22వ సామాన్య ఆదివారము, Year B
ద్వితీయ. 4:1-2, 6-8; యాకో. 1:17-18, 21-22,27; మార్కు. 7:1-8, 14-15, 21-23
“వెలుపలనుండి
లోపలికిపోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదియును లేదు. కాని, లోపలినుండి బయలు
వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును” (మార్కు 7:15). పరిసయ్యులు, ధర్మశాస్త్ర
బోధకులు న్యాయనిపుణులు. చట్టాన్ని అక్షరాల పాటించేవారు (చదువుము. ద్వితీ. 4:1). అయితే,
ఆ ధర్మశాస్త్ర ఉద్దేశాన్ని లేదా దేవుడు ఒసగిన ఆజ్ఞల ఉద్దేశాన్ని పక్కనపెట్టేవారు.
బాహ్యపరమైన ఆచారాలకు, సంప్రదాయాలకు ప్రాముఖ్యతను ఇచ్చేవారు. బాహ్యపరమైన శుద్ధికి
ప్రాముఖ్యతను ఇచ్చేవారు, కాని అంత:ర్గత పవిత్రతను నిర్లక్ష్యం చేసేవారు.
అందుకే,
యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, యేసు వద్దకు
వచ్చి, “తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్కచేయక, మలిన హస్తములతో భుజించు
చున్నారేమి?” అని ప్రశ్నించారు. అప్పుడు యేసు వారితో నైతికముగా ఏది ముఖ్యమో వారికి
తెలియజేయు చున్నారు; అలాగే, వారి కపట భక్తిని బట్టబయలు చేయుచున్నారు.
సంప్రదాయాలను
యేసు ఎప్పుడు ఉల్లంఘించలేదు; అలా చేయమని ఎప్పుడుకూడా యేసు తన శిష్యులకు చెప్పలేదు.
దానికి బదులుగా, “నేను ధర్మశాస్త్రమును, ప్రవక్తల ప్రబోధమును రద్దుచేయ వచ్చితినని
తలంప వలదు. నేను వచ్చినది వానిని సంపూర్ణ మొనర్చుటకే గాని, రద్దుచేయుటకు కాదు”
(మత్త. 5:17) అని స్పష్టం చేసియున్నారు.
యూదులకు
“ధర్మశాస్త్రము” లేదా “చట్టము” అనగా ఒకటి వ్రాతపూర్వకమైన చట్టం, రెండు మౌఖిక (నోటమాట
జెప్పిన) చట్టం. వ్రాతపూర్వకమైన చట్టం బైబులులోని మొదటి ఐదు గ్రంథాలు (‘తోరా’ అని
పిలుస్తారు). కొన్నిసార్లు దీనిని ‘మోషే చట్టం’ అని కూడా పిలుస్తారు. చాలాకాలముగా,
యూదులు వ్రాతపూర్వకమైన చట్టముతో సంతృప్తి చెందారు. దీనిని తమ జీవితాలలోనికి
అన్వయించుకొని జీవించారు.
అయితే,
కాలక్రమేణా, ధర్మశాస్త్ర బోధకులు ఈ వ్రాతపూర్వకమైన చట్టం, అర్ధంచేసుకోవడానికి
కష్టంగా యున్నదని తలంచారు. దీనికి వివరణ ఇవ్వాలని భావించారు. దానిఫలితముగా, అది మౌఖిక
(నోటమాట జెప్పిన) చట్టానికి లేదా సంప్రదాయాలకు దారి తీసింది. వాటిలో ఒకటే,
భోజనమునకు ముందుగాని, ప్రార్ధనకు ముందుగాని చేతులు కడుగు కొనవలయును అను చట్టము. ఈ
సంప్రాదాయాల వెనుక ఉన్న ఉద్దేశ్యం చాలా మంచిదే! కాని కాలక్రమేణా, ఈ సంప్రదాయాలు
బాహ్యపరమైన మతాచారాలుగా మారిపోయాయి.
యేసు జీవించిన
కాలానికి, శుద్ధత, ఆశుద్ధత గూర్చి ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. మొదటి
పఠనములో విన్నట్లుగా, మోషే ఇశ్రాయేలు ప్రజలతో, “నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమి చేర్చరాదు.
వానినుండి యేమి తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభువు ఆజ్ఞలను ఉన్నవానిని
ఉన్నట్లుగా అనుసరింపుడు” (ద్వితీయ. 4:2) అని స్పష్టం చేసారు.
అన్ని
భక్తికార్యాలు, సంప్రదాయాలు, పద్ధతులు చెడ్డవి కావు. అయితే క్రీస్తు, పరిసయ్యుల
వైఖరిని ఖరాఖండిగా వ్యతిరేకించారు. కేవలం బాహ్యపరమైన చర్యలు, క్రియలు ఒక వ్యక్తియొక్క
మతతత్వాన్ని కలిగియుండటాన్ని యేసు వ్యతిరేకించారు. అయితే, ఈ సంప్రదాయాలను
ప్రదర్శనకోసం, ఇతరుల మెప్పుకోసం, లేదా వారు ఎంత ధర్మాత్ములని ఇతరులకు చూపించడం
కోసం పాటించడం అనేది చాలా దారుణం! మరోమాటలో చెప్పాలంటే, కేవలం కర్మ క్రియలను
పాటించడం కోసం, చట్టం యొక్క నిజమైన ఉద్దేశ్యం కనుమరుగై పోయింది. పరిశుభ్రతకు చేతులు,
పాత్రలు శుభ్రపరచు ఆచారాలు అవసరమైనప్పటికినీ, అవి ఒక వ్యక్తియొక్క అంత:ర్గత
శుద్ధీకరణను తెలియజేయలేవు అని ప్రభువు తెలియజేయు చున్నారు.
ప్రక్షాళన
కర్మను (బాహ్యపరమైన శుద్ధి) పాటిస్తే ప్రజలు శుద్దులవుతారని పరిసయ్యులు,
ధర్మశాస్త్ర బోధకులు అనుకున్నారు. దేవుని చట్టాన్ని పాటించడంలోగల నిగూఢ అర్ధాన్ని
వారు గ్రహించలేక పోయారు. కేవలం బాహ్య పరమైన ఆచారాలు, సంప్రదాయాలుగా మిగిలిపోయాయి. వాటిని
అక్షరాల పాటిస్తారు కాని, వారి హృదయాలలో ఇసుమంతైన ప్రేమకూడా లేదు. ప్రేమలేని
జీవితం, మనం ఎన్ని కర్మక్రియలు, చట్టాలు పాటించినా హృదాయే అని నేడు మనం
గ్రహించాలి.
అందుకే
యేసు వారితో యెషయా ప్రవక్త ప్రవచనాన్ని పలుకుతూ, “కపట భక్తులారా! ఈ జనులు కేవలము
నన్ను పెదవులతో పొగడెదరు కాని వీరి హృదయములు నాకు దూరముగా నున్నవి. మానవులు
ఏర్పరచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించు చున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్ధము”
(మార్కు. 7:6-7; చదువుము. యెషయ 29:13) అని పలికారు. వారు బోధించే దానికి వారు చేసే
కార్యాలు విరుద్ధముగా ఉన్నాయని వారిని విమర్శించారు. దేవుని చట్టం పట్ల వారి
ఉత్సాహం కేవలం నోటి మాటకు మాత్రమే, అయితే కార్యాలు మాత్రం శూన్యం! ఇక్కడ రెండు
విషయాలు గమనించుదాం: ఒకటి బాహ్యపరమైన ఆచారాలను ప్రేమ లేకుండా పాటించడం; రెండు,
మాటలకు, చేష్టలకు పొంతన లేకపోవడం.
భోజనానికి
ముందుగాని, ప్రార్ధనకు ముందుగాని చేతులు కడుక్కోక పోవడం ఒక వ్యక్తి శుద్దుడా,
ఆశుద్ధుడా అని చెప్పలేము. చేతులు కడుక్కోకుండా తినడం వలన ఒక వ్యక్తి ఆశుద్ధుడు
కాడు. ఒక వ్యక్తిని ఆశుద్ధపరచునది, మాలిన్యపరచునది వారి అంతరంగము నుండి లేదా
హృదయమునుండి వెలువడునదియే. “హృదయమునుండి దురాలోచనలు, వేశ్యాసంగమము, దొంగతనము,
నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము,
అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నియు మానవుని అంతరంగము నుండియే
వెలువడి అతనిని మలినపరచును” (మార్కు. 7:21-23). వీటినుండి మనం ఎలా శుద్దులం
కావాలని ఆలోచించాలి!
అన్నింటికన్న ముఖ్యమైనది ప్రేమ: కేవలం
మనం చేసే బాహ్య క్రియలను, కర్మలను బట్టి మన మతాన్ని లేదా నేను మతస్థుడనని గుర్తించ
కూడదు. ఉదాహరణకు: ఆదివారాలలో దేవాలయానికి వెళ్లి పూజలో పాల్గొనడం, జపాలు
వల్లించడం, బైబులు చదవడం, పుణ్యక్షేత్రాలను దర్శించడం, దీక్షలు తీసుకోవడం,
దానధర్మాలు చేయడం.... ఇవి మన పవిత్రతకు హామీ ఇవ్వలేవు. అన్నింటికన్న ముఖ్యమైనది,
అవసరమైనది మన హృదయాలలో ప్రేమ. ఆ నిజమైన ప్రేమ ఉన్నప్పుడే మనస్పూర్తిగా
పై కార్యాలను చేయగలం. నేను దేవున్ని అమితముగా ప్రేమిస్తున్నాను కనుక నేను
దేవాలయమునకు వెళ్లి పూజలో పాల్గొంటాను. నేను ఇతరులను ప్రేమిస్తున్నాను కనుక
దానధర్మాలు చేస్తాను. మన హృదయములో గర్వము, అహంభావము ఉన్నచో, మనలో ప్రేమ లేనిచో, ఇవన్ని
మనలను పవిత్రులుగా చేయలేవు.
ఈనాటి రెండవ
పఠనములో యాకోబు ఈ విషయాన్ని స్పష్టపరుస్తున్నారు: “తండ్రియైన దేవుని దృష్టిలో
పవిత్రమును, నిష్కళంకమునైన మతమేదనగా – అనాధలను, విధవరాండ్రను, వారి కష్టములలో
పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండ, తనను తాను కాపాడుకొనుట అనునవియే” (యాకో.
1:27). “వాక్యమును కేవలం వినుటయేనని ఆత్మవంచన చేసికొనకుడు. దానిని ఆచరింపుడు”
(1:22) అని యాకోబు తెలియజేయు చున్నారు. దేవుని వాక్యమును చదవాలి, ధ్యానించాలి,
ప్రార్ధించాలి, ముఖ్యముగా దానిని ఆచరించాలి. “దేవుని వాక్కును ఆలకించి దానిని
పాటించువారు మరింత ధన్యులు” (లూకా. 11:28).
బైబులు
ప్రకారం, హృదయం జ్ఞానమునకు, భావాలకు, భావోద్వేగాలకు, నిర్ణయాలకు నిలయం. ఉదాహరణకు,
“నన్ను ప్రభువుగా గుర్తింప వలెనన్న కోరికను వారికి కలిగింతును. వారు నా ప్రజలు
కాగా నేను వారికి దేవుడనగుదును. వారు పూర్ణహృదయముతో నా వద్దకు తిరిగి వత్తురు”
(యిర్మీ. 24:7). హృదయమునుండియే మంచి చెడులు వెలువడును (మత్త. 7:21; లూకా. 6:45). హృదయం
విశ్వాసమునకు మూలం (రోమీ. 10:10). జ్ఞానము యొక్క ఆలయము (1 రాజు. 3:12). అలాగే,
హృదయం ఒక వ్యక్తికి, వ్యక్తిత్వానికి తార్కాణం. మనకున్నది ఒకే హృదయం. దానిని
దేవునికి అర్పించుదాం. “దేవుని యందలి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పును మీకు
కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక!” (2 తెస్స. 3:5).
ప్రతీ
దేశములో, ప్రతీ రాష్ట్రములో, ప్రతీ గ్రామములో, ప్రతీ కుటుంబములో, ప్రతీ వ్యక్తిలో
ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఇవన్ని కూడా ముఖ్యమే ఎందుకన, సమాజములో స్థిరత్వాన్ని,
అవగాహనను, క్రమాన్ని కలిగిస్తాయి. అయితే, మనకు భిన్నమైన సంప్రదాయాలు ఉండటం వలన, ఇవి
ఒక్కోసారి అనైఖ్యతకు, అపార్ధాలకు కూడా దారి తీస్తాయి. కనుక, మన సంప్రదాయాల పట్ల
సరైన అవగాహన మనకు ఉండాలి, లోతైన భావాన్ని ఎరిగి యుండాలి. వాటిని గుడ్డిగా కాకుండా,
అర్ధవంతముగా పాటించడానికి ప్రయత్నం చేయాలి.
Praise the lord father 🙏
ReplyDeleteThanks for sharing