దైవ రాజ్యము – మన యోగ్యత

దైవ రాజ్యము – మన యోగ్యత

    దైవరాజ్యము, దానిలో మనము భాగస్థులము కావాలంటే, దానిలో ప్రవేశించుటకు అర్హులము, యోగ్యుము కావాలంటే, దేవుని రాజ్యమునకు వారసులము కావాలంటే, మనము ఏమి చేయాలి అనే అంశంపై ధ్యానించుదాము.

దైవరాజ్యము అనగా నేమి?

    యోహాను 18:36లో ‘‘నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు’’ అని ప్రభువు చెప్పియున్నారు. అనగా దైవరాజ్యం దైవసంబంధమైనది. కనిపించనటువంటిది. ఆధ్యాత్మికమైనది, అంతర్గతమైనది. శాశ్యతమైనది, సార్వత్రికమైనది. దైవరాజ్యము మనమధ్యలో, మనచుట్టూ, మనలో ఉన్నది. అది లోకాంతము వరకు ఉంటుంది. లోకాంతమున పరిపూర్ణమవుతుంది. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా, యేసు ఈ విధముగా సమాధానం ఇచ్చాడు. ‘‘దేవుని రాజ్యము కంటికికనబడునట్లు రాదు. ఇదిగో! ఇక్కడ ఉన్నది లేక అదిగో ! అక్కడ ఉన్నది అని ఎవడును చెప్పజాలడు, ఏలయన అది మీ మధ్యనే ఉన్నది’’ (లూకా 17:20`21).

    దేవుని రాజ్యమును గురించి పౌలుగారు రోమీయులకు వ్రాసిన పత్రిక 14:17లో వివరిస్తున్నారు: ‘‘దేవుని రాజ్యము అనగా తినుట, త్రాగుట కాదు, పవిత్రాత్మయొసగు నీతి, శాంతి సంతోషములే!’’ అనగా దైవరాజ్యము కేవలం శారీరక మైనది, తాత్కాలికమైనది సామాజికమైనది కాదు. దైవరాజ్యం నైతికమైనది, అతీంద్రియమైనది. దైవరాజ్యం అనగా రక్తమాంసములతో చేయబడినది కాదు (1 కొరి. 15:50). దేవుని రాజ్యము ఉట్టి మాటలు కాదు అని 1 కొరి. 4:20లో చదువుచున్నాము.

    దైవరాజ్యం అనగా దేవుని  పరిపాలన, శక్తి, జీవము, రక్షణ, దేవుని సన్నిధి. దైవరాజ్యం అనగా దేవునిలో ఐక్యత, సహవాసము. దేవుని రాజ్యము ఒక రహస్యము, ఒక పరమ రహస్యం, క్రీస్తు, సన్నిహితులకు మాత్రమే పరలోకరాజ్య పరమ రహస్యములు జ్ఞానము అనుగ్రహించ బడినది. (మార్కు. 4:11, లూకా. 8:10). పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమువలె ఉన్నది. కనుక దానిని మనము కనుగొనాలి (మత్త. 13:44).

    దేవుని రాజ్యము అనగా క్రీస్తే. దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది. (మత్త. 12:28). దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చియున్నది.(లూకా 11:20).

మన యోగ్యత

    ‘‘యేసు వాడవాడ, పల్లెపల్లె పర్యటించుచు, బోధించుచు యెరుషలేము దిక్కుగ పోవుచుండగా, రక్షణ పొందువారు కొద్దిమంది మాత్రమేనాఅని ఒకడు ఆయనను అడిగెను. అందుకు యేసు ఇరుకైన మార్గమున ప్రవేశింపుము. అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు కాని అది వారికి సాధ్యపడదు (లూకా. 13:22`24) అని సమాధానం ఇచ్చెను. ‘‘ఇరుకైన మార్గము’’ ఎందుకనగా ‘‘వెడల్పైన ద్వారము, సులభముగానున్న మార్గము వినాశనమునకు చేర్చును. (మత్త. 7:13`14). జీవమునకు పోవుమార్గము ఇరుకైనది, కష్టమైనది.

    దైవరాజ్యంలో ప్రవేశించాలంటే మనకు కావలసిన ప్రధానమైన అర్హత, యోగ్యత హృదయ పరివర్తనము. ‘‘హృదయ పరిపరివర్తనము చెందుడు. పరలోక రాజ్యము సమీపించియున్నది. (మత్త 4:17). ‘‘కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తన చెంది, సువార్తను విశ్వసింపుడు’’ (మార్కు. 1:15). దైవరాజ్యంలో ప్రవేశించాలంటే ఉట్టిమాటలు సరిపోవు. ‘‘ప్రభు! ప్రభు! అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు! కాని, పరలోకమందు నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును’’ (మత్త. 7:21).

    హృదయ పరివర్తనము అనగా దేవునివైపు మరలటం. పాపజీవితాన్ని విడవటం. దేవుని చిత్తానుసారముగా జీవించటం, దేవుని ఆజ్ఞను పాటించటం, నీతివంతమైన జీవితమును జీవించటం. మీరు నీతివంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరు’’ (మత్త. 5:20).

    దైవరాజ్యంలో ప్రవేశించాలంటే మనము ఆత్మానుసారముగా జీవించాలి. ఆత్మకు వ్యతిరేకం శరీరం. ‘‘శరీరానుసారముగా జీవించువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు’’ (గలతీ. 5:21).

    ‘‘దేవుని రాజ్యము నిమిత్తము ఇంటిని, భార్యను, బిడ్డలను అన్నదమ్ములను, తల్లిదండ్రులను పరిత్యజింపవలసి ఉంటుంది’’ (లూకా. 18:29). ధనాపేక్ష ఉన్నవారు దేవుని రాజ్యమున ప్రవేశింప లేరు. ‘‘ధనవంతులు దేవుని రాజ్యమును ప్రవేశించుట ఎంత కష్టము’’ (మార్కు. 10:23-25). దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్న బిడ్డలవలె జీవించాలి. ‘‘చిన్న బిడ్డలదే దేవుని రాజ్యము’’ (మార్కు. 10:14). ‘‘నీటివలన, ఆత్మవలన జీవించిననేతప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేరు’’ (యోహాను. 3:5). అనగా జ్ఞానస్నానము పొందాలి. ‘‘నాగటి మీద చెయ్యిపెట్టి వెనకకు చూచువాడు (పాత జీవితం, పాప జీవితం) ఎవడును దేవుని రాజ్యమునకు యోగ్యుడు కాదు’’ (లూకా. 9:62).

    క్రీస్తే ఆ దైవరాజ్యం. ఆయన ఎన్నుకున్న ఆ ఇరుకైనమార్గం సిలువమార్గం. సిలువ ప్రేమకు, త్యాగానికి, సమర్పణకు, అంకితభావానికి, విధేయతకు, రక్షణకు, విజయానికి గుర్తు. క్రీస్తు మార్గములో పయనించినప్పుడే దైవరాజ్యంలో మనముకూడా ప్రవేశిస్తాము.

    ఈ దైవరాజ్యము శ్రీసభ. శ్రీసభ అందించు దివ్యసంస్కారములద్వారా ఈ దైవరాజ్యము కొనసాగుతుంది. మనం ఏవిధంగా ఈ రాజ్యములో (తిరుసభ) జీవించాలి? యేసు ఇలా సమాధాన మిస్తున్నాడు. ‘‘దీనిద్వారా సకల మానవాళికి మీరు నా శిష్యులని తెలియునుగాక’’ (యోహాను. 13:35). ఏది మనం ఇతరులకు చేస్తామో, అది క్రీస్తుకు చేసినట్లే. ఈ విధముగనే క్రీస్తును, దైవరాజ్యాన్ని ఇతరుల వద్దకు తీసుకుపోగలము. తద్వారా, మనముకూడా దైవరాజ్యంలో ప్రవేశించగలము. యేసును ఎప్పుడైతే మన హృదయాలలోనికి స్వీకరిస్తామో, అప్పుడే దైవరాజ్యాన్ని ఇంకా వ్యాప్తిచేయగలము. శ్రీసభ దైవరాజ్య స్థాపన ఆరంభం మాత్రమే. సంపూర్ణ దైవరాజ్యాన్ని, క్రీస్తు, తండ్రితో పరిలోకమున స్థాపించగలడు. అప్పుడు మనము దేవుని ముఖాముఖిగా గాంచెదము. పరిపూర్ణ ప్రేమను, ఆనందాన్ని దేవునితో పొందగలము.

    ఈ దైవరాజ్యము పరిపూర్ణము కావాలని మనము మనసారా ప్రార్దన చేయాలి. అందుకే పరలోక ప్రార్దనలో ఉన్నట్లుగా ‘‘మీ రాజ్యము వచ్చును గాక’’ అని ప్రార్దన చేయాలి. అనగా దేవుడు మనలో వసించి తన రాజ్యమును మన హృదయాలలో ఆత్మలో స్థాపించునుగాక. తద్వారా, మనము ఆ రాజ్యంలో ఉందుముగాక, దేవుడు తన చట్టమును ఆజ్ఞలను ఈ లోకములో స్థాపించునుగాక. అనగా సామాజిక, రాజకీయ, సాంసృతిక పద్దతులు దేవునియొక్క అనుగ్రహముచేత రూపాంతరముచెంది దేవుని రాజ్యంలో పాలుపంచుకొని, ఫలభరితమగునుగాక, అలాగే క్రీస్తు రెండవ రాకడ సమయంలో ఈ రాజ్యమును పరిపూర్తిచేయునుగాక.

1 comment:

  1. It was a good Article regarding the Kingdom of God and our Worthiness.

    ReplyDelete