ఆగమనకాల రెండవ ఆదివారము, YEAR C

ఆగమనకాల రెండవ ఆదివారము, YEAR C
బారూకు గ్రంధము 5:1-9; ఫిలిప్పీ 1:4-6, 8-11; లూకా 3:1-6

ప్రభువు మార్గములో నడచెదము

సియోను వాసులారా! వినుడు. ప్రజలను రక్షించు నిమిత్తము రక్షకుడు వచ్చును. ఆయన వచ్చి తన ఇంపైన స్వరమును మీ హృదయములకు ఆనందకరముగా వినిపింపజేయును.

ఈరోజు శ్రీసభ మనకు ఒక గొప్ప వ్యక్తిని ఆదర్శముగా చూపిస్తూ ఉంది. అతడే పునీత బప్తిస్మ యోహాను. ప్రవక్తలందరిలోకెల్ల గొప్ప ప్రవక్త, చివరి ప్రవక్త బప్తిస్మ యోహాను. దేవుని వాక్యాన్ని ఆలకించి, దానిని మనసారా స్వీకరించి, దైవ ప్రజలకు అందించడం ప్రవక్తల మొదటి కర్తవ్యం. కనుక ప్రవక్త దేవునికి ప్రజలకు మధ్యవర్తి.

అలాంటి ప్రవక్తలలో ఒకరైన యెషయా ప్రవక్త పలికిన మాటలు, బప్తిస్మ యోహాను జీవితము ద్వారా నిజమవుతూ ఉన్నాయి. "ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు" (యెషయ 40:3; లూకా 3:4) అని ప్రవక్త పలికిన ఈ మాటల ద్వారా బప్తిస్మ యోహాను దైవప్రజలను ప్రభువు మార్గములోనికి ఆహ్వానించియున్నాడు. ప్రభువు రాకకోసం మార్గమును సిద్ధము చేయాలని కోరుతున్నాడు. యోహాను ప్రభువు రాకకోసం ప్రజలను సిద్ధము చేసాడు. పశ్చాత్తాపము, జ్ఞానస్నానము అను మార్గములద్వారా ప్రజలను సిద్ధముచేసి ముందుకు నడిపించాడు. ప్రవక్తగా, ప్రభువు మార్గమును సిద్ధపరచడం, ప్రభువును అనుసరింపగోరువారికి పశ్చాతాపముగూర్చి ప్రకటించడం యోహాను పాత్ర. ప్రభువు దరికి వచ్చు వారి జీవితాలను సక్రమం చేయడం ఆయన భాద్యత.

మొదటి పఠనములో బారూకు ప్రవక్త చెప్పిన విధముగా: "ప్రతీ లోయ పూడ్చబడును. పర్వతములు, కొండలు సమము చేయబడును. వక్రమార్గములు సక్రమము చేయబడును. కరకు మార్గము నునుపు చేయబడును" (5:7; లూకా 3:5). మొదటి పఠన నేపధ్యము, ఇశ్రాయేలు ప్రజల బానిసత్వ ముగింపును, రక్షణ (మార్గము)ను, త్వరలో వారు పొందబోవు ఆనందమును ఈ వాక్యం సూచిస్తుంది. ఈవిధముగా, ప్రభువు తన ప్రజల పాపములను క్షమించి తన దయను చూపును.

క్రీస్తు రాకకొరకు మనలను మనం తయారుచేసుకొనే ఈ పవిత్ర ఆగమన కాలములో, మనలోనున్న లోయలగు చెడును తీసివేయడానికి ప్రయత్నించాలి. అలాగే, గర్వాన్ని, అహంకారాన్ని విడచి పెట్టాలి. మనం తీసుకొనే చెడు నిర్ణయాలకు స్వస్తి చెప్పాలి. మనలో ఉన్న రాతి హృదయాన్ని కరిగించమని ప్రభువును వేడుకోవాలి. పాపము మన రక్షణ మార్గమునకు ఆటంకము. రక్షణ మార్గమునకు మొదటి మెట్టు నిజమైన పశ్చాత్తాపము, పరిపూర్ణమైన ప్రేమ. రక్షణ అనేది దేవుని వరం. అయినను, మన కృషిని, సహకారాన్ని దేవుడు ఆశిస్తాడు. 'యేసు క్రీస్తునందు విశ్వాసము' మనకు రక్షణ వరము లభింప జేయును: 1). క్రీస్తు పిలుపును (మార్కు 1:17; 2:14) అందుకొని ఆయనను అనుసరిస్తూ, ఆయన ప్రేషిత కార్యములో భాగస్తులం కావాలి. 2). క్రీస్తు శ్రమలు, మరణములో పాల్గొనునట్లు చేయు ఆయన సిలువను అంగీకరించాలి (మత్తయి 16:24). అన్నింటికన్న, ఆయనను పరిపూర్ణముగా ప్రేమించాలి. 3). అన్ని విషయములలో క్రీస్తును అనుసరించాలి, అనుకరించాలి (యోహాను 12:26).

అయితే, ఇక్కడ మనం ఒక ముఖ్య విషయాన్ని గ్రహించాలి. మనం ప్రభు చెంతకు వెళ్ళటం కంటే కూడా, ఆ ప్రభువే మన చెంతకు వస్తూ ఉన్నాడు. మనం ఆయన చెంతకు వెళ్లకముందే ఆయన ఒక అడుగు ముందుకేసి మనకన్న ముందుగా మన దగ్గరకు వస్తున్నాడు. ఎందుకన, రక్షణ కార్యములో మొదటి అడుగు వేసింది ప్రభువే కదా! కనుక, క్రిస్మస్ పండుగ రోజున దేవుడే మానవ రూపాన్ని ధరించి యేసు అను వ్యక్తిగా మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ఆ గొప్ప ఘడియనే మనం క్రీస్తు జయంతిగా కొనియాడుతూ ఉన్నాము. ఒక విధముగా దేవుడే మనకు మార్గాన్ని తయారు చేస్తున్నాడు. ఆ మార్గములో మనలను నడచుకోమని, జీపించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభువు "నేనే మార్గమును, సత్యమును, జీవమును" (యోహా 14:6) అని చెప్పారు. కనుక, ప్రభువు పిలుపును గుర్తించి, గ్రహించి, అది ఒక భాద్యతగా స్వీకరించి, ప్రభువుకు సమాధానం చెప్పాలి. ఆయన మార్గములో నడవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ప్రభువు మార్గము మన మార్గాలకన్న భిన్నమైనది. ఆయన మార్గము రక్షణ మార్గము. "ప్రతీ ఒక్కరు దేవుని రక్షణమును కాంచును" (లూకా 3:6) అని సువార్తలో వినియున్నాము. కనుక, ఎవరైతే ప్రాపంచిక మార్గాలను విడిచి, ప్రభువు చూపించే మార్గములో నడుచుకొంటారో, వారు తప్పక ఆయన రక్షణములో పాలు పంచుకొంటారు.

దేవుని వాక్యము ఎడారిలో జీవించే బప్తిస్మ యోహానుగారికి వినిపించింది. మనుగడలేని ఎడారిలో ఆయన దేవుని వాక్కును వినగలిగాడు. అదేవిధముగా, మన జీవితములో కూడా కొన్ని సందర్భాలు ఎడారిగా మారుతూ ఉంటాయి. జీవితములో కష్టం వచ్చినప్పుడు, నిరాశ కలిగినప్పుడు, జీవితం అంధకారముగా కనిపించినప్పుడు, ఎటు వెళ్ళాలో దారి తెలియనప్పుడు, మన జీవితం ఎడారిలా కనిపిస్తుంది. ఒంటరివారము అవుతాము. జీవం లేనివారముగా ఉంటాము. బ్రతకాలన్న ఆశ కూడా ఉండదు. ఈ సందర్భాలన్నీ మన జీవితములో ఒక ఎడారి అనుభవాన్ని తలపిస్తాయి. కాని, మన దేవుడు, ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. ఇలాంటి సందర్భాలలోనే అనేకమంది ప్రవక్తలు దైవపిలుపును పొందియున్నారు. వారిలాగా మనము కూడా మన అంత:రంగమునుండి దేవుని వాక్యాన్ని విని, ధ్యానించినట్లయితే, మనంకూడా తప్పక ఆయన ప్రేమ పిలుపును పొందగలుగుతాము. ఆయన ప్రేమ పలుకులు మనకు జీవాన్ని ఇస్తాయి.

కష్టసమయములో ప్రవక్త ఒక నూతన సృష్టిగా మారతాడు. దేవుని వాక్కును విని, గ్రహించి తనలో ఉన్న దైవశక్తి చేత నూతన వ్యక్తిగా తయారవుతాడు. అదేవిధముగా, ఈ పవిత్ర ఆగమన కాలములో దేవుడు తన వాక్యముద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తలవలె మనం కూడా దేవుని వాక్యాన్ని విని, గ్రహించినట్లయితే, మనంకూడా నూతన వ్యక్తులుగా తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక, కష్ట సమయాలలో అధైర్యం చెందక ఉండాలి. దేవుని వాక్య సహాయముతో ఒక నూతన జీవితానికి నాంది పలుకగలుగుతాము. దేవుడు ప్రతీ రోజు నూతన జీవితానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు.

ఆగమన కాలంలో, 'ప్రభువు వస్తున్నాడు' అన్న సందేశం మన హృదయాలలో మ్రోగుతూ ఉంటుంది. ఆ సంతోషకర సందేశమే మనలను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ప్రభువు రాకతో, తన జీవితాన్ని, ప్రేమను మనతో పంచుకొంటున్నాడు. అదే సమయములో, మన జీవితాన్ని, ప్రేమను దేవునితోను, ఇతరులతోనూ పంచుకోవాలని  ఆహ్వానిస్తున్నాడు. యోహాను ప్రకటించిన 'క్రీస్తు రాకడ' కొరకు విశ్వాసముతో నిరీక్షించాలి. ప్రభువు రాకను స్వాగతించి, ఆయనకు మన హృదయాలలో స్థానం ఇవ్వాలి.

యోహానువలె మనముకూడా ఈనాడు మన సంఘములో ప్రవక్తలుగా మారాలి. ఇతరులకు మార్గచూపరులుగా ఉండాలి. ఇతరుల జీవితాలలో వెలుగును నింపాలి. ప్రభువు దరికి రావడానికి వారికి మార్గమును సిద్ధపరచాలి. దేవుని వాక్యమును బోధించాలి.

ఈ నిరీక్షణలో మరియమ్మగారిని ఆదర్శముగా తీసుకొందాం. లోకరక్షణకోసం ఆమె ఎంతగానో నిరీక్షించారు. తననుతాను సిద్ధంచేసుకున్నారు. ప్రార్ధనలు చేసారు. దేవునివాక్యం విని ధ్యానం చేసారు.  మరియతల్లి ప్రార్ధన సహాయం మనకు తోడ్పడునుగాక!

రెండవ పఠనములో మూడు అంశాలను చూడవచ్చు: 1). కృతజ్ఞత: ఫిలిప్పీ క్రైస్తవుల ఉదారస్వభావాన్నిబట్టి, తన అపోస్తోలిక కృషిలో వారు చేసిన సహాయాన్ని బట్టి, పౌలు సంతోషముతో దేవునకు కృతజ్ఞతలు తెలియజేయు చున్నాడు. వారియందు దేవుడు ప్రారంభించిన మంచి పనిని సంపూర్ణము చేయును. 2). ప్రేమయందు ఎదుగుదల: దైవప్రేమ, సోదర ప్రేమ వారిలో ఎదగాలని ఆశిస్తున్నాడు. వారి ప్రేమ వర్ధిల్లాలని పౌలు ప్రార్ధన చేయుచున్నాడు. 3). క్రీస్తు దినము: క్రీస్తు దినమున వారు కల్మషము లేనివారుగా, నిర్దోషులుగా ఉండాలని ఆశిస్తున్నాడు. అది వారి ప్రేమద్వారా సాధ్యమగును.

సర్వశక్తి వంతులును, కనికరపూరితులైన ఓ సర్వేశ్వరా! మీ కుమారునికై ఎదురేగ ఉత్సాహముతో వచ్చు మమ్ము లోక అవరోధములేవియు ఆటంకపరపకుండునుగాక. స్వర్గీయ జ్ఞాన సంపూర్ణమును, ఆయనతో నేకమగు భాగ్యమును మాకు ప్రసాదింపుడు.

No comments:

Post a Comment

Pages (150)1234 Next