వ్యాకులమాత పండుగ - సెప్టెంబర్ 15 వ తేదీ

 వ్యాకులమాత పండుగ - సెప్టెంబర్ 15 వ తేదీ


'శోక సాగరం' వంటి లోకంలో మనకు బాసటగా నిలిచే 'భగవతి' మన మరియతల్లి, మరియతల్లి మన రక్షణార్ధం అవతరించి హింసితుడై మరణించిన యేసుక్రీస్తు బాధాతప్త జీవనంలో భాగస్వామిని ఏ క్షణంలో మరియతల్లి దేవుని పట్ల అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తూ.వినమ్రురాలై- లోక రక్షకుడు క్రీస్తుప్రభువుకు జన్మనీయడానికి అంగీకరించిందో, ఆ క్షణంలోనే మరియతల్లి పరోక్షంగా- పతితులైన మానవుల ఆత్మలను రక్షించటానికి క్రీస్తు అనుభవించబోయే కఠోరమైన శ్రమలను తాను పంచుకోవటానికి సంసిద్ధురాలయ్యారు. ఈ సత్యాన్ని విశదీకరిస్తూ కతోలిక శ్రీ సభ సత్యోపదేశ గ్రంథం ఇలా ప్రబోధిస్తుంది:

"అనితరసాధ్యమైన వినయ శీలము, విశ్వాసము, మొక్కవోని ఆశాభావము, అపారమైన ప్రేమ భావము మూర్తిభవించిన మరియతల్లి పతిత మానవలోకానికి పారలౌకిక జీవ ప్రధానం చేయడంలో తన ప్రియ కుమారునికి బాసటగా నిలిచారు, లోక రక్షణ మహోద్యమంలో తాను భాగస్వామిని అయ్యారు; కుమారుడు లోకరక్షకుడు కాగా తల్లి సహరక్షకిగా వినతి గాంచారు "(కతోలిక శ్రీసభ సత్యోపదేశం; నం 968) అంటే దైవ విధేయురాలుగా మరియతల్లి స్వచ్ఛందంగా అనుభవించిన కష్టాలు, కన్నీళ్లు, జీవన దుఃఖం అన్ని యేసు అనుభవించిన శ్రమలతో కలిసి ఆయన సంకల్పించిన మానవోద్ధరణ మహాయజ్ఞంలో అంతర్భాగాలయ్యాయి; క్రీస్తుని మాతగా మరియతల్లి తన కుమారుని సిలువ చెంత నిలిచి అనుభవించిన కడుపుకోత వర్ణనాతీతమైనది. ఆ గడియలో మరియతల్లి అనుభవించిన శ్రమలను దేవుడు లోకరక్షా యజ్ఞంలో సమిధలుగా పరిగణించాడు; ఆ రక్షకుని మాత రాల్చిన అశ్రుధారలను అమూల్యమైనవిగా భావించారు. ఆ మాతృమూర్తి శోకానికి రక్షాప్రదాయకమైన పరమార్ధాన్ని కల్పించారు. దేవుని తల్లి అంటే ఇతర మత గ్రంధాలను పరిశీలన చేస్తే ఎంతో ఆనందోత్సాహాలతో నిత్యం సేవలు చేయించుకుంటూ ఎటువంటి చీకూచింతా లేకుండా ఉంటుంది. కానీ మరియతల్లి జీవితం ఇందుకు పూర్తి వ్యతిరేకం. ఆ తల్లి సేవలు చేయించుకోలేదు ప్రతిగా సేవలు చేశారు; ఆ తల్లి ఆనందోత్సాహాలను అనుభవించలేదు ప్రతి గా క్రీస్తు శ్రమలను సంతోషంగా అనుభవించారు. మరియతల్లి శ్రమల అనుభవించటానికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తాయి.

మొదటి కారణం-:

క్రీస్తును కన్నతల్లి గనుక మరియతల్లి కష్టాల పాలయ్యారు. తన కుమారుడు సిలువపై మరణ వేదనను అనుభవించడాన్ని కళ్ళారా చూసి తాను ఊపిరిపోసిన తనయుడు తన కన్నుల ముందే విగతజీవుడవుతూ ఉంటే అలవి కాని దుఃఖ భారంతో మరియతల్లి విలవిలలాడారు. ఆ తరుణంలో ఆ కలువరి గిరి పై క్రీస్తు సిలువ నీడన మరికొందరు పుణ్య స్త్రీలు కూడా ఉన్నారు. వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు‌. కానీ వారు అనుభవించే ఆవేదనతో, తల్లిగా మరియ అనుభవించే గర్భశోకాన్ని సరిపోల్చడం సాధ్యం కాదు. కరుణతో కార్చే కన్నీరు వేరు, గుండె పగిలి రాల్చే రక్తకన్నీరు వేరు. అభం, శుభం ఎరుగని తనయుడు అన్యాయంగా సిలువ శిక్ష అనుభవిస్తూ నిస్సహాయంగా మరణిస్తుంటే అశక్తురాలైన ఒక తల్లి పడే ఆవేదనను దేనితో సరిపోల్చగలం? క్రీస్తుని మరణ గడియల్లో మరియతల్లి అనుభవించిన బాధను వర్ణించటానికి మాటలు చాలవు.

రెండవ కారణం-:

మరియమాత శ్రమల అనుభవించటానికి ఆమె చేసినపాపాలు కారణం కాదు.ఆమె జన్మపాపరహితోద్భవి, కళంకం లేని కరుణామయి. గనక తన పాపాల పరిహారార్ధం శ్రమలు అనుభవించవలసిన అవసరం ఆ పుణ్య తల్లికి లేదు. మరి మరియతల్లి అంతటి ఘోరమైన శ్రమలను, కష్టనష్టాలను భరించటానికి కారణం ఏమిటి? దానికి కారణం పాపులమైన మనమే. అవును మానవులమైన మనం చేసిన పాపాలకు పరిహారం కోసమే క్రీస్తు ప్రభువుతో పాటు మరియతల్లి సైతం కష్టాలు అనుభవించవలసి వచ్చింది. మరియతల్లి మనకోసమే శ్రమలు అనుభవించారు.

మరియతల్లి అనుభవించిన 7 దు:ఖ పూరితమైన మరియు బాధతో

కూడిన సంఘటనలను "వ్యాకులమాత"పండుగ ద్వారా మన కతోలిక శ్రీసభ మనందరికీ గుర్తు చేస్తుంది. మరియతల్లి యొక్క

హృదయము మీద ఉన్న ఆ ఏడు ఖడ్గములు మరియతల్లి అనుభవించిన బాధలకు నిదర్శనం. మరియతల్లి అనుభవించిన 7 దుఃఖ పూరితమైన సంఘటనలు:

1. సిమియోను క్రీస్తుప్రభువు యొక్క భవిష్యత్తును, మరియు ఆ భవిష్యత్తులో వచ్చే శ్రమలను గూర్చి చెప్పినప్పుడు.

2. దేవదూత కలలో కనిపించి,"శిశువును చంపుటకు హేరోదు రాజు వెదక బోవుచున్నాడు. కావున నీవు లేచి ఐగుప్తునకు వెళ్ళు అని దేవదూత పునీత జోజప్ప గారికి చెప్పినప్పుడు.

3. యెరూషలేము ఆలయములో ప్రభువు తప్పిపోయినప్పుడు.

4. సిలువ మార్గములో ప్రభువును చూసినప్పుడు.

5. ప్రభువును సిలువ వేసినప్పుడు.

6. ప్రభువు యొక్క పవిత్రమైన శరీరాన్ని సిలువ మీద నుండి దించి మరియతల్లి యొక్క ఒడిలో పెట్టినప్పుడు.

7. ప్రభువు యొక్క పవిత్రమైన శరీరాన్ని భూస్ధాపనము చేసినప్పుడు.

ప్రియమైన మిత్రులారా! మరియతల్లి కార్చిన ప్రతి కన్నీటి బొట్టు ప్రభువు కొరకు కార్చారు, ఈ లోకము కొరకు కార్చారు. ప్రభువు మరణించిన తరువాత ప్రభువు యొక్క దివ్యమైన శరీరాన్ని ఒడిలో వుంచుకొని ఒక కంటితో ప్రభువు కొరకు ఏడుస్తూ ఇంకో కంటితో ఈ లోకము కొరకు ఆలోచించారు. ఈ సమాజములో ఎవరూ భరించలేని అవమానాలను ప్రభువు పేరిట మన కొరకు భరించారు. మన పాపముల కొరకు ప్రభువును త్యాగం చేసిన దయగల అమ్మ మన మరియతల్లి! అందుకే ప్రభువు మరణించే ముందు మరియతల్లిని యోహాను గారికి అప్పగించారు. కేవలం యోహాను గారికి మాత్రమే కాదు, మనందరికీ తల్లిగా ఇచ్చారు. దేవుని పేరిట నిందారోపణలు భరించేవారికి పరలోకములో ప్రత్యేకమైన స్ధానం ఉంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మరియతల్లి ఈ యొక్క మాటకు కట్టుబడి జీవించారు. ఇప్పుడు పరలోకరాజ్ఞిగా తండ్రి దేవుని చేత అభిషేకం పొందారు. "వ్యాకులమాతగా" ఎంతో మంది కన్నీటిని తుడుస్తున్నారు. ఎంతో మందికి ఎన్నో మేలులను దయచేసి ముందుకు నడిపిస్తున్నారు. మన జీవితంలో మన చుట్టూ ఎన్నో కష్టాలు, శోధనలు చుట్టుముట్టి ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం మన విశ్వాసాన్ని కోల్పోతూ అసలు దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా? అని ప్రశ్నిస్తూ ఉంటాము. నిజానికి కష్టాలు, కన్నీళ్లు శోధనలు ఇవన్నీ మనలని దేవునికి దగ్గర చేస్తాయే తప్ప దూరం చేయవు.

ఒక విద్యార్థి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి అంటే పరీక్ష చాలా అవసరం. సంవత్సరకాలం అతను చదివినదంతా కూడా చివరి పరీక్షల్లో మంచిగా రాయగలిగితే ఉత్తీర్ణత సాధిస్తాడు. లేకపోతే ఫెయిల్ అయిపోతాడు. అదే విధముగా మన జీవిత పయనంలో ప్రభువు మనకు ఎన్నో శ్రమలు ఎన్నో కష్టాలను పరీక్షల రూపంలో ఇస్తూ ఉంటారు. మరి మనము మన జీవిత పరీక్షను ఎలా రాస్తున్నాము? ఉత్తీర్ణత సాధించి ప్రభువును సంతోష పెడుతున్నామా? లేదా నిరాశకు గురి చేస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి!

మరియమ్మ గారు క్రీస్తు ప్రభువుకు, ప్రభు శిష్యులకు, ప్రవక్తలకు, పునీతులకు ఎన్నో శ్రమలు ఎన్నో పరీక్షలు ఎదురుపడినప్పుడు వారు తమ విశ్వాసాన్ని కోల్పోలేదు. శిష్యులు కొన్ని సందర్భాలలో తమ విశ్వాసాన్ని కోల్పోయిన, చివరకు మాత్రం విశ్వాసాన్ని బలపరచుకొని ప్రభువు కొరకు మరణించటానికి సిద్ధపడ్డారు.

ఈ యొక్క వ్యాకులమాత పండుగ సందర్భంగా మరియమ్మ గారు అదే తెలియజేస్తున్నారు: ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చిన వాటన్నిటినీ ఎదుర్కొని ప్రభువు కొరకు నడవండి. ప్రభువుతో నడవండి. ప్రభువు కొరకు జీవించండి. ప్రభువుతో జీవించండి అని తెలియజేస్తున్నారు.

మరియమాత తాను అనుభవించిన 7 దుఃఖ పూరితమైన సంఘటనలు గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకొని మనము కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నా ప్రభువు నాకు ఉన్నారు అని విశ్వాసంతో నడుద్దాం.

మరియతల్లి అనుభవించిన 7 దు:ఖ పూరితమైన సంఘటనలు:

1. సిమియోను క్రీస్తుప్రభువు యొక్క భవిష్యత్తును, ఆ భవిష్యత్తులో వచ్చే శ్రమలను గూర్చి చెప్పినప్పుడు -

"ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీయులలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును ఇతడు వివాస్పదమైన గురుతుగా నియమింపబడి యున్నాడు. అనేకుల మనోగత భావములను బయలుపరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొని పోనున్నది" (లూకా 2:34-35).

మోషే చట్టప్రకారం వారు శుద్ధి గావించు కొనవలసిన దినములు కావటం వలన(లూకా 2:22) మరియమాత యోసేపు గారు బాల యేసును తీసుకొని యెరుషలేము దేవాలయానికి వెళ్లారు. నిజానికి మరియమ్మ గారికి జన్మ పాపము లేదు కాబట్టి శుద్దీకరణ సాంగ్యము అవసరం లేదు. అయినా చట్టానికి తలవంచి తనను తాను తగ్గించుకొని మరియమ్మ గారు శుద్దీకరణ పొందడానికి సిద్ధమయ్యారు. ఎవరైనా ఒక స్త్రీకి దేవుడు దర్శనమిచ్చి నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. కానీ నీ కళ్ళ ముందే నీ కుమారుడు మరణిస్తాడు. నువ్వు చూస్తుండగానే దుర్మార్గులు కొందరు నీ కుమారుని ప్రాణాలు తీస్తారు అని చెబితే ఆ స్త్రీ ఏం చేస్తుంది? చదువుతుంటే మనకే కన్నీళ్లు వస్తున్నాయి! ఖచ్చితంగా ఏ అమ్మ దీనికి ఒప్పుకోరు కానీ మరియమ్మ గారు దీనికి భిన్నంగా ప్రవర్తించారు. తనకు జన్మించబోయే దైవ కుమారుడు లోక రక్షణ కోసం శ్రమలను అనుభవించి మరణించబోతున్నారని తెలిసి కూడా మరియమ్మ గారు ప్రభువుకు జన్మనివ్వడానికి సిద్ధపడ్డారు. మానవ రక్షణ కోసం మనకోసం తాను సైతం వ్యాకులమాతగా దుఃఖ భారాన్ని వహించడానికి తన కుమారుని కష్టాలలో కన్నీళ్ళలో పాలు పంచుకోవడానికి అంగీకరించారు. ఇది దేవుని చిత్తం. నేను ఆయన దాసురాలను అంటూ తన ప్రేమను వ్యక్త పరిచారు.

2. దేవదూత కలలో కనిపించి,"శిశువును చంపుటకు హేరోదు రాజు వెదక బోవుచున్నాడు. కావున నీవు లేచి ఐగుప్తునకు వెళ్ళు అని దేవదూత పునీత జోజప్ప గారికి చెప్పినప్పుడు -

హేరోదురాజు బాలయేసును చంపడానికి భటులను పంపుతున్నాడని తెలియగానే మరియతల్లి హృదయం తల్లడిల్లిపోయింది. తక్షణమే పసిగుడ్డు బాలయేసును తీసుకుని భర్త యోసేపు గారితో కలిసి ఐగప్తునకు ప్రయాణమయ్యారు. ఆ రాత్రి వేళ ఆ చీకటిలో చలిలో పసిబిడ్డను తీసుకొని దేశం కాని దేశం ప్రాణభీతితో వెళ్లారు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎంత నీరసంగా ఉంటుందో ప్రతి అమ్మకు ప్రతి అక్కకు తెలుసు. కానీ మరియమాత తన కన్నీటిని తుడుచుకుని మన సంతోషం కొరకు అంత మనోవేదనలో కూడా ముందుకు నడిచారు.

3. యెరూషలేము ఆలయములో ప్రభువు తప్పిపోయినప్పుడు -

మరియమ్మ గారిని తీవ్రమైన మనోవేదనకు గురి చేసిన సంఘటన ప్రభువు తనకు 12 సంవత్సరాల వయసులో ఉండగా జరిగింది. యూదుల ఆచారం ప్రకారం మరియమాత, యోసేపు గారు పాస్కా పండుగకు యెరుషలేము వెళ్లారు. వారితో పాటు బాలయేసును కూడా తీసుకు వెళ్లారు. పండుగ దినాలు ముగిశాక వారు తిరిగి ప్రయాణం అయ్యారు. కానీ బాలయేసు అక్కడే ఉండిపోయారు. ఈ సంగతి తల్లిదండ్రులకు తెలియదు. తమ ప్రాంతం నుంచి వచ్చిన తోటి యాత్రికులతో కలిసి వస్తున్నారు అనుకుని ముందుకు కదలి పోయారు. అలా ఒక రోజంతా ప్రయాణం చేశాక బాలయేసు కోసం వెతికితే ఆయన ఎక్కడా కనిపించలేదు. అప్పుడు మరియతల్లి

అనుభవించిన మనోవేదన అంతా ఇంత కాదు! అందరికీ  అసలే కొత్త ప్రాంతం. పైగా పసి వయసు ఎక్కడ ఉన్నారు, ఏమైపోయారు అనే విషయాలు ఆమెకు తెలియక సమయానికి తిన్నారా లేదా అని కన్నీరు పెడుతూ తల్లడిల్లిపోయారు. చివరికి వేద బోధకుల మధ్య బాలయేసు కూర్చుండి వారి బోధనలను వింటూ వారిని తిరిగి ప్రశ్నలు వేస్తున్నప్పుడు వారు బాలయేసును కనుగొన్నారు.

4. సిలువ మార్గములో ప్రభువును చూసినప్పుడు -

5. ప్రభువును సిలువ వేసినప్పుడు -

6. ప్రభువు యొక్క పవిత్రమైన శరీరాన్ని సిలువ మీద నుండి దించి మరియతల్లి యొక్క ఒడిలో పెట్టినప్పుడు 7. ప్రభువు యొక్క పవిత్రమైన శరీరాన్ని భూస్ధాపనము చేసినప్పుడు -

ఏ తప్పు చేయని తన కుమారుడు దుష్టులైన యూదుల చేతికి చిక్కి అవమానాలను భరించవలసి రావటం మరియతల్లిని తీవ్రమైన మనోవేదనకు గురిచేశాయి. క్రీస్తు ప్రభువు రక్తాన్ని ఆ పవిత్రమైన రక్తాన్ని ఆమె చూసినప్పుడు తన కళ్ళు దుఃఖ సాగరంలో నిండిపోయాయి. ప్రభు దేహాన్ని నిలువెత్తు గాయం చేస్తున్నప్పుడు, ఆ మరియమ్మ గారి హృదయం తట్టుకోలేక కడుపు కోతతో వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ బాధను వర్ణించటం ఎవరి వల్ల కాదు! కానీ ఇవన్నీ మరియమాత భరించారు ఆమె ప్రస్తుత దుఃఖాన్ని చూడలేదు. భవిష్యత్తులో వచ్చే దేవుని రాజ్యాన్ని చూశారు. మన కొరకు శ్రమలను సైతం మౌనంగా భరించారు.

ముగింపు-:

"నన్ను అనుసరింపగోరు వాడు తనను తాను పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను" (మత్తయి సువార్త 16:24).

క్రీస్తు భగవానుడు పై వాక్యంలో చెప్తున్నట్లుగా మన జీవిత యాత్రలో ఎన్ని కష్టనష్టాలు మనకు ఎదురుపడిన దేవుని పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ మన జీవన సిలువను మనం మోయాలి. మరియతల్లి తన జీవిత యాత్రలో క్రీస్తు శ్రమలను సైతం తాను భరించడానికి వెనకడుగు వేయలేదు. ఆనాడు అబ్రహాము గారిని దేవుడు నీ ప్రియ కుమారుని బలిగా సమర్పించు అని అడిగినప్పుడు అబ్రహం గారు ఏమీ ఆలోచించకుండా బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. విశ్వాస పరీక్షలో విజయం సాధించి విశ్వాసులకు తండ్రిగా దేవుని చేత సన్మానించబడ్డారు. అదే విధముగా మరియతల్లి కూడా ధర్మ శాస్త్రం అమలవుతున్న కష్టతరమైన రోజులలో కూడా తన చుట్టూ ఎంత చీకటి ఉన్నా ఎన్ని నిందలు ఉన్నా పవిత్రాత్మ సహకారముతో ప్రభువును కన్నారు. మనందరి పాపాల నిమిత్తం త్యాగం చేశారు. ఈనాడు మనం కూడా మన జీవిత యాత్రలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా నాకు నా దేవుడు ఉన్నారు అనే విశ్వాసముతో ముందుకు నడవాలి. కష్టాలను గెలవాలి అట్టి శక్తి దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని మనసారా ప్రార్థిస్తూ ప్రియ విశ్వాసులందరికీ "వ్యాకులమాత " పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను...

జోసెఫ్ అవినాష్ సావియో
యువ కతోలిక రచయిత
పెదవడ్లపూడి విచారణ

No comments:

Post a Comment