Friday, November 25, 2011

ఆగమనకాల రెండవ ఆదివారము

ఆగమనకాల రెండవ ఆదివారము
యెషయ 40:1-5, 9-11; పేతురు 3:8-14; మార్కు 1:1-8

ఆగమన కాలము: రెండు భాగాలు
భాగం 1: డిశంబర్ 16 వరకు

అన్ని దైవార్చనకాలాలలో ముఖ్యముగా, సువిశేషపటనము ప్రధానకేంద్రముగా నిలుస్తూఉంటుంది. ఆగమనకాలములోని మొదటివారాల పటనాలు యెషయగ్రంథమునుండి తీసుకొనబడుతున్నాయి. విశ్వాసకన్నులతో చూసినట్లయితే, ఈ పటనాలు మెస్సయ్యరాకను గూర్చి ప్రభోదిస్తున్నాయి. అధేవిదముగా , ఇతర దైవార్చనకాలాలకు భిన్నముగా, సువిశేష పటనము వేరువేరు సువార్తలనుండి తీసుకొనబడటము గమనిస్తాము.

దాదాపు రెండువారాలపాటు యెషయగ్రంథమునుండి పటనాలను ధ్యానించినతరువాత, మెస్సయ్యరాకను గూర్చి, సిరాకు, సంఖ్యాకాండము, జెఫన్యా గ్రంధములనుండి ఆలకిస్తాము. తర్వాత, మరల యెషయగ్రంధమునకు తిరిగిరావడం జరుగుతుంది. వారాలు గడచేకొలది ప్రవక్తలు రక్షకునిరాకను గూర్చి సుస్పష్టముగా ప్రవచించడం చూస్తాము.

ఈవిధముగా, ఆగమనకాల మొదటిభాగములో, మొదటిపటనాన్ని పటించినప్పుడు, నిరీక్షణ, ఆశ, నమ్మకము, వాగ్ధానము మొదలగు అంశములగూర్చి ధ్యానిస్తూఉంటాము. సువిశేషపటనాన్ని చదువుకొన్నప్పుడు, ప్రవక్తలప్రవచనాల సంపూర్ణతను ధ్యానిస్తూఉంటాము.

భాగము 2: డిశంబరు 17 - 24

క్రిస్మస్ పండుగకుముందు 8 రోజులు, పటనాలమధ్య బాంధవ్యం మారుతుంది. సువిశేషపటనం క్రిస్మస్ వేడుకలకు తీసుకొని వస్తుంది. మత్తయి, లూకా సువార్తలలోని యేసు బాల్యవృత్తాంతాలను ధ్యానిస్తూఉంటాము. ఈదినాలలో, మొదటిపటనము హెబ్రీయుల గ్రంథమునుండి తీసుకొనబడుతుంది.

నా కంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు (మార్కు 1:7) - బప్తిస్మ యోహాను.

ఆగమనకాలము 'కాలసూచనలను' (signs of the times) గమనించేకాలము. దైవరాజ్యము మనహృదయాలలో, మనసంఘములో నెలకొనుసమయములో పొందు ఆనందము, నమ్మకము అను కాలసూచనలను గమనించాలి. ఆగమనకాలాన్ని ఒక నమ్మకము మరియు ఎదురు చూసే సమయముగా కొనియాడుటకు మన విశ్వాసమే మనలను ఆహ్వానిస్తుంది. మనకు తెలిసినవిధముగా, క్రీస్తురాకయందు న్యాయము, ప్రేమ, శాంతితో కూడిన దైవరాజ్యస్థాపన జరిగి ఈలోకాన్నే మారుస్తుంది. క్రీస్తు మానవరూపమున ఈలోకమున జన్మించి 2000 ల సం,,లు గడచి పోయాయి. ఈ కాలమంతయుకూడా మనవలోకానికి ఒక గొప్ప దైవవరం, అనుగ్రహం. ఈ సమయమంతయు, అన్నిచోట్ల, అన్నిజాతులకు, దయ, పాపక్షమాపణతోకూడిన సువార్త బోధించబడియున్నది. ఈ కాలమంతయు, పవిత్రాత్మశక్తి లోకాన్ని మారుస్తూ దైవరాజ్యస్థాపనకు మనల్ని ఆయత్తంచేస్తూ ఉండినది. ప్రతీ ఆగమనకాలము ఒక దైవవరం. దైవ రాజ్యస్థాపనకు ఆయత్తపడేకాలం. యేసునాటికాలములో, పాలస్తీనాప్రజలు యోహానుబోధలు విని సిద్ధపడ్డారో, ఈ రోజు మనముకూడా సిద్ధపడాలి: ''పరలోకరాజ్యము సమీపించినది. మీరు హృదయపరివర్తనము చెందుడు'' (మ. 3:2).

బైబిలుగ్రంధములో ఇద్దరువ్యక్తులు ప్రాధాన్యముగా ఆగమనకాలముతో అనుబంధాన్ని కలిగియున్నారు: ఒకరు మరియమ్మగారు, మరొకరు బప్తిస్మయోహానుగారు. ఇద్దరుకూడా వారివారి రీతిలో క్రీస్తురాకకై ఎదురుచూసారు. మరియమ్మ తననమ్మకాన్ని సంపూర్ణముగా దేవునిపై ఉంచి, దైవచిత్త కార్యరూపానికి ఎదురుచూసింది. ఆమె ''అవును'' అని చెప్పి ఎదురుచూసింది. దేవుడు ఆమెతో చేసినవాగ్దానములు తప్పక నెరవేర్చబడతాయని నమ్మకముకలిగి ఉన్నది. బప్తిస్మయోహానుగారు శక్తివంతముగా దైవకుమారునిరాకనుగూర్చి భోదించాడు. అతని ఎదురుచూపు, తక్షణమైన పశ్చాత్తాపము, మారుమనస్సుతో ఉన్నది. మరియమ్మది ఓర్పు, నమ్మకముతో కూడిన ఎదురుచూపు. యోహానుగారిది ఛాలెంజ్, తీర్పుతో కూడిన ఎదురుచూపు. ఈనాటి మన ధ్యానాంశం బాప్తిస్మ యోహానుగారి జీవితం, ఆయన భోధన మరియు ఆయన ఎదురుచూపు.

బప్తిస్మ యోహానుగూర్చి మనకి ఏం తెలుసు?

మెస్సయ్యమార్గమును సిద్ధపరచువాడు ఒక పెద్ద 'బుల్డోజరు' వలె వచ్చును అని యెషయప్రవచనాలలో కన్పిస్తుంది.. దేవునికొరకు ఎడారిలోనే రహదారిని ఏర్పాటు చేయగలవాడు. ''ప్రతి లోయ పూడ్చి ఎత్తుచేయుడు, ప్రతిపర్వతమును, కొండను నేలమట్టముచేయుడు. మిట్టపల్లములు సమతలముకావలెను. కరుకు తావులు నునుపుకావలెను. (యెషయా 40:4).

తిబేరియ రోములో చక్రవర్తి. పోంతు పిలాతు యూదయాలో పాలకుడు. హేరోదు అంతిపాసు గలీలయను, ఫిలిప్పు ఇతూరయా-త్రకోనితలకు, లిసాన్యా అబిలేనేకు అధిపతులు. అన్నా-కైఫాలు ప్రధానార్చకులు. లోతైన అవినీతి, పరిపాలనలోను-మతపరమైన విషయాలలోను క్రూరత్వం! ఇలాంటి పరిస్థితులలో జీవించిన వ్యక్తి బప్తిస్మయోహానుగారు. బప్తిస్మయోహానుగారి పరిచర్య అనాది క్రైస్తవులకు ఎంతోవిశేషమైనది, ప్రాముఖ్యమైనది. సువార్తలన్నియుకూడా అతనిగూర్చి చెబుతున్నాయి. 400 నిశబ్ద సం,,ల తర్వాత దేవుడు తనప్రజలతో తన నూతనప్రవక్తద్వారా మాట్లాడుతున్నాడు. మెస్సయ్యరాకనుగూర్చి ప్రవచించడానికి రాబోవు ఏలియ బప్తిస్మయోహానుగారు (మార్కు 9:13; మ 11:10-14; 17:12; లూ 1:17). ప్రభువు మార్గమును సిధ్ధమొనర్చువాడు, ఆయన త్రోవను తీర్చిదిద్దువాడు.

యోహాను జీవితం

యోహాను జననము ప్రత్యేకమైనది, అద్భుతమైనది (లూ 1:57-80). యోహాను అను నామము దేవుని చేత ఇవ్వబడినది (లూ 1:13). యోహాను అనగా 'దేవుడు దయాళుడు'. దేవునిఆగమనమును స్వీకరించుటకు, ప్రజల హృదయాలను సిద్దపరచుటకు పంపబడిన ప్రవక్త. ప్రజలు పాపమునుండి పశ్చత్తాపమునకు, అందకారమునుండి వెలుగులోనికి రావాలని భోదించాడు.

''బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణజ్ఞానము కలవాడాయెను''(లూ 2:40). యూదయాదేశపు ఎడారిలో బోధించుచూ, ప్రభువుమార్గమును సిద్ధముచేస్తూ, ఆయనత్రోవను తీర్చిదిద్దుతున్నాడని చూస్తున్నాము. (మ 3:1-12; మా 1:1-11). ఎడారి, ప్రవక్తలందరికి ప్రత్యేకమైనస్థలం. తర్ఫీదుపొందు తావు. ప్రవక్తలందరూ ఎడారిలో గడిపినవారే! మొదటిగా, ఏడారిలోనే మోషే దేవునిస్వరాన్ని విన్నాడు (ని.కా.3:1-6). ఇశ్రాయేలుప్రజలతో ఒప్పందం చేసుకొన్నది, 10 ఆజ్ఞలుపొందినది ఎడారిలోనే! ఏలియా ఎడారిలోనికి నడిపించబడ్డాడు (1 రాజులు 19:3-7). అక్కడ అతను దేవుణ్ణి కలుసుకోవడం జరిగింది(19:3 -12). ఎడారి దేవుణ్ణి కలుసుకొను స్థలముగా సూచిస్తున్నది. అందుకే యేసుప్రభువుకూడా తండ్రిదేవుణ్ణి కలుసుకొనడానికి ఎడారికి వెళ్ళాడు (మా 1:11-12). ఏలియావలె (II రా 1:8) యోహానుకూడా, ఒంటె రోమములు కంబళి ధరించి, నడుమునకు తోలుపట్టెను కట్టి, మిడతలను భుజించుచూ, పుట్టతేనేను త్రాగుతూ జీవించుచుండెను. (మ 3:4).

యోహాను భోధన

అతని భోదనలు శక్తివంతమైనది. దుస్తులను, భోజనాన్ని ఇతరులతో పంచుకోవాలని (లూ 3:11), సుంకరులు నిర్ణయించబడిన పన్నుకంటే అధికముగా తీసుకోవలదని (లూ 3:12-13), రక్షకభటులు బలాత్కారముగాకాని, అన్యాయారోపణవలనగాని, ఎవరిని కొల్లగొట్టవలదని (లూ 3:14) ముక్కుసూటిగా భోదించాడు. తన భోధ ద్వారా ప్రభువుమార్గమును సిద్ధమొనర్చాడు (మా 3:14). ఆ మార్గమే ప్రభువు ఆగమనము: ''నా కంటే శక్తివంతుడు నా వెనుక రానున్నాడు.'' (మా 1:7). అందుకే ప్రభువు యోహానుగూర్చి ఇలా చెప్పడములో అతిశయోక్తిలేదు: ''మానవులందరిలో బప్తిస్మ యోహానుకంటే అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదు'' (మ 11:11-14).

ఈ ఆగమనకాలములో యోహాను జీవితం, భోధనలనుండి మనం ఏమి నేర్చుకోవాలి?

1. పాపము/పశ్చాత్తాపము

యోహానుగారిభోధ ఉరుములాంటిది, శక్తివంతమైనది, ముక్కుసూటిగా ఉంటుంది: 'హృదయపరివర్తన చెందండి, మీ మార్గములను మార్చుకొనండి, సక్రమముగా జీవించండి' అన్నది ఆయన భోదనల సారాంశం. పశ్చాత్తాపము అనగా, ఆలోచన విధానం మార్చుకోవడం కన్న, చేసిన పాపాలకు చింతించడం కన్న, మరియు ప్రాయశ్చిత్తం చేయడంకన్నఎక్కువ. పశ్చాత్తాపము అనగా ఆలోచనలో, మనసులో, హృదయములో సంపూర్ణమైన మార్పు కలగడం. నూతన జీవితమునకు నడిపించే మార్పు. మనపాపాలకు పశ్చాత్తాపపడి సూటిగా జీవించే శక్తి మనకి ఎక్కడనుంచి వస్తుంది? ''ఇదిగో! లోకముయొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల'' (యో 1:29, 36) అని యోహాను యేసు ప్రభువును మనకి పరిచయం చేస్తున్నాడు. క్రీస్తు అనుచరులకు పాప విముక్తి సిలువనుండియే కదా!

2. నిరాశ/ఆశ

''పరలోక రాజ్యము సమీపించినది'' మెస్సయ్యరాబోవు సమయం ఆసన్నమైనది. ఇన్ని సంవత్సరాల ఆశలు, కలలు త్వరలో నేరవేరబోతున్నాయి. మెస్సయ్యరాజ్యము వినయవినమ్రతలతో కూడినది. కడపటివారు, మొదటివారగుదురు. చిన్న బిడ్డలే ఈ రాజ్యములో మొదటివారు. ఈ విషయములో, యోహానుగారే మనకు ఆదర్శం: ''నేను ఆయన పాదరక్షలు మోయుటకైనను యోగ్యుడనుకాను''(మ 3:11). అది నిజమైన వినమ్రత. మనలోనున్న పాపము, అధికారదాహం, గర్వం, స్వార్ధం, వ్యామోహం...మొ,,వి మనలోనున్న నిరాశ. దైవరాజ్యసామీప్యముతో, క్రీస్తు ఆగమనముతో మనలో నూతన జీవితానికి ఆశను కల్పిస్తున్నది.

3. అంధకారము/వెలుగు

యోహాను సువార్తలో బప్తిస్మ యోహానుగూర్చి ఇలా చదువుతున్నాం: ''దేవుడు ఒక మనుష్యుని పంపెను. అతని పేరు యోహాను. అతనిమూలమున అందరు విశ్వసించుటకు, అతడు వెలుగునకు సాక్షమీయవచ్చెను'' (1:6-7). నిజమైన ఆ వెలుగు క్రీస్తు. మనలోనున్న అంధకారం తొలగిపోవాలి. అంధకారం? ప్రతి రోజు సగం ప్రపంచం ఆకలి భాధతో నిద్రిస్తున్నది, రోగాలు, ఆత్మహత్యలు, బాల్య కార్మికం, అశ్లీలత, అపనమ్మకం, నమ్మకద్రోహం మొ,,గు,, అంధకారములో జీవిస్తున్నాం. వెలుగును పొందుటకు ఆయత్తపాడుదాం.

No comments:

Post a Comment