18వ సామాన్య ఆదివారము, Year B

 18వ సామాన్య ఆదివారము, Year B
నిర్గమ. 16:2-4, 12-15; ఎఫెసీ. 4:17, 20-24; యోహాను. 6:24-35
మన ఆధ్యాత్మిక అవసరత: క్రీస్తు - నిత్య జీవాహారము

గతవారం, యేసు ఐదు రొట్టెలను, రెండు చేపలను ఐదువేల మందికి పైగా నున్న జనసమూహమునకు భోజనముగా ప్రసాదించారు. వారందరు తృప్తిగ భుజించారు. అనంతరం, ప్రభువు, తన శిష్యులు గలిలీయ సరస్సు ఆవలివైపునకు వెళ్ళారు. ఆ తరువాత జరిగిన సంఘటనలను, నేటి సువిశేష పఠనములో చదువుచున్నాము.

యేసును వెదకుచు ప్రజలు పడవలపై సరస్సు అవలివైపునకు వెళ్లి కఫర్నాములో ఆయనను కనుగొన్నారు. వారి శారీరక ఆకలిదప్పులు తీర్చినందున, ప్రజలు యేసును రాజును చేయ ప్రయత్నించారు. కాని ప్రభువు వారితో, “మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా అద్భుత చిహ్నములను చూచి కాదు” (6:26) అని, వారు యేసును మెస్సయగా అంగీకరించ లేదని, వారు కేవలం అశాశ్వతమైన భోజనముకై శ్రమిస్తున్నారని, వెదకుచున్నారని నిర్మొహమాటముగా వారితో చెప్పియున్నారు.

ప్రజలు వారి ఆలోచనలకు నిదర్శనముగా, తరువాత భాగములో, మోషే ఎట్లు ఎడారిలో ‘మన్నా’ను ప్రసాదించారో, అటులనే యేసుకూడా వారికి భోజనం ప్రసాదించాలని ఆశించారు. విశ్వసించుటకు ఎట్టి గురుతును ఇచ్చెదవని, ఏ క్రియలు చేసెదవు అని వారు యేసును  ప్రశ్నించారు. అలా చేస్తే వారు యేసును విశ్వసించెడివారు! కాని యేసు ఆశ్చర్యకరముగా వారితో, “నేనే జీవాహారమును. నా యొద్దకు వచ్చువారు ఎన్నటికిని ఆకలిగొనరు. నన్ను విశ్వసించువారు ఎన్నడును దప్పికగొనరు” (6:35) అని చెప్పారు. యేసు ఎడారిలో వారికి ప్రసాదించిన భోజనము వారి ఆత్మలకు ఒసగు ఆధ్యాత్మిక, నిత్యజీవాహారమునకు సూచనగా ఉన్నది తప్ప, అదే నిత్యజీవాహారము కాదు.

కాని ప్రజలు దానిని అర్ధం చేసుకోలేక పోయారు. ఇంకా ఎక్కువ ఆహారము కొరకు ప్రభువును వెదికారు. ఆయనను కనుగొన్నప్పుడు, “అయ్యా! ఎల్లప్పుడును ఆ ఆహారమును మాకు ఒసగుము” (యోహాను. 6:34) అని అడిగారు. అనగా, వారు కేవలము శారీరక (అశాశ్వతమైన) భోజనము కొరకు తాపత్రయ పడుతూ ప్రభువు వద్దకు వచ్చారు. అందుకే ప్రభువు వారినుండి దూరముగా వెళ్ళిపోయారు.

మనకు శారీరక, మానసిక అవసరాలతోపాటు, ఆధ్యాత్మిక అవసరాలు కూడా ఎంతో ముఖ్యము. కనుక, కేవలం శారీరక అవసరాల కొరకేగాక, ఆధ్యాత్మిక అవసరాల కొరకు కూడా మనం శ్రమించాలి, తృష్ణ కలిగి యుండాలి. “నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు” (6:27) అని ప్రభువే స్వయముగా ఆదేశించారు. అలాగే, “మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు. కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును” (మత్త. 4:4) అని ప్రభువు సైతానుతో చెప్పారు. “నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు, ఆయన పనిని పూర్తిచేయుటయు నా ఆహారము” (యోహాను. 4:34) అని కూడా యేసు పలికారు.

సమరీయ స్త్రీతో, “ఈ నీటిని త్రాగువారు ఎన్నటికిని దప్పికగొనరు, నేను ఇచ్చు నీరు, వారి యందు నిత్యజీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును” (యోహాను. 4:13-14) అని చెప్పారు. అందుకు ఆ స్త్రీ వెంటనే, ఈనాటి సువిషశములోని ప్రజలవలెనే, “అయ్యా! నేను మరల దప్పిక గొనకుండునట్లును, నీటికై ఇక్కడకు రాకుండునట్లును నాకు ఆ నీటిని ఇమ్ము” (4:15) అని అడిగింది. శారీరక (అశాశ్వతమైన) పానీయము కొరకు ఆ స్త్రీ అడిగింది. లోకాశలతో నిండినవారు ఆధ్యాత్మిక విషయాలను గ్రహించలేరు.

నేటి రెండవ పఠనములో, “అంధకారమయమగు మనస్సులు కలవారును అయిన అన్యజనులవలె మీరు ఇక ప్రవర్తింపరాదు. వారు అవివేకులును మూర్ఖులును అగుటచే దేవుని జీవితము నుండి దూరమైరి. వారికి సిగ్గులేదు. వారు దురభ్యాసములకు తమనుతాము అర్పించుకొని, అత్యాశతో విచ్చలవిడిగా అన్ని విధములైన అసహ్యకరములగు పనులను చేయుచుందురు” (ఎఫెసీ. 4:18-19) అని పౌలు విశ్వాసులకు ఉపదేశించారు. పాపమును, స్వార్ధమును వీడి నిత్యజీవము కొరకు జీవించాలని, యేసు నందు కేంద్రీకృతమై జీవితములో ఒక ధ్యేయము కలిగి జీవించాలని  పౌలు కోరుచున్నారు. 

కొంతమంది పుట్టుకతో అన్యులుగా జీవిస్తే, కొంతమంది, క్రీస్తు నందు విశ్వాసమును కోల్పోయి అన్యులుగా జీవిస్తున్నారు. “దేవుడు ఎట్టి పక్షపాతములేక అందరిని సమదృష్టితో చూచును. దేవునికి భయపడుచు, సత్రవర్తన కలవారు ఏ జాతివారైనను దేవునికి అంగీకార యోగ్యులే!” (అ.కా. 10:34-35) అని పేతురు బోధించారు.  

చాలాసార్లు పని, సంపాదనలో పడిపోయి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. దేవుని అవసరత మనకు ఎంతగానో యున్నదని మనం తెలుసుకోవాలి. మనకు అన్ని యున్నను, యేసును గనుక మనము కలిగి లేనిచో, ఏదో వెలితి మనలో ఉంటుంది. ఆధ్యాత్మికత మనలో లేనిచో, మన జీవితాలు శూన్యమే!

యేసే మన (నిత్య) జీవాహారము. ఆధ్యాత్మిక ఆహారము. వాక్కునందు క్రీస్తు మనలను పోషించుచున్నారు. అలాగే జీవాహారముగల యేసు దివ్యసత్ప్రసాదమును మనకోసం స్థాపించారు. దివ్యసత్ప్రసాదముచేత మనం ఆధ్యాత్మికముగా ప్రతీ నిత్యము పోషింపబడుచున్నాము. దివ్యసత్ప్రసాదములో ప్రభువు తన సంపూర్ణ శక్తితో మరుగైయున్నారు. దివ్యసత్ప్రసాదముద్వారా మనపై తన సంపూర్ణ ప్రేమను ప్రదర్శిస్తున్నారు. అనేకసార్లు, ఆయన ప్రేమను, కరుణను గ్రహించలేక పోవుచున్నాము. దేవుడు మన జీవితములో చేసిన మేలులకు, ఒసగిన వరములకు, మనం కృతజ్ఞులమై యుండటము లేదు.

ఈనాటి మొదటి పఠనములో విన్నట్లుగా, ఇస్రాయేలు ప్రజలవలె దేవునిపట్ల గొణుగుచూ ఉంటాము. అద్భుతరీతిన ఐగుప్తు బానిసత్వమునుండి దేవుడు వారిని రక్షించారు; ఎడారిలో ఆకలితో అలమటించుచున్న వారికి ‘మన్నా’ను కురిపించి ఆకలిని తీర్చారు; దాహముగొన్న వారికి దాహమును తీర్చారు. ఆపదలనుండి, శత్రువులనుండి వారిని కాపాడారు. అయినను, వారు దేవునిపట్ల సణిగారు. ఎందుకంటే, వారు దేవున్ని పూర్తిగా నమ్మలేదు, విశ్వసించలేదు.

ఆనాడు వారి ఆక్రందనను విని ‘మన్నా’ను కురిపించిన తండ్రి దేవుడే, నేడు “జీవాహారము”ను అయిన క్రీస్తును మనకోసం పంపించారు. మనం పొందిన ఉత్తమమైన బహుమతి జీవాహారముగల క్రీస్తు. అదే గొప్ప బహుమతిని, వరమును, అనుగ్రహమును నేడు దివ్యసత్ర్పసాదము ద్వారా స్వీకరిస్తున్నాము. దివ్యసత్ర్పసాదమును విశ్వసిస్తే, మన జీవితాలు క్రీస్తువలె రూపాంతరం చెందాలి. అనగా, మనము కూడా క్రీస్తువలె, ఇతరుల (ఆధ్యాత్మిక) ‘ఆకలిదప్పులు’ తీర్చుటకు ‘ఆహారము’గా మారాలి. మనం చేసే ప్రతీ చిన్న సహాయం ఇతరులకు ‘ఆహారము’గా మారగలదు.

No comments:

Post a Comment