క్రిస్మస్ సందేశము
కొన్ని సంవత్సరముల క్రితం ఒక క్రిస్మస్ రోజున, చిన్న పిల్లలతో మాట్లాడుతుండగా, వారిని ఒక ప్రశ్న అడిగాను, ‘క్రిస్మస్ రోజున మీరు పొందేటటువంటి బహుమతులలో మీరు ఏ బహుమతిని పొందాలని అనుకుంటున్నారు?’ పిల్లలు అందరూ కూడా అనేక రకాలైనటువంటి సమాధానమును ఇచ్చి ఉన్నారు. అయితే వారిలో ఒక అమ్మాయి నేను ‘యేసు’ ని బహుమతిగా పొందాలని అనుకుంటున్నాను’ అని సమాధానం ఇచ్చింది. నిజమే కదా! క్రిస్మస్ రోజున యేసు ప్రభువు కంటే గొప్ప బహుమతి, బహుమానం, అనుగ్రహం, దేవుని వరం ఏముంటుంది? వారిని మరో ప్రశ్న అడిగాను, ‘ఈ లోకానికి ఏ బహుమతి కావాలి అంటే మీరు ఏమి కోరుకుంటారు?’ మరలా అనేక సమాధానాలు వచ్చాయి. అయితే అదే అమ్మాయి, ‘ఈ లోకానికి శాంతి కావాలని కోరుకుంటాను’ అని చెప్పింది.
ఈరోజు మనం యేసు జన్మ దినమును కొనియాడుచున్నాము. ఇది దేవుని యొక్క ప్రేమకు నిదర్శనం. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనే దానికి ఒక గొప్ప సాక్ష్యం, నిదర్శనం. కనుక, ఆ దివ్య బాల యేసు మన హృదయాలలో, మన కుటుంబాలలో, మన సంఘములో, ఒక గొప్ప బహుమానంగా జన్మించాలని ఆశిద్దాం. అలాగే లోక రక్షకుడైన యేసు శాంతి స్థాపకుడు కనుక, ఈ లోకంలో శాంతి నెలకొనాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాం! ప్రభువు శాంతి ఈ లోకంలో నెలకొనాలంటే నీవు నేను మనమందరం కూడా శాంతి స్థాపకులుగా, శాంతిని బోధించే సందేశకులుగా మారాలి.
మనం ఎప్పుడైతే యేసు ప్రభువును అనుసరిస్తామో, ఆయన బోధనలను పాటిస్తామో, ప్రభువు శాంతి మనదవుతుంది. మనం ఎప్పుడైతే మన తల్లిదండ్రులను గౌరవిస్తామో, వారిపై దయ, కనికరము కలిగి జీవిస్తామో, మన తోటి సహోదరీ సహోదరులను గౌరవిస్తామో, ప్రేమిస్తామో, అప్పుడు ప్రభువు శాంతి మన కుటుంబంలో భాగమవుతుంది.
ఈ క్రిస్మస్ రోజున మనము చిన్నపిల్లల వలే ఉండాలని ప్రభువు మనల్ని కోరుతున్నాడు. చిన్న బిడ్డల విశ్వాసాన్ని మనము కలిగి జీవించాలి. ఆ విశ్వాసమే నిజమైన శక్తి గల క్రిస్మస్ అంటే ఏమిటో మనకు తెలియజేస్తుంది.
క్రిస్మస్ అనగా ‘ఇమ్మానుయేలు’, దేవుడు మనతో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అంధకారాన్ని పటాపంచలు చేసి నూతన వెలుగును ఇచ్చుటకు ప్రభువు మనతో ఉన్నాడు. మనము ఇక భయపడవలసిన అవసరం లేదు. విచ్చిన్నమైనటువంటి మన బంధాలను, కుటుంబాలను, సంఘాలను, దేశాలను, ఏకం చేయడానికి ప్రభువు మనతో ఉన్నాడు. మనలను ఐక్యం చేయుటకు ప్రభువు మనతో ఉన్నాడు. మనము ప్రశాంతముగా జీవించుటకు ఆయన మనకు సహాయము చేయును. మన పాపములలోనూ, మన బలహీనతలలోనూ, మనలను క్షమించుటకు, మనలను ప్రేమించుటకు, మనలను ఒక నూతన సృష్టిగా తయారు చేయుటకు, ప్రభువు మనతో ఉన్నాడు. మన ఒంటరితనంలోను, మన కష్టాలలోను, బాధలోనూ, మనలను ఓదార్చుటకు ప్రభువు మనతో ఉన్నాడు.
గతంలో ఎంతో మంది దేవుని కోసం వెదకి ఉన్నారు. దేవుని చేరుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఉన్నారు. కానీ క్రిస్మస్ రోజున, దేవుడే మన మధ్యన జన్మిస్తూ ఉన్నాడు. దేవుడు మానవుడై మన మధ్యలో ఉంటున్నాడు. అదే నిజమైన క్రిస్మస్ కు అర్థం.
ప్రభువు మనతో ఉండాలి అంటే, మనము ప్రభువు పట్ల విశ్వాసముగా జీవించాలి. మరియ జోజప్ప గారి వలె మంచి కుటుంబ జీవితం జీవించాలి. ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవించాలి. దేవుని పట్ల మరియ తల్లి చూపించిన వినయ విధేయతలను బట్టియే, ఆమె జీవించిన విశ్వాసమును బట్టియే, ఆమె ధన్యురాలు అయ్యింది.
ప్రభువు మనతో ఉండాలి అంటే దేవునికి మనము ప్రత్యుత్తరము ఇవ్వాలి. దేవుని యొక్క సందేశము గబ్రియేలు దూత ద్వారా అందించినప్పుడు మరియ తల్లి ‘ఇదిగో నేను నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక’ అని జవాబు ఇచ్చింది.
ప్రభువు మనతో ఉండాలి అంటే మనము దేవుని స్వరాన్ని వినగలగాలి. మరియమ్మ దేవుని స్వరమును విని దేవుని యొక్క చిత్తానికి, ప్రణాళికకు తలవొగ్గింది. దేవుని తనలో మోసింది. 9 నెలలు గడిచిన తర్వాత ఆ లోక రక్షకుడు ఆమె గర్భమున జన్మించి ఉన్నాడు. ఆ సమయములో ఆ దివ్య బాల యేసు స్వరమును విన్నది కేవలము ఇద్దరు మాత్రమే, ఒకరు గొల్లలు, మరొకరు జ్ఞానులు.
మనము దేవుని స్వరాన్ని వింటున్నామా? మనలను రక్షించుటకు దివి నుండి భువికి దిగి వచ్చిన ప్రభువును మనము విశ్వసిస్తున్నామా? “ఆయన తన వారి యొద్దకు వచ్చెను. కాని, తన వారె ఆయనను స్వీకరించలేదు” (యో 1:11). కనుక ప్రభువు మనతో ఉండాలి అంటే మనము ప్రభువును స్వీకరించాలి. మన హృదయాలను తెరవాలి. మరియ ప్రసవించుటకు ఎక్కడా చోటు లేదు అని అందరూ అన్నారు. మరి ప్రభువును స్వీకరించుటకు నీ సమయాన్ని, నీ చోటును కేటాయించుటకు నీవు సిద్ధముగా ఉన్నావా?
క్రిస్మస్ ఈ రోజు నాకు ఏలాంటి అర్థాన్నిస్తుంది, అని మనమందరము వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాలి. రెండువేల సంవత్సరముల క్రితం జరిగిన క్రిస్మస్ ఈరోజు నాకు ఎలాంటి అర్థాన్ని ఇస్తుంది?
ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రిస్మస్ ద్వారా దేవుని దయ నాపై దిగి వస్తుంది. ఈ దయ నాకు దేవునికి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గిస్తుంది. నా పాపానికి పరిహారంగా తన ప్రాణమును, తన రక్తాన్ని వెలగా చెల్లించుటకు దేవుని దయ దిగివస్తుంది.
మనం ఇచ్చట ఎందుకు సమావేశమై ఉన్నామో కూడా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడే నిజమైన క్రిస్మస్ యొక్క అర్థాన్ని మనము తెలుసుకోగలం.
క్రిస్మస్ అంటేనే ఎంతో హడావిడి. చివరి క్షణం వరకు కూడా అలంకరణలు చేస్తూ ఉంటాము. షాపింగ్ చేస్తుంటాము. ఇంటిని, దేవాలయాన్ని శుభ్రపరుస్తూ ఉంటాము. క్రిస్మస్ కేకులు, బహుమతులు పంచుతూ ఉంటాము. వీటితోపాటు అలసట, ఒత్తిడికి కూడా లోనవుతూ ఉంటాము. కనుక మన ఆలోచనల ఉరుకులు పరుగులను నెమ్మదించవలసినటు వంటి సమయం. క్రిస్మస్ అంటే కేవలము ఉరుకులు పరుగులు, అలంకరణలు, ఆచారాలు మాత్రమే కాదు. మనం ఇక్కడ సమావేశమైనది ఇతరులను చూడటానికి లేకపోతే ఇతరులు మనలను చూడటానికి కాదు. మనకు ఇష్టమైన క్రిస్మస్ పాటలను పడుకోవడానికి కాదు. మన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కూర్చోవడానికి కాదు. లేకపోతే, ఒక మంచి ప్రసంగాన్ని వినాలని కాదు.
కాని, దేవుడు మన కోసం తన సింహాసనాన్ని వదిలిపెట్టి మనలో ఒకనిగా జన్మించిన ఆ రాత్రిని గుర్తు చేసుకోవడానికి. మనకోసం జన్మించిన దివ్య బాలయేసును ఆరాధించటానికి మనం ఇచట సమావేశమై ఉన్నాము. ఈ బాలుడు మనకు రక్షణ మార్గమును చూపించి యుండుట వలన, తన జీవితాన్నే మనకోసం అర్పించుట వలన మనం ఇక్కడ సమావేశమై ఉన్నాము. క్రిస్మస్ అనగా దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, మనందరికీ ఒక ఆశను, ఒక గొప్ప నమ్మకమును మనకు కలిగిస్తున్నాడు. అందుకే, మనం ఇక్కడ సమావేశమై ఉన్నాము.
క్రీస్తు అను ఒక గొప్ప బహుమానము ఈ రోజు మనందరికీ ఇవ్వబడి ఉంది, కనుక, మనము ఇక్కడ సమావేశమై ఉన్నాము. అందుకే మనము పాటలు పాడుతూ ఉన్నాము, అలంకరణలు చేస్తున్నాము, బహుమతులు పంచుకుంటూ ఉన్నాము. దీనిని మనము ఎల్లప్పుడూ మరువరాదు.
రెండు వేల సంవత్సరముల క్రితం బెత్లెహేములో ప్రభువు జన్మించినప్పటికిని, ఈరోజు, ప్రభువు, నా విశ్వాసమును బట్టి, నా హృదయంలో జన్మించక పోయినట్లయితే నాకు ఎలాంటి ఉపయోగం లేదు.
కనుక, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మన హృదయాలలో జన్మించాలి. అప్పుడే అది మనకు నిజమైన క్రిస్మస్ అవుతుంది.
లోక రక్షకుడు మీ హృదయాలలో జన్మించాలని, మీ జీవితాలు రక్షణ మార్గము వైపు నడిపింప బడాలని, ప్రార్థిస్తున్నాను. మీరు దేవుని యొక్క స్వరమును ఆలకించి, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం జీవించాలని ఆశిస్తున్నాను.
అందరికీ నా హృదయపూర్వక యేసు క్రీస్తు రక్షకుని జన్మదిన శుభాకాంక్షలు!
No comments:
Post a Comment