నాలుగవ సామాన్య ఆదివారము, Year A
నిజమైన శాశ్వతానందం
జెఫన్యా 2:3; 3:12-13; 1 కొరి. 1:26-31; మత్త. 5:1-12
మనం ఎల్లప్పుడు ఆనందముగా ఉండాలని కోరుకుంటాం. ప్రామాణికమైన, నిజమైన ఆనందం ధనవంతులవడములో, భౌతిక విషయాలలో, ప్రాపంచిక విజయాలలో నున్నదని పొరబడుతూ ఉంటాం. అయితే, నిజశాశ్వతానందాన్ని ఈలోకముగాని, దానిలోనున్న ఏదియుగాని ఇవ్వలేదు. ‘ఆనందం’నకు మరోపేరు ‘ఆశీర్వాదం’ లేదా ‘ధన్యత’. అందరుకూడా నిజశాశ్వతానందాన్ని కలిగియుండాలని యేసు ‘కొండమీద ప్రసంగం’లో అష్టభాగ్యాలను బోధిస్తున్నాడు. ఈ ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, ధన్యతను యేసు ‘దేవుని/పరలోకరాజ్యం’ అని పిలిచాడు. కొండమీద ప్రసంగం’లో, యేసు నిర్దేశించిన విలువలు నిజశాశ్వతానందాన్ని ఇవ్వగలవు. అవి ఈలోకాలోచనలకు విరుద్ధమైనవి. నేటి మానవుడు దీనత బదులుగా ధనంలో, శోకార్తి బదులుగా సరదాలలో, వినమ్రత బదులుగా లోకజ్ఞానములో, నీతి బదులుగా మద్యం-భోజనంలో, దయ బదులుగా బలంలో, హృదయశుద్ది బదులుగా శారీరకవ్యామోహములో, శాంతిస్థాపకత బదులుగా వార్తలను సృష్టించుటలో, ధర్మం బదులుగా న్యాయవాదములో నిజశాశ్వతానందం ఉన్నదని భావిస్తున్నాడు. అష్టఅష్టభాగ్యాలలోని అన్ని విలువలను ప్రతీ ఒక్కరు కలిగియుండాలి. నా సంతోషాన్ని నేను ఎక్కడ వెదుకుచున్నాను? ఈ లోకము, లోక వస్తువులలోనా? లేదా యేసు ఒసగిన అష్టభాగ్య-విలువలలోనా? యేసు విలువలలో నిజశాశ్వతానందాన్ని వెదకినట్లయితే మనం “ఆనంద పడాలి; మహానంద పడాలి. ఎందుకన, పరలోకములో మనకు గొప్ప బహుమానము కలదు” (మత్త.5:12). జెఫన్యా ప్రవక్తకూడా ఇదే విషయాన్ని తెలుపుచున్నాడు. వినయవంతులు, దేవుని ఆజ్ఞలను పాటించువారు, న్యాయము పాటించువారు, దేవుని శిక్షను తప్పించుకొందురు (2:3; 3:12-13).
సాధారణముగా మనం దేవుడు జ్ఞానవంతులను, వివేకవంతులను, శక్తివంతులను, పేరుప్రతిష్టలున్నవారిని, ఉన్నత జీవనము కలవారిని ఎన్నుకోవాలని ఆశిస్తూ ఉంటాము. కాని వాస్తవానికి, లోకముచే అవివేకులుగా, బలహీనులుగా, అల్పముగ, నీచముగ, విలువలేనిదిగ భావింపబడువారిని దేవుడు ఎన్నిక చేసికొనును (1 కొరి.1:27-28). ఎందుకన, లోకముచే గొప్పగా భావింపబడేది ఏదియు నిజశాశ్వతానందాన్ని ఇవ్వలేదని పౌలు స్పష్టం చేయుచున్నాడు. దేవునినుండి వచ్చు శక్తితో, కృపతో మాత్రమే మనం దేవుని జీవితాన్ని జీవించగలం. దేవుని కార్యాన్ని చేయగలం. కనుక, మనం దేవునిపై ఆధారపడి జీవించాలి. దేవుని అవసరత మనకున్నదని గ్రహించడమే నిజమైన ఆనందం. మన నమ్మకాన్ని దేవునిపై ఉంచడమే నిజమైన ఆనందం. అలాగే, పవిత్రముగా జీవించాలని దేవుడు మనలను పిలచుచున్నాడు. పవిత్రతలో నిజమైన ఆనందం ఉంటుంది. కనుక, నేటి మూడు పఠనాలు కూడా మనలను కోరేది ఒకటే – నిజమైన ఆనందాన్ని పొందాలంటే, యేసు అడుగుజాడలలో నడవాలి. యేసువలె జీవించాలి, ప్రవర్తించాలి. “ప్రభువైన యేసుక్రీస్తును ధరించాలి” (రోమీ.13:14). పశువుల తొట్టిలో పుట్టినప్పటినుండి సిలువపై మరణించు వరకు యేసు పేదవానిగా జీవించాడు. ప్రతీఒక్కరిపట్ల వినమ్రహృదయుడై, దయగలవాడై జీవించాడు (మత్త.11:29). పాపులను, సుంకరులను, వ్యభిచారములో పట్టుబడిన స్త్రీని, సమరీయ స్త్రీని, నాయిను విధవరాలిని, రోగులను ఆయన ఆదరించాడు. నీతినిమిత్తమై ఆకలిదప్పులు కలిగి జీవించాడు. పేదవారిని చిన్నచూపు చూచినవారిని ఆయన కఠినంగా మందలించాడు. యేసు యెరూషలేము నగరమును చూచి విలపించాడు. శ్రమలను, మరణాన్ని అనుభవించాడు. ప్రభువు సందేశం ఏమనగా - తండ్రి రాజ్యము కొరకు కృషిచేయువారు, దేవుని ప్రేమను ప్రతిబింబించేవారు, తోటివారికి సేవచేసేవారు, ఈ సేవలో కష్టాలను, ఇబ్బందులను, నిరాశను, నిరుత్సాహాన్ని, అలసటను సహించేవారు నిజశాశ్వతానందాన్ని పొందుతారు. సవాలుతో కూడిన జీవితాన్ని ప్రభువు మనకు ఒసగారు. అయితే, సవాళ్ళను ఎదుర్కొనడానికి కావలసిన ఆత్మబలాన్నికూడా మనకు ఒసగాడు. “నా పేరిట నన్ను ఏమి అడిగినను చేసెదను” (యోహా. 14:14) అని వాగ్దానం చేసాడు. కనుక, యేసుక్రీస్తే మన ఆనందం. ఆయనలోనే మన నిజశాశ్వతానందం.
No comments:
Post a Comment