ఆగమనకాల నాలుగవ ఆదివారము, 23 డిశంబరు 2012


ఆగమనకాల నాలుగవ ఆదివారము, 23 డిశంబరు 2012
మీకా 5:1-4, హెబ్రీ 10:5-10, లూకా 1:39-44

ఓ ఆకాశములారా! మేఘములారా! మాకు రక్షకుని స్వర్గమునుండి పంపుడు. ఓ భూతలమా! తెరచుకొని రక్షకుని పంపుము.
ఈ రోజు నాలుగవ ఆగమన ఆదివారము. ఈ వారముతో క్రిస్మస్ పండుగకు మన ఆయత్తం ముగుస్తుంది. మన ప్రార్ధనలన్నీ కూడా "ఇమ్మానుయేలు" (దేవుడు మనతో ఉన్నాడు) అను అంశముపై కేంద్రీకృతమై ఉంటాయి. ఆయన మనలో, మన శ్రమలో, మన జీవితములో ఒకనిగా, మనతో లోకాంత్యము వరకు ఉండటానికి మరియు ఆయన స్వభావాన్ని మనతో పంచుకొనడానికి ఆశించియున్నాడు. ఈనాటి పఠనాలు క్రిస్మస్ పండుగకు మనలను మరింత దగ్గరగా తీసుకొని వస్తున్నాయి. మూడు పఠనాలు, మూడు కోణాలలో ఈ పరమ రహస్యాన్ని మనకు అర్ధమయ్యేలా విశదపరుస్తున్నాయి. దేవుడు తన ప్రణాళికను, ఆయన ఎన్నుకొన్న వ్యక్తుల ద్వారా నెరవేర్చడం ద్వారా, సమస్తము ఆయనకు సాధ్యమే అన్న సత్యాన్ని మనం చూస్తున్నాము. ప్రభుని రాక, ఇంత ముందుగానే సమస్త లోకానికి తెలియజేయడమైనది.

మొదటి పఠనము మీకా గ్రంథమునుండి వింటున్నాము. మీకా ప్రవక్త యిస్రాయెలు ప్రజలకు రాబోవు గొప్ప రాజు గూర్చి ప్రవచిస్తున్నారు. బెత్లెహేము నుండి యిస్రాయెలు పాలకుడు ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములో నరులెల్లరు అతని ప్రాభవమును అంగీకరింతురు. అయితే, ఆ రాజు ఎప్పుడు వచ్చునో పరలోక తండ్రి మాత్రమే ఎరిగియున్నాడు. రక్షకుడు వచ్చినప్పుడు, సమస్త లోకానికి శాంతిని ఒసగును. దైవ ప్రజలు పాప బానిసత్వము నుండి విడుదలై స్వతంత్రులుగా జీవించెదరు.

యేసుక్రీస్తు మనలో ఒకనిగా వచ్చిన ఆ పరమ రహస్యాన్ని, క్రీస్తు తనను తానుగా అర్పించిన బలి మరియు ఆయన విధేయత వలన మాత్రమే సంపూర్ణముగా అర్ధము చేసుకోవచ్చని రెండవ పఠనము తెలియ జేస్తుంది. యేసు క్రీస్తు ఈ లోకానికి ఏమీ ఆశించక తండ్రి చిత్తాన్ని నేరవేర్చ ఆశించాడు. దేవుడు జంతు బలులను, అర్పణలను కోరలేదు. దహన బలులకు, పాప పరిహారార్ధమయిన అర్పణలకు ఇష్ట పడ లేదు. పాత బలులను అన్నింటిని తొలగించి వాని స్థానమున దేవుడు క్రీస్తు బలిని నియమించెను (హెబ్రీ 10:5-6,10). ఈ పరిశుద్ధ  కార్యానికి క్రీస్తు తనను తాను త్యజించి, తండ్రి దేవుని చిత్తానికి విధేయుడై, మన పాపపరిహారార్ధమై తనను తాను బలిగా అర్పించు కొనుటకు ఈ లోకములో జన్మించియున్నాడు. ఆయన జన్మము మనకు జీవమును, శాంతిని, సమాధానమును, స్వతంత్రమును ఒసగు చున్నది. మన జీవితము వెలుగులో ప్రకాశింప బడుచున్నది. క్రీస్తు బలి ద్వారా మనలను ఆయనలో ఐక్యము చేసి పవిత్రులనుగా చేసియున్నాడు.

"ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!"

సువిశేష పఠనము మరియమ్మ ఎలిశబెతమ్మను దర్శించిన సంఘటనను తెలియ జేస్తుంది. యేసు జనన సూచనను దూత ప్రకటించిన కొద్ది సమయములోనే మరియమ్మ ఎలిశబెతమ్మను సందర్శించింది. గబ్రియేలు దూతే ఈ సందర్శనను సూచించినది. "నీ బంధువు ఎలిశబెతమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్ళినది గదా! గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము" (లూకా 1:36). ఆ విషయము గ్రహించిన మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమై వెళ్ళినది.

మరియమ్మ పవిత్రాత్మ శక్తివలన అప్పుడే గర్భము ధరించినది. దైవ కుమారున్ని ఈ లోకానికి స్వాగతించడానికి ముందుగానే సిద్ధపడినది. దేవుడు తనకు అప్పగించిన పవిత్రమైన భాద్యతను ఆమె గుర్తించినది. తన ద్వారానే లోక రక్షకుడు ఈ లోకానికి రావలసి యున్నదని గుర్తించి, దేవుని చిత్తాన్ని అంగీకరించినది. "నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!"

మరియమ్మ జెకర్యా ఇంటిలో ప్రవేశించి  ఎలిశబెతమ్మకు వందన వచనము పలికింది. పవిత్రాత్మతో నింపబడి ఆ వందన వచనములను పలికింది. దైవ కుమారుడిని, లోక రక్షకుడిని గర్భము ధరించి నప్పటికిని, మరియమ్మ తనే స్వయముగా  ఎలిశబెతమ్మను సందర్శించినది. యేసు, ఈ లోకానికి సేవింపబడుటకుగాక, సేవ చేయడానికి వస్తున్నాడన్న విషయం స్పష్టముగా తెలుస్తుంది. సేవ ద్వారా ఈ లోకం ఆయనను ప్రభువుగా గుర్తిస్తుంది. ప్రభువు సన్నిధిలో, వందన వచనములు  ఎలిశబెతమ్మ చెవిన పడగానే, ఆమె గర్భ మందలి శిశువు (బప్తిస్మ యోహాను) గంతులు వేసెను.

క్రీస్తు మన మధ్యలో ఉన్నప్పుడు, మనలో సంతోషము, ఆనందము తప్పక ఉంటాయి. క్రీస్తు మన హృదయములో నున్నప్పుడు, జన్మించినప్పుడు, మన హృదయాలు, మనస్సులు ఆనందముతో గంతులు వేస్తాయి. ప్రభువు మనతో ఉంటె, మనకు ఆశీర్వాదము, శాంతి సమాధానాలు ఉంటాయి.

పవిత్రాత్మ వరముతో,  ఎలిశబెతమ్మ గర్భములోనున్న శిశువు గంతులు వేయడమే గాక,  ఎలిశబెతమ్మ కూడా ఎలుగెత్తి ఇలా పలికింది: "స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీ గర్భ ఫలము ఆశీర్వదింప బడెను". మరియమ్మ జీవితములో గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను, ధన్యతను పొందినది. దీనికి ముఖ్య కారణం, "ప్రభువు పల్కిన వాక్కులు నేరవేరునని మరియమ్మ విశ్వసించినది" (లూకా 1:45). మరియ ద్వారా ఈ లోకానికి వచ్చు ఆ శిశువు "యేసు" అను పేరు పొందును. మహనీయుడై, మహోన్నతుని  కుమారుడని పిలువబడును. ప్రభువైన దేవుడు, తండ్రియగు దావీదు సింహాసనమును పొందును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు (లూకా 1:31-33). గబ్రియేలు మరియమ్మతో పలికిన వాక్కులు.

ప్రభువు మనతో కూడా ఈనాడు మాట్లాడు చున్నాడు. ఆయన పలుకులు తప్పక వేరవేరుతాయని విశ్వసించుదాం. ఆ విశ్వాసము వలననే దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు. మరియమ్మ తన జీవితాంతము దేవునికి విశ్వాసపాత్రురాలుగా జీవించినది. ఆమె విశ్వాసము వలననే, దేవుని ప్రణాళికకు, చిత్తానికి  "నీ మాట చొప్పున నాకు జరుగునుగాక" అని చెప్ప గలిగినది.

మన అనుదిన జీవితములో, ప్రభువు మనలో తన ఉనికిని గ్రహించుటకు అనేక ఆనవాళ్ళను ఇస్తూ ఉంటాడు. అనేక సంఘటనల ద్వారా, వ్యక్తుల ద్వారా, తన ఉనికిని చాటుతూ ఉంటాడు. జ్ఞానస్నానములోను, భద్రమైన అభ్యంగనమున పొందిన పవిత్రాత్మ, మనం విశ్వాస కన్నులతో చూచునట్లు సహాయం చేయును. దైవ రాజ్యమును స్వీకరించుటకు సిద్ధపడునట్లు చేయును.

క్రిస్మస్ దినమున, పభువును స్వీకరించుటకు ఆయత్త పడుదాం!

ఆద్యంత రహితులైన ఓ సర్వేశ్వరా! మా మనసులను మీ కృపతో నింపుడు. ఈ విధమున మీ దూత సందేశము ద్వారా, మీ కుమారుని మనుష్యావతార వార్తనందుకొనిన మాకు ఆయన సిలువ పాటుల ఫలితమున ఆయన పునరుత్థాన మహిమలో చేరు భాగ్యము లభించును గాక!

No comments:

Post a Comment