23వ సామాన్య
ఆదివారము
యెషయ 35:4-7;
యాకోబు 2:1-5; మార్కు 7:31-37
మొదటి పఠనము:
దేవునియందు విశ్వాసము
మొదటి పఠనము యెషయ గ్రంథము నుండి వినియున్నాము. భవిష్యత్తులో, దేవుని మహిమగల శక్తివలన ఇశ్రాయేలు ప్రజల జీవితములో జగరబోయే మార్పుల గురించి యెషయ ప్రవక్త తెలియజేయు చున్నారు. ఇది ఓదార్పు, ఊరటగల ప్రవచనాలు! ఇశ్రాయేలు ప్రజలలో నమ్మకం, ఆశ కలిగించు ప్రవచనాలు! వారి రక్షణ గురించిన ప్రవచనాలు! సకల సమస్యలనుండి వారిని కాచి కాపాడతానని దేవుడు వారికి అభయాన్ని ఇస్తున్నారు. గ్రుడ్డివారు చూతురని, చెవిటి వారు విందురని, కుంటివారు నడచునని, మూగవారు మాట్లాడుదురని ప్రవచించారు. ఈ ప్రవచనం దేవుని కుమారుడైన క్రీస్తునందు నెరవేరియున్నది.
దేవుడు నమ్మక పాత్రుడు, నమ్మదగిన వాడు. తన ప్రజల పట్ల ఎంతో ఆసక్తిని చూపువాడు అని యెషయ ప్రవచనం ద్వారా తెలియుచున్నది. దేవుని దీవెనలు పొందాలంటే, ప్రజలు కూడా దేవుని వైపు మరలి, ఆయన యందు విశ్వాసము, నమ్మకం ఉంచాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి. అనేకసార్లు ఇశ్రాయేలు ప్రజలు వారి విశ్వాస విషయములో తొట్రిల్లారు. అయినను, దేవుడు వారిని విడబాయక వారి వెన్నంటే ఉన్నారు.
రెండవ పఠనము:
ఎవరిపట్ల పక్షపాతం చూపరాదు
రెండవ పఠనము అపోస్తలుడు యాకోబు వ్రాసిన లేఖనుండి వినియున్నాము. సంఘములో గొప్పవారని, పేదవారని, ఎవరిపట్ల పక్షపాతమును చూపవద్దని బోధిస్తున్నారు. లోక విషయాలను బట్టి (ధనము, అధికారము) ఎవరిని తక్కువ, ఎక్కువ చేసి చూడవద్దు. దేవుని దృష్టిలో అందరు సమానమే! లోక విషయాలకు ప్రాముఖ్యతను గాక, వ్యక్తులకు ప్రాముఖ్యతను ఇవ్వడం మనం నేర్చుకోవాలి. బాహ్యముగా చూసి వ్యక్తులను అంచనా వేయరాదు. “ఈ లోక విషయములలో పేదలగు వారిని విశ్వాసమున భాగ్యవంతులుగ ఉండుటకును, తన రాజ్యమునకు వారసులగుటకును దేవుడు ఎన్నుకొనెను” (2:5).
సువార్త
పఠనము: ఆధ్యాత్మిక అంధత్వం నుండి వెలుగునకు (సత్యము) తెరువబడాలి
నేటి సువార్త పఠనమును మార్కు
నుండి వినియున్నాము. యేసు అన్య ప్రజల ప్రాంతములో ఉన్నారు. అచట మూగ, చెవిటి వానిని యేసు
తన శక్తితో స్వస్థపరచిన విషయం వివరించ బడినది. యేసు ఆకాశము వైపు కన్నులెత్తి
ప్రార్ధించారు. అనగా తండ్రి దేవుని శక్తి సహాయం కొరకు ప్రార్ధించారు. తండ్రి
చిత్తము నెరవేరాలని ప్రార్ధించారు.
యేసు తన బహిరంగ ప్రేషిత కార్యములో అనేకమందిని స్వస్థత పరచారు. కనుక, యేసు రాకతో, యెషయ ప్రవచనం నెరవేరినది. వినుట, మాట్లాడుట దేవుని వరములు. ఈ వరములు లేని వ్యక్తిని చూసి యేసు దయను, కనికరమును చూపారు. తన వాక్కుతో (ప్రార్ధన, ఇతర పలుకులు), కార్యములతో (చెవులలో వ్రేళ్ళు పెట్టడం, ఉమ్మి నీటితో నాలుకను తాకడం) ఆ వ్యక్తిని స్వస్థత పరచి, సంపూర్ణ వ్యక్తినిగా మార్చారు.
యేసునందు విశ్వాసం ఉంచువారికి తప్పక స్వస్థత కలుగును. ఆయన తాకిడి మనకు స్వస్థతను కలుగజేసి మనలను సంపూర్ణులను చేయును. జ్ఞానస్నానం పొందినప్పుడు, మన చెవులు, పెదవులు తాకబడ్డాయి. ఈవిధముగా, మనం కూడా ఈ మూగ, చెవిటి వాని కథలో భాగస్తులం అవుచున్నాము.
ప్రభువు ఆ వ్యక్తిని స్వస్థత పరచునపుడు అరమాయిక్ భాషలో “ఎఫ్ఫతా” అని పలికారు. అనగా ‘తెరువబడును’ అని అర్ధము (మార్కు. 7:34). క్రీస్తునందు సత్యమునకు మనం తెరువ బడాలి. ఎందుకన, ఆయన సమస్తమును చక్కపరచువాడు (మార్కు. 7:37). నేడు మనం (ఈ లోకం) అనేక విషయాలలో ఆధ్యాత్మిక అంధత్వముతో, ఆధ్యాత్మిక మూగతనముతో ఉంటున్నాము. దీని వలన, సత్యమును తెలుసుకోలేక పోవుచున్నాము. దేవునితో మాట్లాడలేక పోవుచున్నాము. దేవుని వాక్యమును వినలేక పోవుచున్నాము. కనుక నిజ దేవుడైన క్రీస్తు నందు సత్యమునకు మనం తెరువబడాలి (ఎఫ్ఫతా”). అంధత్వము నుండి వెలుగులోనికి నడిపించ బడాలి.
వినుట, మాట్లాడుట వరములను పొందిన వ్యక్తి, యేసు చేసిన సంపూర్ణత గురించి ప్రచారం చేసాడు. అనగా, మనం కూడా సువార్తను మన మాటలద్వారా, చేతలద్వారా ఇతరులకు ప్రకటించాలి. దేవుని వాక్యమును ఆలకించాలి, ధ్యానించాలి.
Nice Homily, Congratulations Fr Praveen
ReplyDeleteExlent message father gaaru
ReplyDeleteGOD BLESS You
Thank you so much for the nice reflection
ReplyDeleteThank you. God bless you!
ReplyDeleteMeaning Reflection Father 🙏🙏🙏
ReplyDelete