13వ సామాన్య ఆదివారము, YEAR A

 13వ సామాన్య ఆదివారము (2 జూలై 2023)
2 రాజు 4:8-11, 14-16; రోమీ 6:3-4, 8-11; మత్త 10:37-42
క్రైస్తవ పిలుపు శిష్యరికం

మనం చేసే ప్రతీ కార్యములో దేవునితో, తోటివారితో మన బంధాన్ని బలపరచుకున్నప్పుడే, ప్రతిఫలాన్ని పొందుతామని నేటి పఠనాలు మనకు బోధిస్తున్నాయి. మొదటి పఠనములో షూనేము స్త్రీ ఎలీషాను ప్రవక్తగా, దైవభక్తునిగా గుర్తించి, ఉదారముతో ఆతిథ్యమునిచ్చి, తన దాతృత్వానికిగల ప్రతిఫలాన్ని పొంది, జీవితాన్ని ధన్యంచేసుకున్నది. ఆతిథ్యము ఇవ్వడం అంత సులువైన విషయమేమీ కాదు. చాలా సమయాన్ని, వనరులను వెచ్చించాలి. ఆ స్త్రీ, తన భర్త సహాయముతో తమ ఇంటిలో ఎలీషాకు అన్ని వసతులు ఏర్పాట్లు చేసింది. ప్రతిఫలముగా, దేవుడు ఆమెకు సంతానవరమును వాగ్దానం చేసాడు. రక్షణ ప్రణాళికలో దేవునితో సహకరించే వారికి ప్రతిఫలాన్ని ఇవ్వడములో దేవుడు ఎప్పటికీ విఫలము కానేరడు. అలాగే, వాగ్దానం మేరకు ఆ స్త్రీ ఒక కుమారున్ని పొందినది. ఆ బిడ్డ పెరుగుతూ, అకస్మాత్తుగా మరణించినప్పుడు ఎలీషాను వేడుకొనగా, చనిపోయిన ఆ బిడ్డను దేవుడు మరల బ్రతికించాడు. నేటి సువిషేశములో ప్రభువు అన్నమాటలు ఆ స్త్రీకి ఆక్షరాల వర్తిస్తాయి. “ప్రవక్తను, ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు, ప్రవక్త బహుమానము పొందును” (మత్త 10:41). ఆవిధముగానే, ఆ స్త్రీ ప్రవక్త బహుమానాన్ని పొందినది.

నేటి సువిశేష పఠనం శిష్యరికము గురించి బోధిస్తుంది. యేసు తన శిష్యులకు రాబోయే ప్రేషితకార్యం గూర్చి బోధిస్తూ వారిని సంసిద్ధ పరస్తూ ఉన్నాడు. శిష్యుడు యేసుప్రభువును తన జీవితములో ప్రధమ స్థానముగా చేసుకోగలగాలి. ప్రేమ మార్గములో క్రీస్తును అనుసరించాలి. ప్రభువు కొరకు తన ప్రాణాలను సైతం అర్పించుటకు సిద్ధముగా ఉండాలి. అన్నింటికన్న మిన్నగా దేవున్ని ప్రేమించాలి. క్రీస్తుపై ప్రేమ గొప్పదై యుండాలి. అలాంటి వారికి తప్పక ప్రభువు ప్రతిఫలాన్ని ఒసగుతాడు. ఇదే భావాన్ని మొదటి పఠనములో చూసాము. అలాగే, అలాంటి వారు జ్ఞానస్నానముద్వారా, తమనుతాను క్రీస్తుతో పోల్చుకొని, ప్రేమ మార్గములో క్రీస్తును అనుసరిస్తూ, శాశ్వతముగా పాపాన్ని త్యజించువారని రెండవ పఠనం తెలియజేయు చున్నది. క్రీస్తుతో మరణించినచో, క్రీస్తులో జీవించ గలుగుతాము.

క్రీస్తునందు ప్రియ సోదరులారా! క్రీస్తును అనుసరించడములో మనం నిజముగా ఏమి త్యాగం చేసాము? క్రీస్తును అనుసరించడం అంత సులువైన విషయమేమీ కాదు. జీవిత సర్వాన్ని దేవునికి అర్పించాలి. ఇది ఖచ్చితముగా త్యాగపూరితమైన జీవితం. సవాలుతో కూడినటువంటి జీవితం. క్రీస్తును ఎన్నుకొని, సిలువ వరకు ఆయనను వెంబడించడం ఎన్నటికీ వైఫల్యం కాదు. మరణానికి మార్గం కాదు. తప్పక నిత్యజీవితానికి మార్గం. “తన సిలువ నెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాదు” (మత్త 10:38). సిలువను మోయడం క్రీస్తును అనుసరించడములో విడదీయని భాగం (మార్కు 8:34). ఎప్పుడైతే, ఒక వ్యక్తి స్వార్ధముతో, లోకాశలతో జీవిస్తూ ఉంటాడో, అతను తన జీవితాన్ని కోల్పోతాడు. “తన ప్రాణమును దక్కించుకొన యత్నించువాడు, దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించు కొనును (మత్త 10:39). అనగా, ఒక వ్యక్తి దేవుని ప్రణాళికలకు విధేయతతో జీవిస్తూ, తోటి సోదరులపట్ల ప్రేమ కలిగి జీవిస్తాడో, తప్పక జీవాన్ని పొందును. కనుక, యేసును వెంబడించడం అనగా దేవుని మహిమ కొరకు మరియు ఇతరుల మేలు కొరకు మన ప్రాణమును కోల్పోవడం.

మనకు సువార్తను బోధించే వారి జీవితాలలోకూడా యేసును మనం గుర్తించాలి. సువార్తా నిమిత్తమై తమ జీవితాలను అంకితం చేయడానికి, తమ కుటుంబాలను, భూములను, ఆస్తులను వదిలివేసి దేవునిచే పిలువబడిన వారు మన మధ్యలో ఎంతోమంది యున్నారు. వారు అందరివలె సాధారణమైన మనుష్యులే. మానవ నైజానికి అతీతులు ఏమీ కాదు. కనుక, వారికి మన ఆప్యాయత, మద్దతు, సంఘీభావం ఎంతో అవసరం. వారికి సహాయపడటం మన బాధ్యత. ప్రేమ, ఆతిథ్యము, ప్రార్ధనల ద్వారా వారికి అండగా యుండవచ్చు. ఆతిథ్యము క్రైస్తవ జీవితములో భాగం. యేసు తన బోధనలలో కూడా ఆతిథ్యముగూర్చి నొక్కి చెప్పాడు. “నా శిష్యుడని ఈ చిన్న వారలలో ఒకనికి ఎవడేని ఒక గ్రుక్కెడు మంచి నీరొసగినవాడు తన బహుమానమును పోగొట్టు కొనడు (మత్త 10:42).

ఆత్మపరిశీలన చేసుకుందాం. యేసుతో నా సహవాసం, బంధం ఎలాయున్నది? సిలువను మోయుటద్వారా నిజమైన శాంతిని, సంతోషాన్ని పొందుచున్నానా? నా జీవితాన్ని కోల్పోవుట వలన, క్రీస్తులో నిత్యజీవాన్ని పొందుతానని విశ్వసిస్తున్నానా? మన అనుదిన జీవితములో క్రీస్తుకు ప్రాధాన్య మిస్తూ, అనుదిన సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించ ప్రయత్నం చేద్దాం!

No comments:

Post a Comment