పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల (దివ్యసత్ప్రసాద) మహోత్సవం (22 జూన్)
ఆది.కా. 14:18-20; 1 కొరి 11:23-26; లూకా 9:11-17
ఉపోద్ఘాతం: ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈ రోజు మనం పరమ పవిత్ర క్రీస్తు శరీర రక్తముల (దివ్యసత్ప్రసాద)
మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము. ఈ పండుగ మన విశ్వాసానికి
గుండెకాయ లాంటిది. ఇది మన రక్షకుడు యేసుక్రీస్తు తనను తాను మనకు ఆహారంగా
అర్పించుకున్న అద్భుతమైన ప్రేమను గుర్తు చేస్తుంది. పవిత్ర సప్త సంస్కారాలలోకెల్ల దివ్యసత్ప్రసాదం మన క్రైస్తవ జీవితానికి మూలస్తంభం.
క్రీస్తు ప్రభువు తన ఆత్మ ప్రేరణతో దీన్ని ప్రవేశపెట్టారు. మన హృదయాలలో
నివసించడానికి, మన ఆత్మలను పోషించడానికి ఆయన
దివ్యసత్ప్రసాదాన్ని స్థాపించారు. ఇది సర్వమానవాళికి ప్రసాదించిన గొప్ప వరం,
శ్రీసభకు అమూల్యమైన ఆధ్యాత్మిక సంపద.
దివ్యసత్ప్రసాదంలో దైవసాన్నిధ్యం నిక్షిప్తమై ఉంటుంది.
పండుగ నేపథ్యం: ఈ పండుగ
బెల్జియం దేశానికి చెందిన జూలియానా అనే మఠకన్యకు తరచుగా కనిపించిన ఒక దివ్యదృశ్యం నుండి ఉద్భవించింది.
ఆమె దగదగ మెరిసిపోతున్న చంద్రుడిని చూసేది, దానిపై ఒక మచ్చ ఉండేది. అది ఏదో అద్భుతమని ఆమెకు స్పష్టంగా
అర్థమైంది. అయితే, ఆ దృశ్యం గురించి ఇతరులతో
పంచుకోవడానికి ఆమె భయపడింది. ఎందుకంటే, దాన్ని
వివరించలేకపోయింది, దాని లోతైన భావాన్ని
గ్రహించలేకపోయింది. ఆ దృశ్యం యొక్క
అర్థాన్ని తెలుసుకోవాలని ఆమె తీవ్రంగా కోరుకుంది, అందుకు ఉపవాసాలు, ప్రార్థనలు చేసింది. కొన్ని రోజుల
తర్వాత, సాక్షాత్తు క్రీస్తు ప్రభువు ఆమెకు ఆ దృశ్యం యొక్క లోతైన భావాన్ని అర్థమయ్యేలా చేశారు. ఆ విధంగా
ఆమె జ్ఞానోదయం పొందింది. ఈ సంఘటన దివ్యసత్ప్రసాద మహోత్సవానికి పునాది వేసింది.
పండుగ విస్తరణ-దివ్యసత్ప్రసాద గౌరవార్థం ప్రత్యేక ఉత్సవం: జూలియానాకు కనిపించిన దృశ్యం యొక్క లోతైన భావం క్రమంగా స్పష్టమైంది.
ఆ దృశ్యంలో చంద్రుడు
శ్రీసభను సూచిస్తుండగా, దానిలోని మచ్చ 'దివ్యసత్ప్రసాద' గౌరవార్థం ఒక ప్రత్యేక ఉత్సవం లేని లోపాన్ని తెలియజేసింది.
ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేయడంలో తోడ్పడమని
ప్రభువు తనను ఆజ్ఞాపిస్తున్నాడని ఆమె గ్రహించింది. "నేను ఒక సాధారణ కన్యస్త్రీని,
ప్రభువు నాకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించారు,
దీన్ని నేను నెరవేర్చగలనా!" అని లోలోపల
సతమతమవుతుండగా, పెద్దలను ఆశ్రయించమని దేవుడు ఆమెకు
ధైర్యాన్ని ప్రసాదించారు.
ముందుగానే ఆమె ఈ దృశ్యం గురించి కొంతమంది దేవాలయ పెద్దలకు, తెలిసిన గురువులకు, తోటి మఠకన్యలకు తెలియజేసింది. వారందరూ
కలిసి అప్పటి లియోదిపుర పీఠాధిపతిని కలిసి ఈ విషయం ప్రస్తావించారు. తమ మేత్రాసనంలో 'దివ్యసత్ప్రసాద' మహోత్సవాన్ని ఏర్పాటు చేయవలసిందిగా
పీఠాధిపతిని అభ్యర్థించారు. తత్ఫలితంగా, రోబెర్టో పీఠాధిపతులు 1246వ సంవత్సరంలో తమ గురువులందరికీ అధికారపూర్వకమైన
ఉత్తర్వులను పంపి, ఈ ఉత్సవాన్ని ప్రారంభించాలని ఆదేశించారు.
అలా ఆ మేత్రాసనంలో ఉత్సవం ప్రారంభమైనందున ప్రజలు ఈ గొప్ప మహోత్సవం
ద్వారా 'దివ్యసత్ప్రసాద' ప్రాముఖ్యతను, ఔన్నత్యాన్ని గ్రహించారు. అది చూసిన
ఇతర పీఠాధిపతులు తమ మేత్రాసనాల్లో ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. తరువాత కొన్నాళ్ళకి
ఈ ఉత్సవ సంబరం ఇతర దేశాలకు విస్తరించింది. చివరికి 1264వ సంవత్సరంలో, మూడవ ఉర్భాను పోపుగారు ఈ మహోత్సవం
శ్రీసభ అంతటా జరపాలని ఆదేశించారు.
దివ్యసత్ర్పసాదం-చారిత్రకాంశాలు: తొలి రోజుల్లో క్రైస్తవులు జ్ఞానస్నానాన్ని మాత్రమే ప్రధాన సంస్కారంగా పరిగణించారు. జ్ఞానస్నానంతో ప్రారంభమైన
క్రైస్తవ జీవితాన్ని దివ్యసత్ప్రసాదం మరింత పెంపొందిస్తుందని వారు భావించారు.
అందువల్ల, వారి దృష్టిలో సత్ప్రసాదం జ్ఞానస్నానం
అంత ముఖ్యమైనది కాదు.
క్రీస్తు దివ్యసత్ప్రసాదాన్ని స్థాపించిన సందర్భాన్ని పరిశీలిస్తే,
క్రీస్తు "భుజించమని" మాత్రమే
అన్నారు కానీ “ఆరాధించమని” అనలేదు. కనుక, తొలినాటి
క్రైస్తవులు దాన్ని భోజనంగానే భావించారు కానీ ఆరాధ్య వస్తువుగా ఎంచలేదు. పూజకు హాజరైన క్రైస్తవులు,
దివ్యసత్ప్రసాదాన్ని ప్రసాదంగా ఇళ్లకు తీసుకొని
వెళ్ళేవాళ్లు. దాన్ని తమ ఇళ్లల్లో భద్రపరుచుకుని భుజించేవాళ్లు. ఈ సంప్రదాయం 8వ శతాబ్దం వరకు కొనసాగుతూ వచ్చింది.
అదే కాలంలో, దాన్ని దేవాలయాలలో పదిలపరచి పూజ జరగని
సమయాల్లో పంచి పెట్టేవాళ్లు. వ్యాధిగ్రస్తులకు కూడా భోజనంగా ఇచ్చేవాళ్లు. ఈ
సందర్భాలన్నింటిలోనూ దాన్ని భోజనంగానే ఎంచారు. విశ్వాసులు దాన్ని బహిరంగంగా
ఆరాధించలేదు.
పదకొండవ శతాబ్దంలో దివ్యసత్ప్రసాదం పట్ల వైఖరిలో మార్పు: పదకొండవ శతాబ్దంలో, బెరింగారియస్ అనే వ్యక్తి కారణంగా దివ్యసత్ప్రసాదం
పట్ల ప్రజల వైఖరిలో ఒక పెద్ద మార్పు వచ్చింది. అతను దివ్యసత్ప్రసాదంలో దైవసాన్నిధ్యం లేదని, రొట్టె, ద్రాక్షారసాలు క్రీస్తు శరీర రక్తాలుగా
మారవని వాదించాడు.
దీనితో శ్రీసభ 'దివ్యసత్ప్రసాదంలో' దైవసాన్నిధ్యం ఉందని ప్రజలకు స్పష్టంగా బోధించడం ప్రారంభించింది.
ఈ బోధన ఫలితంగా ప్రజలలో దైవసాన్నిధ్యం పట్ల భక్తిభావం పెరిగింది.
క్రమంగా, దివ్యసత్ప్రసాదం కేవలం భోజనం అన్న భావన
మరుగున పడిపోయింది. బదులుగా, అది ఆరాధ్య వస్తువు అన్న భావన ప్రజలలో పెచ్చుపెరిగింది. దీనితో విశ్వాసులు
దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించడం మానేసి, ఆరాధించడం మొదలు
పెట్టారు.
దైవసాన్నిధ్యం నడిపూజలో నెలకొంటుందని విశ్వాసులకు తెలియజేయడం కోసం,
గురువులు నడిపూజలో ‘దివ్యసత్ప్రసాదాన్ని’ పైకెత్తి చూపించేవారు.
అలా పైకెత్తబడిన దివ్యభోజనాన్ని కంటితో చూడడం
మహాభాగ్యంగా విశ్వాసులు భావించారు.
దివ్యసత్ప్రసాద భక్తిలో మార్పులు: క్రమేణా, దివ్యసత్ప్రసాదంలోని దైవసాన్నిధ్యం
పట్ల భక్తి మరింతగా పెరిగింది. దీని ఫలితంగా, 13వ శతాబ్దంలో 'దివ్యసత్ప్రసాద' పండుగను నెలకొల్పారు. దీనితో పాటు సత్ప్రసాద ఆశీర్వాదం, ప్రదక్షిణలు, 40 గంటల ఆరాధనలు వంటి కొత్త భక్తి పద్ధతులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ విధంగా
దివ్యసత్ప్రసాద ఆరాధన విస్తృతంగా ప్రచారంలోనికి వచ్చింది.
అయితే, దివ్యసత్ప్రసాదాన్ని ఆరాధించడం ఎంతగా
ప్రచారంలోనికి వచ్చిందో, దాన్ని భోజనంగా స్వీకరించడం అంతగా
తగ్గిపోయింది. విశ్వాసులు తాము పాపులమని భావించి, ఆ దివ్య భోజనాన్ని స్వీకరించడానికి తాము యోగ్యులం కామని భావించేవారు.
అందువల్ల, వారు పూజకు హాజరైనప్పటికీ, 'దివ్యసత్ప్రసాదాన్ని' మాత్రం స్వీకరించేవారు కాదు.
దివ్యసత్ప్రసాదం: ఆరాధన - స్వీకరణ మధ్య సమతుల్యత: దివ్యసత్ప్రసాదం పట్ల భక్తిలో వచ్చిన ఈ పరిణామ క్రమంలో మంచి, చెడు అంశాలు రెండూ ఉన్నాయి.
మంచి ఏమిటంటే, తొలి వెయ్యేళ్లల్లో లేని ఆరాధనాంశం పదకొండవ శతాబ్దం తర్వాత ప్రచారంలోకి రావడం.
ఇది నిజంగా మెచ్చుకోదగిన అంశం. ప్రజలు
దివ్యసత్ప్రసాదంలోని దైవసాన్నిధ్యాన్ని గుర్తించి, దాన్ని గౌరవించడం ప్రారంభించారు.
అయితే, చెడు ఏమిటంటే, 'దివ్యసత్ప్రసాదం' ఒక భోజనం అన్న విషయం మర్చిపోవడం.
ప్రభువు ఎప్పుడూ దివ్యసత్ప్రసాదంలో తనను తాను
మనకు భోజనంగా అర్పించుకోవడానికి కోరుతుంటాడు. ఇది ఆయన యొక్క చైతన్యవంతమైన సాన్నిధ్యం. దురదృష్టవశాత్తు, విశ్వాసులు ఈ చైతన్యవంతమైన
సాన్నిధ్యాన్ని కేవలం జాడాత్మకమైన సాన్నిధ్యంగా మార్చారు. అంటే, ప్రభువు సత్ప్రసాదంలో వట్టినే
ఉండిపోతాడు అనుకున్నారు, మనం అతన్ని భుజించనక్కరలేదు, ఆరాధిస్తే చాలు అనుకున్నారు.
ఈ పరిణామం, దివ్యసత్ప్రసాదం యొక్క అసలు
ఉద్దేశాన్ని పాక్షికంగా పక్కకు నెట్టింది. దివ్యసత్ప్రసాదం కేవలం ఆరాధనకు మాత్రమే
కాకుండా, మన ఆత్మలకు పోషణగా, క్రీస్తుతో ఐక్యతను పెంపొందించే
భోజనంగా కూడా
ఉద్దేశించబడింది.
ఈ రోజు మనము విన్న పఠన భాగాలను ధ్యానించుకుందాం.
మొదటి పఠనం: (ఆది 14:18-20) ఈ భాగంలో, మెల్కీసెదెకు అనే సాలెం రాజు మరియు యాజకుడు అబ్రహాముకు రొట్టె ద్రాక్షారసములను తీసుకొని వచ్చాడు. అంతేకాకుండా,
అబ్రహామును ఆశీర్వదించాడు. ఈ సంఘటన క్రీస్తు యొక్క యాజకత్వానికి, మరియు ఆయన శరీర రక్తములకు ఒక పూర్వఛాయ
(prefigurement) గా చెప్పవచ్చు.
మెల్కీసెదెకు యాజకుడు, రాజు. ఇదేవిధంగా,
క్రీస్తు కూడా రాజులకు రాజు, మరియు ప్రధాన యాజకుడు. ఇక్కడ సమర్పించబడిన రొట్టె ద్రాక్షారసములు
క్రీస్తు శరీర రక్తములకు సంకేతాలుగా ఉన్నాయి. మెల్కీసెదెకు అబ్రహామును
ఆశీర్వదించినట్లుగా, క్రీస్తు దివ్యసత్ప్రసాదము ద్వారా
మనలను ఆశీర్వదిస్తాడు.
రెండవ పఠనం: (1
కొరి 11:23-26) ఈ భాగంలో, పౌలు అపొస్తలుడు ప్రభువు కడరాత్రి
భోజనాన్ని గురించి మనకు తెలియజేస్తున్నాడు. యేసు తన శరీరమును విరిచి, ద్రాక్షారసమును తన రక్తముగా ఇచ్చి, తన శిష్యులకు “నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై మీరు దీనిని చేయుడు” అని
ఆజ్ఞాపించాడు. ఇది దివ్యసత్ప్రసాద స్థాపన గురించి తెలియ జేయుచున్నది.
ప్రతిసారి మనం దివ్యసత్ప్రసాదమును స్వీకరించినప్పుడు, మనం క్రీస్తు మరణాన్ని, పునరుత్థానాన్ని
ప్రకటిస్తున్నాము. ఇది ఒక జ్ఞాపకార్థం మాత్రమే కాదు, క్రీస్తు యొక్క నిజమైన ఉనికి. ఆయన మన మధ్య ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. దివ్యసత్ప్రసాదం ద్వారా
మనం ఆయనతో ఐక్యమవుతాము.
సువార్త పఠనం: (లూకా 9:11-17) ఈ సువార్త భాగం ఐదు రొట్టెలు, రెండు చేపలతో ఐదువేల మందికి పైగా ప్రజలను యేసు పోషించిన అద్భుతాన్ని
వివరిస్తుంది. ఈ అద్భుతం దివ్యసత్ప్రసాదానికి ఒక శక్తివంతమైన సంకేతం. యేసు తన
శిష్యుల చేతులలో రొట్టెలను విరిచి ఇచ్చినట్లే, ఆయన తన శరీరమును మనకు ఆహారంగా ఇస్తున్నాడు. ఐదు రొట్టెలు, రెండు చేపలు ఐదువేల మందిని పోషించినట్లే, క్రీస్తు శరీరం మరియు రక్తం మన ఆకలిని తీర్చి, మనకు నిత్యజీవమును ప్రసాదిస్తుంది. ఈ అద్భుతం క్రీస్తు యొక్క
దైవత్వాన్ని, ఆయన ప్రేమను, ఆయన సర్వశక్తిత్వమును వెల్లడి చేస్తుంది.
దివ్యసత్ర్పసాదం-నాలుగు ప్రభావాలు: దివ్యసత్ప్రసాదం మన క్రైస్తవ జీవితంలో అనేక అద్భుతమైన ప్రభావాలను
కలిగి ఉంది. వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం:
1. నిత్య జీవితం: “నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నిత్యజీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున
లేపుదును” (యో 6:54). ఈ వాక్యం దివ్యసత్ప్రసాదం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రభావాలలో ఒకటిగా
నిలుస్తుంది. దివ్యసత్ప్రసాదం ద్వారా మనకు లభించే కృపానుగ్రహం మనల్ని కడవరకు నడిపిస్తుంది. పౌష్టికాహారం మన శరీరానికి బలాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఎలా ఇస్తుందో, అదేవిధంగా దివ్యసత్ప్రసాదం మన ఆత్మకు దైవజీవమును ప్రసాదిస్తుంది. అంటే, దేవునితో ఐక్యతను కలిగిస్తుంది. ఈ భోజన ప్రభావం శాశ్వత జీవాన్ని ప్రసాదించేంత వరకు,
దేవునిలో మన ఐక్యత సంపూర్ణమయ్యేంత వరకు ఏ
మాత్రం ఆగదు. ఇది మన క్రైస్తవ ప్రయాణంలో నిరంతర పోషణగా, నిత్యజీవానికి మార్గంగా నిలుస్తుంది.
2. పునరుత్థానము: మనం పైన
పరిశీలించిన వచనం (యో 6:54) ప్రకారం, భక్తి, విశ్వాసాలతో 'దివ్యసత్ప్రసాదాన్ని' స్వీకరించేవారు నిత్యజీవితాన్ని పొందుకుంటారని ప్రభువు వాగ్దానం చేసియున్నారు. ఈ దివ్య భోజనం
దేవునితో ఐక్యతను పెంపొందించడమే కాకుండా, మరణానంతరం మన పునరుత్థాన మహిమ కొరకు కూడా తన ప్రభావాన్ని చూపిస్తూనే
ఉంటుంది. ప్రభువు మనలను మహిమతో లేవనెత్తి, పరలోక బహుమానమైన నీతి కిరీటాన్ని మనకు అందించేంత వరకు ఈ దివ్య భోజనం యొక్క ప్రభావం మనలో కొనసాగుతుంది.
ఇది కేవలం ప్రస్తుత జీవితానికే కాకుండా, శాశ్వతమైన
భవిష్యత్తుకు కూడా మనల్ని సిద్ధం చేస్తుంది.
3. ప్రభువుతో సహవాసం: దివ్యసత్ప్రసాదం యొక్క మరో అద్భుతమైన ప్రభావం ప్రభువుతో సహవాసం. “నా
శరీరమును భుజించి, నా రక్తమును పానము
చేయువాడు నా యందు, నేను వానియందు ఉందును” (యో 6:56) అని యేసు ప్రభువు స్పష్టం చేశారు. ఈ
వాక్యం దివ్యసత్ప్రసాదం ద్వారా మనం పొందే లోతైన ఐక్యతను తెలియజేస్తుంది. దివ్యసత్ప్రసాదం స్వీకరించడం ద్వారా మన
శరీరం క్రీస్తు
శరీరముగా, మన హృదయం క్రీస్తు హృదయముగా రూపాంతరం చెందుతుంది. దివ్యసత్ప్రసాద రూపంలో క్రీస్తు మన హృదయంలోనికి
వచ్చిన తర్వాత, మనం ఆయనతో ఏకమవుతాము. దీని అర్థం, మనం క్రీస్తుతో పాటు జీవిస్తున్నాము, ఆయనతో నిరంతర సహవాసంలో ఉన్నాము. ఇది కేవలం ఒక భోజనం కాదు, క్రీస్తుతో అనుబంధాన్ని బలపరిచే ఒక దివ్యమైన అనుభవం.
4. క్రీస్తు ద్వారా నూతన జీవితం: దివ్యసత్ప్రసాదం యొక్క నాల్గవ కీలక
ప్రభావం క్రీస్తు ద్వారా
నూతన జీవితాన్ని పొందడం. యేసు స్వయంగా ఇలా అన్నారు, “పరలోకమునుండి దిగివచ్చిన జీవముగల
ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము
జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను”
(యో 6:51). భౌతిక ఆహారం మనకు శక్తిని, బలాన్ని అందించి
రోజువారీ పనులు చేసుకోవడానికి ఎలా సహాయపడుతుందో, అలాగే మన ఆత్మలను పోషించడానికి ఆధ్యాత్మిక ఆహారం అవసరం. ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని క్రీస్తు "దివ్యసత్ప్రసాదముగా"
మనకు అనుగ్రహించారు. అయితే, భౌతికాహారాన్ని జీర్ణించుకుని శక్తిని
పొందడానికి ఆరోగ్యకరమైన శరీరం ఎంత అవసరమో, అదేవిధంగా
క్రీస్తు ప్రసాదించే 'దివ్యసత్ప్రసాదాన్ని' స్వీకరించి ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని పొందడానికి మన ఆత్మలు ఆరోగ్యంగా, పవిత్రంగా ఉండటం అంతే అవసరం. కనుక, మనం పరిపూర్ణ విశ్వాసముతో, యోగ్యమైన రీతిలో నిండు పూజలో పాల్గొని 'దివ్యసత్ప్రసాదాన్ని' స్వీకరించాలి. అప్పుడే ఈ జీవాహారం మనలో
నూతన జీవితాన్ని, ఆధ్యాత్మిక బలగాన్ని ప్రసాదించగలదు.
కతోలిక బోధన మరియు మన జీవితాలకు అన్వయింపు: దివ్యసత్ప్రసాదం కతోలిక విశ్వాసంలో ఒక అద్భుతమైన సంస్కారం. ఇది మన
జీవితాలకు ఎలా అన్వయిస్తుందో ఇప్పుడు చూద్దాం:
(1). క్రీస్తు యొక్క నిజమైన ఉనికి: కతోలిక విశ్వాసంలో, దివ్యసత్ప్రసాదంలో రొట్టె
ద్రాక్షారసములు అద్భుతముగా క్రీస్తు శరీర రక్తములుగా మారుతాయి. ఇది కేవలం ప్రతీక
కాదు, ఇది క్రీస్తు యొక్క నిజమైన ఉనికి. ఆయన
మన మధ్య జీవించి ఉన్నాడు.
(2). క్రైస్తవ
జీవితానికి కేంద్రం: దివ్యసత్ప్రసాదం మన క్రైస్తవ జీవితానికి కేంద్రం. ఇది మనకు
ఆధ్యాత్మిక ఆహారం, బలం, మరియు నిత్యజీవానికి ఖచ్చితమైన మార్గం.
(3). త్యాగం మరియు పునరుత్థానం: దివ్యసత్ప్రసాదం క్రీస్తు యొక్క సిలువ
త్యాగాన్ని మరియు ఆయన మహిమగల పునరుత్థానాన్ని గుర్తు చేస్తుంది. ప్రతిసారి మనం
దివ్యసత్ప్రసాదమును స్వీకరించినప్పుడు, మనం ఆ త్యాగంలో,
పునరుత్థానంలో పాలుపంచుకుంటాము.
(4). ఐక్యత మరియు ప్రేమ: దివ్యసత్ప్రసాదం మనలను క్రీస్తుతోను,
ఒకరితో ఒకరిని ఐక్యపరుస్తుంది. మనం ఒకే
రొట్టెలో పాలుపంచుకోవడం ద్వారా, మనం ఒకే శరీరంలో భాగమవుతాము. ఇది మనలో
ప్రేమను, సోదరభావాన్ని పెంపొందిస్తుంది.
(5). సేవ మరియు మిషన్: దివ్యసత్ప్రసాదమును స్వీకరించిన తర్వాత,
మనం క్రీస్తు యొక్క ప్రేమను లోకానికి చాటి చెప్పడానికి,
ఇతరులకు సేవ చేయడానికి శక్తిని పొందుతాము.
దివ్యసత్ప్రసాదం మనలను మిషనరీలుగా మారుస్తుంది.
దివ్యసత్ప్రసాద స్వీకరణలో యోగ్యత: నేడు, క్రీస్తు ప్రభువు మనందరినీ యోగ్యమైన రీతిలో తన శరీర, రక్తములను స్వీకరించమని కోరుతున్నారు.
ఈ మధ్య కాలంలో, చాలామంది కతోలికులు 'దివ్యసత్ప్రసాద' విషయంలో అనేక పొరపాట్లు చేస్తూ
ఉన్నారు. వాటిలో ముఖ్యమైనది పూజకు ఆలస్యంగా రావడం. నిండు పూజలో సరైన విధముగా పాల్గొనని వారు, ఆ మహాప్రసాదాన్ని
స్వీకరించడానికి అనర్హులు అని బైబిల్ స్పష్టం చేస్తోంది (1 కొరి 11:27-31). మనం క్రీస్తు చూపిన ప్రేమ, క్షమాగుణ
సిద్ధాంతాలను పాటిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అలా పాటించకపోతే మనలో 'దివ్యసత్ప్రసాద' శక్తి ఏ మాత్రం పని చేయదు. కనీసం
ఇకనుండైనా, యోగ్యమైన రీతిలో ప్రభువు సర్వమానవాళికి
ప్రసాదించిన ఈ గొప్ప జీవాహారాన్ని స్వీకరించుదాం! అప్పుడే దివ్యసత్ప్రసాదం యొక్క నిజమైన
శక్తిని, ఆశీర్వాదాలను మనం అనుభవించగలం.
ప్రియమైన విశ్వాసులారా, పరమ పవిత్ర
క్రీస్తు శరీర రక్తముల మహోత్సవం నాడు, మన ప్రభువు
యేసుక్రీస్తు మనపై కురిపించిన అపారమైన ప్రేమను ధ్యానించుకుందాం. ఆయన తనను తాను
మనకు ఆహారంగా ఇచ్చి, మనలను తనలో ఐక్యపరుచుకున్నాడు. ఈ
అద్భుతమైన బహుమానానికి మనం కృతజ్ఞులమై ఉందాం. దివ్యసత్ప్రసాదమును భక్తి శ్రద్ధలతో
స్వీకరిద్దాం. ఈ దివ్యసత్ప్రసాదం మనకు నిత్యజీవమును, ఆశీర్వాదములను ప్రసాదించుగాక. మన జీవితాలలో క్రీస్తు ప్రేమను,
త్యాగాన్ని అనుసరిద్దాం.
ప్రార్థన: యేసుక్రీస్తు ప్రభువా, మీరు
దివ్యసత్ప్రసాదము ద్వారా మాకు జీవమును ప్రసాదించినందుకు మీకు వందనములు. ఈ పవిత్ర
బలిపీఠం వద్ద మీ దయను, మీ ప్రేమను అనుభవించడానికి మాకు సహాయం
చేయుము. మీ శరీరమును, మీ రక్తమును స్వీకరించడం ద్వారా మీతో
మరింత సన్నిహితంగా జీవించే కృపను ప్రసాదించుము. మీ పరిశుద్ధ నామానికి మహిమ
కలుగుగాక. ఆమెన్.
No comments:
Post a Comment