క్రీస్తు రాజు మహోత్సవము, YEAR B

క్రీస్తు రాజు మహోత్సవము, YEAR B

దానియేలు 7:13 -14; దర్శన. 1:5 -8; యోహాను 18:33-37 


సర్వేశ్వరుడు రాజ సింహాసనమందు ఆసీనుడై యుండును. ఆయన తన ప్రజలకు శాంతి వరమును ప్రసాదించును (కీర్తన 29:10-11). ప్రభువు రాజు. అతడు ప్రాభవమును వస్త్రమువలె ధరించెను. ప్రభూ! నీ సింహాసనము అనాదికాలము నుండియు స్థిరముగా నిల్చియున్నది (కీర్తన 93:1,2).

పండగ చరిత్ర:

అది మొదటి ప్రపంచ యుద్ధము (1914-1918) ముగిసిన కాలము. ప్రపంచమంతా అల్లకల్లోలమైన పరిస్థితి. ఎక్కడ కూడా శాంతి, ప్రశాంతత లేదు. దేశాలన్నీ కూడా ఆర్ధిక గంధర గోళములో ఉన్నాయి. నిరుద్యోగం ప్రబలిపోయింది. చాలా చోట్ల ప్రజలు ఆకలితో అలమటించి చనిపోయారు. నిరాశావాదం, దేశాల మధ్య ద్వేషంతో నిండిన నిస్సహాయ భావాన్ని విపరీతంగా నింపింది. నిరంకుశ అధికారుల పాలన ప్రారంభమైనది. ఫాసిజం, నేషనల్ సోషలిజం (నాజీలు), కమ్యూనిజం పుట్టుకొచ్చాయి. కష్టాలలో, బాధలలో నున్న ప్రజలు, ఈ గంధర గోళ పరిస్థితులలో, ఆశను చూపిన ఎవరి చెంతకైనా చేరిపోయారు. ఉద్భవిస్తున్న నియంతలకు ఆకర్షితులయ్యారు. తమ దైనందిన జీవితాల నుండి భగవంతుడిని మినహాయించి, తరచుగా స్వయం సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. చాలా మంది నైతికత ప్రాథమిక అంశాలు, శ్రీసభ బోధనలు కాలం చెల్లినవిగా భావించారు; అవి 20వ శతాబ్దపు సమాజంలో సంబంధితంగా లేవని తలంచారు. క్రీస్తు వ్యక్తిగత జీవితంలో రాజు కావచ్చు, కానీ ఖచ్చితంగా సామాజిక ప్రపంచంలో కాదు అని ఆధునికంగా ఆలోచించారు. కొన్ని రాజకీయ పాలనలు యేసు క్రీస్తును పూర్తిగా సమాజం నుండి, కుటుంబాల నుండి బహిష్కరించడాన్ని సమర్థించాయి. దేశాలు, ప్రభుత్వాలు పునర్నిర్మించబడినందున, వాటి పునాదులు, విధానాలు, చట్టాలు తరచుగా క్రైస్తవ విలువలతో సంబంధం లేకుండా రూపొందించ బడ్డాయి. 

లౌకికవాదం, భౌతిక ప్రయోజనం, నిరంకుశులు సృష్టించిన తప్పుడు ఆశలతో ఆధిపత్యం చెలాయించే జీవనశైలికి అనుకూలంగా క్రీస్తును తిరస్కరిస్తున్న ఈ పరిణామములో, 11వ భక్తినాథ పోపుగారు యేసు రాజ్యాధికారాన్ని తిరస్కరిస్తున్న రాజకీయ, ఆర్థిక శక్తులను సంబోధించాలనే తలంపుతో, పోప్‌గా తన పాలనను "క్రీస్తు రాజ్యంలో, క్రీస్తు శాంతి"కి అంకితం చేశారు. ఇలాంటి సమయములో, క్రీస్తు ఒక రాజుగా గౌరవించబడాలని, శ్రీసభకి కూడా స్వతంత్ర౦ కలదనే విషయం లోకం తెలుసుకోవాలని, విశ్వాసులు బలాన్ని, ధైర్యాన్ని పుంజుకొంటారని తలంచారు. రాజు అనేవాడు తన ప్రజలకు ఓ గొర్రెల కాపరివలె, ప్రేమించే హృదయాన్ని కలిగి యుండాలి. సంఘాన్ని న్యాయముతో, శాంతి పధములో నడిపించ గలగాలి. ప్రజల అవసరాలను గుర్తెరిగి వాటిని నెరవేర్చే వాడై ఉండాలి. అలాంటి పరిపాలనను క్రీస్తు రాజు మనకు ఒసగునని గుర్తించాలి.

కౌన్సిల్ ఆఫ్ నైసియా 1600వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, 1925లో శ్రీసభ జూబిలీ సంవత్సరాన్ని జరుపుకుంది. తండ్రి దేవునితో కలిసి ఉండడం ద్వారా కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు దైవత్వాన్ని ఆ సమావేశం ధృవీకరించింది. ఈ విశ్వాసాన్ని నేటికీ మనం విశ్వాస సంగ్రహములో ప్రకటిస్తున్నాము. వార్షికోత్సవ సంవత్సరం అంతయు కూడా, భక్తినాథ పోపుగారు, "క్రీస్తు రాజ్యానికి అంతమే ఉండదు" అని క్రీస్తు రాజరికాన్ని గూర్చి నిరంతరం ప్రకటించారు. కనుక, సకల దేశాలపై, సకల జనులపై క్రీస్తు రాజు యొక్క ఆధిపత్యాన్ని శాశ్వతముగా గుర్తించడానికి, 11 డిసెంబర్ 1925లో, "మన ప్రభువైన యేసుక్రీస్తు రాజు" మహోత్సవాన్ని స్థాపించారు.

ప్రతీ సంవత్సరం దైవార్చన సంవత్సరములో సామాన్య కాల చివరి ఆదివారాన్ని "సర్వాధికారియగు క్రీస్తు రాజు" మహోత్సవమును కొనియాడుచున్నాము. ఈ పండుగ ద్వారా, క్రీస్తు మన హృదయాలను, మనసులను పరిపాలించే రాజు అని గుర్తుకు చేసుకోవాలి.

పండగ పరమార్ధం: 

మొదటి పఠనము - దానియేలు 7:13-14: "శాశ్వత జీవి, నరపుత్రుని (క్రీస్తు-రక్షకుడు) గూర్చిన దర్శనము" గూర్చి దానియేలు (= దేవుడు నా తీర్పరి) ప్రవక్త తెలియజేయు చున్నాడు. తండ్రి నుండి అధికారం పొందిన నరుని కుమారుడు క్రీస్తు. "ఆ నరపుత్రుడు పరిపాలనమును, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతము లేదు. ఈ ప్రవచనం, దేవుడు రాజుగా కలకాలం ప్రజల చెంత ఉన్నాడని, దేవుని రాజ్యం, క్రీస్తు రూపములో భూలోకమునకు ఏతెంచినదని నిరూపిస్తున్నది. స్వయముగా క్రీస్తే దానియేలు ప్రవచనాన్ని మార్కు 14:62; మత్తయి 24:30 లో ప్రస్తావించారు.

యేసు జీవిత గాథ, "యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ?" (మత్తయి 2:2)  అన్న ప్రశ్నతో ప్రారంభమై, "నీవు యూదుల రాజువా?" (లూకా 23:3) అన్న ప్రశ్నతో ముగుస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం, నేటి సువిశేష పఠన౦లో యేసు మాటలలోనే చూడవచ్చు: "నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు... నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. దీనికొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్యసంబంధులందరు నా మాటనాలకింతురు" (యోహాను 18:36,37). పిలాతు ఎదుట ప్రభువు తన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదని, తన రాజ్యము ఆధ్యాత్మికమైనదని, తన రాజ్యము సత్యము, న్యాయములపై ఆధారపడి ఉన్నదని ప్రకటించాడు. సిలువ, క్రీస్తు రాజ్య విజయానికి చిహ్నము. ఈ విజయం జీవితం, సత్యం, ప్రేమ కొరకు. "దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది" (లూకా 17:21) అన్న ప్రభువు పలుకులు క్రీస్తే ఆ దైవ రాజ్యము అని అర్ధమగుచున్నది. అయిదువేల మందికి ఆహారము పంచిన తరువాత, ప్రజలు తనను బలవంతముగా రాజును చేయ ప్రయత్నించినపుడు, యేసు ఒంటరిగా పర్వతముపైకి వెళ్ళాడు (యోహాను 6:15), ఎందుకనగా, ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు.

క్రీస్తు తన శిష్యులతో, "అన్య జాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై పెత్తనం చెలాయించుచున్నారు. మీకు ఇది తగదు. మీలో ఎవడైన గొప్పవాడు కాదలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైన ప్రముఖుడై ఉండదలచిన అతడు మీకు బానిసయై ఉండవలెను. ఏలయన, మనుష్య కుమారుడు సేవించుటకేగాని, సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను (మార్కు. 10:42-45) అని అన్నారు. యేసు రాజ్యాధికారం అనగా సేవ,  ప్రేమ, సమర్పణ, త్యాగం. ఆయన పాలన, అధికారమునుగాక ప్రేమను, అసత్యమునుగాక సత్యమును, ద్వేషమునుగాక దయను, దుష్టత్వమును లేదా స్వార్ధమునుగాక న్యాయమును అనుసరిస్తుంది. మన రక్షణ కొరకు తన ప్రాణాలను సైతం అర్పించాడు. లోక పాప భారాన్ని మోసే రాజు. 

ఈనాటి రెండవ పఠన౦ - దర్శన గ్రంధము 1:5-8 క్రీస్తును ప్రేమించే రాజుగా వర్ణిస్తుంది. "ఆయన మనలను ప్రేమించు చున్నాడు" (1:5). మనకోసం ఒక రాజ్యాన్ని స్థాపించిన సర్వాధికారియైన క్రీస్తు రాజసత్వమును గూర్చి భోదిస్తుంది. ఈ రాజ్యములో క్రీస్తు మనలను దైవసేవకు అంకితము చేసియున్నాడు. "ఆయన రక్తము ద్వారా, మనలను పాప విముక్తులను చేసి (1:5), తన ప్రేమను నిరూపించుకున్నాడు. అందుకే, ఆయన సర్వాధికారమునకు పాత్రుడైనాడు. ఆయన మరల మహిమతో తిరిగి వచ్చును. ఆయన "ఆల్ఫా, ఒమేగ" (1:8).

క్రీస్తు ఈ లోకమున జీవించినప్పుడు, దైవ రాజ్యము గూర్చి భోదించాడు. "మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడు" (మ 6:33) అని తన శిష్యులతో చెప్పాడు. దేవునికి ప్రధమ స్థానాన్ని ఇవ్వాలని సూచించాడు. తన శిష్యులను సేవకులని గాక, స్నేహితులని పిలిచాడు. తన గురుత్వమును, రాజరికాన్ని వారితో పంచుకున్నాడు. రాజుగా ఈ లోకములో ఒక సేవకునిగా ప్రజల దరికి చేరాడు. తన శిష్యులను సైతం సేవకులుగా ఉండాలని ఆజ్ఞాపించాడు. ఆయన నిజమైన స్వాతంత్రాన్ని ఒసగువాడు.  ఈ విధముగా, 'రాజు'కు ఓ నూతన అర్ధాన్ని ఇచ్చాడు. ఈ లోక రాజులవలె, పాలకులవలె గాక, ఆయన ఇష్టపూర్తిగా, తన ప్రజల రక్షణార్ధమై మరణించాడు. ఆయన మరణం యుద్ధము వలన వచ్చినది కాదు. రక్షణ ప్రణాళికలో సృష్టి పూర్వమే ఏర్పాటు చేయబడినది.

క్రీస్తు మన రాజు, అందరి రాజు, సర్వాధికారము కలిగినవాడు. ఆయన మన జీవితాలకు, హృదయాలకు రాజు. ఆయన మన ఆధ్యాత్మిక రాజు. సత్యము-ప్రేమతో పాలించు రాజు. ఆయన చూపిన ప్రేమ-సేవ మార్గములో మనము కూడా పయనిద్దాం. ఇతరులకు సేవకులమై దేవుని రాజ్యాన్ని ఈ లోకములో బలపరచుదాం. మన క్రైస్తవ జీవిత విధానమును బట్టి (ప్రేమ, సేవ, క్షమాపణ, పేదవారిపట్ల సంఘీభావం) ఆయనకు లోబడి యున్నామని నిరూపించుకుందాం. లోక సంబంధమైన పాలన, పాలకులు అశాశ్వతం, కాని క్రీస్తు రాజ్యం, పాలన కలకాలం నిలుచును. సిలువ ఆయన సింహాసనం. యేసు కొండపై బోధనలు ఆయన ప్రధాన శాసనం. ఆయన ప్రేషిత కార్యం లోక రక్షణ. సకల నిర్బంధములనుండి మనలను విముక్తి గావించును. మనం సంతోషముగా, ఆనందముగా జీవించునట్లు చేయును. పరలోక రాజ్యమునకు వారసులగునట్లు చేయును! "నా తండ్రిచే దీవింప బడిన వారలారా! రెండు ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరుపబడిన రాజ్యమును చేకొనుడు" (మత్తయి 25:34). 

జీవిత పాఠాలు:

- క్రీస్తు రాజు పట్ల మన నిబద్ధతను పరిశీలించుకుందాం: క్రీస్తును రాజుగా అంగీకరించిన మనం ఆయన మాటలను ఆలకిస్తున్నామా? ఆయన చూపిన ప్రేమ-సేవ మార్గములో పయనిస్తున్నామా? క్రీస్తుతో కలిసి నడచినప్పుడే ఆయన రాజ్యమునకు చెందిన వారమవుతాము. "నా కాడిని మీ రెత్తు కొనుడు. సాధు శీలుడననియు, వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు" (మత్తయి 11:29) అన్న క్రీస్తు పిలుపుకు స్పందించుదాం. నతనయేలు వలె క్రీస్తును రాజుగా ప్రకటించుదాం (యోహాను 1:49).

- మన జీవితాలపై క్రీస్తు రాజుకు నియంత్రణ ఉండునట్లు చూడాలి: క్రీస్తు మన జీవితాలకు సర్వం కావాలి. ప్రతీ నిర్ణయములో క్రీస్తు రాజునా లేదా బరబ్బనా అని నిర్ణయం చేయాలి.

- క్రీస్తు సత్యాన్ని, వినయపూర్వకమైన సేవను అనుసరించాలి: సత్యమునకు (క్రీస్తు) సాక్ష్యము ఇవ్వవలెను. తండ్రి దేవుడు ప్రేమ కలవాడు, క్షమించువాడు. మనంకూడా ఇతరులను క్షమించాలి. పేదవారిని దయతో ఆదరించాలి. సేవాభావంతో జీవించాలి. నాయకుడు అనగా సేవకుడని గుర్తించాలి. పవిత్రాత్మతో తండ్రి క్రీస్తును అభిషేకించి యాజకునిగా, ప్రవక్తగా, రాజుగా నెలకొల్పాడు (హెబ్రీ 1:8-9). "పరిపాలించడం అంటే సేవించడం, ముఖ్యముగా నిరుపేదలకు, బాధాతప్తులకు సేవలందించడములో రాజధర్మం రాణిస్తుంది. ఈ అభాగ్యుల్లో శ్రీసభ తన స్థాపకుని పేదరికాన్ని బాధామయ రూపాన్ని కనుగొంటుంది. క్రీస్తుతో పాటు సేవలందించడం ద్వారా దైవప్రజలు తమకున్న రాజ ధర్మాన్ని నెరవేరుస్తారు" (సత్యోపదేశం 786).

- క్రీస్తు రాజ్య వారసులమైన మనం ఆయన ప్రేమ ఆజ్ఞను పాటించాలి: "దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ శక్తితోను ప్రేమింప వలెను" (మార్కు 12:30). "మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు (యోహాను 14:15). "నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు" (యోహాను 13:34). 

సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా! సమస్తము మీద రాజ్యాధికారముగల మీ ప్రియతమ పుత్రుని ద్వారా సృష్టినంతటిని పునరిద్దరించ చిత్తగించితిరి. సృష్టి అంతయు పాప దాస్యమునుండి విముక్తి చెంది, మీ వైభవ సేవకు అంకితమగునట్లును, నిత్యము మీ స్తుతిగానమందు నిమగ్నమై యుండునట్లును చేయుమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. ఆమెన్.

యేసు రాజరికం గురించిన ప్రవచనాలు: యెషయా 9:6; 11:10; యిర్మీయా 23:5; అ.కా. 2:30; యోహాను 12:15; 1 తిమోతి 6:15; దర్శన 17:14; 19:16.

దైవ రాజ్యము – మన యోగ్యత

No comments:

Post a Comment