పునీత జాన్ ఆఫ్ ఆర్క్ (30 మే)

పునీత జాన్ ఆఫ్ ఆర్క్ (30 మే)
వీర కన్య, ఫ్రాన్స్ దేశ పాలక పునీతురాలు, క్రీ. శ. 1412 – 1431

“ఫ్రాన్స్ దేశ విమోచకురాలు”గా గణుతికెక్కిన వీరకన్యామణి. క్రీ.శ. 1412 జనవరి 6న ముగ్గురు జ్ఞానుల పండుగ రోజున ఈమె జన్మించింది. ఫ్రాన్సు దేశానికి ఈశాన్య ప్రాంతంలోని మ్యూజ్నదీ తీరానగల సారవంతమైన ‘చంపాగ్నే’ మండలంలోని ‘దోమ్రేమి’ గ్రామం ఈమె జన్మస్థలం. వీరిది కేవలం ఒక వ్యవసాయక కుటుంబం. పేదరైతు జాక్వెస్ డి ఆర్క్ అయిదుగురు సంతానంలో ఈమె కడపటిది. తల్లి గొప్ప విశ్వాసురాలు. తమ చివరి బిడ్డలిద్దరికి నూలువడకడం, బట్టలుకుత్తడంలో శిక్షణ ఇప్పించారు. దైవభక్తితో పెంచారు. కాని జాన్ ఆఫ్ ఆర్క్ కు చదవడం వ్రాయడం తెలీదు.

ఈమె చిన్నతనంలో తమదేశమైన ఫ్రాన్సుకు, ఇంగ్లాండుకు పడేది కాదు. గత నూరేళ్ళుగా అడపాదడపా యుద్ధాలు జరిగుతుండేవి. దీనికితోడు ఫ్రాన్సులోని ఆర్లియనులకు బర్గండియనులకు మధ్య వైరముండి అంతర్యుద్ధాలు చెలరేగుతుండేవి. ఇదేఅదునుగా బ్రిటన్ శత్రుసైన్యాలు వీరవిహారంచేస్తూ ఒక్కొక్క ప్రాంతాన్నే హస్తగతం చేసుకుంటున్నాయి.

జాన్ కు తన 14వ యేట ఆకాశం నుండి ఒక అదృశ్యవాణి విన్పించింది. ఆమె తోటలో పనిచేస్తుండుగా మెరుపులా మధ్యనుండి వింతస్వరం పలికింది. ఆనాటినుండే ఆమె తాను దైవాంకిత బిడ్డగా ప్రవర్తిస్తూ, కన్యకగా గడుప ప్రతిజ్ఞ చేసుకుంది. మరో రెండు సంవత్సరాలు  దొర్లిపోయాయి. జాన్ కు మునుపటి అదృశ్యస్వరాలూ పదేపదే విన్పింపసాగాయి. ఎవరా అని దేవుని ప్రార్ధిస్తూ పరిశీలనగా చూసింది. ఆమెకు పునీత మిఖాయేలు, అలెగ్జాండ్రియా నగర (ఈజిప్ట్) పునీత కత్తెరేనమ్మ, పునీత మార్గరేటుగార్లు దర్శనమయ్యారు. జాన్ తరచూ ఆ పునీతుల త్రయం సందేశాలు సూచనలు తరచు వింటుండేది.

ఇలావుండగా, ఆంగ్లేయులు సైన్యులు విజ్రుంభించి దాదాపు ఫ్రాన్సులోని అత్యధిక ప్రాంతాలు ఆక్రమించాయి. ఇంటిదుస్థిలో 1428 మే నెలలో పునీత త్రయం పలుకులు ఆలించిన జాన్ దైవాదేశంగా భావించి దేశరక్షణకోసం నడుంకట్టింది. మిగిలివున్న ఒక ప్రాంతం ఫ్రాన్సు సైన్యానికి నాయకత్వం చేపట్టింది. కదనరంగానికురికింది. తాను అబల, అమాయకురాలు, అవిద్యావంతురాలైనా దేవునిపై భారంమోపి సబలగామారింది. పురుషదుస్తులు ధరించి గుర్రంపై స్వారీచేస్తూ కత్తిఝుళిపించింది. శత్రుసైన్యంలో గుబులు పుట్టించింది పునీత త్రయంప్రోత్సాహం దేవభక్తి ఆమెను ముందుకు నడిపించింది. ధైర్యసాహసాలతో వీరోచితంగా పోరాడి శత్రు సైన్యాన్ని చిత్తుగా ఓడించి తరిమి వేసింది.

ఫ్రాన్సురాజైన 7వ చార్లెస్ జాన్లోని దైవశక్తి ఏపాటిదో పరీక్షింప నెంచి మారువేషంలో రాజోద్యోగ్యులతో కలిసిపోయి వుండగా జాన్ ఆ రాజును గుర్తుపట్టి పలుకరించగా రాజు ఆశ్చర్యచకితుడై ఆమెను బహుగా ప్రశంసించాడు. మతాధికారులు కూడా ఆమెకు అండగాను, సలహాదారులు గాను ఉన్నారన్న పునీత త్రయం గూర్చి పలుమార్లు పరిశీలించారు. మరో సందర్భంలోకూడా ఆర్లియనుల నగరాన్ని శత్రుగుంపులు చుట్టుముట్టిరాగా జాన్ వారిని అవలీలగా ఓడించి విజయం సాధించింది.

క్రీ.శ. 1429 జూలై 17న ఏడవ చార్లెస్ అధికార లాంఛనాలతో ప్రజాసమక్షంలో కిరీటధారియై రాజ్యాధికారం చేపట్టిన పిమ్మట జాన్ కు ప్రత్యేక స్థానమిచ్చి గౌరవించాడు. ఆమె తన విజయ పతాకంతో సగర్వంగా నిలబడింది. ఆ జెండాపై తండ్రి దేవుని చిత్ర పటం, క్రింద యేసు మరియల నామధేయములు లిఖింపబడి ఇరువైపులా ఇరువురు దేవదూతలు మోకరిల్లి స్తుతులు అర్పిస్తున్నట్లు చిత్రీకరింపబడి దైవభక్తిని చాటుతోంది. సుందరమైన ఆకారం, పరిపుష్టమైన శరీరం, మంచి ఆరోగ్యంతో నిగనిగలాడే, నల్లని కురులు కురుచుగా కత్తిరించుకొని ఉంది. చిరుధరహాసంతో వీరదీరవనితలా చూపరులనిట్టే ఆకట్టుకుంది.

తర్వాత కాలంలోకూడా ఫ్రాన్సుపై జరిగిన పలు దండయాత్రల్లో జాన్ శత్రువులను ఎదురుకుంది. అయితే 1430 మే 23న బర్గండియనులపై జరిగిన పోరాటంలో గవర్నరు తప్పుడు అంచనాలవల్ల ఎత్తుగడల్లో పొరపాటు జరిగి దుండగులకు ఆమె దొరికిపోయింది. జాన్ ను గుర్రంపైనుండి క్రిందికి గుంజి, బంధించి ఖైదుచేశారు. ఆమె తప్పించుకునేందుకు ఎత్తైన ఒక టవరుపై ఎక్కి క్రిందికి దూకింది. కాని తప్పించుకోలేక పోయింది. అయినా అంతపైనుండి దూకి నిక్షేపంగా ఉండడమే ఒక మహా అద్భుతం అనుకున్నారు.

జాన్ ని భందించిన బర్గండీయనులను దుండగులు తమకు అధిక దానం ఇచ్చిన వారికి జాన్ ను అమ్మి వేస్తామని ప్రకటించారు. అయితే ఫ్రాన్సు రక్షణకు విశేషముగా కృషి సలిపిన జాన్ ను 7వ చార్లెస్ రాజు అంతగా పట్టించుకోలేదు. ఇదేఅదనుగా ఆంగ్లేయులు అధికమొత్తములో డబ్బు క్రుమ్మరించి 1430 నవంబర్ 21 న జాన్ ను క్రయం చేశారు. క్రిస్మస్ పండుగకు రెండు దినాలకు ముందుగా ఆమెను రౌయెన్ పట్టణ జైలుకు తరలించి ఒక బల్ల పరుపు పలకంపై గొలుసులతో కట్టి కాపలా పెట్టారు. తర్వాత 1431 ఫిబ్రవరి 21న ఆమె కోర్ట్ హాల్ లోనికి విచారణ నిమిత్తం కొని తేపడింది.

న్యాయాధిపతులు న్యాయానికి కట్టుబడక జాన్ తమ శత్రువు అనే అక్కసునే ప్రదర్శించారు. జాన్ ఒక మంత్రగత్తె, తంత్రశక్తులతో, మూడనమ్మకాలతో కుయుక్తులతో బ్రిటీష్వారిపై తలపడిందని నేరారోపణ చేశారు. ఆమెకు పునీత త్రయం ప్రోత్సాహం, దైవబలం ఉందన్న సంగతి వారి మూర్ఖపగ విద్వేషం వల్ల గ్రహించుకోలేకపోయారు. సైతాను ప్రేరణవల్ల వారి కళ్ళు పొరలు కమ్మాయి. జాన్ ను సజీవంగా మండుతున్న మంటల్లో వేసి దహనం చేయాలని తీర్పునిచ్చి తమ కసి తీర్చుకున్నారు.

తీర్పు ఇవ్వబడిన మరునాడు అనగా 1431 మే 30న బుధవారం ఉదయం 8:౦౦ గంటలకు రౌయన్ పట్టణం మార్కెట్టు ప్రదేశాన జాన్ ను దహన బలికి గురిచేశారు. కట్టెపుల్లలచితికి నిప్పంటించగానే  జాన్ కడపటి కోరిక ప్రకారం ఒక దోమినికన్ సన్యాసిని ఒక సిలువ స్వరూపమును ఆమె కండ్లకు కనబడేలా పైకి ఎత్తి పట్టుకుంది. ఎగిసి మండుతున్న మంటల్లో నుండి “యేసు!” అని జాన్ కంఠం పిలిచింది. బ్రిటీష్ రాజైన హెన్రీ కార్యదర్శి జాన్ ట్రేస్సార్ట్ కు ఈ పిలుపు స్పష్టంగా వినిపించింది. “మనం పోగొట్టుకున్నాం. ఒక పవిత్రురాలిని తగలుబెట్టాము.” అని బిగ్గరగా పలికి పరితాపము చెందాడు. ఆమె అస్థికలు సియెన్ నదీ జలల్లో కలపబడినాయి.

క్రీ.శ. 1456లో అనగా జాన్ యొక్క మరణానంతరం ఆమెయొక్క జీవితాన్ని, పునఃపరిశీలింప వలసినదిగా ఆమె కుటుంభ సభ్యులు కోరిన మీదట 3వ కలిస్తస్ పోపుగారి అనుజ్ఞ మేరకు కేసు తిరుగ తోడబడింది. తద్వారా, తప్పు తీర్పు అన్యాయపు శిక్ష విధింపబడినట్లు అంచనా వేయబడింది. జాన్ తో బాల్యంలో ఆటలు ఆడుకున్నవారు, సహగాములు, గురువులు, జాన్ కు అనుకూలంగా చెప్పారు. జాన్ పవిత్రురాలు, ప్రార్ధనాపరురాలు. అనుదినం గుడిలో కనబడుతుంది. దివ్యసంస్కారాల యెడల భక్తి విశ్వాసాలు మెండు. ఆమె వీర కన్య. పేదలు, రోగులు బాటసారుల యెడ ఎంతో ప్రేమ కనబరిచేది “ఆమె చాల మంచిది.” “ఆమె గ్రామస్తులు ఆమెను అధికంగా అభిమానిస్తారు” అని ఉద్వేంగా వాకృచ్చారు.

జాన్ పునీతుల త్రయం ఆదేశాలవల్ల ఆధ్యాత్మిక బలం పొంది సాహస కార్యాలు చేయగలిగింది అని వెల్లడైంది. నాటి క్రైస్తవ సమాజం చేసిన ఘోర తప్పిదానికి పోపుగారు విస్తుపోయారు. జాన్ “భక్తి విశ్వాసాలుగల శ్రీసభ బిడ్డ” అని వారు నమ్మారు. అప్పటికే ఫ్రాన్సులోని ఆర్లీయను ప్రజలు ప్రతీ సంవత్సరము మే నెల 8న ఆమెను కొనియాడుతూ పండుగ జరుపుకుంటారు. ఈ ఉత్సవాన్ని,1920 లో జాతీయ ఉత్సవంగా ఫ్రాన్సు గుర్తించింది. 1909లో జాన్ ధన్యతగాను, 1919లో 15వ బెనెడిక్ట్ పోపుగారిచే పునీతగాను ప్రకటింపబడింది. ఈమెను ఫ్రాన్సుదేశపు పాలక పునీతురాలిగా శ్రీసభ పేర్కొంది. యువతకుకూడా ఆమె మార్గదర్శకురాలైంది. జాన్, జోన్, జోన్నా అంటే దేవుడు వరముల ఘని, దేవుడు ఆదరించును అని అర్ధం.
ధ్యానాంశం: హృదయపూర్వకంగా ప్రతీ కార్యాన్ని అంగీకరించు. మరణానికి భయపడవద్దు. చివరకు నీవు స్వర్గానికి చేరుకుంటావు (పు. జాన్).

క్రైస్తవుల యొక్క సహాయ మాత పండుగ, 24 మే

క్రైస్తవుల యొక్క సహాయ మాత పండుగ


14వ శతాబ్దంలో జీవించిన పునీత స్వీడన్ బ్రిజీతమ్మ గారు ఒకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు, నిష్కళంక హృదయ మరియ తల్లికి ఒకమాట చెప్పగా విన్నారు. అదేమంటే “నీ యొక్క పవిత్ర నామమున ఎవరేమి అడిగినా అది నేను కృపతో ఆలకించి నెరవేరుస్తాను. వారు పాపాత్ములైనా కాని...... అయితే వారు తమ దోషమార్గాన్ని విడువ గట్టిగా తీర్మానించుకోవాలి.

క్రీ.శ.1808లో 7వ పయస్ [భక్తినాద] జగద్గురువులుగారిని నియంత అయిన నెపోలియన్ నిర్భందించి జైలులో పెట్టించాడు. అతడు దేవుడంటే నమ్మని పాషాణ హృదయుడు, తన శక్తియుక్తులే కాని దైవశక్తి సహాయం అంటూ ఏదిలేదని చెప్పే అహంభావి. అయితే ‘లీప్ జిగ్’ యుద్దం ముగిశాక నెపోలియన్ జగద్గురువులను విడుదలచేశాడు క్రీ.శ. 1814లో పోపుగారు విజయోత్సాహంతో విశ్వాసుల జయజయధ్వానాలమద్య రోమునగర పేతురు సింహాసనం తిరిగి అధిష్టించారు.

అయితే నూరవరోజు నెపోలియన్ ఆటకట్టు అయ్యింది. సంకీర్ణ సేనలు వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ను సైన్యాన్ని ఓడించి తరిమికొట్టాయి. క్రీ.శ.1815లో నెపోలియన్ పీడవిరగడై క్రైస్తవమతాధిపతులకు భయంగుప్పిటనుండి బైటపడినట్లయ్యింది.

ఈ సందర్భంగా 7వ పయస్ పోపుగారు దేవుని, తల్లి మరియాంబకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించారు. తాము చెరనుండి విడుదలైన వార్షికోత్సవం రోజున క్రైస్తవుల యొక్క సహాయమాత ఉత్సవాన్ని ప్రకటించి ఘనంగా ఆ తల్లిని కొనియాడారు.

ధ్యానాంశం: ఓ మేరీ మాతా! ప్రభువు నాకు దయచేయనెంచిన కృపావరాలన్నీ తమ పవిత్ర హస్తాల మీదుగా నొసంగ నిశ్చయించారు. కావున మిమ్మునే సకల వరప్రసాదాలతోను, కృపానుగ్రహాలతోను నింపి ఉన్నారు. (పు. ఇల్దేఫోన్స్)

పునీత కాస్కియ రీట (రీత)మ్మ (22 మే)

పునీత కాస్కియ రీట (రీత)మ్మ (22 మే)
(వితంతువు, అగస్టిన్ వారి సభ మఠవాసిని, అసాధ్యము, నిరాశ నిస్పృహ స్థితిలో ఉన్నవారికి పాలక పునీతురాలు)
క్రీ.శ. 1381 – 1457

పునీత రీట లేక రీతా గారినే మార్గరీట లేక మార్గరీత లేక మార్గరేట్ అని కూడా పిలుస్తారు. వారు ఇటలీదేశ, ఉంబ్రియ మండలం అపెన్నైస్ పర్వత శ్రేణులకు ఆనుకొని వున్న స్పోలేటో పట్టణ దాపునగల రోక్కీపోరేనా గ్రామములో క్రీ.శ. 1381లో జన్మించారు. తల్లిదండ్రులు సామాన్య వ్యవసాయదారులు. రీటాగారు నిండు దైవభక్తితో ప్రభువు పాటులను అధికంగా ధ్యానించేవారు. అందుకే క్రీస్తుకోసం ఎవ్వరు కోపము, పగ, ద్వేషం, స్వార్ధం కారణంగా, పోట్లాటలు, కొట్లాటలకు సమయం వృధాచేయరాదు అని చెప్తుండేవారు. అందుకే “యేసు క్రీస్తుని శాంతి స్థాపకురాలని” ఆమెను ఇరుగు పొరుగువారు సంభోదించేవారు. ఆమెయొక్క ప్రార్ధన, దయ, ప్రేమ, ఏకాంత వాసతత్వానికి వేనోళ్ళ పొగుడుతూ వుండేవారు.

క్రీ.శ. 1399లో రీటమ్మగారి 18వ ఏట ఆమెకాస్కియ పట్టణంలోని పునీత అగస్టీన్ గారి సభలో ప్రవేశించి కన్యాస్త్రీగా జీవించాలని ఆశించారు. కాని తల్లిదండ్రుల బలవంతంమీద పాల్ ఫెర్డినాండు అను వ్యక్తిని పెండ్లాడాల్సివచ్చింది. ఇది దైవచిత్తమని నమ్మి తల్లిదండ్రులకు విధేయించారు. అయితే ఫెర్డినాండు అసలిరంగు వివాహమైనాకగాని తెలియరాలేదు. కోపిష్టి, పోట్లాడే మనస్తత్వం, తాగుబోతు. అందువల్ల రీతమ్మగారికి చాలా మనసు కష్టమేసింది. కాని దేవుని దయవల్ల వారికి ఇద్దరు మగపిల్లలు కలిగారు. వారే రీతమ్మగారి ఓదార్పు, ఆశ. ప్రతీరోజు పూజకు వెంటబెట్టుకుని వెళ్ళేవారు.

రీతమ్మగారి విడువని ప్రార్ధనలు, పరిత్యాగ క్రియలు, పేదలు, రోగుల సందర్శన దేవుని కృపకు పాత్రురాలునిగా చేసింది. భర్తలో మార్పు కలిగి కొద్ది సంవత్సరాలలోనే గుడికి రావడంకూడా మొదలుపెట్టాడు. అయితే ఒకసారి పర్వతదారిలో పోతుండగా పాత కక్షల వల్ల ఎవరో శత్రువు ఫెర్డినాండును కత్తులతో పొడిచి హత్యచేశారు. పాపం రీతమ్మగారి దు:ఖానికి అవధులు లేవు. తన భర్తను హత్యచేసిన దుర్మార్గుడిని క్షమించి అతని మనోపరివర్తనకై దేవున్ని వేడుకున్నారు. అయితే పగబట్టిన పిల్లలు ఇద్దరు ఆ శత్రువును చంపేస్తామని ప్రతినబూనారు. తల్లి రీటాగారి మాట వినేస్థితిలో లేరు. అందుకు రీతమ్మగారు దేవున్ని ప్రార్ధించారు. తిరిగి హత్యానేరంతో తమ పిల్లలు పాపాత్ములు కాకముందే నీ రాజ్యంలోనికి పిలచుకొనండి దేవుడా! అని ఏడ్చి వేడుకున్నారు. కొద్ది నెలల్లోనే ఆ ఇద్దరి కుమారులను దేవుడు పిలుచుకున్నాడు.

వితంతువు అయిన రీతమ్మగారు ఒంటరివారు అయ్యారు. తన పూర్వపు కోరికను నెరవేర్చుకోవాలని కాస్కియా పట్టణంలోని పునీత అగస్టీన్ వారి మఠాలయంలో ప్రవేశింప ప్రయత్నించి విఫలమయ్యారు. కన్యాస్త్రీలకే ప్రవేశం అనే నిభందన వారిపట్ల అభ్యంతరం అయ్యింది. అయితే దేవుడు వారికి ఒక అద్భుతం నెరవేర్చారు. క్రీస్తు పునరుత్థాన పండుగ ముందురోజు (శనివారం) ఆమె ప్రార్ధనా సమయంలో తలుపువద్ద ఆమెకు ముగ్గురు పునీతులు దర్శనమయ్యారు, పునీత అగస్తీను, బాప్తిస్మ యోహాను, పునీత తోలంతినో నికోలస్ గార్లు ప్రత్యక్షమయ్యారు. రీతమ్మగారిని తోడుకొని పోయి కాస్కియా పట్టణములోని కన్యాస్త్రీ మఠ గుడిలో దివ్యసత్ప్రసాద పీఠం ముందు మోకరింపచేసి అదృశ్యమయ్యారు. యథాప్రకారం మఠ కన్యాస్త్రీలు ఉదయకాల ప్రార్ధనల కోసం గుడి తాళం తీసి లోనికిరాగా వారికి రీతమ్మగారు కనిపించారు. వారికి ఆశ్చర్యం వేసింది. తప్పక పరలోకపు పని అని గ్రహించారు. దేవుని చిత్తాన్ని అర్ధంచేసుకున్నారు.

రీతమ్మగారికి మఠంలో ప్రవేశం లభించింది. వారు తమ పరిశుద్ధతలో దినదిన ప్రవర్తమానమయ్యారు. నోవిషియేట్ ముగించి మఠనియమావలి ప్రకారం క్రీ.శ. 1413లో మాటపట్టు, ఉడుపులు స్వీకరించారు. మఠకన్యగా దేవున్ని స్తోత్రించారు, ఇలా ఆత్మశాంతితో 25 సంవత్సరాలు గడిపారు. అక్కడ కాన్వెంట్ గోడపై ప్రభువు శ్రమల చిత్రం కనబడుతూ వుంటుంది. అది చూసినప్పుడల్లా రీతమ్మగారు తనకు కూడా ఆ క్రీస్తు శ్రమల్లో భాగస్వామ్యం కావాలని ఆశించేవారు. ఒక రోజు ఆయమ్మ అలా తలస్తుండగా ప్రభువు శిరముపైగల ముళ్ళ కిరీటము నుండి ఒక దివ్య కాంతి కిరణం దూసుకు వచ్చి ఆమె నొసటికి తాకింది. ఆమె కనుబొమ్మపై గ్రుచ్చుకున్నట్లు అయ్యి గాయమైంది. అది అలాగే ఉండిపోయి రోజురోజుకూ కుళ్ళిపో సాగింది. ఆ భాద వర్ణనాతీతం. ఇది క్రీ.శ. 1441లో జరిగింది. అప్పటినుండి ఆయమ్మ వెలుపలకు రాకుండా తన గదిలోనే ఉంటూ 8 దీర్ఘ సంవత్సరాలు అజ్ఞాతవాసం గడిపారు. వారి ప్రధాన ఉపవాస క్రియలు ఫలితంగా ఎంతోమంది కతోలికులు అయ్యారు. ప్రొటెస్టాంటుల దుష్ప్రచారం కాస్త సన్నగిల్లింది.

ఇంతలో క్రీ.శ. 1450 జూబిలీ సంవత్సరంలో రోము నగరంలో పరిశుద్ధ  పోపుగారు సియోన  బెర్నర్దీన్ గారికి పునీత పట్టము ఒసగే ఉత్సవ తేదీ ప్రకటించారు. అప్పటికి తీర్ధ యాత్రకు వెళ్ళాలని కన్యాస్త్రీలు నిర్ణయించారు. రీతమ్మగారు కూడా ఎంతో ఆశతో ఆ యాత్రను చేయ సమ్మతి తెలిపారు. మరుక్షణమే ఆమె కంటిపై గాయం మాయం అయ్యింది. దైవాద్భుతం మఠవాసినులందరిని మరింత భక్తి పరవశుల్ని చేసింది. 64 సం,,ల రీతమ్మగారు, 90 మైళ్ళు కాలినడకన పవిత్ర రోముకు బయలుదేరారు. బవిష్యత్తులో పునీతులు అయిన మరో నలుగురు పుణ్యాత్ములుకూడా ఆ ఉత్సవమునకు హాజరయ్యారు. వారు పునీత బొలోనా కత్తెరీనమ్మ, పునీత యోహాను కపిస్త్రాను, పునీత మర్బెస్ జేమ్స్, పునీత కాడిస్డిగో గార్లు.

రీతాగారు క్రీ.శ. 1457 మే నెల 22వ తేదీన కాస్కియా మఠంలోనే అంతిమశ్వాస విడిచారు. ఆయమ్మ మధ్యవర్తిత్వాన ప్రార్ధించిన వారికి ఎనలేని అద్భుతాలు కోరికలు నెరవేర్చు, స్వస్థతలు చేకూరాయి. క్రీ.శ. 1900 జూబిలీ సంవత్సరంలో 13వ సింహరాయలు పోపుగారిచే పునీత పట్టము ఇవ్వబడింది. నిరాశా పరిస్థితిలో వేడుకోదగిన పునీతురాలిగా భక్తులు గుర్తించారు. రీతా లేక రీటా అంటే ఆణిముత్యం, రత్నం, మణి అని అర్ధం.

ధ్యానాంశం: పేదవారంగా భౌతిక అవసరాలపట్ల తక్కువ శ్రద్ధ కలిగివుంటే, మనల్ని గురించి అంతగా లక్ష్యపెట్టకుండావుంటే, ఇంద్రియ విషయాసక్తిని అదుపులో పెట్టగలం (పునీత కాస్కియా రీట).

పునీత మత్తియాసు, 14 మే

పునీత మత్తియాసు, 14 మే
(అపోస్తలుడు, వేదసాక్షి  1వ శతాబ్దం)

పునీత మత్తియాసు గురించి అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో మనం చదువుతాం. ఏసుక్రీస్తు ప్రభువు యోర్దాను నదిలో బాప్తిజం పొందిన కాలం నుండి ప్రభువు అనుచర్లలో ఒకరుగా ఉంటూ వచ్చారు.  ప్రభువునకు నమ్మక ద్రోహం చేసిన యూదా ఇస్కారియోత్ ఆత్మహత్య చేసుకోవడంతో ఏసు వారి పండ్రెండు మంది ప్రధాన శిషుల్లో ఒక ఖాళీ ఏర్పడింది. వేదవాక్యం నెరవేరునట్లుగా ఆ ఖాళీ పూరింప బడా ల్సివుంది [అ.కా. 1:20] మరో  శిష్యున్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి. అందుకోసం ఏసుప్రభువు వారి మోక్షరోహణం అనంతరం అపోస్తుల్లు ఇరువురు అనుచరుల్ని ఎంపిక చేసారు. వారిలో ఏ ఒక్కరినో అదృష్ట చీట్లు వేసి ఎన్నుకోవాలనుకున్నారు. వారిరువురిలో ఒకరు యూస్తు అను మారుపెరుగల బర్సబ్బా  అనబడిన యోసేపు మరియు మత్తియాసు [మత్తయ] గారు. అపోస్తళ్ళు ప్రభువు వారి పరిశుద్ధ నామమున ప్రార్ధించి అదృష్ట చీట్లు వేశారు. చీటి మత్తియాస్ గారి పేరట వచ్చింది. దాంతో పండ్రెండవ అపోస్తాలునిగా చేర్చుకోబడ్డారు [అ.కా. 1:23-26]. సీమోను పేతురుగారు శ్రీ సభ జగద్గురువులుకాగా మిగతా అపోస్తళ్ళందరూ పీఠాధిపతులుగా క్రీస్తువారు జీవించిన రోజుల్లో  తమ మాటలు చేతలతో అభిషేకితులైనవారే. కొంతమంది చెబుతున్న దాని ప్రకారం అపోస్తలుడైన మత్యాసుగారు యూదయా, ఇతియోపియా ప్రాంతాలలో క్రైస్తవాన్ని గురించి భోదించి, అక్కడే సిలువ వేయబడినారని తెలుస్తుంది. మరికొందరి వాదన ప్రకారం యేరుషలేం వద్ద వారు క్రూరంగా శిరచ్చేదనం గావింపబడ్డారని ప్రచారంలో ఉంది. మొత్తం మీద క్రిస్తు వారి  విశ్వాసం కోసం వేదసాక్షి మరణం పొందారని రుఢీ అవుతుంది. పునీత మత్యాసుగారిని దర్జీపనివాళ్ళు, వడ్రంగి పనివాళ్ళుకు త్రాగుడు మానే వారికి పాలక పునీతులుగా శ్రీ సభ నియమించింది. మశూచి ప్రబలినప్పుడు మత్తియాసు గారిని ప్రార్దిస్తే అది తగ్గిపోతుందని ఆనవాయి తీగా వస్తున్న సనాతన నమ్మకం. మత్యాసు అనగా ‘దేవుడిచ్చిన కానుక’ అని అర్ధం. 
ధ్యానాంశం :- నీవు నోరులేనివారి పక్షమున మాటలాడుము. నిస్సహాయుల కోపు తీసికొనుము [సామె. 31:8]

ఫాతిమా జపమాల మాత, 13 మే

ఫాతిమా జపమాల మాత, 13 మే

1917 మే 13వ తేదీ నాటికి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై మూడవ సంవత్సరం గడుస్తుంది. 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలోనే రష్యా దేశంలో బోల్షెవిక్ విప్లవం వచ్చి, లెనిన్, ట్రాటస్కీ నేతృత్వంలో కమ్యూనిస్టుల ప్రభుత్వం గద్దెనెక్కింది.ఆ సమయంలో పోర్చుగల్ దేశంలో ‘ఫాతిమా’ అనబడే ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణం వద్ద గొర్రెలు మేపుకునే లూసీ, ఫ్రాన్సిస్, జసింత అనే ముగ్గురు పిల్లలకు దేవుని తల్లి మరియమాత తొలిసారిగా ధర్శన మయ్యారు. ధఫాలుధఫాలుగా ఆరు సార్లు ప్రత్యక్షమవ్వడం విశేషం. ఆ తల్లి ఆ పిల్లల ద్వారా లోకానికి ప్రత్యేక సందేశం అందించారు.


యుద్ధం చేత ప్రపంచం చిన్నాభిన్నం అవుతుంది అని ఆమె సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మానవలు తమ ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, అనేక పనుల ద్వారా చేస్తున్న వివిధ పాపాలు, అన్యాయాలకు గాను ప్రభువు ఎంతో వ్యధ చెందుతున్నారు అని తెలియచేసారు. పాపాత్ములు మనసు మార్చుకోవాలి, చేసిన పాపాలకు దుఖ పడాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆ తల్లి తమ సందేశంలో మానవాళి శ్రేయస్సు కోరి హెచ్చరించారు. వీరిని నరకం నుండి రక్షించడమే ఆ అమ్మ ప్రత్యేక సందేశ తాత్పర్యం. యేసు నేర్పిన దేవుని ప్రేమ, సోదర ప్రేమను మానవాళి ఆచరించాలని చెప్పక చెప్పారు.

అంతే కాకుండా ప్రపంచ శాంతి కోసం సమైక్యత కోసం భక్తితో జపమాలను ప్రార్ధించమని ఆ తల్లి కోరారు. ప్రతీ రోజు ఆ జపమాలను వల్లించడం మరువరాదని మరీ మరీ కోరారు. అలాగే ప్రతీ గుర్తుకు చివరన “ఓనా యేసువా! మా పాపములను మన్నించండి. నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. ఆత్మలన్నింటిని ముఖ్యముగా మీ కృపకు అత్యవసరమైన వాటిని మోక్షమునకు తీసుకొనిపోండి”. అనే ప్రార్ధనను కూడా వల్లించమని మాత కోరారు.

1917 అక్టోబర్ 13వ తేదీ న ఆ ముగ్గురు పిల్లలకు చివరి సారిగా ప్రత్యక్షమై “నేను జపమాల మాతను. మానవాళి చేస్తున్న పాపాల కోసం ప్రాయశ్చిత్తం పొందాలని అడిగేందుకు నేను ఇచ్చటకి వచ్చాను. మనుషులు తమ పాపాలతో ఇప్పటికే ప్రభువును అనేక రకాలుగా హింసించారు.” అని తమ కడపటి దర్శనంలో దేవమాత తమ మనో వ్యధను వ్యక్తం చేశారు.

ప్రతీ శనివారము మే మాసపు అన్నీ రోజుల్లో ఆ తల్లి నేర్పిన జపమాలను ప్రత్యేకంగా చెప్పేటందుకు శ్రీసభ ఏర్పాటు చేసింది. అనుదిన సాయంత్రాలు కూడా భక్తులు జపమాల చెప్తుంటారు.

ధ్యానాంశం: గతంలో నాకు జపమాలను ప్రార్ధింప సమయం దొరికినట్లయితే, ఇప్పటకీ మారు మనస్సు పొందని వ్యక్తిని చూసేవాడిని కాదు. (పు. క్లెమెంట్)

పునీత దోమినిక్ సావియో, 6 మే

పునీత దోమినిక్ సావియో, మే
(బాలుడు, మత సాక్షి క్రీ. శ. 1842 – 1857)

దోమినిక్ సావియో  పునీత డాన్ (జాన్) బోస్కో గారి మొదటి విద్యార్ధుల్లో ఒకరు. వీరు ఉత్తర ఇటలీ లోని ‘మురియాల్డో’ ప్రాంతంలోని ‘రివా’ గ్రామం లో 1842 ఏప్రిల్ 2 న  జన్మించారు. తండ్రి చార్లెస్ సావియో, తల్లి బ్రిజిత. వీరిద్దరు భక్తి గల వారు కావడం వల్ల ఇంటి వద్ద, విచారణ గుడి వద్ద, అందించే ఆధ్యాత్మిక శిక్షణలో వృద్ధి చెందుతూ వచ్చారు. వారి ఇంటి వాతా వరణం కూడా, వీరి ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదం చేసింది. విచారణ గురువు ఫాదర్ జాన్ గారు కూడా దోమినిక్ గారు దేవుని, ప్రకృతిని, మేరీమాతను ఘాడంగా ప్రేమించేటట్లు తీర్చిదిద్దారు.

దోమినిక్ చిన్న పిల్ల వాడైనను పెందలకాడనే లేచి ప్రతీ రోజు దేవాలయానికి వెళ్ళే వాడు. చలి కాలమైన, ఎండా కాలమైన ప్రార్ధనా కాండకు, దివ్యబలి పూజకు విధిగా హాజరు అయ్యేవారు. ఆ రోజుల్లో పన్నిండు సంవత్సరాలు దాటితే కాని దివ్య సత్ప్రసాదం ఇవ్వబడేది కాదు. అయినా దోమినిక్ కోరిక మేరకు మరియు వారి భక్తి ప్రపత్తులను బట్టి వారికి తమ ఏడవ యేటనే 1849 ఏప్రిల్ 8 న ప్రధమ దివ్య సత్ప్రసాదం ఇవ్వబడింది. ఆ రోజు పవిత్రత లోను యేసుతోను నిండిన హృదయము తో తన చిన్న డైరీలో తాను ఆచరించాల్సిన నాలుగు ప్రధాన నిర్ణయాలు వ్రాసుకున్నారు. అవి, 1. వీలయినన్ని సార్లు పాప సంకీర్తనం చేయాలి. 2. అనుదినం దివ్య సత్ప్రసాదాన్ని లోకొనాలి. 3. పాపం చేయుట కన్నా మరణించడం మేలు. 4. యేసు మరియలు నా మిత్రులు.

దోమినిక్ గారికి కావలి అయిన సన్మనస్కునిపై నమ్మకం గౌరవం ఎక్కువ. చాలా దూరం ఉన్నప్పటికీ క్రమం తప్పక బడికి వెళ్లి చెప్పే పాటాలు శ్రద్ధగా వినేవాడు, నేర్చే వాడు. 1853 ఏప్రిల్ 13న దోమినిక్ గారు భద్రమైన అభ్యంగ సంస్కారాన్ని పొంది, యేసు కోసం యుద్ధ వీరుడు లా పోరాడుతానని ప్రభువుకు వాగ్దానం చేశారు. ఆ దినాల్లోనే వారు తనకు భోదిస్తున్న గురువుతో “ఆత్మల రక్షణ కోసం నేను గురువు కావాలని ఆశిస్తున్నాను. లోక రక్షణలో యేసుకు సహాయపడే జీవితం కన్నా మనోహరమైనది ఏది లేదు” అని చెప్పారు.

అదే దినాల్లో  డాన్ బోస్కో అనే గురువు దోమినిక్ గారి ఊరు వచ్చారు. వందలాది బాలురకు ఇటలీ లోనే గల టూరిన్ పట్టణంలో విద్యాభ్యాసం చేయిస్తున్న గురువుగా వారికి ఆ ప్రాంతంలో పేరుంది. దోమినిక్ గారి గురించి డాన్ బోస్కో గారికి విచారణ గురువు వివరించారు. టూరిన్ లో తన వద్ద వుండి చదువుకోవడానికి బోస్కో గారు దోమినిక్ గారికి అనుమతిని ఇచ్చారు. దోమినిక్ గారు టూరిన్ లో బోస్కో గారి పాఠశాలలో చేరారు. తన ఊరిలో మాదిరే అక్కడ కూడా తరగతి లో ఆదర్శ విద్యార్ధి గా వుండి అందరికీ ప్రీతిపాత్రుడయ్యారు.

1854 డిసెంబర్ 8న గొప్ప  పండుగ దినం. 9వ పయస్ (భక్తి నాధ) పోపు గారు కన్య మరియాంబ గారు ‘జన్మ పాపము లేక జన్మించిన మాత’ అన్న విశ్వాస సత్యాన్ని వెల్లడించారు. శ్రీ సభ ఆ రోజు ఆ పండుగను ఘనంగా కొనియాడింది. డాన్ బోస్కో గారి విద్యాలయంలో లోను గొప్ప ఉత్సవం జరుపుకున్నారు. దోమినిక్ గారు తనను మరియమాతకు పునరంకితం చేసుకొని తనను సదా పవిత్రంగా ఉండే లా కాపాడ మని ప్రార్ధించారు.

1855 తపస్సు కాలంలో ఒక ఆదివారం పూజలో బోస్కో గారు పవిత్రత గూర్చి చెప్తూ “మీలో ప్రతీ ఒక్కరూ పునీతులు కావాలి. అది దేవునికి ఎంతో ఇష్టం” అని చెప్పారు. తాను పునీతుడిని కావాలి అని దోమినిక్ గారు పదే పదే తలంచారు. ఆనాటి నుండి ముఖం వ్రేలాడేసుకుని తలదించుకుని నవ్వక మాట్లాడక, నవ్వక, దిగాలుగా ఉండసాగారు. బోస్కో గారు విషయం తెలుసుకుని “దోమినిక్! పవిత్రత అనేది ముఖం వ్రేలాడేసుకోవడంలో లేదు. అనుక్షణం ఆనందంగా చిరునవ్వుతో దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో వుంది” అని నచ్చ చెప్పారు. ఆ విధంగా దోమినిక్ గారిలో తిరిగి ఆనందం పెల్లుబికింది.

దోమినిక్ గారు తోడి పిల్లలను మంచి పాప సంకీర్తనం చేయ ప్రోత్సహించేవారు. చెడ్డ పుస్తకాలు చదివే వారికి బుద్ధి చెప్పే వారు. క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి దూరంగా వుండాలని పిల్లలకు చెప్పే వారు. ఎప్పుడూ ఎవరోఒకరికి సాయ పడే అవకాశం కోసం ఎదురు చూసేవారు. రోగులను పరామర్శించి ధైర్యం చెప్పి ఆనందపరచే వారు. దైవ దూషణ చేసే వారికి సంతృప్తి కర సమాధానం చెప్పి నోరు మూయించే వారు. ఒకసారి దివ్య సత్ప్రసాదంతో గురువు వెళ్తుండగా వర్షం పడి బురదగా వున్నా కాని మోకరిల్లి మర్యాద చూపారు. తన పక్కనున్న సైనికుడు ఒకడు అలా చేసేందుకు సిగ్గు పడుతుండగా తన చేతి రుమాలను నేలపై పరచి మోకరిల్లి గౌరవించేటట్లు చేశారు. అలాగే పోట్లాడుకుంటున్న ఇద్దరు విద్యార్ధులకు “పపరహితుడైన క్రీస్తు తనను హింసించిన వారల కోసం క్షమా భిక్ష పెడుతూ మరణించారు. కాని పాపాత్ముడనైన నేను మాత్రం పగ తీర్చుకుంటాను అని గట్టిగా పలకండి” అని చెప్పి వారిలో పరివర్తనగొని తెచ్చారు.

దోమినిక్ గారు భక్తితో దివ్య సత్ప్రసాదం లోకొనే వారు. అందుకు ముందు మరియు వెనుక కూడా చాలా సేపు జపాలు మరియు కృతజ్ఞతా ప్రార్ధనలు సలిపే వారు. తీరిక దొరికినపుడెల్లా  గుడికి వెళ్లి జపించడం చేసేవారు. “నా తోడి బాలురందరినీ దేవుని వైపు మరల్చగలిగితే నేను ఎంత ధన్యుడిని” అని బోస్కో గారితో అనేవారు. దోమినిక్ గారు తోడి విద్యార్ధులను సంఘటిత పరచి “అమలోద్భవిమాత” సంఘం ఏర్పరిచారు. నిజమైన అపోస్తలుగా ఉండేందుకు పిల్లలకు సత్యోపదేశం నేర్పించడం వారిని పూజకు తీసుకువెళ్ళడం, ప్రార్ధనలు చెప్పించడం చేసేవాళ్ళు. వారికి నీతి కథలతో క్రైస్తవ విశ్వాసం పటిష్ట పరిచే వారు. తనను గట్టిగా కొట్టినా ఒక తోడి పెద్ద విద్యార్ధిని క్షమించారు కాని ఫిర్యాదు చేసి చాడీలు చెప్పక అతనిని మార్చారు.

దోమినిక్ గారికి దూరంలో జరుగుతున్న విషయాలను తాను తెలుసుకొని చెప్పగల వరం దేవుని నుండి పొంది వున్నారు. ఒక వీధి చివర వున్న మూడంతస్తుల భవనంలో మరణావస్తలో వున్న ఒక వ్యక్తి అవసరాన్ని ఇలా తెలుసుకుని ఫాదర్ జాన్ బోస్కో గారిని తీసుకొని పోయి మారు మనస్సు పొంది దేవునితో సఖ్యతపడదలచిన ఆ వృద్ధినికి మంచి పాప సంకీర్తనం కడపటి సాంఘ్యం లభించేలా చేయగలిగారు. అలాగే మరో చోట పెద్ద బంగళాలో తీవ్రంగా జబ్బు పడి ఆందోళనతో గురువు కోసం ఎదురుచూస్తున్న ఒక స్త్రీ అవసాన కోరికను తన ఆత్మశక్తితో గ్రహించి బోస్కో గారిని తీసుకొని పోయి ఆమెకు అవస్థను ఇప్పించి స్వర్గమార్గం సుగమం చేశారు. అలాగే మూడు మైళ్ళ దూరంలో తల్లి బ్రిజిత అనారోగ్యంతో వున్న సంగతి కూడా దివ్య వరంతో తెలుసుకొని పెద్దల అనుమతితో వెళ్లి సందర్శించి రిబ్బనుతో కట్టిన దేవమాత స్వరూపాన్ని తల్లి మెడలో వేయగా ఆమె స్వస్థతనొందింది.  

టూరిన్ లో బోస్కో గారి విధ్యాలయములో విద్యార్ధిగా వున్న దశ లోనే దోమినిక్ గారు ఒక రోజు  తల నొప్పి, దగ్గుతో అస్వస్థులయ్యారు. బోస్కో గారు వారిని ఆసుపత్రి లో చేర్పించారు. కాని వారి ఆరోగ్యం రోజు రోజుకూ క్షీనింపజొచ్చింది. “నేను ఈ లోకంలో ఇక ఎంతో కాలం ఉండను. అనేక ఆత్మలను దేవుని వైపు త్రిప్పేందుకు నా భావి జీవితాన్ని అర్పించాను” అని దోమినిక్ గారు చూడ వచ్చిన మిత్రులతో మెల్లగా చెప్పారు. బోస్కో గారు దోమినిక్ గారి తండ్రిని పిలిపించి ఇంటికి పంపారు. ఆ సమయంలో దోమినిక్  గారి తండ్రిని ఇంటికి పంపారు. ఆ సమయంలో దోమినిక్ గారు తమ జ్ఞాన తండ్రి ఫాదర్ జాన్ బోస్కో గారితో “నేను పరలోకము నుండి మీకు సాయపడతాను..... మీ కోసం నా సహచరుల కోసం ప్రార్ధిస్తాను” అని చివరి సారిగా పలికారు.

ఇంటిని చేరిన దోమినిక్ గారిని చూసి తల్లి బోరున విలపించింది. తండ్రి వైద్యున్ని తీసుకొచ్చారు. డాక్టరు ఇంజక్షన్ సిద్ధం చేస్తూ “బాబూ! భయపడకు .....ఆ వైపు తిరుగు” అన్నప్పుడు దోమినిక్ గారు “డాక్టర్ గారూ!  ప్రభువు చేతులు, కాళ్ళలో చీలలతో పోలిస్తే ఈ సూది ఎంతండి!” అని నవ్వి ఊరుకున్నారు. ఎంతకూ వ్యాధి నయం గాకుండా తీవ్రం కావడంతో గురువును రప్పించి అంతిమ సంస్కారం ఇప్పించారు. దోమినిక్ గారు తన తల్లిని ఓదారుస్తూ “అమ్మా!ఆతృత ఈ లోకంలో కంటే నేను పరలోకంలో వుండడటమే అధిక లాభ దాయకం నేను పైనుండి మిమ్మల్ని గమనిస్తూ వుంటాను నా తోబుట్టువులందరినీ సంరక్షిస్తాను” అన్నారు.

1857 మర్చి 9న తన 15వ ఏట దోమినిక్ గారు “అమ్మా! నేను మోక్షానికి వెళ్తున్నాను...... ప్రభూ! నా ఆత్మ తొలిసారిగా మీ ముందు నిలిచినపుడు నా పై దయచూపండి. నేను సదా మీ మహిమను కీర్తింతును. ఆహా ఎంతటి దేదీప్య మానమైన వెలుగును చూస్తున్నాను.....” తల వాల్చిన దోమినిక్ గారి ముఖం తేజోవంతమైనది.

కొన్ని వారాల తర్వాత దోమినిక్ గారు ఒక రాత్రి తండ్రికి అగుపించి “అవును..... నేనే నాన్నా! నేను మోక్షంలో వున్నాను. నేను నిన్ను, అమ్మను, తమ్ములని, చెల్లెల్ని సంరక్షిస్తాను” అని చెప్పి అద్రుశ్యమయ్యారు. దోమినిక్ గారి మరణానంతరం వారిని ప్రార్ధించుట వల్ల ఎంతో మంది వరాలు పొందారు. అందులో గొప్పది ఏమనగా ఒక బాలుడు చనిపోయాడని డాక్టరు మరల ధ్రువ పత్రంపై సంతకం పెట్టిన తర్వాత ఆ బాలుని తల్లితండ్రులు బంధుమిత్రులు దోమినిక్ గారి మధ్యవర్తిత్వమున ప్రాణభిక్ష కోసం ప్రార్ధింపగా చనిపోయిన ఆ బాలుడు నిద్ర నుండి లేచిన వానిలా లేచాడు.

1954 జూన్ 12న, 12వ పయస్ (భక్తినాధ) పాపు గారు దోమినిక్ గారికి పునీత పట్టాన్ని ఇచ్చి గౌరవించారు. కేవలం 15 సంవత్సరాల పిల్లవాడయిన దోమినిక్ సావియోను పునీతునిగా ప్రకటించడం తనకెంతో ఆనందంగా వుందని, నేటి యువత వీరిని ఆదర్శంగా తీసుకోవాలని ఆ రోజు జగద్గురువులు నుడివారు. దోమినిక్ అనగా ప్రభువు కు సంభందించిన, దేవునకు చెందిన అని అర్ధం.

ధ్యానంశం: నేను గొప్ప కార్యాలు చేయలేను. కాని, దేవునికి అధిక మహిమ కలిగించేందుకు, అతి చిన్న కార్యాలతో పాటు, అన్నింటినీ చేయాలని ఆశిస్తున్నాను. (పు. దోమినిక్ సావియో)

పునీత చిన్న యాకోబు, పునీత ఫిలిప్పు, 3 మే

పునీత చిన్న యాకోబు, పునీత ఫిలిప్పు (3 మే)

పునీత చిన్న యాకోబు: పునీత చిన్న యాకోబు గారినే జేమ్సు అని కూడా అంటాము. అనగా యాగప్ప గారు. యాగప్ప అనగా అందమైన, భక్తి గల, విరక్తత్వము గల వ్యక్తి. వారు అల్ఫయీ కుమారుడు (అ. కా. 1:13). యేసు ప్రభువుకు శిష్యులు మరియు వరుసకు సహోదరుడు అవుతాడు. (మత్త 13: 55, మార్కు 6: 3, గల. 1: 19) చిన్న యాకోబు గారి తల్లి క్లోఫా మరియ (యో. 19: 25), కన్య మరియమ్మ అక్క చెల్లెండ్రు అవుతారని చరిత్ర తెలియచేస్తుంది. చిన్న యాకోబు గారు పవిత్ర నగరం జెరూసలేం పీఠంకు బిషపుగా సేవలు అందించారు. ప్రేమదాత్రుత్వాలకు పెట్టింది పేరుగా ఎల్లప్పుడు దేవాలయంకు వేదప్రచారంలో ఉండేవారు. యూదుల ఆచారాలంటే ఎక్కువ ఇష్టం. హేరోదు అగ్రిప్ప వేదహింసలు ప్రబలినపుడు తమ గొప్ప పదవికి న్యాయం చేయలేక పోతున్నందుకుగాను మౌనముగా రాజీనామా చేశారు. పునీత యాకోబుగారు వ్రాసిన లేఖను క్రీ.శ. 47లో వ్రాసారు. ఈ లేఖ సిరియా శ్రీసభను ఉద్దేశించి వ్రాసినట్లు అర్ధమౌతుంది. ఎందుకంటే, దైవ ప్రేమ, సహోదరప్రేమ పునాదిపై గల క్రైస్తవవేదం అనుసరించడం వల్ల సమాజంలో తాము తక్కువగా చూడబడడం, అనగద్రొక్కబడడం అనుభవిస్తున్న క్రొత్త విశ్వాసుల కోసం వారిని ప్రోత్సహిస్తూ ఈ లేఖ వ్రాసారు. బట్టలు ఉతికే వారల సంఘం వారు ఆగ్రహంతో విరుచుకు పడి చిన్న యాకోబు గారిని దేవాలయంకు వున్న పిట్ట గోడపై నుండి బలంగా విసిరివేసి కొట్టి చంపారు. వారు క్రీ.శ. 62 లో వేదసాక్షి మరణం పొందారు. వీరు డ్రగ్గిస్టులు, చాకలి వృత్తివారు, దొర టోపీ తయారీ దార్ల పాలక పునీతులు.

ధ్యానంశం: కేవలము వినుటయేనని ఆత్మ వంచన చేసికొనకుడు. దానిని ఆచరింపుడు. (యాకోబు. 1: 22)

అపోస్తలుడైన పునీత ఫిలిప్పు: (వేదసాక్షి క్రీ.శ. – 80): గేన్నేసరేతు సరస్సుకు వొడ్డునగల బెత్సయిదాపుర నివాసి ఈ ఫిలిప్పు గారు. యేసుక్రీస్తు ప్రభుని 12మంది తొలి అపోస్తులలో ఒకరు. అప్పటికి వారికి వివాహమైంది. ఎప్పటినుండో వేద ప్రవచనం చొప్పున ఎదురు చూస్తున్న మెస్సియ కంటికగుపించి శిష్యుడుగా చేరిన వెంటనే, తన ఈ ఆనందాన్ని, పంచుకోవడానికి తన ఆప్తమిత్రుడైన నతనయేలు వద్దకు వెళ్లి “మోషే ధర్మశాస్త్రమందును, ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వానిని మేము కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడును, నజరేతు నివాసియును అగు యేసు” అని చెప్పారు. “నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా? అని నతనయేలు ప్రశ్నింపగా “వచ్చి చూడుము” అని జవాబుచెప్పింది ఫిలిప్పుగారే (యో 1:45,46) నతనయేలు (బర్తలోమియో) కూడా ఫిలిప్పు గారితో పాటు వెళ్లి యేసు నాధుని శిష్యులవడం మనకు తెలుసు. తియోడోరేత్ మరియు ఎవుసేబియస్ గార్లు గట్టిగా చెప్పేదేమంటే పెంతెకోస్తు దినాన పవిత్రాత్మను స్వీకరించిన పిమ్మట ఫిలిప్పుగారు ఆసియా మైనరు (టర్కీ) ప్రాంతంలో సువార్తా ప్రచారం చేసి, ప్రిగియా ప్రాంతంలోని హీరాపోలిస్ ఊరిలో సిలువలో బహుశా క్రీ.శ. 80లో కొట్టబడి చంపబడ్డారు. రొట్టెలు ఫిలిప్పు అనగా అశ్వప్రియుడు, గుర్రముల అభిమాని అని అర్ధం.
ధ్యానంశం: నమ్మదగిన స్నేహితుడు సురక్షితమైన కోట వంటి వాడు. అట్టి వాడు దొరికినచో నిధి దొరికినట్లే. (సిరా 6:14).