క్రిస్మస్

 క్రిస్మస్



నిశిరాత్రి నిశ్శబ్ధములో జగమంతా నిద్రించువేళ
అర్దరాత్రి అంబరవీదినుండి అమరులు
ఓ జనమా! మేల్కొనండి, రాజాధిరాజు జనియించె
వేగమే విచ్చేసి సాష్టాంగపడి భక్తితో ప్రణమిల్లుడు

వజ్రవైడూర్యాలు, విలువైన రాజవస్త్రాలు, బంగారం, వెండి, సాంబ్రాణి
ఆయనకు అర్పించడానికి లేదని చింతించకండి
దేవదూతలతో కలిసి, 'మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ
భూలోకములో మంచి మనసుగల వారికి సమాధానము కలుగునుగాక' అని పాడండి

సూర్యుడిని చూసి కమలం వికసించే విధముగా
మేఘమును చూసి నెమలి నాట్యం చేసే తీరుగా
తల్లిని చూసి బిడ్డ మైమరచే తీరుగా
చంద్రుడిని చూసి కలువ నవ్వే విధముగా
ఆనందించండి, మహానందించండి. ఎందుకన, మన రక్షకుడు
మన హృదయాలలో జన్మించాడు.

ఇది ఒక అనూహ్యమైన సంఘటన! చరిత్రలో ఎన్నడు కనీవిని ఎరుగని సంఘటన! అదే క్రీస్తు జననం. దేవుడు, మానవుడిగా జన్మించడం. కన్యయైన మరియ గర్భమున 'దేవుని కుమారుడు' ఈ భువిలో జన్మించాడు.

పూర్వము ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు క్రీస్తు జన్మముతో నెరవేరాయి: "ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కని, అతనికి 'ఇమ్మానువేలు' అని పేరు పెట్టును" (యెషయ 7:14). "మనకొక శిశువు జన్మించెను. మనము ఒక కుమారుని బడసితిమి. అతని రాజ్యమున సదా శాంతి నెలకొనును" (యెషయ 9:6-7). "మీరు సియోను కుమారితో ఇట్లు నుడువుడు. ప్రభువు నిన్ను రక్షింప వచ్చుచున్నాడు" (యెషయ 62:11).

క్రిస్మస్ పండుగ రోజు అందరికి సంతోషకరమైన రోజు. ప్రతి సంవత్సరము వచ్చేదే అయినా, ప్రతీసారి ఎదో కొత్తదనం, ఎదో కొత్త అనుభూతి. క్రిస్మస్ అందరి పండుగ. ఎందుకంటే, క్రీస్తు అందరికోసం జన్మించాడు. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారున్ని ప్రసాదించెను" (యోహాను. 3:16). క్రిస్మస్ రోజు మేళతాళాలు, బాణసంచాలు, ఆటపాటలు, విన్దులుం, వినోదాలు ఆనందిస్తూ అసలు పండుగను, దాని అర్ధాన్ని మరచిపోయే ప్రమాదం ఉన్నది.

'క్రిస్మస్'కు నిజమైన అర్ధం ఏమిటి? యోహాను 1:14లో చక్కగా చెప్పబడినది: "ఆదిలో వాక్కు ఉండెను. ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను. ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు మానవుడై మనమధ్య నివసించెను." పరలోకం, భూలోకం కలుసుకున్న వేళ! దేవుడు మానవుడిగా మనమధ్య జన్మించిన వేళ - క్రిస్మస్, క్రీస్తు జయంతి! ప్రభువు వచ్చేది మానవులను రక్షించడానికేనని యెషయ చెప్పిన ప్రవచనాలు కార్యరూపం దాల్చినరోజే క్రిస్మస్! దేవుడు ప్రేమస్వరూపుడు. ఆప్రేమే క్రీస్తు రూపములో మనమధ్య జన్మించినది. అందుకే, క్రిస్మస్ ఓ ప్రేమ పండుగ, ప్రేమ జన్మించిన రోజు!

క్రీస్తు ఎందుకు ఈ లోకములో జన్మించాడు? 

1. తన ప్రజలను రక్షించుకోవడానికి - యోహాను. 3:17, "దేవుడు తన కుమారున్ని లోకమును రక్షించుటకు పంపెనే కాని, దానిని ఖండించుటకు పంపలేదు." 

2. పాపపు ఊబిలో కొట్టుమిట్టాడుతున్న తన ప్రజలను పాపము నుండి విముక్తులుగా చేయడానికి - 1 యోహా. 4:10, "దేవుడు మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగ తన కుమారుని పంపెను." మంచిగా ఉన్నప్పుడు అందరు ప్రేమిస్తారు. కాని, పాపములోనున్న లోకాన్ని ప్రేమించడం దేవునికి మాత్రమే సాధ్యమైనది.

3. తన సమస్తాన్ని మానవునికి ఇవ్వడానికి - 2 పేతు. 1:3-4, "ఆయన దైవశక్తి, పవిత్ర జీవమునకు సంబంధించిన సమస్తమును మనకోసగుటకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు."

4. నిత్యజీవము ఒసగడానికి - యోహాను. 3:16, "మానవుడు నిత్యజీవము పొందుటకై దేవుడు తన కుమారున్ని ఈ లోకానికి పంపాడు."

5. సర్వరోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థత పరచడానికి - మత్త. 9:12, "వ్యాధిగ్రస్తులకేగాని, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు." అలాగే, చెదరిపోయిన గొర్రెలమందవలె నున్న మానవాళిని ఒక మందగా చేయడానికి, అవిశ్వాసములో నున్న ప్రజలను, విశ్వాసులుగా తీర్చిదిద్దడానికి, అన్యదేవుళ్ళను కొలుస్తున్న తన ప్రజలను తనవైపుకు త్రిప్పుకోవడానికి, హింస, మారణహోమాలతో జీవించే మానవాళిని, ప్రేమ శాంతి సమాదానముతో నింపడానికి, అన్యాయ అక్రమ కుళ్ళు రాజకీయాలతో నిండిపోయిన సమాజాన్ని సరిచేయడానికి, పేద-ధనిక బెధమున్న సమాజాన్ని ఒక దైవసమాజముగా మార్చడానికి, దాస్యమునుండి స్వాతంత్రమునకు, చీకటినుండి వెలుగునకు, దు:ఖమునుండి సంతోషమునకు నడిపించడానికి క్రీస్తు మనమధ్య జన్మించాడు. తన జన్మము, జీవితముద్వారా మనిషి ఇలా జీవించాలని చూపించాడు. తన జన్మముద్వారా ఈ లోకములో దైవరాజ్య స్థాపనకు పునాదులు వేసాడు.

6. ప్రభువు మనతో ఉండటానికి జన్మించాడన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన పేరులోనే ఉన్నది. ఇమ్మానుయేలు అనగా "ప్రభువు మనతో ఉన్నాడు" (మత్త. 1:23). "లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉంటాను" (మత్త. 28:20) అని వాగ్దానం చేసాడు. కాబట్టి, సుఖాలున్నప్పుడు దేవుడున్నాడని, దు:ఖాలున్నప్పుడు దేవుడు లేడని చెప్పరాదు. మనం ఎలాంటి నిస్సహాయ స్థితిలో నున్నను, క్రీస్తు మనతో ఎల్లప్పుడు ఉంటాడు.

7. మన జీవితాలకు అర్దాన్నివ్వడానికి - యోహాను. 10:10, "నేను జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచియున్నాను." చాలామంది జీవిత గమ్యము లేక జీవిస్తున్నారు. ప్రభువును విశ్వసించినచో జీవితాలకు పరమార్ధం చేకూర్చుతాడు.

8. మన హృదయాలలో వసించడానికి - వాక్కు అయిన దేవుడే మనమధ్య జన్మించాడు. కాబట్టి, దేవుని వాక్యాన్ని (బైబులు) చదివి, ధ్యానించి, ఆచరించినచో ప్రభువు (వాక్కు) మన హృదయాలలో వసించును.

9. నూతన నివాసమేర్పరచడానికి - యోహాను. 14:2, "నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోవుచున్నాను." ఈ లోకములో మన జీవితము శాశ్వతము కాదు. అందుకే, ప్రభువు మనతో నివసిస్తూ, ఈలోక జీవితం తర్వాత మనలను పరలోకరాజ్య వారసులుగా, దేవుని బిడ్డలుగా చేయడానికి వచ్చియున్నాడు. "ఆయనను అంగీకరించి, విశ్వసించిన వారందరికీ, దేవుని బిడ్డలగు భాగ్యమును ఇచ్చెను" (యోహాను. 1:12).

ఈవిధముగా, సర్వసృష్టికర్త సర్వలోకాన్ని రక్షించడానికి తన కుమారున్ని పంపాడు.

క్రిస్మస్, నేటి సమాజానికి ఏమి నేర్పుతుంది? ఏ సందేశాన్ని ఇస్తుంది? నేటి సమాజం దైవసంకల్పాన్ని, దైవచిత్తాన్ని అనేకవిధాలుగా కాలరాస్తుంది. క్రీస్తు తన జన్మముద్వారా, జీవితంద్వారా, మరణ-పునరుత్థానములద్వారా స్థాపించిన ఆ దైవరాజ్యం ఎక్కడ? ఆ ప్రేమరాజ్యం ఎక్కడ? ఆ రక్షణ ఎక్కడ? ఆ స్వాతంత్రం ఎక్కడ? నీతినియమాలు ఎక్కడ? శాంతి, సమాధానాలు ఎక్కడ? దైవ-సోదర ప్రేమ ఎక్కడ? నేటి లోకం ఎన్నో సమస్యలతో (రోగాలు, ఆర్ధికమాంద్యం, యుద్ధాలు, రాజకీయ కక్షలు, అధికారదాహం, అక్రమార్జన, పేదరికం, నిరుద్యోగం, విరిగిపోయిన కుటుంబ బాంధవ్యాలు, వివాహేతర సంబంధాలు...) సతమతమవుతుంది.

కనుక, మనం మారాలి. మనలో మార్పు, మారుమనస్సు కలగాలి. అది నాతోనే ఆరంభం కావాలి. అప్పుడే, బాల యేసును దర్శించగలం. క్రిస్మస్ కేవలం పండగలాగే మిగిలిపోకూడదు, మనలో హృదయపరివర్తనం కలగాలి. ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవించుదాం!

1 comment:

  1. చాలా బాగా చెప్పారు..

    ReplyDelete