క్రీస్తు సాక్షత్కార
పండుగ, Year C
మనమంతా
కొన్ని రోజుల క్రితమే మరో నూతన సంవత్సరాన్ని ప్రారభించాము. ఈ సం,,ము ఎలా ఉండబోతుందో
ఎవరికీ తెలియదు. మన భవిష్యత్తు ఎలా ఉంటుదో అసలు ఎవరికీ తెలియదు. మనలో ఏదో ఆందోళన, ఆరాటం!
అవకాశం ఉంటే, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని అందరము ఆరాటపడుతూ ఉంటాము. కాలజ్ఞానం
తెలుసు అంటున్న వ్యక్తులదగ్గరికి పరుగులు తీస్తూ ఉంటాము. అయితే, ఇక్కడ మనం ఒక విషయాన్ని
మరచి పోతూ ఉంటాం!. అదే మన వ్యక్తిగత చరిత్ర. అది ఎప్పుడూ ఓ ప్రణాళిక ప్రకారం సిద్ధం
చేసి ఉండదని తెలుసుకోవాలి. మనం ఈరోజు జీవించే జీవితము రేపు చరిత్రగా మారుతుంది. కాబట్టి,
భవిష్యత్తును తెలుసుకోవాలని ఆరాటపడటముకన్నా, ఈరోజు, ఈ క్షణం చాలా ముఖ్యమైనదని, విలువైనదని
తెలుసుకొందాం. ఇప్పుడు, ఈ క్షణములో, మనం తీసుకొనే నిర్ణయాలనుబట్టి, ఎంచుకొనే విషయాలనుబట్టి,
అలవరచుకొనే విధానాన్నిబట్టి, మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా, గతములోనికి తిరిగి
వెళ్ళలేము. కొత్త ఆశతో, నమ్మకముతో ముందుకు సాగిపోదాం. ఈ నాటి పండుగ సారాంశం, క్రీస్తు
తననుతాను ఈ లోకానికి సాక్షాత్కరింపచేసుకొనడం. జ్ఞానులు క్రీస్తును గాంచడానికి ఏవిధముగా
ముందుకు సాగిపోయారో, అలాగే మనము కూడా ముందుకు సాగిపోదాం.
తూర్పు దిక్కున జ్ఞానులు,
ఖచ్చితముగా ఎక్కడ ఉంటాడో తెలియని వ్యక్తికోసం దూరదేశానికి బయలుదేరారు. వారి ప్రయాణములో
అనేక నక్షత్రాలు, కాంతి దీపాలుగ మారి దారినిచూపిస్తూ గమ్యాన్నిచేరడానికి తోడ్పడ్డాయి.
మన జీవితం ఓ ప్రయాణం. ఏమీ తెలియనటువంటి భావిష్యత్తులోనికి చూస్తూ ముందుకు సాగిపోతూ
ఉంటాం. మన ప్రయాణములోకూడా నక్షత్రాలు మనలను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. కొన్ని నిండు
వెలుగును ప్రకాశిస్తూ మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి, మరికొన్ని వెలుగు లేకుండా ఎలాంటి
గమ్యాన్ని చేర్చకుండా ఉంటాయి. కాని, ప్రతీది మనలను ఆకర్షిస్తూనే ఉంటుంది! ఇంతకీ మనం
ఏ నక్షత్రాల గూర్చి మాట్లాడుతున్నాం? ధనం, వస్తుప్రపంచం, మందు, పదవి, కీర్తి ప్రతిష్టలు
మొ,,గు కాంతిలేని నక్షత్రాలు మనలను ఆకర్షిస్తూ ఉంటాయి. అలాగే, సేవ, శాంతి, సమాధానం,
దయ, ప్రేమ, విశ్వాసం మొ,,గు తేజోవంతమైన నక్షత్రాలు మన ప్రయాణములో సహాయపడుతూ ఉంటాయి.
తేజోవంతమైన నక్షత్రాల కన్నా,
కాంతిహీనమైన నక్షత్రాలే మనలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. దేవుని రూపములో సృష్టింపబడిన
బిడ్డలముగా, తేజోవంతమైన మరియు మన గమ్యాన్నిచేర్చే నక్షత్రాలను మనం అనుసరించాలి. మన
జీవితాలను సార్ధకముచేసే, నిజమైన సంతోషాన్ని, తృప్తిని ఇచ్చే నక్షత్రాలను అనుసరించి
దేవున్ని చేరుకోవాలి. జ్ఞానులుకూడా, వారి ప్రయాణములో ఎన్నో నక్షత్రాలను చూసి ఉంటారు.
కాని, వారి గమ్యాన్ని నడిపించిన నక్షత్రాన్ని ఎన్నుకొని, అనుసరించి, క్రీస్తుని దర్శించుకోగలిగారు.
రక్షణను పొందియున్నారు.
మన జ్ఞానస్నానములో, ఆ నక్షత్రాన్ని
కనుగొన్నామా? క్రీస్తు చూపించే వెలుగు బాటలో పయనిస్తామని, ఆయన కొరకు మాత్రమే జీవిస్తామని
మాట ఇచ్చియున్నాము. ఆ వాగ్దానాన్ని నూత్నీకరించుకొని, ఆయన బాటలో, వెలుగులో నడవటానికి
ప్రయాస పడదాం.
జ్ఞానుల ప్రయాణములో, ఎన్నో కష్టాలు,
ఆటంకాలు, అవమానాలు ఎదురయ్యాయి. అన్నింటిని జయిస్తూ బెతేలేహేమునకు చేరుకొన్నారు. దివ్య
బాలున్ని కనుగొని సంతోషించారు. దీనస్తితిలోనున్న బాలున్ని చూసి వారు అనుమానించలేదు,
నిరాశ చెందలేదు. అతనే లోకరక్షకుడని గుర్తించి, అంగీకరించి, ఆరాధించారు. జ్ఞానుల వలె
ఒకరికొకరము, ధైర్యము చెప్పుకుంటూ, కలసి మెలసి, ఒకే క్రీస్తుసంఘముగా ముందుకు సాగుదాం.
క్రీస్తుకు సాక్షులముగా జీవించుదాం. సమస్యలు, అనుమానాలు, నిరాశ నిస్పృహలు అనే మేఘాలు
నక్షత్రాన్ని కనపడకుండా చేసినప్పుడు, అధైర్యపడక, విశ్వాసముతో ముందుకు సాగుదాం.
జ్ఞానులు తెచ్చిన
కానుకలు, బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను సంతోషముతో దివ్య బాలునికి అర్పించారు.
క్రీస్తుకు మనం ఏ కానుకను ఇవ్వగలం? బెత్లేలేహేము అనే మన విచారణలో, శ్రీసభలో, కుటుంబములో,
మన సమాజములో, మనం పనిచేసే స్థలములో, మనకి రోజు ఎదురుపడే వ్యక్తులలో దివ్యబాలున్ని కనుగొని,
మన స్నేహాన్ని, ప్రేమను, సేవను, మంచి క్రియలను, ప్రభువుకు కానుకగా ఇద్దాం. ఎక్కడైతే
దేవుని వాక్యాన్ని వింటామో, ప్రభువు శరీర రక్తాలను దివ్యబలిలో స్వీకరిస్తామో, అదే మన
బెత్లెహేము. ఎందుకన, ప్రభువు గూర్చి తెలుసుకొంటున్నాం. ప్రభువు వెలుగును, దివ్య కాంతిని
మనం దర్శించుకోగలుగుతున్నాం.
జ్ఞానులు, క్రీస్తును కనుగొని, ఆరాధించి, కానుకలను సమర్పించి, వేరొక మార్గమున
వెనుతిరిగి పోయారు. మనం నిజముగా క్రీస్తును దర్శించగలిగితే, మనమూ ఓ నూతన మార్గములో
పయానిస్తాము. పాత మార్గాలను, పాత జీవితాన్ని విడిచి పెట్టగలుగుతాము. మనలో నిజమైన మార్పు
కలుగుతుంది. ఈ మార్పునే ప్రభువు మనలనుండి కోరుతున్నాడు. ఆయన చూపించిన మార్గములో, విస్వాసములో
జీవించమని పిలుస్తున్నాడు. కనుక, జ్ఞానులవలె, ప్రభువును, ఆయన సువిశేషాన్ని కనుగొందాము.
సంతోష హృదయముతో ఆయనతో ఐక్యమై, విశ్వాసముతో జీవించడానికి ప్రయాసపడుదాం. పరలోక రాజ్యములో
క్రీస్తుదరికి చేరి ఆయన నిత్యవెలుగులో శాశ్వతజీవితాన్ని పొందుటకు ప్రయాసపడుదాము.
No comments:
Post a Comment