11వ సామాన్య ఆదివారము (18 జూన్ 2023)
నిర్గమ 19:2-6; రోమీ 5:6-11; మత్త
9:36-10:8
దేవుని ప్రేమను గుర్తుంచు!
నేటి పఠనాలు, దేవుడు మన జీవితాలలో ఏవిధముగా
ఇమిడియున్నాడో, ఆయన ప్రేమ యెట్టిదో తెలియజేయు చున్నాయి.
మొదటి పఠనములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వమునుండి ఏవిధముగా విడిదల
చేసాడో, సినాయి పర్వతమువద్ద మోషేద్వారా వారికి జ్ఞాపకం
చేయుచున్నాడు. “గరుడపక్షి తన పిల్లలను రెక్కలమీద మోసికొని పోవునట్లే నేనును మిమ్ము
మోసికొని వచ్చి నా కడకు చేర్చుకొంటిని” (19:4) అని దేవుడు తన
ప్రజలపైనున్న ప్రేమను వ్యక్తపరచాడు. దేవుని సహాయం లేనిచో, వారు
వాగ్ధత్తభూమిలోనికి ప్రవేశించేవారు కాదు. ఇది మన రక్షణ చరిత్రకూడా. దేవుడు
మనలనుకూడా తన కడకు చేర్చుకుంటున్నాడు. దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే, దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవుని ఒడంబడికకు విశ్వసనీయముగా కట్టుబడి
ఉండాలి.
మన జీవితములో దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదోయని, దేవుని
మంచితనము, శాశ్వత దయాగుణము, ప్రజల
సృష్టికర్త, సంరక్షకుడు, విశ్వసనీయుడని,
“మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించెనని,
ఇట్లు దేవుడు మనపై ఉన్న ప్రేమను చూపుచున్నాడని”, క్రీస్తుద్వారా దేవుడు మనలను పాపము, మరణములనుండి
విముక్తిచేసి, శాశ్వత జీవమును ఒసగాడని, కనుక ఆయనయందు విశ్వాసం ఉంచాలని పౌలు దేవునికి మనపైనున్న ప్రేమను జ్ఞాపకం
చేయుచున్నాడు.
సువిషేశములో దేవుని ప్రేమ, క్రీస్తునందు
చూడగలము. “కాపరిలేని గొఱ్ఱెలవలె చెదరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు
తరుగుకొని పోయెను” (మత్త 9:36). యేసు అన్ని పట్టణములను,
గ్రామములను తిరిగి, ప్రార్ధనా మందిరములలో
బోధించుచు, పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు
ప్రకటించుచు, జనుల వ్యాధి బాధలనెల్ల పోగొట్టు చుండెను”
(9:35). “ప్రభువు తన ప్రజల గాయములకు కట్టు కట్టును. వారి దెబ్బలను నయము
చేయును” (యెష 30:26) అని ప్రవక్త ప్రవచనాలు క్రీస్తునందు నెరవేరాయి. క్రీస్తు
ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, కాపరి.
దేవునికి మనవి, ప్రార్ధన చేయమని శిష్యులను కోరుతూ, అలాగే వారిని ప్రజల మధ్యలోకి పంపుచు తన కరుణను వ్యక్తపరచారు.
“మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే ఒసగుడు” (మత్త 10:8) అని యేసు తన శిష్యులను పంపుచున్నాడు. ఎందుకన, “పంట మిక్కుటము. కాని కోతగాండ్రు తక్కువ” (9:37). దేవుడు సమస్తమును మనకు ఉచితముగా ఒసగును. ఆయన ఒసగువాడు, గొప్పదాత. దేవుడు మనకు ఒసగిన వరములను ఇతరులతో ఉదారముగా పంచుకోవాలి. యేసు తన శిష్యులను వారు పొందిన దానిని ఇతరులకు ఒసగడానికి పంపుచున్నాడు. ఇతరులకు సేవ చేయడానికి, సువార్తను బోధించడానికి శిష్యులను పంపాడు. ప్రేమ మరియు ఉదారతతో సేవ చేయాలి. ఏమీ ఆశించకుండా దైవరాజ్యమును ప్రకటించాలి. “క్రీస్తు శిష్యులు విశ్వాసం కలిగి, దాన్ని జీవించడం మాత్రమేగాక దాన్ని ప్రకటించాలి. నిబ్బరతతో సాక్ష్యమివ్వాలి, వ్యాప్తి చేయాలి” (సత్యోపదేశం, 1816). శిష్యులు తమ ప్రేషితకార్యము ద్వారా ఇతరులను దేవుని వైపుకు మరల్చాలి.
యేసు ప్రేషిత కార్యములో మనంకూడా భాగస్థులం కావాలి. ఎలాంటి మినహాయింపు లేకుండా, మనమందరం సువార్త బోధకులుగా, మిషనరీలుగా పిలువబడియున్నాము. దేవుని ప్రేమను, కరుణను, దయను, క్షమాపణను ఇతరులకు పంచాలి. నేడు సామాన్య దైవప్రజలు ఈ కార్యములో ఎక్కువ బాధ్యత కలిగి యుండాలి. అందరం ఏకమనస్కులై, సహకార మందించుకుంటూ ఉండాలి. ఎవరికీ సాధ్యమైన రీతిలో వారు విచారణ, సంఘ, శ్రీసభ అభివృద్ధి కొరకు కృషి చేయాలి. దేవుడు మనకు ఎన్నో అనుగ్రహాలను ఇచ్చియున్నాడు. కనుక, దైవరాజ్య సేవలో ఔదార్యముతో మన సేవలను అందిద్దాం. వాటిని సంఘాభివృద్ధికై ఉపయోగించుదాం. ఇది మనందరి ప్రేషితకార్యం.
No comments:
Post a Comment