19వ సామాన్య ఆదివారము, Year B

19వ సామాన్య ఆదివారము, Year B
1 రాజు. 19:4-8; ఎఫెసీ. 4:30-5:2; యోహాను. 6:41-51
“నేను పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమును”

ఐదు వేల మందికి ఆహారమును ప్రసాదించి, వారి శారీరక ఆకలిదప్పులను తీర్చిన ప్రభువు, ఇప్పుడు వారి ఆధ్యాత్మిక ఆకలి తీర్చుట గురించి మాట్లాడుచున్నారు. “నేను పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమును” (6:41) అని యేసు చెప్పారు. అందులకు, యూదులు గొణగ సాగిరి. “ఇతడు యోసేపు కుమారుడగు యేసు కాదా? ఇతని తల్లిదండ్రులను మనము ఎరుగమా? అట్లయిన తాను పరలోమునుండి దిగివచ్చితినని ఎటుల చెప్పగలడు? అని చెప్పుకొనసాగిరి” (6:42). ప్రభువు మాటలను వారు అర్ధం చేసుకోలేక పోయారు. వారి మనస్సులు అంధకారములో మునిగిపోయాయి. యేసు మాటలను ఆలకించక, ఆయనను ప్రశ్నించాలని చూసారు. వారి హృదయ కాఠిన్యత వలన, వారు సత్యమును గ్రహించలేక పోయారు.

మనలో చాలామందిమి ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాము. కతోలిక ప్రభోదములను ఆలకించక, అర్ధంచేసుకొనకుండా, తప్పుబట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అధికారమును, సిద్ధాంతాలను ప్రశ్నించడానికి, సవాలు చేయడానికి సిద్ధముగా ఉంటాము. పరిశుద్ధాత్మ స్వరమును ఆలకించడానికి సిద్ధముగా ఉండము.

కనుక, కొన్నిసార్లు, మౌనధ్యానం ఎంతో అవసరం. మౌనముగా యున్నప్పుడే, దేవుని స్వరమును వినగలము. మనం విన్నదానిని, ప్రార్ధనా పూర్వకముగా ధ్యానించాలి. సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నం చేయాలి.  

ప్రభువు పలికిన మాటలకు అర్ధమేమి? తండ్రి దేవుడు మనకు నిత్యజీవమును ఒసగుటకు, మనతో వాసము చేయుటకు యేసును మనమధ్యలోనికి పంపారు. అందుకే యేసు దివ్యసత్ప్రసాదమును స్థాపించారు. దివ్యపూజాబలి ద్వారా, క్రీస్తు మనతో వాసము చేయుచున్నారు. కనుక, క్రీస్తు సాన్నిధ్యమును మనం అనుభవించాలంటే, ప్రతీరోజు దివ్యపూజా బలిలో పాల్గొనాలి. దివ్యసత్ప్రసాదమును స్వీకరించాలి. ప్రార్ధన చేయాలి. సేవా కార్యాలు చేయాలి. దేవునకు కృతజ్ఞులమై జీవించాలి. దివ్య పూజలో, తన శరీర రక్తముల ద్వారా, మనకు రక్షణను, జీవమును, శక్తిని ఒసగుచున్నారు. “జీవాహారమును నేనే... దీనిని భుజించువారు, మరణింపరు... వారు నిరంతరం జీవించును (6:48-51).

మనమందరం పైకి ఎదగాలని చూస్తాము. ఇతరులకన్న ఎంతో ఎత్తులో ఉండాలని ఆరాట పడతాము. ఎత్తు ఎదిగిన తరువాత, కిందవారిని చిన్నచూపుతో చూస్తాము. కాని, దైవ కుమారుడు మనకోసం పరలోకము నుండి కిందికి దిగివచ్చారు. తననుతాను రిక్తునిగా చేసుకొని మనతో సమానముగా నిలిచారు. మనకోసం “జీవాహారము”గా మారారు. మానవాళి ఆకలిదప్పులను తీర్చుతున్నారు. ప్రజలు మెస్సయ్య, అభిషిక్తుడు పరలోకమునుండి దిగివస్తారని ఎదురుచూసారు. “నేనే ఆయనను” (యోహాను. 8: 24, 28) అని ప్రభువు తెలిపియున్నను, వారు విశ్వసింపలేక పోయారు. “ఈయన ఎక్కడి వాడో మనమెరుగుదుము. కాని ‘క్రీస్తు’ వచ్చినపుడు ఆయన ఎక్కడ నుండి వచ్చునో ఎవరికిని తెలియదు” (యోహాను. 7:27) అని పలికారు.

కనుక క్రీస్తునందు విశ్వాసము ఎంతో ప్రాముఖ్యము. “నన్ను విశ్వసించువారు నిత్యజీవము పొందును” (యోహాను. 6:47) అని ప్రభువు చెప్పియున్నారు. తనను విశ్వసించు వారికి నిజమైన, శాశ్వతమైన ఆహారమును ఒసగును. “వినుము! నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును. వానితో భుజింతును. అతడును నాతో భుజించును” (దర్శన. 3:20).

వాక్కు శరీరధారియైనట్లుగా, క్రీస్తు శరీరము మనకోసం జీవాహారముగా మారుచున్నది. ఎంత అద్భుతం! ఎంత గొప్ప వరం! క్రీస్తువలె మనం కూడా ఇతరులకు “ఆహారము” కావలెను. అనగా ఇతరుల జీవితాలను నిర్మాణాత్మకముగా మార్చుటకు, ఆధ్యాత్మికముగా పోషించుటకు ప్రయత్నం చేయాలి.

రెండవ పఠనము: “దేవుని పోలి జీవింపుడు” (5:1) అని పౌలు ఎఫెసీయులను కోరుచున్నారు. అవును! నిజమే! మనం దేవుని ప్రియమైన బిడ్డలము కనుక ఆయనను పోలి జీవించాలి. “మీ దేవుడను ప్రభువునైన నేను పవిత్రుడను. కనుక మీరును పవిత్రులై యుండుడు” (లేవీ. 19:2) అని యిస్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపించారు. ‘పవిత్రులై యుండుడు’ అనగా ‘దేవుని పోలి యుండుట’.

అయితే, దేవుని పోలి జీవించుటలో మనకు ఆదర్శం “క్రీస్తు” అని పౌలు స్పష్టం చేయుచున్నారు: “వైరము, మోహము, క్రోధము అను వానిని త్యజింపుడు. అరుపులుగాని, అవమానములుగాని ఇక ఉండరాదు. దానికి బదులుగా పరస్పరము దయను, మృదుత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగను, బలిగను, మన కొరకై తన ప్రాణములను సమర్పించెను” (ఎఫెసీ. 4:31-32; 5:2). అలాగే, దుర్గుణాలను త్యజించాలి, సద్గుణాలను అలవరచుకోవాలి.

క్రీస్తును ఆదర్శముగా చేసుకొని జీవించుటకు పవిత్రాత్మ దేవుడు మనకు సహాయం చేయును: “దేవుని పవిత్రాత్మను విచారమున ముంచరాదు. ఏలయన, దేవుడు మీకు స్వేచ్చను ఒసగెడు రోజు రానున్నది అనుటకు అది నిదర్శనము” (4:30).

మొదటి పఠనము: ఏలియా గొప్ప ప్రవక్త. కాని తన జీవితములో కూడా విశ్వాస సంక్షోభాన్ని ఎదుర్కున్నారు. తనను చంపాలని తలంచిన వారి బారినుండి, హోరేబు (సినాయి) కొండకు ప్రయాణమై పోవుచున్న ఏలియా ఆకలిదప్పులతో అలసిపోయి, ఒక రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణములు విడువ గోరినప్పుడు, దేవుడు తన దూతద్వారా అతనికి భోజనమును ప్రసాదించారు. ఏలియా ఆ ఆహారపు బలముతో నలుబది రోజులు నడచి దేవుని కొండయైన హోరేబు చేరుకున్నారు.

ఆధ్యాత్మిక ఆకలిదప్పులు గలవారికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. అంతా అయిపోయింది, మరణమే ఇక గత్యం అని తలంచిన ప్రవక్తను దేవుడు పునరుద్ధరించారు. శారీరక ఆకలిదప్పులను మాత్రమేగాక, అతని ఆధ్యాత్మిక ఆకలిని కూడా తీర్చారు. అతని శారీరక ఆకలిదప్పులను రొట్టె, నీటితో తీర్చారు. అతని ఆధ్యాత్మిక ఆకలిదప్పులను తన సాన్నిధ్యముతో తీర్చారు.

మనం కూడా మన అనుదిన జీవితములో ఏలియావలె ఆధ్యాత్మిక సంక్షోభాన్ని చవిచూడవచ్చు. అలాంటి క్లిష్ట సమయములో దేవునిపై ఆధారపడుదాం. “జీవాహారము” అయిన క్రీస్తునందు విశ్వాసం కలిగి ఉందాము.

3 comments: