12వ సామాన్య ఆదివారము (25 జూన్ 2023)
యిర్మియా 20:10-13; రోమీ 5:12-16; మత్త 10:26-33
భయపడకు! దేవునిపై నమ్మకాన్ని ఉంచు!
12వ సామాన్య ఆదివారము (25 జూన్ 2023)
యిర్మియా 20:10-13; రోమీ 5:12-16; మత్త 10:26-33
భయపడకు! దేవునిపై నమ్మకాన్ని ఉంచు!
నేటి పఠనాలు దేవునిపై విశ్వాసము, నమ్మకముంచాలని
బోధిస్తున్నాయి. మన పరిస్థుతులు విరుద్ధముగా నున్నను, భయానకరముగా నున్నను, దేవుడు
మనపట్ల శ్రద్ధను కలిగియున్నాడని విశ్వసించాలి. ఆపద సమయములో దేవుడు మన ప్రార్ధనలను
తప్పక ఆలకిస్తాడు.
మొదటి పఠనములో, యిర్మియా ప్రవక్త దైవసందేశాన్ని
ప్రకటించుటలో తనకు ఎదురైన సవాళ్లు, వ్యతిరేకతపై తన నిరాశను, వేదనను
వ్యక్తపరుస్తున్నాడు. కష్టాలు, బాధలు, వ్యతిరేకత ఉన్నను, దేవునిపై తన నమ్మకాన్ని,
విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. దేవుడు తనతో ఉన్నాడని, తనకు బలాన్ని
చేకూరుస్తూ, శత్రువుల బారినుండి కాపాడు చున్నాడని తెలియజేయు చున్నాడు. దేవుని
రక్షణ, విశ్వసనీయతపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచి, దేవున్ని బలాడ్యుడుగా, వీరుడుగా గుర్తిస్తున్నాడు.
ఘోరమైన కుట్రలనుండి, దుర్మార్గుల చేతులనుండి దేవుడు యిర్మియాను విడిపించాడు. కష్టాల
సమయములో దేవునిపై ఆధారపడాలని యిర్మియ జీవితం సూచిస్తుంది. విపత్కర పరిస్థితులలో
జీవిస్తున్న మనం, లోక శక్తులపైగాక, దేవునిపై నమ్మకముంచాలి. కష్టాల సమయములో
విశ్వాసాన్ని స్థిరముగా ఉంచుకొని, పట్టుదలతో ఉండాలని యిర్మియా జీవితం మనకు
నేర్పుచున్నది.
రెండవ పఠనము దేవుని రక్షణ, పాపవిముక్తి గూర్చి
తెలియజేయుచున్నది. ఆదాము ద్వారా (ఆది) పాపము ఈ లోకములోనికి ప్రవేశించి, మరణానికి
దారితీసింది. దేవుని సహవాసమునుండి దూరము చేసింది. అయినను దేవుడు మనలను
చేయివిడువలేదు. క్రీస్తు అనుబడు గొప్ప అనుగ్రహము ద్వారా మనకు రక్షణ ఒసగాడు. తండ్రికి
సంపూర్ణ విధేయతద్వారా, సిలువ త్యాగబలిద్వారా, క్రీస్తు తన మరణముద్వారా మన
భయాలన్నింటిని తొలగించాడు. మనకు శాంతిని ప్రసాదించాడు. మన శిక్షనుండి విడిపించి,
తిరిగి మనలను దేవునితో సఖ్యత పరచాడు.
దైవరాజ్యమును, సువార్తను ప్రకటించుటలో, క్రీస్తుకు
సాక్ష్యమిచ్చుటలో ఎవరికీ భయపడకూడదని సువిశేషము తెలియజేయు చున్నది. అప్పటికే
ప్రభువు శిష్యులతో వారు పొందబోవు హింసల గురించి ప్రస్తావించారు (మత్త 10:16-25).
అయినప్పటికిని, వారు ధైర్యముగా ఉండాలని ప్రభువు కోరుచున్నారు. వారి విశ్వాసము, విధేయత, వారి సహనం, పట్టుదల వారిని వెలుగులోనికి నడిపించును. క్రీస్తుకు
సాక్ష్యమివ్వడం మన జ్ఞానస్నాన పిలుపు. అయితే, హింసలు కూడా మనం ఎదుర్కోవలసి
ఉంటుంది. భయం ఆశలోనికి నడిపించాలి. క్రీస్తు సిలువ మనకు గొప్ప ఆదర్శం. సిలువను
ఆలింగనం చేసుకొని, శత్రువులను క్షమించడం వలన, మరణ భయం తొలగిపోయింది.
క్రీస్తు బోధించు విషయముల నెల్ల వెలుతురులో
బోధించాలి. ఇంటిమీది నుండి ప్రకటించాలి. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి, ఆత్మను
నాశనము చేయలేని వారికి భయపడ కూడదు. ఆత్మను, శరీరమును కూడ నరక కూపమున నాశనము చేయగల
దేవునికి మాత్రమే మనం భయపడాలి. ఎందుకన, శారీరక జీవితం అశాశ్వతం. క్రీస్తునందు
శాశ్వత జీవితమున్నదనేది మన దృఢవిశ్వాసం. మన ధైర్యం దేవునిపై మనకున్న
విశ్వాసమునుండి వస్తుంది. ప్రతీ ఒక్కరికి దేవుడు విలువని ఇస్తాడు. మన తల వెంట్రుక
లన్నియు లెక్కింప బడియే యున్నవి. అనగా దేవుడు మనవైపు ఉన్నాడని, మన గురించి
క్షుణ్ణంగా ఎరిగియున్నాడని అర్ధం. శత్రువు బారినుండి మనలను కాపాడుటకు దేవుడు సమర్ధుడు,
ఎల్లప్పుడు సిద్ధముగా ఉన్నాడని అర్ధం. దేవుని దృష్టిలో మనం అతి విలువైన వారము.
కనుక, క్రీస్తు రక్షణను పొందాలంటే, మనం చేయవలసినది ఆయనను సంపూర్ణముగా విశ్వసించడం, ప్రార్ధన చేయడం మరియు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఆయనను విశ్వసించడం అనగా, ఆయన పక్షమున ఉండటమే. ప్రార్ధనలో ధైర్యాన్ని పొందుతాం (మత్త 26:38,42). నిజమైన క్రైస్తవులుగా ఉండటం అంటే, మనలను మనం క్రీస్తుకు సంపూర్ణముగా సమర్పించుకోవడమే. విపత్కాలములో కూడా ధైర్యముగా క్రీస్తుకు సాక్ష్యులుగా మారాలి. మనం నిజముగా క్రీస్తుకు సాక్ష్యులుగా ఉండాలంటే, శ్రమలను ఎదుర్కోవలసినదే. అంధకార సమయములో దేవుడు మనతో వెలుగుగా యున్నాడని దృఢముగా విశ్వసించాలి. క్రీస్తు పొందిన శ్రమలు తిరుసభలో ఎప్పటికి ఉంటాయి. “భయపడకుడు” ఆన్న క్రీస్తు మాటలు మనకు గొప్ప ఊరటను కలిగిస్తాయి. మనతోనున్న క్రీస్తు సాన్నిధ్యం ఆయన కొరకు ప్రాణాలు అర్పించుటకైనను ధైర్యాన్ని ఇస్తుంది. “ప్రజల యెదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని, పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేను అంగీకరింతును” (మత్త 10:32). మన సాక్ష్యం ఇతరులలో కూడా ధైర్యాన్ని నింపును.
Great Homily Father!!! Thank You!!
ReplyDeleteThank you! God bless!
DeleteSimple and humble , everyone needs to remember these words in all situations.thank u father
Delete