ఆగమనకాల మూడవ ఆదివారం, YEAR C, 16 డిశంబర్ 2012
పఠనాలు: జెఫన్యా 3:14-18, ఫిలిప్పీ 4:4-7, లూకా 3:10-18
ప్రభువునందు
మీరు ఎల్లప్పుడును ఆనందింపుడు! మరల చెప్పుచున్నాను! ప్రభువు త్వరలో విచ్చేయుచున్నాడు.
సంతసం
సంతోషంగా ఉండాలని అందరు కోరుకొంటారు
అందరు సంతోషంగా ఉండాలని కొందరు కోరుకొంటారు
తమ సంతోషం కొరకు, ఇతరుల సంతోషం కొరకు అం(కొం)దరు శ్రమిస్తారు.
ఆ సంతోషమునే ధ్యేయముగా, లక్ష్యముగా చేసుకోవాలని ఈనాటి
పఠనాలు ప్రభోదిస్తున్నాయి: మారు మనస్సు, మరో మార్గం, మంచి మార్గం, మంచి జీవితం అని
ఎడారిలో బోధిస్తున్న యోహాను యొక్క సందేశమును వినుటకు వచ్చిన వారు, యోహాను సందేశమునకు
స్పందించి, ఆ సంతోష జీవితమును పొందుటకు "మేము ఏమి చేయవలెనను" అని ప్రశ్నించారు.
ఆ ప్రశ్నను ఈనాటి ధ్యానంశముగా చేసుకొని, ఈ ప్రశ్నకు సమాధానమును సువార్తలోను మరియు మొదటి
రెండు పఠనాలలోనూ చూద్దాం!
సంతోషమునకు కారణములెన్నో ఉన్నాయి (ఉంటాయి). ఏదైనా పొందినప్పుడు, అనుకున్నది
సాధించినప్పుడు, ప్రేమగా చూసే వారి చెంత ఉన్నప్పుడు, మనలను అర్ధం చేసుకొనే వారున్నప్పుడు...
ఇలా ఎన్నో!
మొదటి పఠనములో జెఫనయ ప్రవక్త ఇస్రాయేలీయులతో "ఆనందించండి, హర్ష ద్వానము
చేయండి, నిండు హృదయముతో సంతసించండి." ఎందుకంటే, మీకు విధించబడిన తీర్పు, శిక్ష
తొలగించబడినవి. మీ శత్రువును ప్రభువు చెల్లా చెదరు చేసెను. అన్నటికంటే ముఖ్యముగా
"ప్రభువు మీ మధ్యనే ఉన్నారు." ప్రభువు మీ చెంతనే ఉన్నారు, ప్రభువు మీతో ఉన్నారు.
అందుకే భయపడకుడి. దైవ భయం (భీతి) తప్ప మీలో ఏ భయం
ఉండకూడదు. నిర్భయముగా ఉండండి. మీ చేతులను వ్రేలాడ నీయకుము, (చేతులను వ్రేలాడనీయడం
అనగా శక్తి లేక, బలము లేక పోరాడక చేస్తున్న పనిని వదిలి వేయడం). నీలో సత్తువ సన్నగిల్లినను,
నీలో(తో) ఉన్న ప్రభువు నీచేత మంచి కార్యములు జరిగిస్తాడు. నీ సంతోషమును నీ ద్వారా ఇతరులకు
సంతోషమును కలుగ జేస్తారు. చితికిన, నలిగిన, విరిగిన నీ పైనే (నా పైనే) ప్రభువు అండగా
ఉండి సంతోషమును కలుగ జేస్తారు.
అందుకే ఇశ్రాయేలు జనమా, యేరూషలేము నగరమా, సియోను కుమారి, సంతసించండి. సంతోషముగా
ఉండటానికి ఆయన కీర్తనలు పాడండి. ఆయన మీ (నా) తో, మీ(నా)లో ఉన్నారని గుర్తించండి. ఆయన
రాజుగా, అధిపతిగా, నాయకుడిగా ముందుండి మన (నా)తో ఉండి నడిపిస్తున్నాడని తెలుసుకోండి.
ఎవరులేకున్నా ఆయన ఉన్నాడని, ఉంటాడని విశ్వసించండి. సంతోషముగా ఉండటానికి ఈ ఒక్క కారణం
చాలదా?
ఇదే సంతోషాన్ని పునీత పౌలుగారు కూడా ధృఢపరుస్తున్నారు. అనుభవపూర్వకముగా
ఆయన మనకిస్తున్న సందేశమిది. క్రీస్తు సందేశమును భోధించినందుకు, ఖైదీగా ఉండి, శిక్ష
(మరణ శిక్ష) విధించబడి, ఆ శిక్ష అమలుకొరకు ఎదురు చూస్తున్న పౌలు వ్రాసిన సందేశమిది.
ఆయనలో విచారం లేదు, దు:ఖం లేదు, ఆతురత అంతకంటే లేదు. ఎందుకంటే, ఈ సమయములోనే ప్రభువు
యొక్క సన్నిధిని, సహవాసమును, ఆదరణను, ప్రేమను ఆయన అనుభవించారు. ఆ అనుభవముతో చెప్పిన
(వ్రాసిన) సందేశమే. "ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి." ఎందుకంటే,
ప్రభువుకు సాధ్యము కానిది ఏది లేదు (చూ. లూకా 1:37, యిర్మియా 32:27). ఆయన ఆధీనములో
లేని పరిస్థితి ఏదీ లేదు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ధైర్యముగా ఎదుర్కొనండి. విచారించకండి.
అది మిమ్ము, మీనుండి, దేవుని నుండి దూరం చేస్తుంది. కాబట్టి, కృతజ్ఞతతో కూడిన ప్రార్ధనతో
దేవునికి దగ్గరగా రండు. ఆయన మీ (నీ)తో ఉన్నాడని తెలుసుకోండి. అప్పుడు మీకు సమాధానం,
దేవుని శాంతి మీ హృదయములను, మనస్సులను భద్రముగా ఉంచుతుంది. ఇంతకంటే, ఇంకా ఏమి కావాలి
సంతోషముగా ఉండటానికి?
అదే మాటను బాప్తిస్మ యోహానుగారు తనదైన శైలిలో సుంకరులతోను, రక్షక భటులతోను
అంటున్నారు. వారి జీవితాలను, దానికి కావలసిన పనిని మానుకోమని యోహానుగారు చెప్పడం లేదు.
దానిని నిజాయితీగా చేయమని చెబుతున్నాడు. ఇప్పటి వరకు వీరు "ఎంత ఎక్కువ ఇతరుల నుండి
పొందితే అంత ఎక్కువ సంతోషం తమ స్వంతమవుతుందని" అనుకొన్నారు. దానికి భిన్నముగా
యోహానుగారు నిజమైన సంతోషం 'ఇవ్వడములో'ఉన్నదని బోధిస్తున్నారు. ఇప్పటి వరకు పొందాలని
(ఎక్కువ పొందాలని) తమ వారినుండి దూరమయ్యారు. ఇప్పటినుండి ఇస్తూ, తమకున్న దాన్ని ఇతరులతో
పంచుకొంటూ సంతోషాన్ని పొందండని, దేవుని ప్రత్యక్షతను (సన్నిధిని) అవసరం ఉన్న ప్రతీ
సోదరిలోను, సోదరునిలోను గుర్తించి, అనుభవించండని పిలుపునిస్తున్నాడు.
మొదటి పఠన౦ : ఆయన మీ మధ్యన ఉన్నాడు
రెండవ పఠన౦ : ఆయన నాతో (లో) ఉన్నాడు.
సువార్త పఠన౦ : అవసరం ఉన్న ప్రతి సోదరి, సోదరునిలో ఆయన నీకై ఎదురు చూస్తున్నాడు.
వెళ్ళు! ముందుకెళ్ళు! ఆయనను, ఆయన సన్నిధిని గుర్తించు!
ఇవ్వు! నీకు సాధ్యమైనంత!
అనుభవించు ఆ సంతోషమును.
అదే క్రిస్మస్ నీకూ, నాకు.
త్రిలోక అధినేతవైన ఓ సర్వేశ్వరా! ఈ ప్రజలు రక్షకుని
రాకకై ఉత్సాహముతో వేచియుండుట మీరు కాంచుచున్నారు. అట్టి ఘన రక్షణానందమును చేరుకొనను,
ఆ ఉత్సవములను ఎల్లప్పుడు గొప్ప వేడుకతో చేసికొనను, మాకు మీ కృపను ప్రసాదింపుడు.
Fr. John Antony Polisetty OFM Cap
No comments:
Post a Comment