మోక్షారోహణ పండుగ, Year A

 మోక్షారోహణ పండుగ, Year A
అ.కా. 1:1-11, ఎఫెసీ. 1:17-23, మత్త. 28:16-20

“మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే ఆయన మరల వచ్చును” (అ.కా. 1:11).

మోక్షారోహణం – శ్రీసభ పరిచర్య ప్రారంభం


“శిష్యులు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. ఒక మేఘము ఆయనను కమ్మివేసెను” (1:9). ఈ రోజు మన ప్రభువగు యేసు క్రీస్తు మోక్షారోహణ పండుగను కొనియాడు చున్నాము. మోక్షారహణం ఒక పరమ రహస్యం. గొప్ప, కీలకమైన సంఘటన. ఇది మన గొప్ప విశ్వాసము. మోక్షారోహణము అనగా పరలోకమునకు కొనిపోబడుట. అనగా తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళడం. బైబులులో, ముఖ్యముగా లూకా రచనలలో యేసు క్రీస్తు మోక్షారోహణము గురించి కనిపిస్తుంది (లూకా. 24:50-51; అ.కా. 1:9-11; చూడుము. మార్కు 16:19).

నేడు ముఖ్యముగా రెండు విషయాలను ధ్యానించుదాం:

ఒకటి, క్రీస్తు మోక్షారోహణము, ఆయన పరలోక [తండ్రి] మహిమలోనికి కొనిపోబడ్డాడు (చూడుము. యోహాను. 1:14, ఫిలిప్పీ. 2:5-8). “పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని, కుడి ప్రక్కన కూర్చొని యున్నాడు” అని ‘అపోస్తలుల విశ్వాస ప్రమాణము’ మనకు బోధిస్తున్నది. ఆయన మరల తిరిగి వచ్చును (1:11). “దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయును” (రోమీ. 8:34). “పాపమును గూర్చి విచారించుటకు గాక, తన కొరకై వేచి యున్న వారిని రక్షించుటకు ఆయన రెండవ మారు వచ్చును” (హెబ్రీ. 9:28). రెండు, శ్రీసభ పరిచర్య ప్రారంభం. “పిదప శిష్యులు వెళ్లి అంతట సువార్తను ప్రకటించిరి” (మార్కు. 16:20).

మోక్షారోహణము: యేసు ఆజ్ఞాపించిన విధముగా, పదునొకండుగురు శిష్యులు, గలిలీయలోని ఓలీవు పర్వతము వద్దకు వెళ్ళిరి. బైబులులో ‘పర్వతం’, దేవుని కలుసుకొను పవిత్ర స్థలం, ప్రార్ధానా స్థలం. అచట శిష్యులు “ఆయనను దర్శించి ఆరాధించిరి” (మత్త. 28:17). అప్పుడు యేసు వారు ఏమి చేయాలో తెలియజేసి, కొన్ని ఆజ్ఞలను ఇచ్చి, వారు చూచుచుండగానే, మోక్షారోహణ మయ్యాడు. మోక్షారోహణముతో, ప్రభువు భూలోక యాత్ర ముగిసింది. శరీరముతో మోక్షమునకు కొనిపోబడ్డాడు. దీనికి సూచనగానే, ఈరోజు నుండి మనం దేవాలయములో పాస్కా వత్తిని వెలిగించము. అయితే, ప్రభువు “లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును” (మత్త. 28:20) అని అభయ మొసగాడు. తండ్రి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ద్వారా (యోహాను. 16:7-16; చదువుము. అ.కా. 2:33), మోక్షారోహణమైన ప్రభువు మనతోనే ఉంటాడు.

అ.కా. 1:3-11లో ఉత్థాన క్రీస్తు శిష్యులకు ఇచ్చిన అంతమ సందేశము, మోక్షారోహణమును చూడవచ్చు. ఉత్థానమైన తరువాత, ప్రభువు 40 రోజులపాటు [‘అర్దవంతమైన కాలము’] తన అపోస్తలులకు, శిష్యులకు ప్రత్యక్ష మయ్యాడు. తాను సజీవుడనని పలువిధములుగా ఋజువు పరచుకున్నాడు. దేవుని రాజ్యము గురించి వారికి బోధించాడు. పవిత్రాత్మ ద్వారా వారికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఉదాహరణకు, తండ్రి చేసిన వాగ్ధానము (పవిత్రాత్మ) కొరకు యెరూషలేమును విడిచి వెళ్ళ వద్దు (1:4) అని ఆజ్ఞాపించాడు.

శ్రీసభ పరిచర్య: మోక్షారోహణమయిన ప్రభువు మరల తప్పక తిరిగి వచ్చును అని వాక్యం సెలవిస్తుంది, మన విశ్వాసం కూడా! ఇప్పుడు మనం ఆయన [రెండవ] రాకకై ఎదురుచూస్తూ ఉన్నాము. అయితే, ప్రభువు తిరిగి వచ్చేలోగా, ఆయన ఈ లోకములో ఆరంభించిన ప్రేషిత కార్యమును ఆయన శిష్యులమైన మనమందరము కొనసాగించాలి.

ఆ ప్రేషిత కార్యాన్ని ప్రభువు అపోస్తలులకు స్పష్టము చేసియున్నాడు: “పవిత్రాత్మ మీ పైకి వచ్చునప్పుడు, మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను, యూదయా, సమరియా సీమల యందు అంతటను, భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు” (1:8). అలాగే, తన అంతిమ సందేశముగా, “ఇహ పరములందు నాకు సర్వాధికార మీయబడినది. కనుక మీరు వెళ్లి సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించిన దంతయు వారు ఆచరింప బోధింపుడు” (మత్త. 28:18-20) అని ఉపదేశించాడు. పెంతెకోస్తు దినమున, పవిత్రాత్మ రాక శక్తితో,  ప్రారంభమైన ఆ ప్రేషిత కార్యము, నేటికి కొనసాగుతూనే ఉన్నది. నేడు క్రీస్తునందు జ్ఞానస్నానము పొందిన మనకూ అదే ఆజ్ఞ ఇవ్వబడినది. అపోస్తలులవలె మనము కూడా ఆ ప్రేషిత కార్యములో భాగస్థులమవుటకు పంపబడినాము.

ప్రభువు ఇచ్చిన చివరి ఆదేశము నుండి, మన ప్రేషిత కార్యమును మూడు రకాలుగా చూడవచ్చు:

1. ఈ లోకములో క్రీస్తుకు సాక్ష్యం ఇవ్వడము: ప్రభువు తన శిష్యులతో, “ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోక మందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి యెదుట ప్రకాశింపనిండు” (మత్త. 5:16) అని ఆజ్ఞాపించాడు. క్రైస్తవులు ఈ లోకమునకు వెలుగై యుండాలి. పాపమనే అంధకారముతో నిండియున్న ఈ లోకములో క్రీస్తు విశ్వాసులు తమ మంచి పనులద్వారా, సేవా జీవితము ద్వారా వెలుగును ప్రసరింప జేయాలి. మదర్ తెరెసా లాంటి ఎంతోమంది పునీతులు మనకు ఆదర్శముగా ఉన్నారు. క్రీస్తు బోధించిన అష్టభాగ్యాల సత్యమును, జీవించినచో, లోకమునకు వెలుగు కాగలము. విశ్వాసులు ఒకరికొకరు, ముందుగా వారి కుటుంబములో, ఆదర్శవంతమైన జీవితమును జీవించాలి. కుటుంబములో ప్రేమ కలిగి జీవించువారు, సమాజములోను, లోకములోను ప్రేమ కలిగి జీవిస్తారు.

2. సువార్త పరిచర్య: క్రీస్తు రక్షణ సువార్తను ఈ లోకములో ప్రకటించాలి. సువార్తను మనం పొందనిచో, ఇతరులకు ఎలా తెలియ జేస్తాము? సువార్తను తెలుసుకోవాలన్న కోరిక, తపన ఎంత మందికి ఉన్నది? ప్రస్తుత కాలములో, సామాజిక మాధ్యమాల ద్వారా, ఇతర వ్యక్తులు, సాధనాల ద్వారా, బైబులు విజ్ఞానమును పెంపొందించు కోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనలో ఎంతమందిమి నేర్చుకోవాలని ఆసక్తిని కనబరుస్తున్నాము? మనలో విద్యాపరంగా చదువుకున్నవారు ఎంతోమంది ఉన్నారు, కాని, శ్రీసభ బోధనలను, సువార్తా వివరణలను తెలిసినవారు ఎంతమంది ఉన్నారు?

సువార్తను ప్రకటించడం అనగా కొన్ని వాస్తవాలకు మనం విశ్వాసపాత్రులముగా, నమ్మకముగా ఉండాలి: 1. క్రీస్తుకు, ఆయన సందేశమునకు నమ్మకముగా ఉండాలి. 2. శ్రీసభ పరిచర్యకు నమ్మకముగా ఉండాలి. 3. విశ్వాసుల పట్ల నమ్మకముగా ఉండాలి..

3. సకల జాతి జనులను క్రీస్తుకు శిష్యులనుగా చేయటం: క్రీస్తు శిష్యులు కావాలంటే, క్రీస్తు సువార్త బోధింప బడాలి, మారుమనస్సు పొంది క్రీస్తునందు విశ్వసించాలి, త్రిత్వైక నామమున జ్ఞానస్నానం పొందాలి, క్రీస్తు ఆజ్ఞలను పాటించాలి. యేసు భూలోకములో చేసిన పరిచర్య కూడా ఇదే! నేడు ఇది మనందరి బాధ్యత! మనందరి ప్రేషిత కార్యము! ఇది సాధ్యమే, ఎందుకన, ఆయన ‘ఇమ్మానుయేలు’, “ప్రభువు మనతో ఉన్నారు” (మత్త. 1:23, 28:20). మోక్షారోహణమునకు ముందుగా, శిష్యులు ఆయనను దర్శించి ఆరాధించారు. కాని కొందరు సందేహించారు (మత్త. 28:17). అయినను ప్రభువు వారిని నమ్మి వారికి బాధ్యతను అప్పజెప్పాడు. మనం అల్పవిశ్వాసులమైనను (మత్త. 630), మన విశ్వాసం ఆవగింజంతదైనను, ప్రభువు మనలను నమ్ముచున్నాడు. ఈ బాధ్యతను మనం కొనసాగించాలి. ఈ ప్రేషిత కార్యం విశ్వజనీనమైనది. సకల జాతి జనులను [యూదులు, అన్యులు] క్రీస్తుకు శిష్యులనుగా చేయాలి. త్రిత్వైక సర్వేశ్వరుని ప్రేమను లోకమంతటా ప్రకటించాలి. సకల జాతి జనులకు క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించాలి. జ్ఞానస్నానము ద్వారా, వారిని తల్లి శ్రీసభలోనికి ప్రవేశ పెట్టాలి. జ్ఞానస్నానం త్రిత్వైక సర్వేశ్వరునితో, సంఘముతో ఐఖ్యతకు సూచన.

ఆత్మతో మన పరిచర్య సాధ్యమే!

రెండవ పఠనములో, పౌలు, ఎఫెసీయులకు  ఆత్మను ప్రసాదింప వలసినదిగ, తండ్రి దేవుడిని అర్ధిస్తున్నాడు. ఆత్మ మనకు వివేకమును కలిగించి దేవుని విదిత మొనర్చును. దేవుని శక్తి ఎంతో అతీతమైనది. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండ బెట్టు కొనినపుడు ఆయన ఉపయోగించిన మహా శక్తియే అది! ఆత్మద్వారా మనము పొందు వివేకము మన హృదయ కన్నులను ప్రజ్వరిల్ల జేయును, తద్వారా మన విశ్వాసము బలపడును. మన బుద్ధి, మనసులు వికాసము పొందును. కనుక, మనలో పనిచేయుచున్న ఆత్మ వరమును తక్కువ అంచనా వేయకూడదు. “విశ్వాసులమగు మనలో ఉన్న దేవుని శక్తి ఎంతో అతీతమైనది.” జ్ఞానస్నానము పొందిన ప్రతీ విశ్వాసిలో దేవుని ఆత్మ వసించును. కనుక, శ్రీసభ పరిచర్యను సంపూర్ణము చేయు శక్తిని మనము కలిగి యున్నాము. విధేయత కలిగిన విశ్వాసం మనకుండాలి. కనుక, క్రీస్తుకు సాక్ష్యులమవుదాం. ఆయన సువార్తను ప్రకటించుదాం. సకల జాతి జనులను క్రీస్తుకు శిష్యులనుగా చేయ ప్రయత్నిద్దాం

శ్రీసభ పరిచర్యలో, ప్రేషిత కార్యములో నిమగ్నమైయున్న సమయములోనే, మన జీవితాలను కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇతరుల పరివర్తన, పవిత్రతయే గాక, మన జీవితాలలో పరివర్తన, పవిత్రతను కూడా పరిశీలించు కోవాలి! ప్రభువు వచ్చునప్పుడు, ఈ భూమి మీద మన విశ్వాసమును చూడగలుగునా? (లూకా. 18:8) అని ఎప్పటికప్పుడు పరిశీలించుకుందాం!

1 comment: