పునీత మ్యాక్సిమిలియను కోల్బె (14 ఆగష్టు)

 పునీత మ్యాక్సిమిలియను కోల్బె (14 ఆగష్టు)
పోలెండుదేశ ఫ్రాన్సీసుసభ గురువు, కష్టతర శతాబ్ద పాలక పునీతుడు, అభినవ అపోస్తలుడు,
వేదసాక్షి క్రీ.. 1894 - 1941


పోలెండుదేశంలో లోడ్స్ నగర దాపులోని జదున్స్కావోల గ్రామంలో 1894 జనవరి 8న పునీత మ్యాక్సిమిలియను మేరి కోల్బె జన్మించారు. క్రీస్తు సుగుణాల యెడల బాగా ఆకర్షితులయ్యారు. వీరి జ్ఞానస్నానం పేరు రేమండ్. క్రీస్తు అనుచరుడు కాగోరి ఫ్రాన్సీసువారి సభలో చేరారు. 1911, 1917లో గురుశిక్షణా వ్రతాలు స్వీకరించారు. క్రీ.శ. 1918లో రోమునగరంలో గురుపట్టాభిషేకాన్ని పొందారు. గురువుగా మ్యాక్సిమిలియను అను పేరును స్వీకరించారు. పిమ్మట పోలెండు సొంతగడ్డకు విచ్చేశారు.

వీరికి దేవమాత యెడల అపారమైన భక్తి ఉండేది. క్రీస్తు విశ్వాసం వెదజల్లడానికి వీరు “నిష్కళంక మరియమాత దళం'ను నెలకొల్పారు. మాతృదేశంలోను అనేక ఇతర దేశాల్లోను ఈ దళ కార్యక్రమం విస్తరింప జేశారు. వీరు 'జన్మపాపరహితోద్భవి దండు' పేరట ఒక మాసపత్రికను కూడ నెలకొల్పి తమ విశ్వాస భావాల్ని వేలాది భక్తులకు అందించారు. 1927లో “నిర్మలమాత నగరాలు” అని అర్దంనిచ్చే 'నియోపొకలనోవ్' సభను స్థాపించారు. దీని ప్రధానకేంద్రం వార్సా పట్టణంకు 25 మైళ్ల దూరంలోని ప్రదేశంలో నిర్మింప జేశారు. ఈ సభ జపాను భారతదేశంలోను బాగా విస్తరించింది. వీరు జపానులో వేదప్రచారకునిగా విరివిగా పనిచేశారు.

1936లో వీరు పోలెండులోని తమ సభకు సుపీరియరుగా తమ సేవలందించారు. ఆరంభంలోనే దాదాపు ఎనిమిది వందల మందికి పైగా అనుచరులతో తన సభ కార్యక్రమాల్ని విస్తరిల్లజేశారు. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో అనేక బాధలనుభవించారు. 1941లో జర్మను వారు దండెత్తి పోలెండును ఆక్రమించారు. జర్మనీ నియంత హిట్లరు ఏర్పరచిన నాజీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారిని వారు చంపించేవారు.

మ్యాక్సిమిలియను నాజీల దౌష్ట్యాన్ని అమానవీయతను దుయ్యబడుతూ ఆధ్యాత్మిక వ్యాసాలు వ్రాసి ప్రచారం చేశారు. అందులో భాగంగా ఆ రోజుల్లో ఫాదర్ కోల్బెగారుకూడ బంధీగా ఔచ్’విట్జ్ జైలులో ఉంచబడ్డారు. నాజీలకు బంధీలుగా చిక్కినవారిలో కొందరికి అనగా దాదాపు పదిమందికి మరణశిక్ష విధింపబడింది. అందులో ఒక వ్యక్తికి కఠిన శిక్షపడటం, ఫాదర్ కోల్బెగార్ని కలచి వేసింది. ఆ వ్యక్తి పేరు ఫ్రాన్సీజెక్ గజోవ్నిక్ జేక్. ఇతనికి భార్య, అధిక సంఖ్యలో సంతానం ఉన్నారు. అతన్ని విడిపించాలంటే అతని బదులు తాను మరణించాలని కోల్బె నిశ్చయించారు. అతన్ని సాధారణ బంధీల్లోకి మార్చి తాను ఆ స్థానంలో చేరుకున్నారు. ఈ మరణశిక్ష పడిన వారికి అన్న పానీయాలు అందింపబడక మలమల మాడ్చబడ్డారు. వారి శరీరంలోకి ప్రమాదకరమైన ఫినాయిలును ఇంజెక్షను ద్వారా ఎక్కించడం జరిగింది.

విపరీత బాధతో వారు నేలపైబడి గిలగిల కొట్టుకున్నారు. ఒక పేద కుటుంబీకుని రక్షించడం కోసం క్రీస్తు బాటను ఎంచుకున్నారు ఫాదర్ కోల్బె. 1941 ఆగష్టు 14న వీరు ఈ బాధామయ ధన్య మరణ మొందారు. 1982 అక్టోబరు 10న రెండవ జాన్ పాల్ పోపుగారిచే పునీత పట్టానొందారు. తన స్థానంలో మరణించిన గురువు పునీత పట్టా పొందినందుకు జీవించి ఉన్న గజోవిక్ జెక్ ఆనంద బాష్పాలు రాల్చారు. ఆనాడు, “నా ప్రియ సోదరుడా! దేవుని మహిమకోసం రగులుతున్న నా హృదయం నన్ను నీ స్థానంలో ఉంచాలని ఉవ్విళ్లూరుతోంది” అని ఫాదర్ కోల్బె గారు గజోవ్నిక్ జెక్’తో పల్కిన మాటలు పదేపదే జ్ఞాపకం తెచ్చుకున్నారు. పదుగురితో పంచుకున్నారు. కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ‘మ్యాక్సిమిలియను’ అనగా గొప్ప శ్రామికుడు అని అర్థం. వీరు పాత్రికేయులకు పాలక పునీతులు.

No comments:

Post a Comment