త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము, YEAR A

 త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము, YEAR A
నిర్గమ. 34:4-6, 8-9, 2 కొరి. 13:11-13, యోహాను. 3:16-18

ఈ రోజు మనం త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను కొనియాడు చున్నాము. ప్రతీ సంవత్సరం, పెంతకోస్తు పండుగ తరువాత వచ్చు ఆదివారమున ఈ పండుగను కొనియాడుతూ ఉంటాము. చారిత్రాత్మకముగా, ఈ పండుగ క్రీ.శ. 1030వ సంవత్సరములో పెంతకోస్తు పండుగ తరువాత, మొదటి ఆదివారమున ప్రారంభ మైనది. ఇరువైరెండవ జాన్ పోపు గారు, క్రీ.శ. 1334 వ సంవత్సరములో, దీనిని విశ్వ శ్రీసభ పండుగగా ఆమోదించారు.
 
మనం ప్రతీ ప్రార్ధనను స్లీవ గురుతుతో, అనగా “పిత, పుత్ర, పవిత్రాత్మ, ఆమెన్” అని ప్రారంభిస్తాము. ప్రతీ ప్రార్ధనను త్రిత్వ స్తోత్రముతో, అనగా “పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును, ఎప్పుడును, సదా కాలము కలుగునుగాక, ఆమెన్” అని ముగిస్తాము. 

దేవుడు ఏక త్రిత్వవంతుడైన సర్వేశ్వరుడు. ఒకే సర్వేశ్వరుడు కాని, త్రిత్వవంతుడై యున్నాడు. అనగా, పిత, పుత్ర, పవిత్రాత్మ అను ముగ్గురు వేరువేరు వ్యక్తులు ఉన్నారనియు, ఆ ముగ్గురు వ్యక్తులకు స్వభావము ఒకటేననియు అర్ధము. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడు. ఈ ముగ్గురికి ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే శక్తి, ఒకే దైవస్వభావము ఉండుట వలన, ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడై యున్నారు. వీరిలో శక్తి, మహిమ మొదలైన లక్షణములలో ఎలాంటి బేధము లేదు. ఈ ముగ్గురు వ్యక్తులు అన్నింటిలో సరిసమానులు. వీరు ముగ్గురు ఆరంభము లేనివారై యుండుట వలన, వీరిలో ముందటి వ్యక్తి, వెనుకటి వ్యక్తి లేరు. సర్వేశ్వరుని ముఖ్య లక్షణాలు ఆరు: 1. సర్వేశ్వరుడు తనంతట తానై యున్నాడు. 2. ఆరంభము లేక యున్నాడు. 3. శరీరములేక యున్నాడు. 4. మితిలేని సకల మేలుల స్వభావము కలిగి యున్నాడు. 5. అంతట ఉన్నాడు. 6. పరలోకమునకు, భూలోకమునకు మూలకారణమై యున్నారు. ఇది కతోలిక విశ్వాసము. “పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించు చున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించు చున్నాను. పవిత్రాత్మను విశ్వసించు చున్నాను” అని అపోస్తలుల విశ్వాస ప్రమాణములో ప్రకటిస్తున్నాము.

“పరమ పవిత్ర త్రిత్వం ఒక నిగూఢ సత్యం. క్రైస్తవ విశ్వాసానికి, జీవితానికి అది కేంద్ర బిందువు” (కతోలిక శ్రీసభ సత్యోపదేశం, నం. 234). వాస్తవముగా, త్రిత్వైక పరమ రహస్యాన్ని వివరించడం, అర్ధంచేసుకోవడం చాలా కష్టం. “త్రిత్వం పరిష్కరించాల్సిన సమస్య కాదు, జీవించాల్సిన పరమ రహస్యం” అని పునీత అగుస్తీను వారు చెప్పియున్నారు. బైబులులో “త్రిత్వం” అనే పదం మనకు ఎక్కడా కనిపించదు. 

మత్తయి సువార్త చివరిలో యేసు ప్రభువు తన శిష్యులతో, “మీరు వెళ్లి సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు” (28:19) అని చెప్పాడు. పౌలు కొరింతీయులకు రాసిన రెండవ లేఖ చివరిలో, “యేసుక్రీస్తు ప్రభువు కృపయు, దేవుని ప్రేమయు, పవిత్రాత్మ సహవాసమును మీకు అందరకు లభించును గాక!” (13:14) అని వారిపైకి ఆశీర్వాదాలను అర్ధిస్తూ ముగించాడు. యేసువే స్వయముగా తన బోధనలలో, దేవున్ని “ఆబ్బా! తండ్రీ” అని పిలచి, తన శిష్యులుకూడా అలాగే అర్ధించాలని నేర్పించాడు (మార్కు. 14:36, మత్త. 6:9). ఆదరణకర్త (యోహాను. 14:16), ఒదార్చువాడు (14:26) అని పవిత్రాత్మ గురించి పలికి యున్నాడు. “నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు” (యోహాను. 14:9) అని చెప్పి, త్రిత్వములోని ముగ్గురు వ్యక్తుల మధ్యనున్న ప్రేమ సహవాసము గురించి తెలియజేసి యున్నాడు. పవిత్రాత్మ వచ్చినప్పుడు, సమస్త విషయములను బోధించును (యోహాను. 14:26) అని, త్రిత్వైక సర్వేశ్వరుని ద్వారా, శిష్యులు ప్రేమ, క్షమను పొందెదరని చెప్పాడు.

మనకు అర్ధం అయ్యేవిధముగా, త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులకు, తండ్రి దేవుడు, సృష్టికర్తయని, పుత్ర దేవుడు రక్షకుడని, పవిత్రాత్మ నూత్నీకరించువాడని నిర్దిష్టమైన పాత్రలు ఇవ్వబడ్డాయి. తండ్రితో, ఆత్మతో తనకున్న అతి సమీప సంబంధాన్ని, ఐఖ్యతను, ప్రేమ బంధాన్ని, యేసు చాలా స్పష్టముగా తెలియ జేసాడు. యోహాను తన సువార్తలో, సృష్టి కలిగినప్పుడు, వాక్కు అయిన క్రీస్తు దేవునితో ఉండెను అని చెప్పాడు (యోహాను. 1:1-3). యేసు జననసూచన – దూత ప్రకటన లేదా గబ్రియేలు దూత దేవమాతకు మంగళవార్త చెప్పినప్పుడు, త్రిత్వైక దేవుని కార్యము స్పష్టముగా కనిపిస్తుంది: దేవుడు పంపిన గబ్రియేలు దూత, మరియమ్మ అనుగ్రహ పరిపూర్ణురాలని, పవిత్రాత్మ ఆమెపై వేంచేయునని, ఆమె గర్భములో యేసును ధరించునని తెలియ జేసెను.
 
పిత దేవుడు, మనకు తండ్రి లాంటివాడు. మనలను తన పోలికలో సృజించాడు. భూలోకములో మన ప్రయాణం ముగిసాక, మరల తండ్రి దేవుని యొద్దకు చేరుకుంటాము. ఆయన మనలను పోషించును, నిత్యము తన జీవితాన్ని మనకు ఇస్తూ ఉంటాడు. “నేను ఉన్నవాడను” అని దేవుడు మోషేకి తెలియజేసాడు. తండ్రి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన ప్రజలుగా చేసుకొని వారిని బానిసత్వమునుండి నడిపించి, సినాయి కొండపై ఆజ్ఞలను ఒసగాడు. వారి వెన్నంటే ఉన్నాడు. ఆయన ప్రేమామయుడు, దయామయుడు.

పుత్ర దేవుడు, యేసు క్రీస్తు మనకు సోదరుడు, స్నేహితుడు. అవిధేయత మార్గములనుండి మనలను తనవైపుకు మరల్చుకుంటాడు. ఆయన మనకోసం, మనలో ఒకరిగా జన్మించాడు. మనం శ్రమలలో నున్నప్పుడు, ఆయన మనతో శ్రమలనుభవిస్తాడు. మన ఆనందములో ఆయన పాలుపంచుకుంటాడు. ప్రేమించడం, ప్రేమించబడటం అను జీవిత పరమార్ధం వైపుకు మనలను నడిపిస్తాడు. ఆయన ద్వారా దేవుని కృపానుగ్రహమును, రక్షణను పొంది యున్నాము. యేసు తండ్రిని మనకు పరిచయం చేసాడు.

పవిత్రాత్మ దేవుడు మనలో వసిస్తున్న జీవము, మన శ్వాస, దైవీక శక్తి. దేవుని నుండి ఆత్మను స్వీకరించాము. ఆత్మద్వారా మనము దేవుని ‘అబ్బా! తండ్రీ!’ అని పిలుస్తున్నాము. ఆత్మద్వారా మనం దేవుని బిడ్డల మయ్యాము. బిడ్డలము కనుక వారసులము. క్రీస్తు తోడి వారసులము (రోమీ. 8:15-17). యేసు క్రీస్తు, ఆత్మ ఇరివురు కూడా మనలను ప్రేమగల తండ్రి దేవుని వైపునకు నడిపించును. జ్ఞానస్నానము ద్వారా ఆత్మను పొందిన మనం ‘నూతన జీవితము’ను పొందియున్నాము. ఆత్మ మనలను క్రీస్తులో ఐఖ్యము చేయును. బిడ్డలముగా దేవునితో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచును. “క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకొనిన యెడల ఆయన మహిమలో కూడ మనము భాగస్థులము అగుదము” (రోమీ. 8:17). ఆత్మ మనకు తర్ఫీదు నిచ్చును, మార్గనిర్దేశం చేయును, బోధించును, మనలను ప్రేమించును, ఒదార్చును, బలపరచును.

సువిశేష పఠనము (యోహాను 3:16 –18)
ఈ మూడు వచానాలు మన జీవితాలలో త్రిత్వైక సర్వేశ్వరుని ప్రాముఖ్యత గురించి తెలియజేయు చున్నాయి. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను” (16). ఈ వాక్యము, నేటి పండుగ పరమార్ధమును తెలియ జేయుచున్నది. దేవుడు ఎందుకు త్రిత్వైక సర్వేశ్వరుడు అన్న దానికి ఈ వచనం గొప్ప తార్కాణం. దేవుడు ఎంతో ప్రేమ కలవాడు. స్వాభావికముగా, ఆ ప్రేమను తనలోనే దాచుకొనలేడు. ఆ ప్రేమ పొంగి పొరలును. ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే, అది జీవము గలదిగా మారును. ప్రేమ ఒంటరిగా, ఏకాంతములో గ్రహింపబడదు. అది ఇతరుల సాన్నిహిత్యములో, సహవాసములో సంపూర్ణతను పొందును. అందుకే త్రిత్వము.

త్రిత్వైక సర్వేశ్వరుని ప్రేమ ఎప్పుడు కూడా నదిలా ప్రవహిస్తూ, పొంగి పొరలును. అందుకే, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించాడు. ఈ దైవీక ప్రేమ వలననే, ఈ సృష్టిలో ప్రతీదీ మనగలుగుచున్నది. మానవాళి, విశ్వం, సృష్టి అందం, అన్నీ కూడా పొంగి పొరలుతున్న ఈ దైవీక ప్రేమనుండే వచ్చాయి. ఆ ప్రేమ ప్రవాహములో ప్రవహించడానికి మనలను మనం అనుమతించు కోవాలి. “ప్రేమ... ప్రేమ... ఆ తరువాత అన్నియు అనుగ్రహింప బడును” అని పునీత అగుస్తీను వారన్నారు. సర్వము దేవుని ప్రేమే అని తెలుసుకుందాం!

వ్యాఖ్యానము
సువిశేష పఠనములో, మూడు ముఖ్యమైన విషయాలను గ్రహించాలి: - మనలను రక్షించే దేవుని ప్రేమ, కుమారుని రూపములో ప్రసాదించబడినది (3:16). - దేవుని చిత్తము మనలను రక్షించడమే కాని, ఖండించడం కాదు (3:17). - ఈ ప్రేమను విశ్వసించే ధైర్యము మనకు ఉండాలని దేవుడు మనలను కోరుచున్నారు (3:18).

యోహాను. 3:16 - “దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు.” ప్రేమించడం అనగా ప్రేమకొరకు తననుతాను ఇతరులకు సంపూర్ణముగా ఇవ్వడం. ప్రేమ అనగా, వ్యక్తుల మధ్య సంబంధములోని అనుభవము. ఆనందం, దు:ఖం, బాధ, ఇవ్వడం, నిబద్ధత, జీవితం, మరణం మొ.గు భావాలు, విలువలు ప్రేమలో ఉంటాయి. పాత నిబంధన గ్రంథములో ఈ భావాలన్నీ “హెసెద్” (hesed) అనే మాటలో వ్యక్తపరచ బడ్డాయి. మన బైబులులో దానిని ‘దాతృత్వం’, ‘దయ’, ‘విశ్వసనీయత’ ‘ప్రేమ’ అని అనువదించ బడినది. నూతన నిబంధనలో, ఈ దేవుని ప్రేమను యేసు తన బోధనలలో, కార్యములలో బహిర్గత మొనర్చాడు. స్నేహము, దయ అను భావాలతో ఈ ప్రేమను తెలియ జేశాడు. ఉదాహరణకు, బెతానియాలో మార్తమ్మ కుటుంబముతో నున్న సంబంధములో, “యేసు మార్తమ్మను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించెను” (యోహాను. 11:5, 33-36). యేసు తన ప్రేషిత కార్యాన్ని ప్రేమకు సాక్షాత్కారముగా ఎదుర్కొన్నాడు: “ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను. వారిని చివరి వరకు ప్రేమించెను” (యోహాను. 13:1). ఈ ప్రేమలో, తండ్రితో తనకున్న లోతైన సహవాసమును బహిర్గత మొనర్చాడు: “నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని” (15:9). అలాగే, “నేను మిమ్ము ప్రేమించి నటులనే మీరును ఒకరినొకరు ప్రేమించు కొనుడు” (15:12) అని మనతో చెప్పుచున్నాడు. యోహాను ప్రేమకు ఇలా నిర్వచనం ఇస్తున్నాడు: “క్రీస్తు మన కొరకై ప్రాణమును అర్పించుటను బట్టి ప్రేమ స్వరూపము మనకు బోధపడినది. కనుక మనము కూడ మన సోదరుల కొరకై ప్రాణమును అర్పింపవలెను” (1 యోహా. 3:16). “ఆయన యందు జీవించు చున్నానని చెప్పు కొనెడి వాడు యేసు క్రీస్తు వలె జీవింప వలెను” (1 యోహా. 2:6).

యోహాను. 3:17 - దేవుడు లోకమును ప్రేమించి, దానిని రక్షించడానికి తన ప్రాణమును అర్పించాడు. ‘లోకము’ అనగా సర్వ మానవాళి. ఈ లోకమును ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించాడు. యోహాను సువార్తలో ‘లోకము’ అనగా యేసును అంగీకరించక, వ్యతిరేకించినవారు అని ప్రత్యేకమైన అర్ధము ఉన్నది (7:4, 7; 8:23, 26; 9:39; 12:25). ఈ లోకము యేసు రక్షణ కార్యమునకు వ్యతిరేకం. ఇది విరోధి అయిన సాతానుచే ఆధిపత్యం కలిగి యున్న లోకము. ఈ లోకానికి సాతాను “లోకాధిపతి” (14:30, 16:11) అని పిలువబడినది. అధికారులచేత, పాలకుల చేత, అన్యాయాలను, అక్రమాలను, అణచివేతలను సృష్టించి, విశ్వాసులను, సంఘాలను హింసించును, కష్టాలకు గురి చేయును, నాశనం చేయును (16:33). దేవుని పేరిట వారు ఈ దుష్ట కార్యములు చేయుదురు (16:2). అయితే, యేసు సాతాను “లోకాధిపతి”ని త్రోసివేయును, జయించును (12:31). యేసు లోకముకన్న బలవంతుడు. “నేను లోకమును జయించితిని” (16:33) అని చెప్పాడు. 
యోహాను. 3:18 - దేవుని ఏకైక కుమారుడు మన కోసం తననుతాను అర్పించు కున్నాడు. యేసు ప్రేషిత కార్యమును వివరించడానికి, అనాధి క్రైస్తవ సంఘం యేసుకు ఇచ్చిన, పురాతనమైన, అందమైన నామము “రక్షకుడు”. హీబ్రూలో “గోయల్” (Goel) అని పేరు. కష్టాలలోనున్నవారి ఆస్తులను కాపాడిన దగ్గరి చుట్టమునుగాని, ప్రధమ సోదరునిగాని, “గోయల్” అని పిలిచేవారు (లేవీ. 25:23-55). అయితే, బబులోనియా ప్రవాసమున, ప్రతీ ఒక్కరు సర్వాన్ని కోల్పోయారు. అలాంటి సమయములో, దేవుడు తన ప్రజలకు “గోయల్” (రక్షకుడు) అయ్యాడు. తన ప్రజలను బానిసత్వము నుండి రక్షించాడు. నూతన నిబంధనలో, యేసు, తొలుత జన్మించిన పుత్రుడు మన “గోయల్” అయ్యాడు. యేసు గురించి ‘రక్షకుడు’, ‘విమోచకుడు’, (లూకా. 2:11; యోహాను. 4:42; అ.కా. 5:31), ‘న్యాయవాది” (1 యోహా. 2:1), ‘సోదరుడు’ (హెబ్రీ. 2:11) మొ.గు వానిగా చెప్పబడింది. యేసు మానవాళి కుటుంబ రక్షణార్ధమై, ఆయన సోదరులమైన మనమందరము తిరిగి మరల సంపూర్ణ సోదర ప్రేమలో జీవించడానికి తననుతాను సంపూర్ణముగా అర్పించుకున్నాడు. యేసు స్వయముగా, “మనుష్య కుమారుడు సేవించుటకే గాని, సేవింప బడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్ధము (“గోయల్”), విమోచన క్రయ ధనముగ తన ప్రాణమును దాయ పోయుటకు వచ్చెను” (మార్కు. 10:45) అని చెప్పాడు. ఈ ఆవిష్కరణను, “క్రీస్తు నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగము చేసెను” (గలతీ.2:20) అని పౌలు వ్యక్తపరిచాడు. 

యోహాను సువార్తలో త్రిత్వైక బోధన
తండ్రి కుమారుల మధ్యనున్న అతి సన్నిహిత సంబంధము గురించి యోహాను నొక్కి చెప్పాడు. తండ్రి ప్రేమను తెలియజేయడమే కుమారుని లక్ష్యం (17:6-8). “నేనును, నా తండ్రియు ఏకమై యున్నాము” (10:30) అని యేసు ప్రకటించాడు. వారి మధ్య ఐఖ్యత ఉన్నది. ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే (14:9). తండ్రిని గురించి వెల్లడి జేయడములో, యేసు ఆత్మను గురించి కూడా తెలియజేసాడు, “తండ్రి యొద్దనుండి వచ్చు సత్యస్వరూపియగు ఆత్మ” (15:26). మనతో ఉండటానికి దేవుడు పవిత్రాత్మను పంపును. అలాగే, “నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను” (16:7) అని యేసు పలికాడు. అనగా యేసు పవిత్రాత్మను పంపును. తండ్రి దేవుడు / పుత్ర దేవుడు పవిత్రాత్మను పంపును. ఈ సత్యం తండ్రి కుమారుల మధ్యనున్న గొప్ప సహవాసమును, ఐఖ్యతను స్పష్టముగా  వెల్లడి చేయుచున్నది. ఇదే ఐఖ్యత తన ప్రజల మధ్య ఉండాలని ప్రభువు ఆశించారు (13:34-35;17:21). ఇదే త్రిత్వైక సర్వేశ్వరుని పండుగ గొప్ప సందేశము: మనము పరస్పర ప్రేమ కలిగి, ఐఖ్యతగ జీవించాలి.

త్రిత్వం ప్రేమ యొక్క పరమ రహస్యం. త్రిత్వం ఐఖ్యత యొక్క పరమ రహస్యం. త్రిత్వైక దేవుని జీవితములో మనము పాలుపంచుకోవడానికి పిలువబడి యున్నాము. దేవుడు మనకు నిత్య జీవమును ఒసగును. త్రిత్వైక దేవునిలో ప్రేమ, ఐఖ్యత కలిగి మనము జీవించాలని ప్రార్ధన చేద్దాం.

No comments:

Post a Comment