14వ సామాన్య ఆదివారము, YEAR A

 14వ సామాన్య ఆదివారము, (9 జూలై 2023)
జెకర్యా 9:9-10; రోమీ 8:9,11-13; మత్త 11:25-30
ప్రభువే మన విశ్రాంతి నిలయము!

“భారముచే అలసి సొలసి యున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీ రెత్తుకొనుడు... ఏలన, నా కాడి సులువైనది. నా బరువు తేలికైనది” (మ. 11:28). పాత నిబంధనలో, ‘కాడి’ వ్రాతపూర్వకమైన లేదా మౌఖికమైన మోషే చట్టాన్ని (ధర్మశాస్త్రము) సూచిస్తుంది. సమస్య మోషే చట్టము కాదు. మోషే చట్టము గూర్చిన తప్పుడు వివరణలను యేసు తీవ్రముగా ఖండించాడు. “వారు [పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు] మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయు వారికి సాయపడుటకు తమ చిటికెన వ్రేలైనను కదపరు” (మ 23:4). మోషే చట్టము ప్రజలకు భారముగా మారినది. అందుకే యేసు, “భారముచే అలసి సొలసి యున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను” అని పలికాడు.

మనకున్న భారాలు ఏమిటి? కుటుంబ, శారీరక, ఆర్ధిక, ఆరోగ్య, సాంఘిక, సామాజిక, మానసిక, ఆధ్యాత్మిక భారాలతో సతమత మవుతూ ఉంటాము. ఇన్ని భారాలతో నున్న మనకు యేసు ప్రభువు మాటలు మనకెంతో ఊరటను కలిగిస్తాయి. “ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును. కనుక మీ విచారములన్నియు ఆయనపై మోపుడు” (1 పేతు 5:7) అన్న పేతురు మాటలను గుర్తు చేసుకుందాం. ప్రభువు నందు నమ్మకముంచిన, ఆయనపై ఆధారపడి జీవించిన, “అపుడు మన ఆత్మలందు విశ్రాంతి పొందుదము” (మ 11:29).

మనం సమస్తమును ప్రభువు నుండి నేర్చుకోవాలి. ఎందుకన ఆయనే సత్యము. విజ్ఞానము. చట్టము. కనుక ‘ప్రభువు కాడి’ మోషే చట్టమే, కాని అది ప్రజలకు భారమైనది కాదు. నిజమైన మోషే చట్టము, జ్ఞానము. ఇది పరిసయ్యుల తప్పుడు వివరణలకు వ్యతిరేకమైనది. యేసు ప్రభువు ఈ లోకానికి వేంచేసే సమయానికి, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు 613 నియమాలను సూచించారు. ప్రభువు భారమును మనపై మోపుటకు రాలేదు. కాని మనకు విశ్రాంతి నొసగుటకు వచ్చెను. కనుక, ప్రతీ విశ్వాసి, క్రీస్తు కాడిని ఎత్తుకొనుటకు, క్రీస్తు భారమును మోయుటకు సిద్ధపడ వలెను. ఎందుకన, ఆయన సత్యము, విజ్ఞానము, చట్టము. ఆయన మనకు పరలోక రాజ్యమునకు సంబంధించిన విషయములను బయలు పరచును.

విజ్ఞులకు, వివేకవంతులకు వీటిని మరుగు పరచి పసిబిడ్డలకు బయలు పరచితివి” (మ 11:25) అని యేసు పలికారు. పరలోకమున ప్రవేశించాలంటే, పరలోక పరమ రహస్యాలను గ్రహించాలంటే పసిబిడ్డల మనస్తత్వమును కలిగి యుండాలి. “మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతి వక్కాణించు చున్నాను” (మ 18:3) అని ప్రభువు పలికి యున్నారు. పసి బిడ్డలు షరతులులేని ప్రేమను గుర్తించెదరు. వారు షరతులులేని ప్రేమతోనే సమాధాన మిచ్చెదరు. మన ప్రేమ క్రీస్తులో కేంద్రీకృతమైనచో, మనం ఒకరినొకరము మరియు తోటివారిని షరతులు లేకుండా ఎలా ప్రేమించాలో ప్రభువు మనకు నేర్పిస్తారు. మనపైన పరలోక తండ్రికి యున్న అనంతమైన ప్రేమ కేవలం క్రీస్తుకు మాత్రమే తెలుసు. మన విజ్ఞానము, వివేకముపై మాత్రమే ఆధార పడుచున్నామా లేదా దేవుని విజ్ఞానముపై ఆధారపడు చున్నామా? విజ్ఞులకు, వివేకవంతులకు పరలోకము మరుగు పరచ బడినది ఎందుకన, దేవుని చిత్తమును, మార్గమును తెలిసి కొనుటకు వారు దేవునిపై ఆధారపడక, వారి బలాన్ని, తెలివి తేటలను నమ్ముకొను చున్నారు. పసిబిడ్డల సంపూర్ణ నమ్మకాన్ని కలిగి యుందురు. ఆనాడు, యూదమత నాయకులు కపటముతో, గర్వముతో ప్రభువు బోధనలకు స్పందించలేదు. కాని సామాన్య ప్రజలు ఎక్కువగా ప్రభువునకు స్పందించారు. కపటము, గర్వము ఉన్న విశ్వాసులు పరివర్తన చెందలేరు.

యేసు మార్గము సాధుశీలత, వినమ్రత గలది. ప్రభువు కాడి ఆయన జ్ఞానము. అది సత్యముగల కాడి. తన అనుచరులపై ప్రభువు మోపు కాడి దేవుని చిత్తమును తెలుసుకొని దానిని విధేయించడం. సత్యమును జీవించుటలో విఫలమైనవారు వ్యసనపరులుగా మారెదరు. విశ్వాసి తన పాపములకు బానిస యగును. పాత నిబంధనలో దేవున్ని దర్శించిన మోషే సాధుశీలత, వినమ్రత కలిగి యున్నాడు. ధర్మశాస్త్రానికి మధ్యవర్తి. “నేను మీ నడుమ వినయాత్ములు, దీనులైన ప్రజలను మిగుల నిత్తును, వారే నన్ను నమ్ముకొందురు. అట్టివారు ఎవరికి కీడు చేయరు, కల్లలాడరు, మోసము చేయరు” (జెఫన్యా 3:12) అని ప్రవక్త ప్రవచించాడు. యేసు వినయముగల రాజు. గాడిద పిల్లపై ఎక్కి వచ్చును (జెకర్యా 9:9-10; మ 21:5). ఆయన శాంతి కరుడైన రాజు (యెష 9:6; యో 20:21; యో 14:27; లూకా 2:14). ప్రభువు రాజ్యము నేల అంచుల వరకు వ్యాపించును (జెకర్యా 9:10) అని ప్రవక్త ప్రవచించాడు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని లూకా 1;33లో చదువుచున్నాం. దైవరాజ్య వ్యాప్తి భాద్యతను మొదటగా ప్రభువు శిష్యులకు (మా 16:20; మ 28:18-19), నేడు జ్ఞానస్నానం పొందిన మనందరికి అప్పగించారు. ఇది మనందరి భాద్యత/వాక్కుద్వారా, సత్క్రియల ద్వారా ఈ భాద్యత నెరవేర్చ మనం ప్రయత్నం చేయాలి.

మన అనుదిన జీవితములో ఎన్ని భారములున్నను, ఇతరులతో వినయము, వినమ్రత కలిగి జీవించ ప్రయత్నం చేద్దాం. మన పాపములను మోయు దేవుని గొర్రెపిల్ల క్రీస్తువే (యో 1:29). జీవితాన్ని భారముగా మార్చుకోక, ప్రభువునందు నమ్మక ముంచి ఆయన ఒసగు విశ్రాంతి (నిత్యానందము, నిత్యజీవము యో 10:10) యందు సేద తీరుదాం!

2 comments: