మూడవ సామాన్య ఆదివారము - YEAR C

మూడవ సామాన్య ఆదివారము - YEAR C
పఠనములు: నెహెమ్యా 8:2-4, 5-6, 8-10; 1 కొరింథి 12: 12-31; లూకా 1:1-4, 4: 14-21

దేవుని ప్రేమ అపారమైనది, అనంతమైనది. దేవుని ప్రేమ సృష్టియందు, రక్షణయందు విశదపరచడమైనది. ఆ ప్రేమకు, ప్రతీ ఒక్కరు వ్యక్తిగతముగా, స్పందించాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. తన పోలికలో సృజించిన మనలను ఆయనతో ఉండటానికి ఆహ్వానిస్తున్నాడు. పాపము వలన, ఆయన సన్నిధినుండి దూరమైన మనలను పశ్చాత్తాపం, మారుమనసు పొంది తిరిగి ఆయన సన్నిధిలోనికి రావలయునని తండ్రి దేవుడు ఆశిస్తున్నాడు. మారుమనస్సు అనగా, మన జీవితాలను మార్చుకోవడం, పాత జీవితమును విడనాడటం, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం, ముఖ్యముగా, మన జీవిత మార్గాన్ని మార్చుకోవడం. పరిపూర్ణమైన మార్పును దేవుడు మనలనుండి ఆశిస్తున్నాడు.

మొదటి పఠనములో విన్నట్లుగా, ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో, ధర్మశాస్త్రము, దేవుని వాక్యము ముఖ్యమైన పాత్రను పోషించింది. ధర్మశాస్త్రమును విని, పాశ్చాత్తాప పడి, దేవుని సన్నిధిలోనికి వచ్చియున్నారు. పడిపోయిన వారి జీవితాలను, సంఘాన్ని పునర్నిర్మించుకొన్నారు. నిర్లక్ష్యము చేసిన దేవాలయాన్ని నిర్మించుకొన్నారు. దేవుని చట్టంయొక్క ప్రాముఖ్యతను, దానిని విధేయించాలని గుర్తించారు. దేవుని చట్టమును విని చేతులు పైకెత్తి 'ఆమెన్ ఆమెన్' అని వారి సమ్మతమును తెలియ జేశారు, నేలపై సాగిల పడి వారి విధేయతను వ్యక్తపరచారు.

రెండవ పఠనములో, క్రీస్తు శరీరమున సభ్యులమైన మన మందరము, ఐక్యతతో జీవించాలని తెలియ జేస్తుంది. ప్రతీ ఒక్కరు కూడా, ప్రభువును స్తుతించుటకు, ఆరాధించుటకు, సేవ చేయుటకై పిలువబడి యున్నాము. అందరూ సమానమే. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన ఉండకూడదు. ఒకరి నొకరు సహాయము చేసుకొంటూ, ఒకే సంఘముగా, ఒకే శరీరముగా జీవించ వలయును. ప్రస్తుతం మనలో ఉన్న పెద్ద సమస్య ... వ్యక్తిగతముగా జీవించాలని కోరుకోవడం. నేను...నా ప్రపంచం అన్న ఆలోచనా తీరుతో జీవిస్తున్నాము. మన పిలుపు అనేక విధాలైన, మనమందరమూ జీవిస్తున్నదీ, ఒకే ఒక శ్రీసభలో, మరియు మనలను నడిపించేదీ ఒకే ఆత్మయే!

సువార్తా పఠన ధ్యానం: లూకా, పౌలుగారి అనుచరుడు, వైద్యుడు. సువార్తను తెయోఫిలూ (దేవుని ప్రేమికుడు, దేవునికి ప్రియమైన వాడు) అను విశ్వాసునికి వ్రాసియున్నాడు.

యేసు నజరేతున, అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్ధనా మందిరమునకు వెళ్ళాడు. అచట యెషయా గ్రంధమునుండి, వాక్యమును చదివి, "నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరెను" అని పలికాడు. అవును! యెషయా లేఖనమున ఉన్నట్టుగా, ప్రభువు ఆత్మతో నింపబడిన యేసు పేదలకు సువార్తను బోధించుటకై అభిషేకించబడెను. చెరలో నున్నవారికి విడుదల, గ్రుడ్డివారికి చూపును కలుగ జేయుటకు, పీడితులకు విమోచనము కలుగ చేయుటకు, ప్రభు హిత సం.ను ప్రకటించుటకు తండ్రి దేవునిచేత పంపబడెను.

సినగోగున ప్రభువు బోధనలను ప్రజలు ఆలకించారు, కాని వారు సంపూర్ణముగా అర్ధము చేసుకొనలేక పోయారు. అర్ధమైనంత వరకు కొంతమంది ఆయనను విశ్వసించారు. ప్రభు వాక్యాన్ని మనం పరిపూర్ణముగా అర్ధం చేసుకోవాలంటే, పవిత్రాత్మ శక్తి మనలో ఉండాలి. వాక్కు ఈనాటికి మన మధ్య సజీవముగా ఉన్నది. విశ్వాసముతో, అర్ధం చేసుకొని, ధ్యానించి, మన దైనందిన జీవితములో ఆ వాక్కును జీవించాలి.

మనం పేదవారము. దేవుని సంపదయైన వాక్కు లేని పేదవారము, దేవునిపై విశ్వాసము, ప్రేమ లేని పేదవారము. ఒకరిపై ఒకరికి నమ్మకము లేని పేదవారము. దైవాజ్ఞలను, క్రీస్తు బోధనలను పాటించలేని పేదవారము. అదిగో! పవిత్రాత్మతో నింపబడిన ప్రభువు, ప్రతీక్షణం ముఖ్యముగా దివ్యపూజా బలిలో, దివ్యసంస్కారములయందు, తన సువార్తను మనకు బోధిస్తున్నాడు. మనం పాపం, సైతాను అను దుష్టశక్తులకు లోనై వాని చెరలో బంధీలమై ఉన్నాము. ప్రాపంచిక వ్యసనాలతో, స్వార్ధముతో బంధీలుగా జీవిస్తూ ఉన్నాము. అదిగో! మనలను విడుదల చేసి, విముక్తిని గావించి నిజమైన స్వాతంత్ర్యమును ఒసగుటకు ఆత్మ పూరితుడైన ప్రభువు సిద్ధముగా ఉన్నారు.

మనం ఆధ్యాత్మికముగా గ్రుడ్డివారము. ఈ లోకములో నిజమైన జీవితం ఏమిటో తెలుసుకోలేని గ్రుడ్డివారము. నిజమైన వెలుగును చూడలేని గ్రుడ్డివారము. అదిగో! మన ఆధ్యాత్మిక కన్నులను తెరచుటకు ప్రభువు సిద్ధముగా ఉన్నారు. మనం అనేక శారీరక, ఆధ్యాత్మిక, మానసిక సమస్యలతో సతమతమవుచున్న పీడితులం. మనకు విమోచనను కలిగించుటకు ప్రభువు సిద్ధముగా ఉన్నారు.

మనలో ఆరంభం కావలసినది, మారుమనస్సు, పశ్చాత్తాపం. అప్పుడు ప్రభువు తప్పక మనలను కాపాడతాడు, రక్షిస్తాడు. తండ్రి రాజ్యములో భాగస్తులను చేస్తాడు. వాక్కును విశ్వసిద్దాం, దానిని పాటిద్దాం.

మూడవ సామాన్య ఆదివారము - YEAR C (మొదటి పఠనముపై ధ్యానం)

మూడవ సామాన్య ఆదివారము YEAR C
పఠనములు: నెహెమ్యా 8:2-4, 5-6, 8-10; 1 కొరింథి 12: 12-31; లూకా 1:1-4, 4: 14-21
జీవ వాక్యం - ఆవేదనలోనైన, అవసరములోనైన, ఆపదలోనైన...
రెండు సందర్భాలు
రెండు సమావేశాలు
రెండు ఫలితాలు
కాని, ఒకే సందేశం.
ఆవేదనతో వచ్చినా, అలవాటుగా వచ్చినా, ఆ వాక్యం జీవం పోస్తుంది, జీవం పోసి ముందుకు నడిపిస్తుంది.

ఇదే సందేశాన్ని ఈనాటి మొదటి పఠనము మరియు సువార్త పఠనము మనకు తెలియజేస్తున్నాయి. ఆ సందేశాన్ని సవివరముగా పరిశీలించి ఆ జీవపు ఊటనుండి మన దైనందిన జీవితానికి జీవ జలమును గ్రహించుదాం!

నెహెమ్యా గ్రంథమునుండి మనం ఈ రోజు విన్న వాక్యములు ఆనాటి ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడినవి. ఇశ్రాయేలు అవిధేయత వలన, గర్వము వలన, తన నాశనమును తానే బాబిలోనియా బానిసత్వపు రూపములో కొని తెచ్చుకొన్నది. 70 సం.ల ఊడిగం తరువాత, ఇశ్రాయేలు ప్రజలు తమ స్వంత దేశమునకు, దేవుడు తమకు యిచ్చిన దేశమునకు తిరిగి వచ్చారు. ప్రాకారములను కట్టుకొన్నారు. క్రమముగా అన్నీ సమకూరుతున్నాయి. అన్నీ సక్రమముగా జరుగుతున్నా, ఏదో లోటు, ఏదో వెలితి వారికి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. బానిసత్వములో ఏదో కోల్పోయామని వారు తెలుసుకొన్నారు. క్రమముగా తమ తప్పు తెలియ వచ్చింది. ఏమి కోల్పోయామో తెలియ వచ్చింది. తమను పేరు పెట్టి పిలిచిన, మలచిన, ఆ దేవున్ని, ఆయన సహవాసమును, సాంప్రదాయమును, సన్నిధిని మరిచామని తెలుసుకున్నారు. ఆవేదనతో ఆయన చెంతకు వచ్చారు. ఆయన ధర్మశాస్త్రమును వినవలెనన్న కోరిక బహుబలముగా ఉండెను. అందుకే, ఏడవ నెల మొదటి దినము సమావేశమునకు (బూరల పండుగ) వచ్చినప్పుడు దేవుడు మోషే ద్వారా తమకు ఇచ్చిన ధర్మశాస్త్రమును వినవలెనన్న కోరికను ఎజ్రాకు తెలియపరచగా, ఎజ్రా వారికి చదివి (హీబ్రూ బాషలో) వినిపించెను. ఆ పిమ్మట లేవీయులు, ఆ ధర్మశాస్త్రమును, దాని భావమును వివరించిరి. దాని భావమును తెలుసుకొని, ఇన్ని రోజులు తామేమి కోల్పోయామో తెలుసుకొని దు:ఖించిరి. ఆవేదనతో ఉన్నవారికి ఒక ఆదరువుగా, చీకటిలో ఉన్నవారికి వెలుగుగా వారికి ధర్మశాస్త్రపు మాటలు తోచాయి.

సువార్త పఠనములో, అలవాటు చొప్పున, ప్రభువు విశ్రాంతి దినమున ప్రార్ధన మందిరమునకు వెళ్ళెనని మనం చదువుతున్నాం. ఆత్మతో నింపబడినను, గర్వము లేకుండా ప్రార్ధనా మందిరమునకు వెళ్ళాడు. అందరి మన్ననలు పొందినను, సౌమ్యుడిగా సామాన్యులందరితో కలసి ప్రార్ధించడానికి వచ్చాడు. తనంటే ఇష్టం లేనివారు ఉన్నా కూడా ఆయన ప్రార్ధించడానికి అక్కడికి వచ్చాడు. అక్కడ జరిగే దైవారాధన పరిపూర్ణముగా లేకున్నను ఆయన అక్కడి వారందరితో కలసి ప్రార్ధించడానికి వచ్చాడు. అలా తననుతాను తగ్గించుకొన్నాడు, కాబట్టే, తండ్రి దేవుడు ఆయనను హెచ్చించాడు. ఆత్మను ఇచ్చి, శక్తిని ఇచ్చి, ప్రభు కృప సం.ను, అందరికి సంతోషమునిచ్చు సమయమును ప్రకటించుటకు ఆయనను పంపెను. ఆవేదనతో వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు తన వాక్యముద్వారా సంతోషమునిచ్చి తిరిగి పంపుతున్నారు. అలవాటుగా వచ్చిన యేసు తన శాంతి దూతగా ముందుకు నడిపించారు ఆ తండ్రి దేవుడు.

ఇది ఎప్పుడో ఒకప్పుడు జరిగిన సంఘటన మాత్రమేనా? మన జీవితములో ఇలా జరుగునా అని ప్రశ్నించుకొంటే, 'అవును' అనే సమాధానం వస్తుంది. ఉదాహరణకు, 1945 వ సం.లో జర్మనీలో అనేక పట్టణాలు నేలమట్టమయ్యాయి. చాలామంది మరణించారు. యువకులంతా బందీలయ్యారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు. సర్వం కోల్పోయి గంపెడు దు:ఖముతో ఉన్నారు. అటువంటి వారిలో ఒకడే యూర్గన్ మోల్ట్ మాన్. తల్లి దండ్రులను, తోబుట్టువులను, సంపదను కోల్పోయి, బందీగా పట్టుబడి బెల్జియం దేశములోని కారాగారములో ఉన్న సమయములో, గతమంతా బూడిదలా, భవిష్యత్ అంతా అంధకారంలాగా కనిపించింది. బయట మాత్రమే కాదు, అంతరంగమునందు కూడా అంతా చీకటిగానే ఉన్నది. ఆ దీనస్థితిలో సైన్యములో పనిచేయుచున్న ఒక క్రైస్తవ మత భోదకుడిద్వారా, ఒక బైబిల్ గ్రంధమును పొంది, చదవడం ఆరంభించాడు. అలా చదువుచున్న కొలది, తనలో ఆశ చిగురించింది. ఆ వాక్యమే అతనికి జీవం పోసింది, అతనిద్వారా అనేక మందికి జీవాన్ని అందించినది.

సోదరా, సోదరీ!
ఆవేదనతో ఉన్నా, అలసి పోయినా, దిగులు పడినా, దీన స్థితిలో ఉన్నా,
అందిస్తుంది ఆ వాక్యం, నీకు జీవం!
అలవాటుగా ఆ వాక్యాన్ని చదువు, అవసరములో ఉన్నప్పుడు మరీ ప్రత్యేకముగా చదువు.
జీవమును సమృద్ధిగా పొందు. ఆమెన్.

రెండవ సామాన్య ఆదివారము, YEAR C

రెండవ సామాన్య ఆదివారము YEAR C
యెషయ గ్రంధము 62:1-5, 1 కొరిం 12:4-11, యోహాను 2:1-11

యేసు ప్రభువుకు గొప్ప సాక్ష్యం చెప్పిన వ్యక్తిగా, పునీత బప్తిస్మ యోహానును గడచిన ఆదివారము, అనగా క్రీస్తు బప్తిస్మ పండుగ సందర్భమున మనం ఆయన జీవితమును ధ్యానించి యున్నాము. ఈ ఆదివారం, మరియొక వ్యక్తి గూర్చి ధ్యానించుకొందాం. ఆ వ్యక్తియే, యేసు తల్లి మరియమ్మ. ఆమెకూడా క్రీస్తుకు ఈ లోకములో గొప్ప సాక్ష్యముగా నిలిచింది. ఆ సాక్ష్యానికి ఓ ఉదాహరణ ఈనాటి సువిషేశములో మనం విన్న కానాపల్లె విందులోని అద్భుతం.

మరియమ్మ, యేసు, ఆయన శిష్యులు కానాపల్లెలోని వివాహమునకు వెళ్ళారు. ఇంటి యజమాని అతిధులందరిని సాదరముగా ఆహ్వానించి అన్ని సత్కార్యాలు చేసాడు. కాని, అనుకోకుండా, అతిధులు ఎక్కువగా రావడం వలన, యజమానికి ఒక కష్టం వచ్చింది. అది ఆయన ప్రతిష్టకు సంబంధించినది. వారు విందు కొరకు సిద్ధము చేసుకొన్న ద్రాక్షారసము అయిపోయినది. అతిధులందరు ఇంకా ద్రాక్షారసము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. విందు సమయములో ఏదైనా కొంచెం తగ్గితే, ఎందరు ఎన్ని మాటలు అనుకొంటారో మనకు బాగా తెలుసు! ఇలాంటి సందర్భమే కానాపల్లెలోని ఆ కుటుంబానికి ఎదురయింది. అలాంటి సమయములో, ఆ కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలని తలంచిన మొట్ట మొదటి వ్యక్తి మరియమ్మ. తన కుమారుడిపై విశ్వాసముతో వెళ్లి ఆయనకు చెప్పినది. తన ఘడియ రానప్పటికిని, యేసు తల్లి మాట విని, కష్ట సమయములోనున్న ఆ కుటుంబానికి సహాయం చేయాలన్న తలంపుతో, ఆయన ఆ అద్బుతమును చేసియున్నారు.

ఆ యజమానివలె, మనంకూడా మన జీవితములో జరిగే ప్రతీ సంఘటనకు ప్రభువును ఆహ్వానించుదాం. అప్పుడే మన జీవితాలలోకూడా ఆయన అద్భుత శక్తిని, మహిమను చూడటానికి ఆస్కారముంటుంది. ఆయన మాటను గౌరవించి, దాని ప్రకారం జీవిస్తే, ఆయన మన కష్టాలను తీరుస్తాడు. ప్రభువును స్వీకరించి, ప్రభువులో జీవించే వారిని ఆయన చేయి విడువడు. మరియమ్మ తన కుమారునిలో చూపిన విశ్వాసాన్ని మనం కూడా చూపిస్తే, ప్రభువు తప్పక మనతో నడుస్తాడు. ఆ కుటుంబ గౌరవాన్ని ఎలా కాపాడాడో, మనలను కూడా కాపాడతాడు. కనుక, ప్రభువును విశ్వసించి ఆయనను మనలోనికి ఆహ్వానిస్తే మన జీవితములో కూడా అద్భుతాలు జరుగుతాయి.

కానాపల్లె పెళ్ళిలోని అద్భుతం "సమృద్ధికి" చిహ్నముగా ఉన్నది. ఈ అద్బుతములో యేసు నీటిని ద్రాక్షారసముగా మార్చిన తరువాత, అందరూ దానిని రుచి చూసి, సమృద్ధిగా తాగారు. ఆతరువాత, వారికి ఎలాంటి కొరతయు లేదు. ఇది పండుగకు, సంతోషానికి చిహ్నం. దేవుడు సమృద్ధిగా ప్రసాదిస్తారు అన్న విషయాన్ని అక్కడ ఉన్న రాతి బానలు, వాటినిండా, అంచుల వరకు ఉన్న నీరు సూచిస్తూ ఉన్నాయి. ప్రవక్తలందరూ కూడా, ఇలాంటి సమృద్ధికరమైన, సంపూర్ణమైన సంతోషమును లోకరక్షకుడైన క్రీస్తుద్వారా మాత్రమే వస్తుందని ప్రవచించారు. ఆయనలో జీవించే వారికి ఇవన్ని ఆయన ప్రసాదిస్తారు.

ఆ అద్భుతం క్రీస్తు ప్రభు కడరా భోజన సమయాన్ని గుర్తుకు చేస్తుంది. కడరా భోజన సమయములో రాబోయే పరలోక రాజ్య నిత్య విందును దృష్టిలో ఉంచుకొని, ద్రాక్షారసాన్ని తన రక్తముగా మారుస్తూ ఉన్నాడు. "ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము" (మార్కు 14:25) అని కడరా భోజన సమయమున తన శిష్యులతో చెప్పి యున్నారు. ప్రభు పలికిన ఈ వాక్కు నూతన ఒడంబడికకు గుర్తుగా ఉన్నది. "శ్రేష్టమైన ద్రాక్షారసము" ఈ నూతన ఒడంబడికను తెలియ జేస్తుంది. శ్రేష్టమైన ద్రాక్షారసము క్రీస్తు మనకు ఒసగిన రక్షణమునకు చిహ్నముగా ఉంది.

క్రీస్తు కానా పల్లెలో చేసిన అద్భుతం, మనం ప్రతీ రోజు అర్పించే పూజా బలికి చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నది. ప్రధమముగా, యేసు ప్రభువు కానాపల్లెలో అద్భుతం చేసినప్పుడు, వ్యక్తిగతముగా ఆయన వారి మధ్య ఉన్నారు. ఈనాడు మనం అర్పించే ఈ పూజా బలిలో ప్రభువే స్వయముగా, పరిశుద్ధాత్మ రూపములో మన మధ్య, మన సంఘములో, మన విశ్వాసాన్ని బట్టి ఉన్నారు. యేసు కానా పల్లెలో తన వాక్కుద్వారా నీటిని ద్రాక్షారసముగా మార్చారు. ఈనాడు మనం అర్పించే ఈ బలిలో గురువు క్రీస్తు వాక్యాలను ఉచ్ఛరించుట వలన, అప్ప, ద్రాక్షరసాలు, క్రీస్తు శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయి. యేసు వాక్యం గొప్పది, శక్తి గలది. కనుక యేసు వాక్యాన్ని చదివి, ధ్యానించడం నేర్చుకోవాలి.

చివరిగా, మరియ తల్లి పాత్రను ఈ అద్భుతములో మరచిపోకూడదు. ఈ అద్భుతముద్వారా, యేసుని తల్లి మరియ, తన కుమారుని గుర్తించమని కోరినది. "ఆయన చెప్పినది చేయుడు" అని శిష్యులతో చెప్పి తన కుమారునికి సాక్ష్యముగా నిలచినది. ఆ కుటుంబ కష్టమునుండి రక్షించగల వ్యక్తి యేసు ఒక్కడే అని ఆమె విశ్వసించినది. యేసులో ఉన్న దైవశక్తిని ఆమె గుర్తించినది. ఆ దైవశక్తిని బట్టి, యేసు ఈ అద్భుతాన్ని చేసారు. దేవుని మహిమను ప్రదర్శించారు. ఈ అద్భుతముద్వారా మరియ సంపూర్ణ విశ్వాసానికి ఆదర్శముగా నిలుస్తుంది. ఆమె ఆదర్శాన్ని అనుసరించి, క్రీస్తును వెంబడిద్దాం. ఆయన రక్షణ కార్యములో పాలుపంచుకొందాం.

క్రీస్తు బప్తిస్మ పండుగ, Year C

క్రీస్తు బప్తిస్మ పండుగ, Year C
పఠనములు: యెషయ 40:1-5, 9-11; తీతు 2:11-14; 3:4-7 
లూకా 3:15-16, 21-22 
రక్షకుడు బప్తిస్మము పొందిన సమయమున, ఆకాశము తెరచు కొనెను. పవిత్రాత్మ పావుర రూపమున వచ్చి ఆయన మీద నిలచెను. "నాకానందము కలిగించు నా ప్రియతమ పుత్రుడితడే" నను పిత స్వరము వినిపించెను.


ఈ రోజు మనం యేసు జ్ఞానస్నాన పండుగను కొనియాడుచున్నాము. బప్తిస్మ యోహాను ఇచ్చే స్నానం పాపాలకై పశ్చాత్తాపాన్ని, హృదయ పరివర్తనను సూచించే స్నానం. యూదులు అట్టి స్నానాన్ని ఇంతవరకు ఎరుగలేదు; వారు యూదమతమును స్వీకరించే అన్యులకు 'స్నానం' ఇచ్చేవారు. స్నానం చేసినంత మాత్రాన సరిపోదు. పాప జీవితాన్ని విసర్జించి, హృదయ పరివర్తన చెందటం ముఖ్యమని యోహాను బాప్తిస్మంలోని సారాంశం. యేసు యూదుడుగా బాప్తిస్మం అవసరం లేదు, అయినను, మనందరి రక్షణ నిమిత్తమై ఆయన బాప్తిస్మం పొందారు. ఇదే విషయాన్ని యోహానుకు ఈ విధముగా తెలిపారు: "దేవుని ప్రణాళిక అంతటిని వేరవేర్చుట సమంజసము" (మత్త 3:15).

గొర్రెల కాపరులకు, శుభవార్త ప్రకటించిన తరువాత, ముగ్గురు రాజులు, అద్భుత నక్షత్రం ద్వారా నడిపింపబడి, చిన్నారి బాలుని దర్శించిన తరువాత, ఈ రోజు, దేవుని వాక్కైన క్రీస్తు ప్రభువు, యోర్దాను నదిలో, తను పొందిన బాప్తిస్మం ద్వారా, తననుతాను ఇశ్రాయేలు ప్రజలకు తెలియ పరచుకొంటున్నాడు. "ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను" (3:22) అని పలికిన దివ్యవాణి, పావుర రూపమున వేంచేసిన పవిత్రాత్మ, యేసు ప్రభువు నిజమైన రూపాన్ని, అనగా దేవుని కుమారుడని చాటి చెప్పుతుంది. తండ్రి దేవుడు తన కుమారుని దైవత్వాన్ని ప్రకటించారు. ఈ పిలుపు తర్వాతే, యేసు ప్రభువు ఒక కొత్త వ్యక్తిగా మారాడు. 30 సం.ల వరకు ఒక సాధారణ యూదుడుగా, సినగోగు ప్రార్ధనాలయమునకు వెళ్ళుచూ, దేవుని వాక్యాన్ని చదువుచూ, ధ్యానించుచూ, జీవితాన్ని కొనసాగించాడు. కాని ఈ రోజు ఇదంతయు కూడా మార్పు చెందినది. యేసు ప్రవక్తగా, మెస్సయ్యగా, సేవకునిగా తాను చేయాల్సిన ప్రేషిత కార్యానికి నేడు తండ్రిచేత బలపరచ బడినారు. ఆయన చేయవలసిన కార్యాన్ని తండ్రి దేవుడు ధ్రువపరిచారు.

యేసు బాప్తిస్మంద్వారా, ఆకాశానికి, భూమికీ మధ్య తెగిపోయిన సంబంధం, తిరిగి నెలకొల్పబడినది. ఈ శుభవార్తను యెషయా ప్రవక్త ముందుగానే తెలియజేశాడు. మొదటి పఠనములో యెషయా నోటిద్వారా, దేవుని మాటలను విన్నాము: నా ప్రజలను ఒదార్పుడు! ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో సం.లు బానిసత్వములో జీవించారు, దేవునిపై విశ్వాసాన్ని కోల్పోయారు. ఇటువంటి సమయములో, ప్రభువు ఇలా తన వ్యాక్యాన్ని తన ప్రజలకు తెలియ జేశాడు. "యెరుషలేము ప్రజలకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వం ముగిసినదని, వారి తప్పిదములు మన్నింపబడినవని తెలియ జెప్పుడు." మన జీవితములో కూడా, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలవలె నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాము. అలాకాక, కష్ట సమయములోనే, మన విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి.

మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్ష మయ్యెను (రెండవ పఠనము) అనెడు వాగ్ధానపు పండుగను, ఈ రోజు మనం యేసు ప్రభువు పొందిన జ్ఞానస్నానం ద్వారా తెలుసుకొంటున్నాము. ఈ రోజునుండి తను ఎక్కడనుండి వచ్చినది, ఎక్కడికి వెళ్ళేది, ఏమి చేయాలన్నది ఎరిగియున్నాడు. తండ్రి సమస్తమును తన చేతుల్లో ఒప్పగించాడని, తనతోపాటు సమస్తమును తీసుకొని వెళ్ళవలెనని, పవిత్రాత్మ అతనికి సూచించినది. ఆయనయందు సర్వమానవాళి ఏకమైయున్నది. ప్రతి వ్యక్తి మానవ శరీర వాంఛద్వారా కాక, దేవుని చిత్త ప్రకారముగా జన్మించెనని తెలుసుకోవాలి.

జ్ఞానస్నానం హృదయ పరివర్తనకు పిలుపు. యోహాను తన వద్దకు వచ్చిన వారితో ఇలా అన్నాడు: "ఓ సర్పసంతానమా! రానున్న కోపాగ్నినుండి తప్పించుకొను మార్గమును మీకు సూచించినదెవరు? మీరు ఇక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు..." ఇది విన్న పరిసయ్యులు, సద్దుకయ్యులు, తను ఎవరని ప్రశ్నించగా, "తాను మెస్సయ్య కాదని, దేవుని మార్గమును సిద్ధము చేయుటకు పంపబడిన స్వరమును మాత్రమే అని, ఇక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు..." అని సమాధానమిచ్చెను. అందుకు జనులు మేమేమి చేయవలెనని అడుగగా, "తమకు ఉన్న దానిలో ఇతరులకు సహాయం చేయుడు, ఎవరికీ అన్యాయం చేయకుడు" అని పలికెను.

యోహాను బాప్తీస్మం ప్రజలను హృదయ పరివర్తనకు సిద్ధము చేసే స్నానం మాత్రమే, కాని మెస్సయ్య ఒసగు జ్ఞానస్నానం ప్రజల పాపాలను ప్రక్షాళనం చేసి వారిని పవిత్రాత్మతో నింపుతుంది. ఈ జ్ఞానస్నానం వలన మానవునిలో కలిగే అంతరంగికమైన మార్పును గురించి యెహెజ్కెలు ప్రవక్త పలికిన దేమన: మీకొక కొత్త హృదయమును, ఒక కొత్త మనస్తత్వమును ప్రసాదించెదను. మీనుండి రాతి హృదయమును తీసివేసి మీకొక మాంసపు హృదయమును ప్రసాదించెదను. నా మనస్తత్వమును మీ యందు పుట్టించి, మీరు నా చట్టము ప్రకారము జీవించునట్లును, నేరవేర్చునట్లును చేయుదును (36:26-27). ఇట్టి జ్ఞానస్నానాన్ని ఒసగు మెస్సయ్య, ఏ పాపం చేయని తాను, మానవులందరి పాపములను తనపై వేసుకొని, వారి స్థానములో, యోర్దాను నదిలో, యోహాను ఎదుట నిలబడి యున్నాడు. తన పాటుల ద్వారా, మరణ ఉత్థానము ద్వారా, మనలను శుద్ది చేసి దైవ బిడ్డలుగా మార్చడమే ఆయన ధ్యేయం!

ఈ పండుగద్వారా, వాక్కు లోకమునకు రానైయున్న వెలుగని, గ్రుడ్డివారికి చూపును, చెరలోనున్న వారికి విముక్తిని ఒసగునున్న నిజమైన మెస్సయ్య అని మనకు అర్ధమగుచున్నది. ఆశ్చర్యకరమగు విషయమేమనగా, ఆకాశమునుండి వినబడిన దివ్యవాణి, మనం ఆయన ప్రియమైన బిడ్డలమని, మనం పాపాత్ముల మైనప్పటికినీ, ఆ ప్రభుని రక్షణ మనలనందరినీ రక్షించినదని తెలియ జెప్పినది. ఎవరుకూడా, ప్రభువు వాక్యాన్ని, అది పండించే ఫలాన్ని, అది చూపించే వెలుగుని ఆపలేరు. దేవుని ప్రేమ ఒక అగ్నివలె లోకమంతట వ్యాపించును. యోహాను బాప్తిసం ఒక గురుతు మాత్రమే, కాని మెస్సయ్య ఒసగు బాప్తిసం దేవుని సంపూర్ణ ప్రేమలో, పవిత్రాత్మలో ముంచుతుంది.

జ్ఞానస్నానం పొందిన ప్రతీ వ్యక్తి దేవుని బిడ్డ అను గుర్తింపును పొందును. ఈ గుర్తింపు మన అనుదిన జీవితములో ఒక బలముగా, ప్రేరణగా, దృఢవిశ్వాసముగా ఉండి ముందుకు నడిపించును.

మనలను మనం ప్రశ్నించుకోవలసినది ఏమనగా, మన జ్ఞానస్నానముతో మనం ఏమి చేస్తున్నాము? మన జ్ఞానస్నానము, క్రీస్తునందే మన గుర్తింపు, క్రీస్తులో ఐఖ్యతకు సూచన; దేవుని బిడ్డలమని ఒక నిజమైన గురుతు అయినప్పుడు, మనం విశ్వాసములో జీవించగలగాలి. జ్ఞానస్నానము పొందిన యేసు, దైవరాజ్యమును, సువార్తను బోధించుటకు వెళ్ళారు. మనంకూడా, మన అనుదిన జీవిత బాధ్యతలద్వారా, ఆ దైవరాజ్యమును, దేవుని ప్రేమను, ఆయన సువార్తను ప్రకటించాలి. జ్ఞానస్నానములో జీవితమును, నమ్మకమును, ఆశను, విశ్వాసమును, ప్రేమను పొందియున్నాము. అలా మనం జీవిస్తున్నామా? జ్ఞానస్నానం ఒక నూతన ఆరంభం. యేసు నిజమైన మార్గము, సత్యము, జీవమని, ఆయనలోనే శాశ్వత జీవమున్నదని పవిత్రాత్మ మనకు తెలియ బరచునుగాక! ఆమెన్.

ముగింపు: క్రీస్తు బాప్తిస్మం తన దైవత్వానికి సూచన; త్రిత్వైక దైవం ప్రదర్శింప బడినది; లోక పాపాలను యేసు తనపై వేసుకున్నాడు; తండ్రి ప్రణాళికను నెరవేర్చ సంసిద్ధమయ్యాడు; 

క్రీస్తు సాక్షత్కార మహోత్సవము, జనవరి 6, 2013

క్రీస్తు సాక్షత్కార మహోత్సవము, జనవరి 6, 2013 
పఠనాలు: యెషయా 60: 1-6; కీర్తన 72: 1-2, 7-8 , 10-13; ఎఫెసీ 3:2-3, 5-6; మత్తయి 2:1-12 

ఇదిగో! సర్వాధికారియైన సర్వేశ్వరుడు వచ్చుచున్నాడు. తన చేతియందు రాజ్యాధికారము, శక్తి సామర్ధ్యములను కలిగి వచ్చుచున్నాడు. 

దేవుడు నమ్మదగిన వాడు 

మనలో ప్రతి ఒక్కరముకూడా, నమ్మకము కలిగిన వ్యక్తిని కోరుకొంటాం. అలాంటి వ్యక్తికోసం ఎదురు చూస్తూ ఉంటాము. మనలను ఎల్లప్పుడూ అంటిపెట్టుకొని ఉండటము మాత్రమేగాక, వాగ్దానాలను చేయడం మాత్రమేగాక, మంచి తనము కలిగి చేసిన వాగ్దానాలను నెరవేర్చుటకు కావలసిన శక్తిని కలిగియున్న వ్యక్తి కోసం ఎదురుచూస్తూ ఉంటాం. అధారపడదగిన వ్యక్తి, నమ్మదగిన వ్యక్తి, విశ్వాసముగల వ్యక్తి మనదరికీ కావాలి... ఆ వ్యక్తియే దేవుడు. జ్ఞానుల శిశు సందర్శనము, దేవుని విస్వసనీయతకు, నమ్మకమునకు, ఋజువుగా, బైబిలు గ్రంధములోనున్న అత్యంత అందమైన ప్రామాణాలలో ఒకటి. 

క్రీస్తు జనమ్మునకు 500 సం,,ల పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా, రక్షణ వెలుగును పంచుకొనుటకు అన్ని దేశములను యేరూషలేమునకు నడిపిస్తానని దేవుడు వాగ్ధానము చేసియున్నాడు (యెషయా 49:6). కీర్తనకారుని ద్వారా, ఇదే వాగ్దానాన్ని మరోమాటలో చేసియున్నాడు: ''తర్శీషు రాజులు, ద్వీపముల నృపులు కప్పము కట్టుదురు. షేబా, సెబా పాలకులు కానుకలు కొనివత్తురు'' (కీర్తన 72:10). 500 ల సం,,లు యుద్ధాలు జరిగినను, ప్రజలు వలసలు పోయినను, చారిత్రాత్మక కలతలు జరిగినను, నాగరికత ప్రపంచములో మూడు వేర్వేరుసార్లు ప్రపంచ పటమును తిరగరాసినను, దేవుడు వాగ్ధానము చేసిన దానిని నెరవేర్చియున్నాడు. మంచి వ్యక్తులు, నమ్మకము కలిగిన వ్యక్తులు మాత్రమే మంచి వాగ్దానాలను నిలబెట్టగలరు. జ్ఞానుల ద్వారా, వారి కానుకలద్వారా, సకల దేశాలు, జాతులు రక్షణ వెలుగులోనికి ప్రవేశించియున్నాయి. 

జ్ఞానుల శిశు సందర్శనము దేవుని మంచితనాన్ని మరియు ఆయన శక్తికలవాడని నిరూపిస్తున్నది. ఆయన మన దేవుడు, అందరి దేవుడు. దేవుని మంచితనము, ఆయన శక్తి మనవే, ఎందుకన, మనము క్రీస్తుకు చెందినవారము. దేవుడు, నీకు, నాకు వ్యక్తిగతముగా విశ్వసనీయుడు, నమ్మదగినవాడు. ఆయన మన ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం. అన్నివేళల, అన్నిసమయాలలో, ఆయనను పరిపూర్తిగా విశ్వసించుదాం, పూర్ణహృదయముతో ప్రేమించుదాం. మనమూ ఆయనకు నమ్మదగినవారముగా జీవించుదము. 

రాజైన దేవుడు పరిపాలించుటకు వేంచేయును 

జ్ఞానుల శిశు సందర్శనములో, లోకరాజు జన్మనుగూర్చి ఎరిగి, హేరోదు రాజు కలత చెందాడు. అదే వార్తను ఎరిగిన జ్ఞానులు ఎంతో ఆనందించారు. హేరోదు తన జీవితాంతం హత్యలు చేస్తూ, అన్యాయముగా మరియు స్వార్ధముతో జీవించియున్నాడు. వ్యక్తిగత కీర్తికోసం, పేరు ప్రతిష్టల కోసం రాజ్యాన్ని పరిపాలించాడు. పరలోకమునుండి, గొప్ప అధికారముతో క్రీస్తు లోకరాజుగా ఈ లోకములో ఉద్భవించాడు. హేరోదు భయపడి, క్రీస్తును హంతం చేయకపోతే, తన జీవితం ముగుస్తుందని కలత చెందాడు. మరోవైపు, అన్య దేశాలనుండి వచ్చిన జ్ఞానులు లోకరక్షకుని పట్ల ఎంతగానో సంతోషించారు. లోకరక్షకుడు, రాజునైన క్రీస్తుపైనే వారి జీవితాలు, రాజ్యాలు ఆధారపడియున్నాయని గ్రహించారు. 

క్రీస్తు ప్రతీరోజు అనేక విధాలుగా మనకీ సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. మన మనసాక్షిద్వారా, శ్రీసభ బోధనలద్వారా, దేవుని కృపా వరములద్వారా, మనలోనికి వేంచేస్తూ ఉన్నాడు. హేరోదువలె కలత చెంది, ఆయనను నిర్మూలించుటకు ప్రయత్నింపక, జ్ఞానులవలె, సంతోషముగా, ఆయనను మనలోనికి, మన జీవితములోనికి ఆహ్వానిద్దాం, ఆయనను కలుసుకొందాం. 

దైవ రాజ్యము, శ్రీసభ 

క్రీస్తు ఈ లోకమును పాలించుటకు వచ్చెను, అనగా, సర్వమానవాళిని ఆధ్యాత్మికముగా పాలించి దైవరాజ్యమున చేర్చుటకు ఆధ్యాత్మిక రాజుగా వచ్చాడు. ఆయన ఈలోకమున దైవ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన బోధనల ద్వారా, ఆయన చూపించిన మార్గముల ద్వారా, ముఖ్యముగా, శ్రీసభ ద్వారా ఆ దైవరాజ్యం ఈ నాటికిని కొనసాగుతూనే ఉంది. దైవరాజ్యములో అందరు భాగస్తులే. కాలగతిలో, అనేకమంది శ్రీసభ రూపముననున్న ఈ దైవరాజ్యాన్ని హేరోదు వలె నిర్మూలించాలని ప్రయత్నించారు. వారి ఆధీనములోనుంచుటకు ప్రయత్నించారు. కాని, ఎవరూ నాశనం చేయలేకపోయారు. శ్రీసభ జీవిస్తూనే ఉన్నది, అభివృద్ది చెందుతూనే ఉన్నది, వ్యాప్తి చెందుతూనే ఉన్నది. ఎందుకన, ఈ రాజ్యానికి దేవుడే అధిపతి. ఈ రాజ్యము కలకాలము నిలచును. సర్వము దేవుని ఆధీనములో ఉన్నది. 

నక్షత్రము వలె మార్గ దర్శకులమవుదాం 

''తూర్పు దిక్కున జ్ఞానులు చూసిన నక్షత్రము వారికి మార్గదర్శినీయై, శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలచెను'' (మత్తయి 2:9). ప్రతీ ఒక్కరం ఓ నక్షత్రమువలె ఉండాలి. ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ క్రీస్తు ప్రేమకు సదా సాక్షులమై ఉండాలి. ఈలోకానికి అతీతముగా ఇతరులు వారి కన్నులను పైకెత్తి అనంతమైన దైవరాజ్యమువైపు చూచునట్లు ప్రోత్సహించాలి. క్రీస్తు రాజ్యములో మనం పౌరులం, ఈ లోకమున ఆయన దూతలం లేదా ప్రతినిధులం. 

అందరూ పరిపూర్ణమైన జీవితాన్ని ఆశిస్తారు. కాని, పొందలేకున్నారు. ఎందుకన, ఆ పరిపూర్ణతను వారికున్న సంపదలో, సుఖములో, అధికారములో, మానవ సంబంధాలలో, లోకాశలలో వెదకుచున్నారు. ఇలాంటి వారికి మనము నిజమైన రాజ్యాన్ని, కలకాలము నిలచే రాజ్యాన్ని చూపించగలగాలి. 

మనం చేసే ప్రతీ పని, మనం మాట్లాడే ప్రతీ మాట క్రీస్తును ప్రతిబింబించాలి. మనం మరో క్రీస్తులా మారాలి. ఎలా? మనలను ప్రేరేపించుటకు, మార్గము చూపుటకు పవిత్రాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్ధన చేద్దాం. అలాగే, జ్ఞానులకు మార్గదర్శినీయై క్రీస్తు వద్దకు చేర్చిన నక్షత్రమువలె మనముకూడా మన జీవితాదర్శముద్వారా ఇతరులను క్రీస్తు చెంతకు చేర్చుదాం.

క్రీస్తు సాక్షత్కార పండుగ, Year C

క్రీస్తు సాక్షత్కార పండుగ, Year C

మనమంతా కొన్ని రోజుల క్రితమే మరో నూతన సంవత్సరాన్ని ప్రారభించాము. ఈ సం,,ము ఎలా ఉండబోతుందో ఎవరికీ తెలియదు. మన భవిష్యత్తు ఎలా ఉంటుదో అసలు ఎవరికీ తెలియదు. మనలో ఏదో ఆందోళన, ఆరాటం! అవకాశం ఉంటే, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని అందరము ఆరాటపడుతూ ఉంటాము. కాలజ్ఞానం తెలుసు అంటున్న వ్యక్తులదగ్గరికి పరుగులు తీస్తూ ఉంటాము. అయితే, ఇక్కడ మనం ఒక విషయాన్ని మరచి పోతూ ఉంటాం!. అదే మన వ్యక్తిగత చరిత్ర. అది ఎప్పుడూ ఓ ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసి ఉండదని తెలుసుకోవాలి. మనం ఈరోజు జీవించే జీవితము రేపు చరిత్రగా మారుతుంది. కాబట్టి, భవిష్యత్తును తెలుసుకోవాలని ఆరాటపడటముకన్నా, ఈరోజు, ఈ క్షణం చాలా ముఖ్యమైనదని, విలువైనదని తెలుసుకొందాం. ఇప్పుడు, ఈ క్షణములో, మనం తీసుకొనే నిర్ణయాలనుబట్టి, ఎంచుకొనే విషయాలనుబట్టి, అలవరచుకొనే విధానాన్నిబట్టి, మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా, గతములోనికి తిరిగి వెళ్ళలేము. కొత్త ఆశతో, నమ్మకముతో ముందుకు సాగిపోదాం. ఈ నాటి పండుగ సారాంశం, క్రీస్తు తననుతాను ఈ లోకానికి సాక్షాత్కరింపచేసుకొనడం. జ్ఞానులు క్రీస్తును గాంచడానికి ఏవిధముగా ముందుకు సాగిపోయారో, అలాగే మనము కూడా ముందుకు సాగిపోదాం.

తూర్పు దిక్కున జ్ఞానులు, ఖచ్చితముగా ఎక్కడ ఉంటాడో తెలియని వ్యక్తికోసం దూరదేశానికి బయలుదేరారు. వారి ప్రయాణములో అనేక నక్షత్రాలు, కాంతి దీపాలుగ మారి దారినిచూపిస్తూ గమ్యాన్నిచేరడానికి తోడ్పడ్డాయి. మన జీవితం ఓ ప్రయాణం. ఏమీ తెలియనటువంటి భావిష్యత్తులోనికి చూస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాం. మన ప్రయాణములోకూడా నక్షత్రాలు మనలను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. కొన్ని నిండు వెలుగును ప్రకాశిస్తూ మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి, మరికొన్ని వెలుగు లేకుండా ఎలాంటి గమ్యాన్ని చేర్చకుండా ఉంటాయి. కాని, ప్రతీది మనలను ఆకర్షిస్తూనే ఉంటుంది! ఇంతకీ మనం ఏ నక్షత్రాల గూర్చి మాట్లాడుతున్నాం? ధనం, వస్తుప్రపంచం, మందు, పదవి, కీర్తి ప్రతిష్టలు మొ,,గు కాంతిలేని నక్షత్రాలు మనలను ఆకర్షిస్తూ ఉంటాయి. అలాగే, సేవ, శాంతి, సమాధానం, దయ, ప్రేమ, విశ్వాసం మొ,,గు తేజోవంతమైన నక్షత్రాలు మన ప్రయాణములో సహాయపడుతూ ఉంటాయి.

తేజోవంతమైన నక్షత్రాల కన్నా, కాంతిహీనమైన నక్షత్రాలే మనలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. దేవుని రూపములో సృష్టింపబడిన బిడ్డలముగా, తేజోవంతమైన మరియు మన గమ్యాన్నిచేర్చే నక్షత్రాలను మనం అనుసరించాలి. మన జీవితాలను సార్ధకముచేసే, నిజమైన సంతోషాన్ని, తృప్తిని ఇచ్చే నక్షత్రాలను అనుసరించి దేవున్ని చేరుకోవాలి. జ్ఞానులుకూడా, వారి ప్రయాణములో ఎన్నో నక్షత్రాలను చూసి ఉంటారు. కాని, వారి గమ్యాన్ని నడిపించిన నక్షత్రాన్ని ఎన్నుకొని, అనుసరించి, క్రీస్తుని దర్శించుకోగలిగారు. రక్షణను పొందియున్నారు.
మన జ్ఞానస్నానములో, ఆ నక్షత్రాన్ని కనుగొన్నామా? క్రీస్తు చూపించే వెలుగు బాటలో పయనిస్తామని, ఆయన కొరకు మాత్రమే జీవిస్తామని మాట ఇచ్చియున్నాము. ఆ వాగ్దానాన్ని నూత్నీకరించుకొని, ఆయన బాటలో, వెలుగులో నడవటానికి ప్రయాస పడదాం.

జ్ఞానుల ప్రయాణములో, ఎన్నో కష్టాలు, ఆటంకాలు, అవమానాలు ఎదురయ్యాయి. అన్నింటిని జయిస్తూ బెతేలేహేమునకు చేరుకొన్నారు. దివ్య బాలున్ని కనుగొని సంతోషించారు. దీనస్తితిలోనున్న బాలున్ని చూసి వారు అనుమానించలేదు, నిరాశ చెందలేదు. అతనే లోకరక్షకుడని గుర్తించి, అంగీకరించి, ఆరాధించారు. జ్ఞానుల వలె ఒకరికొకరము, ధైర్యము చెప్పుకుంటూ, కలసి మెలసి, ఒకే క్రీస్తుసంఘముగా ముందుకు సాగుదాం. క్రీస్తుకు సాక్షులముగా జీవించుదాం. సమస్యలు, అనుమానాలు, నిరాశ నిస్పృహలు అనే మేఘాలు నక్షత్రాన్ని కనపడకుండా చేసినప్పుడు, అధైర్యపడక, విశ్వాసముతో ముందుకు సాగుదాం.

జ్ఞానులు తెచ్చిన కానుకలు, బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను సంతోషముతో దివ్య బాలునికి అర్పించారు. క్రీస్తుకు మనం ఏ కానుకను ఇవ్వగలం? బెత్లేలేహేము అనే మన విచారణలో, శ్రీసభలో, కుటుంబములో, మన సమాజములో, మనం పనిచేసే స్థలములో, మనకి రోజు ఎదురుపడే వ్యక్తులలో దివ్యబాలున్ని కనుగొని, మన స్నేహాన్ని, ప్రేమను, సేవను, మంచి క్రియలను, ప్రభువుకు కానుకగా ఇద్దాం. ఎక్కడైతే దేవుని వాక్యాన్ని వింటామో, ప్రభువు శరీర రక్తాలను దివ్యబలిలో స్వీకరిస్తామో, అదే మన బెత్లెహేము. ఎందుకన, ప్రభువు గూర్చి తెలుసుకొంటున్నాం. ప్రభువు వెలుగును, దివ్య కాంతిని మనం దర్శించుకోగలుగుతున్నాం.

జ్ఞానులు, క్రీస్తును కనుగొని, ఆరాధించి, కానుకలను సమర్పించి, వేరొక మార్గమున వెనుతిరిగి పోయారు. మనం నిజముగా క్రీస్తును దర్శించగలిగితే, మనమూ ఓ నూతన మార్గములో పయానిస్తాము. పాత మార్గాలను, పాత జీవితాన్ని విడిచి పెట్టగలుగుతాము. మనలో నిజమైన మార్పు కలుగుతుంది. ఈ మార్పునే ప్రభువు మనలనుండి కోరుతున్నాడు. ఆయన చూపించిన మార్గములో, విస్వాసములో జీవించమని పిలుస్తున్నాడు. కనుక, జ్ఞానులవలె, ప్రభువును, ఆయన సువిశేషాన్ని కనుగొందాము. సంతోష హృదయముతో ఆయనతో ఐక్యమై, విశ్వాసముతో జీవించడానికి ప్రయాసపడుదాం. పరలోక రాజ్యములో క్రీస్తుదరికి చేరి ఆయన నిత్యవెలుగులో శాశ్వతజీవితాన్ని పొందుటకు ప్రయాసపడుదాము.