మరియ మాతృత్వ మహోత్సవము, YEAR ABC


మరియ మాతృత్వ మహోత్సవము, YEAR ABC
1 జనవరి
సంఖ్యా. 6:22-27, గలతీ. 4:4-7, లూకా. 2:16-21

భౌతికంగా మరియ తల్లి క్రీస్తుకు మాత్రమే తల్లి. కానీ ఆధ్యాత్మికంగా క్రీస్తు బాటలో నడిచే ప్రతిఒక్కరికీ ఆమె తల్లి. మరియమాత కన్న ఏకైక కుమారుడు యేసు ప్రభువైతే మరియ మాతృత్వం యేసు ప్రభువుద్వారా ఆయన రక్షించబోయే మానవులందరికీ సంక్రమిస్తుంది, తన ప్రియ కుమారుడు యేసు నామమున ముక్తి భాగ్యాన్ని పొందే భక్తజనులందరూ ఆ మాతృమూర్తికి బిడ్డలు అవుతారు.

ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజున మన యావత్ విశ్వశ్రీసభ మరియమాత దివ్యమాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతూ ఆ తల్లి మాతృత్వంలో దాగియున్న గొప్పతనాన్నిగూర్చి, పరిశుద్ధతనుగూర్చి, మరియతల్లి సకల మానవాళికి తల్లి అనే సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నది.

కన్యక అయిన మరియ, దేవుని తల్లి (గ్రీకు Theotokos). Theotokos అనగా 'దేవున్ని మోసేవారు' లేక 'దేవునికి జన్మనిచ్చేవారు' అని అర్ధము. 431వ సం.లో ''ఎఫెసు సభ''నందు మరియ దేవునితల్లి అని అధికారికముగా ప్రకటించబడి యున్నారు. ఎందుకన, ఆమె కుమారుడు యేసుక్రీస్తు, దేవుడు - మానవుడు, దైవ స్వభావమును - మానవ స్వభావమును కలిగియున్న ఒకే వ్యక్తి కనుక. పరిపూర్ణ దేవుడునైన యేసుక్రీస్తు సాక్షాత్తు త్రిత్వంలోని రెండవ వ్యక్తి. అలాంటి భగవాన్మూర్తికి జన్మనిచ్చిన తల్లి మరియ. అలా పరిపూర్ణమైన దైవ-మానవ స్వభావాలు మూర్తిభవించిన యేసుప్రభువును కన్నతల్లిని దేవుని తల్లి, దేవమాత అనటం ఎంత మాత్రము ఆక్షేపణీయం కాదు. కనక మరియతల్లిని దేవమాత అని సంబోధించడం సమంజసమే.

పవిత్రాత్మ ప్రేరిపితురాలైన ఎలిజబేతమ్మ సాక్షాత్తు మరియతల్లిని "నా ప్రభువు తల్లి" (లూకా. 1:43) అని ఎలుగెత్తి పలికినది. పవిత్రాత్మ ప్రేరణతో ఎలిజబేతమ్మ పలికిన మాట అక్షరాలా సత్యం. పవిత్రాత్మ అనుగ్రహంతో, దివ్య శక్తితో తాను గర్భాన  దాల్చిన వ్యక్తి, తన రక్తమాంసాలను ఇచ్చి జీవం పోసిన వ్యక్తి. సాక్షాత్తు తండ్రి దేవుని జనితైక కుమారుడు, త్రిత్వంలోని రెండవ వ్యక్తి, పుత్ర భగవానుడు అలాంటి కుమార దేవుని కన్న మరియమాత దేవమాత కాదా! కన్న ప్రేవుల సాక్షిగా మరియతల్లి దేవమాతే! ఇదే సత్యాన్ని నిర్ధారిస్తూ శ్రీసభ, మరియ యదార్ధంగా దేవుని తల్లి దేవమాతేనని విశ్వసిస్తోంది (కతోలిక శ్రీసభ సత్యోపదేశం, నం. 495).

మరియ మాతృత్వం - దైవ మాతృత్వం
మాతృత్వం అనునది ఆడజన్మకు దేవుడిచ్చిన గొప్పవరం. సాధారణంగా మాతృత్వం అనునది దాంపత్య జీవితంద్వారా కలుగుతుంది. అది సహజం, కాని, మరియతల్లి మాతృత్వం దీనికి భిన్నమైనది, గొప్పది,  పవిత్రమైనది, ఎందుకంటే, మరియ మాతృత్వం దాంపత్య జీవితం వలన కలిగినది కాదు. సాక్షాత్తు పవిత్రాత్మ ప్రభావంతో ఆమె గర్భం దాల్చారు, క్రీస్తుకు జన్మనిచ్చారు (లూకా. 1:34,35). "యువతి గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కని, అతనికి యిమ్మానువేలు అని పేరు పెట్టును (యెషయ 7:14) అను ప్రవచనాన్ని, మరియతల్లి నెరవేర్చి "అనుగ్రహ పరిపూర్ణ రాలుగా" ధన్యురాలుగా చరిత్రకెక్కారు.

కన్యత్వం చెడని మాత
దేవమాత ప్రార్థనలో మరియతల్లిని "కన్యశుద్దము చెడనిమాతా, అని మనము సంబోధిస్తూ ఉన్నాము. మరియతల్లి నిత్యకన్య ఎలా అవుతారు? మరియతల్లి పురుషుని సహకారంతో బిడ్డను కనలేదు. సాక్షాత్తు పవిత్రాత్మ ప్రభావముతో కన్నారు అని బైబులు  గ్రంధము బోధిస్తున్నది (లూకా. 1:34,35). మరియతల్లి నిత్యకన్య అని, కన్యగానే దైవకుమారుడికి జన్మనిచ్చింది అని మన తల్లి శ్రీసభ తొలి దశనుంచి విశ్వసిస్తూనే వస్తోంది. శ్రీసభ విశ్వాసానికి మూలం సువార్త ప్రబోధం. దైవకుమారుడు యేసుక్రీస్తు పవిత్రాత్మ వలననే కన్య మరియతల్లి గర్భాన శిశువుగా జన్మించారని. ప్రభు జననానికి పురుష సాంగత్యం కారణం కాదని శ్రీసభ ప్రగాఢ విశ్వాసం (కతోలిక శ్రీసభ సత్యోపదేశం, నం. 496). అంతేకాదు, క్రీస్తు భగవానుడు ఇలా ఒక కన్యగర్భాన నరావతారుడై జన్మించటం మానవ మేధస్సుకు, మానవ తర్కానికి అతీతమైన దివ్యశక్తి ప్రభావంతో జరిగిన దైవకార్యమనికూడా శ్రీసభ విశ్వసిస్తుంది. ఈ సందర్భంలోనే మనము ఒక  కతోలిక  వేదాంతి చెప్పిన మాటలను మననం చేసుకోవాలి, "విశ్వసించే వాళ్లకు వివరణ అక్కరలేదు; విశ్వసించని వాళ్లకు వివరించడం సాధ్యం కాదు."

మానవుల మాత మరియ
మరియతల్లి మనందరికీ తల్లి! క్రీస్తు భగవానుడు సిలువమీద మరణించేముందు, తన మాతృమూర్తిని తనకు అత్యంత ప్రియశిష్యుడు యోహానుకు తల్లిగా అప్పగించారు (యోహాను. 19:27) దీనిద్వారా, మరియమాత మానవులందరికీ తల్లి అని క్రీస్తు అధికారికంగా ప్రకటించారు. ఆ క్షణంనుండి మరియమాత అపోస్తులకు, యావత్ మానవజాతికి తల్లి అయ్యారు. క్రీస్తును గురించి ప్రకటిస్తే ఖచ్చితంగా మరణ శిక్ష విధిస్తామని రోమనులు ప్రకటించిన నేపధ్యములో, ప్రాణభయంతోనున్న అపోస్తులులతో కలిసి మరియ ఎడతెగక ప్రార్ధన చేసారు. వారందరినీ చైతన్యపరచారు. పవిత్రాత్మను రాకడ సమయములో వారితోనే యున్నారు. వారిలో ఉన్న పిరికితనాన్ని సమాధి చేశారు. ధైర్యముగా సువార్తను ప్రకటించారు. చివరికి క్రీస్తుకోసం మరణించటానికి సైతం వాళ్లు సిద్ధపడ్డారు, ప్రాణత్యాగంకూడా చేశారు. మరియతల్లి శ్రీసభను కాపాడింది. ఇప్పటికీ, ఎప్పటికీ మరియ తల్లి శ్రీసభకు సకల మానవాళికి తల్లిగా కొనసాగుతుంది.

మరియ దేవునితల్లి, మనందరికీ తల్లికూడా. మరియతల్లిపై భక్తివిశ్వాసాలను పెంపొందిoచు కోవడానికి ప్రయత్నం చేద్దాం.

దేవునితల్లియైన మరియమ్మకు మనం ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. దేవదూత అందించిన సందేశానికి వినయపూర్వక హృదయముతో 'అవును' అని చెప్పుటవలన, మనకి జీవితాన్ని, రక్షణను తన గర్భములోని శిశువుద్వారా తీసికొని వచ్చింది. ఈ రక్షణకార్యమునకై దేవుడు మరియమ్మను ప్రత్యేకవిధముగా, జన్మపాపరిహితగా ఎన్నుకొన్నాడు. ఈనాటి రెండవ పఠనములో పౌలుగారు చెబుతున్నట్లు, కాలము పరిపక్వమైనప్పుడు దేవుని కుమారున్ని మోయుటకు, దేవునికి తల్లిగా మారుటకు ఆమెను ఎన్నుకొని యున్నాడు (గలతీ. 4:4).

గతమున దేవుడు తనప్రజలతో, ప్రవక్తలద్వారా మాట్లాడియున్నాడు (హెబ్రీ. 1:1-12). తన యాజకులద్వారా దేవుడు తనప్రజలను దీవించియున్నాడు. ఈనాటి మొదటిపఠనములో, యాజకులైన ఆహారోను, అతని పుత్రులు ఏవిధముగా ప్రజలపై దీవెనలు పలుకవలెనో యావే మోషేకు తెలియజేసి యున్నాడు (సంఖ్యా. 6:22-27). కాని, ఇప్పుడు దేవుడు తన కుమారుని పంపియున్నాడు. ఆయన రాజ్యమును, మహిమను తన కుమారునిద్వారా బయలుపరచి యున్నాడు. సకలమానవాళికి తన రక్షణప్రణాళికను ఎరుకపరచి యున్నాడు. (యోహాను. 14:8-9).

సృష్టి ఆరంభమునుండి ఎన్నుకొనిన, నడిపింపబడిన దేవుని ప్రజలనుండి ఉద్భవించినవాడు యేసు. సువిశేష పఠనములో విన్నవిధముగా (లూకా. 2:21) శిశువుకు సున్నతి చేయడముద్వారా (ఆది. 17:1-14) అబ్రహాముతో దేవుడు చేసిన ఒడంబడికకు వారసుడు. మనము క్రీస్తునందు జ్ఞానస్నానము పొందుటద్వారా దేవునికి దత్తపుత్రులుగా మారియున్నాము (కొలస్సీ. 2:11; ఫిలిప్పీ. 3:3). దేవుని బిడ్డలముగా, అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానములకు (ఆది. 12:3; 22:18) మనమును వారసులమగు చున్నాము (గలతీ. 3:14). యాజకుడైన ఆహారోను ఈ దీవేనలనే దైవప్రజలపై అందించి యున్నాడు. ఈనాడు ఈ దీవెనలను మనముకూడా మరియతల్లిద్వారా, రక్షకుడైన యేసుక్రీస్తుద్వారా పొందుచున్నాము. ఈ గొప్ప ఆనందదాయకమైన శుభసందేశమే, దేవదూతద్వారా గొల్లలకు తెలియజేయడమైనది (లూకా. 2:10).

యేసు బెత్లేహేములో జన్మించాడు. యోసేపు, మరియమ్మలకుతప్ప ఆ విషయం ఎవరికినీ తెలియదు. కాని, వేగముగా గొల్లలకు ఆ శుభసందేశం, లోకరక్షకుని జననపరమరహస్యం తెలియజేయడమైనది. దేవదూత వారిఎదుట ప్రత్యక్షమై, ''మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభసమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదునగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తుప్రభువు. శిశువు పొత్తిగుడ్డలలో చుట్టబడి పశువులతొట్టిలో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు" (లూకా. 2:10-12) అని తెలియజేసెను. దేవుడు తెలియజేసిన ఆ పరమరహస్యాన్ని గాంచుటకు గొల్లలు వెమ్మటే బెత్లేహేమునకు వెళ్ళిరి. అక్కడ పశువుల కొట్టములో మరియమ్మను, యోసేపును, తొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి.

గొల్లలవలె మనముకూడా వేగముగా మరియ యోసేపులతో యేసును కనుగొనుటకు త్వరపడుదాం. గొల్లలు తాము వినినవానిని, చూచినవానిని గురించి దేవునివైభవమును శ్లాఘించిరి (లూకా. 2:20). దేవుడు ఇచ్చిన ఈ గొప్ప దీవెనలకి మనముకూడా ఆయనను మహిమపరచుదాం. మరియతల్లివలె, దేవునివాక్యమును మనస్సున పదిలపరచుకొని ధ్యానించాలి. క్రీస్తుసందేశము మనహృదయాలలో సమృద్ధిగా ఉండాలి (కొలస్సీ. 3:16). అప్పుడే దేవదూతవలె, గొల్లలవలె, జ్ఞానులవలె మనుమును ఈ గొప్ప సందేశాన్ని, దీవెనని, పరమరహస్యాన్ని ఇతరులకు ఇవ్వగలం.

దేవుడు మనకి ఒసగిన మరో గొప్ప వరం 'మరో నూతన సంవత్సరం'. నూతన సంవత్సరాన్ని ఒక గొప్ప నమ్మకము, ఆశతో చూద్దాం. మన సమాజములో అభివృద్దితోపాటు, చెడుకూడా పెరుగుతూ ఉంది. భయము, ఆధ్యాత్మికలేమి పెరగుతూ ఉన్నాయి. స్వార్ధము రోజురోజుకి పెరుగుతుంది. రాజకీయ అంధకారం, పేద-ధనిక భేదం, వ్యభిచారం, విభజనలు, మాదకద్రవ్యాలు, కులవర్గ భేదాలు మొ.గు సమస్యలతో సతమత మగుచున్నాము. ఇలాంటి పరిస్థితులలో గొప్ప ఆశగల నమ్మకముతో ముందుకు సాగాలి. దేవునిపై ఆధారపడాలి. ఆయనవైపు చూడాలి. మన సమస్యలన్నింటికీ ఆయనే పరిష్కారం. ఈ నమ్మకానికి గొప్ప ఆశ మన యువత. సమాజానికి వారు ఎంతో అభివృద్ధిని తేగలరు. తల్లిదండ్రులు, భోదకులు, యువతపై దృష్టిసారించి విద్యావంతులను చేయడానికి కృషిచేయాలి. ప్రభుత్వము, మీడియా, సంస్థలు యువత అభివృద్ధికి తోడ్పడాలి. అలాగే, పాశ్చాత్య దేశాలలో ఆర్ధికసమస్యలు ఉన్న సమయములో మన భారతదేశ ఆర్ధిక పరిస్థితి చాలా మెరుగుపడి ఉంది. అయితే, అధికశాతం అభివృద్ధి వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నదని మరచిపోరాదు. కొంతకాలముగా, వ్యవసాయదారులు ఎన్నోకష్టాలను ఎదుర్కొంటున్నారు. నూతన సంవత్సరములో వారి మంచికోసం ప్రార్ధన చేద్దాం.

అన్నింటికన్నా ఎక్కువగా, మనమందరం మంచి మానవతాసంబంధాలను కలిగి జీవించాలి. ఒకరినొకరు అర్ధంచేసికొంటూ, సహాయం చేసికొంటూ ముందుకు సాగాలి. నిజమైన స్వేచ్చ, సత్యములను కనుగొని జీవించుదాము. న్యాయముతో, సామాజిక, నైతికవిలువలతో జీవించుదాము. శాంతిస్థాపన మరో ముఖ్యఅంశం, ధ్యేయం. ''శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని బిడ్డలనబడుదురు (మత్త. 5:9).

మరియ తల్లిని మనమందరంకూడా మన ఆధ్యాత్మిక తల్లిగా నెలకొల్పుకుందాం. మరియతల్లి పుట్టిందే ఇతరులకు సహాయం చేయటానికి. ఆ తల్లి మనకు సహాయం చేయటానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. మనం చేయవలసింది ఒక్కటే భక్తిశ్రద్ధలతో జపమాలను ధ్యానం చేయటం, ఆ తల్లి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవించటం. పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానంచేసినట్లైతే మరియతల్లి ఎందరికో సహాయం చేశారు. ఉదాహరణకి, కానాపల్లెలో ద్రాక్షరసం కొరత ఏర్పడితే తన ప్రియ కుమారునిద్వారా ఆ కుటుంబానికి సహాయం చేయించారు, తన బంధువు ఎలిజబేతమ్మ కడువృద్ధాప్యంలో గర్భంధరించినప్పుడు, మూడు నెలలు సేవలు చేశారు. యోహాను స్వీకరించినట్లుగా మనంకూడా మరియతల్లిని మన అమ్మగా స్వీకరిద్దాం. మన ప్రార్ధన అవసరతలను మరియమాత మధ్యస్థ ప్రార్థనా సహాయముద్వారా ఆ క్రీస్తు భగవానుడికి సమర్పించుకుందాం.

పావన పసిబిడ్డలు - వేదసాక్షులు (28.12)

పావన పసిబిడ్డలు - వేదసాక్షులు డిసెంబర్ 28, ఉత్సవము
పఠనాలు: 1 యోహాను 1:5-2:2; మత్తయి 2:13-18



పావనబిడ్డలు క్రీస్తునిమిత్తము హతమైరి. వారు నిర్మల గొర్రెపిల్లవెంట వెళ్ళుచూ సర్వదా ''ఓ రక్షకా! మీకు మహిమ కలుగునుగాక'' అని పలుకుదురు.

హేరోదురాజు పరిపాలనకాలమున యూదయాసీమయ౦దలి బెత్లేహేమునందు యేసు జన్మించెను (మత్తయి 2:1). జ్ఞానులద్వారా, ఈ వార్తను తెలుసుకొన్న హేరోదురాజు కలతచెందాడు. రోమను సామ్రాజ్య పాలకులతో సంబంధాలు ఉండుట వలన, యూదయా ప్రజలలో తనకి అంతగా పేరు లేకుండెను. అందుకే, తన అధికారానికి, సింహాసనానికి ముప్పువాటిల్లే ప్రతీ విషయానికి కలత చెందేవాడు. ఎందుకన, ఇశ్రాయేలు రాజు, యూదుల రాజు, లోకరక్షకుడు, మెస్సయ్య జన్మిస్తాడని ప్రజలు ఎదురుచూసారు.

హేరోదు క్రూరత్వానికి మరోపేరు. నిరంకుశ పాలకుడు. తన సొంత కుటుంబసభ్యులనే (భార్యను, పిల్లలను, సోదరుడిని, సోదరి ఇరువురు భర్తలను) చంపిన కిరాతకుడు. అతని క్రూరత్వాన్ని మత్తయి సువార్త 2:1-18 లో చూడవచ్చు. జ్ఞానులు "యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ?" (2:2) అని అడిగినప్పుడు హేరోదు 'ఎంతగానో కలతచెందాడు'. ప్రధానార్చకులు, ధర్మశాస్ర బోధకులద్వారా, "క్రీస్తు యూదయా సీమయందలి బెత్లెహేమునందు" (2:5) జన్మించెనని తెలుసుకొనెను. శిశువు జాడని కనుగొని తనకు తెలియజేయమని, తనుకూడా వెళ్లి ఆరాధింతునని జ్ఞానులతో చెప్పాడు (2:8). హేరోదుచెంతకు పోరాదని స్వప్నములో వారికి దేవుడు ఆదేశించగా, మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి పోయిరి (2:12).

"శిశువును చంపుటకు హేరోదు వెదక బోవుచున్నాడు. కావున నీవు లేచి, బిడ్డను తల్లిని తీసికొని, ఐగుప్తునకు పారిపోయి, నేను చెప్పువరకు అచటనే యుండుము" అని ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి ఆదేశించినది (2:13). అంతట యోసేపు లేచి, ఆ బిడ్డను, తల్లిని తీసికొని, ఆ రాత్రియందు ఐగుప్తునకు వెళ్లి, హేరోదు మరణించు నంతవరకు అచటనే ఉండెను" (2:14-15).

జ్ఞానులు తనను మోసగించారని భావించి హేరోదు మండిపడ్డాడు (2:16). "బెత్లెహేము నందును, ఆ పరిసరములందున్న రెండేండ్లును, అంతకంటే తక్కువ ప్రాయముగల మగశిశువుల నందరిని చంపుడని" హేరోదు ఆజ్ఞాపించాడు (మత్త 2:16). ఆ పసిబిడ్డలను చంపినప్పుడు, ఆ తల్లిదండ్రుల హృదయాలు ఎంతగా ఘోషించి ఉంటాయో! అందుకే మత్తయి సువార్తీకుడు, యిర్మియా ప్రవక్త ప్రవచనాన్ని గుర్తుకు చేసాడు: "రామాయందు ఒక ఆర్తనాదము వినపడెను. అది ఒక మహా రోదనము. రాహేలు తన బిడ్డల కొరకై విలపించు చుండెను. వారి మరణము వలన కలిగిన దు:ఖమునుండి ఆమె ఓదార్పు పొందకుండెను" (2:17-18). రాహేలు ఇశ్రాయేలు అని పిలువబడే యాకోబు భార్య. అస్సీరియనులు ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా కొనిపోయినప్పుడు రాహేలు తన బిడ్డలకొరకు విలపించెనని సూచిస్తుంది.

చంపబడిన పావన పసిబిడ్డలు, వారికి తెలియకుండానే క్రీస్తుకొరకు వేదసాక్షి మరణాన్ని పొంది స్వర్గములోనికి ప్రవేశించి యున్నారు. వారు దేవుని రక్షణ ప్రణాళికలో భాగస్తులైనారు. మన విశ్వాసానికి ప్రతీకలుగా మారారు. తల్లి శ్రీసభ వారిని [ప్రధమ] వేదసాక్షులుగా గుర్తించి కొనియాడుచున్నది. వారు క్రీస్తు కొరకు మాత్రమేగాక, క్రీస్తు స్థానములో మరణించారు. వారు మనకొరకుకూడా మరణించారు. వేదసాక్షి మరణములో దుష్టత్వము, దు:ఖమున్నను, శాశ్వత జీవము, మహిమ వారికొరకు వేచియుండును.

వారు క్రీస్తు పోలికలో ఉన్నారు కాబట్టి, వారు చంపబడినారు. మనం క్రీస్తుకు ఎంత దగ్గరగా పోలియున్నాము? 'ఆధ్యాత్మికముగా' మనం క్రీస్తులా కనిపిస్తున్నామా? మనలోని క్రీస్తును ఎలా గుర్తిస్తారు? మన మాటలలో, చేతలలో, సేవలో, ప్రేమలో వారు క్రీస్తును చూడగలరా?

మన కాలములోకూడా పసిబిడ్డలు ఎన్నోబాధలను అనుభవిస్తున్నారు, ఎన్నో హింసల పాలవుతున్నారు. అబార్షన్లు (గర్భస్రావం), బాలకార్మికత, పసిపిల్లలపై లైంగిక వేధింపులు మొదలగు దుష్టశక్తులు మన సమాజములో పెట్రేగి పోతున్నాయి. ఎంతోమంది పసిపిల్లలు ఈ దుష్ట కార్యాలకి బలైపోతున్నారు. బాలయేసును ప్రేమించి ఆరాధించాలంటే, శిశువేదసాక్షులను గౌరవించాలంటే, పిల్లలు తల్లిదండ్రులకు, పెద్దలకు విధేయులై, గౌరవపూర్వకముగా ఉండాలని, తోబుట్టువులను ప్రేమించాలని, వారికి నేర్పిద్దాం.

ఈ రోజున పసి బిడ్డల విముక్తి కొరకు ప్రార్ధన చేద్దాం. వారిని ఆశీర్వదిద్దాం (పూజానంతరం పశువుల కొట్టము ఎదుట, చిన్న బిడ్డలనందరిని గురువు ఆశీర్వదించడం ఆచారం; గుడికి రాలేనివారు, యింటివద్ద సమావేశమై, పిల్లలను దీవించాలి). మనము ఒకప్పుడు పసిపిల్లలమే అని మర్చిపోకూడదు.

చిన్న బిడ్డలపై ప్రార్ధన:
ఓ యేసు క్రీస్తు ప్రభువా! "చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు. వారిని ఆటంకపరపకుడు. ఏలయన అట్టి వారిదే దేవుని రాజ్యము" అని పలికి, మీ దగ్గరకు వచ్చిన చిన్న బిడ్డలను ఎత్తి కౌగలించుకొని, వారి మీద చేతులుంచి దీవించావు. నేడుకూడా మీ తండ్రి దయగల చల్లని చూపులతో ఈ చిన్నారి బిడ్డలను దీవింపుమని వేడుకొనుచున్నాము. మీ దయ కనికరములతో వీరు ఎల్లప్పుడు, మిమ్ములను కాంక్షిస్తూ, ప్రేమిస్తూ, మీ ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు సాగునట్లుగా ఆశీర్వదించండి. తద్వారా యుగయుగములు జీవించు పాలించు మీ ద్వారా వారి గమ్య స్థానానికి సురక్షితముగా చేరుదురుగాక! ఆమెన్.

పునీత యోహాను - అపోస్తలుడు, సువిశేషకుడు

పునీత యోహాను - అపోస్తలుడు, సువిశేషకుడు, డిసెంబర్ 27, ఉత్సవము

కడరా భోజన సమయమందు రక్షకుని రొమ్ముమీద తలను వాల్చిన యోహాను ఇతడు.  స్వర్గీయ దివ్యదర్శనములను కాంచిన ఈ ధన్య అపోస్తలుడు జీవన దాయక సందేశమును లోకమంతట వ్యాపింప జేసెను.

యోహాను జబదాయి, సలోమియమ్మ (మార్కు. 15:40;16:1; మత్త. 27:56) ల కుమారుడు. జబదాయి గలిలయలో చేపలు పట్టువాడు. అతనికి జీతగాండ్రును ఉండెను (మార్కు. 1:20). బెత్సయిదాపురమునకు (యోహాను. 1:44) దరిలో నివసించేవారు. సలోమియమ్మ దైవభక్తురాలు. క్రీస్తును వెంబడించినస్త్రీలలో ఆమె ఒకరు (మత్త. 27:55; మార్కు. 15:40; 16:1; లూకా. 8:2; 23:55-24:1). మరో అపోస్తలుడైన యాకోబు (మార్కు. 1:19) అతని సహోదరుడు.

అ.కా 4:13 ప్రకారం, యోహాను (అతని సహోదరుడు యాకోబు) పూర్తి విద్యాభ్యాసం పొందలేదని అర్ధమగుచున్నది. విద్య లేనివారు మరియు యూదులలో ఎలాంటి అధికారిక స్థానము లేనటువంటివారు. కాని, తమ తల్లిదండ్రుల సాంఘికస్థితినిబట్టిచూస్తే, సాధారణ విద్యాభ్యాసం పొందియుండవచ్చు. గలిలయతీరమున అప్పటికే విస్తృతముగా వ్యాప్తిచెందిన గ్రీకుభాషతో, గ్రీకుప్రజల జీవనముతో బాగాపరిచయమున్నట్లు తెలుస్తుంది. సువిషేశాలలో ''జబదాయి కుమారులు'' అని వారి తండ్రి పేరిట పిలువబడుతున్నారు. యేసు వారిద్దరికీ ''బోయనేర్గేసు'' అని పేరుపెట్టాడు, అనగా ''ఉరిమెడివారు'' అని అర్ధము (మార్కు. 3:17). దేవుని చట్టాన్ని అనుసరించడంలో , ఏ మానవశక్తికి భయపడకుండా దృఢవిశ్వాసాన్ని కలిగియుండిరి అని సూచిస్తుంది. మొదటగా, వీరు బాప్తిస్మయోహాను శిష్యులై ఉండిరి. తరువాత యేసు, పేతురు, అ౦ద్రెయతోపాటు వీరినికూడా తన శిష్యులుగా పిలచియున్నాడు (యోహాను. 1:35-42). ప్రధమశిష్యులైన సీమోనుపేతురు, అ౦ద్రెయ, యోహాను మరియు యాకోబు యేసుతో యోర్దానునుండి గలిలయకువచ్చి అక్కడ కొంతకాలం ఉండిరి. ఆ తరువాత వారి సాధారణ జీవితాలకు తిరిగి వెళ్ళిరి. తర్వాత యేసే స్వయముగా వారిని గలిలయసరస్సుతీరమున చేపలుపట్టుచున్న సీమోనును, అతని సోదరుడగు అ౦ద్రెయను ''మీరు నన్ను అనుసరింపుడు. మిమ్ము మనుష్యులను పట్టువారలనుగా చేసెదను'' అని పిలిచాడు. మరియు అచటనుండి యేసు మరికొంత దూరము వెళ్లి పడవలో వలలను బాగుచేసికొనుచున్న జబదాయికుమారుడగు యాకోబును, అతని సోదరుడగు యోహానును చూచి పిలిచెను. వారు ఆయనను అనుసరించిరి (మార్కు. 1:16-19; మత్త. 4:18-22). అపోస్తలుల జాబితాలో యోహాను పేరు రెండవది (అ.కా. 1:13), మూడవది (మార్కు. 3:16-19) నాలుగవది (మత్త. 10:2; లూకా. 6:14). ఎప్పుడు యాకోబు తర్వాతనే యోహాను పేరు వస్తుంది. దీనిని బట్టి యాకోబుకన్న యోహాను చిన్నవాడని అర్ధమగుచున్నది.

అపోస్తలులలో యోహానుకి ప్రత్యేకమైనస్థానం ఉన్నది. యేసు యాయీరుకుమార్తెకు ప్రాణదానము చేసినప్పుడు (మార్కు. 5:37), యేసు దివ్యరూపధారణ పొందినప్పుడు (మత్త. 17:1), గేత్సేమనిలో ఆవేదన సమయమున (మత్త. 26:37) యేసుతో ఉన్నాడు. పేతురు, యోహానులను మాత్రమే పాస్కభోజనమునకు సిద్ధముచేయమని యేసు పంపాడు (లూకా. 22:8). కడరాభోజన సమయములో యోహాను యేసుప్రక్కనే, ఆయన వక్ష:స్థలమును ఆనుకొని కూర్చుండియుండెను (యోహాను. 13:23,25). యో 18:15 లో చెప్పబడిన ''మరియొక శిష్యుడు'' యోహానే. యేసు బందియైన తర్వాత యోహాను యేసువెంట ప్రధానార్చకుని ముంగిటలోనికి వెళ్ళెను. యోహానుకి ప్రధానార్చకునితో పరిచయముండెను. యోహాను మాత్రమే సిలువచెంత యేసుకు దగ్గరగాఉండటం చూస్తున్నాం. మరియతల్లిని యేసు ''ఇదిగో నీ తల్లి'' అని యోహానుకి అప్పజెప్పెను (యోహాను. 19:26-27). పునరుత్థానంతర్వాత అపోస్తలులలో మొదటిగా సమాధియొద్దకు పరుగెత్తుకొని వెళ్ళినవారు సీమోను పేతురు మరియు యోహాను. మొదటిగా యేసు పునరుత్తానుడైనాడని విశ్వసించినది యోహానుగారే (యోహాను. 20:2-10). తేబెరియా సరస్సు తీరమున యేసు శిష్యులకు దర్శనమిచ్చినప్పుడు యోహాను అచ్చట ఉండెను. యేసుప్రేమించినశిష్యుడైన యోహాను పేతురుతో ''ఆయన ప్రభువే'' అని చెప్పినాడు (యోహాను. 21:7).

తను రచించిన యోహాను సువిశేషములో తన పేరు చెప్పకుండా ''ప్రేమించిన శిష్యుడు'' అని వ్రాస్తూ ప్రభువుతో తనకు ఉన్న దగ్గరి సంబంధాన్ని చెప్పియున్నాడు (యోహాను. 21:20-24). యేసుక్రీస్తు పరలోకమునకు కొనిపోబడినతర్వాత, పవిత్రాత్మరాకడ తర్వాత, విశ్వాసము పెంపొందించుటలో, ప్రభువు సంఘమును స్థాపించుటలోను పేతురుతోకలసి యోహానుగారు ప్రాముఖ్యమైన పాత్రను పోషించియున్నారు. దేవాలయముచెంత కుంటివానికి స్వస్థతను చేకూర్చుటలో పేతురుగారితో యోహానుగారినీ చూస్తున్నాం (అ.కా. 3:1). పేతురుతోపాటు యోహానుకూడా చెరపాలయ్యెను (అ.కా. 4:3). మరల పేతురుతోకలసి సమరియాకు వెళ్ళెను (అ.కా. 8:14). ఆ తర్వాత యేరూషలేమునకు వెళ్ళుచూ సమారియాలోని అనేక గ్రామాలలో సువార్తను బోధించిరి (అ.కా. 8:25). పాలస్తీనాలో వారిసువార్త బోధనా ఎంతకాలము జరిగిందో స్పష్టముగా తెలియదు. బహుశా, యోహాను ఇతర అపోస్తలులతో కలసి, దాదాపు 12 సం,,లు అనగా హేరోదు క్రైస్తవులపై హింసకాలము వరకు ఉండియుండవచ్చు (అ.కా. 12:1-17). విశ్లేషకుల ప్రకారం యోహానుగారు సువార్తాబోధనకై ఆసియా ప్రాంతానికి వెళ్ళాడు. క్రీ.శ. 51 వ సం.లో యేరూషలేములో జరిగిన ''అపోస్తోలిక కౌన్సిల్'' కు తిరిగి వచ్చాడు. గలతీయులకు వ్రాసిన లేక 2:9 లో కైస్తవసంఘానికి ఆధారస్తంభాలుగా ఎంచబడినవారు యాకోబు, పేతురు, యోహాను అని పౌలు గారు వ్రాసియున్నారు. పౌలుగారు తన రెండవ మరియు మూడవ సువార్తప్రయాణముల తరువాత, యేరూషలేమునకు వచ్చినప్పుడు యోహానుగారిని కలువలేదు. దీనిని బట్టి, యోహానుగారు 52-55 సం,,ల కాలములో పాస్తీనాను వీడిఉండవచ్చు.

యోహానుగారిని గూర్చి ఇంకా తెలుసుకోవాలంటే, నూతన గ్రంధములో ఆయన వ్రాసినలేఖలు మరియు దర్శన గ్రంధమును చూడాల్సిందే! క్రీస్తు జీవితమునకు, ఆయన కార్యములకు ప్రత్యక్షసాక్షి అని చూస్తున్నాం (1 యోహా. 1:1-5; 4:14). ఆసియా ప్రాంతాలలో, అక్కడవున్న క్రైస్తవ సంఘాలకు నాయకుడుగా అధికారిక గుర్తింపుపొందినట్లుగా తెలియుచున్నది. అంతేగాక, ''దేవుని వాక్కును, యేసుక్రీస్తు సాక్షమును ప్రకటించినందున పత్మాసు ద్వీపమునకు కొనిపోబడెను (దర్శన. 1:9). అచ్చటె దర్శన గ్రంథములోని దర్శనములను అతనికి బయలు పరచబడెను.

రెండవ మూడవ శతబ్దాలలోని క్రైస్తవ రచయితల ప్రకారం అపోస్తలుడు, సువిశేషకుడు అయిన యోహానుగారు మొదటి దశాబ్దపు చివరిశతాబ్దాలలో ఆసియా ప్రాంతములో నివసించాడు. ఎఫేసునుండి అక్కడఉన్న క్రైస్తవసంఘాలను నడిపించియున్నాడు. వేదసాక్షి పునీత జస్టిన్, అపోస్తలుడైన యోహానుగారు ఎఫేసులో వారితో జీవించాడని చెప్పాడు. పునీత ఇరనేయుస్, అపోస్తలుడైన యోహాను ఆసియా ప్రాంతములో ఉండి, ఎఫేసులో తన సువార్తని వ్రాసాడని మరియు ట్రాజాన్ పరిపాలనవరకు అక్కడే నివసించాడని చెబుతున్నాడు. యూఫెబియాస్ మరియు ఇతరులు, యోహాను దోమీశియన్ పాలనా (81-96) కాలములోనే పత్మాసుద్వీపమునకు కొనిపోబడ్డాడని చెప్పారు. దోమీశియన్ మరణానంతరం ట్రాజాన్ కాలములో ఎఫేసుకు మరల తిరిగివచ్చి అక్కడే క్రీ.శ. 100 సం.లో చాలా పెద్ద వయస్సులో మరణించాడు.

పునీత స్తెఫాను, (కిరీటప్ప), మొదటి వేదసాక్షి

పునీత స్తెఫాను, (కిరీటప్ప), మొదటి వేదసాక్షి, డిసెంబర్ 26, ఉత్సవము

'స్తెఫాను' అను నామము గ్రీకు అయినప్పటికిని, అతను యూదుడు. బహుశా, పాలస్తీనా సరిహద్దుల బయటఉండిన (Diaspora) వారి కుటుంబములో పుట్టినవాడైనా లేక జీవించినవాడైనా ఉండవచ్చు. అందుకే, వారిపై గ్రీకుసంస్కృతి (Hellenism) ప్రభావం ఎక్కువగాఉన్నది. గ్రీకుభాషలో 'స్తెఫానోస్' (Stefanos) అనగా 'కిరీటం' అని అర్ధం. అందుకే, పునీత స్తెఫానుగారిని, పునీత కిరీటప్ప అనికూడా పిలుస్తున్నాం.

పునీత స్తెఫాను జీవితము, అతనిపై విచారణ మరియు వేదసాక్షి మరణము గురించి అపోస్తలుల కార్యములు 6,7
అధ్యాయాలలో వ్రాయబడియున్నది. క్రైస్తవ అమరుల జాబితాలో, స్తెఫానుయొక్కజీవితము చిరస్మరణీయమైనది, మనస్సును కరిగించేటటువంటిది. స్తెఫాను యేరూషలేములో, క్రీ.శ. 35వ సం.లో వేదసాక్షిమరణాన్ని పొందియున్నారు. ఆయన మొదటి క్రైస్తవవేదసాక్షి (protomartyr).


అపోస్తలులు ఎన్నుకొన్న మొదటి ఏడుగురు సహాయకులలో (డీకనులు), స్తెఫాను మొదటి వాడు మరియు ప్రాముఖ్యుడు (అ.కా. 6:5). నూతననిబంధనలో అతని బాల్యజీవితముగూర్చిగాని, క్రైస్తవ విశ్వాసమును ఎలాస్వీకరించినదిగానీ, చెప్పబడలేదు. బహుశా, మెస్సయ్య మరణానంతరం యేరూషలేములోని క్రైస్తవులలో అతని ప్రాముఖ్యము, స్థానము పెరిగియున్నది. యేరూషలేములోని గ్రీకుదేశస్థులను ఆకట్టుకొనుటకు తనధీశక్తిని, సామర్ధ్యమును ఉపయోగించియున్నాడు. మొట్టమొదటిసారిగా, స్తెఫానుగూర్చి, అ.కా. 6:5 లో చెప్పబడింది. అనుదిన పరిచర్యను అప్పజెప్పుటకు అపోస్తలులు ఏడుగురు సహాయకులను ఎన్నుకొనుటకు నిశ్చయించిరి. దాని నిమిత్తమై, సంఘస్తులు విశ్వాసముతోను, పవిత్రాత్మతోను నిండిన స్తెఫాను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మేనాసు, నికోలా అనువారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. అపోస్తలులు ప్రార్ధన చేసి వారిపై చేతులుంచిరి.

''స్తెఫాను దైవానుగ్రహముతోను, శక్తితోను నిండినవాడై, ప్రజలమధ్య గొప్పఅద్భుతములను, ఆశ్చ్చర్య కార్యములను చేయుచుండెను'' (అ.కా. 6:8). స్తెఫానుమూలమున అనేకులు నూతనవిశ్వాసమును పొందిరి. ఈ సమయానికి, యూదమతఅర్చకులు అనేకులు క్రొత్తవిశ్వాసములోనికి మారియున్నారు. కాని, వారు ఇంకను, మోషే చట్టములోనున్న పాత సంప్రదాయాలను, నియమాలను పట్టుబడి ఉండేవారు. బాహ్యముగా, నిర్వహింపబడు సాంగ్యాలు, ఆచారాలు ఆత్మకన్న ఎక్కువకాదనియు స్తెఫాను బోధించేవాడు. వారిలో కొందరు స్తెఫానుతో వాదనకు దిగియున్నారు. కాని, స్తెఫాను అగపరచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురింపలేకపోయారు. స్తెఫాను బోధనను చూసి వారు ఓర్వలేక పోయారు.

స్తెఫానును, ఆయన బోధనలసారాంశాన్ని వారు అర్దము చేసుకోలేక పోయారు. స్తెఫానుతో వాదనకుదిగినవారు ''స్వతంత్రులు'', కురేనీయులు, అలెగ్జాండ్రీయులు, సిలీషియా, ఆసియాలనుండి వచ్చినవారిలో కొందరు. క్రీ.పూ. 63వ సం.లో రాజకీయనాయకుడు, మిలిటరీకమాండరు అయిన పొంపీ (క్రీ.పూ. సెప్టెంబర్ 29, 106 నుండి సెప్టెంబర్ 29, క్రీ.శ.48 వరకు) కాలములో రోము నగరమునకు బానిసలుగా కొనిపోబడిన యూదులతరం ఈ ''స్వతంత్రులు''. వీరు స్తెఫానును విచారణసభలోనికి తీసుకొనివచ్చి, అతనికి వ్యతిరేకముగా, మోషేమీద, దేవునిమీద దూషణ వాక్యములు పలుకుచున్నాడని అబద్ద సాక్ష్యములు చెప్పుటకు నిర్ణయించిరి. ప్రజలను, పెద్దలను, ధర్మశాస్త్రబోధకులను అతనికి వ్యతిరేకముగా పురిగొల్పిరి.

విచారణసభలో స్తెఫానుపై విచారణ జరుపుతున్నప్పుడు, అతనిముఖము దేవదూతముఖమువలె కనిపించెను. అతనిపై పడిన నిందలకు జవాబుచెప్పుకొనుటకు అవకాశమును ఇచ్చిరి. ఆసమయములో అతను క్షమాపణచెప్పి, ఇక ఇలాంటివి బోధించననిచెప్పియుండవచ్చు. కాని, స్తెఫాను అలాచేయలేదు. దానికిబదులుగా, తన విశ్వాసానికి సాక్ష్యమిచ్చియున్నాడు. తన ప్రసంగములో (అ.కా. 7:2-53) ఇస్రాయేలు ప్రజలను దేవుడు ఎలా నడిపించాడో, వారి విగ్రహారాధన, అవిధేయతగూర్చి బోధించాడు.

స్తెఫాను చెప్పినదివిని వారు అతనిపై మండిపడి అతనివంక చూచి కోపముతో పండ్లు పటపట కొరికిరి. ''అయినను స్తెఫాను పవిత్రాత్మతో నిండినవాడై, పరలోకమువైపు చూడగా, అతనికి దేవుని మహిమయు, దేవుని కుడిప్రక్కన యేసు నిలువబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు 'చూడుడు! పరలోకము తెరువబడిఉన్నట్లు, నాకు కనబడుచున్నది. మరియు మనుష్యకుమారుడు దేవుని కుడిప్రక్కన నిలువబడి యున్నాడు' అని పలికియున్నాడు'' (అ.కా. 7:55-56). ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకొనిపడి, నగరము బయటకు తరుముకొనిపోయి, రాళ్ళతో కొట్టిరి. ఇంకను రాళ్ళతో కొట్టుచుండగా, స్తెఫాను ''యేసుప్రభూ! నా ఆత్మను గైకొనుము.'' అని ప్రార్ధించాడు. మోకరిల్లి, ''ప్రభూ! ఈ పాపము వీరిపై మోపకుము'' అని పలికి వీరవేదమరణాన్ని పొందియున్నాడు.


రాళ్ళతోకొట్టి చంపబడినవారిని విచారణసభ నిర్ణయించిన స్థలములో ఉంచెడివారు. అయితే, ఇలా స్తెఫాను విషయములో జరిగినదని ఖచ్చితముగా చెప్పడానికి ఆధారాలులేవు. ఏది ఏమైనప్పటికిని, ''కొందరు భక్తులు స్తెఫానును సమాధి చేసిరి'' (అ.కా. 8:2). 5 వ శతాబ్దము వరకు ఆయన సమాధిగూర్చి దాఖలులేవు. 415వ సం.లో లూచియన్ అను గురువు తన దివ్యదర్శనములో, స్తెఫాను అవశేషము ఉత్తర యేరూషలేమునకు 20 మైళ్ళ దూరములోనున్న 'కఫార్ గామాల' అను స్థలములో ఉన్నదని గాంచియున్నాడు. అక్కడనుండి, స్తెఫానుగారి అవశేషమును 'సియోను కొండ' పై ఉన్న దేవాలయములో ఉంచిరి. 460వ సం.లో దమాస్కసుగేటు బయట, స్తెఫాను రాళ్ళతోకొట్టబడిన స్థలమునందు యుదోచియ నిర్మించిన దేవాలయములో ఉంచిరి. ఆ స్థలములో ఇప్పుడు స్తీఫాను పేరిట మరో కట్టడమును నిర్మించిరి.

పునీత కిరీటప్పగారిలోని గొప్పసుగుణం, హింసింస్తున్నవారికొరకు మరణసమయములోను వారిని క్షమించమని యేసుప్రభువును ప్రార్ధించడం. ఆయన ప్రభువును ఎంతగానో ప్రేమించాడు. ఎంతగాఅంటే, ప్రభువుగూర్చి బోధించకుండా ఏక్షణమూ ఉండలేకపోయాడు. నిందలకు, అవమానములకు జంకలేదు. అవిశ్వాసులను, అన్యాయముగా జీవించేవారిని మొహమాటము లేకుండా తూర్పారబట్టాడు. సత్యమునకు పాటుబడి, సత్యముకొరకు ప్రాణాలుసైతం అర్పించాడు. స్తెఫాను యేసుప్రభువువలెనె మరణించాడు. ఆయనపై నిందలనుమోపారు, అన్యాయపుతీర్పునకు గురిచేసారు. మరణ సమయములోనూ, ఆయన పెదవులపై మన్నింపుప్రార్ధన మరియు తన కన్నులను విశ్వాసముతో దేవునివైపునకు త్రిప్పియున్నాడు.

స్తెఫాను క్రైస్తవ విశ్వాసానికి ఓ బలం, ఓ శక్తి. ఆయన ఎంతోమందికి ఆదర్శప్రాయుడైయున్నాడు. పరలోకములో తప్పక ఆయన సౌలు, పౌలుగా మారడానికి ప్రార్ధన చేసాడనడములో ఎంతమాత్రము అతిశయోక్తిలేదు!

స్తెఫాను ''పవిత్రాత్మతో నిండినవాడు, జ్ఞానము గలవాడు, మంచి పేరుగలవాడు'' (అ.కా. 6:3).
''విశ్వాసముతోను, పవిత్రాత్మతోను నిండిన వాడు'' (అ.కా. 6:5)
''దైవా నుగ్రహముతో నిండిన వాడు''(అ.కా. 6:8)
గొప్ప అద్భుతములను, ఆశ్చర్య కార్యములను చేసియుండెను'' (అ.కా. 6:8).

ప్రభువు మనకోసం జన్మించెను, Christmas

ప్రభువు మనకోసం జన్మించెను, Christmas

ఈరోజు, ఒకజ్యోతి మనపై ప్రకాశించెను, ప్రభువు మనకోసం జన్మించెను. ఆయన, దేవునిమహిమయొక్క ప్రకాశవంతమైన జ్యోతి. తన శక్తివంతమైన ఆజ్ఞతో ఈ లోకం పోషింపబడుతున్నది.

క్రీస్తుజయంతియొక్కఅర్ధము ఏమిటి? ప్రాముక్యత ఏమిటి? మనసృష్టికర్త మనకి దూరములో లేడు, అతడు మనకు తెలువనంటివాడుకాదు అన్ననిజాన్ని ఎరిగి ఆనందముతో సంబరాన్ని చేసుకుంటున్నాము. దేవుడు మనకి అతిసమీపములోనే, మనచెంతనే ఉన్నాడు. ఎంతదగ్గర అంటే, ఆయన మనలో ఒకనిగా జన్మించాడు. ఇప్పుడు, స్వతంత్రముతో, నమ్మ్మకముతో, దేవున్ని సమీపించవచ్చు. మనం ఆయనతో మాట్లాడవచ్చు. మన సమస్యలను ఆయనతో పంచుకోవచ్చు. ఆయనను స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. మనకు సాధ్యమైనతీరులో ఆయనతో సంభాషించవచ్చు. దేవుడు ప్రేమించేతండ్రిగా, దయగలరక్షకునిగా, కరుణగలఆప్తునిగా బయలుపరచబడ్డాడు. దేవుడు మనలను తెరచినకరములతో ఆహ్వానిస్తున్నాడు. ఈరోజే, మనం ఆయన దరికి వెళ్దాం.

ప్రభువా, మా హృదయాలను ప్రేమతో మీ కొరకు విశాలము చేయండి.  అమ్మ మరియవలె, ''అవును'' అని చెప్పుటకు మమ్ములను బలవంతులనుగా చేయండి.  ముఖ్యముగా, జీవితాలలో ప్రేమసుగుణాన్ని మరచిపోయినవారిని ఆశీర్వదించండి.  వారిని తాకండి. తద్వారా, ఈ క్రిస్మస్ రోజున వారుకూడా మిమ్ములను ఆహ్వానించెదరుగాక.  మీకు మాఅందరిపైఉన్న ప్రేమను నిజముచేయులాగున మమ్ములను చేయండి.

MERRY CHRISTMAS TO ALL

క్రిస్మస్ సందేశము

క్రిస్మస్ సందేశము

''మీరు భయపడ వలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను'' (లూకా 2:10-11). ఆహా! ఎంతటి అనుగ్రహం! ఎంతటి భాగ్యం! మనం పొందిన వరాలలోకెల్ల గొప్ప వరం, అనుగ్రహం: క్రిస్మస్ - దేవుడు లోక రక్షకుడిగా జన్మించడం. వాక్కు మానవుడై మన మధ్య నివసించడం. తన ప్రజలకు వాగ్ధానము చేసిన విధముగా, చీకటిలోనున్న ఈ లోకానికి వెలుగును ప్రసాదించడం. నిజముగా ఇది గొప్ప శుభవార్తే! అందుకే పరలోకదూతల సమూహము సైతము ప్రత్యక్షమై ఇట్లు స్తుతించెను:

''మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ,
భూలోకమున ఆయన అనుగ్రహమునకు
పాత్రులగు వారికి సమాధానము కలుగుగాక!'' (లూకా 2:14).


''మనకొక శిశువు జన్మించెను. మనమొక కుమారుని బడసితిమి  '' (యెషయా 9:6). క్రీస్తు పూర్వం 8 వ శతాబ్దములో యెషయా ప్రవక్త ఇస్రాయేలు ప్రజలకు ఇచ్చిన గొప్ప ఊరట కలిగించే ప్రవచనం. ఎందుకన, బలమైన అస్సీరియ దేశం ఇస్రాయేలీయుల మీద దండెత్తుతున్న రోజులు. అస్సీరియా రాజు మరణముతో, 'చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూస్తారని, దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించునని, మెడమీద కాడి (బానిసత్వం), విరగ గొట్టబడునని, భుజముల మీద దండమును (అణచివేయుట) ముక్కలు చేయబడునని, నూతన రాజ్య భారమును వహించుటకు శిశువు జన్మించునని' యెషయా ప్రవచించాడు. యేసు జననం పట్ల ఈ ప్రవచనాలు మనకీ ఊరట కల్గించే ప్రవచానాలే! ఎందుకనగా, మనంకూడా ఈనాడు అనేక విధాలుగా, చీకటిలో, బానిసత్వములో జీవిస్తున్నాం.

క్రీస్తు జన్మము ఇమ్మానుయేలు: దేవుడు మనతో ఉన్నాడు అను ఆనందమును కొనియాడటం. ఆయన మనతో లోకాంతము వరకు ఉంటాడు, మనలను అమితముగా, అనంతముగా ప్రేమిస్తాడు అను దానికి ఆయన జన్మ నిదర్శనం. క్రీస్తు జననం ఒక నూతన సృష్టి. నూతన దివికి, నీతికి నిలయమైన భువికి ఆరంభం (యెషయా 65:17; 2 పే 3:13). పుట్టిన ప్రతీ బిడ్డ ఓ కొత్త ఆరంభం, ఎంతో భవిష్యత్తు.

జన్మించిన రక్షకునిలో జీవముండెను. ఆ జీవము మనకు వెలుగాయెను (యో 1:4). తన కుమారుని జన్మముతో దేవుడు తన శక్తిని, అనంతమైన ప్రేమను మనం తెలుసుకొనేలా చేస్తున్నాడు. తద్వారా, మనము జీవితమును, దానిని సమృద్ధిగా పొందులాగున చేసియున్నాడు. కాని, మనము గుర్తుంచుకోవలసిన విషయం: ''ఆయన తన వారి యొద్దకు వచ్చెను. కాని, తన వారే ఆయనను అంగీకరించలేదు'' (యో 1:11). మనమందరము ఆయనకు చెందినవారమని మన విశ్వాసం. ఈరోజు ఆయన మన మధ్యలో జన్మించాడు. మరి, ఆయనను ఎరిగియున్నామా? వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. అదే క్రిస్మస్. దేవుని మహిమను మనమందరము పొందాలి. తండ్రి యొద్ద నుండి వచ్చే ఏకైక కుమారుని మహిమను మనం చూడాలి, పొందాలి. అప్పుడే, ఈ క్రిస్మస్ కి అర్ధం ఉంటుంది. దేవుని బిడ్డగా, ఏకైక కుమారునిగా జన్మించిన ప్రభువును అంగీకరించి విశ్వసిస్తే మనమూ దేవుని బిడ్డలగు భాగ్యమును పొందుదము (యో 1:12).

క్రీస్తు జన్మించే నాటికి, ఈ లోకం చీకటిలో ఉంది. పాపముతో నిండి యున్నది. మనం అవిశ్వాసములో ఉన్నాము. పాలస్తీనా దేశం సాంఘిక అసమానలతో నిండి ఉన్నది. రోమను సామ్రాజ్యం తన మిలటరీ బలగాలతో మధ్యధరా ప్రపంచాన్నంతటిని తన గుప్పిట్లో ఉంచుకుంది. మతోన్మాదులు విప్లవాలను, రక్త పాతాన్ని, ఉగ్రవాదాన్ని, సృష్టిస్తున్నారు. ధనికులు పేదవారిపై పెత్తనం, మతాధికారులు తమ అధికారాన్ని, ప్రభావాన్ని చాటుకొనుటకు ప్రయత్నంచేసేవారు. యేరుషలేము శతాబ్దాలుగా రక్తపాతాలకు, ఘర్షణలకు నిలయముగా చరిత్రలో చిరస్థాయిగా నిలచినటువంటిది. ఇలాంటి విషమ పరిస్థితులు ఉన్నప్పటికిని, దివ్య బాలుడు ఎదురొడ్డి అద్భుత రీతిన జీవించ గలిగాడు. అతడు పెరిగి పెద్దవాడై శాంతికి మూలాధారమైయ్యాడు. ఇదే దేవుని అపారమైన శక్తికి, కరుణకు నిదర్శనం. అందుకే దివ్య బాలుని జన్మను కృతజ్ఞతతో కొనియాడాలి. ఆయన జన్మతో, ఒక క్రొత్త జీవితం ఆరంభ మైనది, లేత మొక్క అంకురించియున్నది. ఓ నూతన సూరీడు దేదీప్యముగా ప్రకాశించి యున్నది. పెరిగి పెద్దవాడైన తర్వాత, దైవరాజ్యము గూర్చి, న్యాయముగూర్చి భోదిస్తాడు.

16 వ బెనడిక్ట్ పాపుగారు తన క్రిస్మస్ సందేశములో ఇలా చెప్పియున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మనం సాంకేతిక, సామాన్య పరిజ్ఞానములో అపారమైన పురోగతిని సాధించాం. ఈరోజు మనం అన్ని విషయాలలో అపారమైన జ్ఞాన వనరులను కల్గియున్నాము. అయితే, ఇలాంటి పరిస్థితులలో, మానవ మేధస్సుకు, సాంకేతిక పరి జ్ఞానానికి బానిసలయ్యే అవకాశం లేకపోలేదు! అలా బానిసలుగా మారినప్పుడు, మనలో ఆధ్యాత్మిక లేమి, హృదయ శూన్యత సంతరించుకొంటాయి. అందుకే, మనం క్రీస్తు జన్మమునకు మన హృదయాలను, మనస్సులను తెరవాలి. రక్షణ ఘట్టమైన క్రీస్తు జననం ప్రతీ మానవునికి ఒక క్రొత్త నమ్మకాన్ని ఇస్తుంది.

ఈనాడు ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినదని భావిస్తున్నాం. కాని, క్రీస్తు వెలుగులేనిచో మన అభివృద్ధికి ఎలాంటి సార్ధకత ఉండదు (యో 1:9). వాక్కు మానవుడై నందునే మానవ జీవితానికి సంపూర్ణ అర్ధమున్నదని శ్రీ సభ పదే పదే భోదిస్తుంది.

ఈ రోజుల్లో అన్ని విభాగాల్లోనూ అన్యాయం, అవినీతి, స్వార్ధం, భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు, నైతిక విలువలు లేకపోవడం, ఆర్ధిక అసమానతలు మొ,,గు దుష్ట శక్తులతో మన సమాజం నిండిపోయినది. క్రీస్తు ఆనాడు బెత్లేహేములో పుట్టినట్లుగా, ఈనాడు మన సమాజములోనూ జన్మించాల్సిన అవసరం ఉంది. మనం మారాలి. అప్పుడే, మన సమాజం మారుతుంది. దేవుడు కోరుకొనేది ఒక్కటే: పరలోక రాజ్యం భూలోకమున నెలకొనాలి. దానికి మనందరి సహాయ సహకారం అవసరం.

క్రీస్తు జయంతిని బాహ్యముగా కొనియాడటముతో సరిపోదు. దివ్యబాలుడు ఈ లోకానికి తెచ్చిన పశ్చాత్తాపము, మారుమనస్సు అను సందేశాన్ని మన జీవితానికి అన్వయించుకొన్నప్పుడే, మనం కొనియాడే ఈ పండుగకు అర్ధం ఉంటుంది.

రెండవ జాన్ పౌల్ పాపుగారు 19 డిశంబర్ 1999 వ సం,,రములో, త్రికాలజపముగూర్చి సందేశాన్ని ఇస్తూ ఇలా అన్నారు. క్రీస్తు జయంతి కేవలం 2000 ల సం,,ల క్రితం క్రీస్తు జన్మించిన సంఘటనని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు. ఇది ఒక సజీవమైన వాస్తవము. కనుక, విశ్వాసుల హృదయాలలో ప్రతీ సం,,ము ఈ సజీవ వాస్తవం పునరావృతం కావాలి. ఆనాటి చారిత్రాత్మిక సంఘటన ఈ రోజు ఆధ్యాత్మిక సజీవ వాస్తవముగా మన సాంగ్యాలలో జీవించాలి.

క్రిస్మస్ - దేవుని శక్తి, దేవుని ప్రేమ, దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని శాంతి మరియు దేవుని రక్షణ. ఆమెన్.

తొమ్మిదవ దినము: 24 డిశంబర్ 2011: బేత్లెహేమున పశువులపాకలో యేసు జన్మించుట

తొమ్మిదవ దినము: 24 డిశంబర్ 2011
బేత్లెహేమున పశువులపాకలో యేసు జన్మించుట

ధ్యానాంశం: తన సామ్రాజ్యమునందు జనాభా లెక్కలు సేకరింప వలెనని ఆగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, యోసేపు, దావీదు వంశస్తుడైనందున గలిలయ సీమలోని నజరేతునుండి యూదయా సీమలో ఉన్న దావీదు గ్రామమగు బేత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్పించుటకై, తన భార్యయు, గర్భవతియునైన మరియమ్మనుకూడా వెంట బెట్టుకొని వెళ్ళెను. గర్భవతియైయున్న మరియ నాలుగుదినాలపాటు, చలిలో, కొండలమీద ప్రయాణముతో ఎంత వేదన పడి ఉంటుందో! వారు బేత్లెహేములో ఉండగానే మరియమ్మకు ప్రసవకాలము సమీపించెను. యోసేపు వారికి సత్రమున స్థలమును వెదికాడు. కాని, ఎక్కడ స్థలము లేకుండెను. వారు పేదవారు కాబట్టి, అన్ని సత్రములనుండి వారు వెడలగొట్టబడ్డారు.

ఆ రాత్రంతయు చోటుకోసం వెదికారు. చివరికి, గ్రామమునకు బయట పశువులపాకగాఉన్న ఒక గుహను కనుగొన్నారు. యోసేపు మరియతో, 'మరియ, ఇంత చలిలో ఈ పశువుల పాకలో రాత్రంతయు నీవు ఎలా ఉండగలవు?' అప్పుడు మరియ 'యోసేపు, రాజులకు రాజైన దైవకుమారుడు జన్మించకోరుకున్న రాజభవనము ఈ గుహనే! పాన్పు ఈ పశువుల తోట్టియే! ఆహా...! ఎంత గొప్ప మనసు! ఎంత గొప్ప వినయం! ఎంత గొప్ప సహనం!.

ప్రసవకాలం ఆసన్నమైనప్పుడు, మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని, పొత్తి గుడ్డలలో చుట్టి పశువులతొట్టిలో పరుండబెట్టెను. దైవకుమారుడు, భూలోకమునకేతెంచిన అద్భుత క్షణాలు! ప్రభువుమహిమ ప్రకాశించిన మధుర క్షణాలు! గుహ అంతయు కూడా, జ్వాలాలతో ప్రకాశించిన క్షణాలు! దేవున్ని మరియ తన హృదయానికి హత్తుకున్న క్షణాలు! మరియ యోసేపులు, ప్రకృతితోకలసి, మోకరిల్లి, దివ్య బాలయేసుని ఆరాధించిన క్షణాలు! చిన్నియేసయ్యను పోత్తిగుడ్డలలో చుట్టి పశువులతొట్టిలో పరుండబెట్టిన క్షణాలు! ఇలా దైవ కుమారుడు మనమధ్యలో జన్మించడమువలన, ఆయన అనంతమైనప్రేమ నిరూపితమగుచున్నది.

ప్రార్ధన: ఆరాధనకు పాత్రుడవైన ఓ దివ్యబాలయేసువా! నేను నీనుండి ఎంతగా పరుగెడాలని ప్రయత్నంచేసినా, నీవు మాత్రం నావెంటే ఉన్నావు. అన్ని ఆపదలనుండి రక్షిస్తున్నావు. నేను నీ పాదముల దగ్గరైనా ఉండుటకు అర్హుడనుకాను. నా పాప భారమే, బేత్లెహేములోని పశువుల తొట్టిలో నీకన్నీటికి కారణం. పాపాత్ములను మన్నించి రక్షించుటకే పరలోకమునుండి, భూలోకానికి ఏతెంచావు. ఈ పాపినికూడా క్షమించి, రక్షించమని దీనముగా వేడుకొంటున్నాను. నేవే నాదేవుడవు, నా రక్షకుడవు!

ఈలోకాన్ని నీవెలుగుతో ప్రకాశింప భువికేగిన నీవు ఈ రాత్రికి నన్నునూ, నా హృదయాన్ని, నా జీవితాన్ని, నీ వెలుగుతో నింప అర్ధిస్తున్నాను. నిన్ను ఎల్లప్పుడూ ప్రేమించువరాన్ని దయచేయండి.

ఓ మరియా, యేసుని తల్లి, నా తల్లి! నీ ప్రార్ధనలవలన నీ కుమారునినుండి సమస్తమును ప్రాప్తించగలవు. నాకొరకు యేసయ్యను ప్రార్ధింపమని నా ఒకే ఒక ప్రార్ధన. ఆమెన్.

ఎనిమిదవ దినము: 23 డిశంబర్ 2011: ఐగుప్తు, నజరేతులో దివ్య బాలయేసు

ఎనిమిదవ దినము: 23 డిశంబర్ 2011
ఐగుప్తు, నజరేతులో దివ్య బాలయేసు

ధ్యానాంశం: మన ప్రియ రక్షకుడైన బాల యేసు తన మొదటి బాల్య జీవితాన్ని ఐగుప్తు దేశములో అనేక సంవత్సరాలు పేదరికములోను, అణకువలోను జీవించాడు. ఐగుప్తులో యోసేపు, మరియలు పరదేశీయులు. అక్కడ బంధువులుగాని, స్నేహితులుగాని లేకుండెను. ప్రతీరోజు కష్టపడుతూ వారి జీవితాలను కొనసాగించారు. వారి జీవనశైలి చాలా పేదరికములో కొనసాగింది. బాలయేసు ఇక్కడే తన తప్పటడుగులు వేసాడు. తన ముద్దుముద్దు మాటలను నేర్చాడు.

ఐగుప్తునుండి, నజరేతునకు తిరిగి వచ్చిన తరువాతకూడా, తిరుకుటుంబం పేదరికములోను, అణకువతోను జీవించింది. ముప్పైసంవత్సరములు వచ్చేవరకు యేసు తన తండ్రి యోసేపుతో వడ్రంగి దుకాణములో ఒక సాధారణ పనివానివలె కష్టపడియున్నాడు. విశ్వాన్ని సృష్టించిన దేవుడే స్వయముగా మనకొరకు ఇలాంటి జీవితాన్ని సంతోషముగా జీవించాడు. ఇదంతయు చూసి ఆయన మీద మనకు ప్రేమ పుట్టక ఉంటుందా?

ప్రార్ధన: ఓ యేసువా! నా రక్షకుడా! ముప్పది సంవత్సరముల పాటు అనామకమైన, కష్టాలతో కూడిన జీవితమును నాకొరకు జీవించియున్నావు. అలాంటప్పుడు, ఈ లోకములో నేను సంపదలను, ఉన్నతమైన జీవితమును ఎలా ఆశించగలను? మీవలె అణకువతో, విధేయతతో జీవించు వరమును అనుగ్రహించండి. నిజమైన సంపదను పరలోకమున వెదకు హృదయమును దయచేయండి. నేవే ఆ నిజమైన సంపద అని తెలుసుకొనే జ్ఞానమును ఒసగండి.

స్వార్ధముతో నా వాంఛలను, కోరికలను సంతృప్తిపరచుకొనుటకు అనేకసార్లు నీ స్నేహాన్ని తృణీకరించాను. నన్ను క్షమించండి. పాపముచేత నా జీవితాన్ని నాశనం చేసుకోవడం నాకిష్టములేదు. నీ అనుగ్రహములో జీవించడమే నాకిష్టం. మిమ్ములను ఎల్లప్పుడూ ప్రేమించుటకు సహాయం చేయండి.

ఓ మరియతల్లి! పాపాత్ముల శరణమా! నేవే నా నమ్మకము. ఆమెన్.

ఏడవ దినము: 22 డిశంబర్ 2011: దివ్య బాలయేసు ఐగుప్తునకు పలాయనము

ఏడవ దినము: 22 డిశంబర్ 2011
దివ్య బాలయేసు ఐగుప్తునకు పలాయనము

ధ్యానాంశం: మానవాళిని రక్షించుటకు పరలోకమునుండి భూలోకమునకు ఏతెంచిన క్షణమునుండియే, రక్షకుడిని చంపాలని ప్రయత్నాలు కొనసాగాయి. బెత్లెహేముపురిలోని పశువుల పాకలో జన్మించిన శిశువు, తన సామ్రాజ్యమును, అధికారమును ఆక్రమిస్తాడని హేరోదు భయపడ్డాడు. ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి, 'శిశువును, చంపుటకు హేరోదు వెదక బోవుచున్నాడు. కావున లేచి, బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను చెప్పువరకు అచ్చటనే ఉండుము' అని ఆదేశించినది. యోసేపు దేవుని ఆజ్ఞను విధేయించాడు. ఆక్షణమున, మరియతల్లి బిడ్డను చూసి తన హృదయములోనే దేవుని ప్రణాళికను మననము చేసి యున్నది.

తిరు కుటుంబం మన కోసం ఎన్నో కష్టాలను అనుభవించింది. ఆ రాత్రియే ఐగుప్తునకు పలాయనం అయ్యింది. ఐగుప్తునకు చేరుకోవడానికి, ఎన్ని రోజులు, రాత్రులు ప్రయాణించవలసివచ్చిందో! బెత్లెహేమునుండి ఐగుప్తు సరిహద్దునకే 120.7 కిలో,,మీ,, ఉంటుంది. సరిహద్దునుండి యూదుల స్థావరమువరకు మరో 160.9 కిలో,,మీ,, ఉంటుంది. దీనిని బట్టి వారు ఎన్ని రోజులు, ఎన్ని వారాలు ప్రయాణం చేసిఉంటారో! మరియు ఆ ప్రయాణం అంత సులువుగా ఉండక పోవచ్చు!

ప్రార్ధన: ప్రియ దివ్య బాలయేసువా! ఐగుప్తు పలాయనములో నీవు ఆకలికి, చలికి, ఎంతగానో ఏడ్చి ఉంటావు! హేరోదు దుష్ట తలంపుల వలన ఎన్నో కష్టాలు గురి అయ్యావు. నేను కూడా, నా పాపాల వలన నిన్ను ఎంతగానో నొప్పించియున్నాను. క్షమించండి ప్రభువా. పాపములో పడిపోకుండా కాపాడండి. శోధనలను ఎదుర్కొనుటకు కావలసిన శక్తినివ్వండి. యోసేపువలె తండ్రి చిత్తమును నెరవేర్చ శక్తినివ్వండి. నీనుండి నన్ను ఏ శక్తియు వేరుపరపకుండునట్లు చేయండి. మీ అనుగ్రహములో జీవించి మరణింప భాగ్యమును దయచేయండి.

ఓ మరియమ్మ గారా! నేను ఎల్లప్పుడూ దైవ ప్రేమలో జీవించునట్లు, మరియు ఆయనను ప్రేమిస్తూ మరణించు భాగ్యమును దయచేయ ప్రార్ధించండి. ఆమెన్.

ఆరవ దినము: 21 డిశంబర్ 2011: మనలను రక్షించుటకు పరలోకమునుండి భూలోకమునకు తన రాకతో దేవుని కృప బయలు పరచడమైనది.

ఆరవ దినము: 21 డిశంబర్ 2011
మనలను రక్షించుటకు పరలోకమునుండి భూలోకమునకు తన రాకతో దేవుని కృప బయలు పరచడమైనది.

ధ్యానాంశం: ''మన రక్షకుడగు దేవుని కృపయు, ప్రేమయు ప్రత్యక్షమగుటతో ఆయన మనలను రక్షించెను'' (తీతు 3:4) అని పౌలుగారు అంటున్నారు. దేవుడు మానవావతారం ఎత్తి భూలోకమునకు విచ్చేయడమువలన అతని మంచితనము, ప్రేమ ఎంత గొప్పదో మనకి అర్ధమగుచున్నది. దేవుని శక్తి మొట్టమొదటిగా, సృష్టిని చేయడములో నిరూపితమైనది. మరియు అతని జ్ఞానము, సృష్టిని పరిరక్షించడములో నిరూపితమైనది. కాని, అతని కృపగల మంచితనము, పడిపోయిన మానవుని, తన శ్రమలు, మరణము ద్వారా రక్షించుటకు మానవ రూపమును దాల్చడములో నిరూపితమైయున్నది.

పశువుల పాకలో జన్మించినప్పుడు నిస్సహాయునివలె, పొత్తిగుడ్డలలో చుట్టబడి కనిపించాడు. ఆ తరువాత, పిలాతు సభ ఆవరణలో ఆయనను కొరడాలతో కొట్టారు. ముళ్ళ కిరీటమును అల్లి, ఆయన శిరస్సుపై పెట్టి, ఆయన చెంపపై కొట్టి అవమానించారు. భారమైన శిలువ మ్రానును మోశారు. చివరిగా, నిస్సహాయ స్థితిలో, భాదలో, ఆవేదనలో ఆ మ్రానుపై ప్రాణాలను విడచారు. మనపైఉన్న ఆయనప్రేమ మనహృదయాలను గెలచుకోవాలని కోరుకొనియున్నది. మనలను రక్షించడానికి, ఒక దేవదూతను ఆయన పంపియుండవచ్చు. కాని, తనే స్వయముగా, శ్రమల మరణము ద్వారా, మనలను రక్షించడానికి మానవ రూపములో ఈ భువికి ఏతెంచారు.

ప్రార్ధన: ఓ నాప్రియ రక్షకుడా! నీవు నాకొరకు ఈ భువిలో జన్మించకపోయినయెడల, పాపమునుండి జీవమునకు పిలువబడకపోయినయెడల, నేను ఇప్పుడు ఎక్కడ, ఏ స్థితిలో ఉండేవాడినో! నాకొరకు నీవు ఇంతకాలము ఎదురుచూసియున్నావు. నా పాపములను క్షమించండి. మిమ్ములను నిత్యము ప్రేమించుటకు సహాయము చేయండి.

ఓ మరియమ్మగారా! నా సహాయమా! నా కొరకు ప్రార్ధన చేయండి. నీవు ప్రార్ధన చేసినచో, దేవుని అనుగ్రహమును నేను తప్పక పొందెదను. ఆమెన్.

ఐదవ దినము: 20 డిశంబర్ 2011: యేసునాధుని శ్రమల జీవితము

ఐదవ దినము: 20 డిశంబర్ 2011
యేసునాధుని శ్రమల జీవితము

ధ్యానాంశం: యేసు క్రీస్తు శ్రమలను పొందకుండానే, మానవాళిని రక్షించియుండగలడు. కాని, ఆయన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో నిరూపించుటకు శ్రమలతోకూడిన జీవితమును ఆయన ఎన్నుకున్నాడు. అందులకే, యెషయా ప్రవక్త ఆయనను ''బాధామయ సేవకుడు'' అని పిలచియున్నాడు. ఆయన జీవితమంతయు కూడా, భాదలతో నిండియున్నది. ఆయన శ్రమలు కేవలం మరణమునకు కొన్ని గంటలముందు మాత్రమే గాకా, ఆయన పుట్టుకతోనే ప్రారంభమయ్యాయి. ఆయన పుట్టినప్పుడు ఒక మంచి స్థలముగాని, కనీసం సత్రములో కూడా చోటు దొరకలేదు. చివరికి, ఊరి చివరిలో పాడుబడిన గుహలోని ఒక పశువుల పాకలో, చిమ్మ చీకట్లలో, మురికి వాసనలో, గరుకైన నేలమీద, కనీస సౌకర్యములు లేనిచోట జన్మించవలసి వచ్చినది. తను జన్మించిన కొంత సమయానికే, ఐగుప్తునకు పలాయనము కావలసి వచ్చినది, ఎందుకన, హేరోదు శిశువును చంపుటకు వెదకబోవుచున్నాడు. అక్కడ హేరోదు మరణించే వరకు ఉండెను. ఐగుప్తు దేశములో పేదరికములోను, కష్టాలలోను జీవించవలసి వచ్చెను. యువకునిగా నజరేతులో కాయాకష్టం చేసి జీవించవలసి వచ్చెను. చివరిగా, యెరూషలేములో కఠినమైన బాధలను, శ్రమలను పొంది, శిలువపై మరణించవలసి వచ్చెను.

వీటన్నింటిని భరించాలని, ప్రభువునకు ముందే తెలుసు. అయినప్పటికిని, సంతోషముగా వాటిని మన రక్షణ కోసం స్వీకరించాడు. ఇదంతయు ఆయనకు మనమీద ఉన్న ప్రేమవలన చేసియున్నాడు. అయితే, ఈ వేదన, శ్రమలకన్నా, మన పాపభారమే ఆయనను ఎక్కువగా భాదించింది. ''నా కన్నీటిని నేను ఎలా ఆపగలను. నా పాపాలే ప్రభువును జీవితాంతం వేదనలు పొందేలా చేసాయి'' అని పునీత కోర్తోన మర్గరీతమ్మగారు అంటుండేవారు.

ప్రార్ధన: ఓ నా యేసువా! నేను కూడా నా పాపాలవలన నిన్ను జీవితాంతం భాధలు, కష్టాలు పొందేట్లు చేసాను. నీ క్షమాపణను పొందుటకు నేనేమి చేయాలో తెలియబరచండి. నీవు చెప్పునది చేయుటకు సిధ్ధముగా ఉన్నాను. నీకు వ్యతిరేకముగా చేసిన ప్రతీ పాపానికి పశ్చాత్తాపముతో క్షమాపణను వేడుకొంటున్నాను. దయతో నన్ను క్షమించండి. నాకన్న మిన్నగా మిమ్ములను ప్రేమిస్తున్నాను. ప్రేమించుటకు కోరికను పుట్టించిన మీరే, మిమ్ములను కలకాలము ప్రేమించుటకు కావలసిన శక్తిని కూడా దయచేయండి. నా హృదయం మిమ్ములను ప్రేమించేలాగున చేయండి. నీ ప్రేమతో నన్ను బంధించండి. నీ ప్రేమలోనే మరణించాలని ఆశిస్తున్నాను.

ఓ మరియమ్మగారా! మన తండ్రియగు దేవుణ్ణి ప్రేమించుటకు ప్రార్ధన చేయండి.

నాలుగవ దినము: 19 డిశంబర్ 2011 : ప్రభువు మనకోసం అవమానకర జీవితమును జీవించాడు

నాలుగవ దినము: 19 డిశంబర్ 2011
ప్రభువు మనకోసం అవమానకర జీవితమును జీవించాడు

ధ్యానాంశం: అప్పుడే జన్మించిన రక్షకుని కనుగొనడములో సహాయపడుటకు దేవదూత గొల్లలకు ఇచ్చిన ఆనవాలు అతని వినయ విధేయతలను సూచిస్తుంది. 'సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదునగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు. ప్రభువు. శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండ బెట్టి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనవాలు'.

ఆయన ఇతర నవ శిశువులవలెగాక, ఒక పశువుల పాకలో జన్మించెను. పేదరికములో పుట్టాడు. ఇలా తన అణకువతను, నమ్రతను, వినయ విధేయతలను, నిగర్వమును చాటుకున్నాడు. ఆయన ఆహంకారులను నాశనము చేసి, వినయ విధేయతలు గలవారిని లేవనెత్తుటకు జన్మించాడు.

రక్షకుడు అనేక అవమానములకు గురికావలసి ఉంటుందని ప్రవక్తలు ప్రవచించియున్నారు . అలాగే ఆయన ఎన్నో అవమానములను పొందియున్నాడు. ఆయనను త్రాగుబోతు అని, దైవదూషనము చేసాడని నిందించారు. ఆయన అనుచరులలోని ఒకడే ఆయనను అప్పగించాడు. ఆయనపై ఉమిసారు, ఆయన ముఖమును మూసి గ్రుద్దుచూ హేళన చేసారు. భటులు ఆయనను పిడికిళ్ళతో గ్రుద్దారు, ముండ్ల కిరీటమును ఆయన తలపై పెట్టారు. కఱ్ఱతో తలపై మోదారు. ఇలా ఎన్నో విధాలుగా ఆయనను పరిహసించారు. ఒక దొంగావానివలె ఆయనను సిలువ వేసారు.

ప్రార్ధన: ఓ ప్రియ రక్షకుడైన ప్రభువా! నా మీదగల ప్రేమ చేత, నీవు ఎన్నో అవమానములను, నిందలను, భాదలను, శ్రమలను పొందియున్నావు. కాని, నేను మాత్రం, నీ కొరకు ఒక మాట గాని, ఒక అవమానాన్ని గాని భరించలేకున్నాను. నేను పాపిని. నీ శిక్షకు అర్హుడను. అయినప్పటికిని, నన్ను క్షమించండి, నీ కరుణను చూపుమని వేడుకొంటున్నాను. ఇక మిమ్ములను అవమానించను, నినదించను, ద్వేషించను. ప్రభువా! నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను. మీ కొరకు ప్రతీ అవమానాన్ని భరించే శక్తిని, అనుగ్రహాన్ని దయచేయండి.

ఓ మరియమ్మగార! నాకొరకు ప్రభువును ప్రార్ధించండి.

మూడవ దినము: 18 డిశంబర్ 2011 - యేసు పేదరిక జీవితం

మూడవ దినము: 18 డిశంబర్ 2011
యేసు పేదరిక జీవితం

ధ్యానాంశం: దేవుడు తన కుమారుని జన్మమునకు ఈ లోకమున సమస్తమును ఏర్పాటు చేసియున్నాడు. యేసు జన్మించే సమయానికి, సీజరు ఆగస్తు చక్రవర్తి తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరించవలెనని ప్రకటించి అధికారులకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. ఈ విధముగా, యోసేపు దావీదు వంశస్తుడైనందున గలిలయ సీమలోని నజరేతునుండి యూదయా సీమలోని దావీదు పట్టణమగు బెత్లేహేమునకు జనాబా లెక్కలలో తమ పేర్లు చేర్పించుకొనుటకై తనకు నిశ్చిత్తార్ధం చేయబడిన, గర్భవతియైన మరియమ్మను వెంటబెట్టుకొని వెళ్ళాడు. వారికి సత్రములో చోటు దొరకపోవడముచేత, మరియమ్మకు ప్రసవకాలము సమీపించుటచేత వారు పశువులశాలయైన ఒక గుహలో ఉండవలసి వచ్చినది. బెత్లెహేములోని ఈ పశువుల పాకలోనే మరియ పరలోక రారాజునకు జన్మనిచ్చినది.

జ్ఞానులు, గొల్లలవలె, మనముకూడా ఈ పశువులపాకను సందర్శించుదాం. విశ్వాసముతో సందర్శించుదాం. విశ్వాసము లేనిచో ఆగుహలో మనం ఏమీ చూడలేము. విశ్వాసముతో చూస్తే దైవకుమారున్ని, మన పాపాలకోసం శ్రమలను పొందుటకు, మనలను రక్షించుటకు దిగివచ్చిన యేసయ్యను చూస్తాము.

ప్రార్ధన: ఓ ప్రియమైన దివ్య బాల యేసువా! నాకోసం ఈ భూలోకానికి వచ్చినందులకు నీకు వేలాది కృతజ్ఞతా స్తోత్రములు. నాకొరకు పేదరికములో జన్మించి, శ్రమలనుపొంది నన్ను రక్షించావు. ''నా ప్రభువా! నా దేవా!''. నిన్ను నిత్యము ప్రేమించుటకు నీ అనుగ్రహాన్ని దయచేయండి. నీవుతప్ప నాకింకేమియు అవసరము లేదు.

ఓ మరియమ్మా! నీ దివ్యకుమారున్ని ప్రేమించుటకు, మీ కుమారునిచేత ప్రేమింపబడుటకు ప్రార్ధన చేయండి. ఆమెన్.

రెండవ దినము: 17 డిశంబరు 2011: దైవ ప్రేమ దివ్యబాలుని జన్మము ద్వారా బయలు పరచడమైనది

రెండవ దినము: 17 డిశంబరు 2011
దైవ ప్రేమ దివ్యబాలుని జన్మము ద్వారా బయలు పరచడమైనది

ధ్యానాంశం: దైవ కుమారుడు మన కొరకు పవిత్రాత్మ శక్తివలన దివ్య బాలునిగా ఈ లోకమున జన్మించియున్నాడు. ఆయన ఆదామును ఒక యువకునిగా చేసినట్లు తను కూడా ఒక యువకునివలె ఈలోకమున అవతరించియుండవచ్చు, కాని ప్రభువు మన అందరిలాగే పసికందై మరియ గర్భమున జన్మించియున్నాడు. చిన్న బిడ్డలంటే, అందరికీ చాలా ఇష్టం మరియు ప్రేమ. దేవుడు ఆ ప్రేమను పొందుటకు, ఆయనకు బయపడక ఉండుటకు, మరియు ఆ గొప్ప ప్రేమను మనదరికి నేర్పించుటకు తన మొదటి దర్శనాన్ని పసిబలుడై జన్మించడాని పునీత పీటర్ క్రిసోలోగుస్ చెప్పియున్నారు. దైవ కుమారుడు ఒక చిన్న బిడ్డవలె జన్మించునని యెషయ ప్రవక్త ఎన్నో సంవత్సరముల క్రితమే ప్రవచించియున్నాడు.

ఆ దివ్యబాలుడు రాజభవంతిలోగాక, వెముకలు కొరికే చలిలో, ఒక పశువుల గాటిలో, నిరుపేదత్వములో జన్మించుటకు నిర్ణయించుకున్నాడు. నా దేవా, నా ప్రభువా! నిన్ను ఈ స్థితికి తీసుకొని రావడానికి గల కారణమేమిటి? 'ప్రేమే' అని పునీత బెర్నార్డు గారు అంటున్నారు. మనపై గల దేవుని ప్రేమే ఈలోకమున ఈ స్థితిలో జన్మించుటకు కారణమైయున్నది.

ప్రార్ధన: ఓ దివ్య బాలయేసువా! నీవు ఎవరికోసం ఈ లోకమునకు వచ్చియున్నావు? నీవు ఈ లోకమున ఎవరి కోసం వెదకుచున్నావు? అవును. నాకు తెలుసు. నన్ను నరకమునుండి రక్షించుటకు, నా కోసం మరణించుటకు వచ్చియున్నావు. తప్పిపోయిన గొర్రెయైయున్న నన్ను వెదకుటకు వచ్చియున్నావు. తద్వారా, నేను నీనుండి పారిపోక, నీ ప్రేమగల హస్తములలో సేద తీరెదనుగాకా! నా యేసువా! నీవే నా సంపద, నా జీవితం, నా ప్రేమ, నా సర్వస్వం. నిన్ను తప్ప నేనింక ఎవ్వరిని ప్రేమించగలను? నీకన్న మిన్నగా ప్రేమించే స్నేహితుడు, తండ్రి నాకెక్కడ దొరకును?

ప్రియ తండ్రీ! నేను మిమ్ము అధికముగా ప్రేమిస్తున్నాను. నిన్ను ప్రేమించని క్షణాలకు మిక్కిలిగా చింతిస్తున్నాను. నా ప్రియ రక్షకుడా! హృదయపూర్వకముగా క్షమించుమని వేడుకొంటున్నాను. నన్ను క్షమించండి. మిమ్ములను ఎన్నటికిని విడువకుండునట్లు మరియు మిమ్ములను సదా ప్రేమించుటకును మీ అనుగ్రహాన్ని దయచేయండి. నన్ను నేను సంపూర్ణముగా మీకు అర్పించుకొనుచున్నాను. నన్ను త్రోసివేయక, నీ హక్కున చేర్చుకొనండి.

మరియ, నిత్య సహాయమాతా! మీ కుమారుని చిత్తమే నాకు జరుగునట్లు, మరణ సమయమువరకు ఓర్పును దయచేయమని నాకోసం ప్రార్ధించండి.

క్రిస్మస్ నవదిన ప్రార్ధనలు (Christmas Novena)

క్రిస్మస్ నవదిన ప్రార్ధనలు
మొదటి దినము: 16 డిశంబర్ 2011
దేవుని ప్రేమ ఆయన మనుష్యావతారమునందు బయలుపరచడమైనది.

ధ్యానాంశం: ఆదాము తన అవిధేయతవలన ఏదేనుతోటనుండి గెంటివేయబడ్డాడు. దేవుని అనుగ్రహమును కోల్పోయి ఉన్నాడు. మరియు, అతనిపై అతని సంతతిపై శాశ్వత మరనమను శిక్షను తీసుకొనివచ్చాడు. కాని, దైవ కుమారుడు, ఇలా జీవితమును కోల్పోయిన మానవున్ని రక్షింపకోరాడు. దీనినిమిత్తమై, మానవస్వభావమునుదాల్చి, శిలువపై దోషిగా నిందింపబడి, మరణవేదనను పొందియున్నాడు. మన రక్షణనిమిత్తమై అన్నింటిని సంతోషముగా భరించియున్నాడు. ఆయన ప్రభువు అయినప్పటికిని, పాపమువలన మానవుడు పోగొట్టుకున్న జీవితము అను దైవానుగ్రహమును ఒసగుటకు మానవుని స్వభావమును ధరించడానికి నిర్ణయించుకున్నాడు.

ప్రార్ధన: ఓ దైవ సుతుడా! మానవుని చేత ప్రేమింపబడుటకు, మానవరూపమును దాల్చియున్నావు. కాని, ఆ ప్రేమ ఎక్కడ? మా ఆత్మలను రక్షించుటకు, నీ రక్తమును చిందించియున్నావు. అయినప్పటికిని, మేము మిమ్ములను పరిపూర్ణముగా ప్రేమించలేక పోతున్నాము. ప్రభువా! అందరికన్న ఎక్కువగా, నేను మిమ్ములను నొప్పించియున్నాను. నా పాపములను క్షమించండి. నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమను నాకు ఒసగండి.

ఓ మరియమ్మా, దేవుని మాత, నా తల్లి, నా కొరకు మీ కుమారున్ని ప్రార్ధించండి. తద్వారా, మీ దివ్యకుమారున్ని, ఎల్లప్పుడూ, నా మరణాంతము వరకు ప్రేమించే అనుగ్రహమును పొందుదునుగాక! ఆమెన్.

ఆగమనకాల నాలుగవ ఆదివారము, Year B

ఆగమనకాల నాలుగవ ఆదివారము, Year B
18 December 2011
2 సా. 7: 1-11,16; రోమీ. 16:25-27; లూకా 1:26-38

ఈనాటి పటనాలు ఒక గొప్పవిషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. దేవుడు మనందరికీ ఒక్కొక్క ప్రణాళికను ఈర్పాటు చేసియున్నాడు. మరియు, ఆ ప్రణాళిక తప్పక నెరవేరుతుంది. మన హృదయాలలో నిజమైన శాంతి నెలకొనాలంటే, దేవుని ప్రణాళిక, మన ప్రణాళిక కావాలి - పరలోక జపములో ప్రార్దిస్తున్నట్లుగా, ''మీ చిత్తము నెరవేరును గాక!''

దావీదు మాహారాజు దేవాలయమును నిర్మించుటకు నిర్ణయించుకొన్నాడు. అది తన ఆలోచనగా, ప్రణాళికగా భావించాడు. కాని, అది దైవ ప్రణాళిక: ''ప్రభువు ఇల్లు కట్టనియెడల దానిని కట్టినవారిశ్రమ వ్యర్ధమగును'' (కీర్తన 127:1). దావీదును, అతని వంశమును నిత్యకాలము నిలచే ఆలయముగా మరియు మెస్సయ్యజన్మించే ఆలయముగా నిర్మించాలనేది దేవుని ఆలోచన, ప్రణాళిక! దేవుని ''మాస్టర్ ప్లాన్'' విశ్వసృష్టితోనే ఆరంభమైనది. రక్షణ ప్రణాళికను ఏదేను తోటలోనే ఏర్పాటుచేసియున్నాడు - ''స్త్రీ మరియు ఆమె సంతతి'' (ఆ.కాం.3). ఈ ప్రణాళిక పరిపూర్తికి ఆరంభం ఈనాటి సువిశేష పటనములో చూస్తున్నాము. ''దావీదు వంశస్తుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక మరియమ్మయొద్దకు దేవుడు గబ్రియేలుదూతను పంపెను'' (లూకా 1:26-27). దేవుని ప్రణాళిక సారాంశం లూకా 1: 31-33 వచనాలలో చూస్తున్నాము.

ఈనాటి సువిశేష పటనాన్ని ధ్యానిద్దాము:


లూకా 1:26-27:
ఈ ఆలోచనే అప్పటి వారికి ఒక పరిహాసముగా తోచియుండవచ్చు. ఎందుకనగా, గలిలయ తృణీకరించబడిన పట్టణము. ''గలిలయనుండి ఏ ప్రవక్తయు రాడు'' (యోహాను 7:52), ''నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా?'' (యోహాను 1:46). దేవుని ఆలోచనలు, ప్రణాళికలు వేరుకదా! ఆయన గలిలయపట్టణమునుండియే, ప్రవక్తలందరిలో గొప్ప ప్రవక్తను ఎన్నుకొంటున్నాడు. ఈ విధముగా, ప్రవక్తల ముఖ్యముగా యెషయ ప్రవక్త ప్రవచనాలు నేరవేర్చబడుతున్నాయి. దావీదువంశస్తుడగు యోసేపునకు 'ప్రధానము' చేయబడిన మరియమ్మ అనుకన్యకకు శుభసందేశాన్ని అందించుటకు గబ్రియేలుదూత పంపబడెను. ఇక్కడ గమనించవలసిన విషయం: మరియమ్మ కన్యక. 'ఆమె ఏ పురుషుని ఎరుగకపోవడం'(లూక 1:34). ఆమె ప్రధానము (engagement) చేయబడిన కన్యక. ఇంకను వివాహము జరగలేదు. చట్టప్రకారముగా, భవిష్యత్తులో తన భర్తతో ఉండవలసినది. ఈ పరిస్థితినుండి బయటపడాలంటే విడాకులు అవసరం (మత్తయి 1:19). ఆ కాలములో ప్రధానము జరిగిన తర్వాత, ఇరువురు శారీరక సంబంధమును కలిగియుండవచ్చు. కాని, మరియ యోసేపుల విషయములో అలా జరగలేదు. దేవునియందు పరిపూర్ణముగా, పరిశుద్ధముగా జీవించుటకు నిర్ణయించుకొని ఉన్నారు. సాధారణముగా, 'ప్రధానము' సమయం పన్నెండ్రు మాసాలు ఉండేది.
'ఆరవమాసము' యోహాను గర్భమందు పడిన తర్వాత ఆరవమాసము. ఇశ్రాయేలుప్రజలు, మెస్సయ్యకోసం, ఎంతోకాల ఎదురుచూపు తర్వాత, దేవుని ప్రణాళిక ఇప్పుడు వేగముగా జరగడం చూస్తున్నాం. దేవుని శుభసందేశం గబ్రియేలుదూతద్వారా పంపడుతుంది. గబ్రియేలుదూత, గలిలయలోని నజరేతునగరమునకు పంపబడెను.

లూకా 1:28: ''అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు''. మరియ 'అనుగ్రహ పరిపూర్ణురాలు'. ప్రతీ స్త్రీ మెస్సయ్యకు తల్లి కావాలని కోరుకొనేది. కాని, అందరి స్త్రీలలోకెల్ల మారుమూల నజరేతులోనున్న మరియను దేవుడు ఎన్నుకొన్నాడు. భర్తను ఎరుగక జన్మనివ్వడం సమాజములో అవమానకరమని మనందరికీ తెలిసిన విషయమే! ఆ అవమానాన్ని భరించుటకు 'ఏలినవారు ఆమెతో ఉన్నారు'. ఆమె గర్భమునుండి సంపూర్ణ మానవత్వం-దైవత్వం కలిగిన దేవుని కుమారుడు జన్మించవలసియున్నది. మరియ జీవితములో జరగబోయే ప్రతీ కార్యములో ఆమెతో ఉంటాడని, దేవుడు అభయాన్ని ఇస్తున్నాడు.

లూకా 1:29: ''మరియ కలత చెందినది''. దేవుని శుభవచనాలకు అర్ధ మేమిటోయని ఆలోచించింది. తననుండి దేవుడు ఏదో గొప్ప విషయాన్నే కోరుతున్నాడని ధ్యానించి ఉంటుంది. ఇంతకుముంది ఇలాంటి దర్శనాలను పొందిన సంఘటనలు ఆమె మదిలో మెదలి ఉంటాయి (ఆ.కాం. 18:10-15; న్యాయాధిపతులు 13:3-5,9).

లూకా 1:30: ''మరియమ్మా! భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భమును ధరించి కుమారుని కనిదెవు. ఆ శిశువునకు 'యేసు' అని పేరు పెట్టుము. దేవుని అనుగ్రహమనేది మనపైగాని, మన కార్యాలపైగాని ఆధారపడదు. దేవుని అనుగ్రహం ఒక వరం. ఆ వరాన్ని, ఆ అనుగ్రహాన్ని మరియమ్మ పొందియున్నది. మరియ ఒక కన్యకగా గర్భము ధరించవలసియున్నది. ఎందుకన, పవిత్రాత్మ ఆమెపై వేంచేయును. యెషయ 7:14 వచనం గుర్తుకు వస్తుంది: ''యువతి గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు (దేవుడు మనతో ఉన్నాడు) అని పేరు పెట్టును. 'యేసు' అనగా 'యహోవా రక్షణ'.

లూకా 1:32-33: గబ్రియేలుదూత జన్మించబోయేవాడు ఎలాంటివాడో తెలియపరుస్తుంది: ''మహనీయుడు, మహోన్నతుని కుమారుడని పిలువబడును, ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును, ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, మరియు ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు.''

లూకా 1:34: ''నేను పురుషుని ఎరుగనుకదా! ఇది ఎట్లు జరుగును?'' మరియమ్మ అమాయకత్వం కనిపిస్తుంది. ఇదంతయు కూడా పవిత్రాత్మ దేవుని శక్తి వలన జరుగును.

లూకా 1:35: పవిత్రాత్మ వలన గర్భము! మానవుని ఆలోచనలకు అందనటువంటిది. ఇది మానవ శక్తితో జరిగేది కాదు. కాని, దేవుని మహోన్నతమైన పవిత్రాత్మ శక్తి వలన జరిగెడి రక్షణ ప్రణాళిక. అందుమూలముననే, జన్మించేవాడు, మహోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు అని పిలువబడును. ఈవిధముగా, రాబోవువాని జన్మ అద్భుతమైనదని మరియు ఆ రాబోవువాడు మెస్సయ్య అని తెలియుచున్నది.

లూకా 1:36-37: ఎలిశబెతమ్మ ముసలిప్రాయములో గర్భము ధరించడముగూర్చి వింటున్నాం. ఇప్పుడు ఆరవమాసము. మరియమ్మకు తప్పక ఈ విషయం తెలుసు. కాని, ఆమె ఆశ్చర్యపడకపోయిఉండవచ్చు. కాబట్టి, గబ్రియేలు దూత దీనిని కేవలం ఒక వార్తగా కాకుండా, ఆ ఇరువురి (యోహాను మరియు యేసు) జన్మల ప్రాముఖ్యతను గూర్చి తెలియపరస్తుంది. దేవుని వాక్యము శక్తివంతమైనది, ఫలవంతమైనదని తెలుస్తున్నది. మరియమ్మకు దూతద్వారా అందిన దేవుని వాక్యముకూడా తప్పక నేరవేరునని నిరూపితమగుచున్నది. యుక్తవయస్సులోనున్న మరియకు ఇది ఒకపెద్ద విధియే! అందుకే ఎలిశబెతమ్మను గూర్చి చెప్పడము వలన మరియపట్ల దేవుని కరుణ, దయ, స్పష్టమగుచున్నది. ''దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదు'' అని ధ్యానించుదాం!

లూకా 1:38: ''ఇదిగో! నేను ప్రభువుదాసిరాలను. నీ మాటచొప్పున నాకు జరుగునుగాక!'' దేవుడు తనని ఎందుకు ఎన్నుకొన్నాడో మరియ జవాబుద్వారా నిరూపితమగుచున్నది. దేవుడు మరియను అనుగ్రహించాడు; ఆమె ప్రభువు దాసిరాలు. మరియ దేవుని చిత్తానికి తననుతాను పరిపూర్ణముగా సమర్పించుకొన్నది. పరిపూర్ణమైన విధేయతను చూపించింది. అసాద్యమైనది తననుండి కోరబడినది. కాని, దేవునికి అసాద్యమైనది ఏదియు లేదని మరియమ్మ విశ్వసించినది. దేవుని ప్రణాళికయే, తన ప్రణాళికగా భావించింది. మరియగర్భం నిత్యకాలమునిలచే, మరియు దేవుడే స్వయముగా ఏర్పాటుచేసికొన్న దేవుని దేవాలయము. దేవుని ఆలోచన, ప్రణాళిక సజీవమైనది! ఇదంతయు మనరక్షణ నిమిత్తమేనని మనం మరువకూడదు సుమా!

మనముకూడా మరియవలె క్రీస్తుకు ఈ లోకములో జన్మనివ్వాలి. మన హృదయాలు ఆయనకు ఆలయాలు కావాలి. ఆయన నిత్యకాలము మనలో నివసించాలి. పునీత పౌలుగారి వాక్యాలను గుర్తుకు చేసుకొందాం: ''ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మద్వారా నివసించును (ఎఫే 2:22). ''మనము ఈ భూమిమీద జీవించు ఈ గుడారము, అనగా మన భౌతిక దేహము శిధిలమగును. అప్పుడు మన జీవమునకై దేవుడు పరలోకమున ఒక గృహమును ఒసగును. అది చేతులతో చేసినది కాదు. అది ఆయనచే నిర్మింపబడినదే. పైగా నిత్యమైనది'' (2 కొరి 5:1).

ఆగమనకాల మూడవ ఆదివారం

ఆగమనకాల మూడవ ఆదివారం
11 డిశంబర్ 2011 YEAR B
యెషయ 61:1-2, 10-11; I తెస్స 5: 16-24; యోహాను 1 : 6-8, 19-28

మొదటిపటనములో, శుభవార్తప్రకటన, బందీలకువిముక్తి అనుదైవకార్యమును కల్గియుండి రాబోవువానిని గూర్చి యెషయప్రవక్త ప్రవచిస్తున్నాడు. సువిశేషపటనములో ఈలోకమునకు వెలుగైనున్నవాని రాకనుగూర్చి బప్తిస్మయోహానుగారు ప్రవచిస్తున్నారు.

గత ఆదివారముకూడా యోహానుగూర్చి, అతని జీవితము, భోధనలగూర్చి ధ్యానించియున్నాము. ఈ రోజుకూడా, బప్తిస్మ యోహానుగూర్చి సువిషేశములో వింటున్నాము. అతనుఎవరో, ఎవరుకాదో సుస్పష్టముగా ఈరోజు తెలుసుకోవచ్చు. మొదటిగా, ఎలియావలె దుస్తులు ధరించినప్పటికినీ(మా 1:6; 2 రా. 1:8), ఎలియావలె పశ్చాత్తాపము, తీర్పుగురించి ప్రకటించినప్పటికిని (1రా. 18:21; 2 రా.ది. 21:12-15), యోహాను పరలోకమునుండి తిరిగివచ్చిన ఎలియాకాదు(2 రా. 2:11). అయితే, యోహాను శారీరకముగా ఎలియాకానప్పటికిని, అతడు ఎలియాఆత్మయును, శక్తియునుకలిగి (లూకా 1:17; మలాకి 3: 23-24) దైవకార్యమును పరిపూర్ణముచేయుటకు పంపబడినవాడు. యోహాను దేవునివాక్యమును ప్రకటించినప్పటికిని, ద్వి.కాం. 18: 15-19 లో మోషేప్రవచించిన ప్రవక్తయునుకాదు. తల్లిగర్భమునుండియే పవిత్రాత్మతో అభిషిక్తుడైనప్పటికిని, అతను మెస్సయ్య కాదు (లూకా 1: 15,44).


మరి యోహాను ఎవరు? యోహాను ప్రభువుమార్గమును సిద్ధముచేయుటకు ఎడారిలో ఎలుగెత్తిపలుకు స్వరము (యోహా 1:23). ఎవరిపై అయితే పరమండలమునుండి ఆత్మదిగివచ్చినదో (యోహాను 1:32), మరియు మొదటిపటనములోవిన్న వాగ్దానములను పరిపూర్ణముచేయుటకు వచ్చియున్నాడో (లూకా 4:16-21) అతనిని మనకు పరిచయం చేయుటకు పంపబడినవాడు.

క్రిస్మస్ దినమునవచ్చు మెస్సయ్యను విశ్వసించుటకు బాప్తిస్మయోహాను మనకు 'వెలుగు'ను చూపించుటకు వచ్చినవాడు. యోహాను ఆవెలుగు కాదు. కాని, ఆ వెలుగునకు సాక్షమీయవచ్చెను. ఈ వెలుగుకోసమే మనం ఈ ఆగమనకాలమంతయు ఆయత్తపడుతూ, విశ్వాసముతో, నమ్మకముతో, గొప్పఆశతో ఎదురుచూస్తున్నాము. వెలుగు ఎప్పుడుప్రకాశిస్తూఉంటుంది. వెలుగువచ్చినపుడు మనలో, మనచుట్టూఉన్న అంధకారము పటాపంచలు అవుతుంది.

మనందరికి తెలిసినవిధముగా, వెలుగు చీకటి రెండు ఏకకాలములో విమడలేవు. చీకటివున్నచోట వెలుగు ఉండదు. వెలుగుఉన్నచోట చీకటిఉండదు. ఆ వెలుగు పేదలకు సువార్తను భోదించుటకు, చేరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనము కలుగజేయుటకు మరియు ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు పంపబడెను (లూకా 4:18-19). క్రీస్తువచ్చినప్పుడు మనలోని అంధకారము పటాపంచలు అవుతుంది. ఆయనరాకతో మనజీవితాలు ప్రకాశవంతమవుతాయి. ఆ వెలుగు ఈ లోకమున ఉండెను. ఆ వెలుగుమూలమున ఈ లోకము సృజింపబడెను.

ఈనాటి రెండవపటనములో, పౌలుగారు ''సర్వదా సంతోషముగా ఉండుడు'' అని చెప్పుచున్నారు. ఒకరు ఆదిశిస్తే వచ్చేది కాదు సంతోషం. అది ఒక అనుభూతి. కాని, పౌలు గారు చెప్పిన విధముగా, మనం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి, ఉండగలం. ఎందుకన, మన సంతోషానికి మూలాధారం మన ప్రభువు. మన భాదలలో కూడా, మనం సంతోషముగా ఉండవచ్చు. మనం ఎంత సంతోషముగా ఉన్నామనేది, మనం ప్రభువునకు ఎంత దగ్గరగా ఉన్నామో, ప్రభువు మనకి ఎంత దగ్గరాగా ఉన్నాడో అన్న దానిపై ఆధార పడిఉంటుంది. కాబట్టి, మనం ప్రభువునకు ఎంత దగ్గరగా ఉంటె, అంత సంతోషముగా ఉండగలం. ప్రభువు శిలువలోనున్న, భాదలలోనున్న ఆయన ప్రభువే. శిలువనుండికూడా మనకి సంతోషాన్ని ఇవ్వగలడు. 'కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు' అని అంటాముకదా! మరి అలాంటప్పుడు, మన భాదలో, దుఃఖంలో, వ్యాధిలో కూడా మనం ప్రభువుతో ఉన్నప్పుడు సంతోషముగా ఉండగలం. ప్రతీ పునీతుని సంతోషరహస్యం అదే! భాదలు వారిసంతోషాన్ని అధికమేచేసాయి. ఎందుకన, వారు ఎల్లప్పుడూ ప్రభువుతో ఉన్నారు కనుక! ఇదీ మన సంతోషరహస్యముకూడా కావాలి!

ప్రభువునకు చేరువ కావాలంటే,

మనకి, మనప్రభువునకు మధ్యఉన్న ఆటంకాలను తొలగించాలి. ఇంకోమాటలో చెప్పాలంటే, మన జీవితమునుండి, మన పాపాలను తీసివేయాలి. మనపాపమే ప్రభువునుండి మనలను దూరంచేస్తుంది. దీనికి, మొట్టమొదటి మెట్టు 'పాప సంకీర్తనము'.

ప్రతీదినం, ప్రతీక్షణం, ప్రభువు మనలను ఎక్కడఉండమని నిర్దేశిస్తే అక్కడ ఉండాలి. మనభాద్యతలను సక్రమముగా నిర్వహించాలి.

ఆదివార దివ్యపూజలో విశ్వాసముగా పాల్గొనాలి. అప్పుడే, ప్రభువునకు విశ్వాసముగా ఉండగలం, ఆయనకీ దగ్గర కాగలం.

''సదా ప్రార్దింపుడు'' (1 తెస్స 5:17). ప్రార్దన అనగా ప్రభుతో సంభాషించడం. ఆయనతో ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా, మాట్లాడవచ్చు.

''పొరుగు వారిని ప్రేమింపుడు''. క్షమా, అర్థం చేసుకోవడం, అంగీకారం, ప్రోత్సాహం అను గుణాలను అలవార్చుకొందాం. ఈ విధముగా, ప్రభువునకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమైఉండగలం. ''అన్ని వేలలయందును క్రుతజ్ఞులై ఉండుడు (1 తెస్స 5:18).

ఇలా ప్రభువునకు చేరువ అయినప్పుడే, పరిపూర్ణమైన ఆనందముతో, సంతోషముతో క్రిస్మస్ పండుగను కొనియాడగలము. ప్రభుహితమైన సంవత్సరమును కొనియాడుటకు క్రిస్మస్ రోజు మనదరికి చాల ప్రత్యేకమైనది. యెషయ ప్రవక్తద్వారా, పౌలుగారి లేఖద్వారా, మరియు బాప్తిస్మయోహానుగారిద్వారా, ప్రభుహితమైన సంవత్సరమును కొనియాడుటకు, సంతోషముతో, ఆనందముతో మనల్నిమనం సిద్ధపరచుకోవాలని ప్రభువు ఆదేశిస్తున్నారు.

Capuchins in India

CAPUCHINS IN INDIA (1632-2009):
A HISTORICAL READING IN RETROSPECT

- Benedict Vadakkekara

History is, to put it simply, something more than an orderly narration of some past events. It is in fact a study of the past or is the result of our attempts at understanding the past. A survey of the nearly four centuries of pastoral and social service that the Capuchin friars have uninterruptedly been carrying out in India not only spotlights the transforming results of their presence but also reflects to a great extent the methodological and ideational principles underpinning the Church’s coeval apostolic activities. If formerly in the historical narratives of local Churches pastoral agents were the protagonists, latterly the local community and its leadership tend to occupy the centre stage. In the ultimate analysis the history of the Capuchin Order in India is very much a story of the participation of local communities, as proven by examples galore. It was the generosity and benevolence of the diocesan authorities of Mangalore that actually paved the way for the opening of the noviciate house of Monte Mariano. The same may be said of the Diocese of Kollam regarding the foundation of St Anthony’s Friary. While Amalashram of Tiruchirappalli imparted a thoroughly native colouring to the Indian Capuchins, Assisi Ashram of Bharananganam stands as a lasting monument to the goodwill of the people towards the friars. Calvary Ashram of Thrissur would not have had its identity but for its place in the hearts of the people of the locality.