో కొనసాగుచున్నవి. కథోలిక వేదపండితులు, మత పెద్దలు, మరెందరో పునీతులు మరియతల్లిని రాణిగా సంబోధించడం కొనసాగించారు. ఏడవ శతాబ్ద కాలానికి చెందిన పునీత ఇల్డెఫోన్సస్ మరియతల్లిని  గూర్చి "నేను క్రీస్తు దాసున్ని గనుక మరియ దాసున్ని, మరియ దేవుని దాసురాలు గనుక నా రాజ్ఞీ నేను మరియ రాజ్ఞిని సేవించి క్రీస్తు సేవకుడనని రుజువు చేసుకుంటాను" అని పేర్కొన్నారు. 11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు, మరియమాత గౌరవార్థం ‘పరిశుద్ధ రాణి వందనం’, ‘పరలోక రాణి వందనం’, ‘మోక్షరాజ్ఞి వందనం’ అని సంబోధించినట్లు శ్రీసభ సాంప్రదాయంద్వారా, పితరుల బోధనలద్వారా తెలుస్తున్నది.

పండుగ చరిత్ర:

1954 అక్టోబర్ 11న, 12వ భక్తినాథ పోపుగారు విశ్వాసుల కోరిక నిమిత్తం "మరియరాణి" పండుగను దైవార్చన  కాలెండరులో చేర్చారు. అప్పటినుండి ఈ పండుగకు విశ్వాస సత్య హోదా లభించినది. 12వ భక్తినాథ పోపుగారు మరియ మాతకు "రాణి" అనే బిరుదు ఆమోదయోగ్య మైనదని పేర్కొన్నారు. ఇప్పుడు "మరియరాణి" పండుగను మరియ "మోక్షారోపణ" పండుగనుండి ఎనిమిదవ నాడు (ఆగస్టు 22) కొనియాడినట్లు శ్రీసభ నిర్ణయించింది.

మరియ రాజ్ఞి – నిర్వచనం:

మరియమాత పిత,సుత, పవిత్రాత్మ అను ముగ్గురు దైవ వ్యక్తుల సమక్షంలో ఇహ:పరలోకాలకు రాజ్ఞీగా నియమింపబడింది. సర్వ సృష్టిప్రాణులందరికీ ఆమె రాజ్ఞి."'కృపారసముగల మాతయై యుండెడి రాజ్ఞి" వందనము' మొదలైన ప్రాచీన జపములు ఆమెను రాజ్ఞిగా పేర్కొంటాయి .కనుక బహు ప్రాచీన కాలం నుండే, క్రైస్తవ భక్తజనులు ఆమెను రాజ్ఞిగా కొనియాడుతూ వచ్చారని విశదమవుతుంది. మరియ తల్లి రాజ్ఞిత్వం పరిపాలన కొరకు కాదు. మన కొరకు తన ప్రియ కుమారునికి మనవి చేయటం కోసం. ఆ తల్లి మానవులందరి కొరకు క్రీస్తుకు మనవి చేస్తుంది. క్రీస్తు ద్వారా మన క్రైస్తవ జీవితానికి కావలసిన వర ప్రసాదాలను అర్ధించి పెడుతోంది. ఆమె రాజ్యం క్రీస్తురాజ్యం- దైవరాజ్యం. భూమిపైన ఉత్తరించు స్ధలములో, నరకంలో, మోక్షంలో కూడా ఆమె రాచరికం చెల్లుతుంది. నరకంలోని దుష్ట ఆత్మలకు గర్వభంగం కలిగిస్తారు. ఉత్తరించు స్థలములోని ఆత్మలకు తన ప్రియ కుమారునిద్వారా విడుదల ప్రసాదిస్తారు. మోక్షంలోని దేవదూతలకు, సకల పునీతులకు రాజ్ఞిగా ఉన్నారు. క్రీస్తు రాజ్య పాలన చేయనంత కాలము, మరియ రాజ్ఞిగా ఉంటారు ఇది దైవ చిత్తం.

మరియ రాజ్ఞి - దేవుని ఉద్దేశం:

క్రీస్తును రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు అడుగు జాడల్లో నడిచే వారికి ఆయన రాజ్యపాలనలో  సైతం పాలుపంచుకుంటారు అన్న వాగ్దానం మరియమాత విషయంలో నెరవేరినది (మత్త. 19:28). అనగా దేవుని సామ్రాజ్యంలో పాలకులుగా, న్యాయమూర్తులుగా అధికారము నెరపెదరు. ప్రభువును అనుసరించడంలో శ్రమలకు గురైనవారు ప్రభువు పాలనలో భాగస్తులు అవుతారు (లూకా. 22:28-30). ప్రభువు కొరకు మరణించిన వారు ఆయనతో రాజ్యపాలన గావిస్తారు (2 తిమో. 2:11-12). మరియతల్లి తన ఇహఃలోక జీవితమంతా దేవుని చిత్తమునకు విధేయంగా జీవించారు. దేవుని చిత్తానుసారము జీవించారు. క్రీస్తును సిలువ మరణం వరకు అనుసరించారు. రాచరికమునకు కావాల్సిన అర్హతలన్నిటిని సాధించారు. అయితే మరియమాత రాచరికం ఆమె సొంత శక్తి వలన పొందిన  కాదు. అది రాజైన క్రీస్తుపై సంపూర్ణంగా ఆధారపడి యున్నది. మరియతల్లి దీనత్వమును బట్టి దేవుడు ఆమెయందు గొప్ప కార్యములు చేసి మహిమ పరిచారు. దేవునిపట్ల మరియమాత చూపిన సంపూర్ణ విశ్వాస, విధేయతల వలన దేవుడు ఆమెను ఇహ:పరలోకాలకు రాజ్ఞిగా నియమించారు.

మరియ రాజమాత, పరలోక రాజ్ఞి - బైబిల్ ఆధారాలు
1. మరియ రాజమాత:

క్రీస్తు రాజ్య పాలనలో భాగస్తురాలుగా, దేవుని న్యాయ సభలో ప్రత్యేక స్థానమును కలిగి యున్నారు. ప్రజల తరుపున మనవి చేయు న్యాయవాదిగాను, తన కుమారునికి సలహాదారునిగా యున్నారు మరియతల్లి. పాత నిబంధనలో దావీదు వంశపు రాజులలో రాజుగారి తల్లి మాత్రమే రాజమాత హోదాను కలిగి యుంటారు. సొలొమోను రాజు తన తల్లి బెత్షెబను చూచి సింహాసనమును దిగి శిరస్సు వంచి నమస్కరించి మరల ఆసనం మీద కూర్చుంటారు. రాజునకు కుడి పక్క బెత్షెబకు మరియొక ఆసనము వేయగా ఆమె దానిపై కూర్చుంటుంది (1 రాజు. 2:19). రాజు తన తల్లితో, 'అమ్మ! నీ మనవులు నాకు తెలుపుము. వాటిని నెరవేరుస్తాను' అంటాడు. అదేవిధంగా, మన తల్లి మరియ రాజ్ఞి కూడా మన మనవులను రాజాధిరాజైన  తన ప్రియ కుమారునికి విన్నవించి మనకు సాధించి పెట్టుచున్నారు.

2. యెషయా ప్రవక్త ప్రవచనము:

"సరే వినుడు; ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కని, అతనికి ‘ఇమ్మానుయేలు’ అని పేరు పెట్టును" (యెషయ. 7:14). యెషయా ప్రవక్త ప్రవచించిన ఈ ప్రవచనం దావీదు వంశములో జన్మించబోవు రాజుకు తల్లి కాబోతున్న రాజమాత మరియను గూర్చి తెలియపరుస్తున్నది. ఆ కుమారునికి "ఇమ్మానుయేలు" అని పేరు పెట్టబడును. "ఇమ్మానుయేలు" అనగా దేవుడు మనతో ఉన్నారని అర్థం. దావీదు వంశములో జన్మించిన రారాజు మెస్సయ్యకు తల్లి మరియమాత కావున తన కుమారుని రాజ్యములో "రాజమాతగా" "పరలోక రాజ్ఞిగా" వెలుగొందుతున్నారు.

3. సైతానుపై యుద్ధం:

ఆదికాండము 3:15 ప్రకారము స్త్రీ సంతతి (క్రీస్తు) సాతాను తలను చిదుక గొట్టును అని  ఉంది. దావీదు వంశపు రాజులు తమ శత్రు సైన్యాన్ని జయించినట్లుగా దావీదు వంశంలో జన్మించిన క్రీస్తు భగవానుడు సైతాను అహమును అణచి దాన్ని సామ్రాజ్యాన్ని కూలద్రోశారు. సాతాను సంతతి తలను చిదుకగొట్టు యుద్ధములో క్రీస్తుతో మరియ సంపూర్ణంగా సహకరించి రాజమాతగా యున్నారు.

4. యోహాను దర్శనం:

"అంతట దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను: ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు. చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై పండ్రెండు నక్షత్రములు గల కిరీటము ఉండెను" (దర్శన. 12:1).

పై వచనములో సూర్యుడే వస్త్రములు గల స్త్రీ మరియమాతను సూచిస్తున్నది. ఆ స్త్రీ కుమారుడే సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలించును. పరలోక సింహాసనమును అధిష్టించి దైవరాజ్య స్థాపన గావిస్తారు. సైతాను రాజ్యమును కూల్చుతారు (దర్శన. 12:5). ఆ స్త్రీ శిరముపై పండ్రెండు నక్షత్రములు గల కిరీటంతో రాచరికపు అంతస్తులతో అలరారు చున్నారు. ఆమె ఇశ్రాయేలీయుల 12 గోత్రములు ప్రజలకేగాక, 12 మంది అపోస్తులులచే నిర్మితమైన యావత్ విశ్వ శ్రీసభకు చెందినవారు యోహానుకు కలిగిన ఈ దర్శనము రాచరికపు స్త్రీ రారాజుకు జన్మనివ్వటమునకు గుర్తుగా యున్నది.

5. ఎలిజబేతమ్మ సాక్ష్యం:

మరియతల్లి ఎలిజబేతమ్మను సందర్శించినప్పుడు ఎలిజబేతమ్మ ఆనందముతో మరియతల్లిని, "నా ప్రభువు తల్లి" అని పేర్కొన్నారు. ఈ విధంగా అనటం ద్వారా మరియ రక్షకుడు, రాజైన క్రీస్తు భగవానుడు తల్లి రాజమాత అని సాక్ష్యం ఇస్తున్నారు (లూకా. 1:43)

పరలోక పట్టాభిషేకం:

దేవుడు తన దూతలను పంపి మరియమాతను ఆత్మ శరీరాలతో మోక్షానికి తోడ్కొని వచ్చారు. మోక్షంలో గొప్ప ఉత్సవం జరిగింది. దేవుడు తన ప్రియ పుత్రిక మరియను చూచి సంతోషిస్తున్నారు. క్రీస్తు భగవానుడు తల్లిని గాంచి ముగ్ధుడై పోయారు. పవిత్రాత్మ దేవుడు తన నివాసమైన పవిత్ర మరియను చూచి పరవశించాడు. అందరూ ఆమెను గౌరవిస్తూ ఆహ్వానించారు. దూత గణములు ఆనంద నాదము చేశాయి. స్తుతి గీతాలు ఆలపించాయి. త్రిత్వేక సర్వేశ్వరుడే ఎదురేగి ఆహ్వానించి, సింహాసనం మీద ఆసీనురాలను చేసి పరలోక, భూలోక రాణిగా ప్రకటించి అభిషేకించి కిరీటంతో అలంకరించారు. స్వర్గస్తులంతా సంతోషించారు. మరియతల్లి వినయ విధేయతలతో ఒదిగిపోయి దేవుని స్తుతించారు.

భక్తి భావం:

మరియ ఇహఃపరలోకాలకు రాజ్ఞీ అని మనము సంపూర్తిగా విశ్వసించాలి, సేవించాలి. మన జప తపాలు, భక్తి క్రియలు, పుణ్యకార్యాలు ఆ రాజ్ఞీకి కానుక పెట్టాలి. 12వ శతాబ్దంలోనే భక్తుడు బెర్నార్డ్ మరియతల్లిని ఉద్దేశించి, 'తల్లీ! నీ శరణుజొచ్చి, నీ సహాయమడిగి, నీ వేడుకోలును కోరుకున్న వాళ్ళల్లో నిరాశ చెందినవాడు ఒక్కడు లేడు' అని సవాలు చేశాడు. ఈ సవాలు మనకు ధైర్యం ఆశను కలిగించాలి. కనుక భక్తులు నమ్మకంతో ఆ తల్లిని శరణు వేడుతుండాలి. తల్లిచాటు బిడ్డలుగా భక్తివంతమైన జీవితాన్ని జీవించాలి. క్రీస్తు మార్గంలో నడవాలి.

లూర్దు నగరములోని మరియ దర్శనాలలో, ఆ తల్లి తననుతాను, “జన్మపాపము లేక జన్మించన రాణిని” అని సగర్వముగా వెల్లడించినది.

2 comments:

  1. Glory to the God 🙏

    ReplyDelete
  2. మంచి వివరణ ఇచ్చారు ఫాదర్ గారు 🙏🙏

    ReplyDelete