పవిత్ర సిలువ విజయోత్సవము (14 సెప్టెంబరు)

పవిత్ర సిలువ విజయోత్సవము (14 సెప్టెంబరు)
సంఖ్యా 21:4-9; ఫిలిప్పీ 2:6-11; యోహాను 3:13-17


సెప్టెంబరు 14న శ్రీసభ పవిత్ర సిలువ విజయోత్సవంను ఘనంగా జరుపుకుంటుంది. ఈ పండుగ క్రీస్తు సిలువను మహిమపరచడానికి, ఆ సిలువ మార్గంలో పయనించడానికి, మన సిలువలను విశ్వాసంతో మోయడానికి మనల్ని ఆజ్ఞాపిస్తుంది.

పండుగ చరిత్ర:

క్రీ.శ. 320 సెప్టెంబర్ 14, కల్వరిలో క్రీస్తు ప్రభువు మోసిన సిలువ కోసం జరిగిన అన్వేషణ ఫలించి పవిత్ర సిలువ లభ్యమైంది. ఐదు సంవత్సరాల తరువాత, క్రీ.శ. 325లో, కాన్స్టాంటైన్ చక్రవర్తి యెరుషలేములోని కల్వరి కొండ సమీపంలో ఒక దేవాలయాన్ని నిర్మించి, పవిత్ర సిలువలో కొంత భాగాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు.

అయితే, క్రీ.శ. 614లో పెర్షియన్ రాజు ఖోస్రోయి యెరుషలేముపై దాడి చేసి విజయం సాధించి, తన విజయ సూచనగా దేవాలయంలోని పవిత్ర సిలువను అహంకారంతో తీసుకొని వెళ్ళాడు. 13 సంవత్సరాల తర్వాత, క్రీ.శ. 627లో, కాన్స్టాంటైన్ నోపిల్‌కు చెందిన హేరక్లియుస్ చక్రవర్తి పెర్షియన్ రాజును ఓడించాడు. పవిత్ర సిలువను తిరిగి యెరుషలేముకు పంపించాడు. క్రీ.శ. 629లో, హేరక్లియుస్ చక్రవర్తి యెరుషలేముకు వచ్చి సెప్టెంబర్ 14న సిలువను పునఃప్రతిష్ఠించి ఆరాధించారు. ఈ సంఘటననే మనం ‘పవిత్ర సిలువ విజయోత్సవం’గా జరుపుకుంటున్నాం.

క్రైస్తవ లోకంలో సిలువ చరిత్ర:

సిలువపై క్రీస్తు శరీరాన్ని చూపించే ఆచారం ఐదవ శతాబ్దంలో ప్రారంభమైంది. నాల్గవ శతాబ్దం వరకు క్రైస్తవులు కేవలం ఖాళీ సిలువనే వాడేవారు. ఈ ఖాళీ సిలువ కూడా నాల్గవ శతాబ్దంలోనే ప్రచారంలోకి వచ్చింది. తొలి మూడు శతాబ్దాల్లో క్రైస్తవులు సిలువను చాలా అరుదుగా వాడారు. దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి:

1.       అన్యమతస్తుల ఎగతాళి: యూదులు, గ్రీకు, రోమన్ ప్రజలు సిలువను ఎగతాళి చేసేవారు. సిలువ ఎక్కినవాడు శాపగ్రస్తుడని యూదుల భావం కాగా, కొరత వేయబడినవాడు వెర్రివాడని గ్రీకు రోమన్ ప్రజల తలంపు. అందువల్ల, తొలి క్రైస్తవులు సిలువను బహిరంగంగా ప్రదర్శించడానికి వెనుకాడారు. ప్రాచీన రోమన్ భవనాల్లో గాడిద తలగల మనిషి సిలువమీద వేలాడుతున్నట్లు, క్రింద ఒక నరుడు అతన్ని ఆరాధిస్తున్నట్లు గీయబడిన చిత్రం ఒకటి కనబడింది. దాని క్రింద “అలెక్స్ప్రెమెనోస్ తన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు” అని వ్రాసి ఉంది. ఆ గాడిద తలగల మనిషి క్రీస్తే, అలా ఆ రోజుల్లో అన్యమతాలవాళ్ళు సిలువ వేయబడిన క్రీస్తుని ఎగతాళి చేసేవారు.

2.       వేదహింసలు: తొలి మూడు శతాబ్దాల్లో వేదహింసలు ఉండేవి. సిలువ చిహ్నం ద్వారా క్రైస్తవులు రోమన్ ప్రభుత్వానికి చిక్కిపోయే ప్రమాదం ఉంది. అందుచేత వారు దాన్ని వాడటానికి భయపడ్డారు.

ఇంకా, క్రీస్తును దిగంబరునిగానే సిలువ వేశారు. అలాంటి దిగంబర క్రీస్తును బహిరంగంగా చూపించడానికి క్రైస్తవులు వెనుకాడారు. అందుకే క్రీస్తు రూపం ఉన్న సిలువలు ఐదవ శతాబ్దం వరకు వాడుకలోకి రాలేదు. అంతకు ముందు క్రీస్తు దేహం లేని సిలువను వాడి అది జీవన దాయకమైనదని విశ్వసించేవారు.

సిలువ వాడకం:

క్రైస్తవ సంకేతాలన్నిటిలోను మనం ఎక్కువగా వాడేది సిలువనే. ఐదవ శతాబ్దంలోనే సిరియా దేశంలో పూజనర్పించే పీఠంపై సిలువను పెట్టేవాళ్ళు. ఆరవ శతాబ్దంలో ప్రదక్షిణాల్లో సిలువను మోసుకొనిపోవడం మొదలుపెట్టారు. 8వ శతాబ్దంలో షార్ల్మేన్ రాజు పోపు గారికి ప్రదక్షిణ సిలువను బహూకరించాడు. ప్రదక్షిణం ముగిసాక దాన్ని పూజనర్పించే పీఠం దగ్గర పెట్టేవారు. మధ్యయుగాల్లో దేవాలయాల గోడలపై పండ్రెండు చోట్ల సిలువ ఆకృతులు చెక్కేవారు. ఈ పండ్రెండు చోట్ల దేవాలయాలకు ప్రతిష్ఠ చేసేవారు. క్రమేణ దేవాలయాల మీదే కాకుండా ఇళ్ళ మీద, బళ్ళ మీద, ఇంకా రకరకాల కట్టడాల మీద సిలువ ఆకృతులు నిర్మించారు. సమాధుల దొడ్లలో సిలువలు నెలకొల్పారు. పూజ వస్త్రాలపై వాటిని కుట్టించారు.

క్రమేణ పంట భూములను సిలువతో ఆశీర్వదించడం మొదలుపెట్టారు. అలాగే నూతన భవనాలు, వాహనాలు, పశువులు మొదలైనవాటిని కూడా ఆశీర్వదించారు. సిలువ ఆకృతులను కూడా సిలువ గుర్తుతో ఆశీర్వదించారు. భక్తిగలవారు తాము వాడుకొనే ప్రతి క్రొత్త వస్తువును మొదట సిలువతో ఆశీర్వదించి గాని వాడుకొనేవారు కాదు.

11-13 శతాబ్దాల మధ్యకాలంలో క్రైస్తవులు మహమ్మదీయులతో చేసిన యుద్ధాలకు “సిలువ యుద్ధాలు” అని పేరు. అయితే ఈ కాలంలో సిలువ క్రీస్తు శ్రమల చిహ్నంగా కాకుండా విజయ చిహ్నంగా మారిపోయింది. క్రీస్తు తన సిలువ ద్వారా మరణాన్నీ, పాపాన్నీ జయించినట్లే మనం కూడా సిలువ ద్వారా శత్రువులను జయిస్తామని క్రైస్తవ ప్రభువులు భావించారు.

రానురాను సిలువభక్తి ఇంకా చాలా భక్తి మార్గాలకు దారితీసింది. పంచగాయాల భక్తి, తిరుహృదయ భక్తి, క్రీస్తు శ్రమల పట్ల భక్తి, సిలువ మార్గం మొదలైన భక్తిమార్గాలన్నీ సిలువ నుండి పుట్టినవే. మధ్యయుగాల్లో సిలువ ధ్యానాలు కూడా విరివిగా ప్రచారంలోకి వచ్చాయి.

సిలువగుర్తును వేసికోవడం:

భక్తులు నుదుటిమీద సిలువ గుర్తు వేసికోవడం రెండవ శతాబ్దంలోనే వాడుకలో ఉండేది. కాని ఈ ఆచారం 4వ శతాబ్దంలో బాగా వాడుకలోకి వచ్చింది. తర్వాత నుదుటి మీద, రొమ్ము మీద కూడా ఈ గుర్తు వేసికొనే పద్ధతి అమలులోకి వచ్చింది. కొందరు దివ్యసత్ప్రసాదంతో కూడా నుదుటిమీద, కళ్ళమీద సిలువ గుర్తు వేసికొనేవాళ్ళు. పెదవుల మీద ఈ గుర్తు వేసికొనే పద్ధతి 8వ శతాబ్దంలో వచ్చింది. నుదురు, రొమ్ము, భుజాలమీద పెద్ద సిలువ గుర్తు వేసికొనే ఆచారం 10వ శతాబ్దంలో వాడుకలోకి వచ్చింది. మొదట నుదుటమీద, రొమ్ముమీద, ఆ పిమ్మట కుడి భుజంమీద, చివరకు ఎడమ భుజంమీద చేతిని త్రిప్పేవారు. తర్వాతి కాలంలో చేతిని ఎడమ భుజం మీదినుండి కుడి భుజం మీదికి త్రిప్పడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఈ పద్ధతే కొనసాగుతూంది.

సిలువ గుర్తు వేసికొనేటప్పుడు భక్తిని కలిగించుకోవడానికి కొన్ని మాటలను కూడా ఉచ్చరించేవారు. “పిత పుత్ర, పవిత్రాత్మ నామమున” అనే మాటలు అతి ప్రాచీన కాలం నుండీ వాడుకలో ఉన్నాయి. వీటికి బదులుగా గ్రీకు క్రైస్తవులు “ఓ పవిత్రుడవైన దేవా, ఓ పవిత్రుడువూ బలవంతుడవూ ఐన దేవా, ఓ పవిత్రుడవూ అమర్త్యుడవూ ఐన దేవా మాపై దయజూపు” అనే మాటలు వాడతారు.

సిలువ గుర్తు ఆశీర్వచనం వెనుక అర్థం: నరులను సిలువ గుర్తుతో ఆశీర్వదించడంలో చాలా అర్థాలున్నాయి? ఆ నరులు క్రీస్తు ముద్రను స్వీకరించి ఆ యజమానునికి చెందుతారని ఒక భావం. వారు క్రీస్తును విశ్వసిస్తున్నారని మరొక అర్థం. ప్రభువు పిశాచ శక్తినుండి మనలను కాపాడతాడని మరొక భావం. క్రీస్తు సిలువ మనలను రక్షించాలని గాని అతని వరప్రసాదం మనలను కాపాడాలని గాని ఇంకొక అర్థం.

ముగింపు:

క్రైస్తవులమైన మనం ఈ దేశంలో అల్పసంఖ్యాకులం. ఐనా అన్యమతస్తుల ముందు మన రక్షణ సాధనమైన సిలువను ప్రదర్శించడానికి ఏమీ సిగ్గుపడకూడదు. ఈ లోకంలో మనం క్రీస్తును అంగీకరించకపోతే పరలోకంలో అతడు మనల్ని ఎలా అంగీకరిస్తారు? పవిత్ర సిలువను మనం మహిమ పరచాలంటే ఒకటే మార్గం - సిలువను గుండెపైన ధరించడం కాదు, గుండెల్లో స్మరించాలి.

ఓ సిలువ! మా రక్షణ కొయ్యా! నిన్నే అంటిపెట్టుకొని ఉండేలా మమ్ము దీవించుము. ఆమెన్.

No comments:

Post a Comment